కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మన కాపరి

యెహోవా మన కాపరి

యెహోవా మన కాపరి

“యెహోవా నా కాపరి. నాకు లేమి కలుగదు.”​కీర్తన 23:⁠1.

యెహోవా తన ప్రజలపట్ల చూపిస్తున్న శ్రద్ధను వర్ణించమని మిమ్మల్ని అడిగితే, మీరేమి చెబుతారు? తన నమ్మకమైన సేవకులపట్ల ఆయన చూపిస్తున్న వాత్సల్యపూరితమైన శ్రద్ధను మీరు దేనితో పోల్చగలరు? మూడువేలకన్నా ఎక్కువ సంవత్సరాల పూర్వం రాజైన దావీదు ఒక కీర్తనలో తన తొలి జీవనవృత్తికి సంబంధించిన ఒక అంశానికి పోలుస్తూ యెహోవాను అత్యంత రమ్యంగా వర్ణించాడు.

2 యువకునిగా ఉన్నప్పుడు దావీదు గొర్రెలకాపరిగా ఉన్నాడు, కాబట్టి గొర్రెలపట్ల శ్రద్ధ చూపించడమంటే ఏమిటో ఆయనకు తెలుసు. గొర్రెలను చూడకుండా వదిలేస్తే అవి సులభంగా తప్పిపోయి దొంగలబారినో లేదా క్రూరజంతువుల బారినో పడతాయని ఆయనకు బాగా తెలుసు. (1 సమూయేలు 17:34-36) శ్రద్ధగా చూసుకునే కాపరి లేకపోతే అవి పచ్చికబయలును, మేతను కనుగొనలేకపోవచ్చు. దావీదు గొర్రెలను కాయడానికి, రక్షించడానికి, మేపడానికి గడిపిన చాలా సమయాన్ని ఆ తర్వాతి సంవత్సరాల్లో మధురంగా జ్ఞాపకం చేసుకొని ఉంటాడనడంలో సందేహం లేదు.

3 యెహోవా తన ప్రజలపట్ల చూపించే శ్రద్ధను వర్ణించడానికి ప్రేరేపించబడినప్పుడు, దావీదుకు కాపరిచేసే పని జ్ఞాపకం రావడంలో ఆశ్చర్యం లేదు. దావీదు వ్రాసిన 23వ కీర్తన ఈ మాటలతో ఆరంభమవుతుంది: “యెహోవా నా కాపరి. నాకు లేమి కలుగదు.” ఇది ఎందుకు సమంజసమైన వర్ణనో మనం పరిశీలిద్దాం. ఆ తర్వాత 23వ కీర్తన సహాయంతో, ఒక గొర్రెలకాపరి తన గొర్రెలపట్ల శ్రద్ధ చూపించినట్లే యెహోవా కూడా తన ఆరాధకులపట్ల ఏయే విధాలుగా శ్రద్ధ చూపిస్తాడో చూద్దాం.​—⁠1 పేతురు 2:25.

సరైన పోలిక

4 లేఖనాల్లో యెహోవాను సూచించే విశిష్టమైన పదాలు ఎన్నో ఉన్నాయి, అయితే “కాపరి” అనే పదమే అన్నింటికన్నా అత్యంత వాత్సల్యపూరితమైనది. (కీర్తన 80:1) యెహోవాను కాపరి అని పిలవడం ఎందుకు సమంజసమో అర్థం చేసుకోవడానికి, రెండు విషయాలను తెలుసుకోవడం మనకు సహాయకరంగా ఉంటుంది: మొదటిది, గొర్రెల స్వభావం, రెండవది మంచి కాపరి విధులు, ఆయన లక్షణాలు.

5 కాపరి ఆప్యాయతకు గొర్రెలు ఇష్టపూర్వకంగా స్పందిస్తాయని (2 సమూయేలు 12:⁠3), మృదు స్వభావంతో ఉంటాయని (యెషయా 53:⁠7), తమను తాము కాపాడుకోలేని స్థితిలో ఉంటాయని (మీకా 5:⁠8) వర్ణిస్తూ బైబిలు తరచూ వాటి లక్షణాలను సూచిస్తోంది. అనేక సంవత్సరాలపాటు గొర్రెలను పెంచిన ఒక రచయిత అలా అన్నాడు: “కొందరు భావించినట్లుగా గొర్రెలు ‘తమను తాము కాపాడుకోలేవు,’ వాటికి ఇతర పశువులన్నిటికన్నా మరింత శ్రద్ధా, ప్రత్యేక రక్షణా ఎల్లప్పుడూ అవసరం.” ఈ నిస్సహాయ పశువులు క్షేమంగా ఉండాలంటే వాటిపట్ల శ్రద్ధచూపే కాపరి కావాలి.​—⁠యెహెజ్కేలు 34:5.

6 పూర్వకాలంలోని గొర్రెల కాపరి దైనందిన జీవితమెలా ఉండేది? ఒక బైబిలు నిఘంటువు ఇలా వివరిస్తోంది: “ఉదయాన్నే ఆయన శాలనుండి మందను తీసుకొని, తను ముందు నడుస్తూ మేత కోసం వాటిని పచ్చికబయలుకు తీసుకువెళతాడు. అక్కడ అవి తప్పిపోకుండా దినమంతా వాటిని జాగ్రత్తగా కాపలా కాస్తాడు, పొరపాటున ఏదైనా గొర్రె తన కనుగప్పి కాసేపు మందకు దూరమైతే, అది దొరికేంతవరకు ఆ కాపరి పట్టుదలతో వెదకుతాడు. . . . సాయంకాలం మందను ఇంటికి తోలుకొచ్చి, గొర్రెలన్నీ ఉన్నాయా లేదా చూసేందుకు వాటిని లెక్కబెడుతూ శాలలోకి పంపిస్తాడు. . . . అవి క్రూరమృగాల బారిన పడకుండా లేదా గుట్టుగా వచ్చే దొంగల కుత్సిత ప్రయత్నాలకు చిక్కకుండా చేసేందుకు ఆయన తరచూ రాత్రిళ్లు కాపలా కాస్తాడు.” *

7 కొన్ని సమయాల్లో గొర్రెలకు, ముఖ్యంగా కట్టిన ఆడగొర్రెలకు, చిన్న గొర్రెపిల్లలకు మరింత ఓపికా, ఆప్యాయతా చూపించవలసిన అవసరమేర్పడుతుంది. (ఆదికాండము 33:13) బైబిలు సమాలోచక గ్రంథమొకటి ఇలా చెబుతోంది: “మందలోని గొర్రెలు సాధారణంగా దూరంగా కొండ ప్రక్కభాగాల్లో ఈనుతాయి. కాపరి ఆ నిస్సహాయ క్షణాల్లో తల్లికి సంరక్షణగా నిలబడి, ఆ పసికూనను ఎత్తుకొని మంద దగ్గరకు మోసుకెళ్తాడు. అది లేచి నడిచేంతవరకు ఆయన కొన్నిరోజులపాటు దానిని తన చేతులమీదో లేదా తన పై వస్త్రపు మడతల్లోనో పెట్టుకుని మోస్తాడు.” (యెషయా 40:10, 11) కాబట్టి ఒక మంచి కాపరికి బలంతోపాటు, వాత్సల్యపూరితమైన లక్షణాలు కూడా అవసరం.

8 “యెహోవా నా కాపరి,” ఈ మాటలు మన పరలోకపు తండ్రిని సమంజసంగానే వర్ణించడం లేదా? మనం 23వ కీర్తనను పరిశీలిస్తుండగా, దేవుడు ఒక కాపరికి ఉండేలాంటి బలంతో, వాత్సల్యంతో మనపట్ల ఎలా శ్రద్ధ చూపిస్తున్నాడో చూస్తాం. దేవుడు తన గొర్రెలకు ఎలాంటి “లేమీ” లేకుండా తగిన ఏర్పాట్లన్నీ చేస్తాడనే నమ్మకాన్ని 1వ వచనంలో దావీదు వ్యక్తపరిచాడు. ఆ తర్వాతి వచనాల్లో ఆయన తన నమ్మకానికిగల మూడు కారణాలను ఉదాహరిస్తున్నాడు: యెహోవా తన గొర్రెలను నడిపిస్తాడు, కాపాడతాడు, పోషిస్తాడు. మనం వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

“నన్ను నడిపించుచున్నాడు”

9 మొదట, యెహోవా తన ప్రజలను నడిపిస్తున్నాడు. దావీదు ఇలా వ్రాస్తున్నాడు: “పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు; శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” (కీర్తన 23:​2, 3) ఈ మాటలతో దావీదు పుష్కలమైన పచ్చికలో ప్రశాంతంగా పడుకున్న మంద తృప్తిగా, సేదదీరుతూ, సురక్షితంగావున్న దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు. “పచ్చికగల చోట్ల” అని అనువదించబడిన హీబ్రూ పదం “ఆహ్లాదకరమైన ప్రదేశం” అనే అర్థాన్నివ్వగలదు. కాపరి లేకుండా గొర్రెలే స్వయంగా ప్రశాంతంగా పడుకునే చోటును కనుగొనడం బహుశా జరగదు. వాటి కాపరే వాటిని అలాంటి ‘ఆహ్లాదకరమైన ప్రదేశానికి’ నడిపించాలి.

10 యెహోవా నేడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు? ఒక విధానం, తన సొంత ఆదర్శమే. “దేవుని పోలి నడుచుకొనుడి” అని ఆయన వాక్యం మనకు ఉద్బోధిస్తోంది. (ఎఫెసీయులు 5:1) ఆ మాటల సందర్భం కరుణను, క్షమాపణను, ప్రేమను ప్రస్తావిస్తోంది. (ఎఫెసీయులు 4:​32; 5:2) అలాంటి ప్రియమైన లక్షణాలను కనబరచడంలో యెహోవా నిశ్చయంగా ఒక అత్యుత్తమ మాదిరి. తనను అనుకరించమని మనల్ని అడగడంలో ఆయన అవాస్తవికంగా వ్యవహరిస్తున్నాడా? లేదు. ఆ ప్రేరేపిత ఉపదేశం నిజానికి ఆయనకు మన మీదున్న నమ్మకానికి అద్భుతమైన వ్యక్తీకరణ. ఏ విధంగా? మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం, అంటే మనకు నైతిక లక్షణాలు, ఆధ్యాత్మిక సామర్థ్యం అనుగ్రహించబడ్డాయని అర్థం. (ఆదికాండము 1:26) కాబట్టి, మనం అపరిపూర్ణులమైనప్పటికీ, ఆయన ఏ లక్షణాలను చూపించడంలో మాదిరిగావున్నాడో అవే లక్షణాలను అలవరచుకునే శక్తి మనలో ఉందని ఆయనకు తెలుసు. ఒక్కసారి ఆలోచించండి, మనమాయనలా ఉండగలమని మన ప్రేమగల దేవుడు నమ్ముతున్నాడు. మనం ఆయన మాదిరిని అనుసరిస్తే, ఆయన మనల్ని ఆహ్లాదభరితమైన ‘శాంతికరమైన’ ప్రదేశాలకు నడిపిస్తాడు. ఈ దౌర్జన్యపూరిత లోకంలో, మనకు దేవుని ఆమోదముందని తెలుసుకోవడం ద్వారా కలిగే నెమ్మదిని అనుభవిస్తూ ‘సురక్షితంగా నివసిస్తాం.’​—⁠కీర్తన 4:⁠8; 29:11.

11 మనల్ని నడిపించడంలో యెహోవా తన వాత్సల్యాన్ని, ఓపికను ప్రదర్శిస్తున్నాడు. కాపరి తన గొర్రెల పరిమితులను పరిగణలోకి తీసుకుంటాడు, అందుకే అతడు, “మందలు నడువగలిగిన కొలది” నడిపిస్తాడు. (ఆదికాండము 33:14) అదేవిధంగా యెహోవా తన గొర్రెలు “నడువగలిగిన కొలది” నడిపిస్తున్నాడు. ఆయన మన సామర్థ్యాలను, పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటున్నాడు. నిజానికి ఆయన మనమివ్వగలిగిన దానికంటే ఎక్కువ అడగకుండా తన వేగాన్ని సర్దుబాటు చేసుకుంటున్నాడు. మనం చేస్తున్నది మనస్ఫూర్తిగా చేయాలని మాత్రమే ఆయన అడుగుతున్నాడు. (కొలొస్సయులు 3:23) మీరు ఒకప్పుడు చేయగలిగినంత ఇప్పుడు చేయలేకపోతున్న వృద్ధులుగా ఉంటే అప్పుడెలా? లేదా మీకు పరిమితులు విధించే ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతుంటే అప్పుడెలా? అలాంటి పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా చేయడమనే మాట ఓదార్పుకరంగా ఉంటుంది. ఏ ఇద్దరూ ఖచ్చితంగా ఒకే విధంగా ఉండరు. మనస్ఫూర్తిగా చేయడమంటే దేవుని సేవలో మీకు సాధ్యమైనంత మేరకు మీ పూర్ణ బలాన్ని, శక్తిని ఉపయోగించడమని అర్థం. మన వేగాన్ని ప్రభావితం చేసే బలహీనతలు మనకున్నా యెహోవా మన పూర్ణహృదయ ఆరాధనను విలువైనదిగా పరిగణిస్తాడు.​—⁠మార్కు 12:29, 30.

12 యెహోవా తన గొర్రెలను “నడువగలిగిన కొలది” నడిపిస్తాడనే దానిని ఉదాహరించడానికి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడే కొన్ని పాపపరిహారార్థ బలుల గురించి చెప్పబడిన విషయాన్ని పరిశీలించండి. కృతజ్ఞత నిండిన హృదయాలతో శ్రేష్ఠమైనవి అర్పించాలని యెహోవా కోరాడు. అదే సమయంలో, అర్పించే వ్యక్తి సామర్థ్యానికి అనుగుణంగా ఆ అర్పణలు వివిధ స్థాయుల్లో ఉన్నాయి. ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: “అతడు గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల, . . . రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని . . . తీసికొనిరావలెను.” రెండు పావురపు పిల్లలను కూడా అతడు తీసుకురాలేకపోతే అప్పుడెలా? అతడు మెత్తటి “గోధుమపిండి” తీసుకురావచ్చు. (లేవీయకాండము 5:7, 11) అర్పించే వ్యక్తి సామర్థ్యానికి మించి దేవుడు అతణ్ణి అడగలేదని ఇది చూపిస్తోంది. దేవుడు మార్పులేనివాడు కాబట్టి, ఆయన మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఎన్నడూ అడగడనీ, మనం ఇవ్వగలిగిన దానినే సంతోషంగా స్వీకరిస్తాడనీ తెలుసుకోవడం మనకు ఓదార్పునిస్తుంది. (మలాకీ 3:6) అంతగా అర్థం చేసుకునే కాపరిచేత నడిపించబడడం ఎంత ఆహ్లాదకరమో కదా!

“ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై యుందువు”

13 దావీదు తన నమ్మకానికిగల రెండవ కారణాన్ని ఇస్తున్నాడు: యెహోవా తన గొర్రెలను కాపాడతాడు. మనమిలా చదువుతాం: “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై యుందువు; నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.” (కీర్తన 23:4) దావీదు ఇప్పుడు యెహోవాను ఉద్దేశించి “నీవు” అనే సర్వనామాన్ని ఉపయోగిస్తూ మరింత సన్నిహితంగా మాట్లాడుతున్నాడు. ఇది ఆశ్చర్యం కలిగించదు, ఎందుకంటే కష్టాలను సహించేందుకు దేవుడు తనకెలా సహాయం చేశాడో దావీదు మాట్లాడుతున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దావీదు గాఢాంధకారపు లోయల్లో సంచరించాడు. అయితే దేవుడు ఎల్లప్పుడూ తన ‘దుడ్డుకఱ్ఱతో,’ ‘దండముతో’ తనకు అండగా ఉన్నాడని గ్రహించిన కారణంగా ఆయన భయానికి తావివ్వలేదు. ఈ కాపుదల ఉందని తెలుసుకోవడం దావీదును ఓదార్చి నిస్సందేహంగా ఆయనను దేవునికి సన్నిహితుణ్ణి చేసివుంటుంది. *

14 యెహోవా నేడు తన గొర్రెలను ఎలా కాపాడుతున్నాడు? ఏ విరోధి అయినా, అది దయ్యమే గానీ, మానవుడే గానీ ఆయన గొఱ్ఱెలను ఈ భూమ్మీద నుండి నిర్మూలించలేరని బైబిలు మనకు హామీ ఇస్తోంది. అలా జరగడానికి యెహోవా ఎన్నడూ అనుమతించడు. (యెషయా 54:17; 2 పేతురు 2:⁠9) అలాగని, మన కాపరి ప్రతీ విపత్తు నుండి మనల్ని కాపాడతాడని అర్థం కాదు. మానవులకు సాధారణంగా కలిగే కష్టాలను అనుభవిస్తూ, నిజ క్రైస్తవులందరికీ వచ్చే వ్యతిరేకతను మనం ఎదుర్కొంటాం. (2 తిమోతి 3:12; యాకోబు 1:2) ‘గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నామని’ చెప్పే సమయాలు మనకు రావచ్చు. ఉదాహరణకు, హింస లేదా అనారోగ్య సమస్యవల్ల మనం మరణానికి చేరువ కావచ్చు. లేదా మనకు ప్రియమైనవారు మరణానికి దగ్గరవడమో, చనిపోవడమో జరగవచ్చు. చీకటి క్షణాలు అనిపించే సమయాల్లో మన కాపరి మనతో ఉండి మనల్ని కాపాడతాడు. ఎలా?

15 అద్భుతరీతిలో తాను జోక్యం చేసుకుంటానని యెహోవా వాగ్దానం చేయడం లేదు. * అయితే ఈ విషయంలో మనం ధైర్యంగా ఉండవచ్చు: మనకు ఎలాంటి అవాంతరం ఎదురైనా దాన్ని అధిగమించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు. “నానా విధములైన శోధనలు” సహించేందుకు జ్ఞానాన్ని ఆయన మనకనుగ్రహిస్తాడు. (యాకోబు 1:2-5) కాపరి తన కర్రను క్రూరమృగాలను తరమడానికే కాక, తన గొర్రెలను సరైన దిశలో నడిపించేలా అదిలించేందుకు కూడా ఉపయోగిస్తాడు. మన పరిస్థితిలో గణనీయమైన మార్పు తీసుకొచ్చే బైబిలు సలహాను అన్వయించుకునేలా బహుశా తోటి ఆరాధకుని ద్వారా యెహోవా మనల్ని ‘అదిలించవచ్చు.’ అంతేకాక, యెహోవా మనకు సహించే శక్తిని ఇవ్వగలడు. (ఫిలిప్పీయులు 4:13) మనం “బలాధిక్యము” కలిగివుండేలా ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆయత్తపరచగలడు. (2 కొరింథీయులు 4:7) మనపైకి సాతాను తీసుకురాగల ఎలాంటి పరీక్షనైనా తట్టుకునేలా దేవుని ఆత్మ మనకు సహాయం చేయగలదు. (1 కొరింథీయులు 10:13) మనకు సహాయం చేయడానికి యెహోవా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని తెలుసుకోవడం ఓదార్పుకరంగా లేదా?

16 అవును, మనమెలాంటి గాఢాంధకారపు లోయలో ఉన్నప్పటికీ, అందులో మనం ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు. మనం పూర్తిగా గ్రహించలేని రీతుల్లో మనకు సహాయం చేస్తూ మన కాపరి మనతోనే ఉంటాడు. మెదడులో ప్రాణాంతకమైన కంతి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైన ఒక క్రైస్తవ పెద్ద అనుభవాన్ని పరిశీలించండి. “యెహోవాకు నా మీద కోపం ఉందా లేక ఆయన నన్ను ప్రేమించడం లేదా అనే ఆలోచనలోపడ్డానని నేను ఒప్పుకోవలసిందే. అయితే నేను యెహోవాకు దూరం కాకూడదని దృఢంగా నిర్ణయించుకున్నాను. అలా దూరం కాకుండా ఆయనకు నా కలతల గురించి చెప్పుకున్నాను. తరచూ నా సహోదర సహోదరీల ద్వారా ఓదారుస్తూ, యెహోవా నాకు సహాయం చేశాడు. ప్రమాదకరమైన వ్యాధిని సహించిన స్వీయ అనుభవాల ఆధారంగా చాలామంది సహాయకరమైన పరిజ్ఞానాన్ని నాతో పంచుకున్నారు. నేను అనుభవిస్తున్నది అసాధారణమైనదేమీ కాదనే విషయాన్ని వారి సమతుల్యమైన మాటలు నాకు జ్ఞాపకం చేశాయి. కొన్ని దయాపూర్వకమైన క్రియలతోపాటు వారిచ్చిన ఆచరణాత్మక సహాయం యెహోవాకు నా మీద కోపం లేదనే ధైర్యాన్ని నాకిచ్చింది. నిజమే నేను నా వ్యాధితో పోరాడాల్సిందే, చివరికి ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అయితే యెహోవా నాకు తోడుగా ఉన్నాడనే, ఈ పరీక్షలో ఆయన విడువక సహాయం చేస్తాడనే నమ్మకం నాకుంది.”

“నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు”

17 తన కాపరిపై తనకున్న నమ్మకానికిగల మూడవ కారణాన్ని దావీదు ఇప్పుడు ఉదాహరిస్తున్నాడు: యెహోవా తన గొర్రెలను సమృద్ధిగా పోషిస్తాడు. దావీదు ఇలా వ్రాస్తున్నాడు: “నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు; నా గిన్నె నిండి పొర్లుచున్నది.” (కీర్తన 23:5) ఈ వచనంలో దావీదు తన కాపరిని, సమృద్ధిగా ఆహారపానీయాలు సమకూర్చే ఉదారుడైన అతిథేయిగా వర్ణిస్తున్నాడు. శ్రద్ధ చూపించే కాపరి, ఉదారుడైన అతిథేయి అనే ఈ రెండు చిత్రీకరణలు పరస్పర విరుద్ధమైనవి కావు. ఎందుకంటే మంచి కాపరికి తన మందకు “లేమి” కలగకుండా ఉండేందుకు సమృద్ధిగా పచ్చిక, తగినంత నీరు ఉన్న ప్రదేశం తెలిసుండాలి.​—⁠కీర్తన 23:1, 2.

18 మన కాపరి కూడా ఉదారుడైన అతిథేయిగా ఉన్నాడా? నిస్సందేహంగా! మనమిప్పుడు ఆస్వాదిస్తున్న వివిధ రకాల ఆధ్యాత్మిక ఆహార నాణ్యత, పరిమాణం గురించి ఒక్కసారి ఆలోచించండి. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా యెహోవా మనకు సహాయకరమైన ప్రచురణలను, కూటాల్లో, సమావేశాల్లో ఉపదేశాత్మక కార్యక్రమాలను అందిస్తున్నాడు, ఇవన్నీ మన ఆధ్యాత్మిక అవసరతలను తీరుస్తున్నాయి. (మత్తయి 24:45-47) నిశ్చయంగా ఆధ్యాత్మిక ఆహారానికి కొదువే లేదు. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” కోట్ల సంఖ్యలో బైబిళ్లను, బైబిలు అధ్యయన సహాయకాలను ఉత్పత్తి చేశాడు, అలాంటి సాహిత్యాలు ఇప్పుడు 413 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. యెహోవా వివిధ రకాలైన ఆధ్యాత్మిక ఆహారాన్ని అంటే “పాల” వంటి ప్రాథమిక బైబిలు బోధలు మొదలుకొని లోతైన ఆధ్యాత్మిక సమాచారపు “బలమైన ఆహారము” వరకు సమకూర్చాడు. (హెబ్రీయులు 5:11-14) ఫలితంగా, మనం సమస్యలను ఎదుర్కొన్నప్పుడు లేదా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు, సాధారణంగా మనకు అవసరమైనదే మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. అలాంటి ఆధ్యాత్మిక ఆహారమే లేకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన కాపరి నిజంగా అత్యంత ఉదారుడైన దాత.​—⁠యెషయా 25:⁠6; 65:13.

“యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను”

19 తన కాపరి, దాతయొక్క విధానాలను తలపోసిన తర్వాత దావీదు చివరికి ఇలా అంటున్నాడు: “నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును; చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.” (కీర్తన 23:6) కృతజ్ఞత, విశ్వాసం నిండిన హృదయంతో అంటే గతాన్ని కృతజ్ఞతతో గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తును విశ్వాసంతో చూస్తూ దావీదు మాట్లాడుతున్నాడు. తన పరలోకపు తండ్రి మందిరంలో నివసిస్తున్నట్లుగా ఆయనకు సన్నిహితంగా ఉన్నంతకాలం, తానెల్లప్పుడూ యెహోవా ప్రేమపూర్వక సంరక్షణలో సురక్షితంగా ఉంటానని గతంలో గొర్రెలకాపరిగా ఉన్న ఈయనకు తెలుసు.

20 ఇరవై మూడవ కీర్తనలో వ్రాయబడిన ఆ ఇంపైన మాటలకు మనమెంత కృతజ్ఞులమో కదా! యెహోవా తన గొర్రెలను ఎలా నడిపిస్తాడో, కాపాడతాడో, పోషిస్తాడో వర్ణించడానికి దావీదుకు ఇంతకన్నా ఉత్తమ విధానం లభించి ఉండేది కాదు. మనం కూడా మన కాపరియైన యెహోవా సహాయం అడగవచ్చనే నమ్మకాన్ని ఇచ్చేందుకు దావీదు వ్రాసిన ఆ వాత్సల్యపూరిత మాటలు భద్రపరచబడ్డాయి. అవును, మనం యెహోవాకు సన్నిహితంగా ఉన్నంతకాలం ప్రేమగల కాపరిగా ఆయన మనపట్ల “చిరకాలం,” యుగయుగాలు శ్రద్ధ చూపిస్తాడు. అయితే ఆయన గొర్రెలుగా మన గొప్ప కాపరియైన యెహోవాతో నడిచే బాధ్యత మనపై ఉంది. ఆ బాధ్యతలో ఏమి ఇమిడివుందో తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 18 ప్రమాదం నుండి తనను కాపాడినందుకు యెహోవాను స్తుతిస్తూ దావీదు చాలా కీర్తనలు రచించాడు.—ఉదాహరణకు, 18, 34, 56, 57, 59, 63 కీర్తనల పైవిలాసము చూడండి.

^ పేరా 20 కావలికోట అక్టోబరు 1, 2003 సంచికలో “దేవుని జోక్యం అదెలా ఉంటుందని మనం ఎదురుచూడవచ్చు?” అనే ఆర్టికల్‌ చూడండి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

దావీదు యెహోవాను గొర్రెలకాపరితో పోల్చడం ఎందుకు సమంజసం?

యెహోవా మనల్ని అవగాహనతో ఎలా నడిపిస్తాడు?

పరీక్షలను సహించడానికి యెహోవా ఏయే విధాలుగా మనకు సహాయం చేస్తాడు?

యెహోవా ఉదారుడైన అతిథేయి అని ఏది చూపిస్తోంది?

[అధ్యయన ప్రశ్నలు]

1-3. దావీదు యెహోవాను గొర్రెల కాపరికి పోల్చడం ఎందుకు ఆశ్చర్యం కలిగించదు?

4, 5. గొర్రెల లక్షణాలను బైబిలు ఎలా వర్ణిస్తోంది?

6. పూర్వకాలంలోని గొర్రెల కాపరి దైనందిన జీవితమెలా ఉంటుందని ఒక బైబిలు నిఘంటువు వివరిస్తోంది?

7. కాపరికి కొన్నిసార్లు మరింత ఓపికా, ఆప్యాయతా చూపించడం ఎందుకు అవసరమవుతాయి?

8. యెహోవా మీద తాను నమ్మకముంచడానికి దావీదు ఏ మూడు కారణాలను ఉదాహరిస్తున్నాడు?

9. దావీదు ఎలాంటి ప్రశాంతమైన దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు, గొర్రెలు అలాంటి ప్రశాంతమైన స్థలానికి ఎలా చేరుకుంటాయి?

10. దేవుడు మనల్ని నమ్ముతున్నానని ఎలా చూపిస్తాడు?

11. యెహోవా తన గొర్రెలను నడిపించడంలో దేనిని పరిగణలోకి తీసుకుంటాడు, ఇది ఆయన మననుండి కోరేదానిలో ఎలా ప్రతిబింబిస్తోంది?

12. యెహోవా తన గొర్రెలను “నడువగలిగిన కొలది” నడిపిస్తాడనే దానిని మోషే ధర్మశాస్త్రంలోని ఏ విషయం ఉదాహరిస్తోంది?

13. కీర్తన 23:4లో దావీదు మరింత సన్నిహితంగా ఎలా మాట్లాడుతున్నాడు, ఇది ఎందుకు ఆశ్చర్యం కలిగించదు?

14. యెహోవా కాపుదలకు సంబంధించి బైబిలు మనకు ఎలాంటి హామీ ఇస్తోంది, అయితే దానర్థం ఏమికాదు?

15, 16. (ఎ) మనమెదుర్కొనే అవాంతరాలను అధిగమించడానికి యెహోవా ఏయే విధాలుగా మనకు సహాయం చేస్తాడు? (బి) పరీక్షా సమయాల్లో యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడో చూపించేందుకు ఒక అనుభవం వివరించండి.

17. కీర్తన 23:5లో దావీదు యెహోవాను ఎలా వర్ణిస్తున్నాడు, ఇది కాపరి చిత్రీకరణకు ఎందుకు విరుద్ధం కాదు?

18. యెహోవా ఉదారుడైన అతిథేయి అని ఏది చూపిస్తోంది?

19, 20. (ఎ) కీర్తన 23:6లో దావీదు ఎలాంటి నమ్మకాన్ని వ్యక్తపరిచాడు, అలాంటి నమ్మకాన్నే మనం కూడా ఎలా కలిగివుండవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

[18వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలులోని కాపరిలాగే యెహోవా తన గొర్రెలను నడిపిస్తాడు