కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పనిపట్ల సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?

పనిపట్ల సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?

పనిపట్ల సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?

ప్రపంచ మార్కెట్‌లు, క్రూరమైన పోటీ స్వభావము, భారీ ఉత్పత్తులు వంటివాటితో అధిక ఒత్తిడితోవున్న నేటి లోకంలో చాలామంది ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళడానికి ఇష్టపడరు. అయినప్పటికీ మనం మన పనిలో ఆనందాన్ని పొందాలి. ఎందుకు? ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము​—⁠దేవుడు తను చేసే పనిలో ఆనందిస్తాడు. ఉదాహరణకు ఆరు సృష్టి “దినములు” లేదా సుదీర్ఘ కాలాల తర్వాత తాను చేసిన దాన్ని పర్యవేక్షించినప్పుడు, “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను” అని ఆదికాండము 1:31వ వచనం చెబుతోంది.

యెహోవా “సంతోషంగల దేవుడు” అని పిలువబడడానికి ఒక కారణం, నిస్సందేహంగా పనిపట్ల ఆయనకున్న ప్రేమే. (1 తిమోతి 1:​8, NW) కాబట్టి మనం ఆయనను ఎంత ఎక్కువగా అనుకరిస్తే మనం అంత ఎక్కువగా సంతోషిస్తామనడం సహేతుకం కాదంటారా? ఈ విషయం గురించి విశిష్ఠ నిర్మాణకుడు, వ్యవస్థాపకుడు, ప్రాచీన ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను ఇలా వ్రాశాడు: “ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే.”​—⁠ప్రసంగి 3:13.

అతి వేగంగా మారిపోతున్న నేటి ఉద్యోగపరిస్థితుల్లో పని పట్ల సమతుల్యమైన, ఆరోగ్యకరమైన దృక్కోణాన్ని పెంపొందించుకోవడం సవాలుగా ఉండవచ్చు. అయితే యెహోవా దేవుడు తన ప్రేమపూర్వక నడిపింపును లక్ష్యపెట్టేవారిని ఆశీర్వదిస్తాడు. (కీర్తన 119:​99, 100) అలాంటివారు విలువైన, నమ్మకస్థులైన ఉద్యోగస్థులుగా ఉంటారు కాబట్టి ఉద్యోగం కోల్పోయే అవకాశాలు వారికి తక్కువగా ఉంటాయి. వారు తమ జీవితాన్ని, ఉద్యోగాన్ని కేవలం ఆర్థిక దృక్కోణం నుండి మాత్రమే కాక ఆధ్యాత్మిక దృక్కోణం నుండి కూడా చూడడం నేర్చుకుంటారు. వారు జీవితంలో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంతోషము భద్రతా భావము కేవలం తమ ఉద్యోగానికి లేదా తరచూ మారుతుండే ఉద్యోగ మార్కెట్‌కు మాత్రమే పరిమితం కాదని గ్రహించడానికి అది సహాయం చేస్తుంది. (మత్తయి 6:31-33; 1 కొరింథీయులు 2:​14, 15) నిజంగా ఉద్యోగంలో సమతుల్యమైన విధంగా నీతి నియమాలను పాటించడానికి అది వారికి సహాయపడుతుంది.

దేవుణ్ణి ప్రీతిపరిచేలా ఉద్యోగంలో నీతి నియమాలను పాటించండి

కొంతమంది తమ ఉద్యోగానికే ప్రథమ స్థానాన్నిస్తూ పనికి బానిసలైపోతారు. ఇతరులు తమ రోజు ఎప్పుడు ముగుస్తుందా పని కట్టేసి ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని ఆత్రుతతో ఎదురు చూస్తుంటారు. మరి సమతుల్యమైన దృక్కోణమంటే ఏమిటి? బైబిలిలా సమాధానమిస్తోంది: “శ్రమయును గాలికైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మది కలిగియుండుట మేలు.” (ప్రసంగి 4:⁠6) నిజానికి మరీ కష్టపడి పనిచేయడం లేదా మరీ ఎక్కువ సమయం పనిచేయడం మన లక్ష్యాన్ని సాధించేందుకు సహాయపడే బదులు సమస్యలకు దారితీస్తుంది, అది వ్యర్థమైన “గాలికైన యత్నము.” ఎందుకలా? ఎందుకంటే అలా చేయడం ద్వారా మనం మన సంతోషానికి కారణమైన వాటికి​—⁠మన కుటుంబంతో మన స్నేహితులతో ఉన్న సంబంధానికి, మన ఆధ్యాత్మికతకు, మన ఆరోగ్యానికి, చివరికి దీర్ఘాయుష్షుకు కూడా​—⁠బాగా హాని కలిగించుకుంటుండవచ్చు. (1 తిమోతి 6:​9, 10) కలహాలు దైన్యస్థితులతో అదనపు పని భారాన్ని మోసే బదులు కాస్త శాంతిని అనుభవిస్తూ తక్కువ సంపదలతో సంతృప్తి చెందడమే సమతుల్యమైన దృక్కోణం.

ఇలాంటి సమతుల్యమైన దృక్కోణాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు బైబిలు సోమరితనాన్ని ఆమోదించడం లేదు. (సామెతలు 20:⁠4) సోమరితనం మన ఆత్మ గౌరవాన్ని, ఇతరులకు మనపట్ల ఉండే గౌరవాన్ని క్రమంగా నాశనం చేస్తుంది. అంతకంటే ఎక్కువగా దేవునితో మనకున్న సంబంధానికి కూడా హాని కలుగజేస్తుంది. పనిచేయడానికి నిరాకరించే వ్యక్తి ఇతరుల ఖర్చుతో భోజనం చేయడానికి అర్హుడు కాదని బైబిలు నిర్మొహమాటంగా చెబుతోంది. (2 థెస్సలొనీకయులు 3:​10) బదులుగా ఆ వ్యక్తి తన జీవిత విధానాన్ని మార్చుకొని కష్టపడి పనిచేయాలి, అలా ఆయన తనకోసమూ తనపై ఆధారపడివున్న వారి కోసమూ గౌరవప్రదమైన రీతిలో ఆహారాన్ని సంపాదించుకుంటాడు. కష్టపడి పనిచేయడం ద్వారా ఆయన నిజంగా అవసరంలో ఉన్న వారికి సహాయం చేసే అవకాశం కూడా ఉంది​—⁠ఆ అలవాటును దేవుని వాక్యం ప్రోత్సహిస్తోంది.​—⁠సామెతలు 21:25, 26; ఎఫెసీయులు 4:​27, 28.

పనిని గౌరవించేలా బాల్యంనుండే శిక్షణ పొందడం

పనిచేయడంలోని మంచి అలవాట్లు వాటంతటవే రావు; బాల్యం నుండే వాటిని నేర్చుకోవాలి. అందుకే బైబిలు తల్లిదండ్రులకు ఇలా ఉద్బోధిస్తోంది: “బాలుడు [లేదా బాలిక] నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” (సామెతలు 22:⁠6) వివేచనగల తల్లిదండ్రులు తాము పనివారిగా మంచి మాదిరిని ఉంచడంతోపాటు, తమ పిల్లల వయస్సుకు తగినట్లు వారికి ఇంట్లో పనులను అప్పజెప్పడం ద్వారా వారికి శిక్షణనివ్వడం ప్రారంభిస్తారు. కొన్ని పనులు చేయడానికి పిల్లలు ఇష్టపడకపోయినప్పటికీ వారు తమను తాము కుటుంబంలో విలువైన సభ్యులుగా పరిగణించుకోవడం ప్రారంభిస్తారు, ప్రత్యేకించి వారు చక్కగా చేసిన పనిని వారి తల్లిదండ్రులు మెచ్చుకున్నప్పుడు అలా జరుగుతుంది. అయితే విషాదకరమైన విషయమేమిటంటే, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను మరీ గారాబం చేస్తూ వారి పట్ల ప్రేమ చూపిస్తున్నామని పొరబడుతుంటారు. అలాంటి తల్లిదండ్రులు సామెతలు 29:​21, NW వచనంలోని మాటల గురించి ఆలోచించడం మంచిది, అక్కడ ఇలా చెప్పబడుతోంది: “ఒకడు తన దాసుని [లేదా పిల్లవాడిని] చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదకు వాడు కృతజ్ఞతలేని వాడిగా తయారవుతాడు.”

బాధ్యతగల తల్లిదండ్రులు తమ పిల్లల విద్య గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని, స్కూల్లో ఉన్నప్పుడే కష్టపడి పని చేయడాన్ని నేర్చుకొమ్మని, కష్టపడి పనిచేయమని వారిని ప్రోత్సహిస్తారు. పిల్లలు తర్వాత ఉద్యోగాల్లో చేరినప్పుడు ఆ శిక్షణ వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

పనిని జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకోండి

మనం ఎలాంటి పని చేయాలో బైబిలు చెప్పకపోయినప్పటికీ అది మన ఆధ్యాత్మిక అభివృద్ధి, దేవునికి మనం చేసే సేవ, మన ఇతర ముఖ్యమైన బాధ్యతలతో రాజీ పడకుండా ఉండడానికి మనకు చక్కని మార్గనిర్దేశకాలను ఇస్తోంది. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట . . . ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.” (1 కొరింథీయులు 7:​29-31) ఈ ప్రస్తుత విధానంలో ఏదీ శాశ్వతం కాదు, పూర్తిగా స్థిరమైనది కాదు. దానికోసం మన మొత్తం సమయాన్నీ శక్తినీ ఇవ్వడం, మనం మన జీవితమంతా పొదుపు చేసుకున్న డబ్బును వరదలు వచ్చే ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి ఖర్చుచేయడం వంటిది. అది ఎంత అవివేకమైన పెట్టుబడో కదా!

“అమితముగా అనుభవింపనట్టు” అనే పదబంధాన్ని ఇతర బైబిలు అనువాదాలు “దానిలో లీనమైపోకుండా,” “వాటిలో పూర్తిగా నిమగ్నమైపోకుండా” అని అనువదించాయి. (ద జెరూసలేమ్‌ బైబిల్‌; టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌) ఈ ప్రస్తుత విధానానికున్న “కాలము సంకుచితమై” ఉందనే వాస్తవాన్ని వివేకవంతులు చూసీచూడనట్లు ఎన్నడూ వదిలేయరు, ఈ విధానంలో ‘లీనమైపోవడం’ లేదా ‘పూర్తిగా నిమగ్నమైపోవడం’ తప్పకుండా నిరాశకు దుఃఖానికి దారితీస్తుంది.​—⁠1 యోహాను 2:15-17.

‘దేవుడు నిన్ను ఎన్నడును ఎడబాయడు’

యెహోవాకు మన అవసరాల గురించి మనకంటే బాగా తెలుసు. ఆయన సంకల్ప నెరవేర్పుకు సంబంధించి కాలగతిలో మనము ఎక్కడున్నామో కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆయన మనకిలా గుర్తుచేస్తున్నాడు: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. —నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే [దేవుడే] చెప్పెను గదా.” (హెబ్రీయులు 13:⁠5) ఆ మాటలు ఎంత ఓదార్పుకరమైనవో కదా! దేవునికి తన ప్రజలపట్ల ఉన్న ప్రేమపూర్వకమైన శ్రద్ధను అనుకరిస్తూ, యేసు తన శిష్యులకు పనిపట్ల భౌతికపరమైన విషయాలపట్ల సరైన దృక్కోణం గురించి నేర్పించడానికి ప్రసిద్ధి చెందిన కొండ మీది ప్రసంగంలోని ఎక్కువ భాగాన్ని ఉపయోగించాడు.​—⁠మత్తయి 6:19-33.

యెహోవాసాక్షులు ఆ బోధనలను లక్ష్యపెట్టడానికి కృషి చేస్తారు. ఉదాహరణకు, ఎలక్ట్రీషియన్‌ అయిన ఒక సాక్షిని రోజూ ఓవర్‌టైం చేయమని ఆయన యజమాని అడిగినప్పుడు, ఆయన అందుకు నిరాకరించాడు. ఎందుకు? ఆయన తన కుటుంబం కోసం ఆధ్యాత్మిక విషయాల కోసం కేటాయించే సమయాన్ని తన ఉద్యోగం దోచుకోవడాన్ని ఆయన ఇష్టపడలేదు. ఆయన నమ్మకస్థుడైన ఒక మంచి ఉద్యోగి కాబట్టి ఆయన యజమాని ఆయన ఇష్టాన్ని గౌరవించాడు. అయితే అన్ని సందర్భాల్లోనూ అలా జరగదు కాబట్టి సమతుల్యమైన జీవిత విధానాన్ని కొనసాగించడానికి ఒక వ్యక్తి వేరే ఉద్యోగం వెతుక్కోవలసి రావచ్చు. అయినప్పటికీ తమ పూర్తి విశ్వాసాన్ని యెహోవాపై ఉంచేవారు, సాధారణంగా తమ మంచి ప్రవర్తన, ఉద్యోగంలో నీతి నియమాలను పాటించడం తమ యజమాని అభిమానాన్ని చూరగొంటాయని గ్రహిస్తారు.​—⁠సామెతలు 3:5, 6.

ప్రతీ పని ప్రతిఫలదాయకంగా ఉండే సమయం

ప్రస్తుత అపరిపూర్ణ విధానంలో, ఉద్యోగాలూ ఉద్యోగావకాశాలూ సమస్యల నుండీ సందిగ్ధావస్థల నుండీ అతీతంగా ఎప్పటికీ ఉండలేవు. నిజానికి లోకం మరింత అస్థిరంగా తయారవుతుండగా, ఆర్థిక పరిస్థితులు క్షణక్షణానికి మారిపోతుండగా లేదా విఫలమవుతుండగా పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారు కావచ్చు. కానీ ఈ పరిస్థితి తాత్కాలికమైనదే. త్వరలోనే, ఎవ్వరూ నిరుద్యోగులుగా ఉండరు. అంతేకాదు ప్రతీ పని నిజంగా ఆసక్తికరంగా, ప్రతిఫలదాయకంగా ఉంటుంది. అదెలా సాధ్యం? అలాంటి మార్పు ఎలా వస్తుంది?

యెహోవా తన ప్రవక్త యెషయా ద్వారా అలాంటి సమయాన్ని సూచించాడు. “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు” అని యెహోవా చెప్పాడు. (యెషయా 65:​17) ఆయన తన కొత్త ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రభుత్వము క్రింద, పూర్తిగా కొత్తదైన ఒక భిన్నమైన మానవ సమాజం వాస్తవంగా మారుతుంది.​—⁠దానియేలు 2:⁠44.

అప్పుడు ప్రజలు జీవించే విధానం గురించీ వారు పనిచేసే విధానం గురించీ చెబుతూ ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మిముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.”​—⁠యెషయా 65:21-23.

దేవుడు రూపొందించే ఆ కొత్త లోకం తెచ్చే మార్పు ఎంత విశేషమైనదో కదా! మీరు “వృథాగా ప్రయాసపడ”కుండా మీ శ్రమ “ఫలమును” పూర్తిగా అనుభవించే అలాంటి లోకంలో జీవించడానికి మీరు ఇష్టపడరా? అయితే అలాంటి ఆశీర్వాదాలను ఎవరు అనుభవిస్తారో గమనించండి: “యెహోవాచేత ఆశీర్వదింపబడినవా[రు].” యెహోవా గురించి నేర్చుకొని ఆయన కోరేవాటిని చేయడం ద్వారా మీరు కూడా ఆ “ఆశీర్వదింపబడిన” వారిలో ఒకరిగా ఉండవచ్చు. యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) దేవుని వాక్యమైన బైబిలును ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేయడం ద్వారా జీవాన్నిచ్చే ఆ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీకు సహాయపడేందుకు యెహోవాసాక్షులు సంతోషిస్తారు.

[6వ పేజీలోని బాక్సు]

“సాక్షులు కావాలి”

“మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి” అని బైబిలు చెబుతోంది. (కొలొస్సయులు 3:​23) ఒక వ్యక్తి ఈ చక్కని సూత్రంచే నియంత్రించబడి ఉద్యోగంలో నీతి నియమాలను పాటిస్తే, ఆయన తప్పకుండా కోరదగ్గ ఉద్యోగస్థుడిగా ఉంటాడు. ఆ కారణంగానే, హౌ టు బి ఇన్‌విజిబుల్‌ అనే తన పుస్తకంలో జె. జె. లూనా, ఉద్యోగస్థుల కోసం వెదికే యజమానులకు నిర్దిష్టమైన మత గుంపులలోని చురుకైన సభ్యుల కోసం వెదకమని సలహా ఇస్తున్నాడు, అయితే ఆయన ఇలా కూడా అంటున్నాడు: “వాస్తవం ఏమిటంటే సాధారణంగా మనం [యెహోవా] సాక్షులకే ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకుంటాము.” ఆయన ఇచ్చిన కారణాలలో ఒకటి, యెహోవాసాక్షులు తమ నిజాయితీకి పేరుగాంచారు కాబట్టి వివిధ పనుల కోసం “సాక్షులు కావాలి.”

[5వ పేజీలోని చిత్రాలు]

ఉద్యోగాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాలతో వినోదంతో సమతుల్యం చేయడం సంతృప్తిని తెస్తుంది