దేవుణ్ణి సంతోషపెట్టే విరాళాలు
దేవుణ్ణి సంతోషపెట్టే విరాళాలు
ఈ కథ సంతోషకరమైనదేమీ కాదు. రాణి అతల్యా మోసగించడం ద్వారా, హత్యలు చేయడం ద్వారా యూదా సింహాసనాన్ని ఆక్రమించుకుంటుంది. సింహాసనాన్ని అధిష్ఠించే వారసులందరూ హతమయ్యారని పొరబడి ఆమె తనను తాను రాణిగా ప్రతిష్ఠించుకుంటుంది. యెహోవానూ ఆయన ధర్మశాస్త్రాన్నీ ఎంతో గాఢంగా ప్రేమించిన యువరాణియైన యెహోషెబ అనే మరొక స్త్రీ, రాజ్య వారసుడైన బాల యోవాషును ధైర్యంగా దాచిపెడుతుంది. యెహోషెబ, ప్రధాన యాజకుడైన ఆమె భర్త యెహోయాదా దేవాలయంలోని తమ నివాస గృహంలో ఆ వారసుడ్ని ఆరేండ్లు దాచిపెడతారు.—2 రాజులు 11:1-3.
యోవాషుకు ఏడేండ్లు వచ్చేసరికి, ప్రధాన యాజకుడు యెహోయాదా, మోసపూరితంగా సింహాసనాన్ని ఆక్రమించుకున్న ఆ రాణిని తొలగించాలనే తన పథకాన్ని ఆచరణలో పెట్టడానికి సిద్ధమవుతాడు. ఆయన ఆ బాలుడ్ని బయటకు తీసుకువచ్చి, ఆ రాజ్యానికి న్యాయమైన వారసునిగా పట్టాభిషేకం చేస్తాడు. దుష్ట రాణియైన అతల్యాను రాజ భటులు దేవాలయం బయటకు వెళ్ళగొట్టి చంపేస్తారు, దాంతో జనులకు ఊరట, సంతోషం కలుగుతాయి. యెహోయాదా, యెహోషెబలు తమ చర్యల ద్వారా యూదా దేశంలో సత్యారాధన పునఃస్థాపించబడడంలో చాలా తోడ్పడ్డారు. కానీ ఇంకా ఎంతో ముఖ్యమైనది ఏమిటంటే, వారు మెస్సీయ రానున్న దావీదు రాజవంశం కొనసాగేందుకు తోడ్పడ్డారు.—2 రాజులు 11:4-21.
కొత్తగా ప్రతిష్ఠించబడిన రాజు కూడా దేవుని హృదయాన్ని సంతోషపెట్టే ప్రాముఖ్యమైన చర్య తీసుకోవాల్సి ఉంది. యెహోవా మందిరానికి మరమ్మతుల అవసరం చాలా ఉంది. ఏకైక యూదా పరిపాలకురాలిగా ఉండాలనే అతల్యా హద్దుల్లేని కోరిక కారణంగా దేవాలయం నిర్లక్ష్యానికే కాక దోపిడికి కూడా గురైంది. కాబట్టి యోవాషు దేవాలయాన్ని పునర్నిర్మించి పూర్వస్థితికి తీసుకురావాలని నిశ్చయించుకుంటాడు. ఆయన ఆలస్యం చేయకుండా, యెహోవా మందిరమును బాగుచేయడానికి అవసరమైన నిధులను సమకూర్చమని ఇలా ఆజ్ఞ జారీచేస్తాడు: “యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలాచేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును, వంతుచొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛచేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును, యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారియొద్ద తీసికొని, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెను.”—2 రాజులు 12:4, 5.
ప్రజలు విరాళాలను ఇష్టపూర్వకంగా ఇస్తారు. అయితే యాజకులు దేవాలయాన్ని మరమ్మతు చేసే విషయంలో తమ విధులను పూర్ణ హృదయంతో నిర్వర్తించరు. దాంతో రాజు ఆ పనిని తానే చేపట్టాలని నిర్ణయించుకొని, విరాళాలన్నీ నేరుగా ఒక ప్రత్యేకమైన పెట్టెలో వేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆయన యెహోయాదాకు ఆ బాధ్యతను అప్పగిస్తాడు, ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జముచేసి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారముకాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా రాజుయొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి, యెహోవా మందిరమందు దొరికిన 2 రాజులు 12:9-12.
ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి. తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు, అనగా పనిచేయించు వారికప్పగించిరి; వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసెపనివారికిని రాతిపనివారికిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును, మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని, ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి.”—ప్రజలు పూర్ణహృదయంతో స్పందిస్తారు. యెహోవా ఆరాధన గౌరవనీయమైన రీతిలో కొనసాగేలా ఆయన ఆరాధనా మందిరం పునఃస్థాపించబడుతుంది. ఆ విధంగా విరాళాలుగా వచ్చిన నిధులన్నీ సముచితమైన రీతిలో ఉపయోగించబడతాయి. యోవాషు రాజు అలా జరిగేలా చూశాడు!
నేడు యెహోవా దృశ్య సంస్థ, విరాళాలుగా వచ్చిన నిధులన్నీ యెహోవా ఆరాధనను ముందుకు కొనసాగించడానికి సక్రమంగా ఉపయోగించబడేలా జాగ్రత్త తీసుకుంటోంది. నిజ క్రైస్తవులు ఆ నాటి ప్రాచీన ఇశ్రాయేలీయుల్లాగే పూర్ణహృదయంతో స్పందించారు. బహుశా రాజ్య సంబంధ విషయాల అభివృద్ధి కోసం గత సేవా సంవత్సరంలో విరాళాలు ఇచ్చినవారిలో మీరూ ఉండవచ్చు. మీ విరాళాలను ఉపయోగించిన కొన్ని విధానాలను మనం గమనిద్దాం.
ప్రచురణా పని
ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం కోసం, పంపిణీ కోసం ఈ క్రింది ప్రచురణలు ముద్రించబడ్డాయి:
• పుస్తకాలు: 4,74,90,247
• చిన్న పుస్తకాలు: 68,34,740
• బ్రోషుర్లు: 16,78,54,462
• క్యాలెండర్లు: 54,05,955
• పత్రికలు: 1,17,92,66,348
• కరపత్రాలు: 44,09,95,740
• వీడియోలు: 31,68,611
ఆఫ్రికా, ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, పసిఫిక్ ద్వీపాల్లోని దేశాలు—మొత్తం 19 దేశాల్లో ముద్రణా పని జరుగుతోంది.
“నా పేరు క్యాట్లెన్ మే. నా వయసు ఎనిమిది. నా దగ్గర 28 డాలర్లు ఉన్నాయి, నేను ఈ డబ్బును ప్రచురణా యంత్రాలు కొనడానికి ఇవ్వాలనుకుంటున్నాను. మీ చిన్ని సహోదరి, క్యాట్లెన్.”
“మా కుటుంబమంతా కలిసి కొత్త ముద్రణా యంత్రాల గురించి చర్చించుకున్నాం. 11, 9 ఏండ్లుగల మా పిల్లలు తాము దాచుకున్న డబ్బులో నుండి విరాళాలు ఇచ్చి తమ వంతు నిర్వర్తించడానికి నిర్ణయించుకున్నారు. మా విరాళాలతోపాటు వారి విరాళాలను కూడా పంపించడానికి మేము సంతోషిస్తున్నాం.”
నిర్మాణ పనులు
ఈ కింద ఉన్నవి యెహోవాసాక్షుల కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి చేపట్టిన కొన్ని నిర్మాణ ప్రాజెక్టులు:
• పరిమిత వనరులు ఉన్న దేశాల్లో రాజ్య మందిరాలు: 2,180
• అసెంబ్లీ హాళ్ళు: 15
• బ్రాంచీలు: 10
• పూర్తికాల సేవలో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులు: 2,342
“ఈ వారాంతంలో మేము మా క్రొత్త రాజ్య మందిరంలో మొదటి కూటాన్ని జరుపుకున్నాం. మన తండ్రియైన యెహోవా దేవుణ్ణి స్తుతించడానికి సరైన స్థలం లభించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీరు మరిన్ని రాజ్య మందిరాలు నిర్మించడం ద్వారా మా అవసరాలపట్ల శ్రద్ధ చూపించినందుకు యెహోవాకూ మీకూ మా కృతజ్ఞతలు. నిజానికి మా రాజ్య మందిరం ఈ చుట్టుపక్కల వారందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంది.”—చీలి.
“యెహోవా సంస్థ అందించిన సహాయానికి సహోదరసహోదరీలు ఎంతో కృతజ్ఞతగా ఉన్నారు. మేము నిర్మాణ బృందంతో గడిపిన చక్కని సమయం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటాం.”—మాల్డోవా.
“నేనూ నా భార్యా ఇటీవలే మా 35వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. మేము ఆ సందర్భంలో ఒకరికొకరం ఏమి ఇచ్చుకోవాలని నిర్ణయించుకోవడానికి ప్రయత్నించి, చివరకు మేము యెహోవాకూ ఆయన సంస్థకూ ఏదైనా తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం, ఎందుకంటే వారి సహాయం లేకుండా మేము మా వైవాహిక జీవితంలో బహుశా సఫలమయ్యేవాళ్ళం కాకపోవచ్చు. మేము దీంతో పంపిస్తున్న డబ్బును ఒక నిరుపేద దేశంలో రాజ్య మందిర నిర్మాణానికి సహాయంగా ఉపయోగించాలని కోరుతున్నాం.”
“నాకు ఇటీవలే కొంత వారసత్వపు ఆస్తి లభించింది. నాకున్న ‘కోరికలు’ తక్కువ, నా ‘అవసరాలు’ అంతకన్నా తక్కువ కాబట్టి, నేను పంపిస్తున్న ఈ డబ్బును రాజ్యమందిరాలు చాలా అవసరమున్న అనేక దేశాల్లో రాజ్య మందిరాలు నిర్మించడానికి సహాయంగా ఉపయోగించమని కోరుతున్నాను.”
విపత్తుల్లో సహాయం
ఈ అంత్యదినాల్లో, ఎలాంటి హెచ్చరిక లేకుండానే విపత్తులు తరచూ విరుచుకుపడుతున్నాయి. అలాంటి విపత్తులకు గురైన ప్రాంతాల్లోని తమ సహోదరులకు సహాయపడేందుకు చాలామంది యెహోవాసాక్షులు అదనపు విరాళాలను ఇస్తున్నారు. విపత్తుల సహాయం కోసమిచ్చే విరాళాలు ప్రపంచవ్యాప్త పనిలో భాగంగానే ఉపయోగించబడతాయని గుర్తుంచుకోవాలి. యెహోవాసాక్షులు విపత్తులకు గురైన బాధితులకు సహాయం చేసిన ప్రాంతాల్లో కొన్ని:
• ఆఫ్రికా
• ఆసియా
• కరీబియన్ ప్రాంతం
• పసిఫిక్ ద్వీపాలు
“తుఫాన్లవల్ల జరిగిన నష్టం నుండి ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన సహాయ కార్యక్రమంలో భాగంగా సహాయ సామగ్రి పంపించినందుకు నేనూ నా భర్తా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము మా ఇంటికి క్రొత్త పైకప్పును నిర్మించుకోగలిగాం. మీరు చాలా త్వరగా స్పందించినందుకు మేము నిజంగా అభినందిస్తున్నాం.”
“నా పేరు కోనర్, నాకు 11 ఏండ్లు. సునామీ వచ్చినప్పుడు ఏమి జరిగిందో చూడగానే, నేను సహాయం చేయాలని అనుకున్నాను. నా సహోదరసహోదరీలకు ఇది సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను.”
ప్రత్యేక పూర్తికాల సేవకులు
చాలామంది క్రైస్తవులు సువార్తికులుగా లేక బెతెల్ గృహాల్లో పూర్తికాల సేవకులుగా సేవ చేస్తున్నారు. కొంతమంది పూర్తికాల స్వచ్ఛంద సేవకులకు స్వచ్ఛంద విరాళాల మద్దతు లభిస్తోంది. అలాంటి వారిలో ఈ క్రింద పేర్కొన్నవారు ఉన్నారు:
• మిషనరీలు: 2,635
• ప్రయాణ పైవిచారణకర్తలు: 5,325
• బెతెల్ సభ్యులు: 20,092
“నేను ఇప్పుడు [ఐదు సంవత్సరాల అబ్బాయి] బెతెల్‌లో సేవ చేయలేను కాబట్టి, నేను ఈ విరాళాన్ని ఎంతో ప్రేమతో పంపించాలని కోరుకుంటున్నాను. నేను పెద్దవాడ్ని అయ్యాక, బెతెల్‌కు వెళ్ళి కష్టపడి పని చేస్తాను.”
బైబిలు విద్యను ప్రోత్సహించడం
యేసుక్రీస్తు “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:19) ఆయన మాటలకు విధేయులై, యెహోవాసాక్షులు 235 దేశాల్లో బైబిలు సందేశాన్ని ప్రకటించడంలో, బోధించడంలో నిమగ్నమై ఉన్నారు. వారు బైబిలు సాహిత్యాలను 413 భాషల్లో ప్రచురించి, పంపిణీ చేస్తున్నారు.
నిజానికి దేవుని గురించీ ఆయన సంకల్పాల గురించీ ఇంకా ఎక్కువమంది తెలుసుకోవడానికి సహాయపడడంలో, ఒక క్రైస్తవుడు ఇవ్వగలిగే అతి విలువైన విరాళం అతని సమయమే. యెహోవాసాక్షులు తమ పొరుగువారికి సహాయం చేయడానికి తమ సమయాన్నీ శక్తినీ ఎక్కువగా వెచ్చించారు. వారు ఉదారంగా ఆర్థిక సహాయం కూడా చేశారు, వారిచ్చిన విరాళాలు ఎలాంటి రూపంలోవైనా అవన్నీ యెహోవా నామాన్ని, ఆయన సంకల్పాలను భూమి అంతటా తెలిపేందుకు దోహదపడ్డాయి. యెహోవా గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేసే ఈ ప్రయత్నాలను ఆయన ఎల్లప్పుడూ ఆశీర్వదించును గాక. (సామెతలు 19:17) ఇతరులకు సహాయం చేయడంలో చూపించే ఇలాంటి సంసిద్ధత యెహోవా హృదయాన్ని సంతోషపెడుతుంది!—హెబ్రీయులు 13:15, 16.
[28-30వ పేజీలోని బాక్సు]
కొందరు ఇవ్వడానికి ఎంచుకునే పద్ధతులు
ప్రపంచవ్యాప్త పనికి విరాళాలు
చాలామంది, “ప్రపంచవ్యాప్త పని కోసం చందాలు—మత్తయి 24:14” అని వ్రాసి ఉండే చందా పెట్టెలలో వేయడం కోసం కొంత డబ్బును ప్రత్యేకంగా తీసిపెట్టుకుంటారు లేదా ఇంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించుకుంటారు.
ఈ నిధులను, తమ దేశంలోని సేవను పర్యవేక్షిస్తున్న యెహోవాసాక్షుల కార్యాలయానికి సంఘాలు ప్రతినెలా పంపిస్తాయి. స్వచ్ఛంద విరాళంగా ఇచ్చే డబ్బును ఈ కార్యాలయాలకు నేరుగా కూడా పంపించవచ్చు. బ్రాంచి కార్యాలయాల చిరునామాలు ఈ పత్రికలోని 2వ పేజీలో ఉన్నాయి. చెక్కులు ”Watch Tower” పేరున వ్రాయాలి. ఆభరణాలను లేదా ఇతర విలువైన వస్తువులను కూడా విరాళంగా ఇవ్వవచ్చు. అలాంటి వస్తువులు పూర్తిగా విరాళంగానే ఇస్తున్నామని తెలియజేసే క్లుప్తమైన లేఖను వాటితోపాటు జతచేయాలి.
ధర్మదాన ప్రణాళిక
ప్రపంచవ్యాప్త రాజ్యసేవ ప్రయోజనం కోసం, డబ్బును పూర్తిగా కానుక రూపంలో ఇవ్వడంతోపాటు ఇతర పద్ధతుల్లో కూడా ఇవ్వవచ్చు. ఆ పద్ధతులు ఈ విధంగా ఉన్నాయి:
భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్/పెన్షన్ పథకానికి లబ్దిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.
బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలకు, డిపాజిట్ల సర్టిఫికెట్లకు లేదా వ్యక్తిగత రిటైర్మెంట్ ఖాతాలకు లబ్దిదారుగా Watch Towerను ట్రస్టుగా చేయవచ్చు లేదా మరణానంతరం Watch Towerకు చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.
షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను Watch Towerకు పూర్తిగా కానుక రూపంలో విరాళంగా ఇవ్వవచ్చు.
స్థలాలు: అమ్మదగిన స్థలాలను పూర్తిగా కానుక రూపంలో విరాళంగా ఇవ్వవచ్చు లేదా అవి నివాస స్థలాలైతే ఆమె లేక అతడు జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించే ఏర్పాటుతో విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన దస్తావేజులను వ్రాసేముందు మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.
వార్షిక భత్యం లభించే విరాళం: వార్షిక భత్య విరాళమనే ఏర్పాటులో ఒక వ్యక్తి తన డబ్బును లేదా డబ్బు హామీలను Watch Tower Societyకి బదిలీ చేస్తాడు. ఆ తర్వాత ఆ దాత లేదా ఆ దాత నియమించిన వ్యక్తి జీవితాంతం ప్రతి సంవత్సరం నిర్దిష్ట మొత్తాన్ని పొందుతాడు. దాత ఏ సంవత్సరంలో ఈ విరాళ ఏర్పాటు చేస్తాడో ఆ సంవత్సరం ఆయనకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది.
వీలునామాలు, ట్రస్ట్‌లు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధమైన వీలునామాను ఉపయోగించి Watch Tower పేరున వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్ట్ అగ్రిమెంట్ లబ్దిదారుగా Watch Tower పేరు వ్రాయవచ్చు. కొన్ని దేశాల్లో ఒక మతపరమైన సంస్థకు ప్రయోజనం చేకూర్చే ట్రస్ట్ ఏర్పాటువల్ల కొంతమేరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు, అయితే ఇండియాలో ఇలాంటి సదుపాయం లేదు.
“ధర్మదాన ప్రణాళిక” అనే పదబంధం సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వడానికి సాధారణంగా దాత ముందుగా ప్రణాళిక వేసుకోవలసి ఉంటుంది. ప్రణాళిక వేసుకొని ఇవ్వడానికి సంబంధించిన పద్ధతుల్లో ఏదో ఒక దానిని ఉపయోగించి యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వాలని కోరుకునేవారి సహాయార్థం ప్రపంచవ్యాప్త రాజ్య సేవ ప్రయోజనార్థం ధర్మదాన ప్రణాళిక * అనే బ్రోషుర్ ఆంగ్లంలోను, స్పానిష్‌లోను ప్రచురితమైంది. ఆ బ్రోషుర్‌లో కానుకలను ఇప్పుడు లేదా మరణానంతరం వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించిన సమాచారం ఉంది. ఆ బ్రోషుర్‌ను చదివిన తర్వాత, తమ న్యాయ సలహాదారులను లేదా పన్ను సలహాదారులను, సంప్రదించిన తర్వాత చాలామంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యెహోవాసాక్షుల పనికి మద్దతును ఇవ్వగలిగారు, అలా చేయడం ద్వారా తాము చెల్లించే పన్నుల్లో మినహాయింపును కూడా అధికం చేసుకున్నారు.
మరింత సమాచారం కోసం మీరు యెహోవాసాక్షులను, ఈ క్రింది చిరునామాలో లేదా మీ దేశంలోని సేవను పర్యవేక్షించే యెహోవాసాక్షుల కార్యాలయం చిరునామాలో ఉత్తరం ద్వారానైనా ఫోను ద్వారానైనా సంప్రదించవచ్చు.
Jehovah’s Witnesses,
Post Box 6440
Yelahanka,
Bangalore 560 064,
Karnataka.
Telephone: (080) 28468072
[27వ పేజీలోని చిత్రసౌజన్యం]
Faithful video:స్టాలిన్: U.S. Army photo
[అధస్సూచి]
^ పేరా 60 ఇండియాలో ఇది అందుబాటులో లేదు.