కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎల్లకాలం జీవించవచ్చు

మీరు ఎల్లకాలం జీవించవచ్చు

మీరు ఎల్లకాలం జీవించవచ్చు

ప్రపంచ మతాలకు చెందిన విశ్వాసుల్లో అత్యధికులు ఎలాగైనా ఎల్లకాలం జీవించే అవకాశాన్ని విలువైనదిగా పరిగణిస్తారు. ఒక్కో మతం ఒక్కో విధంగా వివరించినా నిరీక్షణ మాత్రం ప్రాథమికంగా ఒక్కటే, అదేమిటంటే, మరణ భయం లేకుండా మంచి పరిస్థితుల్లో సంతోషంగా జీవించడమనేదే. మీరు కోరుకునేది కూడా అదే కాదా? అలాంటి నమ్మకాలు అన్ని మతాల్లోనూ ఉన్నాయంటే దాని భావమేమిటి? ఎల్లకాలం జీవించాలనే కోరిక ఏనాటికైనా తీరుతుందా?

ఎల్లకాలం జీవించాలన్న కోరికను సృష్టికర్త మానవుల్లో ఆది నుండే, అంటే తాను మొదటి మానవ జంటను సృష్టించినప్పుడే వారి హృదయంలో నాటాడని లేఖనాలు సూచిస్తున్నాయి. “[దేవుడు] శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు” అని బైబిలు చెబుతోంది.​—⁠ప్రసంగి 3:​11.

అయితే, ఎల్లకాలం జీవించాలనే తమ కోరికను తీర్చుకోవడానికి, ఆ మొదటి మానవ జంట తప్పేదో ఒప్పేదో నిర్ణయించే దేవుని అధికారాన్ని అంగీకరించాలి. వారలా అంగీకరించివుంటే, యెహోవా తాను వారికోసం సిద్ధంచేసిన గృహమైన ఏదెను తోటలో వారు ‘శాశ్వతకాలం’ జీవించడానికి అర్హులని నిర్ణయించి ఉండేవాడు.​—⁠ఆదికాండము 2:⁠8; 3:​22.

ఎల్లకాలం జీవించే అవకాశం చేజారిపోయింది

దేవుడు తోటలో “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును” నాటి, దాని ఫలములు తినవద్దని ఆదాము హవ్వలకు ఆజ్ఞాపించాడనే కాక, వాటిని తింటే చనిపోతారని కూడా ఆయన చెప్పాడని బైబిలు వృత్తాంతం చూపిస్తోంది. (ఆదికాండము 2:​9, 17) ఆదాముహవ్వలు ఆ పండు తినకుండా ఉండడం, వారు ఆయన అధికారాన్ని అంగీకరిస్తున్నారని చూపిస్తుంది. దానికి భిన్నంగా ఆ చెట్టు పండు తినడం, వారు దేవుని అధికారాన్ని నిరాకరిస్తున్నారని సూచిస్తుంది. ఆదాముహవ్వలు యెహోవా ఉపదేశాలను వినకుండా, దేవుని అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆత్మప్రాణియైన సాతాను పక్షం వహించారు. తత్ఫలితంగా, ఆదాముహవ్వలు ఎల్లకాలం జీవించేందుకు అర్హులు కారని దేవుడు న్యాయంగానే నిర్ణయించాడు.​—⁠ఆదికాండము 3:​1-6.

దేవుడు జీవాన్ని లేదా మరణాన్ని అంటే ఉనికిలో ఉండడాన్ని లేదా ఉనికిలో లేకపోవడాన్ని వారి ముందుంచాడు. అవిధేయత ఫలితం మరణం, అంటే వారు పూర్తిగా ఉనికిలో లేకుండాపోతారు. అదాముహవ్వలు గానీ వారి సంతానం గానీ ఏదో దివ్యౌషధం ద్వారానో అమర్త్యమైన ఆత్మ ద్వారానో ఎల్లకాలం జీవించడం సాధ్యంకాదు. *

ఆదాము తిరుగుబాటు మూలంగా ఆయన సంతానమంతా బాధపడవలసి వచ్చింది. దాని పర్యవసానాలను వివరిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”​—⁠రోమీయులు 5:​12.

ఎల్లకాలం జీవించడం మళ్ళీ సాధ్యం

అపొస్తలుడైన పౌలు ఆదాము సంతానపు స్థితిని మొదటి శతాబ్దపు దాసుని స్థితితో పోల్చి దాన్ని సోదాహరణంగా వివరించాడు. వారసత్వంగా లభించిన పాపం మూలంగా ఆదాముహవ్వల పిల్లలు, తప్పించుకోలేని విధంగా, చనిపోయేవారిగా “పాపమునకు దాసు[లుగా]” జన్మించారు. (రోమీయులు 5:​12; 6:​16, 17) యెహోవా న్యాయబద్ధమైన పరిష్కారం ఏర్పాటుచేసి ఉండకపోతే ఆదాముహవ్వల సంతానం తప్పించుకోవడం సాధ్యమయ్యేది కాదు. పౌలు ఇలా వివరించాడు: “తీర్పు, [ఆదాము చేసిన] ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.” ఆ “పుణ్యకార్యము” చేయడానికి యేసు తన మానవ జీవితాన్ని “అందరికొరకు విమోచన క్రయధనముగా” అర్పించాడు. “శిక్షావిధి” యొక్క “తీర్పు” నుండి మానవజాతిని విడుదల చేయడానికి విమోచన క్రయధనానికున్న న్యాయబద్ధమైన శక్తిని యెహోవా గుర్తించాడు.​—⁠రోమీయులు 5:​16, 18, 19; 1 తిమోతి 2:​5, 6.

అందుకే శాస్త్రజ్ఞులు మానవుని జన్యు సంకేతంలో నిరంతర జీవితపు కీలకాన్ని ఎన్నటికీ కనుగొనలేరు, ఆ కీలకం మరోచోట ఉంది. బైబిలు చెబుతున్నదాని ప్రకారం, మానవజాతి మరణానికి మూలకారణం నైతికతకు, న్యాయానికి సంబంధించింది, అంతేగాని జన్యుపరమైంది కాదు. కాబట్టి ఎల్లకాలం జీవించగలిగే సాధ్యతను పునఃస్థాపించే మార్గం అంటే యేసు విమోచన క్రయధన బలి ఆ మేరకు న్యాయబద్ధమైనదే. అలాగే విమోచన క్రయధనం దేవుని నీతిని, కృపను కూడా ప్రదర్శించింది. అయితే విమోచన క్రయధనం నుండి ఎవరు ప్రయోజనం పొంది, ఎల్లకాలం జీవించగలుగుతారు?

అమర్త్యంగా జీవించే బహుమానం

యెహోవా దేవుడు “యుగయుగముల” నుండి ఉన్నాడు. ఆయన అమర్త్యుడు. (కీర్తన 90:⁠2) అమర్త్యంగా జీవించడమనే బహుమానాన్ని యెహోవా మొదటిగా యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: ‘మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు, మరణానికి ఇక ఆయనమీద ప్రభుత్వము లేదు.’ (రోమీయులు 6:​8) వాస్తవానికి, పునరుత్థానం చేయబడిన యేసుకు, భూపరిపాలకులకు మధ్యవున్న వ్యత్యాసాన్ని చూపిస్తూ, వారిలో ఎల్లకాలం జీవించగల ఏకైక వ్యక్తి ఆయనే అని పౌలు వర్ణిస్తున్నాడు. యేసు “నిరంతరము” సజీవంగా ఉంటాడు. ఆయన “నాశనము” కాడు.​—⁠హెబ్రీయులు 7:​15-17, 23-25; 1 తిమోతి 6:​15, 16.

అలాంటి బహుమానాన్ని అందుకునేది యేసు మాత్రమే కాదు. పరలోక మహిమలో రాజులుగా పరిపాలించడానికి ఎంచుకోబడిన ఆత్మాభిషిక్త క్రైస్తవులు కూడా యేసు పొందినలాంటి పునరుత్థానాన్నే పొందుతారు. (రోమీయులు 6:⁠5) ఈ ఆధిక్యత 1,44,000 మందికి అనుగ్రహించబడిందని అపొస్తలుడైన యోహాను వివరిస్తున్నాడు. (ప్రకటన 14:⁠1) వాళ్ళు కూడా ఎల్లకాలం జీవించే బహుమానాన్ని అందుకుంటారు. వారి పునరుత్థానం గురించి పౌలు ఇలా చెబుతున్నాడు: “రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; . . . బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది.” అలాంటి పునరుత్థానం పొందేవారిమీద మరణానికి ఇక ఏ అధికారమూ ఉండదు.​—⁠1 కొరింథీయులు 15:​50-53; ప్రకటన 20:⁠6.

ఈ దైవిక ప్రకటన నిజంగా గమనార్హమైనది. దేవదూతలు ఆత్మ ప్రాణులైనప్పటికీ వారు అమర్త్యంగా జీవించేలా సృష్టించబడలేదు. తిరుగుబాటులో సాతానుతో చేతులు కలిపిన ఆత్మప్రాణులకు మరణశిక్ష విధించబడుతుందనే వాస్తవం దీన్ని స్పష్టంచేస్తోంది. (మత్తయి 25:​41) కానీ, యేసు సహపరిపాలకులు అమర్త్యంగా జీవించే బహుమానాన్ని అందుకుంటారు, వారి విశ్వాస్యతపై యెహోవాకున్న అచంచలమైన నమ్మకానికి అది నిదర్శనం.

ఇంతవరకు జీవించిన కోటానుకోట్ల మానవులతో పోలిస్తే ఎంతో తక్కువ సంఖ్యలోవున్న 1,44,000 మంది మాత్రమే ఎల్లకాలం జీవిస్తారని దీని భావమా? కాదు. ఎందుకు కాదో మనం చూద్దాం.

పరదైసు భూమ్మీద ఎల్లకాలం జీవించడం

బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథం, పరదైసు భూమ్మీద ఎల్లకాలం జీవించే అవకాశం ఇవ్వబడిన అసంఖ్యాక ప్రజల సమూహాన్ని గురించిన అందమైన దృశ్యాన్ని వర్ణిస్తోంది. మరణించి పునరుత్థానం చేయబడి, తిరిగి పూర్తి యౌవనారోగ్యాన్ని, బలాన్ని పొందినవారు కూడా వారితోపాటు ఉన్నారు. (ప్రకటన 7:⁠9; 20:​12, 13; 21:​3, 4) వారు ‘దేవుని సింహాసనమునొద్దనుండి ప్రవహిస్తున్న, స్ఫటికమువలే మెరయునట్టి జీవజలముల నది’ దగ్గరికి నడిపించబడతారు. దాని ఒడ్డున ‘జీవవృక్షములున్నవి. ఆ వృక్షముల ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించబడును.’ యెహోవా దేవుడు ఇస్తున్న దయాపూర్వక ఆహ్వానం ఇలా ఉంది: “దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.”​—⁠ప్రకటన 22:​1, 2, 17.

ఈ వృక్షాలు, జలములు శతాబ్దాల క్రితం రసాయనశాస్త్ర పరిశోధకులు వెదికిన దివ్యౌషధమో, అన్వేషకులు అన్వేషించిన యౌవనపు జలధారో కావు. కానీ అవి, మానవజాతిని మునుపటి పరిపూర్ణ స్థితికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన ఏర్పాట్లకు ప్రాతినిధ్యం వహిస్తాయి.

విధేయులైన మానవజాతికి భూమ్మీద ఎల్లకాలం జీవించే అవకాశాన్ని ఇవ్వాలన్న దేవుని సంకల్పం ఇప్పటికీ మారలేదు. యెహోవా యథార్థవంతుడు కాబట్టి ఆ సంకల్పం నెరవేర్చబడుతుంది. కీర్తన 37:⁠29 ఇలా చెబుతోంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.” ఈ వాగ్దానం మనల్ని, పరలోకంలో అమర్త్యతా బహుమానం అనుగ్రహించబడిన వారిని ఇలా ప్రకటించడానికి పురికొల్పుతుంది: “ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు?”​—⁠ప్రకటన 15:​3, 4.

ఎల్లకాలం జీవించడమనే అమూల్యమైన బహుమానాన్ని పొందాలని మీరు కోరుకుంటున్నారా? అలాగైతే, మీరు “యుగములకు రాజు”పట్ల యథార్థంగా, విధేయంగా ఉన్నట్లు నిరూపించుకోవాలి. మీరు యెహోవా గురించి, అలాంటి జీవితం ఎవరి ద్వారా సాధ్యం చేయబడిందో ఆ యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. తప్పొప్పుల విషయంలో దేవుని ప్రమాణాలను అంగీకరించడానికి ఇష్టపడే వారందరికీ ఎల్లకాలం జీవించడం లేదా “నిత్యజీవము” అనే బహుమానం అనుగ్రహించబడుతుంది.​—⁠యోహాను 17:⁠3.

[అధస్సూచి]

^ పేరా 7 మరణం తర్వాత ఏమి జరుగుతుందనే బోధ గురించిన పూర్తి చర్చ కోసం దయచేసి, యెహోవాసాక్షులు ప్రచురించిన మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం) అనే బ్రోషుర్‌ను చూడండి.

[5వ పేజీలోని బాక్సు/చిత్రం]

చెక్కుచెదరని కల

సా.శ.పూ. రెండవ సహస్రాబ్దికి చెందినదని భావించబడుతున్న, మెసొపొతమియాకు చెందిన సాహసగాథ అయిన గిల్గమేష్‌ పురాణగాథ, కథానాయకుడు నిరంతర యౌవనం కోసం అన్వేషించడాన్ని వర్ణిస్తుంది. ప్రాచీన ఐగుప్తీయులు ఆత్మలు అమర్త్యమైనవని విశ్వసిస్తూ అవి తిరిగి తమ శరీరాలను ఉపయోగించుకోగలుగుతాయనే తలంపుతో వారి మృత శరీరాలకు సుగంధద్రవ్యాలు పూసి భద్రపరిచేవారు. అందుకే, ఐగుప్తీయుల సమాధులు కొన్ని, మరణానంతర జీవితం అనబడే జీవితంలో మృతులకు అవసరమయ్యే సమస్త వస్తువులతో నింపబడేవి.

చైనీయుల రసాయనశాస్త్ర పరిశోధకుల మధ్య భౌతిక అమర్త్యత అనే నమ్మకం కనీసం సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దం నుండి, దివ్యౌషధాల ద్వారా దాన్ని పొందడం సాధ్యమనే నమ్మకం సా.శ.పూ. నాలుగవ శతాబ్దం నుండి ఉన్నట్లు కనబడుతోంది. మధ్యయుగాలనాటి, యూరప్‌కు, అరేబియాకు చెందిన రసాయనశాస్త్ర పరిశోధకులు దివ్యౌషధాల కోసం వెదికారు, తమ సొంత ఔషధ మిశ్రమాలను తయారుచేసుకోవడానికి ప్రయత్నించారు. అలాంటి కొన్ని ఔషధ మిశ్రమాల్లో పాషాణం, పాదరసం, గంధకం వంటి లవణాలు ఉండేవి. ఈ మిశ్రమాల విషప్రభావంతో ఎంతమంది మరణించారో ఎవరికి తెలుసు!

ఒకప్పుడు, యౌవనపు జలధార అని పిలువబడే దాని గురించిన పురాణగాధలు కూడా విస్తృతంగా వ్యాపించాయి, ఈ జలధారలో నుండి త్రాగిన వారికి తిరిగి బలం చేకూర్చబడుతుందని చెప్పబడుతుంది.

[7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ఎల్లకాలం జీవించడం​—⁠విసుగు పుట్టిస్తుందా?

ఎల్లకాలం జీవించడమనేది పదేపదే ఒకే విధంగా అర్థరహితమైన విషయాల్లో సమయాన్ని గడపడంతో సమానమని, అది విసుగు పుట్టిస్తుందని కొందరు అంటారు. బహుశా వారు ప్రస్తుత జీవనవిధానాలు, పరిస్థితులు ఎప్పటికీ అలాగే కొనసాగుతాయని అనుకుంటుండవచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు చాలామందికి విసుగుపుట్టించేవిగానే, అర్థరహితమైనవిగానే ఉన్నాయి. అయితే, తాను పునఃస్థాపించే పరదైసులో మానవుడు ‘బహు క్షేమము కలిగి సుఖిస్తాడు’ అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 37:​11) అలాంటి జీవితం మానవజాతికి యెహోవా సృష్టి గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఇప్పుడు మనం కేవలం కలలు కనే అద్భుతమైన నైపుణ్యాల్లో, అధ్యయనాల్లో, వృత్తుల్లో వేటినైనా లేక అన్నింటినీ వృద్ధిచేసుకోవడానికి సమయాన్ని వెచ్చించే అవకాశాన్నిస్తుంది.

కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన, జీవితాయుష్షును పొడిగించడానికి పరిశోధనలు చేస్తున్న జన్యుశాస్త్రవేత్త డాక్టర్‌ ఓబ్రీ డి గ్రే ఇలా పేర్కొన్నాడు: “మంచి విద్య, దాన్ని ఉపయోగించుకోవడానికి సమయం, ఉన్న ప్రజలు నేడు ఎన్నడూ విసుగుచెందరు, వారు తాము చేయాలనుకునే క్రొత్త విషయాలకు కొదువ ఉంటుందని ఎన్నడూ అనుకోరు.” అంతేగాక, దేవుని ప్రేరేపిత వాక్యం ఇలా చెబుతోంది: “దేవుడు చేయు క్రియలను” మానవజాతి ఎన్నటికీ “పరిశీలనగా తెలిసికొన[లేదు].”​—⁠ప్రసంగి 3:​11.