పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
యెహోవా విగ్రహారాధనను ఖండిస్తాడు కదా, మరి బంగారు దూడను చేసినందుకు అహరోనును ఎందుకు శిక్షించలేదు?
అహరోను బంగారు దూడను చేశాడని నిర్గమకాండము 32వ అధ్యాయం చెబుతోంది. ఆయన అలా చేయడం ద్వారా విగ్రహారాధన విషయంలో దేవుడు ఇచ్చిన నియమాన్ని ఉల్లంఘించాడు. (నిర్గ. 20:3-5) ఆ కారణంగా ‘యెహోవా అహరోనును నశింపజేయుటకు అతనిమీద బహుగా కోపపడగా, అప్పుడే [మోషే] అహరోనుకై బ్రతిమాలుకున్నాడు.’ (ద్వితీ. 9:19, 20) అహరోను విషయంలో నీతిమంతుడైన మోషే చేసిన ప్రార్థన ‘చాలా ప్రభావాన్ని’ చూపించిందా? (యాకో. 5:16, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.) చూపించింది. ఎందుకంటే యెహోవా మోషే ప్రార్థనకు జవాబిచ్చాడని తెలుస్తోంది. మోషే చేసిన ప్రార్థనను బట్టి, మరితర రెండు కారణాలనుబట్టి యెహోవా అహరోనును శిక్షించలేదు.
మొదటిగా, అహరోను అప్పటివరకు తనను నమ్మకంగా సేవించాడన్న విషయాన్ని యెహోవా పరిగణలోకి తీసుకొని ఉండవచ్చు. ఫరో దగ్గరకు వెళ్లి ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. మోషే ప్రతినిధిగా మాట్లాడేందుకు ఆయనతోపాటు అహరోనును కూడా పంపించాడు. (నిర్గ. 4:10-16) వీరిద్దరూ వినయంగా ఎన్నోసార్లు ఐగుప్తు రాజైన ఫరో దగ్గరకు వెళ్లి, కఠిన హృదయుడైన ఆ ఫరో ఆగ్రహాన్ని భరించాల్సి వచ్చింది. అలా ఐగుప్తులో ఉన్నప్పుడు అహరోను యెహోవాకు నమ్మకంగా, స్థిరంగా సేవచేశాడు.—నిర్గ. 4:21.
ఎలాంటి పరిస్థితుల్లో అహరోను బంగారు దూడ చేయాల్సి వచ్చిందో ఆలోచించండి. మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్లి అప్పటికి 40 రోజులు గడిచాయి. “మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు” తమ కోసం ఒక విగ్రహాన్ని తయారుచేయమని వారు అహరోను మీద ఒత్తిడి తీసుకొచ్చారు. వారడిగినట్లే అహరోను ఒక బంగారు దూడను చేశాడు. (నిర్గ. 32:1-6) ఆ తర్వాత అహరోను చేసిన కొన్ని పనులను బట్టి చూస్తే ఆయన విగ్రహారాధన చేయాలనే ఉద్దేశంతో కాదుగానీ ప్రజల ఒత్తిడికి లొంగిపోయి అలా చేశాడని స్పష్టమౌతోంది. ఉదాహరణకు, విగ్రహారాధనను తీసివేయడానికి మోషే ఓ తీవ్రమైన చర్య తీసుకున్నప్పుడు ఇతర లేవీయులతో పాటు అహరోను కూడా యెహోవా పక్షాన స్థిరంగా నిలబడ్డాడు.—నిర్గ. 32:25-29.
ఆ తర్వాత మోషే ప్రజలతో, “మీరు గొప్ప పాపము చేసితిరి” అని అన్నాడు. (నిర్గ. 32:30) ఈ విషయంలో అహరోను మాత్రమే అపరాధి కాదు. యెహోవా ఎంతో కనికరం చూపించడం వల్ల అహరోను, ఇశ్రాయేలు ప్రజలు ప్రయోజనం పొందారు.
బంగారు దూడకు సంబంధించిన సంఘటన జరిగిన తర్వాత, అహరోనును ప్రధాన యాజకునిగా నియమించమని యెహోవా ఆజ్ఞాపించాడు. “అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ప్రతిష్ఠింపవలెను” అని యెహోవా మోషేకు చెప్పాడు. (నిర్గ. 40:12, 13) దీన్నిబట్టి అహరోను బలహీనతను యెహోవా క్షమించాడని స్పష్టంగా తెలుస్తోంది. స్వతహాగా అహరోను తిరుగుబాటుదారుడైన విగ్రహారాధకుడు కాడుగానీ సత్యారాధనను సమర్థించిన నమ్మకమైన యెహోవా సేవకుడు.