బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా సంతుష్టిని పొందండి
బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా సంతుష్టిని పొందండి
కాళ్ళు ముడుచుకు పడుకొని సన్నగా గురకతీసే పిల్లిని మీరు చూసే ఉంటారు. సంతుష్టికి అది సరైన చిత్రీకరణ. ఆ పిల్లిలాగే కాళ్లు ముడుచుకు పడుకుని, అలాంటి సంతుష్టిని ఆస్వాదించడం ఎంత బావుంటుందో కదా! అయితే, చాలామందికి సంతుష్టి పొందడమనేది చాలా కష్టమైనదే కాక, అది తాత్కాలికమైనది కూడా. ఎందుకలా?
ఎందుకంటే అపరిపూర్ణత కారణంగా మనం తరచూ తప్పులు చేస్తాం, ఎదుటివారి బలహీనతలనూ మనం సహించాలి. అంతేకాక, బైబిలు ‘అంత్యదినములని’ పిలుస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం, అవి ‘అపాయకరమైన కాలములని’ వర్ణించబడుతున్నాయి. (2 తిమోతి 3:1-5) బాల్యంలో మనం అనుభవించిన సంతుష్టికి సంబంధించిన విలువైన మధురానుభూతులు ఉన్నా, మనలో చాలామందిమి ఈ ‘అపాయకరమైన కాలముల’ తీవ్ర తాకిడిని ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఈ కాలంలో సంతుష్టిని పొందడం సాధ్యమేనా?
ఈ అపాయకరమైన కాలాలను ఎదుర్కోవడం అసాధ్యం కాదుగానీ, ఆ కాలాలతో వ్యవహరించడం అపాయకరంగా లేదా కష్టంగా ఉంటుందని లేఖనాలు చెబుతున్నట్లు గమనించండి. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా మనం వాటితో వ్యవహరించవచ్చు. మనం ఎల్లప్పుడూ మన సమస్యలను పరిష్కరించుకోలేకపోవచ్చు, కానీ మనం కొంతమేరకు సంతుష్టిని పొందుతాం. అలాంటి మూడు సూత్రాలను మనం పరిశీలిద్దాం.
వాస్తవిక దృక్కోణాన్ని కాపాడుకోండి
సంతుష్టిని పొందేందుకు, మనం మన పరిమితుల విషయంలో, ఎదుటివారి పరిమితుల విషయంలో వాస్తవిక దృక్కోణాన్ని కాపాడుకోవాలి. రోమీయులకు వ్రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని సూచిస్తున్నాడు: “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమీయులు 3:23) యెహోవా మహిమకు సంబంధించిన అనేక అంశాలు మన ఊహకందవు. ఆదికాండము 1:31లో చెప్పబడిన సరళమైన వాస్తవం దానికొక ఉదాహరణ. అక్కడిలా ఉంది: “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.” యెహోవా తాను చేసినవాటిని మరోసారి గుర్తుతెచ్చుకోవాలని అనుకున్నప్పుడల్లా, అది “చాలమంచిదిగ నుండెను” అనే ఆయనెల్లప్పుడూ చెప్పగలడు. ఏ మానవుడైనా ఎప్పుడూ అలా చెప్పలేడు. మన పరిమితులను గుర్తించడం సంతుష్టిని పొందేందుకు అవసరమైన మొదటి మెట్టు. అది మాత్రమే కాదు, ఇంకా ఎక్కువే చేయాలి. సంబంధిత విషయంపై యెహోవా దృక్కోణమేమిటో అర్థం చేసుకొని దాన్ని అంగీకరించాలి.
“పాపం” అని అనువదించబడిన గ్రీకుపదం, “గురితప్పడం” అనే మూలపదం నుండి వచ్చింది. ఉదాహరణకు: బాణంతో గురిని కొట్టి బహుమతి గెలవాలని ఆశిస్తున్న ఒక వ్యక్తిని ఊహించుకోండి. ఆయన దగ్గర మూడు బాణాలున్నాయి. ఆయన మొదటి బాణం వదులుతాడు, అది గురితప్పి ఒక మీటరు దూరంలో పడుతుంది. ఆయన ఇంకాస్త జాగ్రత్తగా గురిపెట్టి రెండవ బాణం వదులుతాడు, అయితే అది ఈసారి కూడా గురితప్పి 30 సెంటీమీటర్ల దూరంలో పడుతుంది. పూర్ణ ఏకాగ్రతతో ఆయన గురిచూసి తన చివరి బాణం వేస్తాడు, అది కేవలం 2 సెంటీమీటర్ల దూరంలో పడుతుంది. అది దాదాపుగా గురిని కొట్టినట్లే, కానీ కొంచెం తప్పినా అది తప్పినట్లే అవుతుంది.
మనం నిరాశచెందిన ఆ విలుకానిలా ఉన్నాం. కొన్నిసార్లు మనం చాలావరకు ‘గురి తప్పినట్లు’ అనిపిస్తుంది. మరికొన్నిసార్లు మనం దాదాపు గురిని కొట్టినట్లే అనిపిస్తుంది అయినా, గురిని తప్పుతాం. మనమెంత కష్టపడినా, అవసరమైనంత చేయలేక పోయామని మనం నిరాశచెందుతాం. మనమిప్పుడు తిరిగి ఆ విలుకాని దగ్గరకు వెళ్దాం.
ఆయన నిరాశతో నెమ్మదిగా వెనుదిరుగుతున్నాడు, ఎందుకంటే బహుమతి పొందాలని ఆయన మనసారా కోరుకున్నాడు. అయితే, అనుకోకుండా ఆ పోటీల అధికారి ఆయనను వెనక్కి పిలిచి, ఆయన చేతికి బహుమతినందిస్తూ ఇలా అన్నాడు: “దీనిని నీకివ్వాలని నేననుకుంటున్నాను, ఎందుకంటే నీ మీద నాకు అభిమానమేర్పడింది, నువ్వెంత కష్టపడ్డావో నేను గమనించాను.” దానికి ఆ విలుకాడు ఎంతో ఉప్పొంగిపోతాడు!
దేవుని నుండి పరిపూర్ణమైన నిత్యజీవమనే ‘కృపావరాన్ని’ లేదా బహుమతిని అందుకునే ప్రతీ ఒక్కరూ ఆ విలుకానిలానే ఉప్పొంగిపోతారు. (రోమీయులు 6:23) ఆ తర్వాత, వారు చేసే ప్రతీది పరిపూర్ణంగా ఉంటుంది, వారెన్నడూ మళ్ళీ గురితప్పరు. వారు పరిపూర్ణ సంతుష్టిని పొందుతారు. ఆ సమయమొచ్చే వరకు మనం ఈ దృక్కోణాన్ని మనసుల్లో ఉంచుకున్నప్పుడు, మన గురించి, మన చుట్టూ ఉన్నవారి గురించి మంచిగా భావిస్తాం.
ప్రతీదానికి సమయం పడుతుందని గుర్తించండి
ప్రతీదానికి సమయం పడుతుందనేది వాస్తవం. అయితే మీరు వేచి చూస్తున్నది అనుకున్నదానికన్నా ఆలస్యమవుతున్నట్లు అనిపిస్తున్నప్పుడు లేదా ఇబ్బందికరమైన ఒక పరిస్థితి ఊహించినదానికన్నా ఎక్కువకాలం కొనసాగుతున్నట్లు అనిపించినప్పుడు సంతుష్టి పొందడం ఎంత కష్టమో మీరు గమనించారా? అయినప్పటికీ, కొందరు అలాంటి పరిస్థితుల్లోనూ సంతుష్టిగా ఉండగలిగారు. యేసు ఉదాహరణను పరిశీలించండి.
భూమికి రాకముందు, యేసు పరలోకంలో విధేయతకు ఓ మంచి మాదిరిగా ఉన్నాడు. అయితే, ఆయన భూమిపై ఉన్నప్పుడు ‘విధేయతను నేర్చుకున్నాడు.’ ఎలా? “తాను పొందిన శ్రమలవలన.” అంతకుముందు ఆయన బాధపడుతున్నవారిని గమనించాడే గానీ, వ్యక్తిగతంగా ఆ బాధను తానెన్నడూ అనుభవించలేదు. భూమిపై ఉన్నప్పుడు, ప్రత్యేకంగా యొర్దానులో బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి గొల్గొతావద్ద మరణించేంతవరకు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఈ విషయంలో యేసు ఎలా ‘సంపూర్ణసిద్ధి పొండాడో’ మనకు పూర్తిగా తెలియదు గానీ, నేర్చుకోవడానికి మాత్రం ఆయనకు సమయం పట్టిందని మనకు తెలుసు.—హెబ్రీయులు 5:8, 9.
యేసు ‘తనయెదుట ఉంచబడిన ఆనందాన్ని’ అంటే తన నమ్మకత్వానికి లభించే ప్రతిఫలాన్ని ధ్యానించిన కారణంగానే సఫలీకృతుడయ్యాడు. (హెబ్రీయులు 12:1-2) అయితే, ఆయన కొన్నిసార్లు ‘మహా రోదనముతోను, కన్నీళ్లతోను ప్రార్థనలను యాచనలను సమర్పించాడు.’ (హెబ్రీయులు 5:7) మనం కూడా కొన్నిసార్లు అలాగే ప్రార్థిస్తుండవచ్చు. యెహోవా అలాంటి ప్రార్థనను ఎలా దృష్టిస్తాడు? యేసు చేసిన ప్రార్థనను యెహోవా ‘అంగీకరించాడని’ అదే వచనం చూపిస్తోంది. అదేవిధంగా దేవుడు మన ప్రార్థనలను కూడా అంగీకరిస్తాడు. ఎందుకు అంగీకరిస్తాడు?
ఎందుకంటే, యెహోవాకు మన పరిమితులు తెలుసు, ఆయన మనకు సహాయం చేస్తాడు. సహించడంలో ప్రతీ ఒక్కరికి పరిమితులున్నాయి. ఆఫ్రికాలోని, బెనిన్‌లో ప్రజలు ఇలా అంటారు: “నీరు అధికమైతే అది చివరకు కప్పలను కూడా ముంచేస్తుంది.” మన పరిమితుల గురించి మనకన్నా యెహోవాకే ఎక్కువ తెలుసు. ఆయన ‘సమయోచితమైన సహాయము కోసం కృపను, కనికరమును’ ప్రేమతో అనుగ్రహిస్తాడు. (హెబ్రీయులు 4:16) ఆయన యేసుకూ, అసంఖ్యాకమైన ఇతరులకూ అలాగే చేశాడు. మోనికా, యెహోవా సహాయాన్ని ఎలా పొందిందో పరిశీలించండి.
మోనికా చీకూచింతా లేకుండా, సంతోషంగా ఓ చురుకైన వ్యక్తిగా పెరిగింది. అయితే, 1968లో ఆమె ఇంకా 20వ పడిలో ఉండగానే తనకు మల్టిపుల్ స్ల్కీరోసిస్ (నాడీ వ్యవస్థను దెబ్బతీసే వ్యాధి) సోకిందని తెలుసుకొని నిర్ఘాంతపోయింది, సాధారణంగా ఈ వ్యాధివల్ల పాక్షికంగా పక్షవాతం వస్తుంది. ఇది ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది అంతేకాక, ఆమె తన పూర్తికాల పరిచర్యకు సంబంధించి ముఖ్యమైన సర్దుబాట్లు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అది దీర్ఘకాలిక అనారోగ్యమని మోనికా గ్రహించింది. పదహారు సంవత్సరాల తర్వాత ఆమె ఇలా అంది: “నా వ్యాధికి ఇప్పటికీ చికిత్సలేదు, సమస్తాన్ని నూతనపరిచే దేవుని నూతన విధానం వచ్చేంత వరకు బహుశా అదలాగే ఉండొచ్చు.” జీవితం కొనసాగించడం అంత సులభం కాలేదని ఆమె అంగీకరిస్తోంది: “నేను నా ఆనందాన్ని కాపాడుకుంటున్నానని, నేనెప్పటిలానే సంతోషంగా ఉన్నానని నా స్నేహితులు అంటున్నప్పటికీ . . . అప్పుడప్పుడు నా కన్నీళ్ళు ధారగా ప్రవహిస్తాయని నా సన్నిహిత స్నేహితులకు తెలుసు.”
అయితే, ఆమె ఇలా అంటోంది: “నేను సహనంగా ఉండడమే కాక, నా ఆరోగ్యం ఏ కాస్త బాగుపడినా దాన్నిచూసి సంతోషించడం కూడా నేర్చుకున్నాను. వ్యాధితో పోరాడే విషయంలో మనిషి ఎంత నిస్సహాయుడో చూడడం, యెహోవాతో నా వ్యక్తిగత సంబంధాన్ని బలపర్చింది. యెహోవా మాత్రమే సంపూర్ణ స్వస్థతను తీసుకురాగలడు.” యెహోవా సహాయంతో, మోనికా సంతుష్టిగా ఉండడమేకాక, ఆమె ఇప్పుడు 40 కన్నా ఎక్కువ సంవత్సరాల పూర్తికాల సేవను గుర్తు తెచ్చుకోగలుగుతోంది.
మోనికాకున్నలాంటి పరిస్థితులు అంత సులభం కాదని అంగీకరించవలసిందే. అయితే కొన్ని విషయాలు మీరు ఎదురుచూసిన దానికన్నా ఎక్కువ సమయం తీసుకుంటాయని గుర్తించినప్పుడు మీరు మరింత సంతుష్టిగా ఉంటారు. మోనికాలాగే, మీరు కూడా యెహోవా ఇచ్చే “సమయోచితమైన సహాయము” మీద నమ్మకముంచవచ్చు.
ఇతరులతో పోల్చుకోకండి—సముచితమైన లక్ష్యాలు పెట్టుకోండి
మీరొక ప్రత్యేకమైన వ్యక్తి. అచ్చం మీలాగే మరో వ్యక్తి ఎవరూ ఉండరు. ఈ సత్యాన్ని ఆఫ్రికా సంబంధిత గూన్ భాషలోని ఓ లోకోక్తి సరళంగా ఇలా చెబుతోంది: “అన్ని వేళ్ళూ ఒకేలా ఉండవు.” ఒక వేలిని మరో వేలుతో పోల్చడం అవివేకం. యెహోవా మిమ్మల్ని మరో వ్యక్తితో పోల్చాలని మీరు కోరుకోరు, ఆయనలా ఎన్నడూ చేయడు. అయితే, మానవుల్లో ఇతరులతో పోల్చుకోవాలనే వైఖరి ఎక్కువగా ఉండడమే కాక, అది ప్రజలు సంతుష్టిని పొందకుండా చేయగలదు. మత్తయి 20:1-16లో మనం చదువుతున్నట్లుగా, యేసు దీన్ని ఎంత శక్తిమంతంగా ఉదాహరించాడో గమనించండి.
తన ద్రాక్షాతోటలో పనిచేయడానికి కూలీలు అవసరమున్న ఒక “యజమాని” గురించి యేసు మాట్లాడాడు. ఆయన కొంతమంది పనిలేనివారిని కనుగొని వారిని, బహుశా ఉదయం 6 గంటల నుండి పనిచేసేందుకు, కూలికి పెట్టుకున్నాడు. వారు ఆ కాలంలోని సాధారణ కూలికి అంటే 12 గంటల పని దినానికి ఒక దేనారం భత్యానికి ఒప్పుకున్నారు. సాధారణ భత్యానికే కూలిపని దొరికినందుకు వారు సంతోషపడ్డారనడంలో సందేహం లేదు. ఆ తర్వాత, యజమాని పనిలేని వేర్వేరు గుంపులవారిని కనుగొని కొందరిని ఉదయం 9 గంటలకు, కొందరిని మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు, చివరకు మరికొందరిని సాయంకాలం 5 గంటలకు కూడా పనిలో చేర్చుకున్నాడు. ఈ గుంపులలోని ఏ ఒక్కరూ రోజంతా పనిచేయరు. కూలీ విషయంలో యజమాని వారికి “యేమి న్యాయమో అది” ఇస్తానని వాగ్దానం చేశాడు, దానికి పనివారు ఒప్పుకున్నారు.
సాయంకాలం, ఆ యజమాని వారికి కూలి ఇమ్మని తన గృహనిర్వాహకునికి ఆజ్ఞాపించాడు. పనివారిని పిలిచి చివర వచ్చినవారికి కూలి మొదటిమ్మని చెప్పాడు. వీరు కేవలం ఒక గంట మాత్రమే పని చేశారు, కానీ ఆశ్చర్యకరంగా ఒక రోజు కూలి పొందారు. ఆ తర్వాత జరిగిన సంభాషణను మనం ఊహించుకోవచ్చు. పూర్తిగా 12 గంటలు పనిచేసినవారు, తమ తర్వాత వచ్చినవారితో పోలిస్తే తమకు ఎక్కువ దొరుకుతుందని అనుకున్నారు. అయితే వారికి కూడా అంతే కూలి దొరికింది.
వారెలా స్పందించారు? “వారది తీసికొని—చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజమానునిమీద సణుగుకొనిరి.”
అయితే యజమాని, పరిస్థితిని మరో కోణం నుండి చూశాడు. ఆయన వారెంతకు ఒప్పుకున్నారో అంతే తీసుకున్నారని, తక్కువేమీ తీసుకోలేదని సూచించాడు. మిగతావాళ్ళకు, ఆయన నిస్సందేహంగా వారు ఊహించినదానికన్నా ఎక్కువే అంటే ఒకరోజు కూలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి ఏ ఒక్కరూ ఒప్పందం చేసుకున్నదానికన్నా తక్కువ పొందలేదు; వాస్తవానికి, చాలామంది తాము ఊహించినదానికన్నా ఎక్కువే పొందారు. కాబట్టి చివరకు, ఆ యజమాని ఇలా అడిగాడు, “నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా?”
ఒకవేళ గృహనిర్వాహకుడు మొదటివారికి మొదటే కూలి ఇచ్చివుంటే, వారు ముందే వెళ్ళిపోయి, సంతుష్టిగా ఉండేవారు. వారెప్పుడైతే ఇతరులు తక్కువ పనిచేసినా సమానంగా కూలి పొందడం చూశారో, అప్పుడు మాత్రమే వారిలో అసంతృప్తి కలిగింది. అది వారిలో ఎంత కోపాన్ని రగిలించిందంటే, తమను కూలికి పెట్టుకున్నందుకు ఎంతో కృతజ్ఞత చూపించవలసిన యజమాని మీదే వారు సణిగేందుకు దారితీసింది.
మనం ఇతరులతో పోల్చుకుంటే ఏమి జరుగుతుందో ఇది చక్కగా ఉదాహరిస్తోంది. యెహోవాతో మీకున్న వ్యక్తిగత సంబంధం గురించి ధ్యానించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో దానిపట్ల కృతజ్ఞత కలిగివున్నప్పుడు, మీరు సంతుష్టిగా ఉంటారు. మీ పరిస్థితిని ఇతరుల పరిస్థితితో పోల్చుకోకండి. ఒకవేళ యెహోవా ఇతరులకు మరింత మేలు చేసేందుకు నిర్ణయించాడన్నట్లు అనిపిస్తే, వారి విషయంలో ఆనందంగా ఉండండి, వారితోపాటు ఆనందించండి.
అయితే, యెహోవా మీ నుండి ఒకటి ఆశిస్తున్నాడు. ఏమిటది? గలతీయులు 6:4 ఇలా చెబుతోంది “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.” మరో విధంగా చెప్పాలంటే, మీ కోసం మీరు సముచితమైన లక్ష్యాలు పెట్టుకోండి. వాస్తవంగా మీరెంత చేయగలరో అంతవరకే పథకం వేసుకొని, దాన్ని అనుసరించండి. ఆ లక్ష్యం సముచితమైనదై మీరు దాన్ని చేరుకుంటే, మీకు ‘అతిశయము కలుగుతుంది.’ మీరు సంతుష్టి పొందుతారు.
ప్రతిఫలం లభిస్తుంది
మనం పరిశీలించిన మూడు సూత్రాలు, వాస్తవానికి మనం అపరిపూర్ణులమైనప్పటికీ, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ఈ అంత్యదినాల్లో కూడా సంతుష్టిని పొందేందుకు సహాయం చేస్తుందని చూపిస్తున్నాయి. మీరు ప్రతీరోజు బైబిలు చదివేటప్పుడు, దానిలోని కథనాల్లో, ఉపమానాల్లో సరళంగా పేర్కొనబడిన లేదా అంతర్లీనంగా దాగివున్న సూత్రాల కోసం ఎందుకు చూడకూడదు?
మీలో సంతుష్టి లోపిస్తున్నట్లు అనిపిస్తే, దానికి అసలు కారణమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఆ తర్వాత, పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు మీరు అన్వయించుకోగల సూత్రాలకోసం చూడండి. ఉదాహరణకు, “ప్రతిలేఖనము” విశ్వసనీయమైనది, ప్రయోజనకరమైనది * అనే బ్రోషుర్‌లోని 22-23 పేజీలను మీరు పరిశీలించవచ్చు. ఆ పేజీల్లో సామెతల పుస్తకం చర్చించబడింది, మీరక్కడ 12 శీర్షికల క్రింద, చాలా సూత్రాలను, సలహాలను చూస్తారు. వాచ్‌టవర్ పబ్లికేషన్ ఇండెక్స్,* సీడీ-రామ్‌పై వాచ్‌టవర్ లైబ్రరీ* సమాచారానికి శ్రేష్ఠమైన మూలాలు. వాటిని తరచూ ఉపయోగించడం ద్వారా, అన్వయించుకోగల సూత్రాలను తెలుసుకోవడంలో మీరు ప్రవీణులవుతారు.
అర్హులైనవారికి యెహోవా అందించే పరదైసు భూమిపై పరిపూర్ణ నిత్యజీవాన్నిచ్చే సమయం రాబోతోంది. అప్పుడు వారి జీవితాల్లో సంపూర్ణమైన సంతుష్టి ఉంటుంది.
[అధస్సూచి]
^ పేరా 30 యెహోవాసాక్షులు ప్రచురించినవి.
[12వ పేజీలోని బ్లర్బ్]
“అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.”—రోమీయులు 3:23
[13వ పేజీలోని బ్లర్బ్]
యేసు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొన్నాడు.—హెబ్రీయులు 5:8, 9
[15వ పేజీలోని బ్లర్బ్]
“అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.”—గలతీయులు 6:4