బాల్కన్ రాష్ట్రాలలో ఆనందభరితమైన సమయం
బాల్కన్ రాష్ట్రాలలో ఆనందభరితమైన సమయం
అది 1922వ సంవత్సరం. అప్పట్లో శ్రద్ధగల బైబిలు విద్యార్థులని పిలువబడిన యెహోవాసాక్షులు, ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రక్‌లో ఒక కూటాన్ని నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులలో, సెర్బియాలోని వోజ్‌వొడినాలోవున్న అపటీన్‌నుండి వచ్చిన యువకుడైన ఫ్రాన్జ్ బ్రాండ్ ఉన్నాడు. దేవుని పేరు యెహోవా అని ప్రసంగీకుడు పేర్కొన్న వెంటనే, ఒక గుంపు అవహేళన చేయడం ప్రారంభించడంతో, ఆయన ప్రసంగాన్ని కొనసాగించడం అసాధ్యమైంది, కూటం ముగించబడింది. అయినప్పటికీ ఫ్రాన్జ్ విన్న సమాచారం ఆయనపై గాఢమైన ముద్ర వేసింది, ఆయన రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. బాల్కన్ రాష్ట్రాలలోని ఒక దానిలో జరిగిన ఉత్తేజకరమైన ఆధ్యాత్మిక పెరుగుదలకు ఈ సంఘటనలు చిన్న చిన్న ఆరంభాలు.
నేడు చాలామంది ప్రజలకు, యుగోస్లావియా అనే పేరు వినగానే యుద్ధం, సామూహిక వధ మనస్సుకు వస్తాయి. బాధ కలిగించే ఘోరమైన సామూహిక సంహారాలు, నిరాశతోవున్న శరణార్థులు, నాశనం చేయబడిన గృహాలు, తీవ్రబాధతోవున్న అనాథల దృశ్యాలు మనస్సుకు వస్తాయి. మానవ కృషి ద్వారా సాధ్యమయ్యే సంపన్నమైన, చింతలు లేని భవిష్యత్తుకు సంబంధించిన నిరీక్షణను పూర్తిగా నాశనం చేస్తూ 1991 నుండి 1995 వరకు బాల్కన్ ద్వీపకల్పాన్ని దోచుకున్న యుద్ధం కలుగజేసిన తీవ్రమైన శారీరక, భావోద్రేక బాధను, ఆందోళనను పదాలు వర్ణించలేవు. యుద్ధం ఫలితంగా, మునుపటి యుగోస్లావియాలోని ప్రజలు ఆర్థిక కష్టాలను, ఘోరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. *
ఇలాంటి బాధలు ఉండడం వల్ల, ఆ ప్రాంతంలో ఆనందభరితులైన ప్రజలు ఉంటారని ఎవ్వరూ అనుకోరు. కాని అక్కడ ఆనందభరితులైన ప్రజలు ఉన్నారన్న విషయం వింతగా అనిపించవచ్చు. నిజానికి, 20వ శతాబ్దం చివరి భాగంలో ఈ ఆనందభరితులైన ప్రజలు ఒక రోజు ప్రత్యేకమైన సంతోషాన్ని అనుభవించారు. ఆ సంతోషకరమైన సమయానికీ ప్రారంభంలో పేర్కొనబడిన ఫ్రాన్జ్ బ్రాండ్ అనే యువకుడికీ సంబంధం ఏమిటి?
బాల్కన్ రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక పెరుగుదల
ఫ్రాన్జ్ బ్రాండ్ తాను విన్న క్రొత్త సత్యాల గురించి ఉత్తేజితుడై, సువార్తను వ్యాపింపజేయాలని నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రియా సరిహద్దు వద్ద ఉన్న స్లొవేనియాలోని మారిబోర్ నగరంలో ఆయన ఒక మంగలిగా పని సంపాదించుకుని, తన కస్టమర్లకు ప్రకటించడం ప్రారంభించాడు. వారు సాధారణంగా షేవింగ్ చేయించుకునేటప్పుడు కూర్చుని ఆయన చెప్పేది నిశ్శబ్దంగా వినేవారు. ఆయన చేసిన కృషి
ఫలితంగా 1920ల చివరి భాగంలో మారిబోర్‌లో రాజ్య ప్రచారకుల చిన్న గుంపు తయారయ్యింది. బైబిలు ప్రసంగాలు ఒక రెస్టారెంటులో ఇవ్వబడేవి. ఆ రెస్టారెంటుకు తర్వాత నోవి స్వెట్ (క్రొత్త లోకం) సముద్ర ఆహారపు రెస్టారెంట్ అని పేరుపెట్టబడింది.కొంత కాలానికి ఆ ప్రాంతమంతటా సువార్త వ్యాపించింది. “ఫోటో-డ్రామా ఆఫ్ క్రియేషన్” (ఫిల్మ్‌లు, స్లైడ్‌లు, రికార్డింగ్‌లు చేరివున్న ఎనిమిది గంటల ప్రదర్శన) ఉపయోగం ఈ విస్తరణలో మంచి సాధనంగా పనిచేసింది. ఆ తర్వాత 1930లలో జర్మనీలో యెహోవాసాక్షులు తీవ్రంగా హింసించబడినప్పుడు, యుగోస్లావియాలోని సాక్షులు, తమ స్వదేశాన్ని వదిలి పారిపోయి వచ్చిన జర్మన్ పయినీర్ల ద్వారా బలపర్చబడ్డారు. వ్యక్తిగత సౌకర్యాన్ని అనుకూలతను పక్కనపెట్టి, కొండలతో వున్న ఆ దేశంలోని మారుమూల ప్రాంతాలలో ప్రకటించడానికి వారు కృషి చేశారు. మొదట్లో వారి సందేశానికి చాలా తక్కువ ప్రతిస్పందన ఉన్నట్లు కనిపించింది. 1940ల తొలి కాలంలో కేవలం 150 మంది ప్రచారకులు క్షేత్ర పరిచర్య చేసినట్లు రిపోర్టు ఇచ్చారు.
1941 లో తీవ్రమైన హింస ప్రారంభమై 1952వ సంవత్సరం వరకూ కొనసాగింది. చివరకు 1953వ సంవత్సరంలో సెప్టెంబరు 9వ తేదీన జనరల్ టీటోకు సంబంధించిన కమ్యూనిస్టు రెజీమ్ క్రింద యెహోవాసాక్షులు చట్టబద్ధంగా రిజిస్టర్ చేయబడినప్పుడు ఎంతటి సంతోషం కలిగిందో! ఆ సంవత్సరంలో 914 మంది సువార్త ప్రచారకులు ఉన్నారు, వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే వచ్చింది. 1991వ సంవత్సరానికల్లా ప్రచారకుల సంఖ్య 7,420కి చేరుకుంది, ఆ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు 16,072 మంది హాజరయ్యారు.
1991 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ నుండి 18వ తేదీ వరకూ, ఆ దేశంలోని యెహోవాసాక్షుల మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం క్రొయెషియాలోని జాగ్రేబ్‌లో నిర్వహించబడింది. ఆ దేశంనుండి, బయట దేశాలనుండి మొత్తం కలిపి 14,684 మంది సమావేశానికి హాజరయ్యారు. మరపురాని ఈ సమావేశం, రాబోయే కష్టాలకు యెహోవా ప్రజలను సిద్ధపరిచింది. క్రొయెషియాకు సెర్బియాకు మధ్యవున్న చెక్‌పాయింటును దాటిన చివరి వాహనాలలో, సెర్బియన్ ప్రతినిధులను ఇంటికి తీసుకువెళుతున్న బస్సులు ఉన్నాయి. ఆఖరి బస్సు చెక్‌పాయింటును దాటిన తర్వాత, సరిహద్దు మూయబడింది, యుద్ధం మొదలయ్యింది.
యెహోవా ప్రజలు సంతోషించడానికి కారణాలున్నాయి
యుద్ధం జరిగిన సంవత్సరాలు, బాల్కన్ రాష్ట్రాలలోని యెహోవాసాక్షులకు తీవ్రమైన పరీక్షా కాలాలుగా పరిణమించాయి. అయినప్పటికీ వారు సంతోషించడానికి కారణాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడున్న తన ప్రజలను యెహోవా అద్భుతమైన పెరుగుదలతో ఆశీర్వదించాడు. 1991వ సంవత్సరం నుండి మునుపటి యుగోస్లావియా ప్రాంతంలోని రాజ్య ప్రచారకుల సంఖ్య 80 కంటే ఎక్కువ శాతం పెరిగింది. 2001వ సంవత్సరంలో ప్రచారకుల సంఖ్య 13,472 శిఖరాగ్ర సంఖ్యకు చేరుకుంది.
జాగ్రేబ్, బెల్‌గ్రేడ్ (సెర్బియా)లలోని కార్యాలయాలు మునుపటి యుగోస్లావియా అంతటిలోని యెహోవాసాక్షుల పనిని పర్యవేక్షించేవి. యెహోవాసాక్షుల సంఖ్య పెరిగినందువల్ల, రాజకీయ మార్పులవల్ల, బెల్‌గ్రేడ్ జాగ్రేబ్‌లలో క్రొత్త కార్యాలయాలను సంపాదించుకోవడంతోపాటు జుబ్‌జానా (స్లొవేనియా), స్కోప్యే (మాసిడోనియా)లలో క్రొత్త కార్యాలయాలను స్థాపించవలసిన అవసరం ఏర్పడింది. ఈ కార్యాలయాలలో దాదాపు 140 మంది సేవచేస్తున్నారు. వారిలో అధిక శాతంమంది యౌవనస్థులు, యెహోవా పట్ల ఉత్సాహంతో, ప్రేమతో నింపబడివున్నారు. వారిలో చెప్పుకోదగినంత మంది బైబిలు అధ్యయన సహాయకాలను క్రొయెషియన్, మాసిడోనియన్, సెర్బియన్, స్లోవేనియన్ భాషలలోకి అనువదించే పనిలో భాగం వహిస్తున్నారు. యెహోవాసాక్షుల పత్రికలు, సాహిత్యంలోని అధికశాతం మూలప్రతి అయిన ఇంగ్లీషు సంచికలతో సమానంగా ఈ భాషలలో కూడా ప్రచురించబడడం ఎంతటి ఆశీర్వాదం! ఈ ప్రచురణలు అనేకమంది ప్రజలు ఓదార్పును నిరీక్షణను కనుగొనడానికి సహాయపడతాయి.
ఇతర దేశాలనుండి వచ్చిన అనేకమంది పూర్తికాల సేవకులు
నిస్వార్థంగా ప్రకటనా పనిలో అందిస్తున్న మద్దతు, సంతోషించడానికి మరో కారణాన్ని ఇస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో ఎన్నో అందమైన రాజ్యమందిరాలు నిర్మించబడ్డాయి, ఇది సంఘాల సంతోషాన్ని అధికం చేసింది. అయితే, వారికి మరింత సంతోషం కలుగనుంది. అదెలా?సాటిలేని ప్రాజెక్టు
‘మన భాషలో ఎప్పటికైనా న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ లభిస్తుందా?’ అని చాలామంది ప్రచారకులు తరచూ అనుకునేవారు. జిల్లా సమావేశంలో దాని గురించిన ప్రకటన వినడం కోసం వారు సంవత్సరాల తరబడి ఆతురతతో ఎదురుచూశారు. అయితే, ఈ భాషలకు సంబంధించిన అనువాద టీములు కేవలం కొద్ది సంవత్సరాల ముందే ప్రారంభించబడినందువల్ల, కేవలం కొద్దిమంది అనువాదకులు మాత్రమే ఉన్నందువల్ల ఇంతటి భారీ ప్రాజెక్టు ఎలా నిర్వహించబడుతుంది?
విషయాలను పరిశీలించిన తర్వాత క్రొయెషియన్, మాసిడోనియన్, సెర్బియన్ అనువాద టీములు సన్నిహితంగా సహకరించుకుంటూ, ఒకరి పనినుండి, సలహాలనుండి మరొకరు ప్రయోజనం పొందేలా ఒక జాయింట్ ప్రాజెక్టుకు పరిపాలక సభ ఆమోదాన్ని తెలిపింది. క్రొయెషియన్ టీము పర్యవేక్షించడానికి నియమించబడింది.
సంతోషించే రోజు
బాల్కన్ రాష్ట్రాల్లోని యెహోవాసాక్షులు 1999వ సంవత్సరం జూలై 23వ తేదీని ఎన్నడూ మరచిపోరు. “దేవుని ప్రవచన వాక్యం” జిల్లా సమావేశాలు బెల్‌గ్రేడ్, సారాయెవో (బోస్నియా-హెర్జెగోవినా), స్కోప్యే, జాగ్రేబ్‌లలో ఒకే సమయంలో నిర్వహించబడ్డాయి. కొంత సమయం వరకూ బెల్‌గ్రేడ్‌లో సమావేశం నిర్వహించబడుతుందా లేదా అన్న విషయంలో అనిశ్చయ పరిస్థితి నెలకొంది, ఎందుకంటే నాటో బాంబింగుల సమయంలో బహిరంగ కూటాలు అనుమతించబడేవి కాదు. నెలల తరబడి ఉన్న అనిశ్చయత తర్వాత మళ్ళీ కలిసి సహవసించే అవకాశం లభిస్తుందని తెలుసుకోవడానికి సహోదరులు ఎంతో సంతోషించారు! అయితే, అక్కడ జరిగినది వారి ఊహలను మించిపోయింది.
శుక్రవారం మధ్యాహ్నం, సమావేశం జరిగిన నాలుగు నగరాలలోనూ ఒక ప్రత్యేక ప్రకటన చేయబడింది. ఏమి చెప్పబడుతుందా అని హాజరైన 13,497 మంది నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నారు. చివరికి, ప్రసంగీకుడు క్రొయెషియన్, సెర్బియన్ భాషలలో న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ గ్రీక్ స్క్రిప్చర్స్‌ను విడుదల చేసి, మాసిడోనియన్ అనువాదం కూడా చక్కగా జరుగుతోందని ప్రకటించినప్పుడు, ప్రతినిధులు తమ భావోద్రేకాలను అదుపుచేసుకోలేక పోయారు. ప్రతిధ్వనించే కరతాళ ధ్వనులు ప్రసంగీకుడ్ని ప్రకటన పూర్తిచేయనివ్వలేదు. సారాయెవో సమావేశం వద్ద, హాజరైన వారందరూ ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ తర్వాత చాలాసేపటి వరకూ కరతాళ ధ్వనులు చేశారు. బెల్‌గ్రేడ్‌లో చాలామంది ఆనందభాష్పాలు రాల్చారు, ప్రసంగీకుడు ప్రకటన చేయడం ముగించే ముందు కరతాళ ధ్వనుల వల్ల చాలాసార్లు మధ్యలో ఆగవలసి వచ్చింది. అందరూ ఎంతో సంతోషించారు!
యెహోవాసాక్షులు క్రొయెషియన్ అలాగే సెర్బియన్ బైబిలు అనువాదాల ప్రచురణ హక్కులను అందుకున్నారు అన్న వాస్తవం ఈ బహుమానపు విలువను రెండింతలు చేసింది. కాబట్టి, ఈ రెండు భాషలలోనూ న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ గ్రీక్ స్క్రిప్చర్స్, అవే భాషల్లోని హీబ్రూ లేఖనాలతో కలిపి ఒక్కో సంపుటిగా తయారుచేయబడ్డాయి. అంతేకాకుండా, సెర్బియన్ బైబిలు రోమన్ లిపిలోనూ సిర్రిలిక్ లిపిలోనూ ప్రచురించబడింది.
బాల్కన్ రాష్ట్రాలలోని యెహోవా ప్రజలు అద్భుతమైన బహుమానాలకు నడిపింపుకు కృతజ్ఞతాపూర్వకంగా దావీదు వ్రాసిన ఈ మాటలతో హృదయపూర్వకంగా ఏకీభవిస్తున్నారు: “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు [యెహోవా] నాకు తోడై యుందువు.” వారు ఇప్పటికీ ఎన్నో కష్టాలు ఎదుర్కుంటున్నారు, అయినప్పటికీ వారు ‘యెహోవాయందు ఆనందించుటవలన బలపడడానికి’ నిశ్చయించుకున్నారు.—కీర్తన 23:4; నెహెమ్యా 8:10.
[అధస్సూచి]
^ పేరా 1 మునుపటి యుగోస్లావియాలో ఆరు రిపబ్లిక్‌లు ఉండేవి—బోస్నియా-హెర్జెగోవినా, క్రొయెషియా, మాసిడోనియ, మాంటెనీగ్రో, సెర్బియా, స్లోవేనియా.
[20వ పేజీలోని చిత్రం]
స్లోవేనియాలోని మారిబోర్‌లోని ప్రచారకుల తొలి గుంపు, సుదూర క్షేత్రంలో ప్రకటించడం