అర్మగిద్దోను—సంతోషకరమైన ప్రారంభం
అర్మగిద్దోను—సంతోషకరమైన ప్రారంభం
“అర్మగిద్దోను” అనే పదం, హీబ్రూ పదబంధమైన “హార్‌మెగిద్దోను” నుండి వచ్చింది, దానికి “మెగిద్దో పర్వతం” అని అర్థం. ఆ పదం ప్రకటన 16:15లో ఉంది, ఆ వచనం ఇలా చెబుతోంది: “హెబ్రీభాషలో హార్‌మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.” అర్మగిద్దోను అనే చోటుకు ఎవరు పోగుచేయబడ్డారు, ఎందుకు పోగుచేయబడ్డారు? దానికి ముందున్న వచనంలోనే, అంటే ప్రకటన 16:14లో మనం ఇలా చదువుతాం: ‘సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులు’ పోగుచేయబడ్డారు. సహజంగానే ఆ మాటలు చాలా ఆసక్తికరమైన అదనపు ప్రశ్నలను లేవదీస్తాయి. ఆ “రాజులు” ఎక్కడ పోరాడతారు? ఆ యుద్ధంలో ఏ వివాదాంశం పరిష్కరించబడుతుంది, వారు ఎవరితో పోరాడతారు? చాలామంది అనుకుంటున్నట్లుగా ఆ రాజులు, సామూహిక నిర్మూలనా ఆయుధాలను ఉపయోగిస్తారా? అర్మగిద్దోనును ఎవరైనా తప్పించుకుంటారా? ఈ ప్రశ్నలకు బైబిలే సమాధానం చెప్పనివ్వండి.
“మెగిద్దో పర్వతం” గురించిన ప్రస్తావన, మధ్య ప్రాచ్యంలోని ఒక నిర్దిష్టమైన పర్వతమ్మీద అర్మగిద్దోను యుద్ధం జరుగుతుందనే భావాన్నిస్తుందా? లేదు. మొట్టమొదటిగా, ప్రాచీన మెగిద్దో ఉన్న ప్రదేశంలో అలాంటి పర్వతమేదీ నిజానికి ఉనికిలో లేదు, ఆ ప్రదేశానికి ప్రక్కన ఉన్న మైదానానికి దాదాపు 20 మీటర్ల ఎత్తులో ఒక మట్టిదిబ్బ మాత్రమే ఉంది. అంతేకాక, మెగిద్దో చుట్టూ ఉన్న ప్రదేశంలో ‘భూరాజులు వారి సేనలు’ అంతా పట్టరు. (ప్రకటన 19:19) అయితే, మధ్య ప్రాచ్య చరిత్రలో జరిగిన కొన్ని అతి భయంకరమైన, అతి నిర్ణయాత్మకమైన యుద్ధాలు మెగిద్దోలో జరిగాయి. అలా అర్మగిద్దోను అనే పేరు ఒక నిర్ణయాత్మకమైన పోరాటానికి చిహ్నంగా నిలుస్తుంది, ఆ యుద్ధంలో కేవలం ఒకే స్పష్టమైన విజేత ఉంటారు.—5వ పేజీలో ఉన్న “మెగిద్దో—సరైన చిహ్నం” అనే బాక్సు చూడండి.
అర్మగిద్దోను కేవలం భూజనాంగాల మధ్య జరిగే పోరాటం కాదు, ఎందుకంటే “లోకమంతట ఉన్న రాజులు,” “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము”లో ఐక్య సమాఖ్యగా ఏర్పడతారని ప్రకటన 16:14 చెబుతోంది. “యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు” చెల్లాచెదురవుతారని యిర్మీయా తన ప్రేరేపిత ప్రవచనంలో చెప్పాడు. (యిర్మీయా 25:33) కాబట్టి, అర్మగిద్దోను మధ్య ప్రాచ్యంలోని ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి పరిమితమయ్యే మానవ యుద్ధం కాదు. అది యెహోవా యుద్ధం, అది భూవ్యాప్తంగా జరుగుతుంది.
అయితే, ప్రకటన 16:15లో అర్మగిద్దోను ఒక “చోటు”గా పిలవబడిందనేది గమనించండి. బైబిల్లో “చోటు” అనేది స్థితిని లేక పరిస్థితిని సూచించవచ్చు, ఈ సందర్భంలోనైతే అది, యెహోవాను వ్యతిరేకించడంలో లోకమంతా ఐక్యంగా నిలిచే పరిస్థితిని సూచిస్తోంది. (ప్రకటన 12:6, 14) అర్మగిద్దోను యుద్ధంలో భూజనాంగాలంతా కలిసి “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అయిన యేసుక్రీస్తు సైనికాధికారం క్రింద ఉన్న “పరలోకమందున్న సేనలకు” వ్యతిరేకంగా నిలుస్తాయి.—ప్రకటన 19:14, 16.
అర్మగిద్దోను, సామూహిక నిర్మూలనా ఆయుధాలు ఇమిడివున్న ఒక మారణహోమంగా లేక ఆకాశ గ్రహంతో ఢీకొనడం ఇమిడివున్న ఒక మారణహోమంగా ఉంటుందని చెప్పబడుతున్న విషయమేమిటి? మానవజాతి, వారి గృహమైన భూమి అలా భయంకరమైన విధంగా అంతమవడానికి ప్రేమగల దేవుడు అనుమతిస్తాడా? అనుమతించడు. తాను భూమిని “నిరాకారముగానుండునట్లు” సృష్టించలేదు కానీ ‘నివాసస్థలమగునట్లుగా దాని సృజించాను’ అని ఆయన స్పష్టంగా చెప్పాడు. (యెషయా 45:18; కీర్తన 96:10) యెహోవా అర్మగిద్దోనులో మన భూగోళాన్ని భయంకరమైన అగ్నికి ఆహుతి చేయడు. అయితే ఆయన, ‘భూమిని నాశనం చేసేవారిని నాశనం చేస్తాడు.’—ప్రకటన 11:18.
అర్మగిద్దోను ఎప్పుడు వస్తుంది?
అర్మగిద్దోను ఎప్పుడు వస్తుందనే ప్రాముఖ్యమైన ప్రశ్న, శతాబ్దాలుగా అంతులేని ఊహాగానాలను సృష్టించింది. ప్రకటన పుస్తకాన్ని బైబిల్లోని ఇతర భాగాల ఆధారంగా పరిశోధించడం అతి ప్రాముఖ్యమైన ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుందనేది తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ప్రకటన 16:15, అర్మగిద్దోనును యేసు దొంగవలె రావడంతో ముడిపెడుతోంది. యేసు తాను ఈ విధానం మీద తీర్పు తీర్చడానికి రావడాన్ని గురించి వర్ణించడానికి కూడా ఆ ఉపమానాన్ని ఉపయోగించాడు.—మత్తయి 24:43, 44; 1 థెస్సలొనీకయులు 5:2.
బైబిలు ప్రవచనాల నెరవేర్పు చూపిస్తున్నట్లుగా మనం 1914 నుండి ఈ విధానపు అంత్యదినాల్లో జీవిస్తున్నాం. * “మహాశ్రమ” అని యేసు పిలిచిన కాలం, అంత్యదినాల చివరి భాగానికి సూచనగా ఉంటుంది. ఆ కాలవ్యవధి ఎంత ఉంటుందనేది బైబిలు చెప్పడం లేదు కానీ అది తీసుకువచ్చే విపత్తులు ఇంతవరకు లోకం చూసిన విపత్తులకన్నా ఘోరంగా ఉంటాయి. ఆ మహాశ్రమ అర్మగిద్దోనుతో ముగుస్తుంది.—మత్తయి 24:21, 29.
అర్మగిద్దోను ‘సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము’ కాబట్టి దానిని వాయిదా వేసేందుకు మానవులు ఏమీ చేయలేరు. యెహోవా ఆ యుద్ధం ప్రారంభమవడానికి ‘నిర్ణయకాలాన్ని’ విధించాడు. అది “జాగుచేయక వచ్చును.”—హబక్కూకు 2:3.
నీతిమంతుడైన దేవుడు న్యాయమైన యుద్ధం చేస్తాడు
అయితే, దేవుడు ఎందుకు భౌగోళిక యుద్ధం చేస్తాడు? అర్మగిద్దోనుకు ఆయన ప్రధాన లక్షణాల్లో ఒకటైన న్యాయంతో దగ్గరి సంబంధం ఉంది. బైబిలు ఇలా ప్రకటిస్తోంది: “యెహోవా న్యాయమును ప్రేమించువాడు.” (కీర్తన 37:28) ఆయన మానవ చరిత్రలో జరిగిన అన్యాయపు క్రియలన్నిటినీ చూశాడు. అవి సహజంగానే ఆయనకు నీతియుక్తమైన కోపాన్ని తెప్పిస్తాయి. అందుకే, ఆయన ఈ దుష్టవిధానాన్నంతటినీ నాశనం చేయడానికి ఒక న్యాయమైన యుద్ధం చేయడానికి తన కుమారున్ని నియమించాడు.
నాశనానికి తగినవారిని మాత్రమే నాశనం చేసి, యథార్థహృదయులు భూమ్మీద ఎక్కడ ఉన్నా వారు రక్షించబడే విధంగా నిజానికి ఒక న్యాయమైన యుద్ధం చేసేందుకు యెహోవాయే సమర్థుడు. (మత్తయి 24:40, 41; ప్రకటన 7:9, 10, 13, 14) అంతేకాక ఈ భూమంతటి మీద తన సర్వాధిపత్యాన్ని అమలు చేసే హక్కు ఆయనకు మాత్రమే ఉంది, ఎందుకంటే అది ఆయన సృష్టి.—ప్రకటన 4:10.
యెహోవా తన శత్రువుల మీద ఏ శక్తులను ఉపయోగిస్తాడు? మనకు దాని గురించి తెలియదు. దుష్ట జనాంగాలను పూర్తిగా నాశనం చేసే శక్తులు ఆయన దగ్గర ఉన్నాయని మాత్రం మనకు తెలుసు. (యోబు 38:22, 23; జెఫన్యా 1:15-18) అయితే, దేవుని భూ ఆరాధకులు ఆ యుద్ధంలో పాల్గొనరు. యేసుక్రీస్తుతోపాటు పరలోక సైన్యాలు మాత్రమే యుద్ధంలో పాల్గొంటాయని ప్రకటన 19వ అధ్యాయంలోని దర్శనం సూచిస్తోంది. భూమ్మీద ఉన్న యెహోవా క్రైస్తవ సేవకులెవ్వరూ ఆ యుద్ధంలో భాగం వహించరు.—2 దినవృత్తాంతములు 20:15, 17.
జ్ఞానవంతుడైన దేవుడు తగినంత హెచ్చరిక ఇస్తున్నాడు
అర్మగిద్దోనులో తప్పించుకొనేవారెవరైనా ఉంటారా? అర్మగిద్దోనులో ఎవరూ నాశనమవనవసరం లేదు. అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: ‘యెహోవా యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుతున్నాడు.’ (2 పేతురు 3:9) దేవుడు “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.—1 తిమోతి 2:4.
ఆ లక్ష్యాన్ని సాధించేందుకు, “రాజ్య సువార్త” భూవ్యాప్తంగా వందలాది భాషల్లో ప్రకటించబడేలా యెహోవా జ్ఞానయుక్తంగా చూశాడు. ఆ యుద్ధాన్ని తప్పించుకొనేందుకు రక్షణ పొందేందుకు అన్నిచోట్లా ఉన్న ప్రజలకు అవకాశం ఇవ్వబడుతోంది. (మత్తయి 24:14; కీర్తన 37:34; ఫిలిప్పీయులు 2:12) సువార్తకు అనుకూలంగా ప్రతిస్పందించేవారు అర్మగిద్దోనును తప్పించుకొని పరదైసు భూమ్మీద పరిపూర్ణులుగా నిరంతరం జీవించగలుగుతారు. (యెహెజ్కేలు 18:23, 32; జెఫన్యా 2:3; రోమీయులు 10:13) ప్రేమా రూపి అయిన దేవుని నుండి ఎవరైనా ఆశించేది అదే కాదా?—1 యోహాను 4:8.
ప్రేమగల దేవుడు యుద్ధం చేయగలడా?
అయితే ప్రేమకు ప్రతిరూపమైన దేవుడు, మానవజాతిలో చాలామందికి మరణశిక్షను ఎందుకు విధిస్తాడు, వారిని ఎందుకు నాశనం చేస్తాడు అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఆ పరిస్థితిని చీడపట్టిన ఇంటితో పోల్చవచ్చు. న్యాయబుద్ధిగల యజమాని చీడను తొలగించడం ద్వారా తన కుటుంబ ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని కాపాడాలని మీరు అంగీకరించరా?
అదేవిధంగా యెహోవాకు మానవులపట్ల ప్రగాఢమైన అనురాగం ఉంది కాబట్టే అర్మగిద్దోను యుద్ధం జరగాలి. భూమిని పరదైసుగా మార్చి మానవజాతికి పరిపూర్ణత, శాంతి చేకూర్చి ‘వారికి ఎవరి భయము లేకుండా’ చేయాలన్నదే దేవుని సంకల్పం. (మీకా 4:3, 4; ప్రకటన 21:4) అయితే తమ తోటిమానవుల శాంతిభద్రతలకు ముప్పువాటిల్లజేసేవారిని ఏమి చేయాలి? దేవుడు మార్చడానికి వీలుకాని అలాంటి దుష్టులైన “చీడలను” నీతిమంతుల కోసం నిర్మూలించాలి.—2 థెస్సలొనీకయులు 1:6, 9; ప్రకటన 21:8.
నేడు జరుగుతున్న పోరాటాలకు, రక్తపాతానికి చాలావరకు అపరిపూర్ణ మానవ పరిపాలన, జాతీయ ప్రయోజనాల కోసం చేసే స్వార్థపూరిత ప్రయత్నాలు కారణం. (ప్రసంగి 8:9) మానవ ప్రభుత్వాలు తమ ప్రాబల్యాన్ని పెంచుకొనే ప్రయత్నంలో దేవుడు స్థాపించిన రాజ్యాన్ని పూర్తిగా ఉపేక్షిస్తున్నాయి. అవి తమ సర్వాధిపత్యాన్ని విడిచి దానిని దేవునికి, క్రీస్తుకు ఇస్తాయనే సూచన ఏదీ కనిపించడం లేదు. (కీర్తన 2:1-9) కాబట్టి, క్రీస్తు ఆధ్వర్యంలోని యెహోవా రాజ్యపు నీతియుక్త పరిపాలనకు మార్గం సుగమం చేయడానికి అలాంటి ప్రభుత్వాలు నిర్మూలించబడాలి. (దానియేలు 2:44) ఈ గ్రహాన్ని, మానవజాతిని పరిపాలించే హక్కు ఎవరికి ఉందనే వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి అర్మగిద్దోను యుద్ధం జరగాలి.
యెహోవా మానవజాతి ప్రయోజనార్థం అర్మగిద్దోనులో క్రియాశీలంగా జోక్యం చేసుకుంటాడు. లోక పరిస్థితులు విషమిస్తున్నాయి కాబట్టి దేవుని పరిపూర్ణ పరిపాలనే మానవజాతి అవసరాలను పూర్తిగా తీరుస్తుంది. ఆయన రాజ్యం ద్వారానే నిజమైన శాంతి, సమృద్ధులు నెలకొంటాయి. దేవుడు శాశ్వతంగా జోక్యం చేసుకోకుండా ఉన్నట్లయితే లోక పరిస్థితులు ఎలా ఉంటాయి? శతాబ్దాలుగా నడుస్తున్న మానవ పరిపాలనలో మానవజాతిని పట్టిపీడించిన ద్వేషం, హింస, యుద్ధాలు ఎల్లప్పుడూ అలాగే ఉండిపోవాలా? అర్మగిద్దోను యుద్ధం నిజానికి మానవజాతికి ఎంతో మేలు చేస్తుంది!—లూకా 18:7, 8; 2 పేతురు 3:13.
యుద్ధాలన్నిటినీ అంతం చేసే యుద్ధం
అర్మగిద్దోను యుద్ధం ఇప్పటివరకు మరే ఇతర యుద్ధం సాధించని దానిని సాధిస్తుంది, అది యుద్ధాలన్నిటినీ అంతం చేస్తుంది. యుద్ధం గతించిన అంశంగా ఉండే దినాన్ని ఎవరు కోరుకోరు? అయితే యుద్ధాన్ని అంతం చేయడంలో మానవ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. యుద్ధాన్ని అంతం చేయడంలో మానవజాతి చేస్తున్న ప్రయత్నాలు అలా పదే పదే విఫలం కావడం యిర్మీయా మాటల్లో ఉన్న ఈ సత్యాన్ని నొక్కిచెబుతుంది: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:23) యెహోవా ఏమి సాధిస్తాడనే దాని గురించి బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే; యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.”—కీర్తన 46:8, 9.
దేశాలు తమ ప్రాణాంతకమైన ఆయుధాలను ఒకరి మీద మరొకరు ప్రయోగించి ఈ వాతావరణాన్ని నాశనం చేసే విధంగా ముప్పు వాటిల్లజేస్తున్నప్పుడు భూమిని సృష్టించిన సృష్టికర్త, బైబిలుకు సంబంధించిన అర్మగిద్దోనులో చర్య తీసుకుంటాడు! (ప్రకటన 11:18) కాబట్టి, ఆ యుద్ధం యుగాలుగా దైవభయంగల మానవులు ఆశించిన దానినే సాధిస్తుంది. భూమికి యజమానియైన యెహోవా దేవునికి తన సృష్టి అంతటినీ పరిపాలించే హక్కు ఉందని అది నిరూపిస్తుంది.
కాబట్టి, నీతిని ప్రేమించే ప్రజలు అర్మగిద్దోనుకు భయపడనవసరం లేదు. అది వారి నిరీక్షణకు ఆధారాన్నిస్తుంది. అర్మగిద్దోను యుద్ధం ఈ భూమ్మీద ఉన్న అవినీతినంతటినీ, దుష్టత్వానంతటినీ తీసివేసి దేవుని మెస్సీయా రాజ్య పరిపాలనలో నీతియుక్త నూతన విధానానికి మార్గం సుగమం చేస్తుంది. (యెషయా 11:3, 5) అర్మగిద్దోను భయంగొల్పే వినాశకరమైన అంతంగా ఉండే బదులు పరదైసు భూమ్మీద నిరంతరం జీవించే నీతియుక్త మానవులకు ఒక సంతోషకరమైన ప్రారంభానికి సూచనగా ఉంటుంది.—కీర్తన 37:29.
[అధస్సూచి]
^ పేరా 9 యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలోని 11వ అధ్యాయాన్ని చూడండి.
[5వ పేజీలోని బాక్సు/చిత్రం]
మెగిద్దో—సరైన చిహ్నం
ప్రాచీన మెగిద్దో చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంలో నెలకొని ఉంది, అక్కడినుండి ఉత్తర ఇశ్రాయేలులో ఉన్న సారవంతమైన యెజ్రెయేలు లోయ పడమటి భాగం కనిపిస్తుంది. అది అంతర్జాతీయ వ్యాపారాన్ని, ఆ ప్రాంతం గుండా వెళ్ళే సైనిక మార్గాలను నియంత్రించింది. అలా మెగిద్దో నిర్ణయాత్మక యుద్ధాలు జరిగే స్థలంగా మారింది. ప్రొఫెసర్ గ్రయమ్ డేవిస్, సిటీస్ ఆఫ్ ద బిబ్లికల్ వరల్డ్—మెగిద్దో అనే తన పుస్తకంలో ఇలా వ్రాశాడు: “మెగిద్దో పట్టణం . . . అన్ని దిశల నుండి వచ్చే వర్తకులు, శరణార్థులు సులభంగా చేరుకొనేలా ఉంది, అదే సమయంలో అది శక్తిమంతంగా ఉన్నట్లయితే ఆ మార్గాల్లో ప్రవేశాన్ని నియంత్రించి, తద్వారా వ్యాపారానికి యుద్ధానికి సంబంధించిన ఫలితాలను నిర్దేశించగలదు. అందుకే ఆ బహుమానం కోసం తరచూ యుద్ధాలు జరిగాయి, జయించినవారు దానిని దృఢంగా కాపాడుకున్నారు అనేది . . . ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదు.”
దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, ఐగుప్తు పరిపాలకుడు టుట్మోస్ III, మెగిద్దో పట్టణపు కనాను రాజులను ఓడించినప్పుడు ఆ పట్టణపు దీర్ఘ చరిత్ర మొదలైంది. 1918లో బ్రిటీష్ సైనికాధికారి ఎడ్మంట్ ఎలెన్బె, టర్కీ సైన్యాన్ని ఘోరంగా ఓడించేంతవరకు దాని దీర్ఘ చరిత్ర శతాబ్దాలకొద్దీ కొనసాగింది. మెగిద్దోలోనే న్యాయాధిపతియైన బారాకు, కనాను రాజు యాబీనును ఘోరంగా ఓడించడానికి దేవుడు సహాయం చేశాడు. (న్యాయాధిపతులు 4:12-24; 5:19, 20) ఆ పట్టణానికి దగ్గర్లోనే న్యాయాధిపతియైన గిద్యోను మిద్యానీయులను నిర్ణయాత్మకంగా ఓడించాడు. (న్యాయాధిపతులు 7:1-22) ఆ పట్టణంలోనే అహజ్యా, యోషీయా రాజులు కూడా చంపబడ్డారు.—2 రాజులు 9:27; 23:29, 30.
మెగిద్దోలో ఎన్నో నిర్ణయాత్మకమైన యుద్ధాలు జరిగాయి కాబట్టి, అర్మగిద్దోనును ఆ ప్రాంతంతో జతచేయడం సరైనది. దేవునికి వ్యతిరేకంగా నిలిచిన శక్తులన్నిటి మీద దేవుని పూర్తి విజయానికి అది సరైన చిహ్నం.
[చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[7వ పేజీలోని చిత్రాలు]
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు హెచ్చరిక, అర్మగిద్దోనును తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వబడుతున్నాయి
[7వ పేజీలోని చిత్రం]
అర్మగిద్దోను ఒక సంతోషకరమైన ప్రారంభానికి సూచనగా ఉంటుంది