ఓబద్యా, యోనా, మీకా పుస్తకాల ముఖ్యాంశాలు
యెహోవా వాక్యము సజీవమైనది
ఓబద్యా, యోనా, మీకా పుస్తకాల ముఖ్యాంశాలు
“ఓబద్యాకు కలిగిన దర్శనము.” (ఓబద్యా 1) ఈ మాటలతో బైబిలు పుస్తకమైన ఓబద్యా ప్రారంభమౌతుంది. ఆ ప్రవక్త సా.శ.పూ 607లో రాయడం పూర్తిచేసిన ఈ పుస్తకంలో, ఆయన తన పేరు తప్ప తన గురించిన వేరే ఏ వివరాలూ ఇవ్వలేదు. దానికి దాదాపు రెండు శతాబ్దాల క్రితం రాయబడిన ఒక పుస్తకంలో, యోనా ప్రవక్త తన మిషనరీ నియామకంలో ఎదురైన అనుభవాన్ని నిజాయితీగా వివరించాడు. ఓబద్యా, యోనా ప్రవచించిన కాలానికి మధ్యలో అంటే సా.శ.పూ. 777 నుండి సా.శ.పూ. 717 వరకు మీకా 60 ఏళ్లు ప్రవచించాడు. ఆయన తాను “మోరష్తు [పల్లెకు]” చెందినవాడనీ, “యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో” యెహోవా వాక్కు తనకు ప్రత్యక్షమైందనీ మాత్రమే తన గురించి తాను చెప్పుకున్నాడు. (మీకా 1:1) తన సందేశంలోని అంశాలను నొక్కిచెప్పేందుకు ఆ ప్రవక్త ఉపయోగించిన ఉపమానాలనుబట్టి ఆయనకు పల్లె జీవనంతో పరిచయముందని స్పష్టమౌతుంది.
ఎదోము ‘ఇక ఎన్నటికి లేకుండ నిర్మూలమౌతుంది’
ఎదోము గురించి ఓబద్యా ఇలా ప్రవచించాడు: “నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమునుబట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు.” కొంతకాలం క్రితమే ఎదోమీయులు యాకోబు కుమారులమీద అంటే ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్యాలు ప్రవక్తకు బాగా గుర్తున్నాయి. సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసినప్పుడు ఎదోమీయులు ‘పగవారై నిలిచి’ దండెత్తి వచ్చిన ‘పరదేశులతో’ జట్టుకట్టారు.—ఓబద్యా 10, 11.
దానికి భిన్నంగా, యాకోబు సంతతివారు పూర్వస్థితికి తీసుకురాబడతారు. ఓబద్యా ప్రవచనం ఇలా చెబుతోంది: “అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు.”—ఓబద్యా 17.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
5-8—ఎదోము నాశనాన్ని రాత్రిపూట కన్నంవేసేవారు, ద్రాక్ష పండ్లను ఏరుకునేవారు రావడంతో పోల్చడానికున్న ప్రాముఖ్యత ఏమిటి? ఎదోముమీద దొంగలు పడితే వారు తమకు కావల్సింది మాత్రమే దోచుకునేవారు. కోతకోసేవారు ఎదోమును దోచుకోవడానికి వస్తే వారు పరిగె ఏరుకునేలా పంటలో కొంత భాగాన్ని వదిలేసేవారు. అయితే, ఎదోము పతనమైనప్పుడు ‘[దానితో] సంధిచేసినవారే’ అంటే దాని మిత్రపక్షమైన బబులోనీయులే దాని సంపదల కోసం జాగ్రత్తగా వెదకి వాటిని పూర్తిగా కొల్లగొడతారు.—యిర్మీయా 49:9, 10.
10—ఎదోము ఎలా ‘ఎన్నటికీ లేకుండా నిర్మూలమైంది’? ముందే చెప్పబడినట్లుగా, భూమ్మీద ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రభుత్వం, ప్రజలుగల జనాంగంగా ఉన్న ఎదోము ఉనికిలో లేకుండా పోయింది. దాదాపు సా.శ.పూ. ఆరవ శతాబ్దపు మధ్య భాగంలో బబులోను రాజైన నెబోనైడస్ ఎదోమును జయించాడు. సా.శ.పూ. నాల్గవ శతాబ్దానికల్లా ఎదోము ప్రాంతంలో నబటీయులు నివాసమేర్పరచుకున్నారు కాబట్టి, ఎదోమీయులు యూదా దక్షిణభాగంలో ఉన్న నెగెబు ప్రాంతంలో నివాసమేర్పరచుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత ఆ ప్రాంతం ఇదూమయ అని పిలువబడింది. సా.శ. 70లో రోమన్లు
యెరూషలేమును నాశనం చేసిన తర్వాత ఎదోమీయులు ఉనికిలోలేకుండాపోయారు.మనకు పాఠాలు:
3, 4. ఎదోమీయులు దుర్భేద్యమైన, మొనదేలిన ఎత్తైన పర్వత ప్రాంతాల్లో, ఇరుకుగా లోతుగా ఉండే లోయ ప్రాంతాల్లో నివసించేవారు కాబట్టి తాము క్షేమంగా, భద్రంగా ఉన్నామని వారు అతివిశ్వాసంతో అనుకొనివుండవచ్చు. అయితే యెహోవా తీర్పులను తప్పించుకోవడం సాధ్యంకాదు.
8, 9, 15. “యెహోవాదినము”లో మానవ జ్ఞానం, శక్తి ఎలాంటి రక్షణను ఇవ్వలేవు.—యిర్మీయా 49:7, 22.
12-14. దేవుని సేవకులు ఎదుర్కొనే కష్టాలను చూసి సంతోషించేవారికి ఎదోమీయులు ఒక హెచ్చరికా ఉదాహరణగా ఉన్నారు. యెహోవా తన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తేలికగా తీసుకోడు.
17-20. యాకోబు వంశీయులు పునస్థాపించబడడం గురించిన ఈ ప్రవచనం, సా.శ.పూ 537లో బబులోను నుండి యెరూషలేముకు యూదుల శేషం తిరిగివచ్చినప్పుడు నెరవేరడం మొదలైంది. యెహోవా వాక్యం ఎల్లప్పుడూ నెరవేరుతుంది. ఆయన వాగ్దానాలను మనం పూర్తిగా నమ్మవచ్చు.
“నీనెవె పట్టణము నాశనమగును”
యోనా, “నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి” తీర్పు సందేశాన్ని “ప్రకటింపుము” అనే దేవుని ఆజ్ఞకు లోబడే బదులు ఆ పట్టణానికి వ్యతిరేక దిశలో పారిపోయాడు. యెహోవా “సముద్రముమీద పెద్దగాలి” పుట్టించి, పెద్ద “మత్స్యము”ను ఉపయోగించడం ద్వారా యోనా గమ్యాన్ని మార్చి, అష్షూరు రాజధానికి వెళ్లమని ఆయనను రెండవసారి ఆజ్ఞాపించాడు.—యోనా 1:2, 4, 17; 3:1, 2.
యోనా నీనెవె పట్టణంలోకి ప్రవేశించి సూటియైన సందేశాన్ని ఇలా ప్రకటించాడు: “ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగును.” (యోనా 3:4) తన ప్రకటనా పనివల్ల కలిగిన అనూహ్య ప్రతిస్పందన యోనా ‘కోపగించుకునేలా’ చేసింది. యోనాకు దయ గురించిన పాఠం నేర్పించడానికి యెహోవా ‘ఒక సొర చెట్టును’ ఉపయోగించాడు.—యోనా 4:1, 6.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
3:3—నీనెవె పట్టణం “మూడు దినముల ప్రయాణమంత పరిమాణం[లో]” ఉందా? అవును. ప్రాచీన కాలంలో, ఉత్తరానున్న కోర్సాబాద్ పట్టణం నుండి దక్షిణానున్న నిమ్రద్ పట్టణం వరకు ఉన్న నివాసస్థలాలు నీనెవె పట్టణంలో భాగంగా ఉన్నట్లు భావించబడుతోంది. నీనెవెలో ఉన్న నివాసస్థలాలన్నీ కలిసి 100 కిలోమీటర్ల చుట్టుకొలత గల చతుర్భుజాకృతిలో ఉండేవి.
3:4—నీనెవెవాసులకు ప్రకటించడానికి యోనా అష్షూరీయుల భాష నేర్చుకోవాల్సివచ్చిందా? యోనాకు అంతకుముందే అష్షూరీయుల భాష వచ్చివుండవచ్చు, లేక ఆ భాషలో మాట్లాడే సామర్థ్యం ఆయనకు అద్భుతంగా అనుగ్రహించబడివుండవచ్చు. అలా కానట్లయితే, ఆయన తన సంక్షిప్త సందేశాన్ని హీబ్రూ భాషలో చెబుతుంటే, మరొకరు దానిని అనువదించివుండవచ్చు. అదే నిజమైతే, ఆయన మాటలు, ఆయన సందేశం గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలం వారిలో పుట్టించివుండవచ్చు.
మనకు పాఠాలు:
1:1-3. రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో పూర్తిగా భాగం వహించకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా వేరే పనులు పెట్టుకోవడం, చెడు ఉద్దేశం ఉందని సూచిస్తుంది. అలా చేసే వ్యక్తి దేవుడిచ్చిన నియామకం నుండి పారిపోతున్నట్లే.
1:1, 2; 3:10. యెహోవా దయ ఒక జనాంగానికి లేక జాతికి లేక ప్రత్యేక ప్రజల గుంపుకు మాత్రమే పరిమితంకాదు. “యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీదనున్నవి.”—కీర్తన 145:9.
1:17; 2:10. గొప్ప మత్స్యం కడుపులో యోనా మూడు రాత్రింబగళ్లు ఉండడం ప్రవచనాత్మకంగా యేసు మరణాన్ని, పునరుత్థానాన్ని సూచిస్తుంది.—మత్తయి 12:39, 40; 16:21.
1:17; 2:10; 4:6. యెహోవా యోనాను అల్లకల్లోలంగావున్న సముద్రం నుండి రక్షించాడు. అంతేకాక, దేవుడు “సొర చెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు చేసెను.” యెహోవా తమను సంరక్షించి, రక్షిస్తాడని ఆయన ఆధునిక దిన ఆరాధకులు తమ దేవునిమీద, ఆయన ప్రేమపూర్వక దయమీద నమ్మకముంచవచ్చు.—కీర్తన 13:5; 40:11.
2:1, 2, 9, 10. యెహోవా తన సేవకుల ప్రార్థనలను ఆలకించి వారి విన్నపాలను చెవియొగ్గి వింటాడు.—3:8, 10. సత్యదేవుడు తాను చేస్తానని చెప్పినకీడు విషయంలో “పశ్చాత్తప్తుడై” లేక తన మనసు మార్చుకొని “కీడుచేయక మానెను.” ఎందుకు? ఎందుకంటే నీనెవెవాసులు “తమ చెడు నడతలను మాను[కున్నారు].” అలాగే నేడు, ఒక పాపి నిజమైన పశ్చాత్తాపాన్ని కనబరిస్తే ఆయన దేవుని ప్రతికూల తీర్పును తప్పించుకోవచ్చు.
4:1-4. దేవుడు తన దయకు పరిమితులు పెట్టుకునేలా ఏ మానవుడూ చేయలేడు. యెహోవా దయాపూర్వక మార్గాలను మనం విమర్శించకుండా జాగ్రత్తపడాలి.
4:11. యెహోవా ఓర్పుతో భూవ్యాప్తంగా రాజ్య సందేశాన్ని ప్రకటింపజేస్తున్నాడు, ఎందుకంటే, నీనెవెలోని 1,20,000 మంది విషయంలో ఆయన జాలిపడినట్లే ఆయన “కుడియెడమలు ఎరుగని జనము” విషయంలో జాలిపడతాడు. మనం కూడా మన క్షేత్రంలో ఉన్న ప్రజలపట్ల జాలిపడి రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో ఉత్సాహంగా పాల్గొనవద్దా?—2 పేతురు 3:9.
‘వారు తమ బోడితనము కనబరచాలి’
మీకా ఇశ్రాయేలు, యూదాల పాపాలను బహిర్గతం చేసి, వారి రాజధానులు నాశనం చేయబడతాయని ప్రవచించడమేకాక, అవి పునఃస్థాపించబడతాయని కూడా వాగ్దానం చేశాడు. షోమ్రోను “చేనిలోనున్న రాళ్లకుప్పవలె” అవుతుంది. ఇశ్రాయేలు, యూదాలు విగ్రహారాధన చేస్తున్నాయి కాబట్టి “బోడితనము”కు లేక అవమానించబడడానికి అవి తగినవి. అవి చెరలోకి తీసుకువెళ్లబడడం ద్వారా వాటి బోడితనం “బోరువగద్దవలె” పెరగనుంది, ఆ గద్ద తలమీద కొన్నే మృదువైన వెంట్రుకలు ఉండే ఒక జాతికి చెందిన రాబందు కావచ్చు. యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: ‘యాకోబు సంతతిని నేను తప్పక పోగుచేయుదును.’ (మీకా 1:6, 16; 2:12) భ్రష్ట నాయకులు, అపరాధులైన ప్రవక్తల కారణంగా యెరూషలేము కూడా “రాళ్లకుప్పలగును.” అయితే యెహోవా “[తన ప్రజలను] సమకూర్చును.” “బేత్లెహేము ఎఫ్రాతా” నుండి “ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు” వస్తాడు.—మీకా 3:12; 4:12; 5:2.
యెహోవా ఇశ్రాయేలీయులతో అన్యాయంగా వ్యవహరించాడా? ఆయన నియమాలు చాలా కఠినమైనవా? లేదు. ‘న్యాయముగా నడుచుకోమని, కనికరమును ప్రేమించమని, దీనమనస్సు కలిగి’ దేవునితో నడవమని మాత్రమే యెహోవా తన ఆరాధకులను కోరుతున్నాడు. (మీకా 6:8) అయితే మీకా సమకాలీనులు ఎంతగా భ్రష్టుపట్టారంటే “వారిలో మంచివారు ముండ్లచెట్టువంటివారు, వారిలో యథార్థవంతులు ముండ్లకంచెకంటెను ముండ్లు ముండ్లుగా” ఉంటూ వారి దగ్గరికి వచ్చేవారికి హాని, బాధ కలిగిస్తున్నారు. అయితే ఆ ప్రవక్త ఇలా అడుగుతున్నాడు: “[యెహోవాకు] సముడైన దేవుడున్నాడా?” దేవుడు తన ప్రజలపట్ల మళ్లీ దయ చూపించి “వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో . . . పడవే[యును].”—మీకా 7:4, 18, 19.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
2:12—‘ఇశ్రాయేలీయులలో శేషించినవారిని సమకూర్చడానికి’ సంబంధించిన ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? అది మొదటిసారి సా.శ.పూ. 537లో అంటే యూదా శేషం బబులోను చెర నుండి తమ స్వదేశానికి తిరిగివచ్చినప్పుడు నెరవేరింది. ఆధునిక కాలాల్లో, ఆ ప్రవచనం “దేవుని ఇశ్రాయేలు” విషయంలో నెరవేరింది. (గలతీయులు 6:16) 1919 నుండి అభిషిక్త క్రైస్తవులు “గొఱ్ఱెలు కూడునట్లు” సమకూర్చబడ్డారు. ముఖ్యంగా 1935 నుండి ‘వేరే గొర్రెలకు’ చెందిన “గొప్పసమూహము” వారితో కలిసి ‘గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులతో విస్తారముగా’ తయారయ్యారు. (ప్రకటన 7:9; యోహాను 10:16) ఆ రెండు గుంపులు కలిసి ఉత్సాహంగా సత్యారాధనను ప్రోత్సహిస్తున్నాయి.
4:1-4—“అంత్యదినములలో,” యెహోవా ఎలా “మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, . . . బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును”? “అనేక జనములు,” “బలముగల అన్యజనులు” అనే మాటలు, జాతీయ గుంపులను లేక రాజకీయ శక్తులను సూచించవు. బదులుగా, ఆ మాటలు
జనాంగాలన్నిటి నుండి వచ్చి, యెహోవా ఆరాధకులైన వ్యక్తులను సూచిస్తున్నాయి. యెహోవా ఆధ్యాత్మికంగా వారికి న్యాయం తీర్చి, తీర్పు తీరుస్తాడు.మనకు పాఠాలు:
1:6, 9; 3:12; 5:2. సా.శ.పూ. 740లో అంటే మీకా జీవిత కాలంలోనే షోమ్రోనును అష్షూరీయులు నాశనం చేశారు. (2 రాజులు 17:5, 6) హిజ్కియా పాలనలో అష్షూరీయులు యెరూషలేమువరకు వచ్చారు. (2 రాజులు 18:13) సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును కాల్చివేశారు. (2 దినవృత్తాంతములు 36:19) మీకా ప్రవచించినట్లే, మెస్సీయ “బేత్లెహేము ఎఫ్రాతా”లో జన్మించాడు. (మత్తయి 2:3-6) యెహోవా ప్రవచనాత్మక వాక్యం ఎన్నడూ విఫలంకాదు.
2:1, 2. దేవుని సేవిస్తున్నామని చెప్పుకుంటూ ‘ఆయన రాజ్యమును నీతిని’ మొదట వెదికే బదులు ధన సంపాదనలో పడడం ఎంత ప్రమాదకరమో కదా!—మత్తయి 6:33; 1 తిమోతి 6:9, 10.
3:1-3, 5. తన ప్రజల్లో నాయకత్వం వహిస్తున్నవారు న్యాయంగా వ్యవహరించాలని యెహోవా కోరుతున్నాడు.
3:4. యెహోవా మన ప్రార్థనలకు సమాధానమివ్వాలని మనం కోరుకుంటే మనం పాపం చేయకూడదు లేక ద్వంద జీవితాన్ని గడపకూడదు.
3:8. మనం యెహోవా పరిశుద్ధాత్మ ద్వారా బలపర్చబడితేనే, తీర్పు సందేశాలు కూడా ఉన్న సువార్త ప్రకటించమని మనకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చగలుగుతాం.
5:5. దేవుని ప్రజలపై వారి శత్రువులు దాడిచేసినప్పుడు “ఏడుగురు [సంపూర్ణతను సూచిస్తుంది] గొఱ్ఱెలకాపరులు,” “ఎనమండుగురు ప్రధానులు” అంటే చాలామంది సమర్థులైన పురుషులు యెహోవా ప్రజల్లో నాయకత్వం వహించడానికి నియమించబడతారని మెస్సీయకు సంబంధించిన ఈ ప్రవచనం హామి ఇస్తోంది.
5:7, 8. అనేకమందికి, నేటి అభిషిక్త క్రైస్తవులు “యెహోవా కురిపించు మంచువలె” అంటే దేవుని ఆశీర్వాదంగా ఉన్నారు. దేవుడు వారిని తన రాజ్య సందేశాన్ని ప్రకటించడానికి ఉపయోగిస్తున్నాడు కాబట్టి వారలా పరిగణించబడతారు. “వేరే గొఱ్ణెలు,” ప్రకటనా పనిలో అభిషిక్త క్రైస్తవులకు చురుకుగా మద్దతునివ్వడం ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక సేదదీర్పు ఇవ్వడానికి సహాయం చేస్తున్నారు. (యోహాను 10:16) ఇతరులకు నిజమైన సేదదీర్పునిచ్చే ఈ పనిలో భాగం వహించడం ఎంత గొప్ప ఆధిక్యతో కదా!
6:3, 4. మనం యెహోవా దేవుణ్ణి అనుకరిస్తూ, కఠినంగా వ్యవహరించేవారిపట్ల లేక ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారిపట్ల కూడా దయను, కనికరాన్ని కనబరచాలి.
7:7. ఈ దుష్టవిధానాంతంలో మనకు సమస్యలు ఎదురౌతున్నప్పుడు మనం కృంగిపోకూడదు. బదులుగా, మీకాలాగే మనం ‘[మన] దేవునికొరకు కనిపెట్టుకోవాలి.’
7:18, 19. యెహోవా మన దోషాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, మనకు వ్యతిరేకంగా పాపం చేసే వారిని క్షమించడానికి మనం సిద్ధంగా ఉండాలి.
‘యెహోవా నామంలో నడుస్తూ’ ఉండండి
దేవునికి, ఆయన ప్రజలకు వ్యతిరేకంగా పోరాడేవారు ‘ఇక ఎన్నటికీ లేకుండా నిర్మూలమౌతారు.’ (ఓబద్యా 10) అయితే, మనం దైవిక హెచ్చరికను లక్ష్యపెట్టి ‘చెడు నడతలను మానుకొంటే’ యెహోవా కోపాన్ని ప్రదర్శించడు. (యోనా 3:10) “అంత్యదినములలో” సత్యారాధన అబద్ధమతాలన్నింటి కన్నా అధికంగా ఘనపర్చబడుతోంది, విధేయులైనవారు దానిలోకి ప్రవాహంలా వస్తున్నారు. (మీకా 4:1; 2 తిమోతి 3:1) అందుకే మనం ‘మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుచు నడుచుకొంటూ’ ఉండాలని తీర్మానించుకుందాం గాక.—మీకా 4:5.
ఓబద్యా, యోనా, మీకా పుస్తకాల్లో ఎంతటి విలువైన పాఠాలు ఉన్నాయో కదా! దాదాపు 2,500 సంవత్సరాల క్రితం రాయబడినా, వాటిలోని సందేశం నేటికీ ‘సజీవమైనది, బలముగలది.’—హెబ్రీయులు 4:12.
[13వ పేజీలోని చిత్రం]
ఓబద్యా ఇలా ప్రవచించాడు: ‘[ఎదోము] ఇక ఎన్నటికి లేకుండా నిర్మూలమౌతుంది’
[15వ పేజీలోని చిత్రం]
మీకా ‘యోహోవా కోసం కనిపెట్టుకొని ఉన్నాడు,’ మీరు కూడా అలా కనిపెట్టుకొనివుండవచ్చు
[16వ పేజీలోని చిత్రం]
ప్రకటనా పని అమూల్యమైనదిగా ఎంచాల్సిన ఒక ఆధిక్యత