కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్నారా?

యౌవనులారా మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్నారా?

యౌవనులారా మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్నారా?

“నేను క్రైస్తవ కూటాలకు హాజరయినప్పటికీ యెహోవాను సేవించాలని మనస్ఫూర్తిగా కోరుకోలేదు” అని హీడ్యో తాను ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ చెబుతున్నాడు. “నా తోటివారు నన్ను ఇష్టపడుతున్నట్లు, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వీధిలో దర్జాగా నడిచి వెళుతున్నట్లు నేను తరచూ ఊహించుకునేవాడిని. నాకు నిర్దిష్టమైన లక్ష్యాలు ఉండేవి కావు, ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలని నేను కోరుకోలేదు.” హీడ్యోలానే చాలామంది యౌవనస్థులు విలువైన ఏ లక్ష్యాలనైనా చేరుకోవాలనే లేదా ప్రగతి సాధించాలనే కోరిక లేకుండా గమ్యరహితంగా కాలం గడుపుతున్నట్లు అనిపిస్తోంది.

మీరు యౌవనస్థులైతే బహుశా మీరు క్రీడలలో పాల్గొంటున్నప్పుడు లేదా మీకిష్టమైన పని చేస్తున్నప్పుడు ఉత్సాహంగా ఉండవచ్చు. అయితే ఆధ్యాత్మిక కార్యకలాపాలకు వచ్చేసరికి మీకు అలా అనిపించకపోవచ్చు. ఆధ్యాత్మిక లక్ష్యాల విషయంలో ఉత్సాహంగా ఉండడం సాధ్యమేనా? కీర్తనకర్త వ్రాసిన ఈ మాటలను పరిశీలించండి: “యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు [“అనుభవం లేనివారికి,” NW] జ్ఞానము పుట్టించును. . . . యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.” (కీర్తన 19:​7, 8) దేవుని వాక్యము, “అనుభవం లేనివారు” జ్ఞానయుక్తంగా ప్రవర్తించేందుకు కావలసిన నిర్దేశాన్నిచ్చి వారి “కన్నులకు వెలుగిచ్చును.” అవును ఆధ్యాత్మిక విషయాలను బట్టి మీరు సంతోషించి ఆనందించవచ్చు. కానీ మీకలా అనిపించడానికి ఏమి అవసరం? మీరు ఎక్కడ నుండి ప్రారంభించాలి?

దేవుణ్ణి సేవించడానికి ప్రేరేపించబడండి

మొదట మీరు ప్రేరేపించబడాలి. యూదా రాజైన యోషీయా అనే యువకుడి గురించి ఆలోచించండి. ఆలయంలో యెహోవా ధర్మశాస్త్రం కనబడినప్పుడు యోషీయా దాన్ని చదివించుకొని, తాను విన్నదానిబట్టి అమితంగా కదిలించబడ్డాడు. దాని ఫలితంగా “యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలోనుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివే[శాడు].” (2 దినవృత్తాంతములు 34:​14-21, 33) దేవుని వాక్యాన్ని చదవడం, పరిశుద్ధారాధనను వ్యాప్తి చేయడానికి కృషి చేసేందుకు యోషీయాను కదిలించింది.

మీరు క్రమంగా బైబిలు చదివి, చదివిన విషయాల గురించి ధ్యానిస్తే మీరు కూడా యెహోవాను సేవించాలనే కోరికను పెంపొందించుకోవచ్చు. హీడ్యోను ప్రేరేపించింది అదే. ఒక వృద్ధ పయినీరుతో అంటే యెహోవాసాక్షుల పూర్తికాల సేవకుడితో ఆయన సన్నిహితంగా సహవసించడం ప్రారంభించాడు. ఆ పయినీరు బైబిలు శ్రద్ధగా చదివి దాని బోధనలను తన జీవితంలో అన్వయించుకోవడానికి కృషి చేసేవాడు. ఆ పయినీరు మాదిరి మూలంగా ఎంతగానో ప్రోత్సహించబడిన హీడ్యో తాను కూడా అలాగే చేయడం ప్రారంభించి, దేవునికీ ఇతర ప్రజలకూ సేవ చేయాలనే బలమైన కోరికను పెంపొందించుకున్నాడు. ఆయన సాధించిన ఆధ్యాత్మిక ప్రగతి ఆయన జీవితానికి ఒక సంకల్పాన్ని ఇచ్చింది.

ప్రతీరోజు బైబిలు చదవడం యౌవనస్థులను ప్రేరేపించగలదు. టకాహిరో ఇలా వివరిస్తున్నాడు: “నేను నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు, ఆ రోజు నేను బైబిలు చదవలేదని గుర్తువచ్చిన వెంటనే నేను లేచి బైబిలు చదివేవాడిని. తత్ఫలితంగా యెహోవా నడిపింపునిస్తున్నాడని నాకు అనిపించేది. ప్రతీరోజు బైబిలు చదవడమనేది నేను ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి ఎంతో సహాయపడింది. యెహోవా సేవలో ఇంకా ఎక్కువగా భాగం వహించాలని నిర్ణయించుకొని నేను ఉన్నత పాఠశాలనుండి ఉత్తీర్ణుడనవ్వగానే క్రమ పయినీరు సేవ చేయడం ప్రారంభించాను. నేను పయినీరు సేవలో ఎంతో ఆనందిస్తున్నాను.”

బైబిలు చదవడంతోపాటు, యెహోవాను స్తుతించాలనే మీ ప్రేరణను బలపరచుకోవడానికి ఇంకా ఏమి సహాయం చేయగలదు? టొమొహిరోకు ఆయన తల్లి బైబిలు సత్యాన్ని నేర్పించింది. “19 సంవత్సరాల వయస్సులో జీవితానికి ఒక సంకల్పం ఉంది (ఆంగ్లం) అనే పుస్తకాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే, నేను యెహోవా ప్రేమను బట్టి యేసు విమోచన క్రయధన బలిని బట్టి ఎంతో ప్రభావితుడనయ్యాను. దేవుని ప్రేమ పట్ల నాకు కలిగిన ఆ కృతజ్ఞత, నేను యెహోవా సేవలో ఇంకా ఎక్కువ చేసేలా నన్ను ప్రేరేపించింది” అని ఆయన చెబుతున్నాడు. (2 కొరింథీయులు 5:​14, 15) టొమొహిరో వలే చాలామంది యౌవనస్థులు బైబిలును వ్యక్తిగతంగా శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి సాధించేందుకు ప్రోత్సహించబడుతున్నారు.

ఆ తర్వాత కూడా యెహోవాను సేవించాలనే హృదయపూర్వక కోరిక మీలో కలగకపోతే అప్పుడెలా? మీరు సహాయం కోరగలిగేవారు ఎవరైనా ఉన్నారా? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, . . . మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.” (ఫిలిప్పీయులు 2:​13) మీరు సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తే ఆయన తన పరిశుద్ధాత్మను మీకు ధారాళంగా ఇస్తాడు, ఆ పరిశుద్ధాత్మ మీలో “కార్యసిద్ధి” కలుగజేయడమే కాకుండా దాన్ని మీరు ‘ఇచ్ఛయించడానికి’ శక్తినిస్తుంది. అంటే దేవుని పరిశుద్ధాత్మ యెహోవా సేవలో మీకు సాధ్యమైనదంతా చేయాలనే మీ కోరికను అధికం చేస్తుంది, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడుతుంది. యెహోవా శక్తిపై విశ్వాసముంచి మీ హృదయాన్ని బలపరచుకోండి!

సొంత లక్ష్యాలను ఏర్పరచుకోండి

యెహోవాను మరింత సంపూర్ణంగా సేవించాలని మీరు దృఢ నిశ్చయం చేసుకున్న తర్వాత, ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి మీరు వ్యక్తిగత లక్ష్యాలను ఏర్పరచుకోవలసి ఉంటుంది. మానా అనే క్రైస్తవ యువతి ఇలా చెప్పింది: “లక్ష్యాలను ఏర్పరచుకోవడం నాకు ఎంతగానో సహాయపడింది. నేను వెనకంజ వేసే బదులు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగాను. నా లక్ష్యాలను మనస్సులో ఉంచుకొని నడిపింపు కోసం యెహోవాకు తీవ్రంగా ప్రార్థించాను, నేను పరధ్యానంలో పడకుండా అభివృద్ధి సాధించగలిగాను.”

మీ లక్ష్యాలు వాస్తవికమైనవిగా, చేరుకోదగినవిగా ఉండాలి. ప్రతీరోజూ బైబిలులోని ఒక అధ్యాయం చదవడం సహేతుకమైన లక్ష్యం. మీరు ఒక పరిశోధనా ప్రాజెక్టును కూడా ప్రారంభించవచ్చు. ఆంగ్లంలో లభ్యమయ్యే ప్రచురణలు ఉపయోగించి ఉదహరించాలంటే, వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌లో “జెహోవా” (యెహోవా) అనే పేరు క్రింద “క్వాలిటీస్‌ బై నేమ్‌” (పేర్ల క్రమంలో ఉన్న లక్షణాలు) అనే ఉపశీర్షిక క్రింద ఇవ్వబడిన యెహోవా లక్షణాల గురించి మీరు అధ్యయనం చేయవచ్చు. మీరు పరిశీలించేందుకు దాదాపు 40 అంశాలున్నాయి, మీరు చేసే పరిశోధన మిమ్మల్ని యెహోవాకు మరింత సన్నిహితుల్ని చేసి, ఆయన కోసం మీరు ఇంకా ఎక్కువ చేసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుందనడంలో సందేహం లేదు. ప్రతి క్రైస్తవ కూటంలో ప్రేక్షకులు భాగం వహించాల్సిన అంశాలున్నప్పుడు కనీసం ఒక్కసారైనా వ్యాఖ్యానించడం, కూటానికి వెళ్ళిన ప్రతీసారి కనీసం ఒక్క సభ్యుడితోనైనా పరిచయం పెంచుకోవడం, ప్రతీరోజు తప్పకుండా యెహోవాకు ప్రార్థించడం ఆయన గురించి ఇతరులతో మాట్లాడడం వంటివి మీరు చేరుకోదగిన ఇతర లక్ష్యాలు.

మీరు ఇప్పటికి ఇంకా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరకపోతే, దాన్ని మీరు ఒక మంచి లక్ష్యంగా ఏర్పరచుకోవచ్చు. మీరు క్షేత్ర పరిచర్యలో భాగం వహిస్తున్నారా? ఒకవేళ భాగం వహించకపోతే, బాప్తిస్మం తీసుకోని ప్రచారకునిగా తయారవ్వడానికి మీరు కృషి చేయాలని కోరుకోవచ్చు. యెహోవాతో మీకున్న సంబంధం గురించి గంభీరంగా ఆలోచించుకొని మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోవడం తర్వాతి చర్య. పూర్తికాల సేవ చేయడానికి చర్యలు చేపట్టడం ద్వారా చాలామంది యౌవనస్థులు తమ సమర్పణకు తగినట్లుగా జీవించడానికి కృషి చేస్తారు.

మీ జీవితంలో లక్ష్యాలను ఏర్పరచుకోవడం మంచిదే అయినప్పటికీ పోటీ స్వభావాన్ని పెంపొందించుకోకుండా జాగ్రత్తవహించండి. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకపోతే, మీరు చేసే పనుల్లో మరింత ఆనందాన్ని పొందుతారు.​—⁠గలతీయులు 5:26; 6:⁠4.

మీకు అనుభవం లేదనీ, సహేతుకమైన లక్ష్యాలు ఏర్పరచుకోవడం కష్టంగా ఉందనీ మీకు అనిపించవచ్చు. అప్పుడు, “చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము” అని బైబిలు ఇస్తున్న ఉపదేశాన్ని అనుసరించండి. (సామెతలు 22:​17) మీ తల్లిదండ్రుల లేదా పరిణతిగల ఇతర క్రైస్తవుల సహాయాన్ని తీసుకోండి. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులైనా ఇతరులైనా సహేతుకంగా, ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇతరులు తమకోసం ఏర్పరచిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేసేందుకు ఒత్తిడి చేయబడుతున్నట్లు భావించడం యౌవనస్థుల సంతోషాన్ని దోచుకొని, లక్ష్యాలు ఏర్పరచడానికి గల ఉద్దేశం నెరవేరకుండా కూడా చేయవచ్చు. ఒక అమ్మాయి విషయంలో అదే జరిగింది, ఆమె ఇలా చెప్పింది: “నా తల్లిదండ్రులు ఒకదాని తరువాత ఒకటి వరుసగా​—⁠దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరడం, క్షేత్ర పరిచర్యలో పాల్గొనడం, బాప్తిస్మం తీసుకోవడం, పయినీరు సేవ చేయడం వంటి​—⁠లక్ష్యాలను నా ముందుంచారు. వాటిలో ప్రతీదాన్ని చేరుకోవడానికి నేను తీవ్రంగా కృషి చేశాను. నేను ఒక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ప్రశంసించేవారే కాదు, బదులుగా నేను కృషి చేయడానికి మరో లక్ష్యాన్ని నా ముందుంచారు. ఫలితంగా, ఆ లక్ష్యాలను చేరుకోవడానికి నన్ను బలవంతపెడుతున్నట్లు భావించాను. నేను చాలా అలసిపోయాను, లక్ష్యాలను చేరుకున్నానన్న సంతృప్తే నాకు కలుగలేదు.” ఆమె విషయంలో ఎక్కడ తప్పు జరిగింది? ఆ లక్ష్యాలన్నీ సహేతుకమైనవే కానీ అవి ఆమె స్వయంగా ఏర్పరచుకున్నవి కావు. మీరు విజయం సాధించాలంటే, మీ కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడంలో చొరవ తీసుకోవడానికి మీరే ప్రేరేపించబడాలి!

యేసుక్రీస్తు గురించి ఆలోచించండి. ఆయన భూమిపైకి వచ్చినప్పుడు, తను ఏమి చేయాలని తన తండ్రియైన యెహోవా కోరుకుంటున్నాడో ఆయనకు తెలుసు. యెహోవా చిత్తం చేయడం యేసుకు కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాక ఆయన నెరవేర్చవలసిన బాధ్యతవలే ఉండేది. యేసు తన నియామకాన్ని ఎలా దృష్టించాడు? “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది” అని ఆయన అన్నాడు. (యోహాను 4:​34) యేసు యెహోవా చిత్తం చేయడంలో ఆనందించాడు, తన తండ్రి తన నుండి కోరేవాటికి అనుగుణంగా జీవించాడు. అది యేసుకు ఆహారంవలే ఉండేది​—⁠తననుండి కోరబడిన పనిని పూర్తిచేయడంలో ఆయన ఆనందాన్నీ సంతృప్తినీ పొందాడు. (హెబ్రీయులు 10:​5-10) మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏదైతే చేయమని ప్రోత్సహిస్తారో దాన్ని చేయడానికి మీరు సరైన విధంగా పురికొల్పబడితే మీరు కూడా ఆనందాన్ని పొందవచ్చు.

మేలు చేయడంలో విసిగిపోకండి

మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత, దాన్ని సాధించడానికి కృషి చేయండి. “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము” అని గలతీయులు 6:9 చెబుతోంది. మీ సొంత శక్తి లేదా సామర్థ్యం మీద మాత్రమే ఆధారపడకండి. మీకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, కొన్నిసార్లు తాత్కాలికంగా విఫలమయ్యాననే భావన కూడా మీకు కలుగవచ్చు. కానీ బైబిలు మనకు ఈ హామీ ఇస్తోంది: ‘నీ ప్రవర్తన అంతటియందు [దేవుని] అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.’ (సామెతలు 3:⁠6) మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి మీరు కృషి చేస్తుండగా యెహోవా మిమ్మల్ని బలపరుస్తాడు.

అవును యెహోవాను సేవించాలనే కోరికను పెంపొందించుకోవడం ద్వారా, ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయడం ద్వారా మీరు ‘మీ అభివృద్ధి అందరికి తేటగా కనబడేటట్లు’ చేయవచ్చు. (1 తిమోతి 4:​15) అప్పుడు మీరు దేవుణ్ణి సేవిస్తూ అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తారు.

[9వ పేజీలోని చిత్రం]

బైబిలు చదివి, మీరు చదివిన విషయాలను ధ్యానిస్తే యెహోవాను సేవించడానికి మీరు ప్రేరేపించబడతారు

[10వ పేజీలోని చిత్రం]

యేసు తన తండ్రి తన నుండి కోరేవాటికి అనుగుణంగా జీవించాడు