కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఈ లోకపు నటన గతించుచున్నది”

“ఈ లోకపు నటన గతించుచున్నది”

“ఈ లోకపు నటన గతించుచున్నది”

“సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది.”​—⁠1 కొరింథీయులు 7:29.

మీ జీవిత కాలంలో మీరు ఎలాంటి మార్పులు చూశారు? వాటిలో కొన్ని మీరు గుర్తుచేసుకోగలరా? ఉదాహరణకు, వైద్యశాస్త్రం పురోగమించింది. ఆ రంగంలోని పరిశోధన కారణంగా కొన్ని దేశాల్లో 20వ శతాబ్దపు ఆరంభంలో 50 సంవత్సరాల కంటే తక్కువున్న సగటు జీవితకాలం నేడు 70 కంటే ఎక్కువ సంవత్సరాలయ్యింది! రేడియో, టెలివిజన్‌, సెల్‌ ఫోన్లు, ఫ్యాక్స్‌ మిషన్లు సముచితంగా ఉపయోగించడం నుండి మనం ప్రయోజనం పొందిన మార్గాల గురించి కూడా ఆలోచించండి. విద్య, రవాణా, మానవహక్కుల పురోభివృద్ధిని మనం కాదనలేం, ఇవన్నీ కోట్లాదిమంది జీవితాలను మెరుగుపరిచాయి.

2 అయితే, మార్పులన్నీ మేలుకోసమే జరుగలేదు. పెరుగుతున్న నేరాలు, పతనమవుతున్న నైతిక విలువలు, అధికమవుతోన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వేగంగా పెరుగుతున్న విడాకుల సంఖ్య, పరుగులు తీస్తున్న ద్రవ్యోల్బణం, అంతకంతకు మరెక్కువ జడిపిస్తున్న ఉగ్రవాదపు వినాశనకర ప్రభావాలను చూసీచూడనట్లుగా వదిలేయడం అసాధ్యం. ఏదేమైనా, ఎంతోకాలం పూర్వమే, “ఈ లోకపు నటన గతించుచున్నది” అని అపొస్తలుడైన పౌలు వ్రాసిన మాటలతో మీరు ఏకీభవిస్తారు.​—⁠1 కొరింథీయులు 7:31.

3 పౌలు ఆ మాటలు పలికినప్పుడు, ఆయన లోకాన్ని రంగస్థలంతో పోలుస్తున్నాడు. ఆ రంగస్థల నటులు అంటే రాజకీయ, మత, సాంస్కృతిక రంగ ప్రముఖులు రంగ ప్రవేశంచేసి, తమ పాత్ర పోషించి, ఆ తర్వాత వేరేవారి కోసం రంగ నిష్క్రమణ చేస్తుంటారు. ఇది శతాబ్దాలుగా జరుగుతోంది. గడచిన కాలంలో ఒకే రాజవంశానికి చెందినవారు దశాబ్దాలపాటు, చివరకు శతాబ్దాలపాటు పరిపాలించేవారు, నెమ్మదిగా మార్పులు జరిగాయి. కానీ నేడు పరిస్థితి అలా లేదు, ఒక ప్రముఖ నాయకుడు చంపబడినప్పుడు క్షణకాలంలోనే చరిత్ర గమనం మారిపోతుంది! అవును, ఈ కల్లోలభరిత కాలాల్లో రేపేమి జరుగుతుందో మనకు తెలియదు.

4 లోకం రంగస్థలమైతే దాని పరిపాలకులు నటులైతే, క్రైస్తవులు ప్రేక్షకులు. * అయితే వారు “లోకసంబంధులు కారు” కాబట్టి, రంగస్థల ప్రదర్శన గురించి లేదా ఆయా పాత్రధారుల వ్యక్తిత్వాల గురించి వారు అధికంగా చింతించరు. (యోహాను 17:​16) బదులుగా, ఆ నాటకం చరమాంకానికి చేరుకుంటుంది అంటే విపత్కరమైన ముగింపుకు చేరుకుంటుంది అని తెలిపే సూచనల కోసం వారు ఆత్రుతతో ఎదురుచూస్తారు, ఎందుకంటే దీర్ఘకాలంగా ఎదురుచూడబడుతోన్న నీతియుక్తమైన నూతనలోకాన్ని యెహోవా స్థాపించే ముందు ఈ విధానం అంతం కావాలని వారికి తెలుసు. * కాబట్టి మనం యుగాంతంలో జీవిస్తున్నామనీ, నూతనలోకం సమీపంలో ఉందనీ తెలియజేసే రెండు రకాల రుజువులను మనం పరిశీలిద్దాం. అవి (1) బైబిలు కాలవృత్తాంతం, (2) దిగజారుతున్న లోక పరిస్థితులు.​—⁠మత్తయి 24:21; 2 పేతురు 3:13.

చివరకు ఆ మర్మం వెల్లడయింది!

5 కాలానికీ, సంఘటనలకూ మధ్యగల సంబంధాన్ని అధ్యయనం చేయడమే కాలవృత్తాంతం. దేవుని రాజ్య ప్రమేయం లేకుండా ఈ లోక నాయకులే ప్రపంచ రంగస్థలంపై ప్రముఖ పాత్ర పోషించే కాలం గురించి యేసు మాట్లాడాడు. ఆ కాలాన్ని యేసు “అన్యజనముల కాలములు” అని పిలిచాడు. (లూకా 21:​24) ఆ “కాలముల” అంతంలో హక్కుదారుడైన పరిపాలకునిగా యేసు పరిపాలించే దేవుని పరలోక రాజ్యం అధికారంలోకి వస్తుంది. మొదట యేసు తన “శత్రువుల మధ్య” పరిపాలన చేస్తాడు. (కీర్తన 110:⁠2) ఆ తర్వాత దానియేలు 2:⁠44 చెప్పిన ప్రకారం ఆ రాజ్యం మానవ ప్రభుత్వాలన్నింటిని ‘పగులగొట్టి నిర్మూలంచేసి’ అది శాశ్వతకాలం నిలిచివుంటుంది.

6 “అన్యజనముల కాలములు” ఎప్పుడు ముగుస్తాయి, దేవుని రాజ్యపాలన ఎప్పుడు ఆరంభమౌతుంది? “అంత్యకాలమువరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడిన” ఆ జవాబులో బైబిలు కాలవృత్తాంతం ఇమిడివుంది. (దానియేలు 12:⁠9) ఆ “కాలము” సమీపిస్తుండగా యెహోవా వినయస్థులైన బైబిలు విద్యార్థుల గుంపుకు ఆ జవాబును వెల్లడి చేయడానికి చర్యలు తీసుకున్నాడు. దేవుని ఆత్మ సహాయంతో వారు “అన్యజనముల కాలములు” సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనంతో మొదలయ్యాయనీ ఆ “కాలములు” 2,520 సంవత్సరాలనీ అర్థం చేసుకున్నారు. దీనినుండి వారు 1914లో “అన్యజనముల కాలములు” ముగుస్తాయని లెక్కగట్టారు. అంతేకాకుండా, 1914తో ఈ విధానాంతం ఆరంభమైందని కూడా వారు గ్రహించారు. మీరు ఒక బైబిలు విద్యార్థిగా 1914 ఎలా లెక్కించబడిందో లేఖనాల నుండి వివరించగలరా? *

7 దానియేలు పుస్తకంలో ఓ సంకేతం దాగివుంది. సా.శ.పూ. 607లో “అన్యజనముల కాలములు” ఆరంభమైనప్పుడు యెరూషలేమును నాశనం చేయడానికి యెహోవా నెబుకద్నెజరు రాజును ఉపయోగించాడు కాబట్టి, దేవుని జోక్యం లేకుండా అన్యజనాంగాలు సూచనార్థకంగా ఏడు కాలాలు పరిపాలన సాగిస్తాయని ఆయన ఆ పరిపాలకుని ద్వారా వెల్లడిచేశాడు. (యెహెజ్కేలు 21:26, 27; దానియేలు 4:​16, 23-25) ఆ ఏడుకాలాల నిడివి ఎంత? ప్రకటన 11:2, 3 మరియు 12:​6, 14 ప్రకారం మూడున్నర కాలాల నిడివి 1,260 రోజులు. ఆ విధంగా ఏడు కాలాల నిడివి దానికి రెట్టింపు ఉండాలి అంటే 2,520 రోజులు ఉండాలి. అంతటితో ఆ లెక్కముగిసిందా? లేదు ఎందుకంటే యెహోవా ఆ సూచనార్థక కాలాన్ని లెక్కించేందుకు దానియేలు సమకాలీనుడైన యెహెజ్కేలు ప్రవక్తకు ఓ నియమాన్ని ఇచ్చాడు: “సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను.” (యెహెజ్కేలు 4:⁠6) కాబట్టి, ఏడు కాలాలు నిజానికి 2,520 సంవత్సరాలుగా ఉంటాయి. సా.శ.పూ. 607తో ఆరంభించి ఆ 2,520 సంవత్సరాలను మనం లెక్కిస్తే అన్యజనముల కాలములు 1914లో ముగుస్తాయనే నిర్ధారణకు మనం చేరుకోవచ్చు.

“అంత్యకాలము” నిర్ధారించబడింది

8 బైబిలు కాలవృత్తాంతంపై ఆధారపడ్డ అవగాహన సరైనదేనని 1914 నుండి జరుగుతున్న ప్రపంచ సంఘటనలు ధృవీకరిస్తున్నాయి. “యుగసమాప్తి” యుద్ధాలు, కరవులు, తెగుళ్లచే గుర్తించబడుతుందని స్వయంగా యేసే చెప్పాడు. (మత్తయి 24:3-8; ప్రకటన 6:​2-8) 1914 నుండి పరిస్థితి నిశ్చయంగా అలాగే వుంది. దానికితోడు ప్రజల వైఖరిలో గుర్తింపదగ్గ మార్పు ఉంటుందని చెబుతూ అపొస్తలుడైన పౌలు మరింత సమాచారమిచ్చాడు. ఆయన వర్ణించిన మార్పులు ఖచ్చితంగా అలాగే ఉన్నాయని కళ్లకు కట్టినట్టుగా మనం చూస్తూనే ఉన్నాము.​—⁠2 తిమోతి 3:1-5.

9 “ఈ లోకపు నటన” 1914 నుండి నిజంగా మారిందా? ద జనరేషన్‌ ఆఫ్‌ 1914 అనే పుస్తకంలో ప్రొఫెసర్‌ రాబర్ట్‌ వోల్‌ ఇలా చెబుతున్నాడు: “ఆ యుద్ధకాలంలో జీవించినవారు ఓ ప్రపంచం ముగిసి 1914 ఆగస్టులో మరో ప్రపంచం ఆరంభమైందనే నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోరు.” దీనిని ధృవీకరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్య సంచాలకుడైన డాక్టర్‌ జార్జ్‌ ఎ. కోస్ట ఇలా వ్రాశాడు: “శరవేగంతో మార్పులు జరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. అవి మానవ చరిత్రలో మునుపెన్నడూ చూడని స్థాయిలో వ్యాకులతకు, ఒత్తిడికి కారణమవుతున్నాయి.” మీ వ్యక్తిగత అనుభవం కూడా అలాగే ఉందా?

10 దిగజారుతున్న ప్రపంచ పరిస్థితులకు కారణమైన దోషి ఎవరు? ఆ దోషి ముసుగు తొలగిస్తూ ప్రకటన 12:7-9 ఇలా చెబుతోంది: “పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును [యేసుక్రీస్తును] అతని దూతలును ఆ ఘటసర్పముతో [అపవాదియైన సాతానుతో] యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోస పుచ్చు . . . ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను.” కాబట్టి అపవాదియగు సాతానే కష్టాలు కలిగిస్తున్న దోషి, 1914లో అతడు పరలోకం నుండి పడద్రోయబడడంవల్ల “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.”​—⁠ప్రకటన 12:10, 12.

నాటకపు చరమాంకం ఎలా ఉంటుంది

11 తన ముగింపు సమీపిస్తోందని తెలుసుకున్న సాతాను 1914 నుండి ‘సర్వలోకమును మోసపుచ్చేందుకు’ తన ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అన్ని సందర్భాల్లోను ఆరితేరిన ఆ మోసగాడు తెరవెనుక ఉండి రంగస్థలంపై ప్రపంచ నాయకులను, ప్రముఖులను నటులుగా నటింపజేస్తుంటాడు. (2 తిమోతి 3:13; 1 యోహాను 5:​19) అతని లక్ష్యాల్లో ఒకటి, తన పరిపాలనా విధానమే నిజమైన శాంతి తెస్తుందని ఆలోచించేలా మానవాళిని మోసం చేయడం. ఒక రకంగా అతని ప్రచారం జయప్రదమైంది, ఎందుకంటే పరిస్థితులు అంతకంతకు చెడిపోతున్నాయనడానికి కొండంత రుజువున్నా ప్రజలు ఆశాభావంతోనే ఉన్నారు. ఈ విధానం నాశనం చేయబడడానికి ముందు సాతాను ప్రచారంలో గమనించదగ్గ మాట ఒకటి ఉంటుందని అపొస్తలుడైన పౌలు ప్రవచించాడు. ఆయనిలా వ్రాశాడు: “లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని [“శాంతి భద్రతలున్నాయని,” NW] చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును.”​—⁠1 థెస్సలొనీకయులు 5:3; ప్రకటన 16:13.

12 ఇటీవలి సంవత్సరాల్లో, వివిధరకాల మానవ పథకాలను వర్ణిస్తూ రాజకీయ నాయకులు “శాంతి భద్రతలు” అనే మాటల్ని తరచూ ఉపయోగిస్తున్నారు. పేరుకు తగ్గట్టు ఆ సంవత్సరం లేకపోయినా 1986వ సంవత్సరానికి వారు అంతర్జాతీయ శాంతి సంవత్సరమని నామకరణం చేశారు. ప్రపంచ నాయకులు చేసే అలాంటి ప్రయత్నాలు 1 థెస్సలొనీకయులు 5:3వ వచనపు సంపూర్ణ నెరవేర్పును సూచిస్తున్నాయా లేక ప్రపంచ దృష్టినాకర్షించే నాటకీయమైన ప్రత్యేక సంఘటనను పౌలు సూచిస్తున్నాడా?

13 బైబిలు ప్రవచనాలు నెరవేరిన తర్వాత లేదా నెరవేరుతుండగా మాత్రమే పూర్తిగా అర్థమవుతాయి కాబట్టి మనం వేచి చూడాలి. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే, ‘శాంతి భద్రతల’ కేక వెనువెంటనే ఆకస్మికంగా కలిగే నాశనాన్ని పౌలు గర్భిణీ స్త్రీకి కలిగే ప్రసవ వేదనతో పోల్చాడు. తల్లికాబోయే స్త్రీకి తొమ్మిది నెలల కాలంలో తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అంతకంతకూ ఎక్కువ తెలుస్తుంటుంది. బహుశా ఆమె బిడ్డ గుండె చప్పుళ్లు వినగలుగుతుంది లేదా ఆమెకు కడుపులో బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. కడుపులో బిడ్డ కాళ్లతో తన్నవచ్చు కూడా. అలాంటి సూచనలు రోజులు గడిచేకొద్ది ఎక్కువవుతూ ఉంటాయి అయితే అకస్మాత్తుగా ఒక రోజు తాను ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం అంటే కాన్పు సమయం వచ్చిందని సూచిస్తూ ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమవుతాయి. కాబట్టి, ‘శాంతి భద్రతల’ కేకకు సంబంధించిన ప్రవచనం ఏవిధంగా నెరవేరినా, అది అకస్మాత్తుగా వచ్చి బాధ కలిగించేదిగావున్నా చివరకు ఆశీర్వాదకరంగా మారే సంఘటనకు అంటే దుష్టత్వం నాశనమవడానికి, నూతన ప్రపంచ విధానం ఆరంభమవడానికి దారితీస్తుంది.

14 ప్రేక్షకులుగా గమనించే నమ్మకమైన క్రైస్తవులకు ఆ రాబోయే నాశనం భక్తిపూర్వక భయం కలిగించేదిగా ఉంటుంది. మొదట, భూరాజులు (సాతాను సంస్థ యొక్క రాజకీయ విభాగం) మహాబబులోను మద్దతుదారులపై (దాని మత విభాగంపై) దాడిచేసి వారిని నాశనం చేస్తారు. (ప్రకటన 17:​1, 15-18) అలా పరిస్థితి ఆశ్చర్యకరంగా మలుపుతిరిగి సాతాను రాజ్యం రెండుగా విచ్ఛినమైపోతుంది, దానిలోని ఒక విభాగం మరోదానిపై దాడి చేసుకుంటాయి, కాగా దానిని నివారించే శక్తి సాతానుకు ఉండదు. (మత్తయి 12:​25, 26) భూరాజులు ‘తన సంకల్పం కొనసాగించడానికి’ అంటే భూమి నుండి తన మత విరోధులను తొలగించడానికి యెహోవాయే వారికి ఆ బుద్ధి పుట్టిస్తాడు. అబద్ధమతం నాశనమైన తర్వాత, సాతాను వ్యవస్థలో మిగిలినవాటిని అంటే వాణిజ్య, రాజకీయ శక్తుల్ని పూర్తిగా నలుగగొట్టి నాశనం చేయడానికి యేసుక్రీస్తు తన పరలోక సైన్యాలను నడిపిస్తాడు. చివరకు, సాతాను బంధించబడి అచేతనుడిగా చేయబడతాడు. దానితో, దీర్ఘకాలంగా సాగుతున్న నాటకానికి తెరపడుతుంది.​—⁠ప్రకటన 16:14-15; 19:11-21; 20:1-3.

15 ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆ దినం లేదా ఘడియ మనకు తెలియవు. (మత్తయి 24:​36) కానీ, “కాలము సంకుచితమై యున్నది” అని మనకు తెలుసు. (1 కొరింథీయులు 7:​29) కాబట్టి మిగిలిన సమయాన్ని మనం జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడం ఆవశ్యకం. ఎలా? అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నట్లుగా, మనం ప్రతీ దినాన్ని లెక్కలోకి తీసుకుంటూ అల్పవిషయాలకు కేటాయించే సమయాన్ని మరి ప్రాముఖ్యమైన వాటికి వెచ్చిస్తూ ‘సమయం పోనివ్వక సద్వినియోగం’ చేసుకోవాలి. కారణమేమిటి? “దినములు చెడ్డవి.” మనకోసం యెహోవా ‘చిత్తమేమిటో’ మనం ‘గ్రహించినప్పుడు’ ఇంకా మిగిలివున్న ప్రశస్త సమయాన్ని మనం వృధాచేయము.​—⁠ఎఫెసీయులు 5:15-17; 1 పేతురు 4:1-4.

16 ప్రపంచ విధానమంతా అంతమవడానికి సిద్ధంగా ఉందని తెలుసుకొన్న మనం వ్యక్తిగతంగా ఎలా ప్రభావితులం కావాలి? మన ప్రయోజనార్థమై అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక . . . మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” (2 పేతురు 3:​11) నిజంగా మనమెలాంటి వ్యక్తులుగా ఉండాలో గదా! పేతురు ఇచ్చిన జ్ఞానయుక్తమైన సలహాకు అనుగుణంగా మనం (1) మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండేలా మనం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి, (2) యెహోవా సేవలో మనం అత్యంతాసక్తితో చేసే క్రియలు అన్ని సందర్భాల్లోను ఆయనపట్ల మన ప్రగాఢ ప్రేమను ప్రతిబింబించేలా చూసుకోవాలి.

17 లోకాశలనుబట్టి దానికి హత్తుకుపోకుండా ఉండేందుకు దేవునిపట్ల మనకున్న ప్రేమ మనల్ని అడ్డగిస్తుంది. ప్రస్తుత విధానానికి భవిష్యత్తులో జరగబోయే దాని దృష్ట్యా, ఆనందమే ఉత్తమ పురుషార్థమనే లోకపు తళుకు బెళుకుల పరధ్యానంలో పడిపోవడం మనకు ప్రమాదకరం. మనం ఈ లోకంలో జీవిస్తూ, పనిచేస్తున్నప్పటికీ, ఈ లోకాన్ని అమితంగా అనుభవించకుండా ఉండాలనే జ్ఞానయుక్త ఉపదేశాన్ని మనం లక్ష్యపెట్టాలి. (1 కొరింథీయులు 7:​31) నిజానికి, ఈ లోక ప్రచారపు మోసానికి గురికాకుండా జాగ్రత్తగా ఉండేలా మనం శాయశక్తులా ప్రయత్నించాలి. ఈ లోకం దాని సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధించలేదు. అది యుగయుగాలు ఇలాగే నిలబడదు. మనమలా ఎందుకు ఖచ్చితంగా చెప్పగలం? ఎందుకంటే దేవుని ప్రేరేపిత వాక్యమిలా చెబుతోంది: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”​—⁠1 యోహాను 2:17.

శేష్ఠమైనది ఇంకా రావలసివుంది!

18 యెహోవా త్వరలోనే సాతాను అతని మద్దతుదారుల పనిబడతాడు. ఆ తర్వాత, దేవుని ఆశీర్వాదంతో ఈ విధానాంతం నుండి రక్షించబడ్డ విశ్వసనీయులు నిత్యం నిలిచివుండేలా రంగస్థలంపై ‘నటనలో’ మార్పులు తీసుకురావడం ఆరంభిస్తారు? యుద్ధమిక ఎన్నడూ ఆ దృశ్యాన్ని పాడుచేయదు; ఎందుకంటే దేవుడు ‘భూదిగంతములవరకు యుద్ధములు మాన్పుతాడు.’ (కీర్తన 46:⁠9) కరవుల స్థానే “దేశములో . . . సస్య సమృద్ధి” ఉంటుంది. (కీర్తన 72:​16) జైళ్లు, పోలీసు స్టేషన్లు, సుఖవ్యాధులు, మాదకద్రవ్య ప్రభువులు, విడాకుల న్యాయస్థానాలు, దివాలాకోరు విధానాలు, ఉగ్రవాదం మటుమాయమవుతాయి.​—⁠కీర్తన 37:29; యెషయా 33:24; ప్రకటన 21:3-5.

19 సమాధులు తెరవబడి వందలకోట్ల మంది పునరుత్థానం చేయబడడంతో రంగస్థలం మీదికి మరెక్కువమంది నటులు వస్తారు. ఒక తరంవారు మరో తరంవారిని తిరిగి కలుసుకొని దీర్ఘకాల ఎడబాటు తర్వాత ప్రియమైనవారు వాత్సల్యభావంతో పరస్పరం హృదయపూర్వకంగా వాటేసుకోవడం ఎంత ఆనందమో గదా! చివరకు, జీవిస్తున్న ప్రతీ ఒక్కరూ యెహోవాను ఆరాధిస్తారు. (ప్రకటన 5:​13) ఆ మార్పులన్నీ పూర్తయినప్పుడు భూవ్యాప్త పరదైసనే నాటకానికి తెర లేస్తుంది. ఆ దృశ్యాన్ని మీరు చూస్తుండగా మీ మనో భావమెలా ఉంటుంది? ‘దీనికోసమే నేను చాలాకాలం నిరీక్షించాను, ఆ నిరీక్షణ తగినదే’ అని మీరు నిస్సందేహంగా ఎగిరి గంతేయడానికి పురికొల్పబడతారు.

[అధస్సూచీలు]

^ పేరా 6 మరో విభిన్నమైన సందర్భంలో పౌలు అభిషిక్త క్రైస్తవులు “లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా” ఉన్నారని మాట్లాడాడు.​—⁠1 కొరింథీయులు 4:9.

^ పేరా 6 ఉదాహరణకు, దానియేలు 11:40, 44, 45లో ప్రస్తావించబడ్డ “ఉత్తరదేశపు రాజు” గుర్తింపుకు సంబంధించి, దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) పుస్తకంలో 280-1 పేజీలు చూడండి.

^ పేరా 9 సా.శ.పూ. 537లో చెరలోని యూదులు తిరిగి రావడానికి 70 సంవత్సరాల ముందు యెరూషలేము పతనమైందని బైబిలే స్వయంగా సూచిస్తోంది. (యిర్మీయా 25:11, 12; దానియేలు 9:​1-3) “అన్యజనముల కాలముల” వివరణాత్మక పరిశీలన కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాల నుండి తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలో 95-7 పేజీలు చూడండి.

మీరెలా జవాబిస్తారు?

“ఈ లోకపు నటన గతించుచున్నది” అని చెప్పిన పౌలు మాటలు మనకాలంలో నిజమని ఎలా నిరూపించబడ్డాయి?

“అన్యజనముల కాలముల” అంతాన్ని బైబిలు కాలవృత్తాంతము ఎలా సరిగ్గా సూచిస్తోంది?

మారుతున్న ప్రపంచ పరిస్థితులు 1914వ సంవత్సరం “యుగసమాప్తి”కి ఆరంభమని ఎలా ధృవీకరిస్తున్నాయి?

“కాలము సంకుచితమైయున్నది” అనే వాస్తవం మనపై ఎలాంటి ప్రభావం చూపాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మీ జీవిత కాలంలో మీరు ఎలాంటి మార్పులు చూశారు?

3. “ఈ లోకపు నటన గతించుచున్నది” అని వ్రాసినప్పుడు పౌలు భావమేమిటి?

4. (ఎ) ప్రపంచ సంఘటనల విషయంలో క్రైస్తవులకు ఎలాంటి సమతూక దృక్కోణం ఉండాలి? (బి) మనమిప్పుడు విశ్వాసం కలిగించే ఏ రెండు రకాల రుజువులు పరిశీలిస్తాం?

5. “అన్యజనముల కాలములు” ఏమిటి, అవి మనకెందుకు ఆసక్తి కలిగించాలి?

6. “అన్యజనముల కాలముల” ఎప్పుడు ఆరంభమయ్యాయి, అవి ఎంతకాలం కొనసాగాయి, అవి ఎప్పుడు ముగిశాయి?

7. దానియేలు పుస్తకంలో ప్రస్తావించబడ్డ ఏడుకాలాల ఆరంభం, నిడివి, ముగింపులు కనుక్కోవడానికి ఏ లేఖనాలు మనకు సహాయం చేస్తాయి?

8. ప్రపంచ పరిస్థితులు 1914 నుండి క్షీణించిపోయాయని మీరు ఏ రుజువులు చూపించగలరు?

9. పరిశీలకులు 1914 నుండి ప్రపంచ పరిస్థితుల గురించి ఏమి చెబుతున్నారు?

10. బైబిలు 1914 నుండి దిగజారుతున్న ప్రపంచ పరిస్థితుల కారణాన్ని మనకు ఎలా తెలియజేస్తోంది?

11. (ఎ) ‘సర్వలోకమును మోసపుచ్చుటకు’ సాతాను ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తున్నాడు? (బి) సాతాను చేసే ఎలాంటి ప్రత్యేక ప్రయత్నంపై అపొస్తలుడైన పౌలు శ్రద్ధ మళ్లిస్తున్నాడు?

12. మన కాలంలో శాంతి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి?

13. ‘శాంతి భద్రతల’ కేక గురించి పౌలు ప్రవచించినప్పుడు, దాని తర్వాత కలిగే నాశనాన్ని ఆయన దేనితో పోల్చాడు, దీనినుండి మనమేమి నేర్చుకోవచ్చు?

14. ఏ క్రమంలో భవిష్యత్తు సంఘటనలు జరుగుతాయి, చివరికేమి సంభవిస్తుంది?

15, 16. “కాలము సంకుచితమై యున్నది” అనే జ్ఞాపిక మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపాలి?

17. నమ్మకమైన క్రైస్తవులు సాతానుయొక్క ఎలాంటి ఉరుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి?

18, 19. నూతనలోకంలో ఎలాంటి మార్పుల కోసం మీరు ఎదురు చూస్తున్నారు, అలా నిరీక్షించడం ఎందుకు తగినదే?

[20వ పేజీలోని చిత్రం]

చివరకు ఆ మర్మం వెల్లడయింది!