దుష్టులపైకి యెహోవా తీర్పు వస్తుంది
దుష్టులపైకి యెహోవా తీర్పు వస్తుంది
“మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి.”—ఆమోసు 4:12.
యెహోవా ఎప్పటికైనా ఈ భూమ్మీది దుష్టత్వాన్ని, బాధను అంతమొందిస్తాడా? ఆ ప్రశ్న ముందెన్నడూ లేనంత ఎక్కువగా ఈ శతాబ్దారంభంలో అడగబడింది. ఎక్కడ చూసినా మానవుడు తన తోటి మానవునిపట్ల చూపిస్తున్న అమానుషత్వమే కనబడుతోంది. హింస, ఉగ్రవాదం, అవినీతి లేని ప్రపంచాన్ని మనమెంతగా కోరుకుంటామో గదా!
2 ఒక మంచి వార్త ఏమిటంటే, దుష్టత్వాన్ని యెహోవా అంతమొందిస్తాడని మనం పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. దుష్టులపై దేవుడు చర్య తీసుకుంటాడని ఆయన లక్షణాలు మనకు గట్టి హామీ ఇస్తున్నాయి. యెహోవా నీతి న్యాయములుగలవాడు. కీర్తన 33:5లో ఆయన వాక్యం మనకిలా చెబుతోంది: “ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు.” మరో కీర్తన ఇలా చెబుతోంది: ‘బలాత్కారాసక్తులు ఆయనకు [యెహోవాకు] అసహ్యులు.’ (కీర్తన 11:5) కాబట్టి, నీతి న్యాయములను ప్రేమించే సర్వశక్తిగల దేవుడైన యెహోవా తాను ద్వేషిస్తున్న దానిని ఎల్లకాలం సహించడు.
3 యెహోవా దుష్టత్వాన్ని అంతమొందిస్తాడని మనం గట్టిగా నమ్మడానికి ఉన్న మరో కారణాన్ని పరిశీలించండి. గతంలో ఆయన వ్యవహరించిన విధానం దానికి హామీ ఇస్తోంది. దుష్టులతో యెహోవా వ్యవహార విధానానికి సంబంధించిన గమనార్హమైన ఉదాహరణలు బైబిలు పుస్తకమైన ఆమోసులో ఉన్నాయి. ఆమోసు ప్రవచనాన్ని లోతుగా పరిశీలించడం దైవిక తీర్పుకు సంబంధించిన మూడు సంగతులను నొక్కిచెబుతుంది. మొదటిది, అది అన్ని సందర్భాల్లో తగినదే. రెండవది, అది తప్పించుకోలేనిది. మూడవది, అది విచక్షణా సహితంగా ఉంటుంది, ఎందుకంటే యెహోవా దుష్టులకు శిక్ష విధిస్తాడు గానీ పశ్చాత్తాపపడుతున్న, సరైన మనోవైఖరిగల వ్యక్తులను కనికరిస్తాడు.—రోమీయులు 9:17-26.
దేవుని తీర్పు అన్ని సందర్భాల్లో తగినదే
4 ఆమోసు కాలంలో ఇశ్రాయేలు జనాంగం అప్పటికే రెండు రాజ్యాలుగా విడిపోయింది. మొదటిది రెండు గోత్రాల దక్షిణ యూదా రాజ్యం. రెండవది పది గోత్రాల ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం. యెహోవా ఆమోసును తన ప్రవక్తగా సేవ చేయమని ఆజ్ఞాపిస్తూ, యూదాలోని ఆయన స్వస్థలం నుండి ఇశ్రాయేలుకు పంపించాడు. దేవుడు ఆమోసును అక్కడ దైవిక తీర్పు ప్రకటించడానికి ఉపయోగించుకున్నాడు.
5 ఆమోసు దుష్ప్రవర్తనగల ఉత్తర రాజ్యం మీదకు రాబోయే యెహోవా తీర్పును ప్రకటించడంతో కాదుగానీ ఇశ్రాయేలు చుట్టూవున్న ఆరు జనాంగాల మీదకు రాబోయే తీవ్రమైన దైవిక తీర్పు గురించి ప్రకటించడంతో తన సేవను ఆరంభించాడు. ఆ జనాంగాలు ఏవంటే, సిరియా, ఫిలిష్తీయ, తూరు, ఎదోము, అమ్మోను, మోయాబు. ఆ జనాంగాలు నిజంగా దేవుని ప్రతికూల
తీర్పు పొందడానికి తగినవేనా? ఖచ్చితంగా! అయితే ఒకటి మాత్రం నిజం, వారు దేవుని ప్రజలకు శత్రువులుగా ఉండడానికే కంకణం కట్టుకున్నారు.6 ఉదాహరణకు, ‘గిలాదును నూర్చినందుకు’ యెహోవా సిరియనులను ఖండించాడు. (ఆమోసు 1:3) సిరియనులు గిలాదులోని కొంత భూభాగాన్ని అంటే ఇశ్రాయేలులో యొర్దాను నదికి తూర్పునవున్న ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడున్న దేవుని ప్రజలకు తీవ్ర హాని కలిగించారు. మరి ఫిలిష్తీయ, తూరుల విషయమేమిటి? పరవాసులుగా లేదా చెరపట్టబడినవారిగావున్న ఇశ్రాయేలీయులను తీసుకెళ్లి ఎదోమీయులకు అమ్ముకున్న దోషం ఫిలిష్తీయులపై ఉండగా, కొందరు ఇశ్రాయేలీయులు తూరు దేశపు బానిస వ్యాపారుల ఆధీనంలోకి వచ్చారు. (ఆమోసు 1:6, 9) దేవుని ప్రజలను బానిసలుగా అమ్మడాన్ని ఊహించండి! కాబట్టి సిరియ, ఫిలిష్తీయ, తూరులమీదికి విపత్తులు తీసుకువస్తానని యెహోవా ప్రకటించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
7 ఎదోము, అమ్మోను, మోయాబులకు పరస్పరం, అలాగే ఇశ్రాయేలీయులకు సంబంధించి ఒక సాధారణ విషయముంది. ఆ మూడు జనాంగాల వారూ ఇశ్రాయేలీయులకు బంధువులే. యాకోబు కవల సోదరుడైన ఏశావు ద్వారా ఎదోమీయులు అబ్రాహాము వంశం నుండి వచ్చారు. కాబట్టి, వారొక విధంగా ఇశ్రాయేలీయులకు సహోదరులు. అమ్మోనీయులు, మోయాబీయులు అబ్రాహాము అన్న కొడుకైన లోతుకు వారసులు. అయితే ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు తమ బంధువులైన ఇశ్రాయేలీయులను సోదర భావంతో చూశారా? ఎంతమాత్రం చూడలేదు! ఎదోమీయులు ‘తమకు సహోదరులగువారిపై’ నిర్దాక్షిణ్యంగా ఖడ్గం ఉపయోగించగా, అమ్మోనీయులు చెరలోవున్న ఇశ్రాయేలీయులపట్ల అమానుషంగా ప్రవర్తించారు. (ఆమోసు 1:11, 13) దేవుని ప్రజల విషయంలో మోయాబు అనుచిత ప్రవర్తనను ఆమోసు సూటిగా ప్రస్తావించకపోయినా, చాలాకాలంగా ఇశ్రాయేలీయులను వ్యతిరేకించిన చరిత్ర మోయాబీయులకు ఉంది. సన్నిహిత బంధువులైన ఆ మూడు జనాంగాలకు విధింపబడే శిక్ష కఠినంగా ఉంటుంది. యెహోవా వారిపై అగ్ని కురిపిస్తాడు.
దేవుని తీర్పు తప్పించుకోలేనిది
8 ఆమోసు ప్రవచనంలో ముందు ప్రస్తావించబడిన ఆ ఆరు జనాంగాలు నిస్సందేహంగా దేవుని ప్రతికూల తీర్పుకు తగినవే. అంతేగాక, వారు దాన్ని తప్పించుకునే మార్గమేలేదు. ఆమోసు 1వ అధ్యాయం 3వ వచనం నుండి 2వ అధ్యాయం 1వ వచనం వరకు యెహోవా ఆరుసార్లు, ‘తప్పకుండా శిక్షింతును’ అని చెప్పాడు. చెప్పినట్టే ఆయన ఆ జనాంగాలను శిక్షించకుండా విడిచిపెట్టలేదు. ఆ తర్వాత, ఈ జనాంగాలన్నీ విపత్తులు అనుభవించాయని చరిత్ర నిరూపిస్తోంది. వాటిలో కనీసం నాలుగు జనాంగాలు అంటే ఫిలిష్తీయ, మోయాబు, అమ్మోను, ఎదోములు చివరకు ఉనికిలోనే లేకుండా పోయాయి!
9 ఆమోసు ప్రవచనం ఆ తర్వాత ఏడవ జనాంగం పైకి అంటే ఆయన స్వదేశమైన యూదాపైకి దృష్టి సారించింది. యూదా రాజ్యంపై ఆమోసు తీర్పు ప్రకటించడం, ఉత్తర రాజ్యంలోని ఆయన శ్రోతలను బహుశా ఆశ్చర్యపరిచి ఉంటుంది. యూదా నివాసులు కఠిన తీర్పుకు ఎందుకు అర్హులు? ‘యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించినందుకే’ అని ఆమోసు 2:4 చెబుతోంది. తన ధర్మశాస్త్రాన్ని ఉద్దేశపూర్వకంగా అలా నిర్లక్ష్యం చెయ్యడాన్ని యెహోవా తేలికగా తీసుకోలేదు. ఆమోసు 2:5 ప్రకారం ఆయనిలా ప్రవచించాడు: “యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును.”
10 అవిశ్వాస యూదా రాబోయే శ్రమ తప్పించుకోలేకపోయింది. యెహోవా ఏడవసారి ఇలా చెప్పాడు: ‘నేను తప్పకుండ శిక్షింతును.’ (ఆమోసు 2:4) బబులోనీయులు సా.శ.పూ. 607లో యూదాను నాశనం చేసినప్పుడు అది ప్రవచించబడిన ఆ శిక్షను అనుభవించింది. దుష్టులు దేవుని తీర్పు తప్పించుకోలేరని మనం మళ్లీ ఒకసారి చూస్తున్నాం.
11 ఆమోసు ప్రవక్త అప్పటికే ఏడు జనాంగాలపై యెహోవా తీర్పు ప్రకటించాడు. ఆమోసు ఇక ప్రవచించడం ముగించాడని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఆయనింకా ముగించలేదు! ఆయన ముఖ్యంగా ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం మీద కఠినమైన తీర్పు సందేశాన్ని ప్రకటించమని ఆజ్ఞాపించబడ్డాడు. దేవుని ప్రతికూల తీర్పుకు ఇశ్రాయేలు తగినదే, ఎందుకంటే ఆ జనాంగపు నైతిక, ఆధ్యాత్మిక భ్రష్టత మహా ఘోరంగా తయారైంది.
12 ఇశ్రాయేలు రాజ్యంలో సర్వసాధారణమైన అణచివేతను ఆమోసు ప్రవచనం బహిర్గతం చేసింది. ఈ విషయం గురించి ఆమోసు 2:6, 7లో మనమిలా చదువుతాం: “ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మివేయుదురు. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు.”
13 నీతిమంతులు కేవలం ‘ద్రవ్యానికే’ అమ్మబడుతున్నారు, అంటే న్యాయాధిపతులు ద్రవ్యం లంచంగా తీసుకొని అమాయకులను శిక్షిస్తున్నారని దాని భావం కావచ్చు. అప్పిచ్చినవారు బీదలను “పాదరక్షల” ఖరీదుకు అంటే కొద్ది అప్పుకే బానిసలుగా అమ్మేస్తున్నారు. బాధ, దుఃఖం లేదా అవమానానికి సూచనగా తమ తలమీద తామే మట్టికొట్టుకునే స్థితికి ‘దరిద్రులను’ దిగజార్చాలని నిర్దయులైన ఆ మనుషులు ‘ఆశపడుతున్నారు’ లేదా అమితాసక్తితో ప్రయత్నిస్తున్నారు. ‘దీనులు’ న్యాయం జరగవచ్చని ఆశించలేనంతగా అక్కడ అవినీతి ప్రబలిపోయింది.
14 ఎవరెవరు అనాదరణకు గురవుతున్నారో గమనించండి. ఆ దేశ నివాసుల్లోని నీతిమంతులు, బీదలు, దరిద్రులు, దీనులు. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్ర నిబంధన దిక్కులేని వారిని బీదలను కనికరించాలని కోరింది. అయితే పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో అలాంటివారి పరిస్థితి మహా ఘోరంగా ఉంది.
“మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి”
15 ఇశ్రాయేలులో లైంగిక దుర్నీతి, ఇతర పాపాలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి, సరైన కారణంతోనే ఆమోసు ప్రవక్త ఆ తిరుగుబాటు జనాంగాన్ని “మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి” అని హెచ్చరించాడు. (ఆమోసు 4:12) యెహోవా ఎనిమిదవసారి “నేను తప్పకుండ దానిని శిక్షింతును” అని ప్రకటించాడు. కాబట్టి, అవిశ్వాస ఇశ్రాయేలు సమీపిస్తున్న ఆ దైవిక తీర్పును ఎంతమాత్రం తప్పించుకోలేదు. (ఆమోసు 2:6) దాక్కోవడానికి ప్రయత్నించే దుష్టుల గురించి దేవుడు ఇలా చెప్పాడు: ‘వారిలో ఒకడును తప్పించుకొనడు, తప్పించుకొనువారిలో ఎవడును బ్రదుకడు. వారు పాతాళములో చొచ్చినా అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును; ఆకాశమునకెక్కినా అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను.’—ఆమోసు 9:1, 2.
16 దుష్టులు “పాతాళములో” చొచ్చినా అంటే అలంకారార్థంగా భూమి అంతర్భాగాల్లో దాక్కోవడానికి ప్రయత్నించినా యెహోవా తీర్పును వారు తప్పించుకోలేరు. లేదా వారు ‘ఆకాశానికి ఎక్కిపోయినా’ అంటే ఎత్తైన పర్వతాలను ఆశ్రయించడానికి ప్రయత్నించినా దేవుని తీర్పును వారు తప్పించుకోలేరు. యెహోవా హెచ్చరిక సుస్పష్టం: ఆయన చేరుకోలేని చాటు ఉండదు. ఇశ్రాయేలు రాజ్యం దాని దుష్ట క్రియలకు లెక్క అప్పగించాలని దేవుని న్యాయం కోరుతోంది. ఆ సమయం రానే వచ్చింది. ఆమోసు తన ప్రవచనం వ్రాసిన తర్వాత దాదాపు 60 సంవత్సరాలకు అంటే సా.శ.పూ. 740లో ఇశ్రాయేలు రాజ్యం జయిస్తూ వచ్చిన అష్షూరీయుల ఎదుట కూలిపోయింది.
దేవుని తీర్పు విచక్షణా సహితంగా ఉంటుంది
17 దేవుని తీర్పు ఎల్లప్పుడూ సరైనదిగా ఉంటుందనీ, దానిని తప్పించుకోవడం అసంభవమనీ గ్రహించేందుకు మనకు ఆమోసు ప్రవచనం సహాయం చేసింది. అయితే ఆమోసు పుస్తకం యెహోవా తీర్పులు విచక్షణా సహితంగా ఉంటాయని కూడా సూచిస్తోంది. దుష్టులు ఎక్కడ దాక్కున్నా దేవుడు వారిని కనిపెట్టి తీర్పు విధించగలడు. పశ్చాత్తాపం చూపిన, యథార్థపరులను కూడా ఆయన కనిపెట్టి తాను ఎంచుకున్న వారిపట్ల కనికరం చూపగలడు. ఇది ఆమోసు పుస్తకం చివరి అధ్యాయంలో అద్భుతరీతిలో నొక్కి చెప్పబడింది.
18ఆమోసు 9వ అధ్యాయం 8వ వచనం ప్రకారం యెహోవా ఇలా సెలవిచ్చాడు: “యాకోబు సంతతివారిని సర్వనాశముచేయక విడిచిపెట్టుదును.” 13 నుండి 15 వచనాల్లో ఉన్నట్లుగా ‘చెరలోనుండి తన ప్రజలను రప్పింతునని’ యెహోవా వాగ్దానం చేశాడు. వారు కనికరింపబడి సురక్షితంగా, సుభిక్షంగా ఉంటారు. ‘కోయువారి వెంటనే దున్నువారు వస్తారని’ యెహోవా వాగ్దానం చేశాడు. ఒక్కసారి ఊహించండి—మళ్ళీ పొలం దున్ని, విత్తనాలు చల్లే కాలంవచ్చే వరకు పంట కూర్చడమే పూర్తికానంత విస్తారంగా ఆ కోత ఉంటుంది!
19 యూదా, ఇశ్రాయేలులో దుష్టులపై యెహోవా విధించిన తీర్పు విచక్షణా సహితమనీ, పశ్చాత్తాపం చూపించిన సరైన మనో వైఖరిగలవారు కనికరించబడ్డారనీ చెప్పవచ్చు. ఆమోసు 9వ అధ్యాయంలో వ్రాయబడిన పునరుద్ధరణ ప్రవచన నెరవేర్పుగా, సా.శ.పూ. 537లో పశ్చాత్తాపం చూపిన యూదుల, ఇశ్రాయేలీయుల శేషం బబులోను చెరనుండి తిరిగివచ్చింది. వారు తిరిగి తమ ప్రియమైన దేశంలో స్వచ్ఛారాధన నెలకొల్పారు. అలాగే వారు సురక్షితమైన వాతావరణంలో తమ ఇళ్లు కట్టుకొని, ద్రాక్షతోటలు, వనములు నాటుకున్నారు.
యెహోవా ప్రతికూల తీర్పు ఖచ్చితంగా అమలు చేయబడుతుంది!
20 ఆమోసు ప్రకటించిన దైవిక తీర్పు సందేశాల పరిశీలన, మన కాలంలో యెహోవా దుష్టత్వాన్ని అంతం చేస్తాడనే అభయం మనకివ్వాలి. అలాగని మనమెందుకు నమ్మవచ్చు? మొదటిది, దుష్టులతో దేవుని గత వ్యవహారాల ఉదాహరణలు మన కాలంలో ఆయనెలా చర్య తీసుకుంటాడో సూచిస్తున్నాయి. రెండవది, మతభ్రష్ట ఇశ్రాయేలు రాజ్యంపైకి వచ్చిన దేవుని తీర్పు, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహాబబులోను”లోని అత్యంత నిందాభరిత భాగమైన క్రైస్తవమత సామ్రాజ్యాన్ని దేవుడు నాశనం చేస్తాడనే విషయాన్ని రూఢీపరుస్తోంది.—ప్రక. 18:2.
21 క్రైస్తవమత సామ్రాజ్యం దేవుని ప్రతికూల తీర్పుకు తగినదేనని చెప్పడంలో సందేహం లేదు. దానిలో ఉన్న ఘోర మత, నైతిక పరిస్థితులే గొంతెత్తి మాట్లాడతాయి. క్రైస్తవమత సామ్రాజ్యానికి, సాతాను మిగతా ప్రపంచానికి వ్యతిరేకంగా యెహోవా ఇచ్చే తీర్పు తగినదే. దాన్ని తప్పించుకోవడం అసంభవం, ఎందుకంటే తీర్పు అమలు చేయబడే సమయం వచ్చినప్పుడు, ఆమోసు 9వ అధ్యాయం, 1వ వచనంలోని ఈ మాటలు అనువర్తిస్తాయి: ‘వారిలో ఒకడును తప్పించుకొనడు, తప్పించుకొనువారిలో ఎవడును బ్రదుకడు.’ అవును, దుష్టులు ఎక్కడ దాక్కున్నా యెహోవా వారిని కనిపెడతాడు.
22 దేవుని తీర్పు అన్ని సందర్భాల్లో తగినదే కాక, అది తప్పించుకోలేనిదీ విచక్షణా సహితమైనదీ. దీనిని మనం అపొస్తలుడైన పౌలు మాటల నుండి చూడవచ్చు. ఆయన ఇలా వ్రాశాడు: “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.” (2 థెస్సలొనీకయులు 1:6-8) దేవుని అభిషిక్తులకు శ్రమ కలిగించిన వారిపైకి ప్రతికూల తీర్పు తీసుకురావడం “దేవునికి న్యాయమే.” ఆ తీర్పు తప్పించుకోలేనిది ఎందుకంటే ‘ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు’ దుష్టులు ఎంతమాత్రం తప్పించుకోలేరు. దేవుని తీర్పు విచక్షణా సహితంగా కూడా ఉంటుంది ఎందుకంటే యేసు ‘దేవుని నెరుగనివారికిని, సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన’ చేస్తాడు. దేవుని తీర్పు అమలు చేయబడడం, శ్రమలు అనుభవించే దేవుని ప్రజలకు ఓదార్పునిస్తుంది.
యథార్థవంతుల నిరీక్షణ
23 ఆమోసు ప్రవచనంలో, సరైన మనోవైఖరిగల వారికి ఓదార్పు నిరీక్షణల అద్భుతమైన సందేశం ఉంది. ఆమోసు పుస్తకంలో ప్రవచించబడినట్లుగా, యెహోవా తన ప్రాచీనకాల ప్రజలను బొత్తిగా నిర్మూలించలేదు. ఆయన చివరకు ఇశ్రాయేలు, యూదా జనాంగాల్లో బంధీలుగావున్న వారిని సమకూర్చి, వారిని స్వదేశానికి రప్పించి వారికి సమృద్ధిగా భద్రతను, క్షేమాభివృద్ధిని కలుగజేశాడు. మన కాలంలో దాని భావమేమిటి? దైవిక తీర్పు అమలు జరిగే సమయంలో దుష్టులు ఎక్కడ దాక్కున్నా యెహోవా వారిని కనిపెడతాడనీ, తన కనికరానికి పాత్రులైన వారు ఈ భూమ్మీద ఏ ప్రాంతంలో జీవించినా వారిని ఆదుకుంటాడనీ మనకు స్పష్టం చేస్తోంది.
24 దుష్టులపైకి యెహోవా తీర్పు రావాలని మనం వేచివున్న అపొస్తలుల కార్యములు 13:48, NW) మనమిప్పుడు అనుభవిస్తున్న ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిలో పాలుపంచుకోవడానికి సాధ్యమైనంత ఎక్కువమందికి సహాయం చెయ్యాలని మనం నిశ్చయంగా కోరుకుంటాం. దుష్టులపైకి త్వరలో రానున్న దైవిక తీర్పు అమలు చేయబడడం నుండి వారు రక్షించబడాలనీ మనం ఆశిస్తాం. అయితే ఈ ఆశీర్వాదాలు అనుభవించాలంటే, మనకు సరైన హృదయస్థితి ఉండాలి. మనం తర్వాతి ఆర్టికల్లో చూడబోతున్నట్లుగా, ఇది కూడా ఆమోసు ప్రవచనంలో నొక్కిచెప్పబడింది.
కాలంలో, ఆయన నమ్మకమైన సేవకులుగా మనమేమి అనుభవిస్తున్నాం? యెహోవా మనలను సమృద్ధికరమైన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధితో ఆశీర్వదిస్తున్నాడు. క్రైస్తవమత సామ్రాజ్య అబద్ధ బోధల ఫలితంగా ప్రబలిన అబద్ధాలు, తప్పుడు బోధలు లేని ఆరాధనా విధానాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. ఆధ్యాత్మిక ఆహార సమృద్ధితో కూడా యెహోవా మనలను ఆశీర్వదించాడు. అయితే, యెహోవా నుండి వచ్చే ఈ ఆశీర్వాదాలతోపాటు మనపై బరువైన బాధ్యత కూడా ఉందని గుర్తుంచుకోవాలి. రాబోయే తీర్పు గురించి మనం ఇతరులను హెచ్చరించాలని దేవుడు ఆశిస్తున్నాడు. “నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగల” వారిని కనుగొనేందుకు శాయశక్తులా కృషి చేయాలని మనం కోరుకుంటాం. (మీరెలా జవాబిస్తారు?
• యెహోవా ప్రతికూల తీర్పులు ఎల్లప్పుడూ న్యాయమైనవేనని ఆమోసు ప్రవచనం ఎలా చూపిస్తోంది?
• దేవుని తీర్పులు తప్పించుకోలేనివని చూపించడానికి ఆమోసు ఎలాంటి రుజువు ఇచ్చాడు?
• దేవుని తీర్పు విచక్షణా సహితమైనదని ఆమోసు పుస్తకం ఎలా చూపిస్తోంది?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. దేవుడు దుష్టత్వాన్ని అంతమొందిస్తాడని మనమెందుకు నిశ్చయతతో ఉండవచ్చు?
3. ఆమోసు ప్రవచనాన్ని లోతుగా పరిశీలించడం వేటిని నొక్కిచెబుతుంది?
4. యెహోవా ఆమోసును ఎక్కడకు పంపించాడు, ఎందుకు పంపించాడు?
5. ఆమోసు మొదట ఏ జనాంగాలకు విరుద్ధంగా ప్రవచించాడు, వారు దేవుని ప్రతికూల తీర్పుకు తగినవారనడానికిగల ఒక కారణమేమిటి?
6. సిరియ, ఫిలిష్తీయ, తూరులమీదికి దేవుడు ఎందుకు విపత్తు తీసుకురాబోతున్నాడు?
7. ఇశ్రాయేలీయుల విషయంలో ఎదోము, అమ్మోను, మోయాబులకు సంబంధించిన సాధారణ విషయమేమిటి, అయితే వారు ఇశ్రాయేలీయులను ఎలా చూశారు?
8. ఇశ్రాయేలు సమీపానవున్న ఆరు జనాంగాలపైకి వచ్చే దేవుని తీర్పు ఎందుకు తప్పించుకోలేనిది?
9. యూదా నివాసులు దేనికి అర్హులు, ఎందుకు?
10. యూదా శ్రమను ఎందుకు తప్పించుకోలేకపోయింది?
11-13. ఆమోసు ముఖ్యంగా ఏ జనాంగానికి విరుద్ధంగా ప్రవచించాడు, అక్కడ అణచివేత ఏయే విధాలుగా ఉంది?
14. పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో ఎవరెవరు అనాదరణకు గురవుతున్నారు.
15, 16. (ఎ) “మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి” అని ఇశ్రాయేలీయులు ఎందుకు హెచ్చరించబడ్డారు? (బి) దేవుని తీర్పును దుష్టులు తప్పించుకోలేరని ఆమోసు 9:1, 2 ఎలా చూపిస్తోంది? (సి) సా.శ.పూ. 740లో పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి ఏమి సంభవించింది?
17, 18. దేవుని కనికరం గురించి ఆమోసు 9వ అధ్యాయం ఏమి వెల్లడిస్తోంది?
19. యూదుల, ఇశ్రాయేలీయుల శేషానికి ఏమి జరిగింది?
20. ఆమోసు ప్రకటించిన తీర్పు సందేశాల పరిశీలన మనకు దేనిని హామీ ఇవ్వాలి?
21. క్రైస్తవమత సామ్రాజ్యం దేవుని ప్రతికూల తీర్పును పొందడానికి ఎందుకు తగినది?
22. రెండవ థెస్సలొనీకయులు 1:6-8లో దేవుని తీర్పుకు సంబంధించిన ఏ అంశాలు స్పష్టం చేయబడ్డాయి?
23. ఆమోసు పుస్తకం నుండి మనం ఎలాంటి ఓదార్పు, నిరీక్షణ పొందవచ్చు?
24. యెహోవా ఆధునిక దిన సేవకులు ఏయే విధాలుగా ఆశీర్వదించబడ్డారు?
[17వ పేజీలోని చిత్రం]
ఇశ్రాయేలు రాజ్యం దేవుని తీర్పును తప్పించుకోలేదు
[18వ పేజీలోని చిత్రం]
సా.శ.పూ. 537లో ఇశ్రాయేలు, యూదాల శేషము బబులోను చెరనుండి తిరిగివచ్చింది