కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను అంధునిగా ఉన్నప్పుడు, నా కళ్ళు తెరుచుకున్నాయి!

నేను అంధునిగా ఉన్నప్పుడు, నా కళ్ళు తెరుచుకున్నాయి!

జీవిత కథ

నేను అంధునిగా ఉన్నప్పుడు, నా కళ్ళు తెరుచుకున్నాయి!

ఏగొన్‌ హాసర్‌ చెప్పినది

నా కంటిచూపు పోయిన రెండు నెలల తర్వాత, నేను నా జీవితంలో అప్పటివరకు నిర్లక్ష్యం చేసిన బైబిలు సత్యాల పట్ల నా కళ్ళు తెరుచుకున్నాయి.

గడచిన ఏడు దశాబ్దాల కంటే ఎక్కువకాలం గురించి నేను ఆలోచిస్తే, నా జీవితంలోని అనేక అంశాలు నాకు ఎంతో సంతృప్తినిస్తాయి. కానీ వాటిలో ఒక్క అంశాన్ని నేను మార్చుకోగలిగితే, నేను యెహోవా దేవుని గురించి తెలుసుకోవడాన్ని చాలా ముందే ఎంపిక చేసుకునేవాణ్ణి.

నేను 1927లో ఉరుగ్వేలో జన్మించాను, జీడిమామిడి పండు ఆకారంలో ఉండే ఈ దేశం అట్లాంటిక్‌ సముద్రతీరం పొడవునా మైళ్ళ కొలది అందమైన ప్రకృతి దృశ్యాలతో అర్జెంటీనా బ్రెజిల్‌ల మధ్య ఉంది. అక్కడి జనాభాలో వలస వచ్చినవారిలో ఇటాలియన్‌, స్పానిష్‌ వంశీయులే ఎక్కువగా ఉన్నారు. కానీ మా తల్లిదండ్రులు హంగేరీ నుండి వలస వచ్చినవారు, నా చిన్నతనంలో మా పొరుగువారు, మేము ఎంతో నిరాడంబరంగా జీవించేవాళ్ళం, అయితే మేమంతా ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఆ ప్రాంతంలో నేరాలు చాలా అరుదుగా జరిగేవి. మా మధ్య జాతి వివక్ష ఉండేది కాదు. విదేశీయులు, స్థానికులు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు అనే తేడా లేకుండా మేమందరం స్నేహితుల్లా ఉండేవాళ్ళం.

మా తల్లిదండ్రులు క్యాథలిక్‌ ఆచారాలను పాటించేవారు, నేను నా పదవ యేట చర్చిలో ప్రీస్టుకు సహాయపడే అల్టర్‌ బాయ్‌నయ్యాను. పెద్దవాడినయ్యాక నేను స్థానిక మతబోధకుడితో కలిసి పని చేశాను, ఆ ప్రాంతపు బిషప్పుతో సంప్రదించే గుంపులో ఒక సభ్యుడినయ్యాను. నేను వైద్య వృత్తిని ఎంపికచేసుకోవడం వల్ల, వెనిజులాలో క్యాథలిక్‌ చర్చి నిర్వహించిన సెమినార్‌లో పాల్గొనడానికి ఆహ్వానించబడ్డాను. మా గ్రూపులోని డాక్టర్లు గైనకాలజీ స్పెషలిస్ట్‌లు కాబట్టి, ఆ సమయంలో మార్కెట్‌లో ప్రవేశపెట్టబడుతున్న గర్భనిరోధక మాత్రలపై అధ్యయనం చేసే నియామకం మాకివ్వబడింది.

వైద్య విద్యార్థిగా నా తొలి అభిప్రాయాలు

నేను మానవ శరీరం గురించి నేర్చుకుంటున్న విద్యార్థి దశలోనే, దాని రూపకల్పనలో వ్యక్తం చేయబడిన జ్ఞానానికి ఎంతో ముగ్ధుడ్నయ్యాను. ఉదాహరణకు దేహరోగస్థితి నుండి తనకు తానే కోలుకోగల శరీర సామర్థ్యాన్ని బట్టి, అంటే కాలేయం లేక పక్కటెముకలు వంటి వాటినుండి కొంత భాగాన్ని తీసివేసినా అవి తిరిగి మామూలు పరిమాణంలోకి పెరిగే సామర్థ్యాన్ని బట్టి నేను అబ్బురపడ్డాను.

అదే సమయంలో, తీవ్రంగా గాయపడిన అనేకమంది బాధితులను చూశాను, రక్తం ఎక్కించడం మూలంగా వారు చనిపోవడం నాకు దుఃఖం కలిగించింది. రక్తం ఎక్కించడం వల్ల తలెత్తిన క్లిష్ట పరిస్థితుల కారణంగా చనిపోయిన రోగుల బంధువులతో మాట్లాడడం ఎంత కష్టమైందో నాకు ఇప్పటికీ గుర్తుంది. అనేక సందర్భాల్లో, రక్తం ఎక్కించడం వల్లనే తమ ప్రియమైన వారు మరణించారనే విషయం బంధువులకు తెలియజేయబడలేదు. దానికి బదులు వారికి వేరే కారణాలు చెప్పబడ్డాయి. చాలా సంవత్సరాలు గడచినా, రక్తమార్పిడ్ల విషయంలో నాలో కలిగిన సందిగ్ధ భావాలు ఇప్పటికీ గుర్తున్నాయి. చివరకు నేను ఆ పద్ధతిలో ఏదో పొరపాటు ఉందనే నిర్ధారణకు వచ్చాను. అప్పుడు నాకు రక్త పవిత్రతకు సంబంధించి యెహోవా నియమమేమిటో తెలిసివుంటే ఎంత బాగుండేదో! అలా తెలిసివుంటే, నేను చూస్తున్న పద్ధతి గురించి నాలో సందిగ్ధ భావాలు కలిగేవే కావు.​—⁠అపొస్తలుల కార్యములు 15:​19, 20.

ప్రజలకు సహాయం చేయడంలో సంతృప్తి

కొంతకాలానికి నేను సర్జన్‌నయ్యాను, ఆ తర్వాత సాంటా లూసియాలోని వైద్య సహాయ కేంద్రానికి డైరెక్టర్‌నయ్యాను. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్స్‌లో కూడా నాకు కొన్ని బాధ్యతలు ఉండేవి. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు నేను సహాయం చేశాను, వారి శారీరక బాధ నుండి వారిని విముక్తులను చేశాను, అనేక సందర్భాల్లో ప్రాణాలు కాపాడాను, ప్రసవ సమయంలో తల్లులకు సహాయం చేయడం ద్వారా ఈ లోకంలోకి కొత్త ప్రాణులను తెచ్చాను. రక్తమార్పిడ్లతో నాకు అంతకుముందున్న అనుభవాల కారణంగా, నేను రక్తం ఎక్కించకుండానే వేలాది ఆపరేషన్లు నిర్వహించాను. రక్తస్రావం అంటే పీపాకు చిల్లుపడడం వంటిది, దానికి నిజమైన పరిష్కారం ఆ చిల్లును పూడ్చడమే గానీ ఆ పీపాను నింపుతూ ఉండడం కాదని నేను తర్కించాను.

సాక్షులైన రోగులకు చికిత్స చేయడం

నాకు యెహోవాసాక్షులతో పరిచయం 1960 నుండి, అంటే వారు రక్త రహిత సర్జరీ కోసం మా క్లినిక్‌కు వస్తున్నప్పటి నుండి మొదలైంది. ఒక రోగి కేసైతే నేను ఎప్పటికీ మరచిపోలేను, ఆమె ఒక పయినీరు (పూర్తికాల పరిచారకురాలు), పేరు మర్సేదేస్‌ గొన్సాలేస్‌. ఆమె చాలా బలహీనంగా ఉండేది, యూనివర్సిటీ హాస్పిటల్‌లోని డాక్టర్లు ఆమెకు ఆపరేషన్‌ చేస్తే ఆమె బ్రతకదు అని భావించి, ఆపరేషన్‌ చేయడానికి సాహసించలేదు. ఆమె రక్తం కోల్పోతున్నప్పటికీ మేము మా క్లినిక్‌లో ఆమెకు ఆపరేషన్‌ చేశాం. ఆపరేషన్‌ విజయవంతమైంది, ఆ తర్వాత ఆమె తన 86వ యేట ఇటీవలే మరణించేంత వరకు అంటే 30 సంవత్సరాలకు పైగా పయినీరుగా కొనసాగింది.

అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన తమ క్రైస్తవ సహోదరుల పట్ల యెహోవాసాక్షులు కనబరిచే ప్రేమాసక్తులకు నేను ముగ్ధుడనయ్యేవాడిని. నేను హాస్పిటల్‌లోని రోగులను సందర్శించేటప్పుడు, వారు తమ నమ్మకాల గురించి మాట్లాడుతుంటే విని ఆనందించేవాడిని, వారు నాకిచ్చిన సాహిత్యాలను తీసుకునేవాడిని. అయితే అతి త్వరలో నేను వారి డాక్టరునే కాదు వారి ఆధ్యాత్మిక సహోదరుడ్ని కూడా అవుతాననే తలంపు నా మనసులోకి ఎన్నడూ రాలేదు.

ఒక రోగి కూతురైన బియాట్రీస్‌ను పెళ్ళి చేసుకున్న తర్వాత నేను సాక్షులకు మరింత దగ్గరయ్యాను. ఆమె కుటుంబంలోని చాలామంది సభ్యులు అప్పటికే యెహోవాసాక్షులతో సహవసిస్తున్నారు, మా పెళ్ళయ్యాక ఆమె కూడా క్రియాశీలక సాక్షి అయ్యింది. మరో పక్కన నేను నా పనిలో నిమగ్నమై వైద్య రంగంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాను. జీవితం సంతృప్తిగా ఉన్నట్లనిపించింది. కానీ అతి త్వరలో నా జీవితం కుప్పకూలి పోనున్నదని నాకు ఎంత మాత్రం తెలియదు.

దురవస్థకు గురికావడం

ఒక సర్జన్‌కు సంభవించగల అత్యంత ఘోరమైనవాటిలో కనుదృష్టి కోల్పోవడం ఒకటి. నాకదే జరిగింది. అకస్మాత్తుగా నా రెండు కళ్ళలో ఉండే పల్చని పొర పగిలిపోయి, నాకు అంధత్వం ఏర్పడింది! నాకు చూపు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. నాకు ఆపరేషన్‌ చేసి, రెండు కళ్ళకు కట్లు కట్టి మంచం మీద పడుకోబెట్టారు, నేను చాలా క్రుంగిపోయాను. నేను ఎందుకూ పనికిరానివాడిగా నిరీక్షణ లేనివాడిగా భావించి, చివరకు నా జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాను. నేను ఉండేది నాల్గవ అంతస్తులో కాబట్టి, మంచం మీద నుండి లేచి గోడ వెంట నడిచివెళ్ళి కిటికీ కోసం వెదకుతున్నాను. కిటికీలో నుండి దూకి చనిపోవాలనుకున్నాను. తీరా చూస్తే నేను హాస్పిటల్‌ వసారాలోకి చేరుకున్నాను. ఒక నర్సు నన్ను తిరిగి మంచం దగ్గరకు తీసుకువచ్చింది.

నేను మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ నేను నా అంధకార ప్రపంచంలో నిత్యం క్రుంగిపోతూ, చిరాకుపడుతూ గడిపాను. నేను అంధునిగా ఉన్న ఆ సమయంలో, నాకు చూపువస్తే మొత్తం బైబిలు చదువుతానని దేవునికి ప్రమాణం చేశాను. చివరకు నా కంటి చూపు కాస్త మెరుగుపడింది, నేను చదవగలను. అయితే నేను సర్జనుగా మాత్రం కొనసాగలేను. అయినా ఉరుగ్వేలో, “నో హే మల్‌ క్యు పొర్‌ బియెన్‌ నో వెంగా,” అంటే “ఏ మాత్రం మంచిలేని చెడు ఏదీ లేదు” అనే ఒక నానుడి ఉంది. దానిలోని సత్యాన్ని నేను అనుభవించబోతున్నాను.

దురుద్దేశంతో ఆరంభం

పెద్దక్షరాల అచ్చుగల ద జెరూసలెమ్‌ బైబిల్‌ కొనుక్కోవాలన్నది నా కోరిక, అయితే యెహోవాసాక్షుల దగ్గర తక్కువ ధరకు లభ్యమయ్యే బైబిలుందని నాకు తెలిసింది, ఆ బైబిలు ఒక యువసాక్షి మా ఇంటికి తెచ్చిస్తానని చెప్పాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ యువకుడు బైబిలు చేత పట్టుకొని మా గుమ్మం ముందర నిలబడ్డాడు. మా ఆవిడ తలుపు తీసి ఆయనతో మాట్లాడుతోంది. బైబిలు కొరకు ఆమె అతడికి డబ్బులు ఇచ్చేస్తే ఇక అతడు ఇంట్లో ఉండవలసిన అవసరమేమీ లేదనీ ఇక వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందనీ నేను లోపల నుండి అరిచాను, అతడు వెంటనే వెళ్ళిపోయాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అతి త్వరలో ఆ యువకుడే నా జీవితంలో ఒక గమనార్హమైన పాత్ర వహిస్తాడని నాకేమాత్రం తెలియదు.

ఒకరోజు నేను నా భార్యకు ఒక వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చలేకపోయాను. దానికి పరిహారంగా ఆమెను సంతోషపరచడం కోసం, నేను క్రీస్తు మరణం యొక్క వార్షిక జ్ఞాపకార్థానికి ఆమెతో కూడా వస్తానని చెప్పాను. ఆ దినం సమీపించినప్పుడు, నాకు నా వాగ్దానం జ్ఞాపకమొచ్చి ఆమెతోపాటు నేను ఆ కార్యక్రమానికి హాజరయ్యాను. అక్కడి స్నేహపూర్వకమైన వాతావరణం, నేను అందుకున్న ప్రేమపూర్వక స్వాగతం నన్ను ముగ్ధుడ్ని చేశాయి. ప్రసంగీకుడు తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు, ఆయనను చూసి నేను ఆశ్చర్యపోయాను, నేను మా ఇంటి నుండి అమర్యాదగా వెళ్ళగొట్టిన యువకుడే ఆ ప్రసంగీకుడు. ఆయన ప్రసంగం నన్ను ఎంతో ప్రభావితం చేసింది, ఆయనతో దురుసుగా ప్రవర్తించినందుకు నాకు చాలా బాధనిపించింది. దానికి పరిహారంగా నేను ఏమి చేయాలి?

ఆయనను ఒక సాయంత్రం భోజనానికి ఆహ్వానించమని నా భార్యను కోరాను, “మీరే పిలిస్తే ఇంకా బాగుంటుంది కదా? ఇక్కడే ఉండండి ఆయనే మన దగ్గరకు వస్తాడు” అని నా భార్య సలహా ఇచ్చింది. ఆమె చెప్పింది నిజమే. ఆయన మమ్మల్ని పలకరించడానికి మా దగ్గరకు వచ్చాడు, మా ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించాడు.

ఆయన మా ఇంటికి వచ్చిన సాయంత్రం జరిగిన సంభాషణ నాలోని అనేక మార్పులకు నాంది పలికింది. ఆయన నాకు నిత్య జీవమునకు నడుపు సత్యము * అనే పుస్తకం చూపించాడు, నేను ఆయనకు అదే పుస్తకపు ఆరు కాపీలు చూపించాను. హాస్పిటల్‌కు వచ్చిన సాక్షులైన వివిధ రోగులు వాటిని నాకు ఇచ్చారు, కానీ నేను వాటిని ఎన్నడూ చదవలేదు. భోజనం చేసేటప్పుడు, భోజనం తర్వాత రాత్రి పొద్దు పోయేంతవరకు ప్రశ్న వెంట ప్రశ్న వేస్తూనే ఉన్నాను, వాటన్నిటికీ ఆయన బైబిలు ఉపయోగించి జవాబులిచ్చాడు. అలా ఆ చర్చ తెల్లవారు జాము వరకు కొనసాగింది. ఆ యువకుడు వెళ్ళేముందు, సత్యము పుస్తకం ఉపయోగించి నాతో బైబిలు అధ్యయనం చేస్తానని ప్రతిపాదించాడు. ఆ పుస్తక అధ్యయనం మేము మూడు నెలల్లో పూర్తి చేసాము, ఆ తర్వాత “మహా బబులోను పడిపోయింది! దేవుని రాజ్యం ఏలుతోంది!”* (ఆంగ్లం) అనే పుస్తకాన్ని కొనసాగించాము. అటు తర్వాత నేను నా జీవితాన్ని యెహోవా దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్నాను.

మళ్ళీ సమర్థవంతుడిగా భావించడం

నా కళ్ళకు కలిగిన అంధత్వం ఫలితంగా, నేను అప్పటి వరకు నిర్లక్ష్యం చేసిన బైబిలు సత్యాల పట్ల నా “మనోనేత్రములు” తెరుచుకున్నాయి. (ఎఫెసీయులు 1:​17, 18) యెహోవా గురించీ ప్రేమపూర్వకమైన ఆయన సంకల్పం గురించీ తెలుసుకోవడం నా జీవితాన్నంతటినీ మార్చివేసింది. మళ్ళీ నేను సమర్థవంతుడిగా సంతోషంగా భావించాను. నేను ప్రజలకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాను, వారు ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ విధానంలోనూ నూతన విధానంలో శాశ్వతంగానూ తమ తమ జీవితాలను ఎలా పొడిగించుకోవాలో చూపిస్తాను.

నేను వైద్య పురోభివృద్ధితోపాటు ముందుకుసాగాను, రక్తమార్పిడిలోని ప్రమాదాలపై, ప్రత్యామ్నాయ చికిత్సలపై, రోగి హక్కులపై, బయోఎథిక్స్‌పై పరిశోధన చేశాను. ఆ విషయాలపై మెడికల్‌ సెమినార్లలో మాట్లాడేందుకు నేను ఆహ్వానించబడినప్పుడు, ఆ సమాచారాన్ని నేను స్థానిక మెడికల్‌ కమ్యూనిటీతో పంచుకునే అవకాశాలు నాకు లభించాయి. 1994లో బ్రెజిల్‌లోని రియో డి జనైరోలో రక్తరహిత థెరపీపై జరిగిన మొట్టమొదటి గోష్ఠికి నేను హాజరయ్యాను. రక్త స్రావాలతో ఎలా వ్యవహరించాలో తెలుపుతూ ఒక ప్రసంగమిచ్చాను. ఆ సమాచారంలోని కొంత భాగం, నేను వ్రాసిన “ఊన ప్రొపుయెస్ట: ఎస్ట్రాటెగియస్‌ పరా ఎల్‌ ట్రాటమియెంటొ దె లాస్‌ హెమరాజియస్‌” (“ఎ స్ట్రేటెజిక్‌ ప్రపొజిషన్‌ ఫర్‌ యాంటి హెమరేజిక్‌ ట్రీట్‌మెంట్‌”) అనే ఆర్టికల్‌లో ఉంది. హెమొథెరపియ అనే మెడికల్‌ మ్యాగజైన్‌లో అది ప్రచురించబడింది.

ఒత్తిడి సమయంలో యథార్థత

రక్తమార్పిడ్ల గురించిన నా సందేహాలు మొదట ఎక్కువగా వైజ్ఞానిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉండేవి. అయితే నేనే స్వయంగా హాస్పిటల్‌లోని ఒక రోగిగా మారినప్పుడు, రక్త మార్పిడ్లను నిరాకరించడం, డాక్టర్ల నుండి వచ్చే బలమైన ఒత్తిడి కింద నా విశ్వాసాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదని గ్రహించాను. తీవ్రమైన గుండెపోటు వచ్చిన తర్వాత నేను ఒక సర్జన్‌తో దాదాపు రెండు గంటల కంటే ఎక్కువ సమయం మాట్లాడుతూ నా స్థానం గురించి వివరించాల్సి వచ్చింది. ఆ సర్జన్‌ నా ప్రాణ మిత్రుడి కొడుకు, ఒకవేళ రక్తమార్పిడితో నా ప్రాణాలు కాపాడవచ్చని తను భావిస్తే నన్ను చనిపోనీయనని చెప్పాడు. ఆ డాక్టరు నాతో ఏకీభవించకపోయినా నా స్థానాన్ని అర్థం చేసుకొని దానికి గౌరవమిచ్చేలా చేయమని కోరుతూ నేను మౌనంగానే యెహోవాకు ప్రార్థించాను. చివరకు ఆ డాక్టరు నా నిర్ణయాలను గౌరవిస్తానని వాగ్దానం చేశాడు.

మరొక సందర్భంలో, నా ప్రొస్టేట్‌ గ్లాండ్‌ నుండి ఒక పెద్ద ట్యూమర్‌ తీసేయాల్సివచ్చింది. అప్పుడు రక్త స్రావం జరిగింది. మరొకసారి, నేను రక్తమార్పిళ్ళను నిరాకరించడానికి కారణాలను వివరించాను, నేను నా రక్తంలోని మూడు వంతుల్లో రెండు వంతులు కోల్పోయినా, వైద్య సిబ్బంది నా స్థానాన్ని గౌరవించింది.

వైఖరిలో మార్పు

ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బయోఎథిక్స్‌ సభ్యుడిగా నేను, రోగుల హక్కుల విషయంలో వైద్య సిబ్బంది, చట్టానికి సంబంధించిన అధికారులు తమ వైఖరి మార్చుకోవడాన్ని చూసి సంతృప్తి పొందే అవకాశం నాకు లభించింది. డాక్టర్ల అధికారపూర్వక వైఖరి తగ్గి, రోగి అన్ని విషయాలు తెలుసుకుని తీసుకునే నిర్ణయాన్ని గౌరవించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వారు రోగులు చికిత్సా విధానాన్ని ఎంపిక చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. యెహోవాసాక్షులు వైద్యానికి తగని ఛాందసులు అనే తలంపు లేకుండా పోయింది. బదులుగా వారు అన్ని విషయాలూ తెలిసిన రోగులు, వారి హక్కులను గౌరవించాలి అనే తలంపు వచ్చింది. మెడికల్‌ సెమినార్లలో, టెలివిజన్‌ కార్యక్రమాల్లో ప్రసిద్ధులైన ప్రొఫెసర్లు ఇలా అన్నారు: “యెహోవాసాక్షుల ప్రయత్నాల మూలంగా మాకు ఇప్పుడు అర్థమవుతోంది . . .” “మేము సాక్షుల నుండి నేర్చుకున్నాం . . . ” “మెరుగుపరచుకోవడాన్ని వారు మాకు నేర్పించారు.”

జీవితం అన్నింటికంటే ముఖ్యమైనది అని అంటారు, ఎందుకంటే జీవితం లేకుండా స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, గౌరవం వంటివాటికి అర్థం ఉండదు. అనేకమంది ఇప్పుడు, ప్రతీ వ్యక్తి తన వ్యక్తిగత హక్కులకు యాజమాన్యం వహిస్తాడనీ ఆయా పరిస్థితుల్లో తన హక్కుల్లో దేనికి ప్రాధాన్యతనివ్వాలనేది ఆ వ్యక్తే స్వయంగా నిర్ణయించుకుంటాడని గుర్తిస్తూ చట్టపరమైన ఒక ఉన్నత భావనను అంగీకరిస్తున్నారు. ఆ విధంగా గౌరవానికి, ఎంపిక చేసుకునే స్వేచ్ఛకు, మత నమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. రోగికి నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యం ఉంది. యెహోవాసాక్షులు ఏర్పాటు చేసిన ఆసుపత్రి సమాచార విభాగం, ఈ విషయాల్లో తమ అవగాహనను వృద్ధి చేసుకునేందుకు చాలామంది డాక్టర్లకు సహాయం చేసింది.

నా కుటుంబం నిరంతరం ఇచ్చిన మద్దతు నేను యెహోవా సేవలో ప్రయోజనకరంగా ఉండేందుకు, క్రైస్తవ సంఘంలో ఒక పెద్దగా సేవచేసేందుకు దోహదపడింది. నేను ఇంతకుముందే పేర్కొన్నట్లు, నా జీవితంలో ఇంకా ముందే నేను యెహోవా గురించి తెలుసుకోలేకపోయానన్నదే నేను ఎక్కువగా బాధపడే విషయం. అయినప్పటికీ, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనని” దేవుని రాజ్య ఏర్పాటులో నివసించే అద్భుతమైన నిరీక్షణ విషయంలో నా కళ్ళు తెరిపించినందుకు ఆయనకు నేనెంతో కృతజ్ఞుణ్ణి.​—⁠యెషయా 33:​24. *

[అధస్సూచీలు]

^ పేరా 24 యెహోవాసాక్షులు ప్రచురించినది.

^ పేరా 34 ఈ ఆర్టికల్‌ సిద్ధం చేస్తుండగా, సహోదరుడు ఏగొన్‌ హాసర్‌ చనిపోయారు. ఆయన నమ్మకస్థునిగా మరణించారు, ఆయన నిరీక్షణ ఖచ్చితంగా నెరవేరుతుందని మేమూ ఆయనతో ఆనందిస్తున్నాము.

[24వ పేజీలోని చిత్రం]

నా 30వ పడిలో, సాంటా లూసియా హాస్పిటల్‌లో పని చేస్తున్నాను

[26వ పేజీలోని చిత్రం]

1995లో నా భార్య బియాట్రీస్‌తో