అధికార నిర్వహణలో క్రీస్తును అనుకరించండి
అధికార నిర్వహణలో క్రీస్తును అనుకరించండి
కొన్ని సంవత్సరాల క్రితం, మానవ ప్రవర్తనకు సంబంధించి నిర్వహించబడిన ఒక ప్రయోగం ఆసక్తికరమైన ఫలితాలనిచ్చింది. ఆ ప్రయోగంలో పాల్గొంటున్నవారు రెండు గుంపులుగా విభజించబడ్డారు. ఒక గుంపువారు, ఖైదీలుగా నియమించబడిన మరో గుంపుపై కాపలాదారులుగా నియమించబడ్డారు. అప్పుడేమి జరిగింది?
“కొద్దిరోజుల్లోనే, [కాపలాదారుల్లోని] చాలామంది ఇతరులను అవమానిస్తూ, దౌర్జన్యం చేస్తూ, తరచూ శిక్షించేవారిగా తయారయ్యారు, మరోవైపు ఖైదీలుగా ఉన్నవారు పిరికివారిగా, అణగిమణగి ఉండేవారిగా తయారయ్యారు” అని నివేదించబడింది. చివరకు ఆ పరిశోధకులు ఈ నిర్ధారణకొచ్చారు: దాదాపు ప్రతి ఒక్కరూ అధికార దుర్వినియోగమనే ఉరిలో చిక్కుకునే అవకాశముంది.
అధికార వినియోగం, దుర్వినియోగం
అధికారాన్ని సరిగా నిర్వహిస్తే అది మేలును చేకూర్చగలదు. అది తగిన నిర్దేశాన్ని అందించడమే కాక, భౌతిక, భావోద్రేక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను చేకూర్చగలదు. (సామెతలు 1:5; యెషయా 48:17, 18) అయితే, పైన ప్రస్తావించబడిన ప్రయోగం చూపించిన విధంగా సముచిత అధికార నిర్వహణలో హద్దులు మీరే ప్రమాదం ఎల్లప్పుడూ పొంచివుంటుంది. బైబిలు ఈ ప్రమాదాన్నే నొక్కిచెబుతూ ఇలా అంటోంది: “దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.”—సామెతలు 29:2; ప్రసంగి 8:9.
సదుద్దేశంతో నిర్వహించినా, అధికార దుర్వినియోగం హానికరంగానే ఉంటుంది. ఉదాహరణకు, ఈ మధ్యనే ఐర్లాండ్లో ఒక మతబోధనా వర్గంవారు తమ అధీనంలో ఉన్న పిల్లలపై కొంతమంది ఉపాధ్యాయులు చేసిన అధికార దుర్వినియోగం విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆ ఉపాధ్యాయుల్లో చాలామంది ఉద్దేశాలు నిస్సందేహంగా మంచివై ఉండవచ్చు, కానీ వారిలో కొందరి పద్ధతులు తీవ్ర హానిని కలిగించాయి. “ఉపాధ్యాయులుగా ఉన్న సహోదరులు అతి కఠినమైన, హింసాయుత పద్ధతులు ప్రయోగించడంవల్ల చాలామంది పిల్లలు మానసికంగా గాయపడ్డారు” అని ఒక వార్తాపత్రిక నివేదించింది. (ద ఐరిష్ టైమ్స్) మరి అలాంటప్పుడు, మాటలవల్ల లేదా చేతలవల్ల ఇతరులను దూరం చేసుకోకుండా లేదా వారికి హానికలిగించకుండా వారికెంతో ప్రయోజనం చేకూర్చే రీతిలో మీరెలా అధికారాన్ని నిర్వహించవచ్చు?—సామెతలు 12:18.
యేసుక్రీస్తుకు “సర్వాధికారము” ఇవ్వబడింది
యేసుక్రీస్తు మాదిరిని పరిశీలించండి. పరలోకానికి ఆరోహణమవడానికి ముందు ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.” (మత్తయి 28:18) ఆ విషయాన్నిబట్టి ఆయన శిష్యుల్లో ఎవరైనా భయపడ్డారా? అసమ్మతిని లేదా తిరుగుబాటును అణచివేయడంలో పేరుగాంచిన రోమా కైసరుల స్వభావాన్నే యేసు ప్రతిబింబిస్తాడని వారు భావించారా?
బైబిలు ఖచ్చితంగా లేదనే జవాబిస్తోంది. యేసుక్రీస్తు కూడా తన తండ్రిలాగే అధికారం నిర్వహిస్తాడు. యెహోవా న్యాయంగానే సర్వశక్తిగల విశ్వ సర్వాధిపతి అయినప్పటికీ, ఆయన తన ప్రజలనుండి మనఃపూర్వక సేవనే కోరతాడు కానీ, యాంత్రికంగా, భయంతో, తప్పదన్నట్లు చూపించే విధేయతను కోరడు. (మత్తయి 22:37) యెహోవా ఎన్నడూ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడు. ఈ విషయాన్ని యెహెజ్కేలు ప్రవక్తకు ఇవ్వబడిన నాటకీయ దర్శనం చూపిస్తోంది.
యెహెజ్కేలు ఆ దర్శనంలో యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించే నలుగురు దేవదూతలను చూశాడు. ప్రతీ దేవదూతకు నాలుగు ముఖాలు ఉన్నాయి. యెహెజ్కేలు ఇలా వ్రాస్తున్నాడు: “ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.” (యెహెజ్కేలు 1:10) ఆ నాలుగు ముఖాలు, పరిపూర్ణ సమతుల్యంగల దేవుని నాలుగు ప్రధాన లక్షణాలను లేదా గుణాలను సూచిస్తున్నాయి. అవి దేవుని వాక్యంలో ఇలా గుర్తించబడ్డాయి: మానవ ముఖంచేత సూచించబడిన ప్రేమ; సింహముఖంచేత సూచించబడిన న్యాయం; పక్షిరాజు ముఖంచేత సూచించబడిన జ్ఞానం. ఈ మూడు లక్షణాలు నాల్గవ లక్షణంతో అంటే ఎద్దు ముఖంచేత సూచించబడిన శక్తితో కలిసి పనిచేస్తాయి. దీనంతటి భావమేమిటి? యెహోవా తన ఇతర ప్రధాన లక్షణాలతో పొందికలేని రీతిలో ఎన్నడూ తన అపార శక్తినీ, అధికారాన్నీ ఉపయోగించడని ఆ దర్శనం చూపిస్తోంది.
యేసుక్రీస్తు కూడా ఎల్లప్పుడూ తన తండ్రిని అనుకరిస్తూ ప్రేమ, జ్ఞానం, న్యాయమనే లక్షణాలను సంపూర్ణ పొందికతో ఉపయోగిస్తూ తన అధికారం నిర్వహించాడు. యేసు అధికారం క్రింద సేవ చేయడంలో ఆయన శిష్యులు గొప్ప విశ్రాంతిని పొందారు. (మత్తయి 11:28-30) యెహోవా దేవునిలో, యేసుక్రీస్తులో ఒకే విధంగా కనబడే లక్షణం ఏదైనా ఉందంటే అది ప్రేమే గానీ శక్తో అధికారమో కాదు.—1 కొరింథీయులు 13:13; 1 యోహాను 4:8.
అధికారాన్ని మీరెలా నిర్వహిస్తారు?
ఈ విషయంలో మీరెలా ఉన్నారు? ఉదాహరణకు, కుటుంబంలో మీ వ్యక్తిగత అభిప్రాయాలు, అభిరుచుల విషయంలో పట్టుబడుతూ, అధికార బలంతో పరిస్థితుల్ని నియంత్రిస్తారా? మీ కుటుంబంలోని వారు మీపై ప్రేమ మూలంగా మీ నిర్ణయాలతో ఏకీభవిస్తారా లేక భయంతోనా? మీకున్న అధికారంవల్లే మీకు విధేయత చూపించబడుతోందా? కుటుంబ ఏర్పాటులో దైవపరిపాలనా క్రమాన్ని కాపాడే దృక్కోణంతో కుటుంబ యజమానులు ఈ ప్రశ్నలను పరిశీలించవచ్చు.—1 కొరింథీయులు 11:3.
క్రైస్తవ సంఘంలో మీకు కొంత అధికారముంటే అప్పుడేమిటి? మీరు దానిని సరిగా వినియోగిస్తున్నారో లేదో చూసుకునేందుకు, యెహోవా దేవుని ప్రేరణతో వ్రాయబడిన, యేసుక్రీస్తు మాదిరి ఉంచిన ఈ క్రింది సూత్రాలతో మిమ్మల్ని మీరు పోల్చిచూసుకోండి:
‘ప్రభువుయొక్క దాసుడు అందరి యెడల సాధువుగాను, కీడును సహించువాడుగాను, సాత్వికముతో బోధింప సమర్థుడుగాను ఉండవలెను.’—2 తిమోతి 2:26.
తొలి క్రైస్తవ సంఘంలో కొంతమందికి ఎక్కువ అధికారం ఉండేది. ఉదాహరణకు, ‘భిన్నమైన బోధ చేయవద్దని ఆజ్ఞాపించే’ అధికారం కూడా తిమోతికి ఉండేది. (1 తిమోతి 1:3) తిమోతి తాను చేసినదానంతటిలో దైవిక లక్షణాలను ప్రతిబింబించి ఉంటాడని మనం నమ్మవచ్చు, ఎందుకంటే “సాత్వికముతో” బోధించమనీ, పర్యవేక్షించడమనే తన క్రైస్తవ బాధ్యతను నిర్వహించడంలో “అందరి యెడల సాధువుగా” ఉండమనీ పౌలు ఆయనకు ఇచ్చిన ఉపదేశానికి అనుగుణంగా ప్రవర్తించాడనడంలో సందేహం లేదు. ఆయన వయసులో ఇతరులకన్నా చిన్నవాడు కాబట్టి, వృద్ధులతో గౌరవప్రదమైన కుమారునిలా, యౌవనులతో శ్రద్ధచూపించే సహోదరునిలా ప్రవర్తించాలి. (1 తిమోతి 5:1, 2) అటువంటి ప్రేమపూర్వక శ్రద్ధ ఉన్నప్పుడు, క్రైస్తవ సంఘం ఉదాసీనమైన, నిర్దాక్షిణ్యమైన వ్యాపార సంస్థ చూపించే స్ఫూర్తిని కాదుగానీ, ఆత్మీయత ప్రేమలతో నిండిన కుటుంబ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.—1 కొరింథీయులు 4:14; 1 థెస్సలొనీకయులు 2:7, 8.
‘అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురు. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను.’—మత్తయి 20:25, 26.
లోకంలోని అధికారులు తమ ఇష్టాన్ని ఇతరులపై రుద్దుతూ, ఫలానా రీతిలోనే పనులు చేయాలని పట్టుబడుతూ, ఒకవేళ అలా చేయకపోతే శిక్షిస్తామని బెదిరిస్తూ ‘వారిపై ప్రభుత్వం చేస్తారు.’ అయితే యేసుక్రీస్తు ఇతరులను బలవంతపెట్టకుండా వారికి సేవ చేయాలని నొక్కిచెప్పాడు. (మత్తయి 20:27, 28) ఆయన ఎల్లప్పుడూ తన శిష్యులతో ప్రేమపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా వ్యవహరించాడు. మీరు యేసు మాదిరిని అనుకరించినప్పుడు, మీతో సహకరించడం ఇతరులకు చాలా సులభంగా ఉంటుంది. (హెబ్రీయులు 13:7, 17) ఒకవేళ వారికి సాధ్యమైతే మీతోపాటు ‘రెండు మైళ్ళు’ నడిచేలా చేస్తుంది, అదీ బలవంతంగా కాదుకానీ ఇష్టపూర్వకంగా నడవడాన్ని కూడా సులభతరం చేస్తుంది.—మత్తయి 5:41.
“మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి.”—1 పేతురు 5:2, 3.
సంఘ సభ్యులందరి ఆధ్యాత్మిక సంక్షేమం విషయంలో తాము జవాబుదారులమని నేటి పైవిచారణకర్తలు గ్రహిస్తారు. వారు ఈ బాధ్యతను గంభీరమైనదిగా పరిగణిస్తారు. వారు దేవుని మందను ఇష్టపూర్వకంగా, సిద్ధమనస్సుతో, ప్రేమపూర్వకంగా కాసేందుకు కృషిచేస్తారు. అపొస్తలుడైన పౌలులాగే వారు తమ పర్యవేక్షణలో ఉన్నవారి విశ్వాసం విషయంలో ప్రభువుల్లా ప్రవర్తించక, వారి విశ్వాసాన్ని బలపర్చేందుకు కృషి చేస్తారు.—2 కొరింథీయులు 1:24.
సముచితమైన హితబోధ చేయవలసి వచ్చినప్పుడు, పెద్దలు సాత్వికమైన మనసుతో అలాచేస్తూ తప్పుచేసిన వ్యక్తిని మంచి దారికి తీసుకొస్తారు లేదా ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు తోటి క్రైస్తవునికి సహాయం చేస్తారు. అపొస్తలుడైన పౌలు గుర్తుచేసిన ఈ విషయాన్ని వారు మనసులో ఉంచుకుంటారు: “సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.”—గలతీయులు 6:1; హెబ్రీయులు 6:1, 9-11.
“ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి . . . పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:13, 14.
క్రైస్తవ ప్రమాణాలను సంపూర్ణంగా పాటించలేనివారితో మీరెలా వ్యవహరిస్తారు? యెహోవా, యేసుక్రీస్తులాగే మీరుకూడా వారి అపరిపూర్ణతలను పరిగణలోకి తీసుకుంటారా? (యెషయా 42:2-4) లేక ప్రతీ సందర్భంలోనూ పొల్లుపోకుండా దేవుని నియమాల్ని పాటించాలని పట్టుబడతారా? (కీర్తన 130:3) సాధ్యమైనప్పుడల్లా మృదు స్వభావం ప్రదర్శించడం, అవసరమైనప్పుడు మాత్రమే దృఢంగా ఉండడం సముచితమని గుర్తుంచుకోండి. ప్రేమతో వ్యవహరించడం మీకూ, మీ అధికారం క్రిందవున్నవారికీ మధ్య పరస్పర విశ్వాసనమ్మకాల బలమైన బంధం ఏర్పడేందుకు సహాయం చేస్తుంది.
మీకు ఎలాంటి అధికారం అప్పగించబడినా, దానిని నిర్వహించడంలో యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తును అనుకరించడానికి శాయశక్తులా కృషిచేయండి. యెహోవా తన ప్రజలపై నిర్వహించే అధికార విధానాన్ని కీర్తనకర్త ఎంత అద్భుతంగా వర్ణించాడో గుర్తుతెచ్చుకోండి. దావీదు ఇలా ఆలపించాడు: “యెహోవా నా కాపరి. నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు; శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” అదేవిధంగా, యేసు గురించి మనమిలా చదువుతాము: “నేను గొఱ్ఱెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.” ప్రేమపూర్వక అధికార నిర్వహణ విషయంలో మనకు ఇంతకంటే మంచి మాదిరి ఇంకెవరున్నారు?—కీర్తన 23:1-3; యోహాను 10:14, 15.
[18వ పేజీలోని బ్లర్బ్]
యెహోవా తన శక్తిని, ఎల్లప్పుడూ తన న్యాయానికి, జ్ఞానానికి, ప్రేమకు అనుగుణంగా ఉపయోగిస్తాడు
[18వ పేజీలోని చిత్రం]
పెద్దలు కొన్ని సందర్భాల్లో తప్పుచేసినవారికి ప్రేమపూర్వక ఉపదేశాన్నివ్వాలి
[19వ పేజీలోని చిత్రం]
గౌరవప్రదమైన కుమారునిలా, శ్రద్ధచూపే సహోదరునిలా ప్రవర్తించమని పౌలు తిమోతికి ఉపదేశించాడు
[20వ పేజీలోని చిత్రం]
యేసుక్రీస్తు తన అధికారాన్ని న్యాయమైన, జ్ఞానవంతమైన, ప్రేమపూర్వకమైన రీతిలోనే నిర్వహిస్తాడు