సహాయం కోసం మొరపెట్టుకునేవారిని ఎవరు విడిపించగలరు?
సహాయం కోసం మొరపెట్టుకునేవారిని ఎవరు విడిపించగలరు?
“దేవా, రాజునకు నీ న్యాయవిధులను . . . తెలియజేయుము. దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును.”—కీర్త. 72:1, 12.
1. దావీదు జీవితాన్ని పరిశీలించినప్పుడు, మనకు దేవుని కనికరం గురించి ఏమి తెలుస్తోంది?
ఆ మాటలు ఎంత ప్రోత్సాహాన్నిస్తున్నాయి! వాటిని బహుశా ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు రాసివుంటాడు. ఆ మాటలు రాయడానికి ఎన్నో సంవత్సరాల ముందు, తాను బత్షెబతో వ్యభిచారం చేసినందుకు ఆయన ఎంతో వేదనను అనుభవించాడు. అప్పుడు ఆయన దేవుణ్ణి ఇలా వేడుకున్నాడు: “నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము . . . నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది . . . నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.” (కీర్త. 51:1-5) మనకు వారసత్వంగా వచ్చిన పాపాన్ని యెహోవా కనికరంతో పరిగణలోకి తీసుకుంటాడు.
2. డెబ్భై రెండవ కీర్తన మనకు ఎలా సహాయం చేస్తుంది?
2 మనం ఎంత దయనీయ స్థితిలో ఉన్నామో యెహోవా అర్థం చేసుకుంటాడు. అయితే వాగ్దానం చేయబడినట్లు, దేవుని అభిషిక్త రాజు ‘దరిద్రులు మొఱ్ఱపెట్టగా వారిని విడిపించును. దీనులను నిరాధారులను విడిపించును. నిరుపేదలయందును బీదలయందును కనికరించును బీదల ప్రాణములను రక్షించును.’ (కీర్త. 72:12, 13) వారికి ఉపశమనం ఎలా కలుగుతుంది? 72వ కీర్తనలో దానికి జవాబు ఉంది. దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలన గురించి కూర్చబడిన ఈ కీర్తన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిపాలన మానవుల బాధలను ఎలా తీసివేస్తుందో వివరిస్తుంది.
క్రీస్తు పరిపాలన ఎలా ఉంటుందో తెలిసింది
3. సొలొమోను ఏమి కోరుకున్నాడు? దేవుడు ఆయనకు ఏమి ఇచ్చాడు?
3 సొలొమోనును రాజుగా చేయమని ఆదేశించిన కొంతకాలానికి, వృద్ధుడైన దావీదు సొలొమోనుకు కొన్ని నిర్దిష్టమైన సూచనలు ఇచ్చాడు. వాటిని సొలొమోను నమ్మకంగా పాటించాడు. (1 రాజు. 1:32-35; 2:1-3) ఆ తర్వాత యెహోవా సొలొమోనుకు కలలో కనిపించి “నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దాని నడుగుము” అని చెప్పాడు. అప్పుడు సొలొమోను “నేను మంచిచెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము” అని ఒకే ఒక కోరిక కోరాడు. సొలొమోను వినయంతో విన్నవించుకున్నందుకు దేవుడు ఆయన కోరిందే కాక ఇంకా ఎక్కువే ఇచ్చాడు.—1 రాజు. 3:5, 9-13.
4. సొలొమోను కాలానికి చెందిన ఒక రాణి ఆయన పరిపాలనను ఎలా వర్ణించింది?
4 యెహోవా సొలొమోను పరిపాలనను ఆశీర్వదించాడు కాబట్టి ఆయన పరిపాలనలో ప్రజలు శాంతి సుభిక్షతల్ని అనుభవించారు. భూమ్మీద ఏ పరిపాలనలోనూ మానవులు అలాంటి పరిస్థితిని అనుభవించలేదు. (1 రాజు. 4:25) సొలొమోను పరిపాలన ఎలా ఉంటుందో చూడడానికి ఎంతోమంది వచ్చారు. వారిలో షేబదేశపురాణి కూడా ఉంది. ఆమె గొప్ప పరివారంతో ఆయన రాజ్యానికి వచ్చింది. ఆయన రాజ్యాన్ని చూసిన తర్వాత ఆమె సొలొమోనుతో, ‘నీ కార్యముల గురించి, జ్ఞానము గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదు. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి’ అని అన్నది. (1 రాజు. 10:1, 6, 7) అయితే, యేసు సొలొమోను కన్నా గొప్ప జ్ఞానాన్ని కనబరిచాడు. అందుకే ఆయన తన గురించి ఇలా చెప్పుకోగలిగాడు: “ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.”—మత్త. 12:42.
గొప్ప సొలొమోను పరిపాలనలో కలిగే ఉపశమనం
5. డెబ్భై రెండవ కీర్తన ఏమి తెలియజేస్తుంది? భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని అది వివరిస్తోంది?
5 గొప్ప సొలొమోను అయిన యేసుక్రీస్తు పరిపాలనలో పొందే ఆశీర్వాదాల గురించి తెలుసుకునేందుకు మనం ఇప్పుడు 72వ కీర్తనలోని విషయాలను పరిశీలిద్దాం. (కీర్తన 72:1-4 చదవండి.) “సమాధానకర్తయగు అధిపతి” అయిన తన కుమారుడగు యేసుక్రీస్తు ‘రాజ్యం’ గురించి యెహోవా ఏమి అనుకుంటున్నాడో ఈ కీర్తన తెలియజేస్తుంది. (యెష. 9:6, 7) దేవుని నిర్దేశంలో గొప్ప సొలొమోను ‘శ్రమనొందువారికి న్యాయము తీర్చును, బీదల పిల్లలను రక్షించును.’ ఆయన పరిపాలనలో సమాధానం, నీతి ఉంటాయి. తన వెయ్యేండ్ల పరిపాలన ఎలా ఉంటుందో భూమ్మీద ఉన్నప్పుడు యేసు చూపించాడు.—ప్రక. 20:4.
6. దేవుని రాజ్య పరిపాలనలో మానవులు ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తారో చూపించేందుకు యేసు ఏ కార్యాలు చేశాడు?
6 డెబ్భై రెండవ కీర్తన నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు భవిష్యత్తులో మానవుల కోసం ఏమి చేస్తాడో తెలుసుకునేందుకు ఆయన చేసిన కొన్ని కార్యాలను ఇప్పుడు చూద్దాం. బాధపడుతున్న ప్రజల పట్ల ఆయన చూపించిన గొప్ప కనికరాన్నిబట్టి మనం ముగ్ధులమౌతాం. (మత్త. 9:35, 36; 15:29-31) ఉదాహరణకు, ఓ కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చి, “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు” అని వేడుకున్నాడు. దానికి యేసు, “నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్ము” అని చెప్పినప్పుడు ఆ రోగి బాగయ్యాడు. (మార్కు 1:40-42) ఆ తర్వాత, తనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి కోల్పోయిన ఓ విధవరాలిని యేసు కలిశాడు. అప్పుడు ఆయన కనికరపడి, “చిన్నవాడా, లెమ్ము” అని చెప్పినప్పుడు ఆమె కుమారుడు బ్రతికాడు!—లూకా 7:11-15.
7, 8. యేసుకు స్వస్థతా శక్తి ఉందని చెప్పడానికి కొన్ని రుజువులేమిటి?
7 అద్భుతాలు చేసే శక్తిని యెహోవా యేసుకు ఇచ్చాడు. “పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ” విషయంలో జరిగినదాన్ని చూస్తే ఇది అర్థమౌతుంది. ‘ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి తనకు కలిగినదంతయు వ్యయము చేసినా’ ఆమె పరిస్థితి మరింత విషమించింది. ఆ స్త్రీ జనసమూహం మధ్యలోకి వెళ్లి యేసును ముట్టింది. ధర్మశాస్త్రం ప్రకారం ‘రక్తస్రావముగలవారు’ అలా చేయకూడదు. (లేవీ. 15:19, 25) తనలో నుండి శక్తి వెళ్లినట్లు అనిపించి, తనను ఎవరు ముట్టారని యేసు అడిగాడు. ఆ స్త్రీ “భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను.” యెహోవా ఆ స్త్రీని స్వస్థపరిచాడని గుర్తించి, యేసు ఆమెపట్ల కనికరంతో ఇలా అన్నాడు: “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక.”—మార్కు 5:25-27, 30, 33, 34.
8 యెహోవా దేవుడు ఇచ్చిన స్వస్థతా శక్తితో యేసు రోగులను బాగుచేశాడు. దాన్ని చూసినవారు కూడా ఎంతో ప్రభావితులైవుంటారు. ఉదాహరణకు, ప్రఖ్యాతిగాంచిన తన కొండమీది ప్రసంగాన్ని ఇచ్చే ముందు యేసు ప్రజలను స్వస్థపరచడం చూసి చాలామంది నిస్సందేహంగా ముగ్ధులై ఉంటారు. (లూకా 6:17-19) యేసు మెస్సీయనేనా అని నిర్ధారించుకునేందుకు బాప్తిస్మమిచ్చు యోహాను ఇద్దరు సందేశకులను పంపించాడు. యేసు, ‘రోగాలు, బాధలు, అపవిత్రాత్మలుగల అనేకులను స్వస్థపరచి, చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేయడాన్ని’ వారు చూశారు. అప్పుడు యేసు వారితో ఇలా అన్నాడు: “మీరు వెళ్లి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.” (లూకా 7:19-22) యోహాను ఆ సందేశాన్ని విని ఎంత ప్రోత్సాహాన్ని పొందివుంటాడు!
9. యేసు తన అద్భుతాల ద్వారా దేన్ని ముందుగా చూపించాడు?
9 యేసు తన భూపరిచర్యలో ప్రజలకు బాధల నుండి కలిగించిన ఉపశమనం తాత్కాలికమైనదే. ఆయన బాగుచేసినవారు లేదా పునరుత్థానం చేసినవారు ఆ తర్వాత చనిపోయారు. అయినా, భూమ్మీద ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేయడం ద్వారా తన మెస్సీయ పరిపాలనలో మానవులు ఎలా శాశ్వత ఉపశమనం అనుభవిస్తారో ముందుగా రుచిచూపించాడు.
త్వరలో భూమంతా పరదైసుగా మారుతుంది!
10, 11. (ఎ) రాజ్య ఆశీర్వాదాలను మానవులు ఎంతకాలం అనుభవిస్తారు? యేసు పరిపాలన ఎలా ఉంటుంది? (బి) పరదైసులో క్రీస్తుతోపాటు ఎవరు ఉంటారు? ఆ వ్యక్తి ఏమి చేస్తే నిరంతరం జీవించగలుగుతాడు?
10 భూపరదైసులో జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి! (కీర్తన 72:5-9 చదవండి.) అద్వితీయ సత్యదేవుని ఆరాధకులు సూర్యచంద్రులున్నంతకాలం అంటే నిత్యమూ పరదైసులో జీవితాన్ని ఆనందించగలుగుతారు! రాజైన యేసుక్రీస్తు ‘గడ్డికోసిన బీటిమీద కురియు వానవలె, భూమిని తడుపు మంచి వర్షమువలె’ సేదదీర్పును ఇస్తాడు.
11 ఈ కీర్తన నెరవేర్పును మీరు ఊహించుకుంటున్నప్పుడు భూపరదైసులో నిత్యం జీవించే నిరీక్షణనుబట్టి మీ హృదయం ఉప్పొంగడంలేదా? తనతోపాటు వేలాడదీయబడిన తప్పిదస్థునితో, “నీవు నాతోకూడ పరదైసులో ఉందువు” అని యేసు అన్నప్పుడు అతడు ఎంతో పులకించిపోయుంటాడు. (లూకా 23:43) యేసు వెయ్యేండ్ల పరిపాలనలో ఆ వ్యక్తి పునరుత్థానం చేయబడతాడు. ఆ తర్వాత అతడు క్రీస్తు పరిపాలనకు లోబడితే, ఈ భూమ్మీద పరిపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా నిరంతరం జీవిస్తాడు.
12. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో పునరుత్థానం చేయబడిన అనీతిమంతులకు ఏ అవకాశం ఇవ్వబడుతుంది?
12 గొప్ప సొలొమోను అయిన యేసుక్రీస్తు పరిపాలనలో “నీతిమంతులు వర్ధిల్లుదురు.” (కీర్త. 72:7) యేసు భూమ్మీదున్నప్పుడు ఎంతో ప్రేమను, వాత్సల్యపూరిత శ్రద్ధను చూపించాడు. అదే విధమైన ప్రేమను, శ్రద్ధను తన పరిపాలనలో కూడా చూపిస్తాడు. యెహోవా వాగ్దానం చేసిన నూతనలోకంలో పునరుత్థానం చేయబడిన ‘అనీతిమంతులకు’ కూడా యెహోవా ప్రమాణాలను పాటిస్తూ సజీవంగా ఉండే అవకాశం ఇవ్వబడుతుంది. (అపొ. 24:14, 15) దేవుని నియమాలను పాటించేందుకు నిరాకరించేవారు నూతనలోకంలో ఉంటే శాంతిసమాధానాలకు భంగం వాటిల్లుతుంది కాబట్టి, వారు సజీవంగా ఉండేందుకు యెహోవా అనుమతించడు.
13. రాజ్య పరిపాలన ఎంత విస్తృతంగా ఉంటుంది? ఆ పరిపాలనలో శాంతికి ఎందుకు భంగం వాటిల్లదు?
13 గొప్ప సొలొమోను పరిపాలన భూదిగంతములవరకు ఉంటుందని ఈ మాటలు సూచిస్తున్నాయి: “సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.” (కీర్త. 72:8, 9) అవును, యేసుక్రీస్తు పరిపాలన భూవ్యాప్తంగా ఉంటుంది. (జెక. 9:9, 10) ఆయన పరిపాలనను, ఆశీర్వాదాలను గుర్తించి వాటిని విలువైనవిగా పరిగణించేవారు ఇష్టపూర్వకంగా ‘లోబడతారు.’ మరోవైపున, పశ్చాత్తాపం చూపించని పాపులు ‘నూరు సంవత్సరముల వయస్సుగలవారైనా’ చనిపోతారు. (యెష. 65:20) వారు ‘మన్ను నాకుతారు.’
యేసుకు మనపట్ల సానుభూతితో కూడిన శ్రద్ధ ఉంది
14, 15. యేసు మానవుల కష్టసుఖాలను అర్థం చేసుకోగలడని, ‘దరిద్రులు మొరపెట్టగా వారిని విడిపిస్తాడని’ మనకు ఎలా తెలుసు?
14 పాపులైన మానవులు దయనీయ స్థితిలో ఉన్నారు. వారికి అత్యవసరంగా సహాయం అవసరం. అయితే, మనకు భవిష్యత్తు విషయంలో ఆశ ఉంది. (కీర్తన 72:12-14 చదవండి.) గొప్ప సొలొమోను అయిన యేసు మన అపరిపూర్ణ స్థితిని అర్థం చేసుకుంటాడు కాబట్టి, ఆయనకు మనపట్ల సానుభూతి ఉంది. అంతేకాదు, ఆయన నీతి కోసం శ్రమలను అనుభవించాడు. ఎవరి సహాయం లేకుండా పరీక్షలను ఎదుర్కొనేందుకు దేవుడు ఆయనను అనుమతించాడు. అంతెందుకు, యేసు ఎంత మానసిక వేదనను అనుభవించాడంటే, “ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.” (లూకా 22:44) ఆ తర్వాత హింసాకొయ్యమీద ఆయన బిగ్గరగా, “నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి” అని కేకలు వేశాడు. (మత్త. 27:45, 46) ఎన్నో శ్రమలను అనుభవించినా, యెహోవా నుండి దూరం చేసేందుకు సాతాను శతవిధాల ప్రయత్నించినా యేసు యెహోవా దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
15 యేసు మన బాధలను చూస్తాడనీ, ‘దరిద్రులు మొఱ్ఱపెట్టగా వారిని విడిపిస్తాడనీ, దీనులను నిరాధారులను విడిపిస్తాడనీ’ మనం నమ్మవచ్చు. యేసు తన తండ్రిలాగే ప్రేమపూర్వకమైన శ్రద్ధతో ‘దరిద్రుల మొర ఆలకిస్తాడు,’ ‘గుండె చెదరినవారిని బాగుచేస్తాడు, వారి గాయములు కడతాడు.’ (కీర్త. 69:33; 147:3) యేసు ‘సమస్త విషయాల్లో మనలాగే శోధింపబడ్డాడు’ కాబట్టి ఆయనకు ‘మన బలహీనతల విషయంలో సహానుభవము’ ఉంది. (హెబ్రీ. 4:15) రాజైన యేసుక్రీస్తు పరలోకంలో పరిపాలిస్తున్నాడని, కష్టాల నుండి మానవులకు ఉపశమనం కలిగించడానికి ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడని తెలుసుకొని మనం ఎంత సంతోషిస్తాం!
16. సొలొమోను తన దేశ ప్రజల బాధలను ఎందుకు అర్థం చేసుకోగలిగాడు?
16 సొలొమోనుకు జ్ఞానం, ప్రజల పరిస్థితి గురించిన అవగాహన ఉన్నాయి కాబట్టి ఆయన నిస్సందేహంగా ‘బీదల పట్ల కనికరం’ చూపించివుంటాడు. అదీగాక, ఆయన తన జీవితంలో బాధాకరమైన పరిస్థితులను, మానసిక వేదన కలిగించే పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తన సహోదరుడైన అమ్నోను తన సహోదరియైన తామారును పాడుచేశాడు, ఆ పాపం చేసినందుకు మరో సహోదరుడైన అబ్షాలోము అమ్నోనును చంపాడు. (2 సమూ. 13:1, 14, 28, 29) దావీదు సింహాసనాన్ని ఆక్రమించి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అబ్షాలోము ప్రయత్నించాడు కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. చివరికి యోవాబు చేతుల్లో చనిపోయాడు. (2 సమూ. 15:10, 14; 18:9, 14, 15) ఆ తర్వాత సొలొమోను సహోదరుడైన అదోనీయా ఇశ్రాయేలీయుల రాజు కావడానికి ప్రయత్నించాడు. ఒకవేళ ఆ ప్రయత్నం ఫలించివుంటే, సొలొమోను ఖచ్చితంగా చంపబడివుండేవాడు. (1 రాజు. 1:5) యెహోవా ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో సొలొమోను చేసిన ప్రార్థననుబట్టి ఆయన మానవుల కష్టాలు అర్థంచేసుకున్నాడని స్పష్టమౌతోంది. ఆయన తన దేశ ప్రజల కోసం యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “ప్రజలు తమ బాధలు గ్రహించి నిన్ను ప్రార్థించి వేడుకుంటే . . . వారి మొరాలకించి, వారిని క్షమించుము. ప్రతి వ్యక్తికి వానికి అర్హమైన దాని నివ్వుము.”—2 దిన. 6:29, 30, ఈజీ-టు-రీడ్ వర్షన్.
17, 18. కొంతమంది దేవుని సేవకులు ఎలాంటి బాధలను అనుభవించాల్సి వచ్చింది? వారు వాటిని ఎలా సహించగలిగారు?
17 గతంలో మనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలవల్ల కూడా మనం ‘బాధలు’ అనుభవిస్తుండవచ్చు. 30వ పడిలో ఉన్న మేరీ a అనే యెహోవాసాక్షి ఇలా రాసింది: “నేను సంతోషంగా ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి, కానీ నా గతం గుర్తుకువస్తే నేను సిగ్గుతో తలవంచుకుంటాను, నన్ను నేను అసహ్యించుకుంటాను. అదేదో నిన్నే జరిగినట్లు అనిపించి చాలా బాధేస్తుంది, ఏడుపొస్తుంది. పాత జ్ఞాపకాలవల్ల న్యూనతా భావాలు, అపరాధ భావాలు నన్ను ఇప్పటికీ ఎంతగానో వేధిస్తుంటాయి.”
18 చాలామంది దేవుని సేవకులకు అలాగే అనిపిస్తుంది. వాటిని సహించేందుకు కావాల్సిన శక్తిని వారు ఎక్కడ నుండి పొందగలరు? మేరీ ఇలా చెబుతోంది: “నిజమైన స్నేహితులవల్ల, సంఘంలోని సహోదరసహోదరీలవల్ల నేను సంతోషాన్ని పొందుతున్నాను. అంతేకాక, భవిష్యత్తు విషయంలో యెహోవా చేసిన వాగ్దానాల గురించి ఆలోచించేందుకు నేను ప్రయత్నిస్తాను, సహాయం కోసం నేను విడుస్తున్న కన్నీళ్లు ఆనందభాష్పాలుగా మారతాయనే నమ్మకం నాకుంది.” (కీర్త. 126:5) దేవుడు మనమీద రాజుగా నియమించిన తన కుమారునిపై మనం నమ్మకముంచాలి. ఆయన గురించి ఇలా ప్రవచించబడింది: “నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.” (కీర్త. 72:13, 14) ఆ మాటలు మనకు ఎంత ఓదార్పునిస్తున్నాయి!
ఎన్నో ఆశీర్వాదాలు తెచ్చే నూతనలోకం మన ముందుంది
19, 20. (ఎ) 72వ కీర్తనలో చెప్పబడినట్లు రాజ్య పరిపాలనలో ఏ సమస్య పరిష్కరించబడుతుంది? (బి) క్రీస్తు పరిపాలననుబట్టి మనం ముఖ్యంగా ఎవరిని ఘనపర్చాలి? ఆ పరిపాలనలో నెరవేరే విషయాల గురించి మీకు ఏమనిపిస్తోంది?
19 గొప్ప సొలొమోను పరిపాలనలోని నూతనలోకంలో నీతిమంతుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి మళ్లీ ప్రయత్నించండి. “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును” అని మనకు వాగ్దానం చేయబడింది. (కీర్త. 72:16) సాధారణంగా, పర్వత శిఖరాలమీద పంట పండదు కాబట్టి, భూమి ఎంత ఫలవంతంగా తయారౌతుందో ఈ మాటలు నొక్కిచెబుతున్నాయి. సొలొమోను పరిపాలనలో “లెబానోను” ప్రాంతంలో సమృద్ధిగా పండేది. భవిష్యత్తులో భూమంతా లెబానోను ప్రాంతంలో పండినట్లే సమృద్ధిగా పండుతుంది. ఈ పరిస్థితి గురించి ఒక్కసారి ఊహించుకోండి! ఆహారకొరత, కుపోషణ, ఆకలిబాధలు అస్సలు ఉండవు, అందరూ “క్రొవ్వినవాటితో విందు[ను]” ఆరగిస్తారు.—యెష. 25:6-8; 35:1, 2.
20 ఇన్ని ఆశీర్వాదాలు పొందుతున్నందుకు మనం ఎవరిని ఘనపర్చాలి? ప్రాథమికంగా, యుగ యుగములకు రాజు, విశ్వసర్వాధిపతి అయిన యెహోవా దేవుణ్ణే మనం ఘనపర్చాలి. అలా చేస్తే, మనందరం సంతోషంగా మధురమైన, ప్రోత్సాహకరమైన ఈ పాటలోని చివరి భాగాన్ని పాడడంలో స్వరాన్ని కలుపగలుగుతాం: “అతనిపేరు [రాజైన యేసుక్రీస్తు పేరు] నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును. అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్. ఆమేన్.”—కీర్త. 72:17-19.
[అధస్సూచి]
a పేరు మార్చబడింది.
మీరెలా జవాబిస్తారు?
• 72వ కీర్తనలోని ప్రవచనంలో ఎవరి పరిపాలన గురించి వివరించబడింది?
• గొప్ప సొలొమోను ఎవరు? ఆయన పరిపాలన ఎంత విస్తృతంగా ఉంటుంది?
• 72వ కీర్తనలో ప్రవచించబడిన ఆశీర్వాదాల్లో మీకు ఏది బాగా నచ్చింది?
[అధ్యయన ప్రశ్నలు]
[29వ పేజీలోని చిత్రం]
సొలొమోను పరిపాలనలో ప్రజలు అనుభవించిన సుభిక్షత దేనికి ప్రతీకగా ఉంది?
[32వ పేజీలోని చిత్రం]
గొప్ప సొలొమోను పరిపాలనలోని పరదైసులో జీవించడానికి మనం చేసే ప్రయత్నాలకు తగిన ఫలితం లభిస్తుంది