మీ జీవితం ఎలా మరింత అర్థవంతంగా ఉండగలదు
మీ జీవితం ఎలా మరింత అర్థవంతంగా ఉండగలదు
ఒక ప్రాచీన సామెత ఇలా చెబుతుంది: “ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.” (సామెతలు 23:4, 5) మరొక మాటలో చెప్పాలంటే, ధనసంపాదనకే మనల్ని మనం అంకితం చేసుకోవడం జ్ఞానయుక్తమైనది కాదు ఎందుకంటే, ధనం పక్షిరాజు రెక్కలు విప్పుకుని ఎగిరిపోయినట్లు ఎగిరిపోగలదు.
బైబిలు చెప్తున్నట్లుగా, వస్తు సంపద చాలా త్వరగా అదృశ్యమైపోగలదు. పకృతి వైపరీత్యాల వల్లనో, ధరలు పడిపోవడం వల్లనో, లేక ఇతర అనూహ్య సంఘటనల వల్లనో ఒక్కరాత్రిలోనే మీకున్నదంతా అదృశ్యమైపోవచ్చు. అంతకంటే ఎక్కువగా, వస్తు సంబంధంగా మంచి విజయాన్ని సాధించినవారు సహితం తరచూ నిరాశ చెందుతారు. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, అధికారంలో ఉన్నవారికి సాదరసత్కారాలు చేయవలసిన పని ఇమిడివున్న జాన్ అనే వ్యక్తినే తీసుకోండి.
“నన్ను నేను నా ఉద్యోగానికి పూర్తిగా అంకితం చేసుకున్నాను. నేను ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాను, లగ్జరీ హోటల్లో నివసించేవాడిని, పనికి వెళ్ళేటప్పుడు ప్రైవేట్ జెట్ ఎయిర్ ప్లేన్‌లో ప్రయాణించేవాడిని. మొదట్లో నేను చాలా ఆనందించాను, క్రమంగా నాకు అది విసుగు పుట్టించేదయ్యింది. నేను ఎవరిని మెప్పించటానికి ఎంతో కృషి చేశానో ఆ ప్రజలు ఏమంత పెద్ద జ్ఞానవంతుల్లా అనిపించలేదు. నా జీవితానికి అర్థంలేకుండాపోయింది.”
జాన్ కనుగొన్నట్లుగా, ఆధ్యాత్మిక విలువలు లేని జీవితం శూన్యంగా అనిపిస్తుంది. ప్రసిద్ధిగాంచిన కొండమీది ప్రసంగంలో, యేసు క్రీస్తు నిరంతరం నిలిచే సంతోషాన్ని ఎలా అనుభవించవచ్చో చూపించాడు. “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది” అని ఆయన చెప్పాడు. (మత్తయి 5:3) కాబట్టి, జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమ స్థానం ఇవ్వడం జ్ఞానయుక్తమైనదని స్పష్టమౌతుంది. అయితే, జీవితానికి మరింత అర్థాన్ని చేకూర్చటానికి ఇతర విషయాలు కూడా సహాయం చేయగలవు.
మీ కుటుంబం, స్నేహితులు ఎంతో అవసరం
మీ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా, సన్నిహిత స్నేహితులెవరూ లేకుండా మీరు మీ జీవితాన్ని ఆనందించగలరా? ఎంతమాత్రమూ ఆనందించలేరు. ప్రేమించే, ప్రేమించబడే అవసరతతో సృష్టికర్త మనలను సృష్టించాడు. ‘మనవలే మన పొరుగువారిని ప్రేమించడంలోని’ ప్రాముఖ్యతను యేసు ఉన్నతపర్చడానికి మరొక కారణం అదే. (మత్తయి 22:39) కుటుంబం, నిస్వార్థ ప్రేమను కనపర్చుకునేందుకు ఆదర్శవంతమైన వాతావరణాన్ని అందించే దైవిక వరమైవుంది.—ఎఫెసీయులు 3:14-18.
మన కుటుంబము మన జీవితానికి మరింత అర్థాన్ని ఎలా ఇవ్వగలదు? ఐక్యతగల కుటుంబాన్ని, అనుదిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుండి ఉపశమనకరమైన ఆశ్రయాన్నిచ్చే ఒక అందమైన తోటతో పోల్చవచ్చు. అలాగే, ఉపశమనాన్ని కలిగించే సహవాసాన్నీ, ఒంటరితనాన్ని పోగొట్టే ఆదరాభిమానాల్నీ మనం కుటుంబంలో పొందవచ్చు. నిజమే ఒక కుటుంబం దానంతటదే అలాంటి ఆశ్రయాన్ని కలిగించలేదు. మనం మన కుటుంబ బంధాలను పటిష్ఠపరచుకున్నట్లయితే, ఒకరికొకరం దగ్గరౌతాము, మన జీవితం సుసంపన్నమౌతుంది. ఉదాహరణకు, మన వివాహ జత పట్ల ప్రేమనూ గౌరవాన్నీ చూపించేందుకు మనం వెచ్చించే సమయమూ ఇచ్చే అవధానమూ, చివరికి పుష్కలమైన ఫలితాలను తెచ్చే రోజువారీ పెట్టుబడుల లాంటివే.—ఎఫెసీయులు 5:33.
మనకు పిల్లలుంటే, వాళ్ళను పెంచటానికి సరైన వాతావరణాన్ని కల్పించేందుకు మనం ప్రయాసపడాలి. వారితో సమయాన్ని గడపటానికీ, పరస్పరం సంభాషించుకోవటానికీ, వారికి ఆధ్యాత్మిక ఉపదేశాన్నివ్వటానికీ ఎంతో కృషి చేయవలసి రావచ్చు. కాని అలాంటి సమయమూ కృషీ మనకు గొప్ప సంతృప్తిని తెస్తాయి. విజయవంతులైన తల్లిదండ్రులు, తమ పిల్లలను ఒక ఆశీర్వాదముగా, చాలా జాగ్రత్తతో చూడాల్సిన దేవుడిచ్చిన స్వాస్థ్యముగా దృష్టిస్తారు.—కీర్తన 127:3.
మంచి స్నేహితులు కూడా సంతృప్తికరమైన, అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు తోడ్పడతారు. (సామెతలు 27:9) సానుభూతిని చూపించడం ద్వారా మనం అనేకమందిని స్నేహితులనుగా చేసుకోవచ్చు. (1 పేతురు 3:8) నిజమైన స్నేహితులు మనం తొట్రుపడితే, లేవనెత్తుతారు. (ప్రసంగి 4:9, 10) మరియు, ‘నిజమైన స్నేహితుడు దుర్దశలో, సహోదరుడుగా నుండును.’—సామెతలు 17:17.
నిజమైన స్నేహం ఎంత సంతృప్తినిస్తుందో ! స్నేహితుని సమక్షంలో సూర్యాస్తమయం మరింత అద్భుతంగా కనిపిస్తుంది, భోజనం మరింత రుచికరంగా ఉంటుంది, సంగీతం మరింత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. నిజమే, సన్నిహితులైన కుటుంబ సభ్యులూ విశ్వసనీయులైన స్నేహితులూ అర్థవంతమైన జీవితానికి రెండు ముఖాలవంటివారు. మన జీవితాలకు మరింత అర్థాన్ని చేకూర్చగల ఇంకా ఎలాంటి ఏర్పాట్లను దేవుడు చేశాడు?
మన ఆధ్యాత్మిక అవసరాలను సంతృప్తిపరచుకోవడం
ముందే పేర్కొన్నట్లుగా, యేసు క్రీస్తు మన ఆనందాన్ని మన ఆధ్యాత్మిక అవసరాలను తెలుసుకొని ఉండడంతో ముడిపెట్టాడు. నైతిక శక్తితోనూ ఆధ్యాత్మిక శక్తితోనూ మనం సృష్టించబడ్డాము. అందుకే ‘ఆత్మసంబంధియైనవాని’ గురించీ, “హృదయపు అంతరంగ స్వభావము” గురించీ బైబిలు తెలియజేస్తుంది.—1 కొరింథీయులు 2:15; 1 పేతురు 3:3-5.
ఆలంకారిక హృదయం, “మనిషి మనస్సు ఆలోచించే విధానానికీ, ఆయన నైతిక చర్యలకూ సంకేతం, అంటే ఆయనలోని అటు తార్కికమైన ఇటు భావోద్రేకమైన అంశాలకు చిహ్నం” అని ఏన్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్‌మెంట్ అనే పుస్తకంలో డబ్ల్యు. ఇ. వైన్ అంటున్నాడు. ఆయన ఇంకాస్త వివరిస్తూ ఇలా జోడిస్తున్నాడు: “వేరే మాటల్లో చెప్పాలంటే, ఒక వ్యక్తి యొక్క అంతరంగం ఉద్భవించే అదృశ్య స్థానానికి ఆలంకారికంగా హృదయాన్ని ఉపయోగించడం జరిగింది.” అదే పుస్తకంలో ఇంకా ఇలా ఉంది: “శరీరంలోని అంతర్భాగంలో ఉన్నందు మూలాన హృదయంలో ఆలంకారికంగా ‘అదృశ్యవ్యక్తి’ ఉంటాడు, అంటే అసలైన వ్యక్త వసిస్తాడు.”
‘ఆత్మసంబంధియైనవాని’ లేక “దాగివున్న మనిషి” యొక్క అంటే, “హృదయపు అంతరంగ స్వభావము” యొక్క అవసరాలను మనం ఎలా తీర్చవచ్చు? “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొఱ్ఱెలము” అని దైవ ప్రేరేపితంగా కీర్తనకర్త చెప్పిన దానిని గుర్తించినప్పుడు, మనం ఒక ప్రాముఖ్యమైన చర్య తీసుకుని, మన ఆధ్యాత్మిక అవసరతను తృప్తి పర్చుకుంటాము. (కీర్తన 100:3) దానిని గుర్తించడం కారణసహితంగానే, దేవునికి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత మనకుందనే ముగింపుకు రావడానికి నడిపిస్తుంది. “మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము” అనే జాబితాలో చేరాలంటే ఆయన వాక్యమైన బైబిలుకు అనుగుణ్యంగా చర్య తీసుకోవాలి.
దేవునికి లెక్క అప్పచెప్పడం వల్ల ఏమైనా నష్టం ఉందా? ఎంతమాత్రమూ లేదు, మన ప్రవర్తనపట్ల దేవునికి పట్టింపు ఉందన్న విషయాన్ని తెలుసుకోవడం మన జీవితానికి అర్థాన్ని చేకూరుస్తుంది. మంచి వ్యక్తులుగా తయారుకావాలని అది మనలను ప్రోత్సహిస్తుంది, అది ఖచ్చితంగా మనం కల్గివుండవలసిన లక్ష్యం. “యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు” అని కీర్తన 112:1 చెప్తుంది. భక్తి పూర్వకంగా దేవునికి భయపడడం ఆయన ఆజ్ఞలకు హృదయపూర్వకంగా గౌరవం చూపించడం మన జీవితాలకు గొప్ప అర్థాన్ని చేకూర్చగలవు.
మనం దేవునికి విధేయత చూపించడం మనల్ని ఎందుకు సంతృప్తిపరుస్తుంది? ఎందుకంటే మనకు ఒక మనస్సాక్షి ఉంది గనుక, అది మానవజాతిలోని ప్రతి ఒక్కరికీ యెహోవా ఇచ్చిన గొప్ప వరం. మన మనస్సాక్షి, మనం చేసిన లేక చేయాలనుకునే వాటిని అమోదించడమో లేక నిరాకరించడమో చేసే నైతిక పరీక్షకుని లాంటిది. కలతచెందిన మనస్సాక్షి పడే రోమీయులు 2:15) కానీ మన మనస్సాక్షి మనకు ప్రతిఫలం కూడా ఇస్తుంది. దేవుని పట్ల, తోటి మానవుల పట్ల మనం నిస్వార్థంగా ప్రవర్తిస్తే మనం సంతుష్టిని, సంతృప్తిని పొందుతాము. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని మనం కనుగొంటాము. (అపొస్తలుల కార్యములు 20:35) దానికొక ప్రాముఖ్యమైన కారణం ఉంది.
ఆందోళనను మనమందరమూ అనుభవించాము. (మన తోటివారి కోరికలు అవసరాలు మనపై ప్రభావం చూపేలా ఉండేటట్లు మన సృష్టికర్త మనలను తయారుచేశాడు. అందుకే ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం ఆనందాన్ని పొందుతాము. అదనంగా, అవసరంలో ఉన్న వారికి మనం సహాయం చేస్తే, మనం తనకే సహాయం చేసినట్లుగా దేవుడు భావిస్తాడని బైబిలు మనకు హామీ ఇస్తుంది.—సామెతలు 19:17.
ఆధ్యాత్మిక అవసరాలకు అవధానాన్నివ్వడం, మనకు అంతర్గత సంతృప్తిని ఇవ్వడమేకాక, మనకు ఆచరణాత్మకమైన విధంగా సహాయం చేయగలదా? అలా సహాయం చేయగలదని మధ్యప్రాచ్యంలోని రేమండ్ అనే ఒక వ్యాపారస్థుడు నమ్ముతున్నాడు. “డబ్బు సంపాదించాలన్నదే నా లక్ష్యంగా ఉండేది” అని ఆయనంటున్నాడు. “కానీ దేవుడున్నాడనీ, ఆయన సంకల్పాల గురించి బైబిలు తెలియజేస్తుందనీ నేను నా హృదయంలో అంగీకరించినప్పటి నుండి నేను పూర్తిగా వేరే వ్యక్తిని. జీవనోపాధి ఇప్పుడు నా జీవితంలో రెండవస్థానంలో ఉంది. దేవుని సంతోషపరచడానికి ప్రయత్నించడం ద్వారా, హానికరమైన ద్వేషాన్నుండి తప్పించుకోగలిగాను. మా నాన్నగారు ఒక పోరాటంలో చనిపోయినప్పటికీ దాని బాధ్యులైనవారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నేను అనుకోవడంలేదు.”
రేమండ్ తెలుసుకున్నట్లుగా, ‘ఆత్మసంబంధియైనవాని’ అవసరాల గురించి శ్రద్ధ తీసుకోవడం లోతైన భావోద్రేక గాయాలను స్వస్థపరచగలదు. ఏమైనప్పటికీ ప్రతీరోజూ ఎదురయ్యే సమస్యలను మనం ఎదుర్కొంటేనే గానీ జీవితం పూర్తిగా సంతృప్తిగా ఉండదు.
మనం “దేవుని సమాధానాన్ని” కలిగివుండవచ్చు
ఈ ఊపిరి సలపని ప్రపంచంలో చాలా తక్కువ రోజులు ప్రశాంతంగా గడుస్తాయి. హఠాత్పరిణామాలు సంభవించవచ్చు, వేసుకున్న పథకాలు తారుమారైపోవచ్చు, ప్రజలు మనల్ని నిరుత్సాహపర్చవచ్చు. ఇవన్నీ మన సంతోషాన్ని అపహరించవచ్చు. అయితే యెహోవా దేవుని సేవ చేసేవారికైతే “దేవుని సమాధానము” అనే అంతర్ సంతృప్తి ఉంటుందని బైబిలు వాగ్దానం చేస్తుంది. ఈ సమాధానాన్ని మనమెలా పొందవచ్చు?
అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) మన సమస్యలను మనమే ఒంటరిగా మోసేందుకు ప్రయత్నించేకన్నా మనం పట్టుదలతో ప్రార్థన చేస్తూ, మన అనుదిన భారాల్ని యెహోవాపై మోపాలి. (కీర్తన 55:22) మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ దేవుడు చేస్తున్న సహాయాన్ని గ్రహిస్తుండగా, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేసే అలాంటి విన్నపాలకు యెహోవా ప్రతిస్పందిస్తాడన్న మన విశ్వాసము అధికమౌతుంది.—యోహాను 14:6, 14; 2 థెస్సలొనీకయులు 1:3.
మనం “ప్రార్థన ఆలకించు”వాడైన యెహోవా పట్ల మనకున్న నమ్మకాన్ని పెంపొందించుకున్న తర్వాత, మనం దీర్ఘకాల అనారోగ్యం, వృద్ధాప్యం, లేక దుఃఖం వంటి శ్రమలను అధిగమించగల్గుతాము. (కీర్తన 65:2) అయితే నిజంగా అర్థవంతమైన జీవితం కోసం మనం భవిష్యత్తును కూడా పరిగణలోనికి తీసుకోవలసిన అవసరం ఉంది.
ముందున్న నిరీక్షణయందు ఆనందించుట
‘క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి’ గురించి, అంటే విధేయతగల మానవ కుటుంబాన్ని పరిపాలించే నీతియుక్తమైన, శ్రద్ధగల పరలోక ప్రభుత్వాన్ని గురించి బైబిలు వాగ్దానం చేస్తుంది. (2 పేతురు 3:13) దేవుడు వాగ్దానం చేసిన ఆ నూతన లోకంలో, యుద్ధం అన్యాయం స్థానే శాంతి, న్యాయం ఉంటాయి. ఇది కేవలం ఒక ఆశ మాత్రమే కాదు గానీ అది ప్రతి రోజు బలపడే ఒక దృఢ నమ్మకం. అది నిజంగా సువార్తే, ఆనందించటానికి ఒక కారణమే.—రోమీయులు 12:12; తీతు 1:1-4.
శీర్షికారంభంలో పేర్కొన్న జాన్, ఇప్పుడు తన జీవితానికి గొప్ప అర్థం ఉందని భావిస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నేను ఎన్నడూ పెద్ద భక్తిపరునిగా ఉండకపోయినా, నేను ఎప్పుడూ దేవుడ్ని నమ్మాను. కానీ ఇద్దరు యెహోవాసాక్షులు నా దగ్గరికి వచ్చే వరకూ నేను ఈ నమ్మకాన్ని గురించి ఏమీ చేయలేదు. ‘మనమిక్కడ ఎందుకున్నాము? మనమెక్కడికి వెళ్తాము?’ వంటి ప్రశ్నలతో నేను ఆ యెహోవా సాక్షులను ఉక్కిరిబిక్కిరి చేసేశాను. వాళ్లిచ్చిన సంతృప్తికరమైన లేఖనాధార సమాధానాలు మొట్టమొదటి సారిగా నా జీవితానికొక సంకల్పం ఉందన్న భావాన్ని నాకు కలిగించాయి. అది కేవలం ప్రారంభం మాత్రమే. నా సంకల్పాలన్నిటినీ మార్చుకోవడానికి దారి తీసిన సత్యం కోసం నేను అపేక్షను ఏర్పరచుకున్నాను. నేను వస్తుసంబంధంగా ఇప్పుడు సంపన్నుడిని కాకపోయినా, ఆధ్యాత్మికంగా మాత్రం నేను కోటీశ్వరుడిననే భావిస్తాను.”
జాన్ వలే మీరు బహుశా మీ ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని చాలా సంవత్సరాల పాటు నిద్రాణ స్థితిలో వదిలేసి ఉండవచ్చు. అయితే “జ్ఞానహృదయము”ను పెంపొందింపజేసుకోవడం ద్వారా మీరు దాన్ని పునర్జీవింపజేసుకోవచ్చు. (కీర్తన 90:12) కృషీ నిశ్చయతలతో, మీరు నిజమైన ఆనందాన్ని, సమాధానాన్ని, నిరీక్షణను కల్గివుండవచ్చు. (రోమీయులు 15:13) అవును, అప్పుడు మీ జీవితానికి గొప్ప అర్థం చేకూరుతుంది.
[6వ పేజీలోని చిత్రం]
ప్రార్థన మనకు ‘దేవుని సమాధానాన్ని’ ఇవ్వగలదు
[7వ పేజీలోని చిత్రం]
ఏది కుటుంబ జీవితాన్ని మరింత సంతృప్తికరమైనదిగా చేయగలదో మీకు తెలుసా?