భూమ్మీద నిత్యజీవ నిరీక్షణ మళ్లీ వెలుగులోకి వచ్చింది
భూమ్మీద నిత్యజీవ నిరీక్షణ మళ్లీ వెలుగులోకి వచ్చింది
‘దానియేలూ, అంత్యకాలమువరకు నీవు ఈ మాటలను మరుగుచేయుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును.’—దాని. 12:4.
1, 2. ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలను చర్చిస్తాం?
భూపరదైసులో నిరంతరం జీవించే అవకాశం గురించి బైబిలు బోధిస్తుందని లక్షలాదిమంది ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థంచేసుకుంటున్నారు. (ప్రక. 7:9, 17) మానవులను సృష్టించింది కేవలం కొన్ని సంవత్సరాలు జీవించి చనిపోవడానికి కాదుగానీ నిరంతరం జీవించడానికేనని దేవుడు మానవ చరిత్ర ఆరంభంలో తెలియజేశాడు.—ఆది. 1:26-28.
2 ఆదాముహవ్వలు పాపం చేయకముందున్న స్థితిలోకి తాము వస్తామని ఇశ్రాయేలీయులు నమ్మారు. మానవులు భూపరదైసులో నిరంతరం జీవించడానికి దేవుడు ఏ ఏర్పాటు చేశాడో క్రైస్తవ గ్రీకు లేఖనాలు వివరిస్తున్నాయి. ఆ నిరీక్షణను మళ్లీ వెలుగులోకి ఎందుకు తీసుకురావాల్సివచ్చింది? అది మళ్లీ ఎలా వెలుగులోకి తీసుకురాబడింది? దాని గురించి లక్షలాదిమందికి ఎలా తెలియజేయబడింది?
నిరీక్షణను మరుగుచేశారు
3. భూమ్మీద నిత్యజీవానికి సంబంధించిన నిరీక్షణ చాలామందికి మరుగుచేయబడడాన్ని చూసి మనకు ఎందుకు ఆశ్చర్యం కలగదు?
3 అబద్ధ ప్రవక్తలు తన బోధలను వక్రీకరించి, చాలామందిని మోసగిస్తారని యేసు ముందే చెప్పాడు. (మత్త. 24:11) “మీలోను అబద్ధబోధకులుందురు” అని అపొస్తలుడైన పేతురు క్రైస్తవులను హెచ్చరించాడు. (2 పేతు. 2:1) “జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసుకొనే” కాలము గురించి అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (2 తిమో. 4:3, 4) ప్రజలను మోసగించడంలో సాతాను హస్తం ఉంది. గతంలో అతడు మతభ్రష్ట క్రైస్తవులను ఉపయోగించి మానవులపట్ల భూమిపట్ల దేవుని ఉద్దేశాలకు సంబంధించిన సంతోషాన్నిచ్చే సత్యాలను మరుగుచేశాడు.—2 కొరింథీయులకు 4:3, 4 చదవండి.
4. మానవుల నిరీక్షణ విషయంలో మతభ్రష్టనాయకులు ఏమి బోధించారు?
4 దేవుని రాజ్యం మానవ ప్రభుత్వాలన్నిటినీ పగులగొట్టి నిర్మూలం చేస్తుందని లేఖనాలు చెబుతున్నాయి. (దాని. 2:44) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో సాతాను అగాధంలో బంధించబడతాడు, మరణించినవారు పునరుత్థానం చేయబడతారు, మానవులు మళ్లీ పూర్వస్థితికి తేబడతారు. (ప్రక. 20:1-3, 6, 12; 21:1-4) అయితే, మతభ్రష్ట క్రైస్తవ నాయకులు వేరే సిద్ధాంతాలను స్వీకరించి, వాటిని బోధించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు, మూడవ శతాబ్దపు చర్చి ఫాదిరి అయిన అలెగ్జాండ్రియాకు చెందిన ఆరిజెన్, వెయ్యేండ్ల పరిపాలనలో భూమ్మీద ఆశీర్వాదాలను పొందుతామని విశ్వసించినవారిని తప్పుబట్టాడు. క్యాథలిక్ వేదాంతియైన హిప్పొకు చెందిన అగస్టీన్ (సా.శ. 354-430) “వెయ్యేండ్ల పరిపాలన ఉండదనే సిద్ధాంతాన్ని సమర్థించాడు” అని ద క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. *
5, 6. ఆరిజెన్, అగస్టీన్‌లు వెయ్యేండ్ల పరిపాలన భూమ్మీద జరగదని ఎందుకు బోధించారు?
5 ఆరిజెన్, అగస్టీన్ వెయ్యేండ్ల పరిపాలనకు వ్యతిరేకంగా ఎందుకు అలా బోధించారు? ఆరిజెన్ ఆత్మ అమర్త్యమైనది అనే సిద్ధాంతాన్ని గ్రీకుల నుండి అరువుతెచ్చుకున్నాడు. ఆత్మ గురించి ప్లేటో బోధించిన సిద్ధాంతాలకు ఎంతగానో ప్రభావితుడైన ఆరిజెన్ “ఆత్మ గురించి, దాని గమ్యం గురించి ప్లేటో బోధించిన సిద్ధాంతాన్ని క్రైస్తవ సిద్ధాంతంతో పొందుపర్చాడు” అని వేదాంతియైన వర్నర్ యాగ చెప్పాడు. అందుకే, వెయ్యేండ్ల పరిపాలనలో పొందే ఆశీర్వాదాలు భూమ్మీద కాదుగానీ పరలోకంలో అనుభవిస్తామని ఆరిజెన్ బోధించాడు.
6 అగస్టీన్ 33 ఏళ్ల వయసులో క్రైస్తవ మతంలో చేరే
ముందు మూడవ శతాబ్దపు ప్లోటినస్ బోధించిన ప్లేటో సిద్ధాంతాన్ని అంటే నియోప్లేటోనిజాన్ని నమ్మడం మొదలుపెట్టాడు. క్రైస్తవునిగా మారిన తర్వాత కూడ ఆయన ఆ నమ్మకాన్ని వదల్లేదు. “క్రొత్త నిబంధనకు సంబంధించిన మతంలో ప్లేటో బోధించిన గ్రీకు సిద్ధాంతాన్ని పూర్తిగా చేర్చడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు” అని ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. ప్రకటన 20వ అధ్యాయంలో వివరించబడిన వెయ్యేండ్ల పరిపాలన ‘కేవలం సూచనార్థకమైనది’ అని అగస్టీన్ బోధించినట్లు ద క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. దానిలో ఇలా కూడ చెప్పబడింది: ‘ఆ బోధను ఆ తర్వాత వచ్చిన పాశ్చాత్య వేదాంతులు నమ్మడం మొదలుపెట్టి, వెయ్యేండ్ల పరిపాలన భూమ్మీదే ఉంటుందనే నమ్మకాన్ని గాలికి వదిలేశారు.’7. భూమ్మీద నిత్యమూ జీవించే విషయంలో ఏ అబద్ధ నమ్మకం మానవుల ఆశలపై నీళ్లు చల్లింది? ఎలా?
7 ఆత్మ అమర్త్యమైనదనే సిద్ధాంతం మొదట ప్రాచీన బబులోనులో బోధించబడి, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచెందింది. ఆ సిద్ధాంతం భూమ్మీద నిత్యమూ జీవిస్తామని అనుకున్న మానవుల ఆశలమీద నీరుచల్లింది. క్రైస్తవమత సామ్రాజ్యంలోని శాఖలు ఆ సిద్ధాంతాన్ని స్వీకరించినప్పుడు, వేదాంతులు పరలోక నిరీక్షణ గురించి చెప్పే వచనాలను వక్రీకరించి, మంచివాళ్లందరూ పరలోకానికి వెళ్తారని ప్రజలు నమ్మేలా చేశారు. మరో మాటలో చెప్పాలంటే, ఈ భూజీవితం తాత్కాలికమైనదేనని, ఓ వ్యక్తి పరలోకానికి వెళ్తాడో లేదో భూమ్మీద ఆయన గడిపే జీవితాన్ని బట్టి తేలుతుందని వారు బోధించారు. భూమ్మీద నిరంతరం జీవిస్తామనే యూదుల నమ్మకం మీద కూడ అలాంటి దాడే జరిగింది. మానవులు పుట్టుకతోనే అమరత్వాన్ని పొందుతారనే గ్రీకుల నమ్మకాన్ని యూదులు క్రమంగా స్వీకరించసాగారు. అలా వారికి భూమ్మీద నిరంతరం జీవిస్తామనే నిరీక్షణ మీద నమ్మకం తగ్గిపోయింది. మానవుల గురించి బైబిలు చెబుతున్నదానికీ ఆ సిద్ధాంతానికీ మధ్య ఎంత తేడా! మానవుడు భౌతిక ప్రాణే కానీ ఆత్మప్రాణి కాదు. అందుకే, “నీవు మన్నే” అని యెహోవా మొదటి మానవునితో అన్నాడు. (ఆది. 3:19) మానవుల శాశ్వత గృహం భూమే కానీ పరలోకం కాదు.—కీర్తనలు 104:5; 115:16 చదవండి.
చీకటిలో సత్యపు వెలుగు ప్రకాశించింది
8. మానవ నిరీక్షణ గురించి 17వ శతాబ్దంలో కొందరు విద్వాంసులు ఏమన్నారు?
8 క్రైస్తవులమని చెప్పుకునే చాలా శాఖలు భూమ్మీద నిరంతరం జీవించే అవకాశం ఉందని బోధించవు. సాతాను వాటిని ఉపయోగించినా అన్ని సమయాల్లో సత్యాన్ని మరుగుచేయలేకపోయాడు. కాలం గడిచేకొద్దీ, బైబిలు శ్రద్ధగా పఠించే కొంతమంది దేవుడు మానవులను మళ్లీ పరిపూర్ణులుగా ఎలా చేస్తాడనే దాని గురించిన కొన్ని విషయాలను అర్థంచేసుకున్నారు. అలా వారు సత్యపు కిరణాలను చూడగలిగారు. (కీర్త. 97:11; మత్త. 7:13, 14; 13:37-39) 17వ శతాబ్దానికల్లా బైబిలు అనువాదం, ముద్రణ పుంజుకోవడంతో పరిశుద్ధ గ్రంథం విరివిగా అందుబాటులోకి వచ్చింది. 1651లో ఓ విద్వాంసుడు, ఆదాము ద్వారా “మానవులు పరదైసునూ, భూమ్మీద నిరంతర జీవితాన్నీ కోల్పోయారు” కాబట్టి, క్రీస్తు ద్వారా “వారు భూమ్మీద నిరంతరం జీవితాన్ని తిరిగి పొందుతారు, అదే నిజం కాకపోతే వారిద్దరినీ పోల్చడంలో అర్థంలేదు” అని రాశాడు. (1 కొరింథీయులు 15:21, 22 చదవండి.) ప్రముఖ ఆంగ్ల కవుల్లో ఒకడైన, జాన్ మిల్టన్ (1608-1674) ప్యారడైజ్ లాస్ట్‌ను, దాని తర్వాతి భాగమైన ప్యారడైజ్ రిగేయిండ్ అనే పుస్తకాలను రాశాడు. ఆయన తన పుస్తకాల్లో, భూపరదైసులో నమ్మకమైనవారు పొందే ఆశీర్వాదాల గురించి ప్రస్తావించాడు. మిల్టన్ తన జీవితంలో ఎక్కువభాగం బైబిలు అధ్యయనానికే అంకితం చేసినప్పుటికీ, క్రీస్తు ప్రత్యక్షత వరకు ఆ లేఖన సత్యాలను పూర్తిగా అర్థంచేసుకోవడం సాధ్యంకాదని ఆయన గ్రహించాడు.
9, 10. (ఎ) మానవుల నిరీక్షణ గురించి ఐజాక్ న్యూటన్ ఏమి రాశాడు? (బి) క్రీస్తు ప్రత్యక్షత దగ్గర్లోలేదని న్యూటన్‌కు ఎందుకు అనిపించింది?
9 ప్రఖ్యాత గణితశాస్త్ర పండితుడైన సర్ ఐజాక్ న్యూటన్ (1642-1727) కూడ బైబిలును ఎంతో ఇష్టపడ్డాడు. పరిశుద్ధులు పరలోకానికి ఎత్తబడి క్రీస్తుతో అదృశ్యంగా పరిపాలిస్తారని ఆయన అర్థంచేసుకున్నాడు. (ప్రక. 5:9, 10) ఆయన ఆ రాజ్య ప్రజల గురించి రాస్తూ, “తీర్పుదినం తర్వాత కూడ ప్రజలు భూమ్మీద ఉంటారు. వారు కేవలం 1,000 సంవత్సరాలే కాక నిరంతరం జీవిస్తారు” అని చెప్పాడు.
10 క్రీస్తు ప్రత్యక్షత కొన్ని శతాబ్దాల తర్వాత జరుగుతుందని న్యూటన్ అనుకున్నాడు. “తన చుట్టూవున్న త్రిత్వవాదుల్లో కనిపించిన విపరీతమైన మతభ్రష్టత్వాన్నిబట్టి ఆయన ఎంతో నిరాశచెందాడు. దేవుని రాజ్యం దగ్గర్లోలేదని ఆయన అనుకోవడానికి అది ఒక కారణం” అని చరిత్రకారుడైన స్టీవెన్ స్నోబెలన్ చెప్పాడు. అప్పుడు సువార్త ఇంకా వెలుగులోకి రాలేదు. దాన్ని ప్రకటించే క్రైస్తవ గుంపేదీ ఆయనకు కనిపించలేదు. అందుకే, ఆయన ఇలా రాశాడు: “దానియేలు, యోహాను రాసిన ఈ ప్రవచనాలు [యోహాను రాసింది ప్రకటన గ్రంథంలో ఉంది] అంత్యకాలంవరకు అర్థంకావు.” దానికిగల కారణాన్ని న్యూటన్ ఇలా వివరించాడు: “‘చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును’ అని దానియేలు చెప్పాడు. ఎందుకంటే మహాశ్రమలు, లోకాంతం రాకముందే సువార్త అన్ని దేశాల్లో ప్రకటించబడాలి. ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని మహాశ్రమలను దాటుకొని వచ్చే అనేక దేశాలకు చెందిన ఆ గొప్పసమూహపువారు లెక్కింపజాలనంతగా ఉండాలంటే వారిందరికీ మహాశ్రమలు రాకముందు ప్రకటించబడాలి.”—దాని. 12:4; మత్త. 24:14; ప్రక. 7:9, 10.
11. మిల్టన్, న్యూటన్ రోజుల్లో చాలామంది మానవ నిరీక్షణ గురించి ఎందుకు తెలుసుకోలేకపోయారు?
11 మిల్టన్, న్యూటన్ రోజుల్లో చర్చి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బోధించడం ప్రమాదకరంగా ఉండేది. అందుకే, బైబిలును పరిశోధించి వారు రాసిన అనేక పుస్తకాలు వారి మరణం తర్వాతే ప్రచురించబడ్డాయి. 16వ శతాబ్దంలో కొందరు క్యాథలక్ చర్చిని, దాని బోధలను విడిచిపెట్టారు. వారికి ప్రొటస్టెంటులు అనే పేరువచ్చింది. ప్రొటెస్టెంట్ చర్చీలు కూడ మానవులు పుట్టుకతోనే అమరత్వాన్ని పొందుతారనే బోధను సరిదిద్దలేకపోయాయి. వెయ్యేండ్ల పరిపాలన భవిష్యత్తులో జరిగేదికాదని, అది ఎప్పుడో ప్రారంభమైందని అగస్టిన్ చెప్పిన సిద్ధాంతాలనే ప్రాబల్యం కలిగిన ప్రముఖ ప్రొటెస్టెంట్ చర్చీలు కూడ బోధించసాగాయి. మరైతే, అంత్యకాలంలో జ్ఞానం అధికమైందా?
నిజమైన ‘జ్ఞానం అధికమౌతుంది’
12. నిజమైన జ్ఞానం ఎప్పుడు అధికమౌతుంది?
12 దానియేలు “అంత్యకాలము”లో జరిగే ఎంతో మంచి విషయాన్ని ప్రవచించాడు. (దానియేలు 12:3, 4, 9, 10 చదవండి.) ఆ అంత్యదినాల్లో “నీతిమంతులు . . . సూర్యునివలె తేజరిల్లుదురు” అని యేసు అన్నాడు. (మత్త. 13:43) అంత్యకాలంలో నిజమైన జ్ఞానం ఎలా అధికమైంది? అంత్యకాలం ప్రారంభమైన 1914కు కొన్ని దశాబ్దాల ముందు జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలను ఇప్పుడు పరిశీలిద్దాం.
13. పాపానికి ముందు ఆదాము ఉన్న పరిపూర్ణ స్థితికి మానవులు తీసుకురాబడడం అనే అంశంమీద పరిశోధించిన తర్వాత ఛార్లెస్ తేజ్ రస్సెల్ ఏమని రాశాడు?
13 పంతొమ్మిదవ శతాబ్దపు చివరి భాగంలో, చాలామంది యథార్థహృదయులు “హితవాక్యప్రమాణమును” అర్థంచేసుకోవడానికి కృషిచేశారు. (2 తిమో. 1:13) ఛార్లెస్ తేజ్ రస్సెల్ వారిలో ఒకరు. 1870లో ఆయనతోపాటు మరికొంతమంది సత్యాన్వేషకులు బైబిలును అధ్యయనం చేయడానికి ఓ తరగతిని ప్రారంభించారు. పాపానికి ముందు ఆదాము ఉన్న పరిపూర్ణ స్థితికి మానవులు తీసుకురాబడడం అనే అంశంమీద వారు 1872లో పరిశోధించారు. ఆ పరిశోధన తర్వాత రస్సెల్ ఇలా రాశాడు: “ఇప్పుడు పరీక్షించబడుతున్న చర్చి (అభిషిక్తుల సంఘం) పొందే బహుమానానికీ, లోకంలోని నమ్మకమైనవారు పొందే బహుమానానికీ మధ్యవున్న పెద్ద తేడాను మేము అప్పటివరకు స్పష్టంగా అర్థంచేసుకోలేకపోయాం.” లోకంలోని నమ్మకమైనవారు “తమ పూర్వీకుడు, పెద్ద అయిన ఆదాము ఒకప్పుడు ఏదెను తోటలో అనుభవించిన పరిపూర్ణ స్థితికి” చేరుకుంటారు. బైబిలు అధ్యయనంలో ఇతరులు కూడ తనకు సహాయం చేశారని రస్సెల్ అంగీకరించాడు. వాళ్లెవరు?
14. (ఎ) అపొస్తలుల కార్యములు 3:21ని హెన్రీ డన్ ఎలా అర్థంచేసుకున్నాడు? (బి) భూమ్మీద నిరంతరం ఎవరు జీవిస్తారని డన్ చెప్పాడు?
అపొ. 3:21) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో భూమ్మీద మానవులు పరిపూర్ణ స్థితిలోకి తీసుకురాబడడం కూడా ఆ కుదురుబాటు కాలంలోనే జరుగుతుందని హెన్రీ డన్‌కు తెలుసు. భూమ్మీద నిరంతరం ఎవరు జీవిస్తారు? అనే ప్రశ్న అనేకమందిని కలవరపెట్టింది. ఆయన ఆ అంశంమీద కూడ పరిశోధన చేశాడు. లక్షలాదిమంది పునరుత్థానం చేయబడతారనీ వారికి సత్యం బోధించబడుతుందనీ క్రీస్తుపట్ల తమకున్న విశ్వాసాన్ని చూపించే అవకాశం వారికి దొరుకుతుందనీ ఆయన వివరించాడు.
14 హెన్రీ డన్ వారిలో ఒకరు. ‘దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించిన కుదురుబాటు కాలముల’ గురించి ఆయన రాశాడు. (15. పునరుత్థానం విషయంలో జార్జ్ స్టార్జ్‌కు ఏమి అర్థమైంది?
15 జార్జ్ స్టార్జ్ కూడా పరిశోధన చేసి అనీతిమంతులు నిత్యమూ జీవించే అవకాశంతో పునరుత్థానం చేయబడతారనే నిర్ధారణకు 1870లో వచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే “‘పాపాత్ముడు నూరు సంవత్సరాలవాడైనా’ చనిపోతాడు” అని కూడ ఆయన లేఖనాల నుండి గుర్తించాడు. (యెష. 65:20) స్టార్జ్ న్యూయార్క్‌లోని బ్రుక్లిన్‌లో నివసిస్తూ బైబిలు ఎగ్జామినర్ అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేసేవాడు.
16. ఏ నమ్మకాన్ని బట్టి బైబిలు విద్యార్థులు క్రైస్తవ మతశాఖలకు భిన్నంగా ఉన్నారు?
16 సువార్త అన్నిచోట్లా ప్రకటించాల్సిన సమయం వచ్చిందని బైబిలును చదివి రస్సెల్ గ్రహించాడు. అందుకే, 1879లో ఆయన జాయన్స్ వాచ్‌టవర్ అండ్ హెరాల్డ్ ఆఫ్ క్రైస్ట్స్ ప్రెజెన్స్ అనే పత్రికను ప్రచురించడం ఆరంభించాడు. ఇప్పుడు ఆ పత్రికకు కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తుంది అనే పేరుంది. అంతకుముందు మానవుల నిరీక్షణ గురించిన సత్యాన్ని కేవలం కొద్దిమందే అర్థంచేసుకున్నారు. కానీ ఇప్పుడు అనేక దేశాల్లోని బైబిలు విద్యార్థుల గుంపులు కావలికోట పత్రికను అందుకొని, దాన్ని అధ్యయనం చేస్తున్నాయి. కేవలం కొద్దిమంది మాత్రమే పరలోకానికి వెళ్తారని, లక్షలాదిమందికి భూమ్మీద పరిపూర్ణ జీవితం లభిస్తుందని బైబిలు విద్యార్థులు నమ్ముతారు. ఆ నమ్మకాన్ని బట్టి బైబిలు విద్యార్థులు మిగతా క్రైస్తవ మతశాఖలన్నింటికీ భిన్నంగా ఉన్నారు.
17. నిజమైన జ్ఞానం ఎలా అధికమైంది?
17 బైబిల్లో ప్రవచించబడిన “అంత్యకాలము” 1914లో ప్రారంభమైంది. అప్పుడు మానవ నిరీక్షణ గురించిన నిజమైన జ్ఞానం అధికమైందా? (దాని. 12:4) 1913కల్లా రస్సెల్ ప్రసంగాలు 2,000 వార్తాపత్రికల్లో ప్రచురించబడ్డాయి. మొత్తం కలిపి 1,50,00,000 మంది పాఠకులు ఆ పత్రికలను చదివేవారు. 1914 సంవత్సరాంతానికల్లా మూడు ఖండాల్లో 90 లక్షలకన్నా ఎక్కువమంది “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” అనే కార్యక్రమాన్ని చూశారు. దానిలో చలనచిత్రాల రూపంలో, స్లైడ్ల రూపంలో క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన గురించి వివరించబడింది. 1918 నుండి 1925 వరకు, భూమ్మీద నిరంతరం జీవిత నిరీక్షణను వివరించిన “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది మరెన్నడూ మరణించరు” అనే ప్రసంగాన్ని యెహోవా సేవకులు ప్రపంచవ్యాప్తంగా 30కన్నా ఎక్కువ భాషల్లో ఇచ్చారు. 1934కల్లా, భూమ్మీద నిరంతరం జీవించాలనుకునేవారు బాప్తిస్మం తీసుకోవాలని యెహోవాసాక్షులు అర్థంచేసుకున్నారు. అలా భూమ్మీద నిరంతరం జీవించే అవకాశం ఉందని గుర్తించి వారు కొత్త ఉత్సాహంతో రాజ్యసువార్తను ప్రకటించారు. నేడు, లక్షలాదిమంది భూమ్మీద నిరంతర జీవితమనే నిరీక్షణ గురించి తెలుసుకొని యెహోవాకు తమ కృతజ్ఞతను చెల్లిస్తున్నారు.
“మహిమగల స్వాతంత్ర్యము” ముందుంది!
18, 19. భవిష్యత్తులో జీవితం ఎలా ఉంటుందని యెషయా 65:21-25లో చెప్పబడింది?
18 ప్రవక్తయైన యెషయా దైవప్రేరణతో భూమ్మీద దేవుని ప్రజలు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తారో రాశాడు. (యెషయా 65:21-25 చదవండి.) దాదాపు 2,700 సంవత్సరాల క్రితం యెషయా ఆ మాటలు రాసినప్పుడు ఉన్న కొన్ని చెట్లు ఇప్పటికీ బ్రతికే ఉండుంటాయి. మంచి బలంతో, ఆరోగ్యంతో మీరు అంతకాలం జీవించడాన్ని ఊహించుకోగలరా?
19 అప్పుడు జీవితం నీటిబుడగలా ఉండదు. నిరంతరం జీవిస్తాం. కట్టడానికి, నాటడానికి, నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. మీకు ఎలాంటి స్నేహితులు దొరుకుతారో ఆలోచించండి. ఆ ప్రేమానుబంధాలు సదా బలపడుతూ ఉంటాయి. “దేవుని పిల్లలు” పొందబోయే “మహిమగల స్వాతంత్ర్యము” గురించి ఒక్కసారి ఊహించుకోండి!—రోమా. 8:20, 21.
[అధస్సూచి]
^ పేరా 4 దేవుని రాజ్య వెయ్యేండ్ల పరిపాలన [క్యాథలిక్] చర్చి స్థాపనతోనే ప్రారంభమైంది కానీ అది ఎప్పుడో భవిష్యత్తులో జరిగే పరిపాలన కాదు అని అగస్టీన్ వాదించాడు.
మీరు వివరించగలరా?
• భూమ్మీద మానవులకున్న నిరీక్షణ ఎలా మరుగుచేయబడింది?
• 17వ శతాబ్దానికల్లా కొంతమంది బైబిలు పాఠకులు ఏమి అర్థంచేసుకున్నారు?
• 1914 సమీపించేకొద్దీ మానవులకున్న నిజమైన నిరీక్షణ ఎలా స్పష్టమైంది?
• భూనిరీక్షణ గురించిన జ్ఞానం ఎలా అధికమయ్యింది?
[అధ్యయన ప్రశ్నలు]
[13వ పేజీలోని చిత్రాలు]
కవి జాన్ మిల్టన్‌కు (ఎడమవైపు), గణితశాస్త్రజ్ఞుడు ఐజాక్ న్యూటన్‌కు (కుడివైపు) భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ గురించి తెలుసు
[15వ పేజీలోని చిత్రాలు]
మానవుల నిజమైన నిరీక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే సమయం వచ్చిందని తొలి బైబిలు విద్యార్థులు లేఖనాల నుండి గ్రహించారు