దాచిపెట్టబడిన నిధి దొరికింది
దాచిపెట్టబడిన నిధి దొరికింది
మీరూహించని చోట మీకెప్పుడైనా విలువైన నిధి దొరికిందా? 2005, మార్చి 27న ఎస్తోనియాలోని ఈవో లాడ్ అనే యెహోవాసాక్షికి అలాంటి నిధి ఒకటి దొరికింది. ఆయన అప్పుడు పాత షెడ్డును పడగొట్టడానికి ఆల్మా వార్డ్యా అనే వృద్ధ సహోదరికి సహాయం చేస్తున్నాడు. వాళ్లు బయటి గోడను కూల్చినప్పుడు స్తంభానికి ఒక వైపు ఓ బోర్డు కనిపించింది. ఆ బోర్డును తీసి చూస్తే ఆ స్తంభంలో 10 సెంటీమీటర్ల వెడల్పు, 1.2 మీటర్ల ఎత్తు, 10 సెంటీమీటర్ల లోతు ఉన్న గూడు కనిపించింది. దానికి స్తంభం రంగులోనేవున్న చెక్క మూత ఉంది. (1) ఆ గూటిలో గుప్త నిధులున్నాయి! ఏమిటా నిధులు? వాటిని అక్కడ ఎవరు దాచిపెట్టారు?
ఆ గూటిలో దళసరి పేపరులో జాగ్రత్తగా చుట్టివున్న చాలా ప్యాకెట్లు ఉన్నాయి. (2) ఆ ప్యాకెట్లలో యెహోవాసాక్షుల
సాహిత్యం ఉంది. అందులో కావలికోట అధ్యయన శీర్షికలే ఎక్కువగా ఉన్నాయి. 1947వ సంవత్సరం నాటివి కూడా కొన్ని ఉన్నాయి. (3) అది జాగ్రత్తగా చేత్తో రాసిన సాహిత్యం. ఎస్తోనియా భాషలో ఉంది. కొన్ని ప్యాకెట్లు తెరిచి చూస్తే వాటిని అక్కడ ఎవరు పెట్టారో తెలిసింది. వాటిలో ఆల్మా భర్త విలెమ్ వార్డ్యా విచారణకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. అంతేకాక, ఆయన జైల్లో గడిపిన సంవత్సరాల గురించిన సమాచారం కూడా అందులో ఉంది. అసలు ఆయనను ఎందుకు జైల్లో పెట్టారు?విలెమ్ వార్డ్యా ఎస్తోనియాలోని టార్టు సంఘంలో, ఆ తర్వాత ఓటెపా సంఘంలో ఒక యెహోవాసాక్షిగా ఎన్నో బాధ్యతలు చేపట్టాడు. ఎస్తోనియా ఒకప్పుడు సోవియట్ రిపబ్లిక్లో ఉండేది. ఆయన బహుశా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సత్యాన్ని తెలుసుకుని ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, 1948 డిసెంబరు 24న కమ్యూనిస్టు ప్రభుత్వం మతసంబంధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని సహోదరుడు వార్డ్యాను అరెస్టు చేసింది. రహస్య పోలీసులు ఆయనను విచారణ చేసి, ఆయనను క్రూరంగా హింసించి, ఆయన నుండి ఇతర సాక్షుల పేర్లను బలవంతంగా రాబట్టడానికి ప్రయత్నించారు. తన వాదనను వినిపించే అవకాశం కోర్టు ఆయనకు ఇవ్వకుండా రష్యన్ జైల్లో పదేళ్ల శిక్ష విధించింది.
విలెమ్ వార్డ్యా 1990 మార్చి 6న కన్నుమూశాడు. ఆయన తుదిశ్వాస విడిచేంతవరకు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఆ సాహిత్యాన్ని అక్కడ దాచిపెట్టాడని ఆయన భార్యకు అసలు తెలియనే తెలియదు. పోలీసులు ఆమెను విచారణ చేస్తే ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందోనని ఆయన ఆ విషయాన్ని చెప్పివుండడు. ఆయన ఆ సాహిత్యాన్ని ఎందుకలా దాచిపెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే కె.జి.బి. అంటే సోవియట్ స్టేట్ సెక్యూరిటీ కమిటీ అధికారులు అకస్మాత్తుగా వచ్చి మతపరమైన సాహిత్యం కోసం తరచూ యెహోవాసాక్షుల ఇళ్లను సోదా చేస్తుండేవారు. మిగతా చోట్ల ఉన్న సాహిత్యాన్ని కె.జి.బి. స్వాధీనం చేసుకున్నా సహోదరులకు మాత్రం ఆధ్యాత్మిక ఆహారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా సహోదరుడు వార్డ్యా బహుశా వాటిని అక్కడ దాచిపెట్టి ఉంటాడు. అలా దాచిపెట్టిన సాహిత్యం 1990 వేసవి కాలంలో కూడా దొరికింది. దానిలో ఒకటి ఎస్తోనియాలోని టార్టు ప్రాంతంలో బయటపడింది. విలెమ్ వార్డ్యానే దాన్ని అక్కడ దాచిపెట్టాడు.
ఈ పత్రాలను మనం నిధులని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే, ఆ రోజుల్లో తమకు అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక ఆహారానికి యెహోవాసాక్షులు ఎంత విలువిచ్చారో వారు శ్రమకోర్చి చేత్తో రాసి దాచిపెట్టిన ఆ పత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. (మత్త. 24:45) మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక ప్రచురణలకు మీరు విలువిస్తున్నారా? వాటిలో ఎస్తోనియా భాషతోపాటు 170 కన్నా ఎక్కువ భాషల్లో లభ్యమవుతున్న కావలికోట కూడా ఉంది.