కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి “ఆత్మయందు” ఆరాధించండి

దేవుణ్ణి “ఆత్మయందు” ఆరాధించండి

దేవుణ్ణి “ఆత్మయందు” ఆరాధించండి

“దేవుని ఎవనితో పోల్పగలము? అతనికి సాటియైన రూపమెద్ది?”​—యెషయా 40:​18, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము. 

దేవుని ఆరాధనలో పటాలను ఉపయోగించడం అంగీకారయుక్తమేనని మీరు యథార్థంగా నమ్ముతుండవచ్చు. దేవుడు అదృశ్యుడు గనుక ఆయన ఒక వ్యక్తి కాడన్నట్లుగాను, అమూర్తమైనవాడిగాను కనిపించవచ్చు. అందుకే పటాలను ఉపయోగించడం ద్వారా మీరు, ప్రార్థనలు ఆలకించువానికి దగ్గరవుతారని భావించవచ్చు.

కానీ దేవుణ్ణి సమీపించే విషయంలో మనం ఎలాంటి విధానాన్ని ఎంపిక చేసుకుంటామన్నది మనమే ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యం మనకు ఉన్నదా? తనకు ఏది అంగీకారమో ఏది కాదో చెప్పే విషయంలో దేవునికే అత్యున్నత అధికారం ఉండవద్దా? ఈ విషయంలో దేవుని దృక్కోణం ఏమిటన్నది యేసు ఇలా వివరించాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రియొద్దకు రాలేడు.” (యోహాను 14:⁠6) * ఈ మాటలు చాలు పటాలైనా మరితర పవిత్ర వస్తువులేవైనా నిషిద్ధం అని నిరూపించడానికి.

అవును, యెహోవా దేవుడు అంగీకరించే నిర్దిష్టమైన ఆరాధనా విధానం ఒకటి ఉంది. అదేమిటి? మరో సందర్భంలో యేసు ఇలా వివరించాడు: “సమయము ఆసన్నమగుచున్నది. నిజమైన ఆరాధకులు ఆత్మయందును, సత్యమందు[ను] తండ్రిని ఆరాధించు సమయము ఇపుడు వచ్చియున్నది. నిజముగ తండ్రి ఆశించునది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మ స్వరూపి కనుక, ఆయనను ఆరాధించువారు ఆత్మయందును, సత్యమునందును ఆరాధింపవలయును.”​—⁠యోహాను 4:​23, 24.

“ఆత్మ స్వరూపి” అయిన దేవుడు భౌతికమైన ఒక రూపంలో చిత్రించబడగలడా? లేదు. ఆ ప్రతిమ ఎంత సుందరమైనదైనా గానీ అది ఎన్నడూ దేవుని మహిమకు సాటిరాలేదు. కాబట్టి దేవుని ప్రతిమ ఎన్నడూ ఆయనకు సరియైన ప్రతిరూపం కాలేదు. (రోమీయులు 1:​22, 23) ఒక వ్యక్తి, ఎవరో మనిషి చేసిన పటం ద్వారా దేవుణ్ణి సమీపిస్తుంటే ఆయనను ‘సత్యమునందు ఆరాధిస్తున్నట్లా’?

సుస్పష్టమైన బైబిలు బోధ

దేవుని ధర్మశాస్త్రము ఆరాధనా వస్తువులుగా ప్రతిమలను తయారుచేసుకోవడాన్ని నిషేధించింది. పది ఆజ్ఞల్లో రెండవది ఇలా ఆజ్ఞాపించింది: “పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమియందు, భూమి అడుగున నున్న నీళ్లయందు ఉండు ఏ వస్తువుయొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. మీరు వానికి మ్రొక్క గూడదు. వానిని పూజింపగూడదు.” (నిర్గమకాండము 20:​4, 5) ప్రేరేపిత క్రైస్తవ లేఖనాలు కూడా ఇలా ఆజ్ఞాపిస్తున్నాయి: “విగ్రహారాధన నుండి తొలగిపొండు.”​—⁠1 కొరింతీయులు [కొరింథీయులు] 10:⁠14.

నిజమే, తాము తమ ఆరాధనలో ప్రతిమలను ఉపయోగించడం విగ్రహారాధనతో సమానం కాదని చాలామంది వాదిస్తారు. ఉదాహరణకు, ఆర్థడాక్స్‌ క్రైస్తవులు తాము ఏ పటాల ముందు వంగి, మోకాళ్ళూని, ప్రార్థిస్తారో వాటిని తాము నిజానికి ఆరాధిస్తున్నామన్న విషయాన్ని తరచూ ఖండిస్తారు. ఒక ఆర్థడాక్స్‌ ప్రీస్టు ఇలా వ్రాశాడు: “అవి పవిత్ర వస్తువులు కాబట్టి, ఆ పటాల్లో ఉన్న వ్యక్తులను మేము పూజిస్తాము కాబట్టి మేము వాటికి గౌరవాన్ని చూపుతాము.”

అయినా ఈ ప్రశ్నకు మాత్రం జవాబు రాలేదు: పరోక్ష పూజ అని పిలువబడే పూజ నిమిత్తమైనా దేవుడు ఇలాంటి పటాలను ఉపయోగించడాన్ని ఆమోదిస్తాడా? అలాంటి ఆచారాన్ని బైబిలు ఎక్కడా సమర్థించడం లేదు. ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించడానికేనని చెబుతూ ఒక దూడ ప్రతిమను తయారుచేసుకున్నప్పుడు, వారు మతభ్రష్టులయ్యారని చెబుతూ యెహోవా తన అనంగీకారాన్ని ఖండితంగా వ్యక్తం చేశాడు.​—⁠నిర్గమకాండము 32:​4-7.

కనబడని ప్రమాదం

ఆరాధనలో ప్రతిమలు పటాలు ఉపయోగించడం ఒక ప్రమాదకరమైన ఆచారం. ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి బదులు దేవుడి ప్రతిరూపాలని తలంచబడే ఆ వస్తువులనే ఆరాధించే ప్రమాదంలో సులభంగా పడిపోతారు. వేరే మాటల్లో చెప్పాలంటే, పటం విగ్రహారాధనా కేంద్రంగా మారిపోతోంది.

ఇశ్రాయేలీయుల కాలంలో అనేక వస్తువుల విషయంలో అలా జరిగింది. ఉదాహరణకు, అరణ్యంలో తిరిగేటప్పుడు మోషే ఒక ఇత్తడి పామును తయారుచేశాడు. నిజానికి ఆ స్తంభంపై ఉంచబడిన పాము ప్రతిరూపం స్వస్థతకు మూలంగా పనిచేసింది. పాము కాటు అనే శిక్షకు గురైన వారు ఆ ఇత్తడి పామును చూసి దేవుని సహాయాన్ని పొందగలిగేవారు. కానీ ప్రజలు వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత, ఆ ఇత్తడి పాముకే ఏదో స్వస్థత చేసే శక్తి ఉన్నదన్నట్లు వాళ్ళు ఆ స్తంభాన్నే విగ్రహంగా మార్చేసినట్లు కనబడుతోంది. వాళ్ళు దానికి ధూపం వేసి, చివరికి దానికి నెహుష్టాన్‌ అనే పేరు కూడా పెట్టారు.​—⁠సంఖ్యాకాండము 21:​8, 9; 2 రాజులు 18:⁠4.

ఇశ్రాయేలీయులు నిబంధన మందసాన్ని తమ శత్రువులకు విరుద్ధంగా మంత్రశక్తులున్న వస్తువుగా ఉపయోగించడానికి ప్రయత్నించారు కూడా, అయితే ఫలితాలు మాత్రం చాలా వినాశకరంగా ఉన్నాయి. (1 సమూవేలు [సమూయేలు] 4:​3, 4; 5:​11) ఇక యిర్మీయా రోజుల్లో చూస్తే, యెరూషలేము పౌరులు దేవాలయంలో అరాధించబడే దేవుని కన్నా దేవాలయానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు.​—⁠యిర్మీయా 7:​12-15.

దేవుని స్థానంలో ప్రతిమలను లేదా విగ్రహాలను ఆరాధించే వైఖరి ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది. పరిశోధకుడైన విటాలీ ఇవాన్యిచ్‌ పెట్రెన్కో ఇలా అన్నాడు: “పటము . . . ఆరాధనా వస్తువుగా మారిపోతుంది, అది విగ్రహారాధన చేసే ప్రమాదానికి నడిపిస్తుంది . . . ఇది ప్రాథమికంగా అన్యమతాల్లోని తలంపు అనీ, ప్రజల్లో ప్రబలివున్న నమ్మకాలే పటాల ఆరాధనకు దారితీశాయనీ ఒప్పుకోవలసిందే.” అదే విధంగా, గ్రీక్‌ ఆర్థడాక్స్‌ ప్రీస్టు అయిన థీమీట్రీయోస్‌ కాన్‌స్టాంటీలోస్‌ గ్రీక్‌ ఆర్థడాక్స్‌ చర్చీని అర్థం చేసుకోవడం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో, “ఒక క్రైస్తవుడు ఒక పటాన్ని విగ్రహారాధనా వస్తువుగా మార్చుకునే అవకాశం ఉంది” అని అంటున్నాడు.

పటాలు పరోక్ష ఆరాధనకు కేవలం సహాయకాలు మాత్రమేనన్న వాదనలో చాలా లోపాలున్నాయి. ఎందుకని? ఆలోచించండి, మరియ లేదా “పరిశుద్ధుల” పటాల్లో కొన్ని, మృతులైన అదే వ్యక్తుల ఇతర పటాల కన్నా ఎక్కువ భక్తి చూపించయోగ్యమైనవని పరిగణించబడుతుండడం వాస్తవం కాదా? ఉదాహరణకు, గ్రీసులోని టీనోస్‌ వద్ద ఉన్న ఒక మరియ పటాన్ని పూజించే నిష్ఠగల ఆర్థడాక్స్‌ ప్రజలు కొందరున్నారు, దీనికి వ్యతిరేకంగా ఉత్తర గ్రీసులోని సూమెలాలో అంతే నిష్ఠగల మరికొందరు భక్తులు మరొక మరియ పటాన్ని పూజిస్తారు. ఈ రెండు పటాలూ ఎంతోకాలం క్రితం మరణించిన ఒకే వ్యక్తికి ప్రతిరూపంగా ఉన్నట్లు చెప్పబడుతున్నా, తమ పటమే ఉన్నతమైనదనీ, అవతలి పటం కన్నా తమ పటమే ప్రభావవంతమైన రీతిలో అద్భుతాలు చేస్తుందనీ ఈ రెండు గుంపుల భక్తులూ నమ్ముతారు. ఆ విధంగా, ఆచరణలోకి వచ్చేసరికి కొన్ని పటాలకు భక్తులు నిజమైన శక్తులున్నట్లు ఆపాదిస్తారు, వాటిని ఆరాధిస్తారు.

“పరిశుద్ధుల”కు లేదా మరియకు ప్రార్థించడం?

ఈ విషయం ప్రక్కన పెడితే, మరియ లేదా “పరిశుద్ధులు” వంటి వ్యక్తులను ఆరాధించడం సంగతేమిటి? సాతాను పెట్టిన ఒక శోధనకు ప్రతిస్పందిస్తూ యేసు ద్వితీయోపదేశకాండము 6:13ను ఎత్తిచెబుతూ ఇలా అన్నాడు: “ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము. ఆయనను మాత్రమే సేవింపుము.” (మత్తయి 4:​10) ఆ తర్వాత ఆయన, సత్యారాధకులు “తండ్రిని” మాత్రమే ఆరాధిస్తారని, ఇంకెవరినీ ఆరాధించరని చెప్పాడు. (యోహాను 4:​23) దీన్ని గ్రహించిన ఒక దేవదూత తనను ఆరాధించడానికి ప్రయత్నిస్తున్న అపొస్తలుడైన యోహానును ఇలా మందలించాడు: “అట్లు చేయకుము! . . . దేవుని పూజింపుము!”​—⁠దర్శన గ్రంథము [ప్రకటన] 22:⁠9.

యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన తల్లిగావున్న మరియను, లేదా ఎవరైనా “పరిశుద్ధుల”ను తమ పక్షాన దేవునితో మధ్యవర్తిత్వం జరపమని కోరుతూ వారికి ప్రార్థన చేయడం యుక్తమేనా? బైబిలు ఇచ్చే ముక్కు సూటియైన జవాబేమిటంటే: ‘దేవుని, మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తి ఒక్కడే. మనుష్యుడైన క్రీస్తుయేసే ఆ మధ్యవర్తి.’​—⁠1 తిమోతి 2:⁠5.

దేవునితో మీకుగల సంబంధాన్ని కాపాడుకోండి

ఆరాధనలో పటాలను ఉపయోగించడమన్నది బైబిలులోని స్పష్టమైన బోధకు విరుద్ధంగా ఉన్నందున, పటాలు దేవుని ఆమోదాన్నీ రక్షణనూ పొందడానికి ప్రజలకు సహాయం చేయలేవు. దీనికి విరుద్ధంగా, మన నిత్యజీవం మనం సత్యదేవుని గురించిన పరిజ్ఞానాన్ని పొందడంపై, అసామాన్యమైన ఆయన వ్యక్తిత్వాన్ని సన్నిహితంగా తెలుసుకోవడంపై, మానవుల విషయంలో ఆయన సంకల్పాన్నీ వారితో ఆయన వ్యవహారాలనూ తెలుసుకోవడంపై ఆధారపడివుందని యేసు చెప్పాడు. (యోహాను 17:⁠3) చూడలేని, స్పృశించలేని, లేదా మాట్లాడలేని పటాలు దేవుని గురించి తెలుసుకోవడానికీ ఆయన్ని అంగీకారయుక్తంగా ఆరాధించడానికీ మనకు సహాయం చేయవు. (కీర్తన 115:​4-8) ఏకైక సత్యదేవుని గురించిన విద్య మనకు ఆయన వాక్యమైన బైబిలును అధ్యయనం చేయడం ద్వారానే లభిస్తుంది.

పటాలను ఆరాధించడం ఏమాత్రం ప్రయోజనం చేకూర్చకపోగా ఆధ్యాత్మికంగా ప్రమాదకరమైనదిగా పరిణమించగలదు. అదెలా? అన్నింటికన్నా ముందుగా, అది యెహోవాతో మనకుగల సంబంధంలో ఒక అగాధాన్ని సృష్టించగలదు. తనకు “కోపం వచ్చేట్లు” చేసిన ఇశ్రాయేలీయుల గురించి ఆయనిలా ప్రవచించాడు: “వారినుండి నేను నా ముఖం దాచుకొంటాను.” (ద్వితీయోపదేశకాండము 32:​16, 20, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) దేవునితో తమకుగల సంబంధాన్ని పునర్నిర్మించుకోవాలంటే వారు ‘విగ్రహాలను పూజించటం మానివేయాలి.’​—⁠యెషయా 31:​6, 7, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

కాబట్టి, ఈ లేఖనానుసారమైన సలహా ఎంత యుక్తమైనదో కదా: “బిడ్డలారా! విగ్రహాలకు దూరంగా ఉండండి.”​—⁠1 యోహాను 5:​21, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

[అధస్సూచి]

^ పేరా 4 ప్రత్యేకంగా సూచించబడని లేఖనాలన్నీ పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము నుండి ఉల్లేఖించబడ్డాయి.

[6వ పేజీలోని బాక్సు]

“ఆత్మయందు” ఆరాధించేందుకు సహాయం పొందినవారు

అల్బేనియాలోని ఆర్థడాక్స్‌ చర్చిలో ఒలీవేరా భక్తినిష్ఠలుగల ఒక సభ్యురాలు. 1967 లో ఆ దేశం మతాలన్నింటినీ నిషేధించినప్పుడు ఒలీవేరా తన మతాచారాలను రహస్యంగా కొనసాగించింది. తనకు వచ్చే కొద్దిపాటి పెన్షన్‌లో అధిక మొత్తాన్ని బంగారంతో చేసిన పటాలను, ధూపాన్ని, క్రొవ్వొత్తులను కొనడానికి వినియోగించేది. ఆమె వాటిని తన పక్క క్రింద దాచిపెట్టేది, వాటిని ఎవరైనా దొంగిలిస్తారేమోనన్న భయంతో ఆమె తరచూ వాటి దగ్గర్లోనే కుర్చీలో కూర్చుని నిద్రపోయేది. 1990ల ప్రారంభంలో ఆమెను యెహోవాసాక్షులు సందర్శించినప్పుడు వారి సందేశంలో బైబిలు సత్యం ఉన్నట్లు ఆమెకు అర్థమైంది. సత్యారాధన “ఆత్మయందు” చేయాలని బైబిలు చెబుతున్న దాన్ని ఆమె గ్రహించింది, పటాల ఉపయోగాన్ని గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడో ఆమె తెలుసుకుంది. (యోహాను 4:​24, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) ఆమెతో బైబిలు అధ్యయనం చేస్తున్న సాక్షి తాను వచ్చిన ప్రతీసారి ఆమె ఇంట్లోని పటాలు ఒక్కొక్కటి తక్కువయిపోతున్నట్లు గమనించింది. చివరికి ఒక్కటి కూడా లేకుండాపోయాయి. ఒలీవేరా తన బాప్తిస్మం తర్వాత ఇలా వ్యాఖ్యానించింది: “నేడు, పనికిరాని ఆ పటాలకు బదులు నా దగ్గర యెహోవా పరిశుద్ధాత్మ ఉంది. ఆయన ఆత్మ నన్ను చేరడానికి పటాల అవసరత లేనందుకు నేనెంతో కృతజ్ఞురాలిని.”

గ్రీస్‌లోని లెజ్వోస్‌ అనే ద్వీప నివాసియైన అధీనా ఆర్థడాక్స్‌ చర్చిలో చాలా క్రియాశీలిగా ఉన్న ఒక సభ్యురాలు. ఆమె చర్చి క్వయిర్‌లో కూడా సభ్యురాలే, పటాలను ఉపయోగించే ఆచారంతో సహా తన మతంలోని ఆచారాలన్నీ నిష్ఠగా పాటించేది. అధీనాకు చర్చిలో నేర్పించబడినవన్నీ బైబిలుతో పొందికగా లేవని గ్రహించడానికి యెహోవాసాక్షులు ఆమెకు సహాయం చేశారు. ఆ విషయాల్లో ఆరాధనలో పటములు, సిలువలు ఉపయోగించడం కూడా ఉన్నాయి. ఈ మతపరమైన వస్తువుల గురించి అధీనా తానే స్వయంగా పరిశోధన చేస్తానని పట్టుబట్టింది. వివిధ సంప్రదింపు గ్రంధాలను లోతుగా పరిశీలించిన పిమ్మట ఆ వస్తువుల మూలాలు క్రైస్తవత్వంలో లేవని ఆమెకు నమ్మకం ఏర్పడింది. దేవుణ్ణి “ఆత్మయందు” ఆరాధించాలన్న ఆమె కోరిక మూలంగా ఎంతో ఖరీదైనవైనా ఆమె తన ఇంట్లోని పటాలను తీసేసింది. అయితే అధీనా, దేవుణ్ణి ఆధ్యాత్మికంగా పరిశుభ్రమైన అంగీకారయోగ్యమైన రీతిలో ఆరాధించడానికి ఎలాంటి నష్టాన్నైనా భరించడానికి ఆనందంగా సిద్ధపడింది.​—⁠అపొస్తలుల కార్యములు 19:⁠19.

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

పటాల్లో కళ?

ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థడాక్స్‌ చర్చికి సంబంధించిన పటాలను అనేకులు సేకరించడం జరిగింది. వీటిని సేకరించే వారు ఆ పటాలను మతపరమైన వస్తువులుగా దృష్టించక బైజాంటైన్‌ సంస్కృతిని ప్రతిబింబిస్తున్న కళాకృతులుగా దృష్టిస్తారు. నాస్తికులమని చెప్పుకునే కొందరు అలాంటి మతపరమైన పటాలను ఇళ్ళల్లోను ఆఫీసుల్లోను అలంకరణ నిమిత్తం ఉంచుకోవడం సాధారణమైన విషయమే.

అయితే యథార్థవంతులైన క్రైస్తవులు పటానికి ఉన్న ప్రాథమిక సంకల్పాన్ని మర్చిపోరు. పటం అనేది ఆరాధనలో ఉపయోగించబడే వస్తువు. ప్రజలు తమ ఇళ్ళల్లో పటాలను పెట్టుకునేందుకు వారికున్న హక్కును క్రైస్తవులు సవాలు చేయకపోయినప్పటికీ, వ్యక్తిగతంగా తమ దగ్గర పటాలను ఉంచుకోరు, చివరికి వాటిని సేకరించరు కూడా. ఇది ద్వితీయోపదేశకాండము 7:​26, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదములో ఉన్న సూత్రానికి అనుగుణంగా ఉంది: “మీరు ఆ ప్రతిమలను మీ ఇండ్లకు కొనివత్తురేమో జాగ్ర[త్త]! వారివలె మీరును శాపము పాలగుదురు. ఆ విగ్రహములు శాపగ్రస్తములు. కనుక మీరు వానిని నీచాతినీచముగా గణించి ఏవగించుకొనవలయును.”

[7వ పేజీలోని చిత్రం]

ఆరాధనలో ప్రతిమలను ఉపయోగించడాన్ని దేవుడు సహించలేదు

[8వ పేజీలోని చిత్రం]

బైబిలులోని పరిజ్ఞానం మనం దేవుణ్ణి ఆత్మయందు ఆరాధించేందుకు సహాయం చేస్తుంది