పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
“యేసు నామమున” అనే మాటలను ఉపయోగించకుండా దేవునికి ప్రార్థించడం సరైనదేనా?
యెహోవాకు ప్రార్థించాలని కోరుకునే క్రైస్తవులు యేసు నామముననే ప్రార్థించాలని బైబిలు చూపిస్తోంది. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.”—యోహాను 14:6, 13, 14.
యేసుకున్న విశిష్ట స్థానము గురించి మాట్లాడుతూ సైక్లోపీడియా ఆఫ్ బిబ్లికల్, థియోలాజికల్ అండ్ ఎక్లీసియాస్టికల్ లిటరేచర్ ఇలా చెబుతోంది: “మనము యేసుక్రీస్తు మధ్యవర్తిగా, దేవునికి మాత్రమే ప్రార్థించాలి. కాబట్టి, పరిశుద్ధులకు లేదా దేవదూతలకు చేయబడే విన్నపాలన్నీ వ్యర్థమైనవే కాదు, దేవదూషణకరమైనవి కూడా. అయితే సృష్టముకు చేసే ఆరాధన, ఆ సృష్టము ఎంత ఉన్నతమైనదైనా అది విగ్రహారాధనే, దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రములో విగ్రహారాధన ఖచ్చితంగా నిషేధించబడింది.”
ఒక ప్రతిఫలదాయకమైన అనుభవం తర్వాత ఎవరైనా “యేసు నామమున” అని చేర్చకుండా, “కృతజ్ఞతలు యెహోవా” అని అంటే అప్పుడెలా? అది అనుచితమా? కాదు. ఒక క్రైస్తవుడు అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదానికి గురై, “సహాయం చేయి యెహోవా” అని ఎలుగెత్తి అర్థిస్తాడనుకోండి. తన సేవకుడు, “యేసు నామమున” అని అనలేదు గనుక దేవుడు సహాయం చేయడానికి నిరాకరిస్తాడని కాదు.
అయితే, దేవునితో కేవలం బిగ్గరగా మాట్లాడడమే ప్రార్థన కాదని గమనించాలి. ఉదాహరణకు, కయీను తన తమ్ముడైన హేబెలును చంపినందుకు యెహోవా దేవునిచే తీర్పుతీర్చబడిన తర్వాత, “నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని” అన్నాడు. (ఆదికాండము 4:13, 14) కయీను యెహోవాతోనే అలా అన్నప్పటికీ, ఆయన వ్యక్తపరచిన మనోభావాలు పాపం యొక్క చేదైన ఫలాన్ని గురించి చేసిన ఫిర్యాదు మాత్రమే.
“దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” అని బైబిలు మనకు చెబుతుంది. సర్వోన్నతుడైన దేవుణ్ణి ఏదో సామాన్య మానవుడన్నట్లు సంబోధించడం వినయము లేకపోవడాన్నే చూపిస్తుంది. (యాకోబు 4:6; కీర్తన 47:2; ప్రకటన 14:7) యేసుకున్న పాత్ర గురించి దేవుని వాక్యం చెబుతున్న దాన్ని తెలుసుకుని కూడా యేసుక్రీస్తును ఉద్దేశపూర్వకంగా గుర్తించకుండా ప్రార్థించడం కూడా అగౌరవాన్ని చూపినట్లే అవుతుంది.—లూకా 1:32, 33.
దీనర్థం ప్రార్థించేటప్పుడు మనమేదో ప్రత్యేక శైలిని లేదా నిర్దిష్ట సూత్రాన్ని అనుసరిస్తేనేగానీ యెహోవా మన ప్రార్థనను వినడని కాదు. ఒక వ్యక్తి హృదయ పరిస్థితే కీలకాంశం. (1 సమూయేలు 16:7) సా.శ. మొదటి శతాబ్దంలో కొర్నేలీ అనే రోమా అధికారి “ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన” చేస్తుండేవాడు. సున్నతి పొందని అన్యుడైన కొర్నేలీ యెహోవాకు సమర్పించుకున్న వ్యక్తి కాదు. ఆయన బహుశా యేసు నామమున ప్రార్థనలు చేసి ఉండకపోవచ్చు, అయినప్పటికీ, అవి “దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.” ఎందుకు? ఎందుకంటే, కొర్నేలీ “దేవుని యందు భయభక్తులు” గలవాడని “హృదయ పరిశోధకుడు” చూశాడు. (అపొస్తలుల కార్యములు 10:2, 4; సామెతలు 17:3) “నజరేయుడైన యేసును” గూర్చిన పరిజ్ఞానాన్ని పొందిన తర్వాత కొర్నేలీ పరిశుద్ధాత్మను పొంది, బాప్తిస్మం తీసుకుని యేసు శిష్యుడయ్యాడు.—అపొస్తలుల కార్యములు 10:30-48.
చివరి విశ్లేషణలో, దేవుడు ఏ ప్రార్థనలను వింటాడనేది నిర్ణయించవలసింది మానవులు కాదు. ఒక క్రైస్తవుడు ఎప్పుడైనా దేవునికి ఏదైనా విజ్ఞప్తి చేసి, “యేసు నామమున” అనే మాటలను ఉపయోగించలేదనుకోండి, ఆయన అపరాధ భారంతో కృంగిపోనవసరం లేదు. యెహోవాకు మన పరిమితుల గురించి పూర్తిగా తెలుసు, ఆయన మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. (కీర్తన 103:12-14) మనం “దేవుని కుమారుని” యందు విశ్వాసం ఉంచితే, “ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించున”ని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. (1 యోహాను 5:13, 14) అయితే, ప్రాముఖ్యంగా ఇతరులకు ప్రాతినిధ్యం వహిస్తూ బహిరంగంగా ప్రార్థిస్తున్నప్పుడు, నిజ క్రైస్తవులు యెహోవా సంకల్పంలో యేసు కలిగివున్నాడని లేఖనాలు తెలియజేస్తున్న పాత్రను అంగీకరిస్తారు. కాబట్టి వారు యేసు ద్వారా దేవునికి ప్రార్థిస్తూ ఆయనను గౌరవించడానికి విధేయంగా కృషిచేస్తారు.