కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దైవభయం “జ్ఞానాభ్యాసమునకు సాధనము”

దైవభయం “జ్ఞానాభ్యాసమునకు సాధనము”

దైవభయం “జ్ఞానాభ్యాసమునకు సాధనము”

నిజమైన జ్ఞానం గొప్ప విందును ఏర్పాటు చేసింది. అది “తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి​—⁠‘జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్ము’ అని ప్రకటించుచున్నది. తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది​—⁠‘వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి. ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.’”​—⁠సామెతలు 9:​1-6.

జ్ఞానం ఏర్పాటు చేసిన బల్లపై విందు భోజనం చేయడం ఎన్నటికీ కీడు లేదా హానికి దారితీయదు. ప్రేరేపిత సామెతల్లోని దైవిక జ్ఞానాన్ని విని, వాటిలోని క్రమశిక్షణను స్వీకరించడంవల్ల మంచే జరుగుతుంది. సామెతలు 15:16-33లో వ్రాయబడిన జ్ఞానవంతమైన సామెతల్లో మంచి ఉపదేశమే ఉంది. * ఈ సంక్షిప్త సామెతల్లోని సలహాలను లక్ష్యపెట్టడం, మనకు తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నదాంట్లోనే సంతృప్తిచెందడానికి, ప్రగతి సాధించడానికి, జీవితంలో ఆనందాన్ని అనుభవించడానికి సహాయం చేస్తుంది. అంతేగాక, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, జీవానికి నడిపించే మార్గంలోనే నడుస్తూ ఉండడానికి కూడా తోడ్పడుతుంది.

వస్తుసంపదలు తక్కువగా ఉండడమే మేలు

“నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు” అని ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను అన్నాడు. (సామెతలు 15:​16) సృష్టికర్తను పరిగణలోకి తీసుకోకుండా వస్తుసంపదలను ఆర్జించడాన్ని మన జీవితాల్లో ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం బుద్ధిహీనతే. అలాంటి జీవితం అలసట కలిగించే ప్రయాసతో, ఎంతో ఆందోళనతో నిండివుంటుంది. తమ జీవితమంతా వ్యర్థంగా, అర్థరహితంగా గడిచిపోయిందని ఒకరు తమ వృద్ధాప్యంలో గ్రహించడం ఎంత విచారకరమో కదా! ఎంతో సంపదతోపాటు “నెమ్మది” లేని జీవితాన్ని కొని తెచ్చుకోవడం నిజంగానే జ్ఞానయుక్తం కాదు. సంతృప్తిగా ఉండడంలోని రహస్యాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా జీవించడం ఎంత మంచిదో కదా! నిజమైన సంతృప్తిని వస్తుసంపదలనుండి పొందలేం కానీ, యెహోవాపట్ల మనకుండే భయం, ఆయనతో మనకుండే సంబంధంనుండి దానిని పొందుతాం.​—⁠1 తిమోతి 6:​6-7.

వస్తుపరంగా చాలా ఉండడంకన్నా ఇతరులతో మంచి సంబంధాలుండడం ఎంతో విలువైనదనే విషయాన్ని నొక్కిచెబుతూ సొలొమోను ఇలా అంటున్నాడు: “పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.” (సామెతలు 15:​17) అవును, రుచికరమైన ఆహారపదార్థాలు సమృద్ధిగా ఉండడంకన్నా కుటుంబంలో ప్రేమపూర్వకమైన వాతావరణం నెలకొని ఉండడం ఎంతో కోరదగినది. కేవలం తల్లి లేదా తండ్రి మాత్రమే ఉండే కుటుంబాల్లో వస్తుసంపద చాలా తక్కువగా ఉండవచ్చు. కొన్ని దేశాల్లో అయితే మామూలు ఆహారాన్ని అందించే స్థోమతే వారికుంటుంది. అయితే, ప్రేమ ఆప్యాయతలు ఉండేచోటే కుటుంబ బాంధవ్యాలు బలంగా ఉంటాయి.

సాధారణంగా ప్రేమపూర్వక వాతావరణం ఉండే కుటుంబాల్లో కూడా కష్టకరమైన పరిస్థితులు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరు వేరే సభ్యుణ్ణి నొప్పించేటట్లుగా ఏదైనా అని ఉండవచ్చు లేదా ఏదైనా చేసి ఉండవచ్చు. అలా నొప్పించబడినవారు ఎలా ప్రతిస్పందించాలి? సామెతలు 15:⁠18 ఇలా చెబుతోంది: “కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.” అలాంటి పరిస్థితుల్లో కోపంతోకాక, మృదువుగా ప్రతిస్పందించడం కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొల్పడానికి తోడ్పడుతుంది. సంఘ కార్యకలాపాలు, బహిరంగ పరిచర్య వంటి జీవితంలోని ఇతర రంగాల్లో కూడా ఈ సామెతలోని సలహా వర్తిస్తుంది.

మన మార్గాన్ని ‘రాజమార్గంగా’ ఎలా చేసుకోవచ్చు?

తర్వాతి సామెత, జ్ఞానాన్ని లక్ష్యపెట్టనివారికి, లక్ష్యపెట్టినవారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నొక్కిచెబుతోంది. జ్ఞానియైన ఆ రాజు ఇలా అన్నాడు: “సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.”​—⁠సామెతలు 15:​19.

సోమరి ఎన్నో రకాల అడ్డంకులను ఊహించుకుంటూ, తాను చేయాల్సిన పనిని ప్రారంభించకపోవడాన్ని సమర్థించుకునేందుకు వాటిని సాకులుగా ఉపయోగిస్తాడు. దానికి భిన్నంగా, యథార్థవంతులు తమను అడ్డగించగల అవరోధాల విషయంలో చింతించరు. వారు తమ పనిని శ్రద్ధగా చేసుకుంటూ, చేతిలో ఉన్న పనికి ప్రాముఖ్యతనిస్తారు. ఆ కారణంగా, అలక్ష్యం చేస్తే ఎదురయ్యే ముళ్లలాంటి సమస్యలు వారికి ఎదురవ్వవు. వారి మార్గము “రాజమార్గము,” అంటే అది ముందుకు సాగుతూనే ఉంటుంది. వారు తమ పనిని ప్రారంభించి, అది కొనసాగడాన్ని చూసి సంతోషిస్తారు.

ఉదాహరణకు, దేవుని వాక్యంలోని ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకొని, పరిణతిగలవారిగా ఎదిగే విషయాన్నే తీసుకోండి. అలా ఎదగాలంటే కృషి అవసరం. ఒక వ్యక్తి బైబిలును శ్రద్ధగా అధ్యయనం చేయకపోవడానికి తరచూ, పరిమితమైన విద్యాభ్యాసం, సరిగా చదవలేకపోవడం, జ్ఞాపకశక్తి లేకపోవడం లాంటి కారణాల్ని సాకులుగా ఉపయోగించవచ్చు. జ్ఞానం సంపాదించుకోకుండా ఆపే అడ్డంకులుగా వాటిని పరిగణించకుండా ఉండడం ఎంత శ్రేయస్కరమో కదా! మనకు పరిమిత సామర్థ్యాలే ఉన్నా, అవసరమైనప్పుడు నిఘంటువును ఉపయోగించడం ద్వారా చదివే నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి, మనం చదివేదాన్ని అర్థం చేసుకోవడానికి కృషి చేయవచ్చు. మనం జ్ఞానం సంపాదించుకుని, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించేందుకు ఆశావహ దృక్పథం సహాయం చేస్తుంది.

“తండ్రి” ఎప్పుడు ‘సంతోషిస్తాడు’?

“జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును” అని ఇశ్రాయేలు రాజు అన్నాడు. (సామెతలు 15:​20) తమ పిల్లలు జ్ఞానయుక్తంగా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు సంతోషించరా? నిజమే, పిల్లలు అలా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలంటే తల్లిదండ్రుల తర్ఫీదు, క్రమశిక్షణ అవసరం. (సామెతలు 22:⁠6) అయితే, జ్ఞానవంతుడైన కుమారుడు తన తల్లిదండ్రులకు ఎంత సంతోషాన్ని కలిగిస్తాడో కదా! కానీ, మూర్ఖుడు వారికి తీరని దుఃఖాన్ని కలిగిస్తాడు.

‘సంతోషం’ అనే పదాన్ని మరో సందర్భంలో ఉపయోగిస్తూ, ఆ జ్ఞానియైన రాజు ఇలా అంటున్నాడు: “బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.” (సామెతలు 15:​21) మూఢుడు నిజమైన సంతృప్తిని, ఆనందాన్నివ్వలేని వ్యర్థమైన వినోదంలో, ఉల్లాసకార్యకలాపాల్లో సంతోషిస్తాడు. అయితే, వివేకి ‘దేవునికన్నా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించడంలోని’ బుద్ధిహీనతను గ్రహిస్తాడు. (2 తిమోతి 3:​1, 4) ఆయన దైవిక సూత్రాలకు అనుగుణంగా జీవించడం, నీతిమంతునిగా కొనసాగేందుకు, తన మార్గాన్ని సరాళం చేసుకునేందుకు సహాయం చేస్తుంది.

మన “ఉద్దేశములు” ఎప్పుడు ‘దృఢపడతాయి’?

దైవిక సూత్రాలకు అనుగుణంగా జీవించడం మన జీవితంలోని ఇతర రంగాల్లో ప్రయోజనాలు చేకూరుస్తుంది. సామెతలు 15:⁠22 ఇలా చెబుతోంది: “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.”

ఆలోచనలు చెప్పడం అంటే వ్యక్తుల మధ్య జరిగే దాపరికం లేని సంభాషణ. ‘ఆలోచనలు చెప్పడం’ అని అనువదించబడిన హెబ్రీ పదానికి సన్నిహితుల మధ్య జరిగే సంభాషణ అని కూడా అర్థం. అది సన్నిహితంగా సంభాషించుకోవడాన్ని సూచిస్తుంది. ఆలోచనలు చెప్పడం అంటే క్లుప్తంగా మాట్లాడుకోవడం కాదు, యథార్థ తలంపులను, భావాలను పంచుకోవడం ఇమిడివుంది. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య అలాంటి దాపరికం లేని సంభాషణ ఉంటే, వారి మధ్య శాంతి, ఐక్యతలు నెలకొంటాయి. అలా సన్నిహితంగా మాట్లాడుకోనప్పుడు కుటుంబాల్లో అసంతృప్తి, సమస్యలు తలెత్తుతాయి.

మనం ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఈ సలహాను లక్ష్యపెట్టడం జ్ఞానయుక్తం: “ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.” ఉదాహరణకు, మనం ఏదైనా వైద్య చికిత్సను ఎంపిక చేసుకుంటున్నప్పుడు, ప్రత్యేకంగా దానిలో ప్రాముఖ్యమైన అంశాలు ఇమిడివున్నప్పుడు, ఇద్దరు లేక ముగ్గురు అభిప్రాయాలు తీసుకోవడం జ్ఞానయుక్తం కాదా?

ఆధ్యాత్మిక విషయాలపట్ల శ్రద్ధ వహిస్తున్నప్పుడు ఆలోచనలు చెప్పే బహుమంది ఉండడం చాలా ప్రాముఖ్యం. పెద్దలు ఒకరినొకరు సంప్రదించుకొని అనేకమంది పెద్దల జ్ఞానయుక్తమైన సలహాను సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు ‘ఉద్దేశాలు దృఢపడతాయి.’ అంతేకాదు, క్రొత్తగా నియమించబడిన పైవిచారణకర్తలు వయసులో పెద్దవారైన, అనుభవజ్ఞులైన పెద్దలనుండి సలహాలు అడగడానికి సంశయించకూడదు. ప్రత్యేకంగా, తాము చేపట్టాల్సిన విషయం కష్టమైనదైతే అలా చేయాల్సి ఉంటుంది.

“ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన” ఎప్పుడు “సంతోషము” కలుగుతుంది?

అంతర్దృష్టితో మాట్లాడడంవల్ల ఎలాంటి మంచి జరుగుతుంది? “సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!” అని ఇశ్రాయేలు రాజు చెప్పాడు. (సామెతలు 15:​23) మన జవాబుని లేదా సలహాను పాటించడంవల్ల ఇతరులు మంచి ఫలితాలు చవిచూసినప్పుడు మనం సంతోషించమా? అయితే, మన ఉపదేశం సమర్థవంతంగా ఉండాలంటే రెండు అంశాలను దృష్టిలోవుంచుకోవాలి.

మొదటిది, ఆ సలహా దేవుని వాక్యమైన బైబిలుమీద దృఢంగా ఆధారపడి ఉండాలి. (కీర్తన 119:105; 2 తిమోతి 3:​16) రెండవది, అది సమయోచితంగా ఉండాలి. సముచితంకాని సమయంలో వాస్తవాలు పలికినా అవి హాని చేకూర్చగలవు. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెప్పేది వినకముందే సలహాలు ఇవ్వడం జ్ఞానయుక్తం కాదు, అలాగే అది సహాయకరంగా కూడా ఉండదు. ‘వినుటకు వేగిరపడేవారిగా, మాటలాడుటకు నిదానించువారిగా’ ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!​—⁠యాకోబు 1:​19.

“పరమునకు పోవు జీవమార్గము”

సామెతలు 15:⁠24 ఇలా చెబుతోంది: “క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచుకొనును.” అంతర్దృష్టితో ప్రవర్తించే వ్యక్తి, మానవజాతి సామాన్య సమాధియైన పాతాళము నుండి దూరంగా వెళ్లే మార్గంలో నడుస్తాడు. ఆయన విచ్చలవిడి లైంగిక ప్రవర్తన, మాదకద్రవ్యాలు ఉపయోగించడం, త్రాగుబోతుతనం వంటి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉంటాడు కాబట్టి అకాలంగా మరణించడు. ఆయన నడిచే మార్గం జీవానికి తీసుకువెళ్తుంది.

దానికి భిన్నంగా, అంతర్దృష్టి లేనివారి మార్గం ఎలా ఉంటుందో గమనించండి: “గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోభి తన యింటివారిని బాధపెట్టును లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును.”​—⁠సామెతలు 15:​25-27.

అనేకులు చేసే తప్పునే మనం చేయకుండా ఎలా ఉండవచ్చో చూపిస్తూ ఇశ్రాయేలు రాజు ఇలా అంటున్నాడు: “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును.” (సామెతలు 15:​28) ఆ సామెతలోని సలహా ఎంత విలువైందో కదా! ఆలోచించకుండా ఇచ్చే అవివేకమైన జవాబులవల్ల ఎలాంటి మంచీ జరగదు. ఒక విషయాన్ని ప్రభావితం చేసే ఇతరుల పరిస్థితులు, భావాలు లాంటి వివిధ కారకాలను మనం పరిగణలోకి తీసుకుంటే, అనేసిన తర్వాత బాధపడాల్సివచ్చే మాటలేమీ మాట్లాడం.

అయితే దైవభయంతో ఉండడం వల్ల, ఆయనిచ్చే క్రమశిక్షణను స్వీకరించడం వల్ల వచ్చే ప్రయోజనాలేమిటి? జ్ఞానియైన వ్యక్తి ఇలా జవాబిస్తున్నాడు: “భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.” (సామెతలు 15:​29) సత్యదేవుడు భక్తిహీనులకు దూరంగా ఉంటాడు. “ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 28:⁠9) దైవభయం ఉండి దేవుని దృష్టిలో సరైనది చేయడానికి కృషి చేస్తున్నవారు, ఆయన తమ ప్రార్థనలు వింటాడనే పూర్తి నమ్మకంతో నిస్సంకోచంగా ఆయనను సమీపించవచ్చు.

“హృదయమునకు” ఏది ‘సంతోషాన్నిస్తుంది’?

మనల్ని ఆలోచింపజేసే పోలికను ఉపయోగిస్తూ సొలొమోను ఇలా అంటున్నాడు: “కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును.” (సామెతలు 15:​30) మూలుగతో నిండినప్పుడు ఎముకలు “పుష్టి”గా తయారవుతాయి. దానివల్ల శరీరమంతా చైతన్యవంతమై, హృదయం సంతోషిస్తుంది. హృదయంలోని ఆ సంతోషం కన్నుల ప్రకాశములో కనిపిస్తుంది. మంచి సమాచారం కూడా అంతటి ప్రభావం చూపిస్తుంది!

యెహోవా ఆరాధన ప్రపంచమంతటా విస్తరించడం గురించిన నివేదికలు మనకు నిజమైన ప్రోత్సాహాన్నివ్వవా? రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో సాధించబడుతున్న ఫలితాలన్నిటి గురించి తెలుసుకోవడం మనల్ని నిజంగానే చైతన్యపరిచి, మనం పరిచర్యలో మరింతగా పాల్గొనేలా చేస్తాయి. (మత్తయి 24:14; 28:​19, 20) యెహోవాను తమ దేవునిగా అంగీకరించి, సత్యారాధనను అవలంబిస్తున్నవారి అనుభవాలు మన హృదయాల్ని ఆనందింపజేస్తాయి. “దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము” అంతటి శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి, మనం పరిచర్యలో చేస్తున్న సేవను ఖచ్చితంగా జాగ్రత్తగా నివేదించడం ఎంత ప్రాముఖ్యమో కదా!​—⁠సామెతలు 25:​25.

“ఘనతకు ముందు వినయముండును”

వివిధ రకాల క్రమశిక్షణను స్వీకరించడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెబుతూ జ్ఞానియైన రాజు ఇలా అంటున్నాడు: “జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును.” (సామెతలు 15:​31, 32) గద్దింపు, లేదా క్రమశిక్షణ ఒక వ్యక్తి హృదయానికి చేరి, దాన్ని సరిచేసి, ఆయనకు మంచి వివేచననిస్తుంది. అందుకే “బాలుని హృదయములో మూఢత్వమును” “శిక్షాదండము” తీసివేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. (సామెతలు 22:​15) గద్దింపును వినే వ్యక్తి వివేకి అవుతాడు అంటే మంచి ఉద్దేశాలను కూడా పెంపొందించుకుంటాడు. దానికి భిన్నంగా క్రమశిక్షణను తృణీకరించడం జీవాన్ని తృణీకరించడంతో సమానం.

జ్ఞానమిచ్చే క్రమశిక్షణను స్వాగతించి, వినయంగా దాన్ని స్వీకరించడం ప్రయోజనకరం. అలా చేయడం సంతృప్తినిస్తుంది, పురోభివృద్ధికి నడిపిస్తుంది, సంతోషాన్నిస్తుంది, అనుకున్నవి సాధించేందుకు తోడ్పడుతుంది అంతేకాక ఘనతకు, జీవానికి కూడా నడిపిస్తుంది. సామెతలు 15:⁠33 ఈ మాటలతో ముగుస్తుంది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.”

[అధస్సూచి]

^ పేరా 3 సామెతలు 15:​1-​15 వచనాల సవివరమైన చర్చ కోసం కావలికోట, జూలై 1, 2006, 13-16 పేజీలు చూడండి.

[17వ పేజీలోని చిత్రం]

రుచికరమైన ఆహార పదార్థాలకన్నా కుటుంబంలో ప్రేమపూర్వకమైన వాతావరణం ఎంతో కోరదగినది

[18వ పేజీలోని చిత్రం]

మనకు పరిమితులు ఉన్నా, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆశావహ దృక్పథం సహాయం చేస్తుంది

[19వ పేజీలోని చిత్రం]

ఆలోచనలు చెప్పడం అంటే తమ యథార్థ తలంపులను, భావాలను పంచుకోవడం

[20వ పేజీలోని చిత్రం]

“మంచి సమాచారము ఎముకలకు పుష్టి” ఎలా కలుగజేస్తుందో మీకు తెలుసా?