కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

చిన్న మొత్తాలే అయినా పందెం కాయడం తప్పా?

దేవుని వాక్యం జూదమాడడం గురించి వివరంగా చర్చించడం లేదుగానీ ప్రతి విధమైన జూదమూ బైబిలు సూత్రాలకు విరుద్ధమైనదని చూపించడానికి తగినన్ని విషయాలను మాత్రం అది తెలియజేస్తోంది. * ఉదాహరణకు, జూదమాడడం దురాశను ఉత్పన్నం చేస్తుందన్నది సర్వ విదితమే. ఆ వాస్తవాన్ని క్రైస్తవులు ప్రాముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే ‘లోభులు’ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని చెబుతూ బైబిలు ధనాపేక్షను విగ్రహారాధనతో సమానమైనదిగా పరిగణిస్తోంది.​—⁠1 కొరింథీయులు 6:9, 10; కొలొస్సయులు 3:⁠5.

జూదం ఆత్మస్తుతిని, హానికరమైన పోటీతత్వాన్ని, విజయం సాధించాలనే బలమైన కోరికను కూడా ఉత్పన్నం చేస్తుంది. అపొస్తలుడైన పౌలు “ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము” అని వ్రాసినప్పుడు అలాంటి విషయాల గురించే హెచ్చరించాడు. (గలతీయులు 5:​26) అంతేగాక జూదం, కొందరు మూఢ నమ్మకంతో అదృష్టం మీద ఆధారపడేలా ప్రోత్సహిస్తుంది. జూదగాళ్ళు తమకు అదృష్టం దక్కేలా చేసుకోవాలని అన్ని రకాలైన మూఢనమ్మకాలను పెట్టుకుంటారు. దానితో వారు మనకు, ‘గాదునకు బల్లను సిద్ధపరచి, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించిన’ నమ్మకద్రోహులైన ఇశ్రాయేలీయులను జ్ఞప్తికి తెస్తారు.​—⁠యెషయా 65:​11.

బంధువులతో లేదా సన్నిహిత స్నేహితులతో స్నేహపూర్వకంగా పేకాట గానీ చైనీస్‌ చెక్కర్‌ వంటి ఇతర ఆటలు గానీ ఆడేటప్పుడు చిన్న మొత్తాల్లో పందెం కాయడం నిరపాయకరమైన వినోదం మాత్రమేనని కొందరు తర్కించవచ్చు. నిజమే చిన్న మొత్తంలో డబ్బు పందెం కాసే వ్యక్తి తనను తాను దురాశాపరునిగా అహంకారిగా పోటీతత్వంగలవాడిగా లేదా మూఢనమ్మకం ఉన్నవాడిగా దృష్టించుకోకపోవచ్చు. అయినా, తాను ఎవరితోనైతే జూదమాడుతున్నాడో ఆ వ్యక్తిపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపించగలదు? జూదానికి బాగా అలవాటుపడిపోయిన జూదగాళ్ళు అనేకులు ‘కేవలం తమాషాకు’ పందెం కాయడంతోనే ప్రారంభించారు. (లూకా 16:​10) నిరపాయకరమైన వినోదంగా అనిపించినది చివరికి వారికి ఎంతో ప్రమాదకరమైనదిగా పరిణమించింది.

పిల్లల విషయానికి వస్తే అది ప్రాముఖ్యంగా నిజం. చాలామంది పిల్లలు చిన్న చిన్న పందాలలో గెలుపొందడం వల్ల కలిగే ఉత్తేజాన్ని చవిచూసి పెద్ద పందాలు కాయాలనే ప్రలోభానికి గురయ్యారు. (1 తిమోతి 6:​10) జూదమాడడమనే వ్యసనానికి సంబంధించి ఆరిజోనా కౌన్సిల్‌ అమెరికాలో ప్రచురించిన ఒక దీర్ఘకాల అధ్యయనం, జూదానికి బానిసలైన వారు “క్రీడా సంఘటనలపై లేదా స్నేహితులతో బంధువులతో పేకాట ఆడేటప్పుడు చిన్న చిన్న పందాలు కాయడం ద్వారా” లేత వయస్సులోనే జూదమాడడం ప్రారంభించారని ధృవీకరిస్తోంది. “పిల్లలు సాధారణంగా కుటుంబంతో స్నేహితులతో పేకాట ఆడడం ద్వారా ఇంటివద్దనే జూదమాడడం ప్రారంభిస్తారు” అని మరో నివేదిక చెబుతోంది. “జూదమాడడం మొదలుపెట్టిన పిల్లల్లో ముప్ఫై శాతం తమ పదకొండవ పుట్టినరోజుకు ముందే మొదలు పెట్టారు” అని ఆ నివేదిక జతచేస్తోంది. వై డూ పీపుల్‌ గాంబుల్‌ టూ మచ్‌​—⁠పాథలాజికల్‌ అండ్‌ ప్రాబ్లెమ్‌ గాంబ్లింగ్‌ అనే అధ్యయనం ప్రకారం, జూదమాడే చాలామంది యౌవనస్థులు నేరాలు చేసి లేదా అవినీతికి పాల్పడి తమ వ్యసనానికి కావలసిన డబ్బును సంపాదించుకుంటారు. మొదట్లో నిరపాయకరమైనదిగా కనిపించిన దానికి ఎంతటి దుఃఖకరమైన పర్యవసానం!

ఇప్పటికే ఎన్నో ఉరులు, శోధనలు ఉన్న లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి మనం అనవసరంగా మరో దానికి బలయ్యేలా చేసుకోవడం ఎందుకు? (సామెతలు 27:​12) జూదమాడడం​—⁠పిల్లలు అక్కడున్నా లేకపోయినా, చిన్న మొత్తాలకైనా పెద్ద మొత్తాలకైనా​—⁠ఆధ్యాత్మికతను ప్రమాదంలో పడవేస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండాలి. చైనీస్‌ చెక్కర్‌ వంటి ఆటలను లేదా పేకాటను వినోదంలా ఆనందించే క్రైస్తవులకు, కేవలం స్కోర్‌ రాసి పెట్టుకుని లేదా అసలేమీ రాయకుండానే కేవలం తమాషాకు ఆడమని ఉపదేశించడం మంచిది. తమ స్వంత ఆధ్యాత్మికత గురించి అలాగే తమ స్నేహితుల కుటుంబీకుల ఆధ్యాత్మికత గురించి శ్రద్ధగల జ్ఞానవంతులైన క్రైస్తవులు కేవలం చిన్న మొత్తానికే అయినా జూదమాడడానికి దూరంగా ఉంటారు.

[అధస్సూచి]

^ పేరా 3 వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా జూదాన్ని “ఒక ఆట, క్రీడ, లేదా యాదృచ్ఛిక సంఘటన యొక్క ఫలితంపై పందెం కాయడం” అని నిర్వచిస్తోంది. “జూదగాళ్ళు లేదా ఆటగాళ్ళు సాధారణంగా లాటరీలు, పేకాటలు, పాచికలాటలు వంటి అదృష్టం మీద ఆధారపడే ఆటలపై . . . డబ్బును పందెం కాస్తారు.”