సంకుబుడి కొంగ నుండి ఒక పాఠము
సంకుబుడి కొంగ నుండి ఒక పాఠము
“ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, . . . అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.” (యిర్మీయా 8:7) ఈ మాటలతో, తమ దేవుడైన యెహోవాను వదిలేసి అన్యదేవతల ఆరాధన వైపు తిరిగిన మతభ్రష్టులైన యూదా ప్రజలకు వ్యతిరేకంగా యెహోవా తీర్పును యిర్మీయా ప్రవక్త ప్రకటించాడు. (యిర్మీయా 7:18, 31) విశ్వాసఘాతకులైన యూదులకు గుణపాఠం చెప్పడానికి యిర్మీయా ఒక సంకుబుడి కొంగను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు?
సంకుబుడి కొంగ, ప్రత్యేకించి తెల్ల కొంగ బైబిలు ప్రాంతాల గుండా వలసవెళ్ళే దృశ్యం ఇశ్రాయేలీయులకు సుపరిచితమే. పొడవైన కాళ్ళు కలిగి నీటిగుండా పోయే ఈ పెద్ద పక్షి పేరు హీబ్రూ భాషలోని స్త్రీలింగ సంబంధమైన ఒక పదం, దాని అర్థం “యథార్థత గలది; ప్రేమపూర్వక దయ గలది.” ఇది సరిగ్గా దానికి తగిన పేరు, ఎందుకంటే ఈ తెల్ల కొంగలు అనేక ఇతర పక్షుల్లా కాకుండా ఆడా మగా జీవితాంతం కలిసి జంటగా ఉంటాయి. చలికాలంలో వేడిగా ఉండే ప్రాంతాల్లో గడిపిన తర్వాత ఈ కొంగల్లో అత్యధిక శాతం అంతకు ముందు ఉపయోగించిన గూటికే తరచుగా తిరిగివస్తాయి, అలా సంవత్సరాల తరబడి వస్తూనే ఉంటాయి.
ఈ కొంగ తన సహజ ప్రవృత్తి ద్వారా, యథార్థత అనే లక్షణాన్ని అసాధారణమైన మార్గాల్లో వ్యక్తం చేస్తుంది. ఆడా మగా పక్షులు రెండూ గుడ్లను పొదగడంలోను పిల్లలకు ఆహారాన్ని అందించడంలోను సమంగా భాగం వహిస్తాయి. అవర్ మాగ్నిఫిసెంట్ వైల్డ్‌లైఫ్ అనే పుస్తకం, “తల్లిదండ్రులుగా ఈ కొంగలు పరస్పరం అసాధారణమైన రీతిలో యథార్థతను చూపించుకుంటాయి. ఉదాహరణకు, జర్మనీలో ఒక మగ కొంగ అత్యధిక వోల్టేజి ఉన్న కరంటు తీగలపై వాలడంవల్ల చనిపోయింది. దాని భాగస్వామి ఒంటరిగానే గుడ్లను పొదగడానికి 3 రోజులపాటు వాటి మీదినుండి కదలకుండా ఉండిపోయింది, మధ్యలో ఒకే ఒక్కసారి ఆహారం కోసం వెళ్ళినా అది చాలా స్వల్పకాలం మాత్రమే . . . మరొక సందర్భంలో, తన తోటి ఆడ కొంగ కాల్చి చంపబడినప్పుడు తండ్రి పక్షే పిల్లలను పెంచింది.”
నిజంగానే, తన జీవిత భాగస్వామిపట్ల సహజసిద్ధమైన నమ్మకాన్ని కలిగి ఉండడం ద్వారా తన పిల్లలపట్ల ప్రేమపూర్వక శ్రద్ధను చూపించడం ద్వారా ఈ కొంగ “యథార్థత గలది” అని తన పేరుకున్న భావానికి తగినట్టుగా జీవిస్తుంది. అందుకే విశ్వాసఘాతకులూ చపలచిత్తులూ అయిన ఇశ్రాయేలీయులకు కొంగలు ఒక శక్తివంతమైన పాఠాన్నందించడంలో తోడ్పడ్డాయి.
నేడు అనేకమందికి యథార్థత విశ్వసనీయత అనేవి పాతకాలపు ఆలోచనలు—అవి మెచ్చుకోదగినవే కానీ ఆచరణాత్మకమైనవి కావు. రోజు రోజుకీ పెరిగిపోతున్న విడాకులు, వదిలిపెట్టిపోవడం, వంచించడంతోపాటు ఇతర రకాల మోసాలు యథార్థతకు ఏ మాత్రం విలువ లేదని నిరూపిస్తున్నాయి. దానికి భిన్నంగా బైబిలు, ప్రేమా దయల చేత ప్రేరేపించబడిన యథార్థతకు ఉన్నతమైన స్థానాన్నిస్తోంది. అది “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను” అని క్రైస్తవులకు ఉద్బోధిస్తుంది. (ఎఫెసీయులు 4:24) అవును, మనం యథార్థంగా ఉండడానికి నవీనస్వభావము మనకు సహాయపడుతుంది, అయినా మనం యథార్థత గురించిన పాఠాన్ని కొంగ నుండి కూడా నేర్చుకోవచ్చు.