సత్యాన్ని ప్రేమించే యౌవనులు
సత్యాన్ని ప్రేమించే యౌవనులు
“యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు?” అని హీబ్రూ కీర్తనకర్త ఒకరు వేల సంవత్సరాల క్రితం ప్రశ్నించాడు. (కీర్తన 119:9) యౌవనస్థులు లోకంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇది నేడు కూడా ప్రాముఖ్యమైన ప్రశ్నే. విచ్చలవిడిగా లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం అనేకమంది యౌవనస్థులు ఎయిడ్స్‌కు గురయ్యేలా చేసింది, ఈ భయంకరమైన వ్యాధికి గురైన వారిలో దాదాపు సగం మంది 15 నుండి 24 ఏళ్ళవారే. మాదక ద్రవ్యాల దుర్వినియోగం కూడా అనేక సమస్యలను సృష్టిస్తూ కొంతమంది యౌవనులు అకాల మరణానికి గురయ్యేందుకు కారణమవుతోంది. దిగజారిపోయిన సంగీతం; హింసాపూరితమైన అనైతికమైన సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వీడియోలు; ఇంటర్‌నెట్‌పై అశ్లీల చిత్రాలు, రచనలు ఇవన్నీ యౌవనులపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి, కీర్తనకర్త అడిగిన ప్రశ్నే నేడు చాలామంది తల్లిదండ్రుల మనస్సుల్లోనూ యువతీయువకుల మనస్సుల్లోనూ మెదులుతోంది.
ఆ కీర్తనకర్త తన ప్రశ్నకు తానే ఇలా సమాధానం ఇచ్చాడు: “నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా.” నిశ్చయంగా దేవుని వాక్యమైన బైబిలులో యౌవనస్థులకు చక్కని నడిపింపు ఉంది, దాన్ని అనుసరించడం ద్వారా చాలామంది యౌవనులు తమ జీవితంలో విజయం సాధిస్తున్నారు. (కీర్తన 119:105) వస్తుసంపదలను, విలాస జీవితాన్ని వెంబడించే ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమిస్తూ ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి కృషి చేస్తున్న కొంతమంది యౌవనస్థుల మాదిరులను మనం పరిశీలిద్దాము.
తల్లిదండ్రుల నడిపింపుకు కృతజ్ఞులుగా ఉన్నారు
హాకోబ్ ఇమ్మానూయెల్ యెహోవాసాక్షుల మెక్సికో బ్రాంచి కార్యాలయంలో సేవ చేయడానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు పూర్తికాల పయినీరు పరిచారకుడిగా సేవచేశాడు. దేవుని సేవ పట్ల తనకు ప్రేమ ఎలా వృద్ధి చెందిందో ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “నాపై ప్రభావం చూపింది ముఖ్యంగా నా తల్లిదండ్రులే, అయితే నేను స్నేహసంబంధాలు పెంపొందించుకున్న అనుభవజ్ఞులైన ఆధ్యాత్మిక సహోదరులు కొందరు కూడా ఎంతో సహాయపడ్డారు. నేను ప్రకటనా పనిని ప్రేమించేలా వారు నన్ను పురికొల్పారు. నెమ్మదిగా వారు నన్ను సరైన మార్గంలో నడిపించారు; వారు నన్ను బలవంతం చేస్తున్నట్లు నేనెప్పుడూ భావించలేదు.”
పూర్తికాల పరిచర్యలో ఇప్పటికే కొన్ని సంవత్సరాలు గడిపిన డేవిడ్, తానూ తన తమ్ముడూ చిన్నవయస్సులో ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు ప్రత్యేక పయినీర్లుగా సేవ చేయడం తనను ఎలా ప్రభావితం చేసిందో గుర్తుతెచ్చుకుంటున్నాడు. అతని తండ్రి మరణించిన తర్వాత అతని తల్లి ప్రత్యేక పయినీరు సేవను కొనసాగించింది. సువార్తను ప్రకటించడమే గాక ఆమె వారి గురించి మంచి శ్రద్ధ తీసుకుంది. “పయినీరు సేవ చేయమని అమ్మా నాన్నా నన్ను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు గానీ ఒక కుటుంబంగా మేము పయినీరు సేవ చేయడాన్ని ఎంతగా ఆనందించేవారమంటే, ఆ సహచర్యమూ ఆ వాతావరణమూ నేనూ అదే పని చేసేలా నన్ను పురికొల్పాయి.” తల్లిదండ్రులు ఇవ్వవలసిన మంచి మార్గనిర్దేశం, శ్రద్ధల ప్రాముఖ్యత గురించి డేవిడ్ ఇలా చెబుతున్నాడు: “ప్రతీ రాత్రి మా అమ్మ మా కోసం ఫ్రమ్ పారడైస్ లాస్ట్ టు పారడైస్ రీగెయిన్డ్ అనే పుస్తకంలో నుండి కథలు చదివేది. * ఆమె మాకు వాటిని చదివి వినిపించిన విధానం మేము ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవడాన్ని ఇష్టపడేలా మాకు సహాయం చేసింది.”
కూటాలపట్ల మెప్పు
క్రైస్తవ కూటాలపట్ల మెప్పు కలిగివుండడం కొంతమంది యౌవనస్థులకు కష్టంగా ఉంటుంది. తమ తల్లిదండ్రులు తమను తీసుకువెళ్తున్నారు గనుక
వారితోపాటు వెళ్తుంటారు. అయితే, వారు అలా కూటాలకు వెళ్ళడం కొనసాగిస్తే, కొంతకాలానికి వారు కూటాలను ఇష్టపడడం మొదలుపెడతారు. తనకు పదకొండేళ్ళు ఉన్నప్పుడు పూర్తికాల సేవను ప్రారంభించిన ఆల్‌ఫ్రేథోను చూడండి. తనకు ఐదేళ్ళున్నప్పుడు, కూటాల్లో తనకు బాగా నిద్రవచ్చేది గానీ తన తల్లిదండ్రులు నిద్రపోవడానికి అనుమతించేవారు కాదు కాబట్టి తాను కూటాలకు వెళ్ళడాన్ని తప్పించుకోవడానికి చూసేవాడినని ఆయన అంగీకరిస్తున్నాడు. ఆయనిలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “కానీ నేను పెరిగి పెద్దవాడినవుతుండగా ముఖ్యంగా నేను చదవడం వ్రాయడం నేర్చుకున్న తర్వాత నా సొంత మాటల్లో వ్యాఖ్యానించడం ప్రారంభించాను, కాబట్టి నాకు మెల్ల మెల్లగా కూటాలమీద ఆసక్తి పెరిగింది.”క్రమ పయినీరుగా సేవ చేస్తున్న సీంటీయా అనే 17 ఏళ్ళ అమ్మాయి, దేవుని సేవ పట్ల ప్రేమను పెంపొందించుకోవడంలో మంచి సహవాసం ఎలా ఒక ప్రధాన పాత్రను పోషించిందో చెబుతోంది. ఆమె ఇలా అంటోంది: “సహోదరులతో మంచి సంబంధం, కూటాలకు క్రమంగా వెళ్ళడం, లోకస్థులైన స్నేహితులు లేరన్న కొరతనూ డిస్కో క్లబ్బులకు వెళ్ళడం వంటి యౌవనస్థులకు ఇష్టమైన కార్యకలాపాల కొరతనూ చవిచూడకుండా చేశాయి. కూటాల్లోని వ్యాఖ్యానాలను, అనుభవాలను వినడం నేను నాకున్నదంతా యెహోవాకు ఇవ్వాలనే కోరికను ఉత్పన్నం చేసింది, నాకున్నదల్లా నా యౌవనమే అని నేను భావిస్తున్నాను. కాబట్టి దాన్ని ఆయన సేవలో వినియోగించాలని నిర్ణయించుకున్నాను.”
అయితే ఆమె ఒక విషయం అంగీకరిస్తోంది: “నేను బాప్తిస్మం తీసుకోకముందు, హోమ్‌వర్క్ ఉందనో స్కూల్లో వేరే కార్యకలాపాలు ఉన్నాయనో సాకులు చెబుతూ కూటాలకు వెళ్ళకుండా ఉన్న సమయాలున్నాయి. నేను చాలాసార్లు కూటాలకు వెళ్ళకుండా ఉండేదాన్ని, అది ఆధ్యాత్మికంగా నామీద ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. బైబిలు అధ్యయనం చేయని ఒక అబ్బాయితో నేను కలిసి తిరగడం మొదలుపెట్టాను. యెహోవా సహాయంతో సకాలంలో నన్ను నేను సరిదిద్దుకున్నాను.”
వ్యక్తిగత నిర్ణయం
దేవుని వాక్య సత్యం పట్ల ప్రేమను వృద్ధి చేసుకోవడానికి కీలకమేమిటని భావిస్తున్నాడో చెప్పమని పూర్తికాలం యెహోవా సేవ చేస్తున్న పాబ్లో అనే యువకుడ్ని అడిగినప్పుడు ఆయనిలా చెప్పాడు: “రెండు విషయాలున్నాయని నేననుకుంటున్నాను: క్రమమైన వ్యక్తిగత అధ్యయనం, ప్రకటనాపని పట్ల ఆసక్తి. యెహోవాను గురించిన సత్యాన్ని నాకు బోధించినందుకు నేను నా తల్లిదండ్రులకు కృతజ్ఞుడిని, ఇది వాళ్ళు నాకివ్వగల అత్యంత శ్రేష్ఠమైనదని నేను భావిస్తున్నాను. అయితే నేను యెహోవాను ఎందుకు ప్రేమిస్తున్నాననే దాని గురించి నేను వ్యక్తిగతంగా ఒప్పించబడాలి. అందుకు, నేను బైబిలు సత్యపు ‘వెడల్పు, లోతు’ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ విధంగా మాత్రమే మనం యెహోవా వాక్యం పట్ల ఆకాంక్షను వృద్ధి చేసుకుంటాము, ఇది మనం వాక్యాన్ని గురించి ఇతరులతో మాట్లాడేలా మనలోని ‘మండే అగ్నిని’ పెంచుతుంది. ప్రకటనాపని పట్ల ఉన్న ఆ ఆసక్తి సత్యం పట్ల మనకున్న మెప్పుదలను అధికం చేస్తుంది.”—ఎఫెసీయులు 3:15-18; యిర్మీయా 20:9.
మునుపు పేర్కొన్న హాకోబ్ ఇమ్మానూయెల్ యెహోవా సేవ చేయాలన్న నిర్ణయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడంలోని ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. బాప్తిస్మం తీసుకోమని తన తల్లిదండ్రులు తనను ఎన్నడూ ఒత్తిడి చేయలేదని ఆయన చెబుతున్నాడు. “దాని వల్ల మంచే జరిగిందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే దాని మంచి ఫలితాలను నేను చూడగల్గుతున్నాను. ఉదాహరణకు, నేను ఎంతో కలిసిమెలిసి తిరిగిన కొంతమంది యౌవనస్థులు కలిసి ఒకేసారి బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అది మంచిదే అయినా, కొందరు కేవలం భావోద్రేకానికిలోనై అలా చేశారని నేను గ్రహించాను, ఎందుకంటే ఆ తర్వాత కొంతకాలానికే రాజ్య
కార్యకలాపాల పట్ల వారి ఆసక్తి అంతరించిపోయింది. నేను యెహోవాకు సమర్పించుకోవాలని నిర్ణయించుకోవడంలో నా తల్లిదండ్రులు నన్ను ఒత్తిడి చేయలేదు. అది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం.”సంఘం నిర్వహించే పాత్ర
కొంతమంది యౌవనస్థులు తమ తల్లిదండ్రుల సహాయం లేకుండా తమంతట తాము దేవునివాక్య సత్యాన్ని నేర్చుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో, సరైనది చేయడం నేర్చుకుని దానిలో కొనసాగడం ఖచ్చితంగా ఒక సవాలే.
సత్యం తనకు ఎంతగా ప్రయోజనం చేకూర్చిందో నోయే గుర్తు తెచ్చుకుంటున్నాడు. చాలా చిన్న వయస్సు నుండే ఆయనకు బాగా కోపం ఉండేది, దౌర్జన్యానికి కూడా పాల్పడేవాడు. ఆయన 14 ఏండ్ల వయస్సులో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు, ఆయన ప్రవృత్తి మెరుగుపడనారంభించింది, ఆ సమయంలో బైబిలు విషయాల మీద ఆసక్తి లేని ఆయన తల్లిదండ్రులు ఆయన ప్రవృత్తిలోని మార్పుకు ఎంతో కృతజ్ఞులై ఉన్నట్లు భావించారు. నోయే ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధిస్తుండగా, ఆయన తన జీవితాన్ని దేవుని సేవలో పూర్తిగా ఉపయోగించాలని కోరుకున్నాడు. ఇప్పుడాయన పూర్తికాల సేవ చేస్తున్నాడు.
అలాగే, ఆలెకాండ్రో తన తల్లిదండ్రులకు ఏమాత్రం ఆసక్తి లేకపోయినా చాలా చిన్న వయస్సు నుండే క్రైస్తవ సత్యం పట్ల ఆసక్తి చూపించడం ప్రారంభించాడు. సత్యం పట్ల తన మెప్పును వ్యక్తం చేస్తూ ఆయనిలా చెబుతున్నాడు: “నేను సాంప్రదాయిక క్యాథలిక్ గృహంలో పెరిగాను. కానీ నేను క్రమేణా కమ్యూనిస్టుల నాస్తికత్వం వైపు మొగ్గుచూపడం ప్రారంభించాను, ఎందుకంటే ఎంతో చిన్న వయస్సు నుండి నన్ను కలవరపరిచిన ప్రశ్నలకు చర్చి సమాధానం ఇవ్వలేదు. కానీ యెహోవా సంస్థ దేవుని గురించిన పరిజ్ఞానాన్ని పొందడానికి నాకు సహాయం చేసింది. అది అక్షరార్థంగా నా ప్రాణాన్ని కాపాడింది, ఎందుకంటే నేను గనుక బైబిలు అధ్యయనం చేసి ఉండకపోతే, అనైతిక కార్యాల్లో నిమగ్నమయ్యుండేవాడిని, త్రాగుడుకు లేదా మాదక ద్రవ్యాలకు బానిసనయ్యుండేవాడిని. నేను కొన్ని విప్లవ సంబంధ గుంపుల్లో కూడా సభ్యుడినై ఉండేవాడిని, అదే గనుక జరిగివుంటే చాలా ఘోరమైన పర్యవసానాలను అనుభవించవలసి వచ్చేది.”
ఒక యౌవనస్థుడు తన తల్లిదండ్రుల మద్దతు లేకుండా సత్యాన్వేషణలో కొనసాగుతూ దాన్ని ఎలా అంటిపెట్టుకుని ఉండగలడు? పెద్దలు, సంఘంలోని ఇతరులు చాలా ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహిస్తారని స్పష్టమవుతోంది. నోయే ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “నేను ఎన్నడూ ఒంటరితనాన్ని అనుభవించలేదు, యెహోవా ఎప్పుడూ నాకు ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. అంతేకాదు, ఆధ్యాత్మిక తండ్రులుగా, తల్లులుగా, అన్నదమ్ములుగా మారిన అనేకమంది ప్రేమగల సహోదరసహోదరీల మద్దతు నాకు లభించింది.” ఇప్పుడాయన బేతేలులో సేవ చేస్తూ తన సమయాన్ని దేవుని సేవలో ఉపయోగిస్తున్నాడు. అలాగే ఆలెకాండ్రో ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “ఒక వ్యక్తిగా నా పట్ల ప్రేమపూర్వక శ్రద్ధ చూపించే పెద్దల సభ ఉన్న సంఘంలో ఉండే ఆశీర్వాదం నాకు లభించినందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటాను. ప్రాముఖ్యంగా దీనికి నేనెందుకు కృతజ్ఞుడినంటే, 16 ఏళ్ళ వయస్సులో నేను బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు, సాధారణంగా యౌవనస్థులకుండే అవిశ్రాంతత నన్ను కూడా ఆవరించింది. అయితే సంఘంలోని కుటుంబాలు నన్ను ఎన్నడూ విడనాడలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు నన్ను సాదరంగా స్వీకరించి వసతి, ఆహారపానీయాలే గాక తమ హృదయాన్ని కూడా నాతో పంచుకునేవారు.” ఆలెకాండ్రో ఇప్పటికి 13 సంవత్సరాలకు పైగా పూర్తికాల సేవలో ఉన్నాడు.
మతం కేవలం వృద్ధుల కోసమే అని కొంతమంది భావిస్తారు. అయితే, బైబిలు సత్యాన్ని చిన్న వయస్సులో నేర్చుకున్న చాలామంది యౌవనస్థులు యెహోవాను ప్రేమిస్తూ ఆయనకు నమ్మకంగా ఉంటున్నారు. ఈ యౌవనస్థులకు కీర్తన 110:3 లో వ్రాయబడివున్న దావీదు మాటలను అన్వయించవచ్చు: “యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములోనుండి నీయొద్దకు వచ్చెదరు.”
సత్యం నేర్చుకుని దానికి అంటిపెట్టుకుని ఉండడం యౌవనస్థులకు ఒక సవాలే. అనేకులు యెహోవా సంస్థకు ఎంతో సన్నిహితంగా ఉండడం, కూటాలకు క్రమంగా హాజరవ్వడం, బైబిలును శ్రద్ధగా అధ్యయనం చేయడం చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. అలా చేయడం ద్వారా వారు దేవుని వాక్యంపట్ల ఆయన సేవపట్ల నిజమైన ప్రేమను వృద్ధి చేసుకోగలిగారు!—కీర్తన 119:15, 16.
[అధస్సూచి]
^ పేరా 6 1958 లో యెహోవాసాక్షులు ప్రచురించినది; ఇప్పుడు ముద్రించబడడం లేదు.