మీకు ఒకప్పుడు సేవాధిక్యతలు ఉండేవా? మళ్లీ చేపట్టగలరా?
మీకు ఒకప్పుడు సేవాధిక్యతలు ఉండేవా? మళ్లీ చేపట్టగలరా?
మీరు ఒకప్పుడు క్రైస్తవ సంఘంలో బాధ్యతాయుతమైన స్థానంలో సేవచేశారా? మీరు బహుశా పరిచర్య సేవకునిగానో, పెద్దగానో లేక పూర్తికాల సేవకునిగానో సేవచేసివుంటారు. నిస్సందేహంగా, మీరు మీ నియామకాల్లో ఆనందాన్ని, ఎంతో సంతృప్తిని పొందివుంటారు. కానీ ఏదో కారణాన్నిబట్టి మీరు వాటిని వదులుకోవాల్సివచ్చింది.
కుటుంబాన్ని చూసుకోవడానికి మీరలా చేసివుంటారు. లేక వయసు మీరడంవల్లనో, అనారోగ్యంవల్లనో వాటిని వదులుకొనివుంటారు. అంతమాత్రాన మీరు చేతకానివారని దానర్థం కాదు. (1 తిమో. 5:8) మొదటి శతాబ్దంలో ఫిలిప్పు మిషనరీగా సేవచేశాడు. అయితే ఆ తర్వాత కైసరయలో స్థిరపడి, తన కుటుంబాన్ని చూసుకున్నాడు. (అపొ. 21:8, 9) ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు వృద్ధుడైనప్పుడు, తన కుమారుడైన సొలొమోను రాజయ్యేందుకు ఏర్పాట్లుచేశాడు. (1 రాజు. 1:1, 32-35) ఫిలిప్పు, దావీదు తమ సేవాధిక్యతలను వదులుకున్నప్పటికీ యెహోవా వారిని ప్రేమించాడు, వారు చేసిన సేవను ఇష్టపడ్డాడు. ఆ ఇద్దరిని ప్రజలు ఇప్పటికీ గౌరవిస్తారు.
బహుశా మీరు అవివేకంగా ప్రవర్తించడం వల్ల లేదా కుటుంబ సమస్యల వల్ల సేవాధిక్యతలను కోల్పోయివుంటారు. (1 తిమో. 3:2, 4, 10, 12) మీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదని కూడ మీకు అనిపించివుంటుంది. ఆ విషయం ఆలోచించినప్పుడల్లా మీకు ఇప్పటికీ కోపం వస్తుండవచ్చు.
సేవాధిక్యతలను మీరు మళ్లీ పొందవచ్చు
ఒకప్పుడు మీకున్న సేవాధిక్యతలను తిరిగి పొందే అవకాశం లేదా? చాలా సందర్భాల్లో వాటిని తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే, మీరు సేవాధిక్యతలను తిరిగి పొందాలంటే వాటికి కావాల్సిన అర్హతలను సంపాదించాలి. (1 తిమో. 3:1) ఆ సేవాధిక్యతలను మళ్లీ పొందేందుకు ఎందుకు కృషిచేయాలి? మీరు యెహోవా పట్ల ప్రేమతో, ఆయనను సేవిస్తున్నవారి పట్ల ప్రేమతో మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. ఆ ప్రేమనే మనసులో ఉంచుకొని ఆ సేవాధిక్యతల్ని మళ్లీ పొందేందుకు కృషిచేయాలి. అలా చేసినప్పుడు, ఆ సేవాధిక్యతను కోల్పోకముందు మీకున్న అనుభవాన్నీ, వాటిని కోల్పోయిన తర్వాత సంపాదించిన అనుభవాన్నీ యెహోవా ఉపయోగించుకుంటాడు.
చేసిన తప్పులను బట్టి ఇశ్రాయేలు జనాంగం దేవునితో తమకున్న ప్రత్యేక సంబంధాన్ని పోగొట్టుకున్నప్పుడు యెహోవా వారికి ఇచ్చిన హామీని గుర్తుచేసుకోండి. “యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయముకాలేదు” అని ఆయన అన్నాడు. (మలా. 3:6) యెహోవా ఇశ్రాయేలీయులను ప్రేమించాడు, వారిని ఎక్కువగా ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. అలాగే యెహోవా మిమ్మల్ని కూడా భవిష్యత్తులో ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. అలాంటప్పుడు అదనపు బాధ్యతలులేని ఈ సమయంలో మీరేమి చేయవచ్చు? సహజ సామర్థ్యాలను బట్టి కాక యెహోవాతో ఉన్న అనుబంధాన్ని బట్టే మీకు సేవాధిక్యతలు ఇవ్వబడతాయి కాబట్టి, యెహోవాతో మీకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి కృషి చేయండి.
మీ విశ్వాసం ‘బలపడాలంటే’ మీరు ‘యెహోవాను, ఆయన బలాన్ని వెదకాలి.’ (1 కొరిం. 16:13; కీర్త. 105:4) అలా బలపడేందుకు మీరు మొదట హృదయపూర్వకంగా ప్రార్థించాలి. మనసు విప్పి యెహోవాకు మీ పరిస్థితిని వివరించి, ఆయన పరిశుద్ధాత్మ సహాయం కోరండి. అలా చేస్తే మీరు యెహోవాకు దగ్గరౌతారు, దానివల్ల మీ విశ్వాసం బలపడుతుంది. (కీర్త. 62:8; ఫిలి. 4:6, 13) రెండవది, దేవుని వాక్య అధ్యయనాన్ని మెరుగుపరచుకోవాలి. ప్రస్తుతం మీకు ఎక్కువ బాధ్యతలు లేవు కాబట్టి మీరు వ్యక్తిగత, కుటుంబ అధ్యయనం ఎక్కువ చేయగలుగుతారు. అలా ఒకప్పుడు మీకు చేయడానికి కష్టమనిపించిన ఆధ్యాత్మిక కార్యకలాపాలను తిరిగి క్రమంగా చేయడానికి వీలౌతుంది.
యెష. 43:10-12) ‘దేవుని జతపరిగా’ ఉండడంకన్నా గొప్ప గౌరవం మరొకటి లేదు. (1 కొరిం. 3:9) పరిచర్యలో ఎక్కువగా పాల్గొనండి. యెహోవాతో మీ సంబంధాన్ని, పరిచర్యలో మీ తోటి సేవకులతో మీకున్న సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి అదో చక్కని మార్గం.
ఒక యెహోవాసాక్షిగా మీరు ఇప్పటికీ యెహోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (ప్రతికూల భావాలు విడిచిపెట్టండి
సేవాధిక్యతలను కోల్పోయినప్పుడు మీకు అవమానం జరిగినట్లు అనిపించవచ్చు లేదా మీకు బాధనిపించవచ్చు. మిమ్మల్ని మీరు సమర్థించుకునే అవకాశముంది. మీ ప్రతివాదనలను విన్న తర్వాత కూడ బాధ్యతగల సహోదరులు మీరు ఆ స్థానంలో కొనసాగకూడదని నిర్ణయించినప్పుడు మీకెలా అనిపించవచ్చు? మీరు ఆ సహోదరులను ఇష్టపడకపోవచ్చు. మీలో ఆ ప్రతికూల భావాలు ఉండడంవల్ల సేవాధిక్యతల కోసం మీరు కృషి చేయకపోవచ్చు లేదా తప్పు సరిదిద్దుకోవడం కష్టం కావచ్చు. మనమిప్పుడు యోబు, మనష్షే, యోసేపు ఉదాహరణలను పరిశీలించి వారిలా ప్రతికూల భావాలను ఎలా విడిచిపెట్టవచ్చో తెలుసుకుందాం.
యోబు ఇతరుల కోసం యెహోవాకు ప్రార్థించాడు, సమాజంలో ఆయనకు ఓ గౌరవ స్థానముంది. అంతేకాక, ఆయన ఓ పెద్దగా, న్యాయాధిపతిగా వ్యవహరించాడు. (యోబు 1:5; 29:7-17, 21-25) అయితే, ఆయన తన జీవితంలో ఓ కీలక సమయంలో తన సంపదను, పిల్లలను, ఆరోగ్యాన్నీ పోగొట్టుకున్నాడు. దాంతో ఇతరులు ఆయనను చిన్నచూపు చూడడం మొదలుపెట్టారు. ‘నాకన్న తక్కువ వయసుగలవారు నన్ను ఎగతాళి చేశారు’ అని యోబు వాపోయాడు.—యోబు 30:1.
తాను ఏ తప్పు చేయలేదనుకొని దేవుని ముందు తనను తాను సమర్థించుకోవాలనుకున్నాడు. (యోబు 13:15) అయినప్పటికీ, ఆయన యెహోవా నడిపింపు కోసం వేచి చూశాడు, అలా వేచి చూసినందుకు ఆయన ఆశీర్వదించబడ్డాడు. తనకు దిద్దుబాటు అవసరమనీ, ముఖ్యంగా తనకు పరీక్షలు ఎదురైనప్పుడు తాను మాట్లాడిన మాటలనుబట్టి తనకు అది అవసరమనీ ఆయన అర్థం చేసుకున్నాడు. (యోబు 40:6-8; 42:3, 6) యోబు వినయం చూపించాడు కాబట్టి, కొంతకాలానికి దేవుడు ఆయనను ఎంతగానో ఆశీర్వదించాడు.—యోబు 42:10-13.
మీరు తప్పుచేసినందుకు సేవాధిక్యతలను కోల్పోతే, యెహోవాతోపాటు మీ క్రైస్తవ సహోదరులు మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తారో లేదో, మీరు చేసినదాన్ని మరచిపోతారో లేదో అనే అనుమానం రావచ్చు. యూదా రాజైన మనష్షే ఉదాహరణనే తీసుకోండి. ఆయన “యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టిం[చాడు].” (2 రాజు. 21:6) అయినప్పటికీ, ఆయన తిరిగి రాజుగా పరిపాలించి నమ్మకస్థునిగా మరణించాడు. అది ఎలా సాధ్యమైంది?
కొంతకాలానికి మనష్షే తనకివ్వబడిన క్రమశిక్షణను అంగీకరించాడు. ఆయన హెచ్చరికలను పట్టించుకోనప్పుడు యెహోవా ఆయన మీదకు అష్షూరీయులను రప్పించాడు. వారు ఆయనను బంధించి ఎంతో దూరంలో ఉన్న బబులోనుకు చెరగా తీసుకువెళ్లారు. అక్కడ మనష్షే ‘తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టాడు.’ హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి, ఆయన తన తప్పును సరిదిద్దుకున్నాడు. అందుకే యెహోవా ఆయనను క్షమించాడు.—2 దిన. 33:12, 13.
సాధారణంగా, కోల్పోయిన సేవాధిక్యతలన్నీ ఒకేసారి తిరిగి లభించవు. అయితే, సమయం గడిచేకొద్దీ కొన్ని చిన్నచిన్న బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. వాటిని స్వీకరించి శాయశక్తులా కృషి చేస్తే మీకు మరిన్ని బాధ్యతలు అప్పగించబడతాయి. అది అనుకున్నంత సులువేమీ కాదు. కొన్నిసార్లు మీరు నిరాశపడాల్సిరావచ్చు. అయినప్పటికీ, ఏది
చేయడానికైనా సిద్ధంగా ఉంటూ పట్టుదలతో దేవుని సేవలో కొనసాగితే మంచి ఫలితాలను పొందుతారు.యాకోబు కుమారుడైన యోసేపు మాదిరిని అనుసరించండి. ఆయనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, ఆయన అన్నలు అన్యాయంగా ఆయనను దాసునిగా అమ్మేశారు. (ఆది. 37:2, 26-28) తన తోబుట్టువులు తనకు అలా చేస్తారని ఆయన ఎన్నడూ ఊహించివుండడు. అయితే, ఆ పరిస్థితిలో ఆయన సర్దుకొని పోవడానికి ఇష్టపడ్డాడు. యెహోవా ఆశీర్వాదం కూడ దానికి తోడుకావడంతో ఆయన “తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింటనుండెను.” (ఆది. 39:2) ఆ తర్వాత యోసేపును చెరసాలలో వేశారు. అయితే ఆయన నమ్మకంగా ఉండడమేకాక యెహోవా కూడ ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, కొంతకాలానికి చెరసాల బాధ్యతలు ఆయనకు అప్పగించబడ్డాయి.—ఆది. 39:21-23.
తన చెరసాల జీవితంలో ఏదో మేలు జరుగుతుందని ఆయనకు తెలియదు. తాను చేయగలిగింది చేస్తూ పోయాడు. అందుకే యెహోవా, వాగ్దాన సంతానం రాగల వంశావళిని కాపాడేందుకు ఆయనను ఉపయోగించుకున్నాడు. (ఆది. 3:15; 45:5-8) యోసేపులాగే ప్రాముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం దొరుకుతుందని మనలో ఎవరమూ ఆశించలేం. కానీ తన సేవకులకు యెహోవాయే సేవాధిక్యతలు అనుగ్రహిస్తాడని బైబిలు చెబుతోంది. యోసేపును అనుకరిస్తూ యెహోవా మనల్ని ఉపయోగించే అవకాశం కోసం సానుకూలంగా వేచివుండండి.
కష్టాల నుండి నేర్చుకోండి
యోబు, మనష్షే, యోసేపులు బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ ముగ్గురూ యెహోవా అనుమతించిన పరిస్థితుల్ని అంగీకరించి, విలువైన పాఠాలు నేర్చుకున్నారు. వాటి నుండి మీరేమి నేర్చుకోవచ్చు?
యెహోవా మీకు ఏమి బోధించాలనుకుంటున్నాడో గ్రహించడానికి ప్రయత్నించండి. బాధలో మునిగిపోయిన యోబు తన గురించే ఆలోచించాడు గానీ, ప్రాముఖ్యమైన విషయాల గురించి ఆలోచించలేదు. యెహోవా ప్రేమతో సరిదిద్దినప్పుడు ఆయన తేరుకొని, “వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక . . . మాటలాడితిని” అని తన తప్పు ఒప్పుకున్నాడు. (యోబు 42:3) సేవాధిక్యతలు కోల్పోయినందుకు మీకు బాధగా ఉంటే ‘మిమ్మల్ని మీరు ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకోకుండా, స్వస్థబుద్ధిగలవారవడానికి తగినరీతిలో మిమ్మల్ని మీరు ఎంచుకోండి.’ (రోమా. 12:3) మిమ్మల్ని సరిదిద్దేందుకు యెహోవా ప్రయత్నిస్తుండవచ్చు, ఎలా సరిదిద్దుతున్నాడో మీరింకా పూర్తిగా అర్థంచేసుకొని ఉండకపోవచ్చు.
క్రమశిక్షణను అంగీకరించండి. తనను అంత తీవ్రంగా శిక్షించడం అనవసరమని మనష్షేకు మొదట అనిపించివుండవచ్చు. అయినా ఆయన దాన్ని అంగీకరించి, పశ్చాత్తాపపడి తన తప్పు సరిదిద్దుకున్నాడు. మీకు ఇచ్చిన క్రమశిక్షణ విషయంలో మీకెలా అనిపించినా, ‘దేవుడు మిమ్మును హెచ్చించునట్లు, దీనమనస్కులై ఉండండి.’—1 పేతు. 5:6; యాకో. 4:10.
ఓపిక కనబరచండి, శిక్షణకు సిద్ధంగా ఉండండి. యోసేపు తనకు ఎదురైన పరిస్థితులనుబట్టి పగ, ప్రతీకారంతో రగిలిపోయే అవకాశముంది. కానీ ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని దయతో వ్యవహరించడం నేర్చుకున్నాడు. (ఆది. 50:15-21) మీకు నిరాశ ఎదురైతే, ఓపిక కనబరచండి. యెహోవా ఇచ్చే శిక్షణకు సిద్ధంగా ఉండండి.
క్రైస్తవ సంఘంలో మీరు ఒకప్పుడు బాధ్యతాయుతమైన స్థానంలో సేవచేశారా? భవిష్యత్తులో మీకు సేవాధిక్యతలను ఇచ్చేందుకు యెహోవాకు అవకాశాన్నివ్వండి. యెహోవాతో మీ సంబంధాన్ని బలపర్చుకోండి. ప్రతికూల భావాలు విడిచిపెట్టి ఓర్పును, వినయాన్ని అలవర్చుకోండి. మీకు ఇవ్వబడే ఏ నియామకాన్నైనా ఇష్టంతో స్వీకరించండి. “యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు” అని గుర్తుంచుకోండి.—కీర్త. 84:11.
[30వ పేజీలోని బ్లర్బ్]
హృదయపూర్వకంగా ప్రార్థించడం ద్వారా విశ్వాసాన్ని బలపర్చుకోండి
[31వ పేజీలోని చిత్రం]
యెహోవాతో మీ సంబంధాన్ని బలపర్చుకునేందుకు పరిచర్యలో ఎక్కువ పాల్గొనడం ఓ చక్కని మార్గం
[32వ పేజీలోని చిత్రం]
భవిష్యత్తులో మీకు సేవాధిక్యతలు ఇచ్చేందుకు యెహోవాకు అవకాశాన్నివ్వండి