దేవుని వాక్యం మిమ్మల్ని బలపరచిందా?
దేవుని వాక్యం మిమ్మల్ని బలపరచిందా?
సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని మీరెలా ఎదుర్కొంటారు? సాతాను సవాళ్ళను ఎదుర్కోవడానికి సముచితమైన ఒక లేఖనాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం యేసుకు సహాయపడింది. (మత్తయి 4:1-11) అదేవిధంగా, దావీదు రాజు వ్యక్తిగత శోధనలకు గురైనప్పుడు ఆయనను దేవుని వాక్యం బలపరచింది. ఆయన ఇలా అన్నాడు: “నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.”—కీర్తన 94:19.
అదేవిధంగా, మనకు సవాళ్ళు ఎదురైనప్పుడు ఇష్టమైన లేఖనాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం మనకు ఊరట కలిగించగలదు లేదా మనల్ని బలపరచగలదు. ఉదాహరణకు, 89 ఏండ్ల రెక్స్, 1931 నుండి పూర్తికాల సువార్తికునిగా ఉన్నాడు. అయినా ఆయనిలా అంటున్నాడు: “పరిచర్యలో నాకు ప్రత్యేక నియామకం ఇచ్చినప్పుడు, అందుకు నేను యోగ్యుడను కాదేమో అని తరచూ భావిస్తాను.” మరి ఆయన దాన్నెలా ఎదుర్కొన్నాడు? “నాకిష్టమైన లేఖనాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను, అదే సామెతలు 3:5, 6, అదిలా చెబుతోంది: ‘నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.’ ఈ లేఖనాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని దాన్ని పాటించడం నాకు ఇవ్వబడిన నియామకాలను విజయవంతంగా నిర్వహించడానికి దోహదపడింది.”
చిన్న పిల్లలు కూడా తమకిష్టమైన లేఖనం నుండి ప్రయోజనం పొందుతారు. 6 ఏండ్ల జాక్ తనకు ఇష్టమైన లేఖనం మత్తయి 24:14 అని చెబుతున్నాడు. తన తల్లిదండ్రులతో ప్రకటించడానికి వెళ్ళేలా ఈ లేఖనం అతడిని పురికొల్పింది. అతడిలా అంటున్నాడు: “ప్రతి శనివారం మా అమ్మ, నాన్న, అక్కలతో కలిసి సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళడమంటే నాకు ఇష్టం.”
యేసులాగే మీరు కూడా మీ విశ్వాసాన్ని పరీక్షించే సవాళ్ళను కొన్నిసార్లు నేరుగా ఎదుర్కొంటున్నారా? అలాంటప్పుడు ఫిలిప్పీయులు 4:13 మీకు ఇష్టమైన లేఖనాల్లో ఒకటిగా అవుతుండవచ్చు. దావీదు రాజులాగ మీరు మీ ‘అంతరంగంలోని విచారముల’ కారణంగా బాధపడుతున్నారా? అయితే మీరు వాటిని ఎదుర్కోవడానికి ఫిలిప్పీయులు 4:6,7 వచనాలను గుర్తు తెచ్చుకోవడం సహాయపడవచ్చు. మీరు దేవునికి చేస్తున్న సేవ అంత విలువైనది కాదని కొన్నిసార్లు చింతిస్తున్నారా? అలాగైతే 1 కొరింథీయులు 15:58 వచనాన్ని గుర్తుంచుకోవడం మిమ్మల్ని బలపరుస్తుంది.
సముచితమైన లేఖనాలను కంఠస్థం చేయడం ద్వారా, మనం దేవుని వాక్యం మన జీవితాల్లో ప్రభావం చూపించడానికి అనుమతిస్తాం. (హెబ్రీయులు 4:12) ఇటువంటి ఇష్టమైన లేఖనాలు మనకు బలాన్ని, ఆదరణను రెండింటినీ అందించగలవు.—రోమీయులు 15:4.