బలహీనతలున్నా బలవంతులమే
బలహీనతలున్నా బలవంతులమే
మీబలహీనతలు మిమ్మల్ని కృంగదీయవచ్చు. అవి మిమ్మల్ని జలగల్లా పట్టి పీడిస్తాయి. ఆ బలహీనతలను ఎన్నడూ అధిగమించలేమని మీరు అనుకోవచ్చు. లేదా మిమ్మల్ని మీరు అసమర్థులుగా పరిగణించుకుంటూ, మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకొని వారితో సరితూగలేమని మీరనుకోవచ్చు. అంతేకాక, మీ శక్తినీ ఉత్సాహాన్నీ హరించివేస్తూ శారీరకంగా కృంగదీసే అనారోగ్యంతో మీరు బాధపడుతుండవచ్చు. కారణమేదైనప్పటికీ, ఆ సమస్యల నుండి తప్పించుకొనే అవకాశమే లేదని మీకనిపించవచ్చు. మీకు కూడా యోబుకు కలిగిన భావాలే కలగవచ్చు. ఆయన దేవునికిలా ప్రార్థించాడు, “నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలు. నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను.”—యోబు 14:13.
అలాంటి నిస్సహాయస్థితి నుండి మీరెలా బయటపడవచ్చు? మీరు మీ సమస్యల గురించి కొంతకాలంపాటు ఆలోచించకుండా ఉండడం కష్టమే అయినా, మీరలా చేయడమే మంచిది. ఉదాహరణకు, యెహోవా తన నమ్మకమైన సేవకుడైన యోబును అడిగిన ఈ ప్రేరేపిత ప్రశ్నల గురించి మీరు ఆలోచించవచ్చు: “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.” (యోబు 38:4, 5) ఆ ప్రశ్నలకున్న ప్రాముఖ్యత గురించి మనం ఆలోచించేకొద్దీ యెహోవా శ్రేష్ఠమైన జ్ఞానాన్ని, శక్తిని గుర్తించేందుకు బహుశా మనం ప్రోత్సహించబడవచ్చు. ఆయన తగిన కారణంతోనే ప్రస్తుత లోకపరిస్థితి ఇలా కొనసాగేందుకు అనుమతించాడు.
“శరీరములో ఒక ముల్లు”
మరో నమ్మకమైన సేవకుడైన అపొస్తలుడైన పౌలు, తన ‘శరీరములో ఉన్న ఒక ముల్లును’ అంటే తనను ఎంతోకాలంగా పట్టిపీడిస్తున్న ఒక సమస్యను తొలగించమని యెహోవాను కోరాడు. ఆయన దానికోసం దేవుణ్ణి మూడుసార్లు వేడుకున్నాడు. ఆ సమస్య ఏదైనప్పటికీ, అది ఇబ్బంది కలిగించే ముల్లులా యెహోవా సేవలో పౌలుకు 2 కొరిం. 12:7-10) ఆయన ఎందుకలా అన్నాడు?
ఆనందం లేకుండా చేసి ఉంటుంది. పౌలు దాన్ని, విడువక నలుగగొట్టబడడంతో పోల్చాడు. దానికి యెహోవా ఇలా సమాధానమిచ్చాడు: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.” యెహోవా ఆ ముల్లును తీసివేయలేదు. పౌలు దానితో పోరాడాల్సి వచ్చినా ఇలా అన్నాడు: “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” (పౌలు సమస్య అద్భుతరీతిలో తొలగించబడనప్పటికీ, యెహోవా సేవలో ఆయన విశేషమైన కార్యాలు చేయగలిగాడు. పౌలు బలం కోసం యెహోవాపై ఆధారపడుతూ, సహాయం చేయమని ఆయనను ఎల్లప్పుడూ వేడుకున్నాడు. (ఫిలి. 4:6, 7) పౌలు తన భూజీవిత చరమాంకంలో ఇలా చెప్పగలిగాడు: “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.”—2 తిమో. 4:7.
అపరిపూర్ణ మానవులకు బలహీనతలు, సమస్యలు ఉన్నా యెహోవా తన చిత్తం నెరవేర్చుకునేందుకు వారిని ఉపయోగించుకుంటాడు కాబట్టి, వారు సాధించిన విజయాలకు ఘనత అంతా ఆయనకే చెందుతుంది. కష్టాలను సహించేందుకు, యెహోవా సేవలో ఆనందాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన నిర్దేశాన్ని, జ్ఞానాన్ని ఆయన వారికి ఇవ్వగలడు. అపరిపూర్ణ మానవులకు బలహీనతలు ఉన్నప్పటికీ గొప్ప కార్యాలు చేయడానికి ఆయన వారిని తప్పక ఉపయోగించుకోగలడు.
తాను “అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము,” దేవుడు తన శరీరంలోని ముల్లును తొలగించలేదని పౌలు తెలియజేశాడు. (2 కొరిం. 12:7) ఆయన శరీరంలోవున్న “ముల్లు,” తనకు పరిమితులున్నాయని గుర్తుచేసి, వినయంగా ఉండేందుకు ఆయనకు దోహదపడింది. అది యేసు బోధించిన ఈ విషయానికి అనుగుణంగా ఉంది, “తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.” (మత్త. 23:12) దేవుని సేవకులు వినయాన్ని అలవర్చుకునేందుకు, యెహోవా సహాయంతోనే నమ్మకంగా సహించగలమని గుర్తించేందుకు శ్రమలు సహాయం చేస్తాయి. అలా, వారు అపొస్తలునిలా ‘యెహోవాయందే అతిశయించవచ్చు.’—1 కొరిం. 1:31.
దాగివుండే బలహీనతలు
కొంతమందికి తమలో బలహీనతలున్నాయని తెలిసి ఉండకపోవచ్చు, లేదా తమలో బలహీనతలున్నాయని వారు ఆంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తనకున్న శక్తిసామర్థ్యాలపై నమ్మకంతో మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కనబరచవచ్చు. (1 కొరిం. 10:12) ప్రధానత్వాన్ని కోరుకోవడం, అపరిపూర్ణ మానవుల్లో సర్వసాధారణంగా ఉండే మరో బలహీనత.
దావీదు రాజు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన యోవాబు దైర్యవంతుడు, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుడు, సమస్యలను పరిష్కరించడంలో దిట్ట. కానీ అతడు ఒక గంభీరమైన తప్పుచేయడంతో అతనిలోవున్న అహంకారం, అధికారకాంక్ష బయటపడ్డాయి. అతడు ఇద్దరు సైన్యాధిపతులను క్రూరంగా హతమార్చాడు. మొదట, అబ్నేరును చంపి తన పగతీర్చుకున్నాడు. తర్వాత, తన సమీప బంధువైన అమాశాను పలకరించి ముద్దుపెట్టుకునే నెపంతో, తన కుడిచేతితో ఆయన గడ్డాన్ని పట్టుకుని ఎడమచేతితో ఆయన కడుపులో కత్తి గుచ్చాడు. (2 సమూ. 17:25; 20:8-10) యోవాబు స్థానంలో అమాశా సైన్యాధిపతిగా నియమించబడ్డాడు కాబట్టి ఆ స్థానానికి తాను మళ్ళీ నియమించబడవచ్చుననే ఆశతో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తన పోటిదారుడైన అమాశాను చంపాడు. అతడు తన స్వార్థపూరిత అధికారకాంక్షను, తన కోరికలను అదుపులో ఉంచుకోలేదని మనం దీనినిబట్టి గ్రహించవచ్చు. అతడు క్రూరంగా ప్రవర్తించాడు. అంతేకాక అలా ప్రవర్తించినందుకు అతడు ఏమాత్రం బాధపడలేదు. దావీదు రాజు తన జీవిత మలిదశలో, యోవాబు చెడుతనానికి తగిన శిక్షపడేలా చూడమని తన కుమారుడైన సొలొమోనును నిర్దేశించాడు.—1 రాజు. 2:5, 6, 29-35.
మనం మన చెడు కోరికలను అదుపులో ఉంచుకోవాలి. మనం మన బలహీనతలపై విజయం సాధించవచ్చు. మొదట, మనం మన బలహీనతలను గుర్తించాలి, అంతేకాక మనలో బలహీనతలున్నాయని అంగీకరించాలి. ఆ తర్వాత వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవచ్చు. వాటి మీద విజయం సాధించేందుకు సహాయం కోరుతూ యెహోవాకు క్రమంగా ప్రార్థించాలి. ఆ చెడు కోరికలను అదుపులో ఉంచుకోవడానికి ఏమి చేయాలో తెలుసుకునేందుకు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి. (హెబ్రీ. 4:12) వాటిమీద విజయం సాధించడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాల్సిరావచ్చు, అలా చేయాల్సివస్తే మనం నిరుత్సాహపడకూడదు. మనం అపరిపూర్ణులముగా ఉన్నంతవరకూ వాటిమీద మన పోరాటాన్ని కొనసాగించాల్సి రావచ్చు. “నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను” అని రాయడం ద్వారా పౌలు తాను కూడా అలా పోరాడాల్సి వచ్చిందని అంగీకరించాడు. అయితే, ఆయన తాను చేసే పనులు పూర్తిగా తన అధీనంలో లేవన్నట్లు ప్రవర్తించలేదు. ఆయన తన బలహీనతలకు లొంగిపోలేదని మనకు తెలుసు. దానికి భిన్నంగా, ఆయన యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చే సహాయంపై ఆధారపడుతూ వాటితో పోరాటం కొనసాగించాడు. (రోమా. 7:15-25) మరోచోట పౌలు ఇలా చెప్పాడు: “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.”—1 కొరిం. 9:27.
మానవులు సాధారణంగా తమనుతాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే “చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి,” అని పౌలు క్రైస్తవులకు ఉపదేశించినట్లు చేస్తూ, మనం యెహోవా దృక్కోణాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఆ బలహీనతను అధిగమించవచ్చు. (రోమా. 12:9) మనకు నిజాయితీ, పట్టుదల, స్వీయ క్రమశిక్షణ ఉంటే మనం మన బలహీనతలను జయించగలుగుతాం. దావీదు యెహోవాను ఇలా వేడుకున్నాడు: “నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము.” (కీర్త. 26:2) దేవుడు మన అంతరంగ కోరికలను ఖచ్చితంగా తెలుసుకోగలడని, మనకు అవసరమైనప్పుడు సహాయాన్నిస్తాడని ఆయనకు తెలుసు. యెహోవా తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చే నడిపింపును అనుసరిస్తే మనం మన బలహీనతలను అధిగమించడంలో ప్రగతి సాధించవచ్చు.
కొందరు సమస్యలతో సతమతమౌతూ వాటిని స్వయంగా పరిష్కరించుకోలేమని అనుకుంటారు. సంఘ పెద్దలు ప్రేమపూర్వక సహాయాన్ని, ప్రోత్సాహాన్ని తప్పక ఇవ్వగలుగుతారు. (యెష. 32:1, 2) అయితే, సమస్యల పరిష్కారం విషయంలో వాస్తవిక దృక్పథాన్ని కలిగివుండడం జ్ఞానయుక్తం. కొన్ని సమస్యలకు ప్రస్తుత విధానంలో సంపూర్ణ పరిష్కారం లభించదు. అయినా, చాలామంది వాటిని ఎలా సహించాలో తెలుసుకున్నారు, అది సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి వారికి సహాయం చేసింది.
యెహోవా మద్దతునిస్తాడని నమ్మవచ్చు
ఈ కష్ట కాలాల్లో మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, యెహోవా మనకు నడిపింపునిచ్చి మనల్ని బలపరుస్తాడని మనం నమ్మవచ్చు. బైబిలు మనల్ని ఇలా ప్రోత్సహిస్తోంది: “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతు. 5:6, 7.
ఎన్నో సంవత్సరాలుగా బెతెల్లో సేవచేస్తున్న క్యాథీ తన భర్తకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందని తెలుసుకున్నప్పుడు దానివల్ల వచ్చే కష్టాలను తాను ఒంటరిగా తాళుకోలేనని అనుకుంది. ఆమె జ్ఞానం కోసం, మానసిక స్థైర్యం కోసం ప్రతీరోజు యెహోవాను ప్రార్థించింది. ఆమె భర్త పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తుండగా, ప్రేమగల సహోదరులు ఆ వ్యాధి ఉన్నవారిని ఎలా చూసుకోవాలో తెలుసుకోవడానికి
ఎంతో కృషిచేశారు. శ్రద్ధగల సహోదరీలు ఆమెను ఓదార్చి, ప్రోత్సహించారు. యెహోవా ఈ క్రైస్తవులను ఉపయోగించి ఆమెను బలపర్చాడు. అందువల్ల ఆమె తన భర్త చనిపోయేంత వరకూ ఆయనను చూసుకోగలిగింది. ఆయన దాదాపు 11 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ఆమె ఇలా అంటోంది: “యెహోవా చేసిన సహాయానికి నేను ఆయనకు కన్నీళ్ళతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశాను, ఆయన సహాయంతోనే నేను నా భర్తను అంతకాలం చూసుకోగలిగాను. నేను అలసిపోయి నీరసించినా, అంతకాలంపాటు నా బాధ్యతలను నిర్వర్తిస్తానని అనుకోలేదు.”దాగివున్న బలహీనతలను అధిగమించేందుకు సహాయం
ఆత్మన్యూనతా భావాలతో సతమతమౌతున్నవారు, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం కోసం తాము చేసే విన్నపాన్ని యెహోవా వినడని అనుకోవచ్చు. అలాంటప్పుడు, దావీదు తాను బత్షెబతో చేసిన గంభీరమైన పాపం విషయంలో ఎంతో బాధపడుతూ పలికిన మాటలను వారు ధ్యానించడం చాలా మంచిది. ఆయన ఇలా అన్నాడు: “దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” (కీర్త. 51:17) దావీదు యథార్థంగా పశ్చాత్తాపపడ్డాడు. తాను దేవునికి ప్రార్థించవచ్చని, దేవుడు తనపై దయచూపిస్తాడని ఆయనకు తెలుసు. యెహోవా చూపించే ప్రేమపూర్వక శ్రద్ధనే యేసు కూడా చూపిస్తాడు. సువార్త రచయితయైన మత్తయి, యెషయా పలికిన ఈ మాటలను యేసుకు అన్వయించాడు: “నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు.” (మత్త. 12:20; యెష. 42:3) యేసు భూమ్మీదున్నప్పుడు దీనులపై, అణచివేయబడినవారిపై కనికరం చూపించాడు. మకమకలాడుతున్న వత్తిలా నలిగి కృశించిపోతున్నవారిని ఆయన మరింత బాధపెట్టలేదు కానీ, ప్రేమపూర్వకంగా వారిలో నూతనోత్తేజాన్ని నింపాడు. ఆయన భూమ్మీదున్నప్పుడు అలా కనికరం చూపించాడు. యేసు ఇప్పటికీ అలాగే ఉన్నాడని, మీ బలహీనతల విషయంలో సానుభూతి చూపించగలడని మీరు నమ్ముతున్నారు కదా? ఆయన ‘మన బలహీనతలయందు మనతో సహానుభవముగలవాడని’ హెబ్రీయులు 4:15 తెలియజేస్తుందని గమనించండి.
పౌలు తన “శరీరములో ఒక ముల్లు” గురించి రాస్తున్నప్పుడు, క్రీస్తు శక్తి తనమీద గుడారంలా ‘కప్పబడివుందని’ చెప్పాడు. (2 కొరిం. 12:7-9, అధఃస్సూచి) గుడారంలో ఉన్న ఒక వ్యక్తి ఎండావానల నుండి ఎలా కాపాడబడతాడో అలాగే ఆయన క్రీస్తు ద్వారా దేవుని కాపుదలను చవిచూశాడు. పౌలులాగే మనం మన బలహీనతలను, సమస్యలను అధిగమించవచ్చు. మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే యెహోవా తన భూసంస్థ ద్వారా చేసిన ఏర్పాట్లన్నింటి నుండి ప్రయోజనం పొందాలి. మానవులముగా మనం శాయశక్తులా కృషిచేసిన తర్వాత, యెహోవా మనల్ని నడిపిస్తాడనే పూర్తి నమ్మకంతో ఆయనకు ప్రార్థించాలి. మన బలహీనతల విషయంలో దేవుని శక్తి మనకు ఎలా సహాయం చేస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు, మనం పౌలు చెప్పినట్లే ఇలా చెప్పగలుగుతాం: “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.”—2 కొరిం. 12:10.
[3వ పేజీలోని చిత్రం]
పౌలు, తన పరిచర్యను పూర్తిచేయడంలో నడిపింపునివ్వమని యెహోవాకు ఎడతెగక ప్రార్థించాడు
[5వ పేజీలోని చిత్రం]
దావీదు రాజు, యోవాబును సైన్యాధిపతిగా నియమించాడు
[5వ పేజీలోని చిత్రం]
యోవాబు తన పోటిదారుడైన అమాశాను హతమార్చాడు
[6వ పేజీలోని చిత్రం]
పెద్దలు, సమస్యలను సహించేందుకు సహాయం చేయగల ప్రేమపూర్వక లేఖన నడిపింపును ఇస్తారు