మనోవేదనను అనుభవించిన అక్కాచెల్లెళ్లు ‘ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేశారు’
మనోవేదనను అనుభవించిన అక్కాచెల్లెళ్లు ‘ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేశారు’
తెలతెలవారుతుండగా, ఇక కొద్దిసేపట్లోనే తన విషయం బయటపడి పోతుందని లేయాకు తెలుసు. అతని బాహువుల్లో ఉన్న స్త్రీ, తన చెల్లెలు రాహేలు కాదని యాకోబుకు తెలిసిపోతుంది. తన తండ్రి కోరిక మేరకు, లేయా బహుశా గుర్తుపట్టని విధంగా ముసుగువేసుకొని ఆ ముందురోజు రాత్రి, యాకోబు, రాహేలు కోసం ఏర్పాటుచేసిన వివాహపాన్పుపై పడుకొనివుండవచ్చు.
ఉదయం అసలు విషయం బయటపడినప్పుడు యాకోబుకు ఎలా అనిపించివుండవచ్చో ఊహించండి! ఆయన కోపోద్రిక్తుడై లేయా వాళ్లనాన్న అయిన లాబానుతో వాదించాడు. ఆ సమయంలో, ఆ మోసంలో తనవంతు పాత్ర గురించి, దానివల్ల కలిగే శాశ్వతకాల పరిణామాల గురించి లేయా ఆలోచించివుండవచ్చు. లేయా, రాహేలుల కథ బైబిలు చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన భాగం. ఒక పురుషునికి ఒకే భార్య ఉండడం, భార్యభర్తల మధ్య విశ్వసనీయత ఉండడం ఎంత జ్ఞానయుక్తమైనదో కూడా అది వివరిస్తుంది.
బావి దగ్గర అపరిచితుడు
ఏడేళ్ల క్రితం, తమ బంధువని చెప్పుకున్న వ్యక్తిని బావి దగ్గర కలిశానని చెప్పేందుకు రాహేలు వాళ్ల నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లింది. యెహోవా ఆరాధకుడైన ఆ వ్యక్తి తన మేనత్త కుమారుడైన యాకోబని ఆమె తెలుసుకుంది. ఒక నెల తర్వాత, రాహేలును పెళ్లి చేసుకోవడం కోసం లాబానుకు ఏడేళ్లు సేవచేస్తానని యాకోబు ప్రతిపాదించాడు. తన మేనల్లుడు ఎంత చక్కగా పనిచేశాడో గమనించడమే కాక, తమ ప్రజల్లో బంధువులు వివాహం చేసుకోవడం వాడుకని కూడా లాబానుకు తెలుసు కాబట్టి, ఆయన ఆ ప్రతిపాదనను అంగీకరించాడు.—ఆదికాండము 29:1-19.
యాకోబుకు రాహేలుపట్లవున్న ప్రేమ వ్యామోహమేమీ కాదు. “అతడు ఆమెను ప్రేమించుటవలన” ఆ ఏడేళ్ల ఒప్పందకాలం “అతనికి కొద్ది దినములుగా తోచెను.” (ఆదికాండము 29:20) రాహేలు మరణించేంతవరకు యాకోబు ఆమెను ప్రేమించాడంటే ఆమెకు ఎన్నో ఆకర్షణీయమైన గుణాలు ఉండివుంటాయని అది తెలియజేస్తుంది.
యెహోవా నమ్మకమైన ఆరాధకుణ్ణి వివాహం చేసుకోవాలని లేయా కూడా ఆశించిందా? బైబిలు దాని గురించి చెప్పడంలేదు. ఆయితే, ఆమె వివాహం గురించి లాబానుకున్న ఉద్దేశాలు బైబిల్లో స్పష్టంగా తెలియజేయబడ్డాయి. రాహేలు కోసం యాకోబు పనిచేయడం పూర్తైన తర్వాత, లాబాను వివాహ విందును ఏర్పాటు చేశాడు. అయితే లాబాను, రాత్రివేళ యాకోబు ‘ఆమెను కూడెలా’ లేయాను ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు.—ఆదికాండము 29:23.
యాకోబును మోసం చేయడానికి లేయా కుట్ర పన్నిందా? లేక కేవలం తన తండ్రి మాటలకు లోబడిందా? ఆ సమయంలో రాహేలు ఎక్కడుంది? ఏమి జరుగుతున్నదో ఆమెకు తెలుసా? ఒకవేళ తెలిసివుంటే, ఆమెకు ఎలా అనిపించింది? ఆమె ఎదురు చెప్పలేనంత కఠినుడా ఆమె తండ్రి? ఆ ప్రశ్నలకు బైబిలు జవాబివ్వడంలేదు. ఆ విషయం గురించి రాహేలు, లేయాలు ఏమనుకున్నా, ఆ పథకాన్నిబట్టి యాకోబు ఆ తర్వాత కోపోద్రిక్తుడయ్యాడు. యాకోబు, లాబాను కూతుళ్లతో కాదుగానీ లాబానుతోనే ఇలా వాదించాడు: “రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివి?” దానికి లాబాను ఎలా స్పందించాడు? “పెద్దదానికంటె ముందుగా చిన్నదాని నిచ్చుట మా దేశ మర్యాదకాదు. ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక ఆదికాండము 29:25-27) అలా బహుభార్యత్వ వివాహబంధపు ఉచ్చులో చిక్కుకునేలా యాకోబు మోసగించబడ్డాడు, అది ఆ కుటుంబంలో తీవ్రమైన అసూయకు కారణమైంది.
యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెనుకూడ నీకిచ్చెదను.” (సంతోషంలేని కుటుంబం
యాకోబు రాహేలును ప్రేమించాడు. లేయా రాహేలుల్లో, లేయా “ద్వేషింపబడుట” దేవుడు చూసినప్పుడు ఆయన ఆమె గర్భాన్ని తెరిచాడు, అయితే రాహేలు గొడ్రాలిగానే ఉంది. కానీ లేయా కుమారున్ని మాత్రమే కాదుగానీ, యాకోబు అనురాగాన్ని కూడా కోరుకుంది. యాకోబుకు అలాంటి అనురాగం రాహేలుపట్ల ఉన్నట్లు లేయా గమనించినప్పుడు ఆమె బాధపడింది. “ఇదిగో, ఒక కుమారుడు!” అనే అర్థమున్న పేరు పెట్టబడిన రూబేనును ఆమె ఆయన మొదటి కుమారునిగా కన్నది కాబట్టి, యాకోబు ప్రేమను తాను పొందుతానని ఆమె ఆశించింది. లేయా తన కుమారునికి ఆ పేరుపెట్టడానికి కారణముంది: “యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును.” అయితే యాకోబు ఆమెను ప్రేమించలేదు, మరో కుమారుడు పుట్టిన తర్వాత కూడా ఆయన ఆమెను ప్రేమించలేదు. లేయా ఆ కుమారునికి షిమ్యోను అనే పేరుపెట్టింది, దానికి “వినడం” అనే అర్థముంది. ఆమె ఇలా అనుకుంది: “నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికూడ నాకు దయచేసెను.”—ఆదికాండము 29:30-33.
యెహోవా ఆమె ప్రార్థనను విన్నాడంటే, ఆమె తన పరిస్థితి గురించి ప్రార్థించిందని అది తెలియజేస్తుంది. దీనినిబట్టి ఆమె నమ్మకమైన స్త్రీ అనిపిస్తుంది. అయినా, ఆమె తన మూడవ కుమారుడైన లేవిని కన్న తర్వాత కూడా మనోవేదన అనుభవించింది. ఆ పేరుకు “విశ్వసనీయత,” లేదా “హత్తుకొనుట” అనే అర్థముంది, దానిని లేయా మాటల్లో చూడవచ్చు: “తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిని.” అయితే, యాకోబు ఆమెను ఇష్టపడనట్లు కనిపిస్తుంది. బహుశా లేయా ఆ వాస్తవాన్ని అంగీకరించివుండవచ్చు, ఎందుకంటే ఆమె నాల్గవ కుమారుని పేరులో, యాకోబుతో మరింత ప్రేమపూర్వక సంబంధం ఏర్పరచుకునే విషయంలో ఆమెకున్న ఆశల గురించిన ప్రస్తావనేలేదు. బదులుగా యూదా అనే పేరు పెట్టడంలో దేవునిపట్ల ఆమెకున్న కృతజ్ఞత వ్యక్తమౌతుంది. యూదా అనే పేరుకు “స్తుతించబడడం” లేదా “స్తుతిపాత్రుడు” అని అర్థం. లేయా కేవలం ఇలా చెప్పింది: “ఈసారి యెహోవాను స్తుతించెదను.”—ఆదికాండము 29:34, 35.
లేయా మనోవేదనను అనుభవించినట్లే రాహేలు కూడా మనోవేదనను అనుభవించింది. ఆమె యాకోబును ఇలా వేడుకుంది: “నాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదను.” (ఆదికాండము 30:1) రాహేలు యాకోబు ప్రేమను పొందింది, కానీ ఆమె మాతృత్వాన్ని కోరుకుంది. లేయాకు పిల్లలున్నారు కానీ ఆమె ప్రేమను కోరుకుంది. వారిద్దరు అవతలి వ్యక్తి దగ్గరున్నదానిని కోరుకున్నారు, ఇద్దరూ సంతోషంగా జీవించలేదు. వారిద్దరూ యాకోబును ప్రేమించారు, ఆయనకు పిల్లలను కనాలని కోరుకున్నారు. వారిద్దరూ ఒకరిపట్ల ఒకరు అసూయ కనబరిచారు. ఆ కుటుంబ పరిస్థితి ఎంత బాధాకరంగా ఉందో కదా!
రాహేలుకు కూడా పిల్లలు కలిగారా?
ఆ కాలంలో గొడ్రాలిగా ఉండడాన్ని శాపంగా పరిగణించేవారు. తమ కుటుంబం నుండి వచ్చే “సంతానం” మూలంగా వంశములన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు. (ఆదికాండము 26:4; 28:14) అయినా, రాహేలుకు పిల్లలు కలుగలేదు. అలాంటి ఆశీర్వాదాల్లో ఒక పాత్ర పోషించేలా యెహోవా మాత్రమే రాహేలుకు కుమారులను ఇవ్వగలడని యాకోబు తర్కించాడు. అయినా, రాహేలు అసహనం ప్రదర్శించింది. “నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురు” అని ఆమె చెప్పింది.—ఆదికాండము 30:2, 3.
రాహేలు వైఖరిని అర్థం చేసుకోవడం మనకు కష్టంగా ఉండవచ్చు. అయితే, గొడ్రాలైన భార్య వారసుని కోసం తన భర్తకు దాసిని ఇవ్వడం ఆమోదించబడిన ఆచారమేనని మధ్య ప్రాచ్య దేశాలన్నిటిలో వెలుగుచూసిన ప్రాచీన వివాహ ఒప్పందాలు తెలియజేస్తున్నాయి. * (ఆదికాండము 16:1-3) కొన్ని సందర్భాల్లో, దాసి పిల్లలు ఆ భార్య పిల్లలుగానే పరిగణించబడతారు.
బిల్హా కుమారుణ్ణి కన్నప్పుడు సంతోషపడిన రాహేలు ఇలా అంది: “దేవుడు నాకు తీర్పు తీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెను.” ఆమె ఆ కుమారునికి “న్యాయాధిపతి” అనే అర్థమున్న దాను అనే పేరుపెట్టింది. ఆమె కూడా తన కష్టాల గురించి ప్రార్థించింది. “నా పోరాటం” అనే అర్థమున్న పేరుగల నఫ్తాలి అనే రెండవ కుమారున్ని బిల్హా కన్నప్పుడు రాహేలు ఇలా అంది: “నా అక్కతో పోరాడి గెలిచితిని!” ఆ పేర్లు, ఆ ఇద్దరి ప్రత్యర్థుల మధ్యవున్న పోరాటాన్ని సూచిస్తున్నాయి.—ఆదికాండము 30:5-8.
బిల్హాను యాకోబుకు ఇచ్చినప్పుడు తాను తన ప్రార్థనలకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నానని రాహేలు అనుకొని ఉండవచ్చు, అయితే దేవుడు ఆమెకు అలా పిల్లలను ఇవ్వదలచుకోలేదు. దీనిలో ఒక పాఠం ఉంది. మనం యెహోవాకు విన్నవించుకున్నప్పుడు మనం మన సహనం కోల్పోకుండా చూసుకోవాలి. మనం అనుకోని విధంగా,
మనం దానికోసం ఎదురుచూడని సమయంలో ఆయన మన ప్రార్థనలకు జవాబివ్వవచ్చు.ఈ విషయంలో లేయా ఏమీ తీసిపోలేదు, ఆమె కూడా తన దాసియైన జిల్పాను యాకోబుకు ఇచ్చింది. జిల్పా మొదట గాదును, తర్వాత ఆషేరును కన్నది.—ఆదికాండము 30:9-13.
లేయా కుమారుడైన రూబేనుకు దొరికిన కొన్ని పుత్రదాత వృక్షపు పండ్లకు సంబంధించిన సంఘటన, రాహేలు, లేయాల మధ్యవున్న పోటీని తెలియజేస్తుంది. ఆ పండ్లు సంతానోత్పత్తికి దోహదపడతాయని అప్పట్లో అనుకునేవారు. రాహేలు కొన్ని పండ్ల కోసం అడిగినప్పుడు, లేయా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఇలా అంది: “నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లును తీసికొందువా?” యాకోబు, లేయాకన్నా రాహేలుతోనే ఎక్కువ సమయం గడిపేవాడనీ ఆమె మాటలు తెలియజేస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. లేయా ఫిర్యాదు సరైందని బహుశా రాహేలు గ్రహించివుండవచ్చు, ఎందుకంటే ఆమె ఇలా జవాబిచ్చింది: “కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించును.” అందుకే, యాకోబు ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు లేయా ఆయనతో ఇలా అంది: “నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటిని.”—ఆదికాండము 30:15, 16.
లేయాకు ఇశ్శాఖారు అనే ఐదవ కుమారుడు, జెబూలూను అనే ఆరవ కుమారుడు పుట్టారు. ఆ తర్వాత ఆమె ఇలా చెప్పింది: “నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయును.” *—ఆదికాండము 30:17-20.
పుత్రదాత వృక్షపు పండ్లు సంతానోత్పత్తికి దోహదపడలేదు. యెహోవా ఆమెను “జ్ఞాపకము” చేసుకొని ఆమె ప్రార్థనలకు జవాబిచ్చినందుకే వివాహమైన ఆరేళ్ల తర్వాత రాహేలు చివరకు గర్భవతియై యోసేపును కన్నది. అప్పుడే రాహేలు ఇలా చెప్పగలిగింది: “దేవుడు నా నింద తొలగించెను!”—ఆదికాండము 30:22-24.
మరణం, వారసత్వం
రాహేలు తన రెండవ కుమారుడైన బెన్యామీనుకు జన్మనిస్తున్నప్పుడు మరణించింది. యాకోబు రాహేలును నిజంగా ప్రేమించాడు, ఆమె ఇద్దరు కుమారులను ప్రియంగా చూసుకున్నాడు. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత, తన మరణం దగ్గరపడినప్పుడు ఆయన తన ప్రియమైన భార్య రాహేలు అకాల మరణాన్ని గుర్తుచేసుకున్నాడు. (ఆదికాండము 30:1; 35:16-19; 48:7) లేయా మరణం విషయానికొస్తే, యాకోబు ఆమెను, తాను కూడా సమాధి చేయబడాలనుకున్న గుహలో పాతిపెట్టాడని మాత్రమే మనకు తెలుసు.—ఆదికాండము 49:29-32.
యాకోబు తన కుటుంబ వ్యవహారాలతోపాటు తన జీవితం వేదనాభరితంగా ఉన్నట్లు తన ముసలితనంలో అంగీకరించాడు. (ఆదికాండము 47:9) లేయా, రాహేలుల జీవితం కూడా వేదనాభరితంగా ఉందనడంలో సందేహమేలేదు. వారి అనుభవాలు, బహుభార్యత్వంవల్ల కలిగే బాధాకరమైన పర్యావసానాలను నొక్కిచెప్పి, ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలనే ఆజ్ఞను దేవుడు ఎందుకు స్థాపించాడో ఉదాహరిస్తాయి. (మత్తయి 19:4-8; 1 తిమోతి 3:2, 12) భర్త లేక భార్య తన ప్రణయాత్మక లేక లైంగిక విషయాలు కేవలం ఒక వ్యక్తికే అంటే తన భాగస్వామికే పరిమితం చేయకపోవడం అసూయకు కారణమౌతుంది. దేవుడు జారత్వాన్ని, వ్యభిచారాన్ని నిషేధించడానికి అది ఒక కారణం.—1 కొరింథీయులు 6:18; హెబ్రీయులు 13:4.
ఏదేమైనా, అపరిపూర్ణతలున్నా, నమ్మకస్థులుగా ఉన్న స్త్రీపురుషులను తన సంకల్పం నెరవేర్చుకోవడానికి దేవుడు ఉపయోగించాడు, ఇప్పటికీ ఉపయోగిస్తున్నాడు. ఆ అక్కాచెల్లెళ్లిద్దరికీ మనకున్నట్లే బలహీనతలు ఉన్నాయి. అయితే ఆ స్త్రీల మూలంగా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని యెహోవా నెరవేర్చడం మొదలుపెట్టాడు. అందుకే, రాహేలు, లేయాలు “ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిరి” అని చెప్పబడింది.—రూతు 4:11.
[అధస్సూచీలు]
^ పేరా 15 ఇరాక్‌లోని నోజీ ప్రాంతానికి చెందిన అలాంటి ఒక ఒప్పందంలో ఇలా ఉంది: “కీలీమ్-నీనోను షెనీమాకు పెళ్లి జరిగింది. . . . కీలీమ్-నీనో [పిల్లలను] కనకపోతే, కీలీమ్-నీనో లూలూ ప్రాంతానికి చెందిన స్త్రీని [దాసిని] షెనీమాకు భార్యగా ఇస్తుంది.”
^ పేరా 20 లేయాకు కలిగిన పిల్లల్లో దీనా కూడా ఉంది, యాకోబు కూతుళ్లలో మనకు ఆమె పేరే తెలుసు.—ఆదికాండము 30:21; 46:7.
[9వ పేజీలోని చిత్రం]
లేయా, రాహేలులు అవతలి వ్యక్తి దగ్గరున్న వాటిని కోరుకున్నారు, ఇద్దరూ సంతోషంగా జీవించలేదు
[10వ పేజీలోని చిత్రం]
యాకోబు పన్నెండుమంది కుమారుల నుండి ఇశ్రాయేలు జనాంగం వచ్చింది