దేవుడా లేక మానవుడా?
దేవుడా లేక మానవుడా?
“నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండును.” (యోహాను 8:12) ఆ మాటలు యేసుక్రీస్తు అన్నాడు. మొదటి శతాబ్దానికి చెందిన ఒక విద్యావంతుడు ఆయన గురించి ఇలా రాశాడు: “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.” (కొలొస్సయులు 2:3) అంతేకాక, బైబిలు ఇలా చెబుతోంది: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) మన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడానికి యేసు గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం చాలా అవసరం.
భూవ్యాప్తంగా చాలామంది యేసుక్రీస్తు గురించి విన్నారు. మానవజాతి చరిత్ర మీద ఆయన ప్రభావం చూపించాడనడంలో సందేహం లేదు. వాస్తవానికి ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉపయోగంలో ఉన్న క్యాలెండర్, ఆయన జన్మించాడని భావించబడుతున్న సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని తయారుచేయబడినదే. “చాలామంది ఆ సంవత్సరానికి ముందున్న తేదీలను క్రీ.పూ., లేక క్రీస్తు పూర్వం అని పిలుస్తారు, వాళ్ళు ఆ సంవత్సరం తర్వాతి తేదీలకు ఎ.డి., లేక అన్నో డోమిని (ప్రభువు సంవత్సరంలో) ఉపయోగిస్తారు” అని ద వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా వివరిస్తోంది.
అయినా, యేసు ఎవరు అనే విషయం గురించి పరస్పర విరుద్ధమైన నమ్మకాలు ఉన్నాయి. కొందరు ఆయన కేవలం చరిత్ర మీద తన ముద్రవేసిన ఒక గొప్ప వ్యక్తి అని నమ్ముతారు. మరికొందరు ఆయనను సర్వశక్తిగల దేవునిగా ఆరాధిస్తారు. హిందూ మతాన్ని అవలంబించే కొందరు, దేవునిగా అవతారమెత్తినట్లు చాలామంది చెప్పే హిందువులు దేవునిగా ఆరాధిస్తున్న కృష్ణునితో యేసుక్రీస్తును పోలుస్తారు. యేసు కేవలం ఒక మానవుడేనా లేక ఆరాధించాల్సిన వ్యక్తా? అసలు ఆయన ఎవరు? ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మనం తర్వాతి ఆర్టికల్లో పరిశీలించబోతున్నట్లుగా యేసు గురించిన ఎక్కువ విషయాలు వివరించే పుస్తకం ఆ ప్రశ్నలకు సరైన జవాబులు ఇస్తోంది.