ప్రేమ ఆవశ్యకమైనది
ప్రేమ ఆవశ్యకమైనది
వయస్సు, సంస్కృతి, భాష, లేదా జాతి ఏదైనా మానవులందరూ ప్రేమించబడాలని కోరుకుంటారు. ఆ కోరిక తీరకపోతే వాళ్ళు సంతోషంగా ఉండరు. ఒక వైద్య పరిశోధకుడు ఇలా వ్రాశాడు: “మనల్ని ఆరోగ్యంగా ఉంచేదేమిటో అనారోగ్యం పాలయ్యేలా చేసేదేమిటో, సంతోషంగా ఉంచేదేమిటో దుఃఖం కలిగించేదేమిటో, బాధపడేలా చేసేదేమిటో స్వస్థపరిచేదేమిటో నిశ్చయించడంలో ప్రేమ, సాన్నిహిత్యం కీలక పాత్ర వహిస్తాయి. ఏదైనా క్రొత్త మందు అలాంటి ప్రభావాన్నే చూపించగలిగితే, దేశంలోని దాదాపు ప్రతీ వైద్యుడు తన రోగులకు దాన్ని సిఫారసు చేస్తాడు. అలా సిఫారసు చేయకపోతే అది నేరమవుతుంది.”
అయినప్పటికీ ఆధునిక సమాజం, ప్రాముఖ్యంగా దాని ప్రసారమాధ్యమాలు, ప్రముఖ రోల్‌మోడల్స్ వాత్సల్యభరితమైన ప్రేమానుబంధాల కోసం మానవులకున్న అవసరానికంటే తరచూ ధనం, అధికారం, కీర్తి, లైంగిక సంబంధాలు వంటివాటికే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. చాలామంది విద్యావేత్తలు ఒక వ్యక్తి సాధించినదాన్ని బట్టి, సమాజంలో అతని స్థానాన్ని బట్టి సఫలతను నిర్వచిస్తూ లౌకిక లక్ష్యాలను, జీవనవృత్తులను ప్రధానమైనవిగా నొక్కిచెబుతారు. నిజమే, ఒకరు విద్యనభ్యసించడం, సామర్థ్యాలను పెంపొందించుకోవడం ప్రాముఖ్యమే, కానీ కుటుంబం కోసం స్నేహితుల కోసం సమయం వెచ్చించలేనంతగా వాటిని సంపాదించుకోవడంలోనే నిమగ్నమైపోవాలా? మానవ నైజాన్ని సూక్ష్మబుద్ధితో పరిశీలించిన, ప్రాచీన కాలానికి చెందిన విద్యాధికుడైన ఒక రచయిత, ఎంతో సమర్థుడే అయినా ప్రేమలేని ఒక వ్యక్తిని ‘మ్రోగెడు కంచు, గణగణలాడు తాళముతో’ పోల్చాడు. (1 కొరింథీయులు 13:1) అలాంటి వ్యక్తులు ధనవంతులు కావచ్చు చివరికి పేరుప్రఖ్యాతులు కూడా సంపాదించుకోవచ్చు, కానీ వారు ఎన్నడూ నిజమైన సంతోషాన్ని పొందలేరు.
మానవుల గురించి ప్రగాఢమైన అవగాహన, వారిపట్ల ప్రత్యేకమైన అభిమానం ఉన్న యేసుక్రీస్తు తన బోధల్లో దేవునిపట్ల పొరుగువారిపట్ల ప్రేమ చూపించడానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాడు. ఆయనిలా అన్నాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె[ను] . . . నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలె[ను].” (మత్తయి 22:37-39) ఈ మాటలను అనుసరించినవారు మాత్రమే నిజంగా యేసు అనుచరులై ఉంటారు. కాబట్టి, ఆయనిలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు[రు].”—యోహాను 13:35.
అయితే నేటి ప్రపంచంలో ప్రేమను ఎలా వృద్ధి చేసుకోవచ్చు? తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమించడమెలా నేర్పించవచ్చు? తర్వాతి ఆర్టికల్ ఈ ప్రశ్నలను పరిశీలిస్తుంది.
[3వ పేజీలోని చిత్రం]
దురాశ రాజ్యమేలుతున్న లోకంలో ప్రేమను వృద్ధి చేసుకోవడం ఒక సవాలే