మనం ఎప్పటికైనా నిజమైన భద్రతను అనుభవిస్తామా?
మనం ఎప్పటికైనా నిజమైన భద్రతను అనుభవిస్తామా?
ప్రేమగల తల్లిదండ్రులతో ఆనందంగా ఆడుకుంటున్న పిల్లలను చూసి ఎవరు మాత్రం సంతోషించరు? శ్రద్ధగల తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు ఎంతో భద్రతతో ఉన్నట్లు భావిస్తారు. అయితే చాలామంది పిల్లలకు అలాంటి సంతోషం అరుదుగా లభిస్తుంది. కొంతమంది పిల్లలు రాత్రి పడుకోవడానికి స్థలం ఎక్కడ దొరుకుతుందా అని ప్రతీరోజు వెదుక్కోవాలి. ఇళ్ళులేని అలాంటి పిల్లలకు, భద్రత లేకుండా జీవిస్తున్న ఇతరులకు ఏదైనా నిరీక్షణ ఉందా?
భవిష్యత్తు నిరాశాపూరితంగా కనిపించినా, దేవుని వాక్యం నిరీక్షణను ఇస్తుంది. ప్రజలందరూ పూర్తి భద్రతతో జీవించే కాలం వస్తుంది అని యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేశాడు. ఆయన ఇలా వ్రాశాడు: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు.”—యెషయా 65:21, 22.
అయితే ఈ నిరీక్షణకు బలమైన ఆధారం ఉందా? అయితే, “నిరీక్షణ” అనే పదం ఎల్లప్పుడూ నిశ్చయతను సూచించదు. ఉదాహరణకు బ్రెజిల్‌లోని ప్రజలకు “ఆ ఎస్పెరాన్సా ఎ అల్టిమా క్యూ మొర్రె” అనే సామెత తరచూ వినిపిస్తుంటుంది. దాని అక్షరార్థ భావం, “నిరీక్షణ అన్నింటికంటే ఆఖరున మరణిస్తుంది.” చాలామంది ప్రజలకు నిరీక్షణతో ఉండడానికి బలమైన ఆధారం లేకపోయినా వాళ్ళు నిరీక్షిస్తూనే ఉంటారు అని అది సూచిస్తుంది. అయితే సజీవుడైన దేవుడు మనకు ఇచ్చే నిరీక్షణ భిన్నమైనది. “ఆయనయందు [దేవునియందు] విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 10:11) ఇప్పటికే నెరవేరిన బైబిలు ప్రవచనాలు, యెహోవా దేవుడు చేసిన ఇతర వాగ్దానాలు కూడా నెరవేరతాయనే నమ్మకాన్ని మనకు ఇస్తున్నాయి. ఆ వాగ్దానాలు నెరవేరినప్పుడు, పిల్లలు వీధుల్లో జీవించడానికి కారణమయ్యే పరిస్థితులు ఇక ఉండవు.
నేడు కూడా బైబిలులోని ఆచరణాత్మక ఉపదేశం, నిరీక్షణలేని వారు తమ జీవితాలను మెరుగుపరచుకొని, నిజమైన భద్రతను కనుగొనడానికి సహాయం చేస్తుంది. అది ఎలా సాధ్యం? మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి మీకు సహాయం చేసేందుకు సంతోషిస్తారు.