మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
• యేసుకు సోదరులు, సోదరీమణులు ఉన్నారని ఏమి సూచిస్తోంది?
మత్తయి 13:55లో మార్కు 6:3లో బైబిలు అలా చెబుతోంది. అక్కడ కనబడే గ్రీకు పదం (అడెల్ఫోస్), “ఒక వ్యక్తి భౌతిక సంబంధాలను లేదా చట్టపరమైన సంబంధాలను పేర్కొనడానికి” ఉపయోగించబడింది, అది “సొంత అన్నదమ్ములను మాత్రమే సూచిస్తుంది.” (ద క్యాథలిక్ బిబ్లికల్ క్వార్టర్లీ, జనవరి 1992)—12/15, 3వ పేజీ.
• యుద్ధ స్వరూపం మార్పు చెందినట్లు ఏది స్పష్టం చేస్తోంది, దానికి తరచూ మూలకారణాలు ఏమిటి?
ఇటీవలి సంవత్సరాల్లో మానవాళిని పీడించిన యుద్ధాలు, ఒకే దేశంలోని ప్రతికూల వర్గాలకు చెందిన పౌరుల మధ్య జరిగిన అంతర్యుద్ధాలే. వాటికి జాతి, వర్గ విద్వేషాలు, మత విభేదాలు, అన్యాయం, రాజకీయ సంక్షోభం వంటివే ప్రధాన కారణాలు. మరో ముఖ్య కారణం అధికారం మీద, డబ్బుమీద అత్యాశ.—1/1, 3-4 పేజీలు.
• క్రైస్తవులు మాదిరి ప్రార్థనను కంఠస్థం చేసి వల్లించాలని యేసు ఉద్దేశించలేదని మనకెలా తెలుసు?
యేసు ఈ మాదిరి ప్రార్థనను తన కొండమీది ప్రసంగంలో ఇచ్చాడు. దాదాపు 18 నెలల తర్వాత, ఆయన ప్రార్థన గురించి తొలుత ఇచ్చిన సూచనల్లోని సారాంశాన్ని పునరుద్ఘాటించాడు. (మత్తయి 6:9-13; లూకా 11:1-4) అయితే ఆయన ప్రతీ పదాన్ని తిరిగి వల్లించలేదనే వాస్తవం గమనార్హం. అది ఆ ప్రార్థనను కంఠస్థం చేసి అవే పదాలతో దానిని వల్లించేందుకు ఆయన దానిని ఇవ్వలేదని సూచిస్తోంది.—2/1, 8వ పేజీ.
• జలప్రళయం తర్వాత, పావురం ఓడ వద్దకు తెచ్చిన ఓలీవ ఆకు దానికి ఎక్కడ లభించింది?
జలప్రళయపు నీటిలోని లవణం గురించి, దాని ఉష్ణోగ్రత గురించి మనకు తెలియదు. కానీ ఓలీవ చెట్లు నరికివేసినా కొత్త చిగుర్లు పుట్టుకొస్తాయని పేరుగాంచాయి. కాబట్టి కొన్ని చెట్లు జలప్రళయపు నీళ్ళలో జీవంతో ఉండి, ఆ తర్వాత చిగురించి ఉండవచ్చు.—2/15, 31వ పేజీ.
• నైజీరియాలో జరిగిన అంతర్యుద్ధం సమయంలో, బయఫ్రాలో రాకపోకలు నిషేధించబడినప్పుడు ఆ ప్రాంతంలోని యెహోవాసాక్షులు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎలా పొందారు?
అటు ఐరోపాలో ఒక అధికారి ఇటు బయఫ్రా విమానాలు దిగేచోట ఒక అధికారి నియమించబడ్డారు. వారిద్దరూ యెహోవాసాక్షులే. ఆ ఇద్దరూ బయఫ్రాకు ఆధ్యాత్మిక ఆహారం సరఫరా చేసే ప్రమాదకరమైన పనిని చేపట్టడానికి ముందుకొచ్చారు. ఆ విధంగా వారు, 1970లో ఆ యుద్ధం ముగిసేంతవరకు అనేకమంది సహోదరులకు ప్రయోజనం చేకూర్చారు.—3/1, 27వ పేజీ.
• వెస్ట్ఫాలియాలోని శాంతి ఒప్పందం ఏమి సాధించింది, అందులో మతం ఎలా భాగం వహించింది?
సంస్కరణోద్యమం పవిత్ర రోమా సామ్రాజ్యాన్ని క్యాథలిక్, లూథరన్, కాల్వినిస్ట్ అనే మూడు రకాల విశ్వాసాలుగా చీల్చింది. 17వ శతాబ్దపు ఆరంభంలో ప్రొటస్టెంటు యూనియన్, క్యాథలిక్ లీగ్ ఏర్పడ్డాయి. ఆ తర్వాత బొహెమియాలో చెలరేగిన మత సంఘర్షణ అంతర్జాతీయ అధికార పోరాటంగా మారింది. క్యాథలిక్, ప్రొటస్టెంట్ పాలకులు రాజకీయ ఆధిపత్యం కోసం, వాణిజ్య లబ్ది కోసం కుతంత్రాలకు పాల్పడ్డారు. చివరకు జర్మన్ ప్రాంతంలోని వెస్ట్‌ఫాలియాలో శాంతి చర్చలు జరిగాయి. దాదాపు 5 సంవత్సరాల తర్వాత, 1648లో వెస్ట్‌ఫాలియా ఒప్పందంపై సంతకాలు చేయబడ్డాయి. దానితో ముప్పై సంవత్సరాల యుద్ధం ముగిసి, సార్వభౌమాధికారంగల రాష్ట్రాల ఆధునిక యూరప్ ఖండం ఆవిర్భవించింది.—3/15, 20-3 పేజీలు.
• “మృగము” యొక్క ముద్ర లేదా పేరు, అంటే 666 అనే సంఖ్య భావమేమిటి?
ఈ ముద్ర ప్రకటన 13:16-18 వచనాల్లో ప్రస్తావించబడింది. మృగం మానవ పరిపాలనను సూచిస్తోంది, ఆ మృగం మీదున్న “మనుష్యుని సంఖ్య,” అపరిపూర్ణ మానవ స్థితిని ప్రతిబింబించే ప్రభుత్వాలను సూచిస్తోంది. 600 ప్లస్ 60 ప్లస్ 6 అనే సంఖ్య, దేవుని దృష్టిలో అది పూర్తిగా లోపసహితమైనదని చూపిస్తోంది. ఈ ముద్రగలవారు రాజకీయ వ్యవస్థకు ఆరాధనాపూర్వక గౌరవాన్ని ఇస్తారు లేదా తమ రక్షణకోసం దానివైపు చూస్తారు.—4/1, 4-7 పేజీలు.