కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్ఞానవంతులై ఉండండి—దేవునికి భయపడండి!

జ్ఞానవంతులై ఉండండి—దేవునికి భయపడండి!

జ్ఞానవంతులై ఉండండి​—⁠దేవునికి భయపడండి!

“యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము.”​—⁠సామెతలు 9:10.

దైవభయంగలవాడు అని ఎవరినైనా వర్ణిస్తే, దానిని ఒకప్పుడు మెచ్చుకోలుగా భావించేవారు. నేడు, దేవుని భయమనే తలంపు పాతకాలపు ఆలోచనని, దాన్ని అర్థం చేసుకోవడం కష్టమని చాలామంది భావిస్తారు. ‘దేవుడు ప్రేమగలవాడైతే, ఆయనకు నేనెందుకు భయపడాలి’ అని వారు అడగవచ్చు. వారికి భయమనేది ప్రతికూలమైనదే కాక, అశక్తతకు కూడా గురిచేసే భావోద్రేకం. అయితే నిజమైన దేవుని భయానికి విశాలమైన అర్థం ఉండడమే కాక, మనం చూడబోతున్నట్లుగా అది కేవలం భావమో లేదా భావోద్వేగమో కాదు.

2 బైబిలు ప్రకారం దైవభయం కోరదగిన లక్షణం. (యెషయా 11:⁠3) అది ప్రగాఢమైన పూజ్యభావం, దేవునిపట్ల హృదయపూర్వక గౌరవభావమే కాక, ఆయనను నొప్పించకూడదనే బలమైన కోరిక కూడా. (కీర్తన 115:​11) అలాగే దానిలో దేవుని నైతిక ప్రమాణాలను అంగీకరించి వాటికి అంటిపెట్టుకుని, మేలు కీడుల గురించి దేవుడు చెప్పేవాటి ప్రకారం జీవించాలనే కోరిక కూడా ఉంది. అలాంటి ఆరోగ్యదాయకమైన భయం “జ్ఞానవంతంగా ప్రవర్తిస్తూ, ఎలాంటి చెడునైనా విడిచిపెట్టేందుకు దోహదపడే ప్రాథమిక దైవిక దృక్పథాన్ని” వెల్లడిచేస్తుంది అని ఒక గ్రంథం చెబుతోంది. కాబట్టి దేవుని వాక్యం మనకిలా చెబుతోంది: “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము.”​—⁠సామెతలు 9:​10.

3 అవును దేవుని భయానికి, మానవ వ్యవహారాలకు సంబంధించిన అనేక అంశాలతో సంబంధం ఉంది. దానికి జ్ఞానంతోనే కాక, సంతోషం, సమాధానం, సుభిక్షత, దీర్ఘాయువు, నిరీక్షణ, బలమైన నమ్మకంతో కూడా సంబంధం ఉంది. (కీర్తన 2:11; సామెతలు 1:⁠7; 10:​27; 14:​26; 22:⁠4; 23:​17, 18; అపొస్తలుల కార్యములు 9:​31) విశ్వాస, ప్రేమలతో దానికి దగ్గరి సంబంధముంది. దానిలో, దేవునితో మనుష్యులతో మన సంబంధాలన్నీ ఇమిడివున్నాయి. (ద్వితీయోపదేశకాండము 10:12; యోబు 6:14; హెబ్రీయులు 11:⁠7) మన పరలోకపు తండ్రికి మనపట్ల వ్యక్తిగత శ్రద్ధవుందనే, మన అపరాధాలను క్షమించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడనే ప్రగాఢ నమ్మకం కూడా దేవుని భయంలో ఉన్నాయి. (కీర్తన 130:⁠4) పశ్చాత్తాపం చూపించని దుష్టులు మాత్రమే దేవునిపట్ల భీతిచెందాలి. *​—⁠హెబ్రీయులు 10:​26-31.

యెహోవాకు భయపడడాన్ని నేర్చుకోవడం

4 జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందేందుకు దేవుని భయం ప్రాముఖ్యం కాబట్టి, ‘యెహోవాకు భయపడడాన్ని’ మనమెలా నేర్చుకోవచ్చు? (ద్వితీయోపదేశకాండము 17:​19) “మనకు బోధ కలుగు నిమిత్తము” లేఖనాల్లో దైవభక్తిగల స్త్రీపురుషుల ఉదాహరణలు ఎన్నో నివేదించబడ్డాయి. (రోమీయులు 15:⁠4) దేవునికి భయపడడమంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి, అలాంటి ఉదాహరణల్లో ఒక దానిని అంటే ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు జీవితాన్ని పరిశీలిద్దాం.

5 ఇశ్రాయేలుకు మొదటి రాజైన సౌలు ప్రజలకు భయపడి, దైవభయం కోల్పోయినందుకు యెహోవా ఆయనను తిరస్కరించాడు. (1 సమూయేలు 15:​24-26) మరోవైపున దావీదు జీవన విధానం, యెహోవాతో ఆయనకున్న సన్నిహిత సంబంధం ఆయనను నిజంగా దైవభయంగల వ్యక్తని సూచించాయి. ఆయన తన చిన్నతనం నుండి తరచూ తన తండ్రి గొర్రెలను మేతకు బయటికి తీసుకెళ్లేవాడు. (1 సమూయేలు 16:​11) చుక్కలతో నిండివున్న ఆకాశం క్రింద అనేక రాత్రులు మందలను కాయడం, యెహోవా భయాన్ని అర్థం చేసుకునేందుకు దావీదుకు సహాయం చేసివుండవచ్చు. సువిశాల విశ్వంలో కేవలం కొద్దిభాగాన్నే దావీదు చూడగలిగినా, ఆయన సరైన ముగింపుకు అంటే దేవుడు మన గౌరవాన్ని, ఆరాధనను పొందేందుకు అర్హుడనే ముగింపుకు వచ్చాడు. ఆయన ఆ తర్వాత ఇలా వ్రాశాడు: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?”​—⁠కీర్తన 8:​3, 4.

6 కాబట్టే, నక్షత్రాలు నిండిన సువిశాల ఆకాశంతో తన అల్పత్వాన్ని పోల్చుకున్నప్పుడు దావీదు ముగ్ధుడయ్యాడు. ఆ పరిజ్ఞానం ఆయనను భయపెట్టడానికి బదులు యెహోవాను స్తుతిస్తూ ఇలా అనేందుకు ఆయనను ప్రేరేపించింది: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.” (కీర్తన 19:⁠1) దేవునిపట్ల దావీదుకున్న ఈ పూజ్యభావమే ఆయనను యెహోవాకు సన్నిహితుణ్ణి చేసి, దేవుని పరిపూర్ణ మార్గాలు తెలుసుకుని, వాటిని అనుసరించేందుకు ఇష్టపడేలా చేసింది. యెహోవాను ఇలా కీర్తించినప్పుడు దావీదులో ఎలాంటి భావాలు కలిగివుండవచ్చో ఊహించండి: “ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు. నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు. యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.”​—⁠కీర్తన 86:​9, 11.

7 ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడించినప్పుడు, దాదాపు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తున్న గొల్యాతు అనే యోధుడు ఇశ్రాయేలీయులను పరిహసిస్తూ ఇలా అన్నాడు: ‘నాతో పోరాడేందుకు మీరొక మనిషిని ఎంచుకోండి! అతడు గెలిస్తే మేము మీకు దాసులమవుతాం.’ (1 సమూయేలు 17:​4-10) సౌలు, ఆయన సైన్యమంతా భయకంపితులయ్యారు, కానీ దావీదు మాత్రం భయకంపితుడుకాలేదు. మానవులు ఎంత బలవంతులైనా వారికి భయపడకూడదు గానీ యెహోవాకు మాత్రమే భయపడాలని ఆయనకు తెలుసు. దావీదు గొల్యాతుతో ఇలా అన్నాడు: “సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. . . . యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే.” యెహోవా సహాయంతో దావీదు తన వడిసెలతో ఒకే రాయి విసిరి ఆ భారీకాయుణ్ణి హతమార్చాడు.​—⁠1 సమూయేలు 17:​45-47.

8 మనం బహుశా దావీదు ఎదుర్కొన్న దానికన్నా భీకరమైన అడ్డంకుల్ని లేదా శత్రువుల్ని ఎదుర్కొంటుండవచ్చు. అలాంటప్పుడు మనమేమి చేయవచ్చు? దేవుని భయంతో మనం కూడా దావీదు, ప్రాచీనకాల ఇతర నమ్మకస్థుల్లాగే వాటిని లేదా మనుష్యులను ఎదుర్కోవచ్చు. దేవుని భయం మనుష్య భయాన్ని జయిస్తుంది. దేవుని నమ్మకమైన సేవకుడైన నెహెమ్యా, వ్యతిరేకుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న తోటి ఇశ్రాయేలీయులను ఇలా ప్రోత్సహించాడు: “వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొ[నుడి].” (నెహెమ్యా 4:​14) యెహోవా మద్దతుతో దావీదు, నెహెమ్యా, నమ్మకస్థులైన దేవుని ఇతర సేవకులు దేవుడు తమకప్పగించిన పనిని విజయవంతంగా నిర్వర్తించారు. దైవభయంతో మనం కూడా అలాగే చేయవచ్చు.

దైవభయంతో సమస్యలను ఎదుర్కోవడం

9 దావీదు గొల్యాతును సంహరించిన తర్వాత, యెహోవా ఆయనకు మరిన్ని విజయాలు ఇచ్చాడు. కానీ ఈర్ష్యపరుడైన సౌలు, మొదట ఉద్రేకంతో, ఆ తర్వాత కుయుక్తితో, చివరకు సైన్యాన్ని ఉపయోగించుకుని దావీదును హతమార్చేందుకు ప్రయత్నించాడు. దావీదు రాజవుతాడని యెహోవా ఆయనకు వాగ్దానం చేసినా, ఆయన పారిపోతూ, పోరాడుతూ యెహోవా తనను రాజుగా చేసేంతవరకు అనేక సంవత్సరాలపాటు వేచివుండాల్సివచ్చింది. ఈ కాలమంతటిలో దావీదు, తనకు సత్యదేవుని భయం ఉందని చూపించాడు.​—⁠1 సమూయేలు 18:​9, 11, 17; 24:⁠2.

10 ఒక సందర్భంలో దావీదు, గొల్యాతు స్వస్థలమైన ఫిలిష్తీయులకు చెందిన గాతు పట్టణపు రాజైన ఆకీషును ఆశ్రయించాడు. (1 సమూయేలు 21:​10-15) రాజు సేవకులు దావీదు తమ దేశానికి శత్రువని ఆరోపించారు. ఆ ప్రమాదకర పరిస్థితిలో దావీదు ఎలా స్పందించాడు? ఆయన దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. (కీర్తన 56:​1-4, 11-13) ఆయన తప్పించుకునేందుకు పిచ్చివాడిలా నటించాల్సివచ్చినా, తన ప్రయత్నాల్ని ఆశీర్వదించి తనను తప్పించింది యెహోవాయే అని దావీదుకు తెలుసు. దావీదు హృదయపూర్వకంగా యెహోవాపై ఆధారపడి ఆయనపై నమ్మకముంచడం దావీదు నిజంగా దైవభయంగల వ్యక్తని చూపించాయి.​—⁠కీర్తన 34:​4-6, 9-11.

11 దావీదులాగే మనం కూడా, సమస్యలను ఎదుర్కొనేలా మనకు సహాయం చేస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మడం ద్వారా దేవుని భయాన్ని చూపించవచ్చు. “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును” అని దావీదు అన్నాడు. (కీర్తన 37:⁠5) అంటే మన సమస్యల విషయంలో మనమేమీ చేయకుండా, వాటిని యెహోవా చేతికప్పగించి ఆయనే వాటిని పరిష్కరిస్తాడని ఎదురుచూడాలని దీనర్థం కాదు. దావీదు సహాయం చేయమని దేవునికి ప్రార్థించి ఆ తర్వాత ఏమీ చేయకుండా ఉండలేదు. ఆయన యెహోవా తనకనుగ్రహించిన శారీరక, మేధాసంబంధ సామర్థ్యాల్ని ఉపయోగించి తన సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే, మానవ ప్రయత్నాలు మాత్రమే విజయం చేకూర్చవని దావీదుకు తెలుసు. మనం కూడా అలాగే నమ్మాలి. మనం మన శక్తిమేరకు ప్రయత్నించి మిగతాది యెహోవాకు వదిలేయాలి. నిజానికి, మనం చాలాసార్లు యెహోవాపై ఆధారపడడం తప్ప మనం చేయగలిగింది ఏమీవుండదు. ఇలాంటప్పుడే మనం వ్యక్తిగతంగా దేవుని భయాన్ని ప్రదర్శిస్తాం. దావీదు హృదయపూర్వకంగా పలికిన ఈ మాటల్లో మనం ఓదార్పు పొందవచ్చు: ‘యెహోవాకు భయపడువారు ఆయనకు సన్నిహితులవుతారు.’​—⁠కీర్తన 25:​14, NW.

12 కాబట్టి, మనం చేసే ప్రార్థనలను, దేవునితో మన సంబంధాన్ని ప్రాముఖ్యమైనవిగా పరిగణించాలి. యెహోవాకు మనం ప్రార్థిస్తున్నప్పుడు, మనం “ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.” (హెబ్రీయులు 11:6; యాకోబు 1:​5-8) ఆయన మనకు సహాయం చేసినప్పుడు, పౌలు మనకు ఉపదేశించినట్లు ‘మనమాయనకు కృతజ్ఞత చూపించాలి.’ (కొలొస్సయులు 3:​15, 17) అనుభవంగల అభిషిక్త క్రైస్తవుడు వర్ణించినవారిలా మనమెన్నటికీ తయారవకూడదు. ఆయనిలా అన్నాడు: “దేవుడు పరలోకంలోవున్న ఒక సేవకుడని వారనుకుంటారు. వారికేదైనా అవసరమైతే, చిటికేసి ఆయనను పిలిచి, తమకు కావాల్సింది దొరకగానే ఆయన అక్కడనుండి వెళ్లిపోవాలని భావిస్తారు.” అలాంటి స్వభావం, దేవుని భయం లేకపోవడాన్ని సూచిస్తుంది.

దేవుని భయం సన్నగిల్లినప్పుడు

13 బాధలో ఉన్నప్పుడు యెహోవా సహాయాన్ని పొందడం దావీదుకున్న దైవభయాన్ని పెంచి, దేవునిపట్ల ఆయన విశ్వాసాన్ని బలపర్చింది. (కీర్తన 31:​22-24) అయితే మూడు ప్రత్యేక సందర్భాల్లో దావీదులో దేవుని భయం సన్నగిల్లింది, అది తీవ్ర పర్యవసానాలకు దారితీసింది. మొదటిది, ఆయన దేవుని ధర్మశాస్త్రం నిర్దేశించిన దానికి భిన్నంగా యెహోవా నిబంధనా మందసాన్ని లేవీయుల భుజాలపై కాక, బండిమీద యెరూషలేముకు తరలించే ఏర్పాటు చేసినప్పుడు జరిగింది. ఆ బండిని నడిపిస్తున్న ఉజ్జా మందసం పడిపోకుండా దాన్ని పట్టుకున్నప్పుడు, ఆ “తప్పునుబట్టి” అతడు అక్కడికక్కడే మరణించాడు. నిజమే, ఉజ్జా ఘోరమైన పాపం చేశాడు, కానీ దేవుని ధర్మశాస్త్రంపట్ల దావీదు సరైన గౌరవం చూపించనందువల్లే ఆ విషాదం చోటుచేసుకుంది. దేవునికి భయపడడమంటే ఆయన ఏర్పాటు ప్రకారం పనులు చేయడమని అర్థం.​—⁠2 సమూయేలు 6:2-9; సంఖ్యాకాండము 4:​15; 7:⁠9.

14 ఆ తర్వాత సాతాను ప్రేరణతో దావీదు ఇశ్రాయేలు యోధులను లెక్కించాడు. (1 దినవృత్తాంతములు 21:⁠1) అలా లెక్కించడం దావీదులో దేవుని భయం సన్నగిల్లిందని చూపించింది, ఫలితంగా 70,000 మంది ఇశ్రాయేలీయులు మరణించారు. యెహోవా ఎదుట దావీదు పశ్చాత్తాపం చూపించినప్పటికీ, ఆయన, ఆయన జనులు తీవ్ర బాధననుభవించారు.​—⁠2 సమూయేలు 24:1-16.

15 దావీదులో తాత్కాలికంగా దేవుని భయం సన్నగిల్లడం ఊరియా భార్యయైన బత్షెబతో అక్రమ సంబంధానికి దారితీసింది. వ్యభిచారం లేదా మరొకరి భార్యను ఆశించడం తప్పని దావీదుకు తెలుసు. (నిర్గమకాండము 20:​14, 17) బత్షెబ స్నానం చేస్తున్నప్పుడు దావీదు చూడడంతో సమస్య ప్రారంభమైంది. దేవునిపట్ల సరైన భయం, దావీదు వెంటనే తన చూపు మరల్చుకొని, వేరే విషయాలు ఆలోచించేలా ఆయనను పురికొల్పేది. బదులుగా, దేవుని భయాన్ని మరుగుచేసేంతగా దావీదు ఆమెను ‘మోహపుచూపుతో’ చూశాడు. (మత్తయి 5:28; 2 సమూయేలు 11:​1-4) తన జీవితంలోని ప్రతీ అంశంతో యెహోవాకు సంబంధముందనే విషయం దావీదు మర్చిపోయాడు.​—⁠కీర్తన 139:​1-7.

16 బత్షెబ దావీదుల అక్రమ సంబంధంవల్ల వారికొక కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత కొద్దికాలానికి, దావీదు పాపాన్ని బయటపెట్టేందుకు యెహోవా తన ప్రవక్తయైన నాతానును పంపించాడు. విషయం గ్రహించిన తర్వాత దావీదు దేవుని భయాన్ని తిరిగి అలవర్చుకొని పశ్చాత్తాపపడ్డాడు. తనను త్రోసిపుచ్చవద్దని, తననుండి ఆయన పరిశుద్ధాత్మను తొలగించవద్దని యెహోవాను వేడుకున్నాడు. (కీర్తన 51:​7, 11) యెహోవా దావీదును క్షమించి శిక్షనైతే తగ్గించాడు గానీ, దావీదు పనులవల్ల కలిగిన చెడు పర్యవసానాలన్నిటి నుండి ఆయనను కాపాడలేదు. దావీదుకు పుట్టిన కుమారుడు చనిపోయాడు, ఇక అప్పటినుండి దుఃఖం, విషాదం ఆయన కుటుంబాన్ని చుట్టుముట్టాయి. దేవుని భయం సన్నగిల్లడంవల్ల ఎంత మూల్యం చెల్లించాల్సివచ్చిందో కదా!​—⁠2 సమూయేలు 12:​10-14; 13:​10-14; 15:14.

17 అదేవిధంగా నేడు, నైతిక విషయాల్లో దేవునికి భయపడకపోతే తీవ్రమైన, శాశ్వతమైన పర్యవసానాలు ఎదురవవచ్చు. విదేశాల్లో పనిచేస్తున్నప్పుడు తన క్రైస్తవ భర్త తనకు అన్యాయం చేశాడని తెలుసుకున్న ఒక యౌవన భార్య అనుభవించిన బాధను ఒక్కసారి ఊహించుకోండి. ఆమె చెప్పలేని దుఃఖంతో ముఖాన్ని చేతుల్లో దాచుకుని భోరున ఏడ్చింది. ఆమె నమ్మకాన్ని, గౌరవాన్ని తిరిగి చూరగొనేందుకు ఆ భర్తకు ఎంతకాలం పడుతుందో కదా? దేవునికి నిజంగా భయపడడం ద్వారా అలాంటి విషాదకరమైన పర్యవసానాలను తప్పించుకోవచ్చు.​—⁠1 కొరింథీయులు 6:​18.

దేవుని భయం పాపం చేయకుండా మనల్ని అదుపులో ఉంచుతుంది

18 సాతాను ఈ లోక నైతిక విలువల్ని అతి వేగంగా నాశనం చేస్తున్నాడు, ప్రత్యేకంగా అతడు నిజ క్రైస్తవులను భ్రష్టుపట్టించాలనుకుంటున్నాడు. అలా భ్రష్టుపట్టించేందుకు అతడు మన హృదయాలకు, మనసులకు నేరుగా చేరుకోగల మార్గాన్ని అంటే జ్ఞానేంద్రియాలను ప్రత్యేకంగా మన కళ్లను, చెవులను ఉపయోగించుకుంటాడు. (ఎఫెసీయులు 4:​17-19) అనుకోకుండా మీకు అనైతిక చిత్రాలు, మాటలు లేదా ప్రజలు ఎదురైనప్పుడు మీరెలా స్పందిస్తారు?

19 ఐరోపాలో ఒక క్రైస్తవ పెద్దగా, తండ్రిగా, డాక్టరుగా ఉన్న ఆండ్రే విషయమే తీసుకోండి. * ఎప్పుడూ రాత్రిపూట మాత్రమే పనిచేయవలసిన ఆసుపత్రిలో ఆండ్రే పని చేస్తున్నప్పుడు, తోటి ఉద్యోగులైన స్త్రీలు తమతో లైంగిక సంబంధానికి ఆహ్వానిస్తూ హృదయం బొమ్మలున్న చిన్న చీటీలను ఆయన తలదిండుకు చాలాసార్లు అతికించారు. ఆండ్రే వారి ప్రతిపాదనల్ని గట్టిగా నిరాకరించాడు. అంతేకాక, అలాంటి చెడు వాతావరణం నుండి తప్పుకుని వేరేచోట ఉద్యోగం చూసుకున్నాడు. దేవునికి భయపడడం జ్ఞానయుక్తమే కాక ఆశీర్వాదాలకూ నడిపించింది, నేడు ఆండ్రే తన దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో పార్ట్‌టైమ్‌ సేవ చేస్తున్నాడు.

20 అదేపనిగా తప్పుడు ఆలోచనలతో ఉండడం ఒక వ్యక్తి తనకేమాత్రం హక్కులేని వాటికోసం యెహోవాతో తనకున్న అమూల్యమైన సంబంధాన్ని పోగొట్టుకునేందుకు సిద్ధపడే మానసిక వైఖరిని వృద్ధిచేసుకోవడానికి నడిపించవచ్చు. (యాకోబు 1:​14, 15) మరోవైపు, మనం యెహోవాకు భయపడితే మన నైతిక అప్రమత్తతను దిగజార్చేందుకు కారణమయ్యే ప్రజలకు, ప్రాంతాలకు, కార్యకలాపాలకు, వినోదాలకు దూరంగా ఉంటాం, అంతేకాక వాటి ఛాయలకైనా వెళ్లం. (సామెతలు 22:⁠3) అది ఎంత అవమానకరంగా ఉన్నా లేక ఎంత త్యాగం చేయాల్సివచ్చినా దానిని దేవుని అనుగ్రహం కోల్పోవడంతో పోలిస్తే అది అత్యల్పంగా ఉంటుంది. (మత్తయి 5:​29, 30) దేవునికి భయపడడంలో, అశ్లీల చిత్రాలతోపాటు ఎలాంటి అనైతిక విషయాల జోలికి వెళ్లకుండా ఉండడం, “వ్యర్థమైనవాటిని చూడకుండా” మన కళ్లను ప్రక్కకు త్రిప్పుకోవడం ఇమిడివున్నాయి. మనమలా చేస్తే, యెహోవా ‘మనల్ని బ్రతికించి’ మనకు నిజంగా అవసరమైన ప్రతీది అనుగ్రహిస్తాడని నమ్మవచ్చు.​—⁠కీర్తన 84:⁠11; 119:​37.

21 దేవునిపట్ల నిజమైన భయంతో ప్రవర్తించడం అన్ని సమయాల్లోనూ జ్ఞానయుక్తం. అంతేకాక, దానివల్ల నిజమైన సంతోషం కూడా కలుగుతుంది. (కీర్తన 34:⁠9) ఈ విషయం తర్వాతి ఆర్టికల్‌లో స్పష్టం చేయబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 5 యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! ఫిబ్రవరి 8, 1998 సంచికలో “బైబిలు ఉద్దేశము: ప్రేమా స్వరూపియైన దేవునికి మీరెలా భయపడగలరు?” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 25 పేరు మార్చబడింది.

మీరు వివరించగలరా?

•దేవుని భయంలో ఎలాంటి క్రైస్తవ లక్షణాలు ఇమిడివున్నాయి?

•మనుష్య భయాన్ని దేవుని భయమెలా నిరర్థకం చేస్తుంది?

•మనకు ప్రార్థన విషయంలో సరైన దృక్కోణమే ఉందని మనమెలా చూపించవచ్చు?

•పాపం చేయకుండా దేవుని భయం మనల్నెలా నిరోధించగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

1. దైవభయమనే తలంపును అర్థం చేసుకోవడం చాలామందికి ఎందుకు కష్టంగా ఉంటుంది?

2, 3. దేవునిపట్ల నిజమైన భయం కలిగివుండడంలో ఏమి ఇమిడిఉన్నాయి?

4. ‘యెహోవాకు భయపడడం’ అంటే ఏమిటో నేర్చుకునేందుకు మనకేది సహాయం చేస్తుంది?

5. మందను కాయడం, యెహోవాకు భయపడడాన్ని దావీదుకు ఎలా నేర్పించింది?

6. యెహోవా గొప్పతనాన్ని గ్రహించినప్పుడు దావీదులో ఎలాంటి భావాలు కలిగాయి?

7. గొల్యాతుతో పోరాడేందుకు దేవుని భయం దావీదుకు ఎలా సహాయం చేసింది?

8. దేవుని భయంగల వ్యక్తులకు సంబంధించిన బైబిలు ఉదాహరణలు మనకేమి బోధిస్తున్నాయి?

9. ఎలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుని భయాన్ని కనబరిచాడు?

10. ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు దావీదు దేవుని భయాన్ని ఎలా చూపించాడు?

11. దావీదులాగే మనం పరీక్షను ఎదుర్కొన్నప్పుడు దైవభయాన్ని ఎలా చూపించవచ్చు?

12. మనం మన ప్రార్థనల్ని ఎందుకు ప్రాముఖ్యమైనవిగా పరిగణించాలి, మనలో ఎన్నటికీ ఎలాంటి స్వభావం ఉండకూడదు?

13. దేవుని ధర్మశాస్త్రంపట్ల గౌరవం చూపించడంలో దావీదు ఎప్పుడు తప్పిపోయాడు?

14. దావీదు ఇశ్రాయేలీయులను లెక్కించడంవల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురయ్యాయి?

15. దావీదు లైంగిక పాపంలో పడిపోయేందుకు ఏది కారణమైంది?

16. దావీదు తప్పు చేసినందుకు ఎలాంటి పర్యవసానాలు అనుభవించాడు?

17. పాపపు క్రియలవల్ల కలిగే దుఃఖాన్ని ఉదాహరించండి.

18. సాతాను లక్ష్యమేమిటి, అతడు ఎలా పని చేస్తాడు?

19. శోధనను జయించేలా దైవభయం ఒక క్రైస్తవునికి ఎలా సహాయం చేసింది?

20, 21. (ఎ) పాపం చేయకుండా దేవుని భయం మనకెలా సహాయం చేస్తుంది?(బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా చేతిపనిని గమనించినప్పుడు దావీదు దేవుని భయమేమిటో తెలుసుకున్నాడు

[24వ పేజీలోని చిత్రాలు]

అనుకోని శోధన మీకు ఎదురైతే మీరెలా స్పందిస్తారు?