కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు కాలాల్లో ‘రక్షణకర్తగా’ వ్యవహరించిన యెహోవా

బైబిలు కాలాల్లో ‘రక్షణకర్తగా’ వ్యవహరించిన యెహోవా

బైబిలు కాలాల్లో ‘రక్షణకర్తగా’ వ్యవహరించిన యెహోవా

“దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్త నీవే.”​—⁠కీర్త. 70:⁠5.

విహార యాత్రకని వెళ్లిన తల్లిదండ్రులు, 23 ఏళ్ల వివాహిత అయిన తమ కూతురు అనుమానాస్పద రీతిలో తప్పిపోయిందన్న వార్త విన్నారు. ఆమె హత్యచేయబడి ఉండొచ్చని అనుమానించారు. వారు వెంటనే తమ సామాను సర్దుకొని ఇంటికి బయలుదేరారు. వారికి ఆ వార్త అందినప్పటి నుండి తమకు సహాయం చేయమని యెహోవాను వేడుకుంటూనే ఉన్నారు. 20 ఏళ్లున్న మరో సహోదరునికి, తనకు ఒక వ్యాధి వచ్చిందని, దానివల్ల కొంతకాలానికి పక్షవాతంతో తన పూర్తి శరీరం చచ్చుబడిపోతుందని తెలిసింది. అప్పటినుండి ఆయన యెహోవాకు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఓ ఒంటరి తల్లికి ఉద్యోగం దొరకలేదు. ఆమెకు 12 ఏళ్ల కూతురు ఉంది. ఒక పూట భోజనం చేయడానికైనా ఆమె దగ్గర డబ్బుల్లేవు. ఆమె తన కష్టాలన్నిటినీ యెహోవాకు చెప్పుకుంది. నిజమే, తీవ్ర పరీక్షలు లేదా కష్టాలు ఎదురైనప్పుడు దేవుని ఆరాధకులు సహజంగానే సహాయం కోసం ఆయనను వేడుకుంటారు. ఎంతో అవసరంలో ఉన్నప్పుడు, మీరు కూడా ఎప్పుడైనా సహాయం చేయమని యెహోవాను వేడుకున్నారా?

2 అయితే, సహాయం కోసం మనం చేసే ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడని మనం నిజంగా నమ్మవచ్చా అనేది మనముందున్న ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. మన విశ్వాసాన్ని బలపర్చే జవాబు 70వ కీర్తనలో ఉంది. యెహోవాను యథార్థంగా ఆరాధించిన దావీదు ప్రోత్సాహకరమైన ఈ కీర్తనను రాశాడు, ఆయన తన జీవితంలో ఎన్నో కష్టమైన పరీక్షలను, సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆయన దైవప్రేరణతో, “దేవా . . . నాకు సహాయము నీవే నా రక్షణకర్త నీవే” అని యెహోవాతో అన్నాడు. (కీర్త. 70:⁠5) 70వ కీర్తనను పరిశీలిస్తే, సమస్యలు ఎదురైనప్పుడు మనం కూడా యెహోవాకు ఎందుకు ప్రార్థించవచ్చో, ఆయన మన “రక్షణకర్త”గా ఉంటాడని ఎందుకు పూర్తిగా నమ్మవచ్చో గ్రహించగలుగుతాం.

“రక్షణకర్త నీవే”

3 దేవుడు తనకు వెంటనే సహాయం చేయాలనే అభ్యర్థనతోనే 70వ కీర్తన ప్రారంభమై ముగుస్తుంది. (కీర్తనలు 70:1-5 చదవండి.) తనను రక్షించడానికి “త్వరగా రమ్ము,” “త్వరపడి రమ్ము” అని దావీదు యెహోవాను ఆ వచనాల్లో వేడుకున్నాడు. 2-4 వచనాల్లో దావీదు ఐదు విషయాల గురించి విన్నవించుకున్నాడు, ప్రతీ విన్నపం చివర్లో అలా జరుగును “గాక” అని కోరుకున్నాడు. మొదటి మూడు విన్నపాల్లో తనను చంపడానికి ప్రయత్నిస్తున్నవారి గురించి చెప్పాడు. ఆ శత్రువులను ఓడించమని, వారు కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు వారు సిగ్గుపడేలా చేయమని ఆయన యెహోవాకు విన్నవించుకున్నాడు. 4వ వచనంలో, దేవుని ప్రజల గురించి మరో రెండు విన్నపాలు చేశాడు. యెహోవాను వెదకువారు ఉత్సహించి, ఆయనను మహిమపరచాలని ప్రార్థించాడు. తన కీర్తన ముగింపులో దావీదు, “నాకు సహాయము నీవే నా రక్షణకర్త నీవే” అని యెహోవాతో అన్నాడు. ఆయన “సహాయం చేయుదువు గాక, రక్షణకర్తగా ఉందువు గాక” అని మరో విన్నపం చేయలేదన్నది గమనించండి. బదులుగా, “నీవే” సహాయం చేసి రక్షిస్తావని చెప్పి యెహోవాపట్ల తనకున్న నమ్మకాన్ని వ్యక్తంచేశాడు. దేవుడు తనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని దావీదు నమ్మాడు.

4 దావీదు గురించి 70వ కీర్తన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఎలాగైనా తనను హతమార్చాలని కాచుకొనివున్న శత్రువులు ఎదురైనప్పుడు ఆయన తన స్వశక్తిపై ఆధారపడలేదు. బదులుగా, యెహోవా తగిన సమయంలో, తగిన విధంగా వ్యతిరేకులకు బుద్ధిచెబుతాడని ఆయన నమ్మాడు. (1 సమూ. 26:​10) యెహోవా తనను వెదికే​వారికి సహాయం చేసి రక్షిస్తాడనే గట్టి నమ్మకం ఆయనకు ఎప్పుడూ ఉండేది. (హెబ్రీ. 11:⁠6) అలాంటి సత్యారాధకులు సంతోషించడానికి, యెహోవా గొప్పతనం గురించి ఇతరులకు తెలియజేస్తూ ఆయనను ఘనపర్చడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని ఆయన నమ్మాడు.​—⁠కీర్త. 5:​11; 35:⁠27.

5 దావీదులాగే, మనం యెహోవా మన సహాయకుడని, మన “రక్షణకర్త” అని పూర్తిగా నమ్మవచ్చు. కాబట్టి, మనం పరీక్షలను, తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నప్పుడు వెంటనే సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాలి. (కీర్త. 71:​12) మనం సహాయం కోసం వేడుకున్నప్పుడు యెహోవా ఎలా సహాయం చేయవచ్చు? ఆయన ఎలా సహాయం చేస్తాడో చర్చించే ముందు, దావీదుకు ఎంతగానో సహాయం అవసరమైనప్పుడు యెహోవా ఆయనను ఏ మూడు విధాలుగా రక్షించాడో పరిశీలిద్దాం.

వ్యతిరేకుల నుండి రక్షించాడు

6 కష్టాలు ఎదురైనప్పుడు నీతిమంతులు యెహోవా సహాయం కోరవచ్చు అని తనకు అందుబాటులో ఉన్న బైబిలు భాగాలను అధ్యయనం చేయడం ద్వారా దావీదు తెలుసుకున్నాడు. యెహోవా భక్తిహీన లోకంపై జల​ప్రళయం రప్పించినప్పుడు ఆయన నోవహును, దైవభక్తిగల అతని కుటుంబాన్ని రక్షించాడు. (ఆది. 7:​23) యెహోవా సొదొమ గొమొర్రాల్లోని దుష్టులమీద అగ్నిగంధకాలను కురిపించినప్పుడు, నీతిమంతుడైన లోతు, ఆయన కుమార్తెలు తప్పించుకునేలా సహాయం చేశాడు. (ఆది. 19:12-26) యెహోవా గర్విష్ఠియైన ఫరోను అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో నాశనం చేసినప్పుడు ఆయన తన ప్రజలను సురక్షితంగా ఉంచి వారు నాశనం కాకుండా కాపాడాడు. (నిర్గ. 14:19-28) అందుకే, మరో కీర్తనలో దావీదు, యెహోవాను “పూర్ణరక్షణ కలుగజేయు దేవుడు” అని స్తుతించడంలో ఆశ్చర్యంలేదు.​—⁠కీర్త. 68:⁠20.

7 యెహోవా రక్షణా శక్తిపై పూర్తి నమ్మకముంచవచ్చని దావీదు తన సొంత అనుభవం నుండి కూడా తెలుసుకున్నాడు. యెహోవా “శాశ్వతంగా ఆదుకునే హస్తాలు” తనను సేవించేవారిని రక్షించగలవని దావీదు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. (ద్వితీ. 33:​27, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఎన్నో సందర్భాల్లో, యెహోవా దావీదును కోపంతోవున్న ఆయన “శత్రువుల” నుండి రక్షించాడు. (కీర్త. 18:17-19, 48) మనం ఒక ఉదాహరణ చూద్దాం.

8 దావీదు శూరత్వాన్ని ఇశ్రాయేలు స్త్రీలు పొగిడినప్పుడు, సౌలు రాజు ఎంతగా ఈర్ష్యపడ్డాడంటే రెండు సందర్భాల్లో ఆయనమీద ఈటెను విసిరాడు. (1 సమూ. 18:6-9) రెండుసార్లూ దావీదు తప్పించుకున్నాడు. అనుభవజ్ఞుడైన యుద్ధవీరునిగా తనకున్న నైపుణ్యాన్నిబట్టి, నేర్పునిబట్టి మాత్రమే దావీదు తప్పించుకున్నాడా? లేదు. “యెహోవా అతనికి తోడుగా నుండెను” అని బైబిలు చెబుతోంది. (1 సమూయేలు 18:11-14 చదవండి.) ఆ తర్వాత, ఫిలిష్తీయుల చేతుల్లో దావీదును చంపించాలనే సౌలు పన్నాగం విఫలమైనప్పుడు, “యెహోవా దావీదునకు తోడుగా నుండుట . . . సౌలు చూ[శాడు].”​—⁠1 సమూ. 18:17-29.

9 తనను ఎవరు రక్షించారని దావీదు చెప్పాడు? ‘సౌలు చేతిలోనుండి యెహోవా తనను తప్పించిన దినమున ఆయన ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాడు’ అని 18వ కీర్తనలోని పైవిలాసము చెబుతోంది. దావీదు తన భావాలను ఒక పాటలో ఇలా తెలియజేశాడు: “యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.” (కీర్త. 18:⁠2) యెహోవా తన ప్రజలను రక్షించగలడని తెలుసుకోవడం మన విశ్వాసాన్ని బలపరచడంలేదా?​—⁠కీర్త. 35:⁠10.

రోగశయ్యపై ఉన్నప్పుడు బలాన్నిచ్చాడు

10 ఒకసారి దావీదు రాజు తీవ్ర అనార్యోగంతో బాధపడ్డాడని 41వ కీర్తనలో పేర్కొనబడింది. కొంతకాలం మంచానపడ్డ దావీదు అనారోగ్యంతో ఎంతగా బాధపడ్డాడంటే ఆయన పడక విడిచి “తిరిగి లేవడని” శత్రువులు కొందరు అనుకున్నారు. (7, 8 వచనాలు) ఆయన ఎప్పుడు అంత తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు? ఆయన కుమారుడైన అబ్షాలోము సింహాసనాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు దావీదు ఎదుర్కొన్న కష్ట పరిస్థితులకూ ఈ కీర్తన వివరించబడిన పరిస్థితులకూ పోలికలు ఉన్నాయనిపిస్తోంది.​—⁠2 సమూ. 15:​6, 13, 14.

11 ఉదాహరణకు, తన ఇంట్లో భోజనం చేసే నమ్మకస్థుడైన స్నేహితుడు నమ్మకద్రోహి అయ్యాడని దావీదు పేర్కొన్నాడు. (9వ వచనం) ఇది విన్నప్పుడు ఆయన జీవితంలోని ఒక సంఘటన మనకు గుర్తుకురావచ్చు. అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు, దావీదుకు నమ్మకస్థునిగా ఉన్న అహీతోపెలు అనే సలహాదారుడు నమ్మకద్రోహిగా మారి, అబ్షాలోముతో చేయికలిపాడు. (2 సమూ. 15:​31; 16:​15) తన శత్రువులు, తమ చెడు ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు తన చావును కోరుకునే కుట్ర​దారులు తన చుట్టూ ఉన్నారని తెలిసినా ఏమీ చేయలేక బలహీనంగా రోగశయ్యపై ఉన్న రాజును ఊహించుకోండి.​—⁠5వ వచనం.

12 యెహోవా తన “రక్షణకర్త” అని దావీదుకున్న నమ్మకం ఏమాత్రం సడలిపోలేదు. నీతిమంతులైన యెహోవా ఆరాధకులు ఎవరైనా అనారోగ్యంపాలైతే, “ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. రోగశయ్యమీద రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు” అని దావీదు చెప్పాడు. (కీర్త. 41:​1, 3) ఈ సందర్భంలో కూడా “యెహోవా వానిని ఆదరించును” అని దావీదు అన్న మాటల్లో ఆయనకున్న నమ్మకాన్ని గమనించండి. యెహోవా తనకు తప్పక రక్షణ కల్పిస్తాడనే నమ్మకం దావీదుకుంది. మరి యెహోవా ఎలా రక్షిస్తాడు?

13 యెహోవా అద్భుతంగా తనను బాగుచేయాలని దావీదు ఆశించలేదు. బదులుగా, తాను అనారోగ్యంతో మంచానపడినప్పుడు యెహోవా తనను ‘ఆదరిస్తాడనే [“బలాన్ని ఇస్తాడనే,” ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌]’ గట్టి నమ్మకాన్ని కనబరిచాడు. దావీదుకు నిజంగానే అలాంటి సహాయం అవసరమైంది. ఆయన అనారోగ్యంవల్ల బలహీనుడయ్యాడు. అంతేకాక ఆయన చుట్టూ ఆయన గురించి చెడుగా మాట్లాడే శత్రువులే ఉన్నారు. (5, 6 వచనాలు) ఓదార్పుకరమైన విషయాలను గుర్తుతెచ్చుకోవడానికి సహాయం చేయడం ద్వారా యెహోవా దావీదును బలపర్చివుంటాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, “నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు” అని దావీదు అన్నాడు. (12వ వచనం) తాను బలహీనంగా ఉన్నా, తన శత్రువులు తన గురించి చెడుగా మాట్లాడుతున్నా, యెహోవా తనను యథార్థవంతునిగా పరిగణిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుచేసుకొని కూడా దావీదు బలాన్ని పొందివుంటాడు. దావీదు కొంతకాలానికి బాగయ్యాడు. అనారోగ్యంతోవున్నవారికి యెహోవా బలాన్నిస్తాడనే విషయం మనకు ఎంత ఓదార్పుకరం! ​—⁠2 కొరిం. 1:⁠3.

ఆహారాన్నిచ్చాడు

14 దావీదు ఇశ్రాయేలు రాజైనప్పుడు ఆయన శ్రేష్ఠమైన ఆహారపానీయాలను ఆనందించడమే కాక తనతోపాటు భోజనం చేయడానికి అనేకమందిని కూడా ఆహ్వానించగలిగాడు. (2 సమూ. 9:​10) అయితే, దావీదుకు ఆహార కొరతంటే ఏమిటో కూడా తెలుసు. ఆయన కుమారుడు అబ్షాలోము ఆయనపై తిరుగుబాటు చేసి సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు దావీదు కొంతమంది విశ్వసనీయులైన మద్దతుదారులతో యెరూషలేము వదిలివెళ్లాడు. వారు యొర్దాను నదికి తూర్పునున్న గిలాదుకు పారిపోయారు. (2 సమూ. 17:​22, 24) అజ్ఞాతవాసంలో గడపాల్సి వచ్చిన దావీదుకూ ఆయన మనుష్యులకూ తినడానికి తాగడానికి ఏమీ దొరకలేదు, అంతేకాక వారికి విశ్రాంతి కూడా కరువైంది. అయితే, ఆ మారుమూల ప్రాంతంలో వారికి ఆహారపానీయాలు ఎక్కడ దొరుకుతాయి?

15 చివరకు, దావీదు ఆయన మనుష్యులు మహనయీము పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వారు ధైర్యవంతులైన షోబీ, మాకీరు, బర్జిల్లయిలను కలుసుకున్నారు. ఒకవేళ అబ్షాలోము సింహాసనాన్ని చేజిక్కించుకుంటే దావీదుకు మద్దతునిచ్చిన వారందరినీ ఆయన తీవ్రంగా శిక్షించేవాడు కాబట్టి ఆ ముగ్గురూ దేవుడు నియమించిన రాజు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికైనా వెనకాడలేదని చెప్పవచ్చు. దావీదు, ఆయన మనుష్యుల దీనావస్థను గుర్తించి నమ్మకస్థులైన ఆ ముగ్గురూ వారికి కావాల్సిన పరుపులు, గోధుమలు, యవలు పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, తేనె, వెన్న, గొఱ్ఱెలు తీసుకొచ్చారు. (2 సమూయేలు 17:27- 29 చదవండి.) వారు చూపించిన అసాధారణ విశ్వసనీయత, ఆదరణ దావీదును ఎంతో ఆకట్టుకొనివుంటాయి. వారు తన కోసం చేసిన సహాయాన్ని ఆయనెలా మరచిపోగలడు?

16 అయితే, నిజానికి వారికి ఆహారపానీయాలను అందేలా చేసిందెవరు? యెహోవా తన ప్రజలను చూసుకుంటాడనే నమ్మకం దావీదుకు ఉంది. అవసరంలోవున్నవారికి తోటి ఆరాధకులు సహాయం చేసేలా యెహోవా తప్పకుండా ప్రోత్సహించగలడు. గిలాదులో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నప్పుడు, ఆ ముగ్గురూ తనపట్ల దయతో వ్యవహరించేలా ప్రోత్సహించడం ద్వారా యెహోవా తనపట్ల ప్రేమపూర్వక శ్రద్ధను కనబరచాడని ఆయన గ్రహించివుంటాడు. దావీదు తన జీవిత చరమాంకంలో ఇలా రాశాడు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.” (కీర్త. 37:​25) యెహోవా తన సేవకుల అవసరాలను తీరుస్తాడని తెలుసుకోవడం మనకు ఓదార్పునివ్వడం లేదా?​—⁠సామె. 10:⁠3.

‘యెహోవా తన భక్తులను తప్పించగల సమర్థుడు’

17 బైబిలు కాలాల్లో, యెహోవా దావీదుతోపాటు అనేకమంది ఆరాధకులను రక్షించాడు. దావీదు కాలం నుండి అపొస్తలుడైన పేతురు చెప్పిన మాటలు నిజమని దేవుడు ఎన్నోసార్లు నిరూపించాడు: ‘భక్తులను శోధనలోనుండి తప్పించుటకు యెహోవా సమర్థుడు.’ (2 పేతు. 2:⁠9) మరో రెండు ఉదాహరణలను చూద్దాం.

18 సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో శక్తివంతమైన అష్షూరు సైన్యం యూదామీద దండెత్తి యెరూషలేముకు హానితలపెట్టినప్పుడు హిజ్కియా రాజు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలిసికొనునట్లు . . . మమ్మును రక్షించుము.” (యెష. 37:​20) హిజ్కియా దేవుని పేరుప్రతిష్ఠల గురించే ఆలోచించాడు. యెహోవా ఆయన చేసిన హృదయపూర్వక ప్రార్థనకు జవాబిచ్చాడు. యెహోవా తన దూతను పంపించి, కేవలం ఒక్క రాత్రిలోనే 1,85,000 మంది అష్షూరీయులను చంపించడం ద్వారా తన నమ్మకమైన సేవకులను రక్షించాడు.​—⁠యెష. 37:​32, 36.

19 యేసు చనిపోవడానికి కొద్దిరోజుల ముందు యూదయలోని తన శిష్యుల ప్రయోజనం కోసం ప్రవచనాత్మక హెచ్చరికనిచ్చాడు. (లూకా 21:20-22 చదవండి.) కొన్ని దశాబ్దాలు ప్రశాంతంగా గడిచాయి, అయితే సా.శ. 66లో యూదులు తిరుబాటు చేయడంతో రోమా సైన్యాలు యెరూషలేముమీద దండెత్తారు. సెస్టియస్‌ గాలస్‌ సైన్యాలు దేవాలయ గోడలో కొంతభాగాన్ని ఛేదించగలిగినా ఆ తర్వాత వారు అకస్మాత్తుగా వెనుదిరిగారు. యేసు ప్రవచించిన నాశనాన్ని తప్పించుకోవడానికి ఇదే అవకాశమని గుర్తించి నమ్మకస్థులైన క్రైస్తవులు కొండలకు పారిపోయారు. రోమా సైన్యాలు సా.శ. 70లో మళ్లీ యెరూషలేముపై దండెత్తాయి. ఈసారి వాళ్లు వెనుదిరగకుండా యెరూషలేమును పూర్తిగా నాశనంచేశారు. యేసు హెచ్చరికను లక్ష్యపెట్టిన క్రైస్తవులు ఆ ఘోర విపత్తును తప్పించుకున్నారు.​—⁠లూకా 19:41- 44.

20 గతంలో యెహోవా తన ప్రజలను ఎలా రక్షించాడో ఆలోచిస్తే మన విశ్వాసం బలపడుతుంది. ఆయన గతంలో చేసిన కార్యాల గురించి ఆలోచించడం ద్వారా మనం ఆయనపట్ల నమ్మకముంచగలుగుతాం. మనం ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురైనా, యెహోవా తన భక్తులను ‘రక్షిస్తాడు’ అని మనం పూర్తిగా నమ్మవచ్చు. అయితే, యెహోవా మనల్ని ఎలా రక్షిస్తాడు? ప్రారంభంలో ప్రస్తావించబడిన సహోదరులకు ఏమైంది? తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.

మీకు జ్ఞాపకమున్నాయా?

• 70వ కీర్తనలోని వచనాలు వివరిస్తున్నట్లుగా మనం దేనివిషయంలో నమ్మకంతో ఉండవచ్చు?

• అనారోగ్యంతో ఉన్నప్పుడు దావీదు ఎలా బలపర్చబడ్డాడు?

• యెహోవా తన ప్రజలను వ్యతిరేకుల నుండి రక్షించగలడని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) ఏయే పరిస్థితుల్లో దేవుని ఆరాధకులు సహాయం కోసం ఆయనను వేడుకుంటారు? (బి) మనముందు ఏ ప్రశ్న ఉంది, దానికి జవాబు ఎక్కడ ఉంది?

3. (ఎ) తనకు వెంటనే ఎవరి సహాయం అవసరమని దావీదు 70వ కీర్తనలో అభ్యర్థించాడు? (బి) 70వ కీర్తనలో దావీదు ఏ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు?

4, 5. దావీదు గురించి 70వ కీర్తన నుండి మనం ఏమి నేర్చుకుంటాం, మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

6. నీతిమంతులను యెహోవా రక్షిస్తాడని దావీదు ఎలా తెలుసుకోగలిగాడు?

7-9. (ఎ) దావీదు దేవుని రక్షణా శక్తిపై నమ్మకముంచడానికిగల కారణ​మేమిటి? (బి) తనను ఎవరు రక్షించారని దావీదు చెప్పాడు?

10, 11. నలభై ఒకటవ కీర్తనలో వివరించబడినట్లుగా దావీదు ఎప్పుడు అనారోగ్యం పాలయ్యాడో ఎలా నిర్ధారించుకోవచ్చు?

12, 13. (ఎ) దావీదు ఏ నమ్మకాన్ని వ్యక్తంచేశాడు? (బి) దేవుడు దావీదును ఎలా బలపర్చివుంటాడు?

14, 15. దావీదు, ఆయన మనుష్యులకు ఆహారపానీయాల అవసరం ఎప్పుడు ఏర్పడింది, వారికి ఎలాంటి సహాయం లభించింది?

16. దావీదు ఆయన మనుష్యులకు ఆహారపానీయాలు అందేలా నిజానికి ఎవరు ఏర్పాటు చేశారు?

17. యెహోవా ఎన్నోసార్లు దేనిని నిరూపించాడు?

18. హిజ్కియా కాలంలో యెహోవా తన ప్రజలను ఎలా రక్షించాడు?

19. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ హెచ్చరికను లక్ష్యపెట్టడంవల్ల విపత్తును తప్పించుకున్నారు?

20. యెహోవా మనల్ని ‘రక్షిస్తాడు’ అని మనమెందుకు నమ్మవచ్చు?

[6వ పేజీలోని చిత్రం]

యెహోవా హిజ్కియా ప్రార్థనకు జవాబిచ్చాడు