కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాధల అగ్నిగుండంలో పరీక్షించబడ్డాము

బాధల అగ్నిగుండంలో పరీక్షించబడ్డాము

జీవిత కథ

బాధల అగ్నిగుండంలో పరీక్షించబడ్డాము

పెర్క్‌లీస్‌ యెనొరీస్‌ చెప్పినది

చెమ్మతో మగ్గిపోయి ఉన్న జైలుగదిలో వ్యాపించివున్న చలి నా ఎముకల్ని కొరికేస్తోంది. నేను ఒక పలుచటి ఉన్ని దుప్పటి కప్పుకొని అక్కడ ఒంటరిగా కూర్చున్నాను, రెండు రోజుల క్రితం నన్ను మిలిటెంట్లు మా ఇంట్లో నుండి లాక్కువస్తున్నప్పుడు యౌవనస్థురాలైన నా భార్య ముఖంలో కనిపించిన కాఠిన్యం ఇంకా నా కళ్ళ ఎదుటే మెదులుతోంది, నా భార్యను, అనారోగ్యంతో ఉన్న నా ఇద్దరు పిల్లలను వదిలివచ్చేశాను. ఆ తర్వాత, నా మత నమ్మకాలను పంచుకోని నా భార్య ఒక పార్సెల్‌తోపాటు ఒక చిన్న లేఖ నాకు పంపింది, దానిలో ఇలా ఉంది: “మీ పిల్లల్లాగే మీరు కూడా అనారోగ్యం పాలవ్వాలని కోరుకుంటూ ఈ కేకులు పంపిస్తున్నాను.” మళ్ళీ నా కుటుంబాన్ని చూడడానికి నేను సజీవంగా ఎప్పటికైనా తిరిగి వెళ్తానా?

క్రైస్తవ విశ్వాసం కోసం చేసిన సుదీర్ఘమైన, కష్టభరితమైన పోరాటంలో అది కేవలం ఒక అంకం మాత్రమే. ఆ పోరాటంలో కుటుంబ వ్యతిరేకతను, సమాజ బహిష్కరణను, చట్టబద్ధమైన పోరాటాలను, తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ నెమ్మదస్థుడ్ని, దైవభయంగల వాడినైన నేను అలాంటి దుర్భరమైన స్థలానికి ఎలా, ఎందుకు చేరుకున్నాను. దయచేసి నన్ను వివరించనివ్వండి.

ఉన్నతాశయమున్న పేద పిల్లవాడు

నేను 1909లో క్రేతులోని స్టావ్‌రోమినోలో జన్మించినప్పుడు, దేశం యుద్ధం, పేదరికం, కరువులతో కొట్టుమిట్టాడుతోంది. అంతేకాక నేను, నా నలుగురు చెల్లెళ్ళు తమ్ముళ్లు స్పానిష్‌ ఫ్లూ దాడిని తృటిలో తప్పించుకోగలిగాము. మాకు ఫ్లూ సోకకుండా ఉండాలని మా తల్లిదండ్రులు మమ్మల్ని వారాల పాటు ఇంట్లోనే బంధించి ఉంచడం నాకు ఇప్పటికీ గుర్తుంది.

పేద రైతు అయిన నాన్నగారు ఎంతో దైవభక్తిగల వ్యక్తి, ఆయన విశాల హృదయుడు కూడా. ఫ్రాన్స్‌లో, మడగాస్కర్‌లో నివసించిన ఆయన, మతం గురించిన అభ్యుదయ తలంపులకు సుపరిచితుడే. అయినా మా కుటుంబం గ్రీక్‌ ఆర్థడాక్స్‌ చర్చికే నమ్మకంగా కట్టుబడి ఉంటూ ప్రతి ఆదివారం మాస్‌కు హాజరయ్యేది, వార్షిక సందర్శనాలు చేస్తున్నప్పుడు స్థానిక బిషప్పుకు మా ఇంట్లోనే విడిది ఏర్పాటు చేసేవాళ్ళం. నేను చర్చి గాయకబృందంలో ఒక సభ్యుడిగా ఉండేవాడిని, ఎప్పటికైనా ప్రీస్టునవ్వాలన్నది నా జీవితాశయం.

1929లో నేను పోలీసు బలగంలో చేరాను. నాన్నగారు మరణించినప్పుడు నేను ఉత్తర గ్రీసులోని థెస్సలొనీకలో విధి నిర్వహణలో ఉన్నాను. ఓదార్పు కోసం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం నేను ఏథోస్‌ పర్వతపు పోలీసు బలగానికి బదిలీ చేయించుకున్నాను, ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సన్యాసుల మఠాన్ని ఆర్థడాక్స్‌ క్రైస్తవులు “పరిశుద్ధ పర్వతము” అని ఎంతో పవిత్రమైనదిగా భావించేవారు. * అక్కడ నేనున్న నాలుగు సంవత్సరాల్లో సన్యాసుల జీవితాన్ని చాలా దగ్గరి నుండి గమనించాను. దేవునికి దగ్గరయ్యే బదులు అక్కడి సన్యాసుల్లోని విపరీతమైన లైంగిక దుర్నీతిని, అవినీతిని చూసి నేను అసహ్యించుకున్నాను. నేనెంతగానో గౌరవించే ఒక ఆర్కిమాన్‌డ్రైట్‌ (బిషప్పు కంటే తక్కువ స్థాయిలో ఉండే చర్చి అధికారి) నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని చూసినప్పుడు నాకు ఏవగింపు కలిగింది. అలా నా భ్రమ తొలగిపోయినప్పటికీ నేను దేవుని సేవ చేయాలని, ప్రీస్టునవ్వాలని హృదయపూర్వకంగా కోరుకున్నాను. నేను ప్రీస్టు వస్త్రాలు ధరించి గుర్తుగా ఉంటుందని ఫోటో కూడా తీయించుకున్నాను. చివరికి నేను క్రేతుకు తిరిగివచ్చాను.

“ఆయనొక దయ్యం!”

1942లో నేను ఫ్రోసీనీ అనే ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను, ఆమెది గౌరవప్రదమైన కుటుంబం. నా భార్య కుటుంబ సభ్యులు ఎంతో దైవభక్తి గలవారు కావడం వల్ల, ప్రీస్టునవ్వాలన్న నా నిర్ణయం వివాహమయ్యాక మరింత బలపడింది. * మతధర్మాలను బోధించే ఒక పాఠశాలలో చదువుకోవడానికి నేను ఏథెన్సుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నేను 1943వ సంవత్సరాంతంలో క్రేతులోని ఇరక్లీన్‌ ఓడరేవుకు చేరుకున్నాను గానీ ఏథెన్సుకు మాత్రం వెళ్ళలేదు. ఆ మధ్యకాలంలో, బహుశా నేను ఆధ్యాత్మికంగా నూతనోత్తేజాన్ని పొందడానికి మరో మూలాన్ని కనుగొనడం దానికి కారణం కావచ్చు. అసలేమి జరిగింది?

ఇమ్మాన్వీల్‌ లియోనూడాకీస్‌ అనే శక్తివంతుడైన యౌవన ప్రచారకుడు కొన్ని సంవత్సరాలుగా యెహోవాసాక్షులతో సహవసిస్తున్నాడు, ఆయన జ్ఞానోదయాన్ని కలిగించే బైబిలు సత్యాలను క్రేతు అంతటా బోధిస్తున్నాడు. * దేవుని వాక్యం గురించి సాక్షులు అందిస్తున్న స్పష్టమైన అవగాహనకు ఆకర్షితులైన కొంతమంది అబద్ధమతాన్ని విడనాడారు. దగ్గర్లో ఉన్న సిటీ అనే నగరంలో, ఉత్సాహవంతులైన సాక్షుల గుంపు ఒకటి ఏర్పడింది. ఇది స్థానిక బిషప్పుకు చికాకు కలిగించింది, అమెరికాలో నివసించిన ఆయనకు యెహోవాసాక్షులు ప్రచారకులుగా ఎంత సమర్థవంతులో చాలా బాగా తెలుసు. తన సామ్రాజ్యంలో నుండి “వితండవాదం” పూర్తిగా నిర్మూలించాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆయన ప్రేరణతోనే పోలీసులు ఎల్లప్పుడూ వివిధ రకాల అబద్ధ ఆరోపణలతో సాక్షులను జైళ్ళకు, కోర్టులకు లాక్కువెళ్ళేవారు.

ఈ సాక్షుల్లో ఒకరు నాకు బైబిలు సత్యాన్ని వివరించడానికి ప్రయత్నించి నాకు ఆసక్తి లేదని భావించాడు. ఆ కారణంగా నాతో మాట్లాడడానికి ఆయన మరింత అనుభవజ్ఞుడైన సేవకుడ్ని పంపించాడు. నేను కరకుగా ఇచ్చిన సమాధానం, రెండవ సాక్షి ఆ చిన్న గుంపు దగ్గరికి తిరిగి వెళ్ళి, “పెర్క్‌లీస్‌ సాక్షి అవడం అసాధ్యం. ఆయనొక దయ్యం!” అని చెప్పేలా చేసి ఉంటుంది.

వ్యతిరేకత యొక్క మొదటి అనుభవం

కానీ దేవుడు నన్నలా దృష్టించనందుకు నేను సంతోషిస్తున్నాను. యెహోవాసాక్షులు బోధిస్తున్నది సత్యమని నమ్మిన మా తమ్ముడు డిమేస్తనీస్‌ 1945 అక్టోబరులో, దుఃఖించే వారినందరిని ఓదార్చండి (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని నాకిచ్చాడు. * దానిలోని విషయాలు నన్ను ముగ్దుడ్ని చేశాయి. మేము వెంటనే ఆర్థడాక్స్‌ చర్చికి వెళ్ళడం మానేసి, సిటీలోని చిన్న గుంపుతో చేరాము, మేము కొత్తగా కనుగొన్న విశ్వాసాన్ని మా తోబుట్టువులకు కూడా చెప్పాము. వారందరూ బైబిలు సత్యాన్ని అంగీకరించారు. అనుకున్నట్లుగానే, అబద్ధమతాన్ని విడనాడాలన్న నా నిర్ణయం నా భార్య నుండి, ఆమె కుటుంబం నుండి నాకు బహిష్కరణను, ప్రతికూలతను తీసుకువచ్చింది. కొంతకాలం పాటు మా మామగారు నాతో మాట్లాడలేదు కూడా. ఇంట్లో ఎప్పుడూ తగవులాటలు, ఉద్రిక్తతలు ఉండేవి. అయినప్పటికీ నేను, డిమేస్తనీస్‌ 1945 మే 21న మినోస్‌ కొకీనాకీస్‌ అనే సహోదరుని ద్వారా బాప్తిస్మం పొందాము. *

చివరికి నేను దేవుని నిజమైన సేవకునిగా సేవ చేయాలన్న నా కలను నిజం చేసుకోగలిగాను! నేను ఇంటింటి పరిచర్యకు వెళ్ళిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. నా బ్యాగులో 35 చిన్న చిన్నపుస్తకాలు పెట్టుకొని బస్సులో ఒంటరిగా ఒక గ్రామానికి వెళ్ళాను. భయపడుతూనే ఇంటింటికి వెళ్ళడం మొదలుపెట్టాను. నేను వెళ్తున్న కొద్దీ ధైర్యం పుంజుకున్నాను. చికాకు పడిన ఒక ప్రీస్టు వచ్చి, తనతో పాటు పోలీసు స్టేషన్‌కు రమ్మని ఒత్తిడి చేసినప్పుడు నేను దాన్ని తిరస్కరించి ధైర్యంగా నిలబడగలిగాను. నేను మొత్తం గ్రామాన్ని సందర్శించిన తర్వాతే అక్కడినుండి వెళ్తానని ఆయనకు చెప్పి, సరిగ్గా అలాగే చేశాను. నేను ఎంతగా సంతోషపడ్డానంటే బస్సుకోసం కూడా ఆగకుండా, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి నడిచి వచ్చాను.

నిర్దయులైన దుష్టుల చేతుల్లో

సిటీలో కొత్తగా ఏర్పడిన మా సంఘంలో నాకు 1945 సెప్టెంబరులో అదనపు బాధ్యతలు ఇవ్వబడ్డాయి. అంతలోనే గ్రీస్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. వేర్పాటువాద గుంపులు తీవ్రమైన ద్వేషంతో ఒకరినొకరు క్రూరంగా హింసించుకున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని, ఏదో ఒక విధంగా సాక్షులను నిర్మూలించమని బిషప్పు ఒక స్థానిక గెరిల్లా గుంపును కోరాడు. (యోహాను 16:⁠2) గెరిల్లా మూక బస్సులో మా గ్రామం వైపు వస్తూ వాళ్ళ “దేవుడు నిర్దేశించిన” కార్యాన్ని నిర్వర్తించడానికి వేసుకుంటున్న పథకాల గురించి మాట్లాడుకుంటుండగా, అదే బస్సులో ప్రయాణిస్తున్న స్నేహశీలి అయిన ఒక స్త్రీ విని మమ్మల్ని హెచ్చరించింది. మేము దాక్కున్నాము, మా బంధువుల్లో ఒకాయన మాకు సహాయం చేశాడు. అలా మా ప్రాణాలు దక్కాయి.

అది, మరిన్ని బాధలు తలెత్తడానికి మార్గాన్ని ఏర్పరచింది. దెబ్బలు, బెదిరింపులు సర్వసాధారణం అయిపోయాయి. మా వ్యతిరేకులు మమ్మల్ని మళ్ళీ చర్చికి రమ్మని, మా పిల్లలకు బాప్తిస్మం ఇమ్మని, సిలువ గుర్తు వేసుకొమ్మని బలవంతం చేయడానికి ప్రయత్నించారు. ఒక సందర్భంలో, వాళ్ళు మా తమ్ముడ్ని ఇక చచ్చిపోయాడు అని వాళ్ళు అనుకున్నంతవరకూ కొట్టారు. మా చెల్లెళ్ళ వస్త్రాలు చింపేసి వారిని కొట్టడం చూసి ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో చర్చి ఎనిమిదిమంది యెహోవాసాక్షుల పిల్లలకు బలవంతంగా బాప్తిస్మం ఇచ్చింది.

1949లో మా అమ్మ చనిపోయింది. అంత్యక్రియలకు సంబంధించిన చట్టపరమైన విధులను మేము నిర్వహించడం లేదంటూ ప్రీస్టు మళ్ళీ మా వెనక పడ్డాడు. కోర్టులో విచారణ చేసి నన్ను నిర్దోషిగా విడుదల చేశారు. అది గొప్ప సాక్ష్యాన్నిచ్చింది, ఎందుకంటే కేసు ప్రారంభ మాటల్లో యెహోవా పేరు ఉపయోగించడం జరిగింది. “మాకు బుద్ధి కలిగేలా చేయడానికి” మా శత్రువులకు మిగిలిన మార్గమల్లా మమ్మల్ని అరెస్టు చేసి దేశబహిష్కరణ చేయడమే. 1949 ఏప్రిల్‌లో వారు అదే చేశారు.

మండుతున్న అగ్నిగుండంలోకి

అరెస్టు చేయబడిన ముగ్గురు సహోదరుల్లో నేను ఒకడిని. నా భార్య స్థానిక పోలీసు స్టేషన్‌లో కనీసం నన్ను చూడడానికి కూడా రాలేదు. మొదట మేము ఇరక్లీన్‌లో ఒక చెరసాలలో ఉంచబడ్డాము. ఆర్టికల్‌ ప్రారంభంలో వర్ణించినట్లు నేను ఒంటరితనంతో కృంగిపోయి ఉన్నాను. సాక్షి కాని యౌవనస్థురాలైన నా భార్యను, ఇద్దరు పసిపిల్లలను వదిలి వచ్చాను. సహాయం కోసం నేను యెహోవాకు ఎడతెగక ప్రార్థించాను. “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని హెబ్రీయులు 13:5లో వ్రాయబడివున్న దేవుని మాటలు నా మదిలో మెదిలాయి. యెహోవాపై పూర్తి నమ్మకం ఉంచడం జ్ఞానవంతమని నేను గ్రహించాను.​—⁠సామెతలు 3:⁠5.

మేము గ్రీస్‌లోని అట్టికా తీరంలో ఉన్న మాక్రోనిసోస్‌ అనే నిర్జన ద్వీపానికి పంపించబడుతున్నామని మాకు తెలిసింది. మాక్రోనిసోస్‌ అన్న పేరు వింటే చాలు ఎవ్వరైనా భయపడిపోయేవారు ఎందుకంటే అక్కడి చెరసాలలో తీవ్రంగా హింసించి, బానిసల్లా పని చేయిస్తారు. చెరసాలకు వెళ్తుండగా, పైరీస్‌ నగరంలో మా ప్రయాణం ఆగింది. మా చేతులకు బేడీలు ఉన్నప్పటికీ తోటి విశ్వాసులు కొందరు పడవలోకి వచ్చి మమ్మల్ని హత్తుకున్నప్పుడు మేమెంతో ప్రోత్సహించబడ్డాము.​—⁠అపొస్తలుల కార్యములు 28:​14, 15.

మాక్రోనిసోస్‌లో జీవితం పీడకలలా ఉంది. సైనికులు ఖైదీలను ఉదయం నుండి రాత్రి వరకూ హింసించేవారు. సాక్షేతర ఖైదీలు చాలామంది పిచ్చివారయ్యారు, కొందరు చనిపోయారు, అనేకమంది అంగవికలులయ్యారు. రాత్రి సమయాల్లో, హింసించబడుతున్నవారి అరుపులు, ఆర్తనాదాలు మాకు వినిపించేవి. పలుచటి నా ఉన్ని దుప్పటి ఆ చలి రాత్రుల్లో నాకు కాస్త వెచ్చదనాన్నిచ్చేది.

మెల్లగా యెహోవాసాక్షులు క్యాంపులో అందరికీ తెలియడం మొదలుపెట్టారు, ఎందుకంటే ప్రతి ఉదయం పేర్లు పిలిచేటప్పుడు ఆ పేరును ఉపయోగించడం జరిగేది. అలా సాక్ష్యమివ్వడానికి మాకు అనేక అవకాశాలు లభించేవి. తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకునేంతగా అభివృద్ధి సాధించిన ఒక రాజకీయ ఖైదీకి, నీటిలో బాప్తిస్మం ఇచ్చే ఆధిక్యత కూడా నాకు లభించింది.

బహిష్కరణలో ఉన్నప్పుడు, నేను నా ప్రియమైన భార్యకు ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవాడిని కానీ ఆమె నుండి నాకెప్పుడు జవాబు రాలేదు. అయినప్పటికీ వాత్సల్యపూరితంగా ఓదారుస్తూ ఇది కేవలం తాత్కాలికమేననీ మనం మళ్ళీ ఆనందంగా ఉంటామనీ ఆమెకు ఉత్తరాలు వ్రాయకుండా అది నన్ను ఆపలేకపోయింది.

ఆ మధ్య కాలంలో, చాలామంది సహోదరులు రావడంతో మా సంఖ్య పెరిగింది. ఆఫీసులో పని చేస్తూ నేను క్యాంపు కమాండింగ్‌ కల్నల్‌తో పరిచయం ఏర్పరచుకున్నాను. ఆయన సాక్షులను గౌరవించేవాడు కాబట్టి, ఏథెన్సులోని మా కార్యాలయం నుండి కొంత బైబిలు సాహిత్యాన్ని తెప్పించుకోవడం సాధ్యమవుతుందా అని ఆయనను అడిగేందుకు ధైర్యం కూడగట్టుకున్నాను. “అసాధ్యం” అన్నాడాయన, “కానీ ఏథెన్సులో ఉన్న మీ వాళ్ళు దాన్ని మీ సంచిలో ప్యాక్‌ చేసి దాని మీద నా పేరు వ్రాసి, దాన్ని నాకెందుకు పంపించకూడదు?” అని ఆయన ప్రశ్నించాడు. నేను అమితాశ్చర్యంతో అలాగే ఉండిపోయాను! కొన్ని రోజుల తర్వాత పడవలో వచ్చిన సరుకును మేము దించుతుండగా, కల్నల్‌కు సెల్యూట్‌ చేసి ఒక పోలీసు, “సర్‌, మీ లగేజ్‌ వచ్చింది” అని ఆయనకు చెప్పాడు. “ఏ లగేజ్‌?” అని ఆయన అడిగాడు. అదేసమయానికి వారికి దగ్గరలోనే ఉన్న నేను వారి సంభాషణ విని, “బహుశా అది మాదై ఉండవచ్చు, మీరు చెప్పినట్లుగా దాన్ని మీ పేరున పంపివుంటారు” అని ఆయనకు మెల్లగా చెప్పాను. మాకు ఆధ్యాత్మిక ఆహారం లభించేలా యెహోవా చేసిన ఏర్పాట్లలో అదొకటి.

అనుకోని ఆశీర్వాదం​—⁠ఆ తర్వాత మరిన్ని బాధలు

1950వ సంవత్సరాంతాన నన్ను విడుదల చేశారు. నేను బలహీనమై, పాలిపోయి, బాగా చిక్కిపోయి ఇంటికి బయల్దేరాను, అక్కడ ఎలాంటి ఆహ్వానం లభిస్తుందో నాకు తెలియదు. నా భార్యా పిల్లల్ని మళ్ళీ చూడగలిగినందుకు ఎంతగా సంతోషించానో! అంతకంటే ఎక్కువగా ఫ్రోసీనీ వ్యతిరేకత తగ్గిపోవడం చూసి మరింత ఆశ్చర్యపోయాను. చెరసాల నుండి నేను వ్రాసిన ఉత్తరాలు సమర్థమైనవిగా నిరూపించబడ్డాయి. ఫ్రోసీనీ నా సహనాన్ని, పట్టుదలను చూసి చలించిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి, నేను ఆమెతో చాలాసేపు సమాధానపూర్వకంగా చర్చించాను. ఆమె బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించి, యెహోవాపై ఆయన వాగ్దానాలపై విశ్వాసాన్ని పెంచుకుంది. నా జీవితంలో అత్యంత ఆనందకరమైన దినాల్లో ఒకటి 1952లో నేను ఆమెకు సమర్పిత యెహోవా సేవకురాలిగా బాప్తిస్మం ఇచ్చిన రోజు!

1955లో మేము ప్రతి ప్రీస్టుకు క్రైస్తవమత సామ్రాజ్యమా క్రైస్తవత్వమా​—⁠ఏది “లోకమునకు వెలుగై” యున్నది? (ఆంగ్లం) అనే చిన్నపుస్తకాన్ని పంచిపెట్టడం మొదలుపెట్టాము. చాలామంది తోటి సాక్షులతోపాటు నన్ను అరెస్టు చేసి విచారణకు తీసుకువెళ్ళారు. యెహోవాసాక్షులపై ఎన్ని కేసులున్నాయంటే, అవన్నీ వినడానికి కోర్టు ఒక ప్రత్యేక సెషన్‌ ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఆ రోజున, ఆ ప్రాంతంలోని న్యాయ వ్యవస్థ అంతా హాజరయ్యింది, కోర్టు గది ప్రీస్టులతో క్రిక్కిరిసిపోయింది. బిషప్పు ఉద్వేగంతో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఒక ప్రీస్టు నాపై మతమార్పిడి ఆరోపణ చేశాడు. న్యాయమూర్తి ఆయననిలా అడిగాడు: “నీ విశ్వాసం ఒక బ్రోషుర్‌ చదివితేనే మారిపోయేంత బలహీనంగా ఉందా?” దానితో ప్రీస్టు ఇక నోరెత్తలేకపోయాడు. నన్ను నిర్దోషిగా విడుదల చేశారు, కానీ కొంతమంది సహోదరులకు ఆరు నెలల జైలు శిక్ష విధించబడింది.

ఆ తర్వాతి సంవత్సరాల్లో, మమ్మల్ని పదే పదే అరెస్టు చేశారు, కోర్టు కేసులు పెరిగిపోతున్నాయి. విచారణలు జరపడానికి మా లాయర్లు ఎప్పుడూ ఉరుకులు పరుగులు తీయవలసి వచ్చేది. నన్ను మొత్తం 17 సార్లు కోర్టుకు తీసుకువెళ్ళారు. వ్యతిరేకత ఉన్నప్పటికీ మేము క్రమంగా ప్రకటనాపనికి వెళ్ళేవాళ్ళం. మేము ఈ సవాలును సంతోషంగా స్వీకరించాము, తీవ్రమైన శ్రమలు మా విశ్వాసాన్ని శుద్ధీకరించాయి.​—⁠యాకోబు 1:2, 3.

కొత్త ఆధిక్యతలు, సవాళ్ళు

1957లో మేము ఏథెన్సుకు తరలి వెళ్ళాము. కొద్దికాలంలోనే నేను కొత్తగా ఏర్పడిన సంఘంలో సేవచేయడానికి నియమించబడ్డాను. నా భార్య ఇచ్చిన హృదయపూర్వక మద్దతు, మేము మా జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకొని, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రాధాన్యతనివ్వడానికి అనుమతించింది. అలా మేము ప్రకటనా పనికి మా సమయాన్ని ఎక్కువగా వెచ్చించగలిగాము. సంవత్సరాలు గడుస్తుండగా, అవసరత ఉన్న వేర్వేరు సంఘాలకు వెళ్ళమని మేము కోరబడ్డాము.

1963లో మా అబ్బాయికి 21 సంవత్సరాలు రావడంతో, ఆయన సైన్యంలో చేరవలసిన సమయం వచ్చింది. తమ తటస్థ స్థానాన్ని బట్టి అలా చేరని సాక్షులందరూ దెబ్బలను, అవమానాలను, హేళనలను అనుభవించవలసి వచ్చింది. మా అబ్బాయి కూడా అదే అనుభవించాడు. మునుపు విశ్వసనీయతను కాపాడుకున్న వారి మాదిరి అనుసరించమని సూచనార్థకంగా ఆయనను ప్రోత్సహించడానికి నేను మాక్రోనిసోస్‌లో ఉపయోగించిన ఉన్ని దుప్పటిని ఆయనకిచ్చాను. పిలిపించబడిన సహోదరులు సైనిక కోర్టులో విచారించబడ్డాక, సాధారణంగా వారికి రెండు నుండి నాలుగు సంవత్సరాల శిక్ష విధించబడేది. విడుదల చేయబడిన తర్వాత వారు మళ్లీ పిలిపించబడి మళ్ళీ వారికి శిక్షవిధించబడేది. మతసంబంధమైన పరిచారకుడిగా, నేను వివిధ చెరసాలలను దర్శించి, మా అబ్బాయిని, నమ్మకమైన ఇతర సాక్షులను కొంతమేరకు కలవగలిగేవాడిని. మా అబ్బాయి ఆరు సంవత్సరాల కంటే ఎక్కువకాలం చెరసాలలో ఉన్నాడు.

యెహోవా మమ్మల్ని బలపరిచాడు

గ్రీస్‌కు మళ్ళీ మత స్వాతంత్ర్యం ఇవ్వబడినప్పుడు, నాకు రోడెస్‌ ద్వీపంలో తాత్కాలికంగా ప్రత్యేక పయినీరు సేవ చేసే ఆధిక్యత లభించింది. నేను క్రైస్తవుడిగా నా జీవితాన్ని ప్రారంభించిన క్రేతులోని సిటీలో 1986లో అవసరత ఏర్పడింది. నేను యౌవనుడిగా ఉన్నప్పటి నుండి నాకు తెలిసిన ప్రియమైన తోటి విశ్వాసులతో కలిసి సేవ చేసేందుకు లభించిన ఈ నియామకాన్ని నేను ఆనందంగా స్వీకరించాను.

మా కుటుంబ పూర్వీకుడిగా నేను, మా కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం 70 మంది విశ్వసనీయంగా యెహోవా సేవ చేయడం చూసి ఆనందిస్తున్నాను. ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. కొందరు పెద్దలుగా, పరిచర్య సేవకులుగా, పయినీర్లుగా, బేతేలు సభ్యులుగా, ప్రయాణ పైవిచారణకర్తలుగా సేవ చేశారు. ఇప్పటికి 58 ఏళ్ళకు పైగా నా విశ్వాసం బాధలనే అగ్ని గుండంలో పరీక్షించబడుతూవుంది. నాకిప్పుడు 93 సంవత్సరాలు, నేను గతం గురించి ఆలోచించినప్పుడు, దేవుని సేవ చేసినందుకు నేనేమాత్రం విచారించడం లేదు. “నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము” అనే తన ప్రేమపూర్వక ఆహ్వానానికి ప్రతిస్పందించే శక్తిని ఆయన నాకిచ్చాడు.​—⁠సామెతలు 23:26.

[అధస్సూచీలు]

^ పేరా 9 కావలికోట, డిసెంబరు 1, 1999, 30-1 పేజీలు చూడండి.

^ పేరా 11 గ్రీక్‌ ఆర్థడాక్స్‌ చర్చి ప్రీస్టులకు వివాహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వబడింది.

^ పేరా 12 ఇమ్మాన్వీల్‌ లియోనూడాకీస్‌ జీవిత కథ కోసం కావలికోట, సెప్టెంబరు 1, 1999, 25-9 పేజీలు చూడండి.

^ పేరా 15 యెహోవాసాక్షులు ప్రచురించినది కాని ఇప్పుడు ముద్రించబడడం లేదు.

^ పేరా 15 మినోస్‌ కొకీనాకీస్‌తో సంబంధమున్న చట్టపరమైన ఒక విజయం గురించి కావలికోట, సెప్టెంబరు 1, 1993, 27-31 పేజీలు చూడండి.

[27వ పేజీలోని బాక్సు]

మాక్రోనిసోస్‌ —ఒక భయంకరమైన ద్వీపం

1947 నుండి 1957 వరకు అంటే పది సంవత్సరాలపాటు, నిర్జీవమైన నిర్జనమైన మాక్రోనిసోస్‌ ద్వీపం 1,00,000 కంటే ఎక్కువమంది ఖైదీలకు గృహంగా ఉంది. వారిలో ఎంతోమంది నమ్మకమైన సాక్షులు, తమ క్రైస్తవ తటస్థతను బట్టి అక్కడికి పంపబడ్డారు. వారు అలా బహిష్కరించబడడానికి కారకులు సాధారణంగా గ్రీక్‌ ఆర్థడాక్స్‌ మతనాయకులే, వారు సాక్షులను కమ్యూనిస్టులని నిందారోపణ చేశారు.

మాక్రోనిసోస్‌లో ఉపయోగించబడే “దిద్దుబాటు” అనే ప్రక్రియ గురించి పాపిరోస్‌ లారొస్సె బ్రిటానికా అనే గ్రీక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “క్రూరమైన హింసా పద్ధతులు, . . . జీవన పరిస్థితులు నాగరిక దేశానికి అనంగీకృతమైనవి, ఖైదీలపట్ల గార్డుల నీచమైన ప్రవర్తన . . . గ్రీస్‌ చరిత్రకు ఒక మాయని మచ్చ.”

తమ మత నమ్మకాలను వదులుకుంటేనేగానీ విడుదల చేయడం జరగదని కొంతమంది సాక్షులకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ, సాక్షుల విశ్వసనీయత చెక్కుచెదరలేదు. అంతకంటే ముఖ్యంగా, కొంతమంది రాజకీయ ఖైదీలు సాక్షులతో పరిచయం మూలంగా బైబిలు సత్యాన్ని స్వీకరించారు.

[27వ పేజీలోని చిత్రం]

మినోస్‌ కొకీనాకీస్‌ (కుడివైపు నుండి మూడవ వ్యక్తి), నేను (ఎడమవైపు నుండి నాలుగవ వ్యక్తి) కారాగార శిక్ష విధించబడే మాక్రోనిసోస్‌ ద్వీపంపై

[29వ పేజీలోని చిత్రం]

నేను యౌవనుడిగా ఉన్నప్పుడు సేవ చేసిన క్రేతులోని సిటీలో తోటి సాక్షితో కలిసి పనిచేయడం