సామెతల గ్రంథములోని ముఖ్యాంశాలు
యెహోవా వాక్యము సజీవమైనది
సామెతల గ్రంథములోని ముఖ్యాంశాలు
ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన రాజైన సొలొమోను “మూడు వేల సామెతలు” చెప్పాడు. (1 రాజులు 4:32) ఆయన చెప్పిన జ్ఞానయుక్తమైన మాటల్ని తెలుసుకునే అవకాశం మనకుందా? ఉంది. సొలొమోను చెప్పిన సామెతల్లో అనేకం బైబిల్లోని సామెతల గ్రంథములో ఉన్నాయి, ఈ గ్రంథం దాదాపు సా.శ.పూ. 717లో పూర్తి చేయబడింది. చివరి రెండు అధ్యాయాలను మాత్రమే వేరే వాళ్ళు వ్రాశారు, వాళ్ళెవరంటే, యాకె కుమారుడైన ఆగూరు, లెమూయేలు రాజు. అయితే, లెమూయేలు అనేది సొలొమోనుకు మరో పేరు అని కొందరు నమ్ముతారు.
సామెతల గ్రంథములో సమకూర్చబడివున్న ప్రేరేపిత మాటల సంకల్పమేమిటంటే, ‘జ్ఞానమును, ఉపదేశమును అభ్యసించడం.’ (సామెతలు 1:2) ఇవి మనం జ్ఞానమును సంపాదించుకోవడానికి సహాయం చేస్తాయి, జ్ఞానమంటే విషయాలను స్పష్టంగా చూసి, సమస్యలను పరిష్కరించడానికి తెలివిని అన్వయించుకోగల సామర్థ్యం. వాటి ద్వారా మనం క్రమశిక్షణను, నైతిక తర్ఫీదును కూడా పొందుతాము. ఈ సామెతలకు అవధానమివ్వడం, వాటి ఉపదేశాన్ని అనుసరించడం మన హృదయంపై ప్రభావం చూపించి, మన సంతోషానికి దోహదపడి, మనం విజయం సాధించడానికి నడిపిస్తుంది.—హెబ్రీయులు 4:12.
‘జ్ఞానము సంపాదించుకోండి, ఉపదేశమును గట్టిగా పట్టుకోండి’
“జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 1:20) బిగ్గరగా, స్పష్టంగా ఉన్న దాని స్వరాన్ని మనమెందుకు వినాలి? జ్ఞానము సంపాదించుకోవడం ద్వారా కలిగే అనేక ప్రయోజనాల గురించి రెండవ అధ్యాయం తెలియజేస్తుంది. యెహోవాతో సన్నిహితత్వాన్ని ఎలా సంపాదించుకోవాలో మూడవ అధ్యాయంలో చర్చించబడింది. తర్వాత సొలొమోను ఇలా చెబుతున్నాడు: “జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము.”—సామెతలు 4:7, 13.
ఈ లోకపు అనైతిక మార్గాలను తిరస్కరించడానికి మనకు ఏమి సహాయం చేస్తుంది? సామెతల గ్రంథములోని ఐదవ అధ్యాయం దానికి సమాధానమిస్తుంది: ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించండి, ఈ లోకపు మోసపూరిత మార్గాలను గుర్తించండి. లైంగిక దుర్నీతికి పాల్పడడంవల్ల కలిగే ప్రతికూల పర్యవసానాల గురించి
కూడా ఆలోచించండి. తర్వాతి అధ్యాయం యెహోవాతో మన సంబంధాన్ని ప్రమాదంలో పడేసే ఆచారాల గురించి, దృక్పథాల గురించి హెచ్చరిస్తుంది. లైంగిక దుర్నీతికి పాల్పడే వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడో ఏడవ అధ్యాయం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎనిమిదవ అధ్యాయంలో, జ్ఞానము యొక్క విలువ, అది చేస్తున్న విన్నపం చక్కగా వర్ణించబడ్డాయి. ఇంతవరకు చర్చించబడిన సామెతలకు ప్రేరణాత్మక ముగింపుగా ఉన్న తొమ్మిదవ అధ్యాయం, జ్ఞానం సంపాదించుకోవడానికి మనల్ని పురికొల్పే ఉత్తేజభరితమైన ఉపమానంగా ఇవ్వబడింది.లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
1:7; 9:10—యెహోవాయందు భయభక్తులు కలిగివుండడం ఎలా “తెలివికి మూలము” మరియు “జ్ఞానమునకు మూలము”? యెహోవాయందు భయము లేకుండా తెలివి కలిగివుండడం సాధ్యంకాదు, ఎందుకంటే ఆయన అన్నిటి సృష్టికర్త, లేఖనాల రచయిత. (రోమీయులు 1:20; 2 తిమోతి 3:16, 17) ఆయనే నిజమైన తెలివికి మూలం. కాబట్టి, యెహోవాపట్ల భక్తిపూర్వక భయంతోనే తెలివి ప్రారంభమవుతుంది. దేవునిపట్ల భయం జ్ఞానానికి కూడా మూలం ఎందుకంటే తెలివి లేకుండా జ్ఞానము కలిగివుండడం సాధ్యంకాదు. అంతేగాక, యెహోవాపట్ల భయంలేని వ్యక్తి తనకున్న ఏకాస్త జ్ఞానాన్నైనా సృష్టికర్తను ఘనపర్చడానికి ఉపయోగించడు.
5:3—జార స్త్రీ, నూతనలోక అనువాదములో “అన్యురాలు” అని ఎందుకు పిలువబడుతోంది? సామెతలు 2:16, 17 వచనాలు, “అన్యురాలు” అంటే “తన దేవుని నిబంధనను మరచునది” అని వర్ణిస్తున్నాయి. జార స్త్రీతో సహా, అబద్ధ దేవుళ్ళను ఆరాధిస్తున్న లేక మోషే ధర్మశాస్త్రాన్ని అలక్ష్యం చేస్తున్న వారెవరైనా సరే అన్యులని పిలువబడేవారు.—యిర్మీయా 2:25; 3:13.
7:1, 2—‘నా మాటల్లో,’ ‘నా ఆజ్ఞల్లో’ ఏమేమి ఇమిడివున్నాయి? వీటిలో బైబిలు బోధలతోపాటు, కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు పెట్టే నియమాలు లేక కట్టడలు ఇమిడివున్నాయి. పిల్లలు వీటికి, అలాగే తమ తల్లిదండ్రుల నుండి లభించే లేఖనాధారిత బోధలకు కట్టుబడివుండాలి.
8:30—“ప్రధానశిల్పి” ఎవరు? వ్యక్తిగా చిత్రీకరించబడిన జ్ఞానము తనను తాను ప్రధానశిల్పిగా పిలుచుకుంటోంది. జ్ఞానము ఇలా వ్యక్తిగా చిత్రీకరించబడడం, జ్ఞానము యొక్క లక్షణాలను అభివర్ణించడానికి ఒక సాహిత్య ఉపకరణంగా తోడ్పడడంకన్నా దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు తన మానవపూర్వ ఉనికిలో ఉండడాన్ని అలంకారార్థంగా సూచిస్తుంది. ఆయన భూమ్మీద మానవునిగా జన్మించడానికి ఎంతో పూర్వం, ‘దేవుని సృష్ట్యారంభముగా’ కలుగజేయబడ్డాడు. (సామెతలు 8:22) “ప్రధానశిల్పి”గా ఆయన అన్నిటినీ సృష్టించడంలో తన తండ్రితో కలిసి చురుకుగా పనిచేశాడు.—కొలొస్సయులు 1:15-17.
9:17—“దొంగిలించిన నీళ్లు” అంటే ఏమిటి, అవి ఎందుకు “తీపి”గా ఉన్నాయి? బైబిలు, వివాహబంధంలో లైంగిక సంబంధాన్ని సేదదీర్చే బావిలోని నీటితో పోలుస్తుంది కాబట్టి, దొంగిలించిన నీళ్ళు రహస్యమైన అనైతిక లైంగిక సంబంధాలను సూచిస్తాయి. (సామెతలు 5:15-17) తప్పుచేసి దొరక్కుండా తప్పించుకోవాలనే ఆలోచన, అలాంటి నీళ్లు తియ్యగా ఉన్నట్లు అనిపించేలా చేస్తుండవచ్చు.
మనకు పాఠాలు:
1:10-14. పాపులు సంపదల గురించి చేసే వాగ్దానాల ద్వారా వారు మనల్ని తమ చెడు మార్గాల్లో చిక్కుకుపోయేలా చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి.
3:3. మనం దయను, సత్యమును ఎంతో విలువైనవిగా పరిగణించాలి, మనం ఖరీదైన కంఠభూషణమును ధరించినట్లు వాటిని అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. ఈ లక్షణాలను మనం మన హృదయం మీద వ్రాసుకుని వాటిని మనలో ఒక భాగంగా చేసుకోవాలి.
4:18. ఆధ్యాత్మిక జ్ఞానం క్రమేణా వృద్ధి చెందుతుంది. వెలుగులోనే ఉండాలంటే మనం వినయాన్ని, సాత్వికాన్ని ప్రదర్శించడంలో కొనసాగాలి.
5:8. మనం దుర్నీతికరమైన ప్రభావాలన్నిటికీ, అవి సంగీతం, వినోదం, ఇంటర్నెట్, పుస్తకాలు లేక పత్రికల వంటి ఏ మూలం నుండి వచ్చినా వాటికి దూరంగా ఉండాలి.
5:21. యెహోవాను ప్రేమించే వ్యక్తి క్షణికానందం కోసం సత్యదేవునితో తనకున్న మంచి సంబంధాన్ని పాడుచేసుకుంటాడా? ఎంతమాత్రం చేసుకోడు! నైతిక స్వచ్ఛతను కాపాడుకోవడానికి బలమైన ప్రేరణ, యెహోవా మన మార్గాలన్నిటిని చూస్తాడనీ, మనల్ని జవాబుదారులుగా ఎంచుతాడనీ తెలుసుకొని ఉండడమే.
6:1-5. ఈ వచనాల్లో, ఇతరుల పక్షాన ‘పూటపడడం’ గురించి లేక జ్ఞానరహితమైన ఆర్థిక ఒప్పందం చేసుకోవడం గురించి జాగ్రత్త వహించమని ఎంత చక్కని ఉపదేశం ఇవ్వబడిందో కదా! నిశితంగా పరిశీలించిన తర్వాత, మనం తీసుకున్న చర్య జ్ఞానరహితమైనదిగా అనిపిస్తే, ఆలస్యం
చేయకుండా మనం పదే పదే అడుగుతూ ‘మనం మన చెలికానిని బలవంతము చేయాలి,’ పరిస్థితులను సరిచేసుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయాలి.6:16-19. ఈ ఏడు ప్రాథమిక రకాల్లో దాదాపు ప్రతి విధమైన తప్పిదం ఇమిడివుంది. వీటిపట్ల మనం ద్వేషాన్ని పెంచుకోవాలి.
6:20-24. లేఖనాధారిత పెంపకం లైంగిక దుర్నీతి అనే ఉరిలో చిక్కుకోకుండా ఒకరిని కాపాడగలదు. అలాంటి తర్ఫీదునివ్వడాన్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు.
7:4. మనం జ్ఞానముపట్ల, తెలివిపట్ల అభిమానాన్ని పెంచుకోవాలి.
మనకు నిర్దేశమిచ్చేందుకు వివిధ సామెతలు
సొలొమోను సామెతల్లోని మిగతా భాగం సంక్షిప్తంగా చెప్పబడిన వివిధ సామెతలు. అవి ముఖ్యంగా వైరుధ్యాలుగా, సమాంతరాలుగా, పోలికలుగా అందజేయబడ్డాయి, అవి ప్రవర్తన, సంభాషణ, దృక్పథాల విషయంలో శక్తివంతమైన పాఠాలు అందజేస్తాయి.
పది నుండి 24 వరకున్న అధ్యాయాలు యెహోవాపట్ల ఉండవలసిన భక్తిపూర్వక భయం యొక్క విలువను నొక్కిచెబుతాయి. 25 నుండి 29 వరకున్న అధ్యాయాలను “యూదారాజైన హిజ్కియా సేవకులు” ఎత్తివ్రాశారు. (సామెతలు 25:1) ఈ సామెతలు యెహోవాపై ఆధారపడడాన్ని, ఇతర ఆవశ్యకమైన పాఠాలను బోధిస్తాయి.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
10:6—“బలాత్కారము భక్తిహీనుని నోరు” ఎలా “మూసివేయును”? భక్తిహీనులు తమ తియ్యని మాటలతో, ఇతరులకు హాని చేయాలన్న తమ దుష్ట తలంపును మరుగుచేస్తారన్న భావంలో చెప్పబడివుండవచ్చు. లేదా భక్తిహీనులపట్ల సాధారణంగా వైరీభావం ప్రదర్శించబడుతుంది కాబట్టి, వారికి ఇతరుల నుండి ఎదురయ్యే వ్యతిరేకత వాళ్ళ నోరు మూయించవచ్చు.
10:10—“కనుసైగ” చేసేవాడు ఎలా వ్యధ పుట్టిస్తాడు? “పనికిమాలినవాడు” కేవలం “కుటిలమైన మాటలు” పలకడమే కాదు “కనుసైగ” చేయడం వంటి చేష్టలతో తన ఉద్దేశాలను మరుగుచేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. (సామెతలు 6:12, 13) ఈ విధమైన మోసంవల్ల, అతనిచేత బాధించబడుతున్న వ్యక్తికి ఎంతో మానసిక వ్యధ కలగవచ్చు.
10:29—“యెహోవా యేర్పాటు” అంటే ఏమిటి? ఇక్కడ మనం అనుసరించవలసిన జీవన విధానం గురించి కాదు గానీ యెహోవా మానవులతో వ్యవహరించే విధానం గురించి చెప్పబడింది. మానవులతో దేవుని వ్యవహారాలు నిర్దోషులకు భద్రతను, దుష్టులకు నాశనాన్ని సూచిస్తాయి.
11:31—నీతిమంతుల కంటే భక్తిహీనులు నిశ్చయంగా ప్రతిఫలం ఎందుకు పొందాలి? ఇక్కడ ప్రతిఫలం అనేది ఒక్కొక్కరికి లభించే శిక్షా స్థాయినిబట్టి కొలవబడుతోంది. నీతిమంతుడు తప్పు చేస్తే, ఆయన తన తప్పులనుబట్టి క్రమశిక్షణను ప్రతిఫలంగా పొందుతాడు. దుష్టుడు ఉద్దేశపూర్వకంగా పాపాలు చేస్తూ, మంచి చేసేందుకు నిరాకరిస్తాడు. కాబట్టి అతడు తీవ్రమైన శిక్షకు అర్హుడేకాక, ఆ శిక్షను పొందుతాడు.
12:23—ఎవరైనా తమ ‘విద్యను’ ఎలా ‘దాచిపెడతారు’? విద్యను దాచిపెట్టడం అంటే వారు దాన్ని అసలు ప్రదర్శించరని కాదు. బదులుగా, ప్రగల్భాలు పలకడం ద్వారా దాన్ని ఆడంబరంగా చూపించకుండా జ్ఞానయుక్తంగా ప్రదర్శిస్తారని అర్థం.
18:19—“బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశపరచుకొనుట” ఎందుకు “కష్టతరము”? ముట్టడి క్రింద ఉన్న బలమైన పట్టణంలా, అలాంటి వ్యక్తి తప్పును క్షమించడానికి బొత్తిగా నిరాకరిస్తుండవచ్చు. అతడికి, తప్పిదస్థుడికి మధ్యవున్న వివాదాలు సులభంగా, “నగరు తలుపుల అడ్డగడియల” వలే అడ్డంకులుగా తయారుకావచ్చు.
మనకు పాఠాలు:
10:11-14. మన మాటలు ప్రోత్సాహకరమైనవిగా ఉండాలంటే మన మనసు ఖచ్చితమైన జ్ఞానముతో నిండివుండాలి, మన హృదయం ప్రేమతో పురికొల్పబడాలి, మన నోటి మాటలను జ్ఞానము నిర్దేశించాలి.
10:19; 12:18; 13:3; 15:28; 17:28. మనం మాట్లాడేముందు ఆలోచించాలి, అధికంగా మాట్లాడకూడదు.
11:1; 16:11; 20:10, 23. మనం మన వ్యాపార వ్యవహారాల్లో నిజాయితీగా ఉండాలని యెహోవా కోరుతున్నాడు.
11:4. వ్యక్తిగత బైబిలు అధ్యయనం, కూటాలకు హాజరవడం, ప్రార్థన, క్షేత్రపరిచర్య వంటివాటిని నిర్లక్ష్యం చేస్తూ వస్తుసంపదలు సంపాదించుకోవడానికి ప్రయాసపడడం మూర్ఖత్వం.
13:4. సంఘంలో బాధ్యతాయుతమైన స్థానం, నూతనలోకంలో జీవితం కావాలని ‘ఆశపడడం’ మాత్రమే సరిపోదు. మనం కష్టపడి పనిచేసేవారిగా ఉండాలి, అవసరమైన అర్హతలు సంపాదించుకోవడానికి తీవ్రంగా కృషి చేయాలి.
13:24; 29:15, 21. ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగారాబం చేయరు, వాళ్ళ లోపాలను చూసీచూడనట్లు విడిచిపెట్టరు. బదులుగా, తల్లి లేక తండ్రి అలాంటి లోపాలు లోతుగా నాటుకుపోకముందే వాటిని పెకిలించివేయడానికి తగిన చర్యలు తీసుకుంటారు.
14:10. మన అంతర్గత భావాలను మనం అన్నివేళలా ఖచ్చితంగా వెల్లడి చేయలేకపోవచ్చు, లేదా వాటిని ఇతరులు ఎల్లప్పుడూ అర్థం చేసుకోలేకపోవచ్చు, కాబట్టి వారిచ్చే మానసిక ఓదార్పు పరిమితంగానే ఉంటుంది. మనం కొన్ని కష్టాలను కేవలం యెహోవా మీదే ఆధారపడడం ద్వారా సహించవలసి ఉంటుంది.
15:7. మనం మనకు తెలిసినదంతా వెంటనే వేరొక వ్యక్తికి పూర్తిగా చెప్పేయకూడదు, రైతు కూడా విత్తనాలన్నీ ఒకే స్థలంలో కుమ్మరించడు. జ్ఞానవంతుడు అవసరాన్నిబట్టి కొద్దికొద్దిగా తన జ్ఞానాన్ని వెదజల్లుతాడు.
15:15; 18:14. ఆశావహ మానసిక దృక్పథాన్ని కాపాడుకోవడం, కష్టభరితమైన పరిస్థితుల్లో సహితం ఆనందంగా ఉండేందుకు సహాయం చేస్తుంది.
17:24. ప్రాముఖ్యమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించే బదులు అస్థిరంగావుండే కళ్ళు, మనసుగల “బుద్ధిహీనుని”లా కాకుండా, మనం జ్ఞానవంతంగా చర్య తీసుకునేందుకు సహాయపడే వివేకం కోసం వెదకాలి.
23:6-8. వేషధారణతో కూడిన ఆతిథ్యం ఇవ్వడం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి.
27:21. పొగడ్త మనమెలాంటి వాళ్ళమో వెల్లడిచేయవచ్చు. పొగడ్త మనం యెహోవాకు ఋణపడి ఉన్నామని అంగీకరించడానికి మనల్ని పురికొల్పి, ఆయన సేవలో కొనసాగేలా మనల్ని ప్రోత్సహిస్తే, మనకున్న అణకువ వెల్లడవుతుంది. పొగడ్త మనలో అధికులమన్న భావాన్ని కలిగిస్తే అది అణకువ లేనితనాన్ని చూపిస్తుంది.
27:23-27. గ్రామీణ పరిస్థితిని ఉపయోగిస్తూ ఈ సామెతలు, కష్టపడి పనిచేయడంవల్ల వచ్చే సరళమైన జీవితం మూలంగా కలిగే సంతృప్తి విలువను నొక్కిచెబుతాయి. అవి ముఖ్యంగా దేవుని మీద ఆధారపడవలసిన అవసరాన్ని మన మనసులపై ముద్రించాలి. *
28:5. మనం ప్రార్థన ద్వారా, ఆయన వాక్య అధ్యయనం ద్వారా ‘యెహోవాను ఆశ్రయిస్తే,’ ఆయనకు అంగీకారమైన విధంగా ఆయన సేవ చేయడానికి అవసరమైన ‘సమస్తాన్ని గ్రహించవచ్చు.’
‘దేవోక్తులు’
బైబిలు పుస్తకమైన సామెతల గ్రంథము రెండు ‘దేవోక్తులతో’ ముగుస్తుంది. (సామెతలు 30:1; 31:1) ఆగూరు ఇచ్చిన సందేశం, ఆలోచన రేకెత్తించే పోలికలను ఉపయోగిస్తూ దురాశ ఎంత తృప్తిపరచబడలేనిదో సోదాహరణంగా తెలియజేస్తుంది, ఒక వ్యక్తి, ఒక కన్యను లోబరచుకోవడానికి ఉపయోగించే మార్గాలు కనిపెట్టడానికి ఎంత కష్టమైనవో చూపిస్తుంది. * స్వీయ పొగడ్తలకు, ఆగ్రహపూరిత మాటలకు వ్యతిరేకంగా కూడా అది హెచ్చరిస్తుంది.
లెమూయేలు తన తల్లి నుండి అందుకున్న దేవోక్తిలో, ద్రాక్షారసాన్ని, మత్తు కలిగించే మద్యాన్ని ఉపయోగించడం గురించి, అలాగే నీతితో తీర్పుతీర్చడం గురించి చక్కని ఉపదేశం ఉంది. మంచి భార్యను గురించిన వర్ణన ఈ వ్యాఖ్యానంతో ముగుస్తుంది: “చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును, గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.”—సామెతలు 31:31.
జ్ఞానమును సంపాదించుకోండి, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోండి, దైవభయాన్ని వృద్ధి చేసుకోండి, యెహోవాపై ఆధారపడండి. ప్రేరేపిత సామెతలు ఎంత విలువైన పాఠాలను బోధిస్తున్నాయో కదా! మనం వాటి ఉపదేశాన్ని అన్వయించుకుని, “యెహోవాయందు భయభక్తులుగల” వ్యక్తి పొందే ఆనందాన్ని తప్పక పొందుదాం.—కీర్తన 112:1.
[అధస్సూచీలు]
^ పేరా 49 కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 1, 1991, 31వ పేజీ చూడండి.
^ పేరా 53 కావలికోట అక్టోబరు 1, 1992, 32వ పేజీ చూడండి.
[16వ పేజీలోని చిత్రాలు]
నిజమైన తెలివికి మూలం యెహోవాయే
[18వ పేజీలోని చిత్రం]
‘తెలివిని వెదజల్లడం’ అంటే ఏమిటి?