మీ చేతులను బలపర్చుకోండి
మీ చేతులను బలపర్చుకోండి
బైబిలులో చేతిని గురించి వందలాది సార్లు ప్రస్తావించబడింది. హీబ్రూ భాషలో చేతిని గురించిన నుడికారాలు వివిధ రీతుల్లో ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు, పరిశుద్ధమైన చెయ్యి నిర్దోషత్వాన్ని సూచిస్తుంది. (2 సమూయేలు 22:21, ఈజీ-టు-రీడ్-వర్షన్; కీర్తన 24:3, 4) గుప్పిలిని విప్పడం అంటే ఇతరులపట్ల ఉదారతను చూపించడం అని అర్థం. (ద్వితీయోపదేశకాండము 15:11; కీర్తన 145:16) తన ప్రాణానికి తెగించిన వ్యక్తి గురించి మాట్లాడుతూ అతడు తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు అని చెప్పబడుతోంది. (1 సమూయేలు 19:5, NW) ఒకరు తమ చేతులను క్రిందికి దించేయడం నిరుత్సాహాన్ని సూచిస్తుంది. (2 దినవృత్తాంతములు 15:7, NW) ఒకరి చేతిని బలపర్చడం అంటే, పనిచేయడానికి ధైర్యమివ్వడం, శక్తిని కలిగించడం అని అర్థం.—1 సమూయేలు 23:16, NW.
నేడు మన చేతులను బలపర్చుకోవలసిన అత్యవసర పరిస్థితి ఉంది. మనం “అపాయకరమైన కాలముల”లో జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1) మనం నిరుత్సాహపడినప్పుడు, మన చేతులు బలహీనమైపోయినట్లు వాటిని క్రిందికి దించేయడం, అది మనకు సాధ్యం కాదు అని వదిలివేయడం మానవ నైజం. కౌమారప్రాయంలోనివారు స్కూలును విడిచిపెట్టడం, భర్తలు తమ కుటుంబాలను వదిలివేయడం, తల్లులు తమ పిల్లలను వదిలివేయడం సాధారణమైపోయింది. క్రైస్తవులుగా, మనం దేవునికి చేసే సేవలో మనకు ఎదురయ్యే కష్టాలను సహించడానికి మన చేతులను బలపర్చుకోవలసిన అవసరముంది. (మత్తయి 24:13) మనమలా చేయడం ద్వారా యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తాము.—సామెతలు 27:11.
చేతులు ఎలా బలపడతాయి
యెరూషలేములోని యెహోవా ఆలయ పునర్నిర్మాణాన్ని పూర్తిచేయడానికి ఎజ్రా కాలానికి చెందిన యూదులు తమ చేతులను బలపర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. వారి చేతులు ఎలా బలపడ్డాయి? ఆ నివేదిక ఇలా చెబుతోంది: “ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.” (ఎజ్రా 6:22) తన ప్రజలు తిరిగి రావడానికి అనుమతించేలా యెహోవా “అష్షూరురాజు”ను తన చురుకైన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించాడు, వారు ప్రారంభించిన పనిని పూర్తిచేసేలా దేవుడు తన ప్రజల మనస్సులను ప్రేరేపించాడన్నది స్పష్టమౌతుంది.
తర్వాత, యెరూషలేము గోడలకు మరమ్మత్తు చేయవలసి వచ్చినప్పుడు, ఆ పని చేయడానికి నెహెమ్యా తన తోటి యూదుల చేతులు బలపర్చాడు. మనమిలా చదువుతాము: “నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు—మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.” బలం తెచ్చుకున్న చేతులతో, నెహెమ్యా మరియు అతని తోటి యూదులు ఆశ్చర్యకరంగా కేవలం 52 రోజులలోనే యెరూషలేము గోడలను పునర్నిర్మించగలిగారు!—నెహెమ్యా 2:18; 6:9, 15.
అదేవిధంగా, రాజ్య సువార్తను ప్రకటించడానికి యెహోవా మన చేతులను బలపరుస్తాడు. (మత్తయి 24:14) “ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచ[డం]” ద్వారా ఆయనలా చేస్తాడు. (హెబ్రీయులు 13:20, 21) ఆయన మన చేతులలో అత్యధిక నాణ్యతగల ఉపకరణాలను పెట్టాడు. ప్రపంచవ్యాప్తంగావున్న ప్రజలను చేరుకోవడానికి మనం ఉపయోగించేందుకు బైబిలు మరియు బైబిలు ఆధారిత పుస్తకాలు, పత్రికలు, బ్రోషుర్లు, కరపత్రాలు, ఆడియో వీడియో రికార్డింగ్లు ఉన్నాయి. నిజానికి మన ప్రచురణలు 380 కంటే ఎక్కువ భాషలలో లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా సంఘ కూటాల ద్వారా, ప్రత్యేక ప్రాంతీయ జిల్లా సమావేశాల ద్వారా మనం ఈ మంచి ఉపకరణాలను మన పరిచర్యలో ఎలా ఉపయోగించాలో నేర్పించడానికి, యెహోవా దైవపరిపాలనా విద్యనూ శిక్షణనూ అందిస్తున్నాడు.
యెహోవా ఇలాంటి ఎన్నో పద్ధతుల ద్వారా మన చేతులను బలపరుస్తున్నప్పటికీ, మనం కూడా కృషి చేయాలని ఆయన ఆశిస్తాడు. సిరియను ఆక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడడానికి సహాయం కోసం యెహోయాషు రాజు ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు, ఎలీషా ఆ రాజుతో ఏమి చెప్పాడో గుర్తు చేసుకోండి. కొన్ని బాణాలను తీసుకుని నేలకు కొట్టమని ఎలీషా ఆ రాజుకు చెప్పాడు. బైబిలు నివేదిక ఇలా చెబుతోంది: “అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి—నీవు అయిదు మారులైన ఆరుమారులైన కొట్టిన యెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.” (2 రాజులు 13:18, 19) ఆసక్తితో తీవ్రంగా కృషి చేయడంలో విఫలమైనందువల్ల, సిరియనులతో పోరాడినప్పుడు యెహోయాషు కొంత విజయాన్ని మాత్రమే సాధించాడు.
యెహోవా మనకు ఇచ్చిన పనిని సాధించాలనుకుంటే మనకు కూడా అదే సూత్రం అన్వయిస్తుంది. మన మార్గంలో ఉన్న ఆటంకాల గురించీ మన నియామకం ఎంత కష్టంగా ఉండగలదు అన్నదాని గురించీ చింతించే బదులు, మనం దాన్ని ఆసక్తితో, పూర్ణహృదయంతో చేయాలి. మనం మన చేతులను బలపర్చుకుని, సహాయం కోసం యెహోవా వైపు చూడవలసిన అవసరం ఉంది.—యెషయా 35:3, 4.
యెహోవా మన చేతులను బలపరుస్తాడు
ఆయన చిత్తాన్ని చేయడానికి మనకు సహాయం చేసేందుకు యెహోవా మన చేతులను బలపర్చడంలో విఫలం కాడు. అయితే, దేవుడు ఒక అద్భుతాన్ని చేయడు, మన కోసం అన్ని పనులు చేయడు. మనం మన వంతు చేయాలని ఆయన ఆశిస్తాడు—రోజూ బైబిలు చదవడం, కూటాలకు సిద్ధపడి క్రమంగా హాజరవ్వడం, వీలైనంత తరచుగా పరిచర్యలో భాగం వహించడం, ఆయనకు తదేకంగా ప్రార్థించడం. మనకు అవకాశం ఉన్నప్పుడే నమ్మకంగా, శ్రద్ధగా మన వంతు మనం చేస్తే, తాను మన నుండి కోరేవాటిని మనం చేయడానికి యెహోవా మనకు బలాన్నిస్తాడు.—ఫిలిప్పీయులు 4:13.
తన భార్యనూ తల్లినీ ఒక సంవత్సరంలోపే మరణంలో కోల్పోయిన ఒక క్రైస్తవుని ఉదాహరణే తీసుకోండి. తాను ఆ దుఃఖం నుండి బయట పడకముందే ఆయన కోడలు ఆయన కుమారున్ని వదిలి, క్రైస్తవ జీవిత విధానాన్ని విడిచిపెట్టేసింది. “మనం మన కష్టాలను గానీ అవి సంభవించే సమయాన్ని గానీ అవి ఎంత తరచుగా వస్తాయన్నదాన్ని గానీ ఎంపిక చేసుకోలేమని నేను నేర్చుకున్నాను” అని ఆ సహోదరుడు అన్నాడు. దేవుని చిత్తాన్ని చేయడంలో ముందుకు కొనసాగడానికి ఆయనకు బలం ఎక్కడనుండి వచ్చింది? “ప్రార్థన చేయడం మరియు వ్యక్తిగత అధ్యయనం చేయడమే నాకు రక్షణ కవచంగా ఉండి నా జీవితాన్ని కాపాడాయి. నా ఆధ్యాత్మిక సహోదర సహోదరీల మద్దతు నాకు ఎంతో ఓదార్పునిచ్చింది. అన్నింటినీ మించి, కష్టమైన పరిస్థితులు తలెత్తకముందే యెహోవాతో మంచి వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవలసిన ప్రాముఖ్యతను నేను గ్రహించాను” అని ఆ సహోదరుడు చెబుతున్నాడు.
మీ జీవితంలో మీ అనుభవం ఏదైనప్పటికీ యెహోవాపై పూర్తి నమ్మకాన్నుంచి, మన చేతులను బలపర్చడానికి ఆయన చేసిన ఏర్పాట్లన్నింటినీ మంచిగా ఉపయోగించుకోవాలనే దృఢనిశ్చయతతో ఉండండి. అప్పుడు మీరు యెహోవాకు అత్యధిక నాణ్యమైన సేవను అందించగలుగుతారు, తద్వారా ఆయన ప్రశస్తమైన నామానికి స్తుతినీ ఘనతనూ తెస్తారు.—హెబ్రీయులు 13:15.
[31వ పేజీలోని చిత్రం]
ఆసక్తితో తీవ్రంగా కృషిచేయడంలో విఫలమైనందువల్ల, సిరియన్లకు వ్యతిరేకంగా పోరాడడంలో యెహోయాషు కేవలం కొంత విజయాన్ని మాత్రమే సాధించగలిగాడు