మనం కలిసి సంతోషిద్దాం!
మనం కలిసి సంతోషిద్దాం!
సంతోషాన్ని, ఆనందాన్ని పొందడం రోజురోజుకూ కష్టమైపోతోంది. ఇతరులతో సానుకూలమైన ఆలోచనలను పంచుకోవడం దాదాపు అసాధ్యమని చాలామందికి అనిపిస్తోంది. ముఖ్యంగా పెద్దపెద్ద నగరాల్లోని ఆధునిక జీవన విధానం వల్ల ప్రజలు నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నారు.
సైకోబయాలజీ ప్రొఫెసర్ ఆల్బెర్టో ఓలీవేరీయో ఇలా అంటున్నాడు, “ఒంటరితనం సర్వసాధారణమైపోయింది. పెద్దపెద్ద భవనాలున్న ప్రాంతాల్లోని జీవన విధానం వల్ల ప్రజలు నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నారు. అందుకే చాలా సందర్భాల్లో మనం తోటి ఉద్యోగుల, పొరుగువాళ్ళ లేదా మనం ప్రతీరోజు చూసే దుకాణాదారుల బాగోగుల గురించి పట్టించుకోం.” అలా నలుగురితో కలవకపోవడం వల్ల ప్రజలు తరచూ డిప్రెషన్‌కు లోనౌతుంటారు.
అయితే తోటి క్రైస్తవుల పరిస్థితి, వాళ్ళ స్ఫూర్తి వేరుగా ఉంటాయి. అపొస్తలుడైన పౌలు, “ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి” అని రాశాడు. (1 థెస్స. 5:16) మనం ఆనందంగా ఉండడానికి, కలిసి సంతోషించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం సర్వోన్నత దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్నాం; బైబిలు సత్యాన్ని అర్థం చేసుకున్నాం; మనకు రక్షణ, నిరంతర జీవితం దొరుకుతాయనే నిరీక్షణ ఉంది; అవే ఆశీర్వాదాలను పొందేలా ఇతరులకు సహాయం చేసే అవకాశం కూడా మనకుంది.—కీర్త. 106:4, 5; యిర్మీ. 15:16; రోమా. 12:12.
నిజక్రైస్తవులు ఆనందంగా ఉంటారు, తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటారు. అందుకే, “నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును. ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి” అని పౌలు ఫిలిప్పీయులకు రాశాడు. (ఫిలి. 2:17, 18) ఆ కొన్ని మాటల్లోనే పౌలు ఆనందంగా ఉండడం గురించి, కలిసి సంతోషించడం గురించి రెండుసార్లు ప్రస్తావించాడు.
కాబట్టి, క్రైస్తవులు ఒంటరిగా ఉండాలన్న ఆలోచన రాకుండా చూసుకోవాలి. మనం ఇతరులకు దూరంగా ఉంటే తోటి విశ్వాసులతో కలిసి సంతోషించలేం. మరి సహోదరులతో కలిసి ‘ప్రభువునందు ఆనందిస్తూ’ ఉండమని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని మనమెలా పాటించవచ్చు?—ఫిలి. 3:1.
తోటి విశ్వాసులతో కలిసి సంతోషించండి
ఫిలిప్పీయులకు పత్రిక రాసే సమయానికి పౌలు తన ప్రకటనా పని కారణంగా బహుశా బంధీగా ఉండివుండవచ్చు. (ఫిలి. 1:7; 4:22) అయినా పరిచర్య విషయంలో ఆయనకున్న ఆసక్తి తగ్గలేదు. కానీ ‘పానార్పణంగా పోయబడి,’ యెహోవా సేవలో తాను చేయగలిగినదంతా చేస్తూ ఎంతో సంతోషించాడు. (ఫిలి. 2:17) ఒక వ్యక్తి పరిస్థితులు ఎలావున్నా సంతోషంగా ఉండవచ్చని పౌలు ఆలోచనా తీరును చూస్తే తెలుస్తోంది. బంధీగా ఉన్నా ఆయనిలా అన్నాడు, “ఇక ముందును సంతోషింతును.”—ఫిలి. 1:18.
పౌలు ఫిలిప్పీలో సంఘాన్ని స్థాపించాడు కాబట్టి అక్కడి సహోదరుల మీద ప్రత్యేకమైన ప్రేమను పెంచుకున్నాడు. యెహోవా సేవలో తాను పొందిన సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారని ఆయనకు తెలుసు. అందుకే ఆయనిలా రాశాడు, “సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను. ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికిని తక్కినవారికందరికిని స్పష్టమాయెను.” (ఫిలి. 1:12, 13) ప్రోత్సాహకరమైన ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకున్నందువల్ల కూడా పౌలు ఆనందంగా ఉండగలిగాడు, సహోదరులతో కలిసి సంతోషించగలిగాడు. ఫిలిప్పీయులు కూడా పౌలుతో కలిసి తప్పకుండా సంతోషించివుంటారు. వాళ్ళు పౌలుతో కలిసి సంతోషించాలంటే ఆయనున్న ఆ పరిస్థితి గురించి నిరుత్సాహపడకూడదు. బదులుగా, వాళ్ళు ఆయన మాదిరిని అనుకరించాలి. (ఫిలి. 1:14; 3:17) అంతేకాక, వాళ్ళు పౌలు గురించి ప్రార్థిస్తూ చేయగలిగిన సహాయాన్ని చేయాలి.—ఫిలి. 1:20; 4:14-16.
మనం కూడా పౌలులాగే సంతోషంగా ఉండడం సాధ్యమేనా? మన జీవితంలోని పరిస్థితుల్లో, క్రైస్తవ పరిచర్యలో సానుకూలమైన విషయాలను చూడడానికి ప్రయత్నిస్తామా? సహోదరులను కలిసినప్పుడు మనం సాక్ష్యమిచ్చే పనిలో
ఎదురైన అనుభవాలను బట్టి సంతోషించడం మంచిది. అలా కలిసి సంతోషించాలంటే సంచలనం కలిగించే అనుభవమే ఎదురవ్వాల్సిన అవసరం లేదు. బహుశా మనం ఒక చక్కని ఉపోద్ఘాతాన్ని లేదా తర్కాన్ని ఉపయోగించినందువల్ల ఇతరులు రాజ్య సందేశంపై ఆసక్తి చూపించివుండవచ్చు. ఒక బైబిలు వచనం గురించి గృహస్థునితో మనం చక్కగా చర్చించివుండవచ్చు. మన క్షేత్రంలోని ప్రజలకు మనం యెహోవాసాక్షులమని తెలియడం వల్ల, అదే గొప్ప సాక్ష్యంగా పనిచేసివుండవచ్చు. అలాంటి అనుభవాలను పంచుకోవడం వల్ల కూడా మనం కలిసి సంతోషించవచ్చు.ప్రకటనా పని చేయడానికి చాలామంది యెహోవా ప్రజలు ఇప్పటికే ఎన్నో త్యాగాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. పయినీర్లు, ప్రయాణ పర్యవేక్షకులు, బెతెల్ సభ్యులు, మిషనరీలు, అంతర్జాతీయ సేవకులు పూర్తికాల సేవలో శాయశక్తులా కృషి చేస్తూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మనం వాళ్ళ విషయంలో ఆనందించి వాళ్ళతో కలిసి సంతోషిస్తామా? అలాగైతే ‘దేవుని రాజ్యం నిమిత్తం జత పనివారైన’ ఆ సహోదర సహోదరీల పట్ల కృతజ్ఞత చూపిద్దాం. (కొలొ. 4:11) క్రైస్తవ కూటాల్లో, పెద్దపెద్ద సమావేశాల్లో వాళ్ళను కలిసినప్పుడు మనం వాళ్ళను ప్రోత్సహించవచ్చు. ఎంతో ఉత్సాహంగా సేవచేస్తున్న వాళ్ళ మాదిరిని మనం అనుకరించవచ్చు. బహుశా వాళ్ళను భోజనానికి పిలవడం ద్వారా వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడానికి, వాళ్ళ ప్రోత్సాహకరమైన మాటలను వినడానికి “సమయము” కల్పించుకోవచ్చు.—ఫిలి. 4:10.
శ్రమలు అనుభవిస్తున్నవాళ్ళతో కలిసి సంతోషించండి
హింసల్ని తట్టుకోవడం వల్ల, శ్రమల్ని అధిగమించడం వల్ల చివరి వరకు యెహోవాకు నమ్మకంగా ఉండాలన్న పౌలు కృతనిశ్చయం బలపడింది. (కొలొ. 1:24; యాకో. 1:2, 3) ఫిలిప్పీలోని క్రైస్తవులు కూడా అలాంటి శ్రమల్నే ఎదుర్కొంటారని, తాను పట్టుదలతో వాటిని తట్టుకోవడాన్ని చూసి వాళ్ళు ప్రోత్సాహాన్ని పొందుతారని తెలుసుకొని పౌలు ఆనందించి వాళ్ళతో కలిసి సంతోషించాడు. అందుకే ఆయనిలా రాశాడు, “మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.”—ఫిలి. 1:29, 30.
మన కాలంలో కూడా ప్రకటనా పని కారణంగా క్రైస్తవులు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తూ మనమీద క్రూరంగా దాడి చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో వ్యతిరేకత మరోవిధంగా ఎదురౌతుంది. మన గురించి మతభ్రష్టులు అబద్ధాలు వ్యాప్తి చేయవచ్చు, ఇంట్లోవాళ్ళు మనల్ని వ్యతిరేకించవచ్చు, తోటి ఉద్యోగులు లేదా విద్యార్థులు మనల్ని ఎగతాళి చేయవచ్చు. అలాంటివి ఎదురైనప్పుడు మనం ఆశ్చర్యపోకూడదని లేదా నిరుత్సాహపడకూడదని యేసు హెచ్చరించాడు. అలాంటివి వచ్చినప్పుడు మనం సంతోషించాలి. యేసు ఇలా అన్నాడు, “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.”—మత్త. 5:11, 12.
కొన్ని దేశాల్లో మన సహోదరులు తీవ్రమైన హింసను ఎదుర్కొంటున్నారని విన్నప్పుడు మనం భయంతో వణికిపోకూడదు. కానీ, వాళ్ళు వాటిని సహించగలుగుతున్నందుకు మనం సంతోషించాలి. వాళ్ళు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ సహనం చూపించేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించవచ్చు. (ఫిలి. 1:3, 4) ప్రియమైన ఆ సహోదరుల కోసం మనం అంతగా ఏమీ చేయలేకపోయినా మన సంఘంలో శ్రమలు అనుభవిస్తున్న సహోదరులకు మనం సహాయం చేయవచ్చు. వాళ్ళపై శ్రద్ధ చూపించి వాళ్ళకు కావాల్సిన సహాయసహకారాల్ని అందించవచ్చు. అప్పుడప్పుడు మన కుటుంబ ఆరాధనకు వాళ్ళను పిలవడం ద్వారా, వాళ్ళతో కలిసి పరిచర్యలో పాల్గొనడం ద్వారా, వాళ్ళతో సరదాగా సమయం గడపడం ద్వారా మనం వాళ్ళతో కలిసి సంతోషించడానికి అవకాశాల్ని సృష్టించుకోవచ్చు.
మనం కలిసి సంతోషించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండాలనుకునే లోకస్థుల్లా కాక మనం సహోదరులతో మన సంతోషాన్ని పంచుకుంటూ ఉందాం. అలా చేస్తే సంఘంలో ప్రేమను, ఐక్యతను పెంచగలుగుతాం, క్రైస్తవ సహోదరత్వాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం. (ఫిలి. 2:1, 2) ‘ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి.’ ఎందుకంటే పౌలు ఇలా అన్నాడు, “మరల చెప్పుదును ఆనందించుడి.”—ఫిలి. 4:4.
[6వ పేజీలోని చిత్రసౌజన్యం]
భూగోళం: Courtesy of Replogle Globes