బైబిలు అధ్యయనానికి సమయాన్ని కేటాయించారా?
బైబిలు అధ్యయనానికి సమయాన్ని కేటాయించారా?
కుటుంబాలు బైబిలు అధ్యయనం చేయడానికి, దాని గురించి చర్చించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించేలా గత సంవత్సరం పరిపాలక సభ కూటాల ఏర్పాటులో మార్పులు చేసినట్లు ప్రకటించింది. మీరు కుటుంబ యజమాని అయితే కుటుంబానికి ఉపయోగపడేలా భార్యాపిల్లలతో కలిసి క్రమంగా కుటుంబ బైబిలు అధ్యయనం చేస్తున్నారా? పిల్లలు లేని దంపతులు ఆ సమయంలో కుటుంబ బైబిలు అధ్యయనం చేయవచ్చు. కుటుంబ బాధ్యతలులేని అవివాహిత సహోదరసహోదరీలు ఆ సమయాన్ని వ్యక్తిగత బైబిలు అధ్యయనానికి ఉపయోగించవచ్చు.
కుటుంబ ఆరాధన కోసం చేయబడిన ఈ ఏర్పాటు చాలా బాగుందని ఎంతోమంది అంటున్నారు. ఉదాహరణకు, కెవన్ అనే సంఘ పెద్ద ఇలా అంటున్నాడు: “ఈ ఏర్పాటు పట్ల మా సంఘంలోని వారికి ఎంత ‘కృతజ్ఞత’ ఉందో తెలియజేయడానికి మాటలు చాలవు. పరిపాలక సభ చెప్పినట్లు కుటుంబ ఆరాధన చేసే సాయంకాలాన్ని మా కుటుంబాలతో బైబిలు అధ్యయనం చేయడానికి మాత్రమే ఉపయోగించేందుకు ఏమి చేయాలో పెద్దలందరం చర్చించుకున్నాం.”
జోడి అనే సహోదరి ఈ విషయంలో ఏమి చెబుతుందో చూద్దాం. ఆమె భర్త క్రైస్తవ సంఘంలో పెద్దగా సేవచేస్తున్నాడు. ఆమె ఇలా రాసింది: “మాకు ముగ్గురు కూతుళ్లు. పెద్దమ్మాయికి పదిహేనేళ్లు, రెండవ అమ్మాయికి పదకొండేళ్లు, చిన్నపాపకు రెండేళ్లు. మేము ఈ మధ్యే సంజ్ఞా భాషా సంఘంలో చేరాం. కాబట్టి, కూటాలన్నిటికీ సిద్ధపడడానికి చాలా సమయం పడుతుంది, ఎంతో కష్టపడాల్సివస్తుంది. ఈ కొత్త ఏర్పాటు వల్ల, ప్రత్యేకంగా కుటుంబ ఆరాధనకే ఓ సాయంత్రాన్ని కేటాయించగలుగుతున్నాం.”
జాన్, జోయన్ దంపతులు క్రమపయినీర్లుగా సేవచేస్తున్నారు. వాళ్లు ఇలా అంటున్నారు: “మేము కుటుంబ బైబిలు అధ్యయనాన్ని క్రమంగా జరుపుకోలేక పోయేవాళ్లం. ఎందుకంటే, మాకున్న ఎన్నో సంఘ కార్యకలాపాలతోపాటు దీన్ని కూడా చేయడం కష్టంగా ఉండేది. మనం సమయాన్ని ఉపయోగించాల్సిన పద్ధతిలో ఉపయోగిస్తేనే యెహోవా బహుమతిగా ఇచ్చిన ఈ ఏర్పాటు వల్ల ఆధ్యాత్మికంగా సేదదీరుతాం.”
అవివాహితుడైన టోనికి దాదాపు 25 ఏళ్లుంటాయి. ఆయన వ్యక్తిగత బైబిలు అధ్యయనానికి మంగళవారం సాయంత్రాన్ని కేటాయించాడు. ఆయన మిగతా రోజుల్లో సంఘ కూటాలకు సిద్ధపడతాడు. “నేను ప్రత్యేకంగా మంగళవారం కోసం ఎదురుచూస్తాను?” అని టోని అంటున్నాడు. ఎందుకు? “ఆ సాయంకాలాన్ని ప్రత్యేకంగా యెహోవాకే అంకితం చేశాను. యెహోవాతో నాకున్న అనుబంధాన్ని బలపర్చే విషయాలను ఆ రోజు దాదాపు రెండు గంటలపాటు అధ్యయనం చేస్తాను. ఇప్పుడు అధ్యయనానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. దాంతో చదివిన లేఖనాలను ధ్యానించగలుతున్నాను” అని ఆయన చెబుతున్నాడు. అలా చేయడం వల్ల ఆయన ఎలాంటి ప్రయోజనాలు పొందాడు? “యెహోవా ఉపదేశం ఇప్పుడు ఇంతకుముందుకన్నా ఎక్కువగా హృదయ లోతుల్లోకి చేరుకుంటోంది” అని టోని అంటున్నాడు. టోని దానికి ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. “అంతర్దృష్టి (ఆంగ్లం) పుస్తకంలో దావీదు, యోనాతానుల స్నేహం గురించి చదివాను. స్వార్థపరుడుకాని యోనాతాను నుండి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన గురించి చదివినప్పుడు నిజమైన స్నేహితునిగా ఉండడమంటే ఏమిటో మరింత స్పష్టంగా అర్థం చేసుకున్నాను. ప్రతీ మంగళవారం సాయంత్రం అలాంటి రత్నాలను ఎన్నింటినో కనుగొనాలని ఎదురుచూస్తున్నాను.”
ఇప్పుడున్న ఈ అదనపు సమయాన్ని బైబిలు అధ్యయనం కోసం, కుటుంబ ఆరాధన కోసం పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం వల్ల యెహోవా సేవకులందరూ తప్పకుండా ఎంతో ప్రయోజనం పొందుతారు.