ఆనాటి జ్ఞాపకాలు
‘దానివల్ల నన్ను విచిత్రంగా చూసేవాళ్లు’
షార్లట్ వైట్ అనే పూర్తికాల సేవకురాలు చక్రాల సూట్‌కేసుతో అమెరికాలోని కెంటకీలోవున్న లూయివెల్కు వచ్చినప్పుడు అందరూ ఆమెను ఆశ్చర్యంగా చూశారు.
ఆసంఘటన 1908లో జరిగింది. అప్పుడు సహోదరి వైట్ లాక్కెళ్తున్న డాన్-మొబైల్ (Dawn mobile) అనే సరికొత్త వస్తువు ఖచ్చితంగా అక్కడి ప్రజలను ఆకట్టుకొని ఉంటుంది. దాని గురించి ఆమె ఇలా చెప్పింది, “ప్రజలు డాన్-మొబైల్ గురించి మాట్లాడుకున్నారు, దానివల్ల నన్ను విచిత్రంగా చూసేవాళ్లు.”
అప్పట్లో బైబిలు విద్యార్థులు అని పిలువబడిన యెహోవాసాక్షులు, లేఖనాలను లోతుగా అధ్యయనం చేసి తాము తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించారు. మిల్లీనియల్ డాన్ (ఆ తర్వాత స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ అని కూడా పిలువబడింది) అనే పేరుతో వరుసగా వచ్చిన పుస్తకాల వల్ల చాలామంది బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ‘బైబిలు విద్యార్థులకు సహాయం చేసే చేతులు’ అని వర్ణించబడిన ఆ పుస్తకాలను ఆసక్తిగల పాఠకులకు ఇచ్చేందుకు ఆ క్రైస్తవులు పట్టణాలకు, పల్లెలకు, గ్రామాలకు వెళ్తూ దూరదూరాలకు ఇష్టపూర్వకంగా ప్రయాణించేవాళ్లు.
1908లో సహోదరి వైట్, ఇతర ఆసక్తిగల రాజ్య ప్రచారకులు బైండింగ్ చేసివున్న 6-సంపుటుల సముదాయాన్ని ప్రజలకు అందించినప్పుడు దాని ఖరీదు 1.65 అమెరికన్ డాలర్లు (ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు 72 రూపాయలు). మిల్లీనియల్ డాన్ పుస్తకాలను గృహస్థులతో మాట్లాడిన వెంటనే ఇచ్చేయకుండా, ఆసక్తి ఉన్న వాళ్ల దగ్గర ముందుగా ఆర్డరు తీసుకునేవాళ్లు. ఆ తర్వాత సాధారణంగా, జీతాలు వచ్చే రోజున వెళ్లి కేవలం ప్రింటింగ్ చార్జీలు మాత్రమే తీసుకొని ఆ పుస్తకాలను వాళ్లకు ఇచ్చేవాళ్లు. ప్రజలు ఆ పుస్తకాలకు చాలా తక్కువ డబ్బులు చెల్లించడం గురించి ఒక వ్యతిరేకి ఫిర్యాదు కూడా చేశాడు.
అప్పట్లో వారానికి దాదాపు రెండు నుండి మూడు వందల పుస్తకాల వరకు ఆర్డరు తీసుకున్నట్లు మలిండ కీఫర్ అనే సహోదరి గుర్తుచేసుకుంది. అయితే, మిల్లీనియల్ డాన్ పుస్తకాలను చదవడానికి చాలామంది ఆసక్తి చూపించినందువల్ల ఒక చిక్కు వచ్చిపడింది. వాటిని తీసుకువెళ్లడం అంత సులభమేమీ కాదు ఎందుకంటే,
కేవలం 6వ సంపుటిలోనే 740 పేజీలు ఉండేవి! “50 పుస్తకాలు 18 కేజీలు ఉండేవి” కాబట్టి వాటిని మోసుకెళ్లి ప్రజలకు ఇవ్వడం సాక్షులందరికీ ముఖ్యంగా, సహోదరీలకు “చాలా కష్టమయ్యేది” అని వాచ్‌టవర్ పత్రిక వ్యాఖ్యానించింది.మిల్లీనియల్ డాన్ పుస్తకాలను ఆసక్తిగల వాళ్ల దగ్గరికి చేర్చడమెలా అనే చిక్కుముడిని పరిష్కరించడానికి జేమ్స్ కోల్ అనే సహోదరుడు, సూట్కేసుకు నట్లతో బిగించే రెండు టైర్ల ఫ్రేమును తయారుచేశాడు, అవసరం లేనప్పుడు ఆ ఫ్రేమును మడతపెట్టేసుకోవచ్చు. దాన్ని తయారుచేయడం వల్ల, పుస్తకాలతో నిండి ఎంతో బరువుగా ఉండే డబ్బాలను మోసుకెళ్లే కష్టం తప్పింది. అందుకే ఆ సహోదరుడు, ‘ఇకపై పెద్దపెద్ద బరువులు మోసుకు వెళ్లాల్సిన అవసరం లేదు’ అన్నాడు. 1908లో ఓహియోలోని సిన్సిన్నాటిలో జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశంలో ఆయన ఆ కొత్త వస్తువును సహోదరులకు పరిచయం చేశాడు. అప్పుడు వాళ్లు ఎంతో సంతోషించారు. దాని మీద అడ్డంగా ఉన్న ఇనుప బార్‌కు ఆ చివరా ఈ చివరా ఉన్న బటన్లపై డాన్-మొబైల్ అనే ముద్ర ఉండేది, దానిపై ముఖ్యంగా మిల్లీనియల్ డాన్ సంపుటులను రవాణా చేసేవాళ్లు కాబట్టే ఆ ముద్ర వేశారు. కాస్త ప్రాక్టీసుతో, డజన్ల కొలది పుస్తకాలు నిండివున్న సూట్‌కేసులను ఒక్క చేత్తోనే తీసుకువెళ్లడం సాధ్యమయ్యేది. సహోదర సహోదరీలు తమ ఎత్తుకు తగినట్లుగా ఆ ఫ్రేమును సవరించుకునే సౌలభ్యం ఉండేది. దాని టైర్లు మామూలు రోడ్లమీద కూడా తిరుగగలిగేవి. రోజంతా పరిచర్య చేసిన తర్వాత ఇంటికి తిరిగివచ్చేటప్పుడు కాలినడకన వచ్చినా, కారులో వచ్చినా ఖాళీ సూట్‌కేసును చేతితో పట్టుకోవడానికి వీలుగా ఆ టైర్ల ఫ్రేమును మడతపెట్టుకునే సౌలభ్యం ఉండేది.
పూర్తికాల సేవలో ఉన్న సహోదరీలు డాన్-మొబైల్‌ను ఉచితంగా పొందేవాళ్లు. కానీ వేరేవాళ్లు దాన్ని కొనుక్కోవాలంటే, దాని ఖరీదు 2.50 అమెరికన్ డాలర్లు (ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు 110 రూపాయలు). ఈ ఫోటోలో కనిపిస్తున్న సహోదరి పేరు కీఫర్. ఆమె డాన్-మొబైల్‌ను నడిపించే కిటుకును నేర్చుకుంది. దానివల్ల ఆమె పుస్తకాలతో నిండివున్న సూట్‌కేసును ఒక చేత్తో నడిపిస్తూ, మరో చేతిలో కొన్ని పుస్తకాలను పట్టుకొని వెళ్లేది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న ఒక బొగ్గుగనుల ప్రాంతంలో ఆసక్తిగల వాళ్లు చాలామంది దొరకడంతో ఆమె వాళ్లకు పుస్తకాలు ఇచ్చే రోజున బ్రిడ్జి మీదుగా దాదాపు మూడు-నాలుగు సార్లు వెళ్లి వచ్చేది.
1987లో ఒక ఎయిర్‌లైన్ పైలట్, చక్రాలుండే సూట్‌కేసును తయారు చేశాడు. అలాంటి వాటిని మనం ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లలో, రైల్వే స్టేషన్లలో చూస్తుంటాం. కానీ దాదాపు వంద సంవత్సరాల క్రితం, ఉత్సాహంగల బైబిలు విద్యార్థులు డాన్-మొబైల్లతో సత్యపు విత్తనాలు వెదజల్లుతూ రోడ్డుమీద అటూ ఇటూ నడుస్తుంటే ప్రజలు వాళ్లను ఆసక్తితో విచిత్రంగా చూసేవాళ్లు.
[32వ పేజీలోని బ్లర్బ్]
సహోదరి కీఫర్ పుస్తకాలు ఇచ్చే రోజున బ్రిడ్జి మీదుగా దాదాపు మూడు-నాలుగు సార్లు వెళ్లి వచ్చేది
[32వ పేజీలోని బ్లర్బ్]
మిల్లీనియల్ డాన్ పుస్తకాలను ఆసక్తిగల వాళ్ల దగ్గరికి చేర్చడమెలా అనే చిక్కుముడిని అది పరిష్కరించింది