కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచవ్యాప్త దైవిక విద్యను వృద్ధి చేయడంలో నా పాత్ర

ప్రపంచవ్యాప్త దైవిక విద్యను వృద్ధి చేయడంలో నా పాత్ర

జీవిత కథ

ప్రపంచవ్యాప్త దైవిక విద్యను వృద్ధి చేయడంలో నా పాత్ర

రాబర్ట్‌ నిస్‌బెట్‌ చెప్పినది

నన్ను, నా తమ్ముడు జార్జ్‌ను, స్వాజీలాండ్‌ రాజైన సోభూజ II తన రాజభవనంలోకి ఆహ్వానించాడు. అది 1936వ సంవత్సరం, అయినప్పటికీ మా మధ్య జరిగిన సంభాషణ నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. ఒక గొప్ప బైబిలు విద్యా పనితో నేను ఎంతోకాలంగా సంబంధం కలిగివుండడంలో భాగంగానే నేను ఆ రాజుతో అలా సుదీర్ఘంగా సంభాషించగలిగాను. ఇప్పుడు 95 సంవత్సరాల వయసున్న నేను, గతంలో నన్ను ఐదు వేర్వేరు ఖండాలకు తీసుకువెళ్ళిన ఆ పనిలో నా పాత్ర గురించి ఆలోచించినప్పుడు ఎంతో సంతోషిస్తాను.

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ఉన్న మా కుటుంబాన్ని 1925వ సంవత్సరంలో డాబ్సన్‌ అనే తేయాకు వ్యాపారి సందర్శించాడు. యువకుడనైన నేను వృత్తివిద్యార్థిగా మందుల దుకాణంలో పనిచేసేవాడిని. నేను చిన్నవాడినే అయినప్పటికీ, 1914-18 మధ్యకాలంలో జరిగిన ప్రపంచ యుద్ధం కుటుంబాల్లో, ప్రజల మతపరమైన జీవితాల్లో తీసుకువచ్చిన మార్పుల గురించి వ్యాకులపడేవాడిని. ఒకరోజు డాబ్సన్‌గారు మమ్మల్ని సందర్శించినప్పుడు యుగాల కొరకు దైవిక ప్రణాళిక (ఆంగ్లం) అనే పుస్తకం ఇచ్చి వెళ్ళారు. ఆ పుస్తకంలో, జ్ఞానవంతుడైన సృష్టికర్తకు ఒక నిర్దిష్ట “ప్రణాళిక” ఉందనే వివరణ ఎంతో కారణసహితమైనదిగా, నేను ఆరాధించాలని కోరుకొన్న దేవునికి అనుగుణమైనదిగా అనిపించింది.

త్వరలోనే అమ్మ, నేను అప్పట్లో బైబిలు విద్యార్థులు అని పిలువబడిన యెహోవాసాక్షుల కూటాలకు హాజరవడం ప్రారంభించాము. 1926 సెప్టెంబరులో గ్లాస్‌గోలో జరిగిన ఒక సమావేశంలో అమ్మ, నేను నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు మా సమర్పణను సూచించాము. బాప్తిస్మం తీసుకునే ప్రతి వ్యక్తికి బాప్తిస్మం తీసుకునేటప్పుడు తాము వేసుకొనే దుస్తులపై వేసుకోవడానికి ఒక పొడవాటి గౌను​—⁠నీటిలో మునిగినప్పుడు అది పైకి తేలకుండా ఉండేందుకు మోకాళ్ళ దగ్గర కట్టుకోవడానికి పట్టీలున్నది​—⁠ఇవ్వబడేది. అప్పట్లో అంత గంభీరమైన సందర్భానికి అలాంటి పొడవాటి గౌను తగినదిగా దృష్టించబడేది.

ఆ తొలి రోజుల్లో, అనేక విషయాలపై మాకున్న అవగాహనను మెరుగుపర్చుకోవలసిన అవసరం ఉండేది. సంఘంలోని సభ్యులందరూ కాకపోయినా అధికశాతం క్రిస్మస్‌ చేసుకునేవారు. చాలా తక్కువమంది క్షేత్ర పరిచర్యలో భాగం వహించేవారు. చివరకు కొంతమంది పెద్దలు కూడా ఆదివారాలు సాహిత్యం పంచిపెట్టడానికి అభ్యంతరం చెప్పేవారు ఎందుకంటే అది సబ్బాతును ఉల్లంఘించినట్లు అవుతుందని వారు తలంచేవారు. అయితే 1925లో కావలికోట ఆర్టికల్‌లు, “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను” అని ఉన్న మార్కు 13:⁠10 వంటి లేఖనాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ప్రారంభించాయి.

ఆ ప్రపంచవ్యాప్త పని ఎలా చేయబడుతుంది? ఇంటింటి ప్రకటనా పనిలో నేను భాగం వహించేందుకు మొదటిసారి చేసిన స్వల్ప ప్రయత్నంలో, అద్భుతమైన మతసంబంధ పుస్తకాలను అమ్ముతున్నాను అని గృహస్థుడికి చెప్పి ద హార్ప్‌ ఆఫ్‌ గాడ్‌ అనే పుస్తకాన్ని ప్రతిపాదించాను, అది బైబిలులోని పది ప్రాముఖ్యమైన బోధనలను హార్ప్‌కు (వీణ వంటి వాద్యం) ఉండే పది తీగలతో పోల్చి వివరించే పుస్తకం. ఆ తర్వాత, గృహస్థులు చదువుకోవడానికి వీలుగా చిన్న సందేశం ముద్రించబడివున్న సాక్ష్యపు కార్డు మాకు ఇవ్వబడింది. పోర్టబుల్‌ ఫోనోగ్రాఫ్‌ను ఉపయోగించి ప్లే చేసేందుకు రికార్డు చేయబడిన నాలుగున్నర నిమిషాల ప్రసంగాలను కూడా మేము ఉపయోగించేవాళ్ళం. ఈ ఫోనోగ్రాఫ్‌ల తొలి మోడల్‌లు చాలా బరువుగా ఉండేవి కానీ ఆ తర్వాత వచ్చిన మోడల్‌లు తక్కువ బరువు ఉండేవి, కొన్నింటిని నిలువుగా ఉంచి కూడా ప్లే చేయడం వీలయ్యేది.

1925 నుండి 1930ల వరకూ, ఆ పరిస్థితుల్లో మాకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రకటనా పనిని కొనసాగించాము. ఆ తర్వాత 1940ల తొలికాలంలో అన్ని సంఘాలకు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పరిచయం చేయబడింది. వినడానికి ఇష్టపడే గృహస్థులతో స్వయంగా మాట్లాడడం ద్వారా రాజ్య సందేశాన్ని ఎలా అందించాలో మాకు నేర్పించబడింది. ఆసక్తిగల ప్రజలతో గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించవలసిన ప్రాముఖ్యత గురించి కూడా మేము నేర్చుకున్నాము. ఒక దృక్కోణం నుండి చూస్తే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యా పనికి అది తొలిదశ అని చెప్పవచ్చు.

సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ప్రోత్సాహం

విద్యా పనిలో ఎక్కువగా భాగం వహించాలనే నా కోరిక, 1931లో నేను పూర్తికాల పయినీరు సేవ ప్రారంభించేలా చేసింది. లండన్‌లో జరిగిన ఒక సమావేశం ముగిసిన వెంటనే నేను నా పని ప్రారంభించాలి. అయితే ఒకరోజు మధ్యాహ్న విరామ సమయంలో, అప్పట్లో పనిని పర్యవేక్షిస్తున్న సహోదరుడు జోసెఫ్‌ రూథర్‌ఫర్డ్‌ నాతో మాట్లాడాలన్నారు. ఒక పయినీరును ఆఫ్రికా పంపించాలని ఆయన ఉద్దేశించారు. “మీరు వెళ్ళడానికి ఇష్టపడతారా?” అని ఆయన నన్ను అడిగారు. నాకు కొంత ఆశ్చర్యం కలిగినా, “నేను వెళతాను” అని ఎంతో దృఢంగా చెప్పగలిగాను.

ఆ రోజుల్లో, సాధ్యమైనంత ఎక్కువ బైబిలు సాహిత్యాన్ని పంచిపెట్టడమే మా లక్ష్యం కాబట్టి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో పర్యవేక్షణకు సంబంధించిన బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న సహోదరులలో చాలామందిలాగే నేను కూడా అవివాహితుడిగా ఉండేందుకు ప్రోత్సహించబడ్డాను. నేను పనిచేయవలసిన క్షేత్రం ఆఫ్రికా దక్షిణాన చివర్లో ఉన్న కేప్‌టౌన్‌ దగ్గర మొదలై హిందూ మహాసముద్ర తీరప్రాంతాన ఉన్న దీవులతో పాటు ఆఫ్రికా ఖండం తూర్పు భాగాన విస్తరించి ఉండేది. నా క్షేత్రపు పడమటి సరిహద్దుకు చేరుకోవడానికి నేను కాళహరి ఎడారి గుండా ప్రయాణించి నైలునది మూలమైన విక్టోరియా సరస్సు వరకూ వెళ్ళాలి. నేను నా సహచరుడితో కలిసి ఈ విస్తారమైన క్షేత్రంలో ఉన్న ఆఫ్రికా దేశాల్లోని ఒక్కొక్క దేశానికి​—⁠కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ దేశాలకు​—⁠ఆరు నెలల చొప్పున కేటాయిస్తూ ప్రయాణించాలి.

రెండు వందల అట్టపెట్టెల నిండా ఆధ్యాత్మిక సంపద

నేను కేప్‌టౌన్‌కు చేరుకున్నప్పుడు, తూర్పు ఆఫ్రికాకు తీసుకువెళ్ళవలసిన 200 కార్టన్‌ల సాహిత్యాన్ని నాకు చూపించారు. ఆ సాహిత్యం నాలుగు యురోపియన్‌ భాషల్లో, నాలుగు ఆసియా భాషల్లో ప్రచురించబడింది కానీ ఒక్కటి కూడా ఆఫ్రికా భాషల్లో దేనిలోనూ లేదు. నేను అక్కడకు చేరుకోకముందే ఆ సాహిత్యం అక్కడ ఎందుకుందని నేను అడిగినప్పుడు, ఇటీవలే కెన్యాలో ప్రకటించడానికి వెళ్ళిన ఫ్రాంక్‌ స్మిత్‌, గ్రే స్మిత్‌ అనే ఇద్దరు పయినీర్ల కోసం అది అక్కడ ఉంచబడిందని నాకు చెప్పారు. దాదాపు వారిద్దరు కెన్యాకు చేరుకున్న వెంటనే ఇద్దరికీ మలేరియా వచ్చింది, విచారకరంగా, ఫ్రాంక్‌ మరణించాడు.

ఈ వార్త నా పరిస్థితి గురించి నేను గంభీరంగా ఆలోచించేలా చేసింది, కానీ అది నన్ను నిరుత్సాహపరచలేదు. నా సహచరుడు డేవిడ్‌ నార్మాన్‌, నేను దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలోవున్న మా మొదటి నియామకమైన టాంజానియాకు చేరుకోవడానికి కేప్‌టౌన్‌లో ఓడ ఎక్కాము. కెన్యాలోని మొంబాజాకు చెందిన ఒక ట్రావెల్‌ ఏజెంట్‌ మా సాహిత్యాన్నంతటినీ తన దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటూ, మేము ఏ ప్రాంతానికి పంపించమని కోరితే ఆ ప్రాంతానికి వాటిని పంపించేవాడు. మొదట్లో మేము వ్యాపార ప్రాంతాల్లో అంటే ప్రతి పట్టణంలోని షాపులకు, కార్యాలయాలకు వెళ్ళి సాక్ష్యమిచ్చేవాళ్ళం. మా సాహిత్య సరఫరాలో ఒక భాగంగా తొమ్మిది పుస్తకాలు, 11 చిన్న పుస్తకాల సెట్‌లు ఉండేవి, ఆ పుస్తకాలు వేర్వేరు రంగుల్లో ఉండేవి కాబట్టి వాటిని వర్షధనుస్సు సెట్‌లు అని పిలిచేవారు.

ఆ తర్వాత, తూర్పు తీరం నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాన్జిబార్‌ ద్వీపాన్ని సందర్శించాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ జాన్జిబార్‌ శతాబ్దాలపాటు బానిసల వ్యాపారానికి కేంద్ర స్థానంగా ఉంది, అయితే ఆ ద్వీపం లవంగాలకు కూడా ప్రఖ్యాతి గాంచింది, పట్టణమంతా ఆ వాసనతో నిండి ఉండేది. ఆ పట్టణం ప్రణాళిక లేకుండా నిర్మించబడింది కాబట్టి అక్కడ సరైన దారి కనుక్కొని వెళ్ళడం కొంచెం కష్టంగా ఉండేది. వీధులు తికమక పెట్టే విధంగా మలుపులు తిరిగి ఉండేవి కాబట్టి మేము ఇట్టే దారి తప్పిపోయేవాళ్ళం. మేమున్న హోటల్‌ సౌకర్యవంతంగానే ఉండేది కానీ దాని తలుపులకు ఇనుప గుబ్బమేకులు పొదగబడి ఉండడం వల్ల, గోడలు చాలా మందంగా ఉండడం వల్ల అది ఒక హోటల్‌లా కాక చెరసాలలా కనిపించేది. అయినప్పటికీ మాకు జాన్జిబార్‌లో చక్కని ఫలితాలు లభించాయి. అరబ్‌లు, భారతీయులు, మరితరులు సాహిత్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించడం చూసి మేము సంతోషించాము.

రైళ్ళు, పడవలు, కార్లు

ఆ రోజుల్లో తూర్పు ఆఫ్రికాలో ప్రయాణించడం సులభమేమీ కాదు. ఉదాహరణకు, మేము మొంబాజా నుండి కెన్యాలోని పర్వత ప్రాంతాలకు ప్రయాణిస్తుండగా మిడతల తెగులు వల్ల మా రైలు ఆగిపోయింది. కోట్లకొలది మిడతలు అక్కడి నేలనూ రైలు పట్టాలనూ కప్పివేయడం వల్ల రైలు చక్రాలు పట్టాలమీద నుండి జారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంజన్‌లోని పొగలు కక్కే వేడి నీటితో రైలు ముందున్న పట్టాలను కడుగుతూ వెళ్ళడమే దానికి పరిష్కారం. మిడతల సమూహాన్ని దాటుకుని వచ్చే వరకూ మేము అదే పద్ధతిలో మెల్లగా ప్రయాణించవలసి వచ్చింది. చివరకు రైలు ఎత్తైన ప్రదేశాల వైపుకు ప్రయాణించినప్పుడు పర్వత ప్రాంతాల చల్లని వాతావరణాన్ని ఆనందించగలగడం ఎంత ఉపశమనంగా అనిపించిందో!

తీరప్రాంతంలోని పట్టణాలను రైలు ద్వారా, పడవ ద్వారా చేరుకోవడం సులభం కానీ గ్రామీణ ప్రాంతాలను చేరుకోవడానికి కారు ప్రయాణమే ఉత్తమమైనది. నా తమ్ముడు జార్జ్‌ నాతోపాటు సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను సంతోషించాను ఎందుకంటే అప్పుడు మేము ఇద్దరం కలిసి కాస్త పెద్ద పానల్‌ వాన్‌ను కొనుక్కోగలిగాము, అది ఎంత పెద్దగా ఉండేదంటే దానిలో పరుపులు, వంట చేసుకోవడానికీ వస్తువులు పెట్టుకోవడానికీ స్థలం, దోమలు లోపలికి రాకుండా తయారుచేయబడిన కిటికీలు ఉండేవి. వ్యాన్‌పైన మేము లౌడ్‌ స్పీకర్లను కూడా ఏర్పాటు చేయించాము. మా వ్యాన్‌ అన్ని సౌకర్యాలతో ఉండడం వల్ల మేము ఉదయం పూట ఇంటింటి పరిచర్య చేసి, సాయంత్రం పూట వ్యాపార స్థలాల్లో నిర్వహించబడే ప్రసంగాలకు ప్రజలను ఆహ్వానించగలిగే వాళ్ళం. “నరకం వేడిగా ఉంటుందా?” అనే ప్రసిద్ధమైన ప్రసంగాన్ని మేము ప్లే చేసేవాళ్ళం. ఒకసారి మేము మా “సంచార గృహంలో” దక్షిణాఫ్రికా నుండి కెన్యా వరకూ 3,000 కిలోమీటర్లు ప్రయాణించాము. ఆ సమయానికల్లా మా వద్ద వివిధ ఆఫ్రికా భాషల్లో రకరకాల చిన్న పుస్తకాలు ఉన్నందుకు మేము సంతోషించాము, వాటిని స్థానిక ప్రజలు సంతోషంగా స్వీకరించేవారు.

మేము ఇలాంటి ప్రయాణాలు చేసినప్పుడు ఆఫ్రికా వన్యప్రాణులను చూడడం ఆహ్లాదకరమైన అనుభవంగా ఉండేది. మేము సురక్షితంగా ఉండేందుకు చీకటి పడిన తర్వాత వ్యానులోనే ఉండేవాళ్ళం కానీ, యెహోవా చేసిన వివిధ జంతువులను వాటి సహజ పరిస్థితుల్లో చూడడం మా విశ్వాసాన్ని ఎంతో బలపరచింది.

వ్యతిరేకత మొదలయ్యింది

మేము అడవి జంతువులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నాం కానీ రాజ్య ప్రకటనా పనిని బహిరంగంగా వ్యతిరేకించడం ప్రారంభించిన వివిధ ప్రభుత్వ అధికారులను, కొంతమంది కోపిష్ఠి మత నాయకులను ఎదుర్కోవడానికి ఇంకా ఎక్కువ జాగ్రత్తలే తీసుకోవలసి వచ్చింది. తనను తాను “దేవుని కుమారుడు” అనే అర్థంగల వానా లీసా అనే పేరుతో పిలుచుకునే మూఢావేశపరుడి వల్ల మాకు ఒక పెద్ద సమస్య తలెత్తింది. విచారకరమైన విషయం ఏమిటంటే అతను నడిపించే గుంపు పేరు కీటావాలా, ఆంగ్లంలో దానర్థం “వాచ్‌టవర్‌.” మేము ఆ ప్రాంతానికి చేరుకోవడానికి కొంతకాలం ముందు ఆ వ్యక్తి బాప్తిస్మం పేరుతో అనేకమంది ఆఫ్రికన్లను నీటిలో ముంచి చంపేశాడు. చివరకు అతను అరెస్టు చేయబడి, ఉరి తీయబడ్డాడు. వానా లీసాను ఉరి తీసిన వ్యక్తితో మాట్లాడే అవకాశం నాకు లభించింది, వానా లీసాకు వాచ్‌టవర్‌ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని నేను అతనికి వివరించాను.

ముఖ్యంగా ఆర్థిక కారణాల వల్ల మేము చేసే విద్యా పనికి సంతోషించని అనేకమంది యురోపియన్లవల్ల కూడా మేము కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. “తెల్లవాళ్ళు ఈ దేశంలో ఉండాలంటే, తాము చౌకగా చేస్తున్న పనిని తెల్లవాళ్ళు తమ స్వలాభానికి ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆఫ్రికావాళ్ళకు తెలియకూడదు” అని ఒక స్టోర్‌ మేనేజర్‌ ఫిర్యాదు చేశాడు. ఆ కారణంగానే ఒక బంగారు గని కంపెనీలోని ప్రధానోద్యోగి నన్ను తన ఆఫీసు నుండి బలవంతంగా బయటకు పంపించాడు. ఆ తర్వాత ఆయన కోపంతో నన్ను వీధి వరకూ తరిమాడు.

ఇలాంటి మతపరమైన, వాణిజ్యపరమైన వ్యతిరేకుల వల్లనే రోడేషియా (ఇప్పుడు జింబాబ్వే) ప్రభుత్వం మమ్మల్ని దేశం వదిలివెళ్ళమని ఆజ్ఞాపించిందనడంలో సందేహం లేదు. మేము ఆ తీర్పును అప్పీలు చేసుకున్నాము, ఆఫ్రికన్లకు ప్రకటించకూడదనే షరతుపైనే అక్కడ ఉండడానికి మాకు అనుమతి ఇవ్వబడింది. ఆఫ్రికన్లకు ప్రకటించవద్దనడానికి కారణం మేము ఇచ్చే సాహిత్యం “ఆఫ్రికా దేశస్థుల మనస్సుకు తగినది కాదు” అని ఒక అధికారి చెప్పాడు. అయితే ఇతర దేశాల్లోని ఆఫ్రికావాళ్ళ మధ్య ఈ విద్యా పని నిరాటంకంగా సాగింది, దాన్ని వారు సంతోషంగా స్వీకరించారు. ఆ దేశాల్లో స్వాజీలాండ్‌ కూడా ఒకటి.

స్వాజీలాండ్‌కు ఘనమైన స్వాగతం

దక్షిణాఫ్రికాలో ఉన్న స్వాజీలాండ్‌ ఒక చిన్న స్వతంత్ర దేశం, దాని విస్తీర్ణం 17,364 చదరపు కిలోమీటర్లు. ఆర్టికల్‌ ప్రారంభంలో ప్రస్తావించిన వాగ్ధాటిగల రాజు సోభూజ IIను మేము కలిసింది ఇక్కడే. ఆయనకు ఆంగ్ల భాషకు సంబంధించి లోతైన పరిజ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఆయన ఒక బ్రిటీషు విశ్వవిద్యాలయానికి హాజరవుతుండగా సంపాదించుకున్నాడు. సాధారణ వస్త్రాలు ధరించిన ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు.

ఆయనతో జరిగిన మా సంభాషణలో, సరైన మనోవైఖరి గలవారి కోసం దేవుడు సంకల్పించిన భూపరదైసుపైనే ఎక్కువ అవధానముంచబడింది. ఆ విషయంలో అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ, దానికి సంబంధించిన ఒక విషయం గురించే తాను ఆలోచిస్తున్నానని ఆయన స్పష్టం చేశాడు. పేదవారి, విద్యలేని వారి జీవితాలను మెరుగుపరచడానికి ఆ రాజు కృషి చేస్తున్నాడు. ఆయనకు క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన అనేక మిషనరీల కార్యకాలాపాలు ఇష్టంలేదు ఎందుకంటే వారు తమ చర్చి సభ్యత్వాన్ని అధికం చేసుకోవడానికే ఆసక్తి చూపించేవారు కాని విద్య విషయంలో కాదు. అయితే మన పయినీర్లు అనేకమంది చేసే కార్యకలాపాల గురించి ఆ రాజుకు తెలుసు, బైబిలు విద్యా పని విషయంలో ఆయన మమ్మల్ని ప్రశంసించాడు, ప్రత్యేకించి డబ్బులు తీసుకోకుండా బదులుగా ఏమీ ఆశించకుండా ఆ పని చేయడానికి సుముఖంగా ఉన్నందుకు ఆయన ప్రశంసించాడు.

బైబిలు విద్య వేగాన్ని పుంజుకుంది

1943లో మిషనరీలకు శిక్షణనిచ్చేందుకు వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ స్థాపించబడింది. కేవలం బైబిలు సాహిత్యాన్ని అందించడానికి ప్రయత్నించే బదులు ఆసక్తిగలవారికి అదనపు సహాయాన్నివ్వడానికి కృషి చేయడంపై అవధానం ఉంచబడింది. 1950లో జార్జ్‌, నేను ఇద్దరం 16వ గిలియడ్‌ తరగతికి ఆహ్వానించబడ్డాము. నేను జీన్‌ హైడి అనే విశ్వసనీయురాలైన ఒక ఆస్ట్రేలియన్‌ సహోదరిని మొదటిసారిగా కలిసింది అక్కడే, మా గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఆమె జపాన్‌లో సేవ చేయడానికి నియమించబడింది. ఆ సమయంలో, అవివాహితులుగా ఉండాలనే ఆలోచన ఇంకా ప్రబలంగా ఉంది కాబట్టి అప్పట్లో మా స్నేహం ముందుకు సాగలేదు.

గిలియడ్‌ శిక్షణ తర్వాత, జార్జ్‌కి నాకు హిందూ మహాసముద్రంలో ఉన్న మారిషస్‌ ద్వీపంలో మిషనరీ నియామకం లభించింది. మేము ప్రజలతో స్నేహం పెంచుకొని, వారి భాష నేర్చుకొని, వారితో గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించాము. కొంతకాలానికి నా చిన్న తమ్ముడు విలియమ్‌, ఆయన భార్య మ్యూరీల్‌ కూడా గిలియడ్‌ నుండి పట్టభద్రులయ్యారు. వారిని నా మునుపటి ప్రకటనా క్షేత్రానికి​—⁠కెన్యాకు​—⁠పంపించారు.

ఎనిమిది సంవత్సరాలు వేగంగా గడిచిపోయాయి, 1958లో న్యూయార్క్‌లో ఒక అంతర్జాతీయ సమావేశం వద్ద నేను జీన్‌ హైడిని మళ్ళీ కలిశాను. మేము మా స్నేహాన్ని తిరిగి ప్రారంభించి నిశ్చితార్థం చేసుకున్నాము. నా మిషనరీ నియామకం మారిషస్‌ నుండి జపాన్‌కు మార్చబడింది, అక్కడ 1959లో జీన్‌ నేను పెళ్ళి చేసుకున్నాము. అప్పట్లో కేవలం ఒకే సంఘమున్న హిరోషిమా నగరంలో మేము సంతోషంగా మా మిషనరీ పని ప్రారంభించాము. నేడు ఆ నగరంలో 36 సంఘాలు ఉన్నాయి.

జపాన్‌కు వీడ్కోలు

సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మా ఇద్దరికి ఆరోగ్య సమస్యలు రావడం వల్ల మా మిషనరీ సేవ చాలా కష్టంగా తయారయ్యింది, చివరకు మేము జపాన్‌ విడిచి జీన్‌ స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్ళి స్థిరపడవలసి వచ్చింది. మేము హిరోషిమాను వదిలి వచ్చిన రోజు చాలా విషాదకరమైన రోజు. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారం వద్ద మేము మా ప్రియమైన స్నేహితులందరికి వీడ్కోలు చెప్పాము.

ఇప్పుడు మేము ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాము, మాకున్న పరిమిత సామర్థ్యాలను సాధ్యమైనంత మేరకు ఉపయోగిస్తూ న్యూ సౌత్‌ వేల్స్‌లోని ఆర్మీడేల్‌ సంఘంలో యెహోవాకు సేవ చేస్తున్నాము. దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు క్రైస్తవ సత్యమనే నిధిని అంతమంది ప్రజలతో పంచుకోవడం ఎంతటి ఆనందకరమైన విషయమో! నేను బైబిలు విద్యా కార్యక్రమం సాధించిన అద్భుతమైన అభివృద్ధిని చూశాను, ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సంఘటనలను వ్యక్తిగతంగా వీక్షించాను. ఈ విజయాలకు ఏ మానవుడు ఘనత పొందలేడు లేదా ఏ గుంపు ఘనత పొందలేదు. నిజమే, కీర్తనకర్త మాటల్లో చెప్పాలంటే “అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము.”​—⁠కీర్తన 118:23.

[28వ పేజీలోని చిత్రం]

మా హౌస్‌కార్‌తో నా తమ్ముడు జార్జ్‌

[28వ పేజీలోని చిత్రం]

విక్టోరియా సరస్సు దగ్గర నేను

[29వ పేజీలోని చిత్రం]

1938లో స్వాజీలాండ్‌లో ఒక బహిరంగ ప్రసంగానికి హాజరైన ఉన్నత పాఠశాల విద్యార్థులు

[30వ పేజీలోని చిత్రాలు]

జీన్‌తో, 1959లో మా వివాహమప్పుడు, ఇప్పుడు