ఇతరులకు సేవచేయడం మన బాధను తగ్గిస్తుంది
జీవిత కథ
ఇతరులకు సేవచేయడం మన బాధను తగ్గిస్తుంది
హూల్యాన్ ఆర్యాస్ చెప్పినది
అది 1988. నాకప్పుడు 40 ఏళ్ళు, వృత్తిపరంగా నా భవిష్యత్తు ఎంతో సురక్షితంగా ఉన్నట్లు అనిపించింది. నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో రీజనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. నా ఉద్యోగాన్ని బట్టి నాకు ఖరీదైన కారు, మంచి జీతం, స్పెయిన్‌లోని మాడ్రిడ్ మధ్యభాగంలో చక్కని ఆఫీసు ఉండేవి. నన్ను తమ కంపెనీ నేషనల్ డైరెక్టర్‌ను చేస్తామని కూడా కంపెనీ సూచించింది. నా జీవితం తీవ్రమైన మార్పుకు గురికాబోతోందని నేనేమాత్రం అనుకోలేదు.
ఆసంవత్సరంలో ఒక రోజున, నాకు మల్టిపుల్ స్ల్కీరోసిస్ అనే నయంకాని వ్యాధి ఉందని మా డాక్టర్ చెప్పాడు. నా నవనాడులు కృంగిపోయాయి. ఆ తర్వాత, మల్టిపుల్ స్ల్కీరోసిస్ ఒక వ్యక్తికి ఏమి చేయగలదో నేను చదివినప్పుడు నాకు చాలా భయమేసింది. * ఇక జీవితమంతా అనారోగ్యంతో కృంగిపోక తప్పదన్నట్లు అనిపించింది. నా భార్య మీలాగ్రోస్ గురించి, మూడేళ్ళ మా అబ్బాయి ఈస్మయల్ గురించి ఎలా శ్రద్ధ తీసుకుంటాను? ఈ పరిస్థితిని మేమెలా తాళుకుంటాము? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం నేను తడువులాడుకుంటుండగానే నాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
నా అనారోగ్యం గురించి మా డాక్టరు నాకు చెప్పిన దాదాపు ఒక నెల తర్వాత, నా సూపర్‌వైజర్ నన్ను తన ఆఫీసులోకి పిలిచి, కంపెనీకి “మంచి రూపం” ఉన్న వ్యక్తులు అవసరమని నాతో అన్నాడు. క్షీణింపజేసే వ్యాధి ఉన్నవారు—చివరికి వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడు సహితం—అలాంటి రూపాన్ని కలిగివుండలేరు. కాబట్టి అప్పటికప్పుడు నా బాస్ నన్ను ఉద్యోగంలో నుండి తీసేశాడు. హఠాత్తుగా, వృత్తిపరంగా నా జీవితగమనం ముగింపుకొచ్చింది!
నా కుటుంబ సభ్యుల ముందు ధైర్యంగా ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నించేవాడిని కానీ నాకు క్రొత్తగా ఏర్పడిన పరిస్థితుల గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి ఒంటరిగా ఉండిపోతే బాగుండుననుకునే వాడిని. నాలో అంతకంతకు అధికమవుతున్న మానసిక కృంగుదలతో పోరాడడానికి ప్రయత్నించేవాడిని. హఠాత్తుగా నేను నా కంపెనీ దృష్టిలో పనికిరాని వాడినయ్యానన్న విషయం నన్ను ఎక్కువగా బాధపెట్టింది.
బలహీనతలో బలాన్ని పొందడం
సంతోషకరంగా, ఆ కష్ట సమయంలో నేను బలం కోసం వివిధ మూలాలపై ఆధారపడగలిగాను. దాదాపు 20 సంవత్సరాల క్రితం, నేను యెహోవాసాక్షినయ్యాను. కాబట్టి నేను నా భావాల గురించి, భవిష్యత్తు చింతల గురించి యథార్థంగా యెహోవాకు ప్రార్థించాను. నాలాంటి విశ్వాసమే కలిగివున్న నా భార్య నాకు ఎంతో మద్దతునిచ్చేది, కొంతమంది సన్నిహిత స్నేహితులు కూడా ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు, వారు చూపిన దయాకనికరాలు అమూల్యమైనవి.—సామెతలు 17:17.
ఇతరుల గురించి బాధ్యత తీసుకోవడం కూడా సహాయం చేసింది. నేను మా అబ్బాయిని మంచిగా పెంచాలని, వాడికి అన్నీ నేర్పించాలని, వాడితో ఆడుకోవాలని, ప్రకటనాపనిలో వాడికి తర్ఫీదివ్వాలని కోరుకున్నాను. అందుకే నేను నిరాశకు లొంగిపోదలచుకోలేదు. అంతేగాక, నేను యెహోవాసాక్షుల ఒక సంఘంలో పెద్దను, అక్కడున్న నా క్రైస్తవ సహోదర సహోదరీలకు నా మద్దతు అవసరం. నా దుఃఖం నా విశ్వాసాన్ని బలహీనపరచడానికి నేను అనుమతిస్తే, నేను ఇతరులకు ఎలాంటి మాదిరిగా ఉంటాను?
నిజమే నా జీవితం శారీరకంగా, ఆర్థికంగా చాలా మారిపోయింది—కొన్ని విషయాల్లో దిగజారిపోయింది, కొన్ని విషయాల్లో పురోగమించింది. ఒకసారి ఒక డాక్టర్ ఇలా చెప్పడాన్ని నేను విన్నాను: “ఏదైనా ఒక వ్యాధి ఒక వ్యక్తిని నాశనం చేయదు; కానీ అది ఆ వ్యక్తిని మారుస్తుంది.” వ్యాధి వల్ల వచ్చే మార్పులన్నీ ప్రతికూలమైనవే కావని నేను తెలుసుకున్నాను.
మొదటిగా, నా “శరీరములో ఒక ముల్లు” ఇతరుల ఆరోగ్య సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, వారిపై సానుభూతి చూపించడానికి నాకు సహాయం చేసింది. (2 కొరింథీయులు 12:7) “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము” అని చెబుతున్న సామెతలు 3:5లోని మాటలను మునుపెన్నటికన్నా బాగా అర్థం చేసుకున్నాను. జీవితంలో నిజంగా ఏమి అవసరమో, ఏది నిజమైన సంతృప్తిని, ఆత్మాభిమానాన్ని ఇస్తుందో నా క్రొత్త పరిస్థితులు నాకు బోధించాయి. యెహోవా సంస్థలో నేను చేయగలిగింది ఇంకా ఎంతో ఉంది. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని చెప్పిన యేసు మాటల్లోని అసలైన అర్థాన్ని నేను గ్రహించాను.—అపొస్తలుల కార్యములు 20:35.
క్రొత్త జీవితం
నా రోగ నిర్ధారణ జరిగిన వెంటనే, మాడ్రిడ్‌లో ఒక సెమినార్‌కు నేను ఆహ్వానించబడ్డాను, అక్కడ డాక్టర్లకు సాక్షులైన వారి రోగులకు మధ్య పరస్పర సహకారాన్ని వృద్ధి చేయడం క్రైస్తవ స్వచ్ఛంద సేవకులకు నేర్పించబడుతుంది. ఆ తర్వాత, ఆ స్వచ్ఛంద సేవకులు ఆసుపత్రి అనుసంధాన కమిటీలుగా సంస్థీకరించబడ్డారు. నాకైతే ఆ సెమినార్ సరిగ్గా సరైన సమయంలో వచ్చింది. ఏవిధమైన ఉద్యోగం కంటే కూడా ఎక్కువ సంతృప్తిని తీసుకురాగల శ్రేష్ఠమైన జీవితగమనాన్ని నేను కనుగొన్నాను.
క్రొత్తగా ఏర్పడిన ఆసుపత్రి అనుసంధాన కమిటీలు పరస్పర సహకారాన్ని వృద్ధిచేసి వ్యతిరేకతలను నివారించాలనే సంకల్పంతో ఆసుపత్రులను సందర్శించి, డాక్టర్లను ఇంటర్వ్యూ చేసి, ఆరోగ్య కార్యకర్తలకు ప్రదర్శనలు చేసిచూపించాలని మేము సెమినార్‌లో నేర్చుకున్నాము. ఆ కమిటీలు, తమ తోటి సాక్షులు రక్తాన్ని ఉపయోగించకుండా వైద్య పద్ధతులు పాటించడానికి ఇష్టపడే డాక్టర్లను కనుగొనడానికి సహాయం చేస్తాయి. అయితే ఒక సామాన్యుడిగా నేను వైద్య పరిభాషలోని పదాల గురించి, వైద్య నీతి గురించి, ఆసుపత్రి సంస్థీకరణ గురించి ఎంతో తెలుసుకోవలసి వచ్చింది. అయినా, ఆ సెమినార్ తర్వాత నేను ఒక క్రొత్త వ్యక్తిగా, నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిన ఒక క్రొత్త సవాలుతో ఇంటికి వెళ్ళాను.
ఆసుపత్రులను సందర్శించడం—సంతృప్తికి మూలం
నా వ్యాధి నన్ను మెల్లగా, నిర్దయగా క్షీణింపజేస్తున్నప్పటికీ ఆసుపత్రి అనుసంధాన కమిటీ సభ్యునిగా నా బాధ్యతలు అధికమయ్యాయి. అశక్తత మూలంగా పని చేయలేనందుకు నాకు ఉపకార వేతనం ఇవ్వబడేది, కాబట్టి ఉద్యోగం చేయకుండా ఆసుపత్రులను సందర్శించడానికి నాకు సమయం ఉండేది. అప్పుడప్పుడూ నిరాశలు ఎదురైనప్పటికీ ఈ సందర్శనలు నేను అనుకున్నదాని కంటే ఎక్కువ సులభమైనవిగా, ప్రతిఫలదాయకమైనవిగా నిరూపించబడ్డాయి. ఇప్పుడు నేను చక్రాల కుర్చీకే పరిమితమైపోయినప్పటికీ అది పెద్ద ఆటంకంగా లేదు. కమిటీలోని తోటి సభ్యులెవరో ఒకరు ఎప్పుడూ నాతో ఉంటారు. అంతేగాక చక్రాల కుర్చీల్లో ఉన్నవారితో మాట్లాడడం డాక్టర్లకు క్రొత్తేమీ కాదు, వారిని సందర్శించడానికి నేను చేస్తున్న కృషిని గమనించి కొన్నిసార్లు వారు మరింత గౌరవంతో వింటున్నట్లు అనిపించేది.
గత పది సంవత్సరాల్లో, నేను వందలాదిమంది డాక్టర్లను కలిశాను. కొంతమంది దాదాపు మొదటి నుండి మాకు సహాయం చేయడానికి ఇష్టపడేవారు. డా. క్వాన్ డ్వార్ట్—రోగి మనస్సాక్షిని గౌరవించడంలో సంతృప్తిని పొందే, మాడ్రిడ్‌లో ఉన్న ఒక హృద్రోగ సర్జన్—వెంటనే తన సేవలను అందజేశాడు. అప్పటి నుండి ఆయన, స్పెయిన్‌లోని అనేక భాగాలకు చెందిన సాక్షులైన రోగులకు రక్తాన్ని ఉపయోగించకుండా 200 కంటే ఎక్కువ సర్జరీలు చేశాడు. సంవత్సరాలు గడుస్తుండగా చాలామంది డాక్టర్లు రక్తరహిత సర్జరీ చేయడం ప్రారంభించారు. మేము వారిని క్రమంగా సందర్శించడం దానికి కొంతమేరకు కారణమైనప్పటికీ వైద్య పురోభివృద్ధి, రక్తరహిత సర్జరీ వల్ల లభించిన చక్కని ఫలితాలు కూడా దానికి కారణమే. యెహోవా మా కృషిని ఆశీర్వదించాడన్నది మా నమ్మకం.
పిల్లలకు చికిత్స చేయడంలో నిపుణులైన కొంతమంది హృద్రోగ సర్జన్‌ల ప్రతిస్పందన నన్ను ప్రాముఖ్యంగా ప్రోత్సహించింది. మేము రెండు సంవత్సరాలపాటు ఇద్దరు సర్జన్‌లు, మత్తుమందిచ్చే వైద్యులు ఉన్న ఒక బృందాన్ని సందర్శించాము. ఈ రంగంలో వేరే డాక్టర్లు ఏమి చేస్తున్నారనేది వివరించే వైద్య సాహిత్యాల్ని మేము వారికి అందజేశాము. ఇన్‌ఫేన్టైల్ కార్డియోవాస్కులార్ సర్జరీపై 1999లో జరిగిన వైద్య సమావేశంలో మా కృషికి ప్రతిఫలం లభించింది. ఇద్దరు సర్జన్‌లు—ఇంగ్లాండ్‌కు చెందిన ఒక సర్జన్ సమర్థవంతమైన సహకారంతో—బృహద్ధమని ముందు భాగంలో ఉండే కవాటాన్ని సరిచేయవలసిన అవసరం ఏర్పడిన సాక్షుల పసిబిడ్డకు ఎంతో కష్టతరమైన ఆపరేషన్ చేశారు. * ఆ సర్జన్‌లలో ఒకరు, ఆపరేషన్ రూములో నుండి బయటికి వచ్చి ఆపరేషన్ విజయవంతం అయ్యిందని, ఆ కుటుంబ సభ్యుల మనస్సాక్షి గౌరవించబడిందని చెప్పినప్పుడు నేను ఆ తల్లిదండ్రులతోపాటు ఎంతో సంతోషించాను. ఇప్పుడు ఈ ఇద్దరు డాక్టర్లు స్పెయిన్ అంతటిలో ఉన్న సాక్షులైన రోగులకు క్రమంగా వైద్యం చేస్తున్నారు.
అలాంటి కేసుల విషయంలో నాకు నిజంగా సంతృప్తినిచ్చేది, నా క్రైస్తవ సహోదరులకు నేను సహాయం చేయగలనన్న గ్రహింపే. సాధారణంగా, వారు తమ జీవితంలోని అత్యంత కష్టతరమైన సమయంలోనే ఆసుపత్రి అనుసంధాన కమిటీని సంప్రదిస్తారు. వారికి ఆపరేషన్ చేయించుకోవలసిన అవసరం ఉంటుంది, స్థానిక ఆసుపత్రుల్లోని డాక్టర్లు రక్తం ఉపయోగించకుండా వైద్యం చేయడానికి ఇష్టపడరు లేదా చేయలేరు. అయితే ఇక్కడ మాడ్రిడ్‌లో, అన్ని వైద్య రంగాల్లోనూ మనకు సహకరించే సర్జన్‌లు ఉన్నారని సహోదరులు తెలుసుకున్నప్పుడు వారు ఎంతో ఉపశమనం పొందుతారు. ఎంతో వ్యాకులతతో ఉన్న ఒక సహోదరుని ముఖం, ఆసుపత్రిలో కేవలం మేము తన దగ్గర ఉన్నంత మాత్రాన్నే ప్రశాంతంగా మారిపోవడం నేను చూశాను.
న్యాయమూర్తులు, వైద్య నీతి
ఇటీవలి సంవత్సరాల్లో, ఆసుపత్రి అనుసంధాన కమిటీల సభ్యులు న్యాయమూర్తులను కూడా సందర్శించారు.
అలాంటి సందర్శనాల్లో, మేము వారికి యెహోవాసాక్షుల కుటుంబ సంరక్షణ మరియు వైద్య నిర్వహణ విధానం (ఆంగ్లం) అనే ప్రచురణను ఇచ్చేవాళ్ళం, రక్తాన్ని ఉపయోగించే విషయంలో మన స్థానాన్ని గురించి, అందుబాటులోవున్న రక్తరహిత వైద్య ప్రత్యామ్నాయాల గురించి అలాంటి అధికారులకు తెలియజేయడానికే ప్రత్యేకంగా ఈ ప్రచురణ సిద్ధం చేయబడింది. ఇలాంటి సందర్శనాలు చేయవలసిన అవసరత ఎంతగానో ఉండేది, ఎందుకంటే అప్పట్లో స్పెయిన్‌లో, సర్వసాధారణంగా న్యాయమూర్తులు రోగి అభీష్టానికి వ్యతిరేకంగా రక్తం ఎక్కించడానికి డాక్టర్లకు అధికారాన్ని ఇచ్చేవారు.జడ్జీల చేంబర్లు ఎంతో గంభీరంగా ఉండేవి, నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ పొడవైన వసారాల్లో నా చక్రాల కుర్చీలో వెళ్తూ చాలా అల్పుడినన్నట్లు భావించాను. పరిస్థితులను మరింత దుర్భరం చేస్తూ చిన్న ఆక్సిడెంట్ జరగడంతో, నేను నా కుర్చీలో నుండి మోకాళ్ళపైకి ఒరిగిపోయాను. నా దురవస్థ చూసిన కొంతమంది న్యాయమూర్తులు, న్యాయవాదులు దయగా నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు, కానీ వారి ఎదుట నాకెంతో సిగ్గనిపించింది.
మేము తమను ఎందుకు సందర్శిస్తున్నామన్నది న్యాయమూర్తులకు అంతగా తెలియకపోయినప్పటికీ వారిలో చాలామంది మాతో దయగా వ్యవహరించారు. నేను సందర్శించిన మొదటి న్యాయమూర్తి మనం వహించే స్థానం గురించి అప్పటికే ఆలోచిస్తున్నాడు, ఈ విషయంలో వివరంగా మాట్లాడడానికి తాను ఇష్టపడుతున్నానని అన్నాడు. మా తర్వాతి సందర్శనంలో, ఆయన స్వయంగా నన్ను నా చక్రాల కుర్చీలో తన చేంబర్లోకి తీసుకువెళ్ళి శ్రద్ధగా విన్నాడు. ఈ తొలి సందర్శనపు చక్కని ఫలితాలు మా భయాలను తొలగించుకోవడానికి నన్ను, నా సహచరులను ప్రోత్సహించాయి, ఆ తర్వాత త్వరలోనే మేము మరిన్ని మంచి ఫలితాలను చూశాము.
అదే సంవత్సరంలో, మేము కుటుంబ సంరక్షణ పుస్తక ప్రతిని మరో న్యాయమూర్తికి ఇచ్చాము, ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, ఆ సమాచారాన్ని చదువుతానని వాగ్దానం చేశాడు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఉంటుందన్నట్లుగా నా ఫోన్ నంబర్ ఆయనకిచ్చాను. రెండు వారాల తర్వాత ఆయన ఫోన్ చేసి, స్థానిక సర్జన్ ఒకాయన సర్జరీ అవసరమైన ఒక సాక్షికి రక్తం ఎక్కించడానికి అధికారం ఇమ్మని తనను అడిగాడని చెప్పాడు. రక్తం ఎక్కించకూడదన్న సాక్షి కోరికను గౌరవించే పరిష్కారం ఏదైనా కనుగొనడానికి తనకు సహాయం చేయమని న్యాయమూర్తి అడిగాడు. మరో ఆసుపత్రిని కనుక్కోవడం మాకు ఏమంత కష్టం కాలేదు, అక్కడి సర్జన్లు రక్తం ఎక్కించకుండా విజయవంతంగా ఆపరేషన్ చేశారు. జరిగింది విన్నప్పుడు న్యాయమూర్తి ఎంతో ఆనందించాడు, భవిష్యత్తులో అదేలాంటి పరిష్కారాల కోసం చూస్తానని ఆయన మాకు హామీ ఇచ్చాడు.
నేను ఆసుపత్రులను సందర్శించినప్పుడు, డాక్టర్లు రోగి హక్కులను మనస్సాక్షిని పరిగణలోకి తీసుకోవాలని మేము కోరుకునేవాళ్ళం కాబట్టి తరచూ వైద్య నీతి గురించి ప్రశ్న తలెత్తేది. మాడ్రిడ్‌లో ఉన్న, ఎంతో సహకరించే ఒక ఆసుపత్రి, వైద్య నీతి గురించి తాము అందజేస్తున్న కోర్సులో పాల్గొనమని నన్ను ఆహ్వానించింది. ఈ కోర్సు, ఈ రంగంలోని అనేకమంది నిపుణులకు బైబిలు ఆధారిత దృక్కోణాన్ని తెలియజేసే అవకాశాన్ని నాకిచ్చింది. డాక్టర్లు తీసుకోవలసిన అనేక కష్టతరమైన నిర్ణయాలను అర్థం చేసుకోవడానికి కూడా అది నాకు సహాయం చేసింది.
ఆ కోర్సు బోధకులలో ఒకరైన ప్రొఫెసర్ డేగ్యో గ్రాస్యా, స్పెయిన్ డాక్టర్ల కోసం వైద్య నీతి సంబంధంగా ఒక గౌరవప్రదమైన మాస్టర్స్ కోర్సును క్రమంగా ఏర్పాటు చేస్తుంటాడు, ఆయన రక్తమార్పిడుల విషయంలో పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతే సమ్మతించేందుకు మనకున్న హక్కును దృఢంగా సమర్థిస్తాడు. * ప్రొఫెసర్ గ్రాస్యాను మేము క్రమంగా సంప్రదించడం కారణంగా, ఆయన పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మన స్థానాన్ని గురించి వివరించడానికి యెహోవాసాక్షుల స్పెయిన్ బ్రాంచి కార్యాలయ ప్రతినిధులు కొందరు ఆహ్వానం అందుకున్నారు, ఆ విద్యార్థుల్లో కొందరు దేశంలోని సర్వశ్రేష్ఠమైన డాక్టర్లుగా పరిగణించబడుతున్నారు.
వాస్తవాన్ని ఎదుర్కోవడం
తోటి విశ్వాసుల కోసం చేస్తున్న ఈ సంతృప్తికరమైన పని నా వ్యక్తిగత సమస్యలన్నిటినీ పరిష్కరించలేదు. నాకున్న వ్యాధి అడ్డులేకుండా పురోగమిస్తూనే ఉంది. అయితే సంతోషకరంగా, నా మెదడు చురుగ్గానే ఉంది. ఎన్నడూ ఫిర్యాదు చేయని నా భార్యాకుమారుల సహాయంతో నేను ఇప్పటికీ నా బాధ్యతలను నిర్వర్తించగలుగుతున్నాను. వారి సహాయ సహకారాలు లేకుంటే ఇది సాధ్యమై ఉండేది కాదు. నేను నా ప్యాంటు బటన్లు కూడా పెట్టుకోలేను, కోటు కూడా సొంతగా వేసుకోలేను. నా కుమారుడు ఈస్మయల్‌తో ప్రతి శనివారం ప్రకటనా పనికి వెళ్ళడం నాకెంతో ఇష్టం, నేను గృహస్థులతో మాట్లాడగలిగేలా అతడు నన్ను నా చక్రాల కుర్చీ మీద తీసుకువెళతాడు. సంఘ పెద్దగా నేను నా విధులను ఇప్పటికీ నెరవేర్చగలుగుతున్నాను.
గత పన్నెండు సంవత్సరాల్లో నాకు కొన్ని వేదనభరితమైన సందర్భాలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు, నా అశక్తత నా కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూసినప్పుడు, అది నాకు అనారోగ్యం వల్ల కలిగే బాధ కన్నా ఎక్కువ బాధను కలిగించింది. వాళ్ళు మాటల్లో వ్యక్తం చేయకపోయినా వాళ్ళు బాధపడుతున్నారని నాకు తెలుసు. కొంతకాలం క్రితం, ఒక సంవత్సర కాలంలో, మా అత్తమ్మ, మా నాన్నగారు మరణించారు. అదే సంవత్సరంలో, నేను చక్రాల కుర్చీ లేకుండా ఇటు అటు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. మా ఇంట్లోనే నివసించిన నాన్నగారు క్షీణింపజేసే మరో వ్యాధితో మరణించారు. ఆయన గురించి శ్రద్ధ తీసుకున్న మీలాగ్రోస్, నాకు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూస్తున్నట్లు భావించింది.
అయితే, అనుకూల పక్షంగా చూస్తే, మేము కష్టాలను కలిసి ఎదుర్కొంటుండగా మా కుటుంబంలో ఐక్యత ఏర్పడింది. నేను కార్యనిర్వాహకుడి కుర్చీ వదులుకుని చక్రాల కుర్చీ స్వీకరించాను, కానీ వాస్తవానికి నా జీవితం ఇప్పుడే బాగుంది, ఎందుకంటే ఇప్పుడది ఇతరులకు సేవ చేయడానికే సంపూర్ణంగా అంకితం చేయబడింది. ఇవ్వడం మన బాధను తగ్గిస్తుంది, అవసర సమయంలో బలపరుస్తానని యెహోవా తాను చేసిన వాగ్దానాన్ని తప్పక నిలబెట్టుకుంటాడు. పౌలులా, నిజంగా నేనిలా చెప్పగలను: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.
[అధస్సూచీలు]
^ పేరా 5 మల్టిపుల్ స్ల్కీరోసిస్ అనేది కేంద్ర నాడీమండలానికి సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి మూలంగా తరచూ సమతుల్యత, కాళ్ళు చేతులు పనిచేయటం, కొన్నిసార్లైతే చూపు, మాట, అవగాహన క్రమేణా తగ్గిపోతాయి.
^ పేరా 19 ఈ ఆపరేషన్‌ను రాస్ విధానం అంటారు.
^ పేరా 27 కావలికోట, ఫిబ్రవరి 15, 1997, 19-20 పేజీలు చూడండి.
[24వ పేజీలోని బాక్సు]
ఒక భార్య దృక్కోణం
మల్టిపుల్ స్ల్కీరోసిస్‌తో బాధపడే వ్యక్తితో కలిసి జీవించడం ఒక భార్యకు మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా చాలా కష్టమే. నేను చేయాలని పథకం వేసుకునేవాటిలో సహేతుకంగా ఉండాలి, భవిష్యత్తు గురించిన అనవసరమైన వ్యాకులతను విడనాడడానికి సిద్ధంగా ఉండాలి. (మత్తయి 6:34) ఏదేమైనా బాధలుపడుతూ జీవించడం ఒక వ్యక్తిలోని శ్రేష్ఠమైన లక్షణాలను వెల్లడి చేస్తుంది. మా వైవాహిక జీవితం మునుపటి కన్నా ఇప్పుడు పటిష్ఠంగా ఉంది, యెహోవాతో నా సంబంధం సన్నిహితమైంది. ఇదే విధంగా ఒత్తిడితో కూడిన పరిస్థితులలో ఉన్న ఇతరుల జీవిత గాథలు నన్నెంతో బలపరిచాయి. హూల్యాన్ తాను సహోదరుల కోసం చేస్తున్న విలువైన సేవ ఫలితంగా సంతృప్తిని పొందుతున్నట్లుగానే నేనూ పొందుతున్నాను, ప్రతి రోజు ఒక క్రొత్త సవాలు తలెత్తినా యెహోవా మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడని నేను తెలుసుకున్నాను.
[24వ పేజీలోని బాక్సు]
ఒక కుమారుడి దృక్కోణం
మా నాన్నగారి సహనం, ఆశావహ స్ఫూర్తి నాకు చక్కని మాదిరిగా ఉన్నాయి, ఆయనను చక్రాల కుర్చీలో ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు నాకెంతో సంతోషం కలుగుతుంది. నాకిష్టమైనదే నేనెప్పుడూ చేయలేనని నాకు తెలుసు. నేనిప్పుడు యౌవనస్థుడినే, కానీ నేను పెద్దవాడినైన తర్వాత ఆసుపత్రి అనుసంధాన కమిటీలో సభ్యునిగా సేవ చేయాలని కోరుకుంటున్నాను. బైబిలు వాగ్దానాలను బట్టి బాధ తాత్కాలికమైనదేననీ, చాలామంది సహోదర సహోదరీలు మాకన్నా ఎక్కువగా బాధపడుతున్నారనీ నాకు తెలుసు.
[22వ పేజీలోని చిత్రం]
నా భార్య నాకు బలానికి మూలం
[23వ పేజీలోని చిత్రం]
హృద్రోగ సర్జన్ డా. క్వాన్ డ్వార్ట్‌తో సంభాషించడం
[25వ పేజీలోని చిత్రం]
నేను, మా అబ్బాయి పరిచర్యలో కలిసి పనిచేయడాన్ని ఆనందిస్తాము