పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో జరిగే అంతిమ పరీక్ష తర్వాత మానవులు పాపం చేసి మరణించే అవకాశముందా?
ప్రకటన గ్రంథములోని రెండు లేఖనాలు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే వివరాలనిస్తున్నాయి: “మరణమును మృతుల లోకమును [హేడిస్] అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.” (ప్రకటన 20:14) “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:4.
ఇక్కడ ఇమిడివున్న కాలాన్ని గమనించండి. అర్మగిద్దోనును తప్పించుకున్నవాళ్ళు, మరణం నుండి పునరుత్థానమైనవాళ్ళు, అర్మగిద్దోను తర్వాత పుట్టినవాళ్ళు “గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి” లేక వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో యెహోవా మానవజాతికి ఇచ్చిన వివరణాత్మక ప్రమాణాలనుబట్టి తీర్పుతీర్చబడిన తర్వాత “మరణమును మృతుల లోకమును” అగ్నిగుండములో పడవేయబడతాయి. (ప్రకటన 20:12, 13) క్రీస్తుయేసు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో నెరవేరబోయే మరో దర్శనాన్ని అపొస్తలుడైన యోహాను ప్రకటన 21వ అధ్యాయంలో వ్రాశాడు. అయితే, ఆ దర్శనం వెయ్యేండ్ల తీర్పు దినం చివర్లో సంపూర్ణంగా నెరవేరుతుంది. యేసు అప్పటికే రాజ్యాన్ని తన తండ్రికి అప్పగించివుంటాడు కాబట్టి, యెహోవా అప్పుడు మధ్యవర్తులెవరూ లేకుండా పూర్తి భావంలో మానవజాతితో నివసిస్తాడు. యెహోవా సూచనార్థక భావంలో నేరుగా ‘తన ప్రజలతో’ శాశ్వతంగా నివసిస్తాడు. క్రీస్తు విమోచనా క్రయధన బలి విలువ పూర్తిగా అన్వయించబడినందువల్ల మానవజాతి పరిపూర్ణతను పొందినప్పుడు “మరణము ఇక ఉండదు” అనే వాగ్దానం పూర్తిభావంలో నెరవేరుతుంది.—ప్రకటన 21:3, 4.
ఆ విధంగా, పైలేఖనాల్లో ప్రస్తావించబడిన మరణం అంటే ఆదాము ద్వారా సంక్రమించిన మరణం క్రీస్తు విమోచనా క్రయధనం ద్వారా తీసివేయబడుతుంది. (రోమీయులు 5:12-21) మొదటి మానవుని ద్వారా సంక్రమించిన మరణం తీసివేయబడడంతో మానవులందరూ, ఆదాము సృష్టించబడినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటారు. ఆదాము పరిపూర్ణుడే, అంతమాత్రాన అతను మరణించే అవకాశమే లేదని దానర్థం కాదు. యెహోవా ఆదాముతో, “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు” అని చెప్పాడు. (ఆదికాండము 2:17) ఆ మరణం ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం ద్వారా వచ్చింది. వెయ్యేండ్ల పరిపాలనా ముగింపులో చివరి పరీక్ష తర్వాత కూడా మానవులు నైతిక స్వేచ్ఛగలవారిగానే ఉంటారు. (ప్రకటన 20:7-10) యెహోవాను సేవించడంలో కొనసాగాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికింకా ఉంటుంది. అయితే, మానవుల్లో ఎవరైనా ఆదాములాగే దేవునికి ఎదురుతిరిగే అవకాశం లేదని చెప్పడానికి వీల్లేదు.
అంతిమ పరీక్ష తర్వాత మరణం గానీ, హేడిస్గానీ లేని సమయంలో ఒక వ్యక్తి తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకుంటే అతనికేం జరుగుతుంది? ఆ సమయంలో ఆదాము ద్వారా సంక్రమించిన మరణం లేదు. పునరుత్థాన నిరీక్షణగల హేడిస్ లేదా మానవజాతి సామాన్య సమాధి కూడా లేదు. అయితే, పునరుత్థాన నిరీక్షణా ఏ మాత్రం లేకుండా యెహోవా ఏ తిరుగుబాటుదారుణ్ణైనా అగ్నిగుండంలో నాశనం చేయగలడు. అది ఆదాము ద్వారా మానవులకు సంక్రమించిన మరణం కాదుగానీ, ఆదాము హవ్వలు అనుభవించిన మరణమే.
అయితే అలాగే అందరికీ జరుగుతుందని ఊహించడానికి వీల్లేదు. ఎందుకంటే, అంతిమ పరీక్షలో కృతార్థులయ్యేవారు ఒక కీలకమైన భావంలో ఆదాముకు భిన్నంగా ఉంటారు. వాళ్ళు సంపూర్ణంగా పరీక్షించబడ్డారు. ప్రజలను పూర్తిగా ఎలా పరీక్షించాలో యెహోవాకు తెలుసు కాబట్టి, అంతిమ పరీక్ష సమగ్రంగా ఉంటుందని మనం నమ్మవచ్చు. ఎంపిక చేసుకునే స్వేచ్ఛను దుర్వినియోగం చేసే ఎవరైనా అంతిమ పరీక్షలో నిర్మూలించబడతారని మనం నమ్మవచ్చు. కాబట్టి, అంతిమ పరీక్షలో కృతార్థులైనవారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా నాశనమయ్యే అవకాశం ఉన్నప్పటికీ అలా జరగడం చాలా అరుదు.
[31వ పేజీలోని చిత్రం]
అంతిమ పరీక్ష తర్వాత, మానవజాతిని ఏ భావంలో ఆదాముతో పోల్చవచ్చు?