ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం నేడు ఎందుకు ప్రాముఖ్యం?
ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం నేడు ఎందుకు ప్రాముఖ్యం?
“ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” —అపొ. 5:42.
చక్కని దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఇంటింటికి వెళ్లడం ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో కనిపిస్తుంది. వారు ఇంటి వ్యక్తితో దేవుని రాజ్యం గురించిన బైబిలు సందేశాన్ని క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి సందేశాన్ని ఇష్టపడితే వారు బైబిలు సాహిత్యాన్నిచ్చి, ఉచితంగా బైబిలు అధ్యయనం చేస్తామని చెబుతారు. వారు ఆ ఇంట్లో మాట్లాడిన తర్వాత వేరే ఇంటికి వెళ్తారు. మీరూ ఈ పనిలో పాల్గొంటున్నట్లయితే, సాధారణంగా మీరు మాట్లాడకముందే మీరొక యెహోవాసాక్షి అని ప్రజలు గుర్తిస్తారని గమనించేవుంటారు. యెహోవాసాక్షులకు ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తారనే పేరుంది.
2 ప్రకటించి, శిష్యులను చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికి మనం వివిధ పద్ధతులను ఉపయోగిస్తాం. (మత్త. 28:19, 20) మనం బజారుల్లో, వీధుల్లో, మరితర ప్రాంతాల్లో ప్రకటిస్తాం. (అపొ. 17:17) మనం ఫోను చేయడం ద్వారా, ఉత్తరాలు రాయడం ద్వారా అనేకమందికి ప్రకటిస్తాం. మనం ప్రతీరోజు ఎవరెవరినైతే కలుసుకుంటామో వారికి బైబిలు సత్యాలను తెలియజేస్తాం. అంతేకాక, మనకు అధికారిక వెబ్‌సైట్ ఉంది, దానిలో 300కన్నా ఎక్కువ భాషల్లో బైబిలు సంబంధిత సమాచారం ఉంటుంది. * ఈ పద్ధతులన్నింటివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే, అనేక ప్రాంతాల్లో, మనం ప్రాముఖ్యంగా ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం ద్వారానే సువార్తను ప్రకటిస్తున్నాం. ఇలా ప్రకటించాలని బైబిల్లో చెప్పబడిందా? నేడు దేవుని ప్రజలు ఈ పద్ధతిని ఇంత ఎక్కువగా ఉపయోగిస్తూ ప్రకటించడానికి ఏ పరిస్థితులు దారితీశాయి? అలా ప్రకటించడం ఇప్పుడు ఎందుకు ప్రాముఖ్యం?
అపొస్తలులు ఉపయోగించిన పద్ధతి
3 ఇంటింటా ప్రకటించాలని బైబిల్లో చెప్పబడింది. యేసు తన అపొస్తలులను ప్రకటించడానికి పంపిస్తున్నప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు: ‘మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేయుడి.’ యోగ్యులైనవారిని వారు ఎలా వెతకగలరు? ప్రజల ఇళ్లకు వెళ్లమని చెప్తూ యేసు వారితో ఇలా అన్నాడు, “ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును.” మరి ఎవరైనా పిలిస్తేనే శిష్యులు వారింటికి వెళ్లాలా? యేసు ఏమి చెబుతున్నాడో చూడండి, “ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.” (మత్త. 10:11-14) అపొస్తలులు ‘బయలుదేరి ప్రతీ గ్రామానికీ వెళ్లి సువార్త ప్రకటిస్తున్నప్పుడు’ ప్రజలను వాళ్ల ఇళ్లకు వెళ్లి కలుసుకునేందుకు చొరవ తీసుకోవాలని ఈ సూచనలు స్పష్టం చేస్తున్నాయి.—లూకా 9:6.
4 అపొస్తలులు ఇంటింటా ప్రకటించారని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. ఉదాహరణకు, అపొస్తలుల కార్యములు 5:42 వారి గురించి ఇలా చెబుతోంది, “ప్రతిదినము దేవాలయములోను ఇంటిటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” ఆ మాటలు చెప్పిన దాదాపు 20 సంవత్సరాలకు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని సంఘ పెద్దలకు ఇలా గుర్తుచేశాడు, ‘ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేశాను, బోధించాను.’ ఆ పెద్దలు విశ్వాసులు కాకముందే పౌలు వారిని కలుసుకున్నాడా? అలానే అనిపిస్తోంది. ఎందుకంటే, ఆయన ఇతర విషయాలతోపాటు ‘దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి’ అని వారికి బోధించాడు. (అపొ. 20:20, 21) రాబర్ట్‌సన్ రాసిన వర్డ్ పిక్చర్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ అనే పుస్తకంలో అపొస్తలుల కార్యములు 20:20 గురించి ఇలా వ్యాఖ్యానించబడింది: “ప్రచారకుల్లోకెల్లా గొప్ప ప్రచారకుడైన ఈయన ఇంటింటా ప్రకటించాడన్నది గమనించదగ్గ విషయం.”
నేటి మిడతల దండు
5 మొదటి శతాబ్దంలో చేయబడిన ప్రకటనా పని మన దినాల్లో జరుగుతున్న గొప్ప పనికి సూచనగా ఉంది. యోవేలు ప్రవక్త, అభిషిక్తుల ప్రకటనా పనిని పురుగులు, మిడతలు కలుగజేసే వినాశనకరమైన తెగులుతో పోల్చాడు. (యోవే. 1:4) ఆ మిడతలు ఒక దండులా ముందుకు కదులుతూ ఆటంకాలను అధిగమిస్తాయి, ఇళ్లల్లోకి చొరబడుతూ వాటికి అడ్డు వచ్చేవాటన్నింటినీ కబళిస్తాయి. (యోవేలు 2:2, 7-9 చదవండి.) నేడు దేవుని ప్రజలు పట్టుదలతో భూవ్యాప్తంగా ప్రకటించడం గురించి అక్కడ ఎంత స్పష్టంగా వర్ణించబడిందో కదా! ఈ ప్రవచనాన్ని నెరవేర్చడానికి అభిషిక్త క్రైస్తవులు వారి సహచరులైన “వేరే గొఱ్ఱెలు” ఉపయోగిస్తున్న పద్ధతుల్లో ఇంటింటి పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైనది. (యోహా. 10:16) యెహోవాసాక్షులమైన మనం ప్రకటనా పనిలో అపొస్తలులు ఉపయోగించిన పద్ధతిని అనుసరించడానికి ఏ పరిస్థితులు దారితీశాయి?
6 ప్రకటనా పనిలో పాల్గొనడం ప్రతీ క్రైస్తవుని బాధ్యత అని 1919 నుండి నొక్కిచెప్పబడింది. ఉదాహరణకు, ఆగస్టు 15, 1922 కావలికోటలో “ప్రకటనాపని అతిప్రాముఖ్యం” అనే శీర్షికతో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్‌లో “ప్రతీ ఇంటికి వెళ్లి ముద్రిత సందేశాన్ని ఇచ్చి వారితో మాట్లాడి, రానున్న పరలోక రాజ్యం గురించి చురుకుగా సాక్ష్యమివ్వడం” ఎంత ప్రాముఖ్యమో అభిషిక్త క్రైస్తవులకు గుర్తుచేయబడింది. పరిచర్యలో ఏయే విషయాల గురించి మాట్లాడాలో బులెటిన్‌లో (ఇప్పుడు మన రాజ్య పరిచర్య) విపులంగా వివరించబడేది. అయినా అప్పట్లో కొద్దిమంది మాత్రమే ఇంటింటి పరిచర్యలో పాల్గొనేవారు. కొంతమందైతే అసలు పాల్గొనేవారే కాదు. వారు అనేక అభ్యంతరాలను లేవనెత్తారు, అయితే ఇంటింటి పరిచర్య తమ హోదాకు సరిపోదని వారు అనుకోవడమే
సమస్యకు అసలు కారణం. ఆ తర్వాతి సంవత్సరాల్లో క్షేత్ర సేవ ఎంత ప్రాముఖ్యమో పదేపదే నొక్కిచెప్పబడినప్పుడు వారిలో చాలామంది యెహోవా సంస్థను విడిచి వెళ్లిపోయారు.7 ఆ తర్వాతి దశాబ్దాల్లో అంతకంతకూ ఎక్కువమంది ప్రకటనా పనిలో పాల్గొనడం మొదలుపెట్టారు. అయితే, ఇంటింటి పరిచర్య చేయడంలో ప్రతీ ఒక్కరికీ మరింత శిక్షణ అవసరమని స్పష్టమైంది. అమెరికాలోని పరిస్థితిని మనం ఉదాహరణగా తీసుకుందాం. 1950-55 మధ్యకాలంలో, ఆ దేశంలోని 28 శాతంమంది సాక్షులు కేవలం కరపత్రాలను పంచేవారు లేదా వీధుల్లో పత్రికలను పంచేవారు. 40 శాతం కన్నా ఎక్కువమంది నెలల తరబడి సాక్ష్యపు పనిలో పాల్గొనేవారే కాదు. సమర్పిత క్రైస్తవులందరూ ఇంటింటి పరిచర్యలో పాల్గొనేలా ప్రోత్సహించడానికి ఏమి చేయబడింది?
8 న్యూయార్క్‌లో 1953లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఇంటింటి పరిచర్య చేయాలని నొక్కిచెప్పబడింది. అప్పట్లో ప్రపంచవ్యాప్త పనికి నాయకత్వం వహించిన సహోదరుడు నేథన్ హెచ్. నార్, ప్రతీ సాక్షి ఇంటింటి పరిచర్యలో క్రమంగా పాల్గొనేలా సహాయం చేయడమే క్రైస్తవ పైవిచారణకర్తలందరికీ ఉన్న ప్రాముఖ్యమైన పని అని ఆ సమావేశంలో చెప్పాడు. “ప్రతీ ఒక్కరూ ఇంటింటికి వెళ్లి ప్రకటించగలగాలి” అని ఆయన అన్నాడు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఒక శిక్షణా కార్యక్రమం ప్రారంభించబడింది. అప్పటికింకా ఇంటింటి పరిచర్యలో పాల్గొననివారికి, ప్రజల ఇళ్లకు వెళ్లి వారితో బైబిలును ఉపయోగిస్తూ తర్కించడానికి, వారు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి శిక్షణ ఇవ్వబడింది.
9 ఈ శిక్షణా కార్యక్రమంవల్ల మంచి ఫలితాలొచ్చాయి. పది సంవత్సరాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రచారకుల సంఖ్య 100 శాతం పెరిగింది, పునర్దర్శనాలు 126 శాతం, బైబిలు అధ్యయనాలు 150 శాతం పెరిగాయి. నేడు దాదాపు 70 లక్షలమంది ప్రచారకులు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తున్నారు. ఇంటింటి పరిచర్యలో తన ప్రజలు చేస్తున్న కృషిని యెహోవా ఆశీర్వదిస్తున్నాడని ఈ అద్భుతమైన అభివృద్ధినిబట్టి రుజువౌతోంది.—యెష. 60:22.
రక్షించబడేందుకు ప్రజల నొసళ్లపై గుర్తువేయడం
10 ఇంటింటి పరిచర్య ఎంత ప్రాముఖ్యమో యెహెజ్కేలు ప్రవక్తకు ఇవ్వబడిన దర్శనాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ దర్శనంలో యెహెజ్కేలు ఆయుధాలు ధరించిన ఆరుగురితోపాటు నారబట్ట వేసుకొని, లేఖకుని సిరాబుడ్డి నడుముకు కట్టుకొన్న ఏడవ వ్యక్తిని కూడా చూశాడు. “పట్టణములో ప్రవేశించి చుట్టు తిరిగి, దానిలో జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు వేయుము” అని ఆ ఏడవ వ్యక్తికి ఆజ్ఞాపించబడింది. గుర్తువేసే పని పూర్తైన తర్వాత, గుర్తులేనివారినందరినీ హతం చేయమని ఆయుధాలను పట్టుకొని ఉన్న ఆ ఆరుగురికి ఆజ్ఞాపించబడింది.—యెహెజ్కేలు 9:1-6 చదవండి.
11 ఆ ప్రవచనంలో ‘అవిసెనారబట్ట ధరించుకొన్న’ వ్యక్తి అభిషిక్త క్రైస్తవుల శేషానికి సూచనగా ఉన్నాడని మనకు తెలుసు. ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో పాల్గొనడం ద్వారా అభిషిక్త క్రైస్తవులు క్రీస్తుకు చెందిన ‘వేరే గొఱ్ఱెల్లో’ భాగమయ్యేవారి నొసళ్లపై సూచనార్థక గుర్తువేస్తారు. (యోహా. 10:16) ఆ గుర్తు ఏమిటి? గొర్రెల్లాంటివారు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తు శిష్యులయ్యారనీ, వారు క్రీస్తులాంటి నవీన స్వభావాన్ని కనబరుస్తున్నారనీ చూపించే రుజువే వారి నొసళ్లపై వేయబడే సూచనార్థక గుర్తు. (ఎఫె. 4:20-24) గొర్రెల్లాంటి ఆ వ్యక్తులు అభిషిక్త క్రైస్తవులతో కలిసి ఒక మందగా ఏర్పడతారు. ఇతరుల నొసళ్లమీద గుర్తువేసే ఈ ప్రాముఖ్యమైన పనిలో వారు అభిషిక్తులకు సహాయం చేస్తారు.—ప్రక. 22:17.
12 “మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారిని” మనం వెతుకుతూ ఉండడం ఎందుకు అత్యవసరమో తెలియజేసే ఒక కారణాన్ని యెహెజ్కేలు దర్శనం నొక్కిచెబుతోంది. 2 థెస్స. 1:6-8) ప్రజలు రాజ్యసువార్తకు ఎలా ప్రతిస్పందిస్తారనే దాన్నిబట్టి తీర్పుతీర్చబడతారన్నది గమనించండి. కాబట్టి, మనం దేవుని సందేశాలను ఉత్సాహంగా చివరి వరకు ప్రకటించాలి. (ప్రక. 14:6, 7) అంటే యెహోవాకు సమర్పించుకున్న సేవకులందరి మీద బరువైన బాధ్యత ఉంది.—యెహెజ్కేలు 3:17-19 చదవండి.
ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. యెహోవా తీర్పులను అమలుచేసే పరలోక సైన్యాలకు సూచనగా ఉన్న ఆరుగురు సాయుధ వ్యక్తులు ఆ సూచనార్థక గుర్తులేనివారిని త్వరలోనే నాశనం చేస్తారు. ఆ తీర్పు గురించి తెలియజేస్తూ అపొస్తలుడైన పౌలు, ప్రభువైన యేసు “తన ప్రభావమును కనుపరచు దూతలతో” కలిసి “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన” చేస్తాడని రాశాడు. (13 ఇతరులకు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత తనకుందని అపొస్తలుడైన పౌలు భావించాడు. ఆయన ఇలా రాశాడు: “గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కానివారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను. కాగా నావలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.” (రోమా. 1:14, 15) యెహోవా తనపై చూపించిన కనికరంపట్ల కృతజ్ఞతతో పౌలు, తాను దేవుని కృప నుండి ప్రయోజనం పొందినట్లే ఇతరులూ ప్రయోజనం పొందేలా సహాయం చేయడానికి ప్రయత్నించడం తన బాధ్యతగా భావించాడు. (1 తిమో. 1:12-16) తాను కలుసుకున్న ప్రతీవ్యక్తికి తను అప్పున్నట్లు, సువార్తను ప్రకటించడం ద్వారానే ఆ అప్పును తీర్చగలనని ఆయన భావించాడు. మీ ప్రాంతంలో ఉన్న ప్రజల విషయంలో మీకు అలాగే అనిపిస్తుందా?—అపొస్తలుల కార్యములు 20:26, 27 చదవండి.
14 మానవులు రక్షించబడడం ప్రాముఖ్యమే అయినా, ఇంటింటా సువార్త ప్రకటించడానికి మనకు మరింత ప్రాముఖ్యమైన కారణముంది. మలాకీ 1:11లోని ప్రవచనంలో యెహోవా ఇలా చెప్పాడు: “తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, . . . పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును.” ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా, యెహోవాకు సమర్పించుకున్న సేవకులు వినయంతో పరిచర్య చేస్తూ భూమ్యంతటా ఆయన నామాన్ని బహిరంగంగా స్తుతిస్తున్నారు. (కీర్త. 109:30; మత్త. 24:14) యెహోవాకు “స్తుతియాగము” చెల్లించాలన్న ప్రాముఖ్యమైన కారణంతోనే మనం బహిరంగంగా, ఇంటింటా ప్రకటిస్తున్నాం.—హెబ్రీ. 13:15.
ప్రాముఖ్యమైన సంఘటనలు జరుగనున్నాయి
15 ప్రకటనా పనిలో ఎలాంటి పరిణామాలు జరుగనున్నాయి? యెరికో పట్టణ ముట్టడి గురించి యెహోషువ పుస్తకంలో రాయబడిన వృత్తాంతం ఒక ఉదాహరణగా ఉంది. యెరికో పట్టణాన్ని నాశనంచేయకముందు రోజుకొకసారి చొప్పున ఆరు రోజులు పట్టణం చుట్టూ తిరగమని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడనేది గుర్తుతెచ్చుకోండి. అయితే వారు ఏడవ రోజు మరింత ఎక్కువ పని చేయాల్సివచ్చింది. యెహోవా యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాడు: “ఏడవ దినమున మీరు ఏడుమారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా . . . జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును.” (యెహో. 6:2-5) భవిష్యత్తులో మనం మరింత ఎక్కువగా ప్రకటనా పనిని చేయాల్సి రావచ్చు. ఏదేమైనా, ఈ ప్రస్తుత విధానం నాశమయ్యేనాటికి, ఇప్పటివరకు ఎన్నడు జరుగనంతగా దేవుని నామం గురించి, ఆయన రాజ్యం గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వబడడాన్ని మనం చూస్తాం.
* అంతేకాక ప్రకటన 16:21 ‘ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పది’ అని చెబుతోంది. ఆ ప్రాముఖ్యమైన తీర్పు సందేశాలను ప్రకటించడానికి మనం ఇంటింటి పరిచర్యా పద్ధతిని ఉపయోగిస్తామో లేదో మనకు ఇప్పుడైతే తెలీదు. కానీ “మహాశ్రమలు” ముగిసేలోపు యెహోవా దేవుని నామం గురించి మానవ చరిత్రలో ముందెన్నడూ లేనంత గొప్పగా ప్రకటించబడుతుంది.—ప్రక. 7:14; యెహె. 38:23.
16 మనం ఆ సందేశాన్ని ‘ఆర్భాటంగా కేకలు’ వేసినట్లే ప్రకటించాల్సిన సమయం రావచ్చు. ప్రకటనా పుస్తకంలో కఠినమైన తీర్పు సందేశాలు ‘అయిదేసి మణుగుల [“టాలెంట్,” NW] బరువుగల పెద్దవడగండ్లుగా’ వర్ణించబడ్డాయి.17 భవిష్యత్తులో జరుగనైయున్న ప్రాముఖ్యమైన సంఘటనల కోసం ఎదురుచూస్తుండగా రాజ్య సువార్తను ఉత్సాహంగా ప్రకటిస్తూనే ఉందాం. మనం ఆ బాధ్యతను నెరవేరుస్తుండగా ఇంటింటి పరిచర్యలో మనకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి, వాటిని మనం ఎలా ఎదుర్కోవచ్చు అనే విషయాలను మనం తర్వాతి ఆర్టికల్‌లో చర్చిద్దాం.
[అధస్సూచీలు]
^ పేరా 4 వెబ్‌సైట్ అడ్రస్ www.watchtower.org.
^ పేరా 22 “ఇక్కడ టాలెంట్ అన్న పదం గ్రీకులు కొలవడానికి ఉపయోగించే కొలత అయ్యుంటుంది. అదే నిజమైతే వడగండ్ల బరువు సుమారు 20 కిలోలు ఉండొచ్చు.”
మీరెలా జవాబిస్తారు?
• ఇంటింటా ప్రకటించాలని బైబిల్లో చెప్పబడిందా?
• ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం గురించి మన కాలంలో ఎలా నొక్కి చెప్పబడింది?
• యెహోవాకు సమర్పించుకున్న సేవకులకు ప్రకటించే బాధ్యత ఎందుకుంది?
• భవిష్యత్తులో ఏ ప్రాముఖ్యమైన సంఘటనలు జరుగనున్నాయి?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) యెహోవాసాక్షులకు ఏ పద్ధతిని ఉపయోగించి ప్రకటిస్తారనే పేరు ఉంది? (బి) మనం ఈ ఆర్టికల్‌లో ఏయే విషయాలను చర్చించనున్నాం?
3. యేసు ప్రకటనా పని గురించి అపొస్తలులకు ఏ సూచనలు ఇచ్చాడు, వారు ప్రకటించాల్సిన విధానం గురించి అవి ఏమి స్పష్టం చేస్తున్నాయి?
4. ఇంటింటా ప్రకటించే పని గురించి బైబిల్లో ఎక్కడ స్పష్టంగా తెలియజేయబడింది?
5. యోవేలు ప్రవచనంలో ప్రకటనా పని ఎలా వర్ణించబడింది?
6. ఇంటింటి పరిచర్య విషయంలో 1922లో ఏమని ప్రోత్సహించబడింది, కొందరు దానికి ఎలా స్పందించారు?
7. 1950లలో ఏది అవసరమని స్పష్టమైంది?
8, 9. ఏ శిక్షణా కార్యక్రమం 1953లో ప్రారంభించబడింది, దానివల్ల ఎలాంటి ఫలితాలొచ్చాయి?
10, 11. (ఎ) యెహెజ్కేలు 9వ అధ్యాయంలో రాయబడినట్లు యెహెజ్కేలుకు ఏ దర్శనం ఇవ్వబడింది? (బి) ఆ దర్శనం మన దినాల్లో ఎలా నెరవేరుతుంది?
12. గొర్రెల్లాంటివారిని మనం వెతుకుతూ ఉండడం అత్యవసరమని నొసళ్లమీద గుర్తువేయడం గురించిన యెహెజ్కేలు దర్శనం ఎలా నొక్కిచెబుతోంది?
13. (ఎ) అపొస్తలుడైన పౌలు తనకు ఏ బాధ్యత ఉందని భావించాడు, అలా ఎందుకు భావించాడు? (బి) మీ ప్రాంతంలోని ప్రజలపట్ల ఏ బాధ్యత ఉందని మీరు అనుకుంటున్నారు?
14. మనం బహిరంగంగా, ఇంటింటా ప్రకటించడానికిగల ప్రాముఖ్యమైన కారణమేమిటి?
15. (ఎ) ఇశ్రాయేలీయులు ఏడవరోజు యెరికో పట్టణం చుట్టూ తిరుగుతుండగా వారు ఎలా మరింత ఎక్కువ పని చేశారు? (బి) ఆ ఉదాహరణ ప్రకటనా పని గురించి ఏమి సూచిస్తోంది?
16, 17. (ఎ) “మహాశ్రమలు” ముగిసేలోపు ఏ పని జరుగుతుంది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏ విషయాలను చర్చించబోతున్నాం?
[4వ పేజీలోని చిత్రాలు]
అపొస్తలుడైన పౌలులాగే ఇతరులకు ప్రకటించాల్సిన బాధ్యత మీకుందని మీరు అనుకుంటున్నారా?
[5వ పేజీలోని చిత్రం]
సహోదరుడు నార్, 1953లో