యెహోవాయే నాకు అభయమూ, బలమూ
జీవిత కథ
యెహోవాయే నాకు అభయమూ, బలమూ
మార్సెల్ ఫిల్టో చెప్పినది
“నువ్వు అతడ్ని పెళ్ళి చేసుకుంటే, జైలుకు వెళ్ళవలసి వస్తుంది.” నేను పెళ్ళి చేసుకోబోతున్న అమ్మాయితో ప్రజలు అన్న మాటలు అవి. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారో వివరిస్తానుండండి.
నేను 1927 లో జన్మించాను. అప్పట్లో, కెనడాలోని క్యూబెక్ అనే ప్రాంతం క్యాథలిక్ మతానికి కేంద్రస్థానంగా ఉండేది. నేను పుట్టిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకురాలైన సేసిల్ డూయ్‌ఫూర్, మోంట్రియల్ నగరంలోని మా ఇంటికి రావడం మొదలు పెట్టింది. ఆమె మా ఇంటికి అలా వస్తున్నందుకు, ఆమెను మా పొరుగువారు తరచూ బెదిరించేవారు. నిజానికి, బైబిలు సందేశాన్ని ప్రకటిస్తున్నందుకు, ఆమెను అనేక సార్లు అరెస్ట్ చేశారు, ఆమెతో నీచంగా వ్యవహరించారు. కనుక, “మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు” అని యేసు పలికిన మాటల్లోని సత్యాన్ని మేము త్వరలోనే తెలుసుకోగలిగాము.—మత్తయి 24:9.
కెనడాలోని ఫ్రెంచ్ భాష మాట్లాడే కుటుంబాలు క్యాథలిక్ మతాన్ని వదలడాన్ని గురించి కనీసం కలలో కూడా ఊహించలేరు అని అప్పట్లో చాలా మంది అనుకునేవారు. మా తల్లిదండ్రులు బాప్తిస్మం పొందిన సాక్షులు కానప్పటికీ, క్యాథలిక్ చర్చి బోధలు బైబిలుతో పొందికగా లేవన్న నిర్ధారణకు త్వరలోనే వచ్చారు. సాక్షులు ప్రచురించిన సాహిత్యాన్ని చదవమని తమ ఎనిమిది మంది పిల్లలను వాళ్ళు ప్రోత్సహించారు, బైబిలు సత్యం పక్షంగా నిలబడిన పిల్లలకు మద్దతునిచ్చారు.
క్లిష్ట సమయాల్లో స్థిరంగా నిలబడడం
1942 లో, నేను స్కూల్లో చదువుతున్నప్పుడే, బైబిలు అధ్యయనంలో నిజమైన ఆసక్తిని చూపించడం మొదలుపెట్టాను. కెనడాలోని యెహోవాసాక్షులు తొలి క్రైస్తవుల మాదిరిని అనుసరిస్తూ, జనాంగములు చేసే యుద్ధంలో పాల్గొనలేదు కాబట్టి, వారి కార్యకలాపాలను నిషేధించారు. (యెషయా 2:4; మత్తయి 26:52) మా అన్నయ్య రోలాన్డ్ మాలో అందరికన్నా పెద్దవాడు. ఆ సమయంలో జరుగుతున్న ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించినందుకు ఆయనను లేబర్ క్యాంపులో వేశారు.
* నేను, అలాంటి యథార్థతను చూపించినవారి ధైర్యవంతమైన మాదిరులను పోలి ఉండాలని పురికొల్పబడ్డాను. ఒక వ్యక్తి ఇంట్లో జరుగుతున్న యెహోవాసాక్షుల కూటాలకు హాజరు కావడం మొదలుపెట్టాను. త్వరలోనే, ప్రకటనా పనిలో పాల్గొనమని నన్ను ఆహ్వానించారు. నన్ను కూడా అరెస్ట్ చేయవచ్చు, జైలులో వేయవచ్చు అని తెలిసే, ఆ ఆహ్వానానికి అంగీకరించాను.
ఆ సమయంలోనే, ఫ్రెంచ్ భాషలోని ఒక పుస్తకాన్ని మా నాన్నగారు నాకిచ్చారు. అడాల్ఫ్ హిట్లర్ యొక్క సైనిక చర్యలకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించినందుకు జర్మనీలోని సాక్షులు అనుభవించిన యాతనలను ఆ పుస్తకం వర్ణించింది.బలం కోసం ప్రార్థించుకుని, నేను మొదటి ఇంటి తలుపును తట్టాను. దయగల ఒక మహిళ బదులిచ్చింది. నన్ను నేను పరిచయం చేసుకున్న తర్వాత, “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము . . . ప్రయోజనకరమై యున్నది” అని 2 తిమోతి 3:16 లోని మాటలను చదివి వినిపించాను.
“బైబిలు గురించి మరెక్కువగా తెలుసుకోవడానికి మీరు ఇష్టపడతారా?” అని అడిగాను.
“ఇష్టమే” అని ఆమె జవాబిచ్చింది.
బైబిలు గురించి నా కన్నా బాగా తెలిసిన నా స్నేహితుడ్ని తీసుకువస్తానని ఆమెకు చెప్పాను. మరుసటి వారం అలాగే తీసుకువెళ్ళాను. ఆ మొదటి అనుభవం తర్వాత, నాకు మరింత ఆత్మవిశ్వాసం కలిగింది, మనం పరిచర్యను మన సొంత బలంతో చేయడంలేదని గ్రహించాను. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, మనం యెహోవా సహాయంతో చేస్తున్నాం. వాస్తవానికి, ‘బలాధిక్యము మనది కాదు దేవునిది’ అని మనం గుర్తించడం చాలా ప్రాముఖ్యం.—2 కొరింథీయులు 4:7.
ఆ తర్వాత, ప్రకటనా పని నా జీవితంలో భాగమైంది, అలాగే నన్ను అరెస్ట్ చేయడమూ, జైలులో వేయడమూ కూడా జీవితంలో భాగమైంది. నా భార్య కాబోయే అమ్మాయితో, “నువ్వు అతడ్ని పెళ్ళి చేసుకుంటే, జైలుకు వెళ్ళవలసి వస్తుంది” అని ప్రజలు అనడంలో ఆశ్చర్యపడవలసిన పని లేదు! అయితే, ఆ అనుభవాలు నిజంగా అంత కఠినంగా లేవు. జైలులో ఒక రాత్రి గడిపిన తర్వాత, సాధారణంగా మా తోటి సాక్షులు ఎవరైనా బెయిలు మీద మమ్మల్ని విడుదల చేయించేవారు.
ప్రాముఖ్యమైన నిర్ణయాలు
1943 ఏప్రిల్‌లో, నన్ను నేను యెహోవాకు సమర్పించుకుని, నీటి బాప్తిస్మం పొందడం ద్వారా దాన్ని సూచించాను. తర్వాత, 1944, ఆగస్టులో, అమెరికాలోని, న్యూయార్క్‌లోని, బఫెలోలో మొదటిసారిగా పెద్ద సమావేశానికి హాజరయ్యాను. అది కెనడా సరిహద్దుకు అవతల ఉంది. అక్కడ, 25,000 మంది హాజరయ్యారు, ఆ కార్యక్రమం, పయినీరుగా ఉండాలన్న నా కోరికను ఉద్దీపింపజేసింది. యెహోవాసాక్షుల్లో, పూర్తికాల పరిచారకులను పయినీర్‌లు అని పిలుస్తారు. కెనడాలో యెహోవాసాక్షుల పనిపై విధించబడిన నిషేధాన్ని మే 1945 లో తీసివేశారు. నేను ఆ మరుసటి నెల నుండి పయినీరింగ్ మొదలుపెట్టాను.
పరిచర్యలో నేను ఎక్కువగా పాల్గొనే కొలది, జైలుకు వెళ్ళడం కూడా ఎక్కువైంది. దీర్ఘకాలంగా యెహోవాకు నమ్మకమైన దాసుడుగా ఉంటున్న మైక్ మిల్లర్ ఉన్న సెల్‌లోనే ఒకసారి గలతీయులు 5:15.
నన్ను వేశారు. మేము సిమెంట్ నేల మీద కూర్చుని మాట్లాడుకున్నాం. మా మధ్య జరిగిన ఆధ్యాత్మికంగా నిర్మాణాత్మకమైన సంభాషణ నన్ను చాలా బలపరచింది. ‘మా ఇద్దరి మధ్య అపార్థాలు ఏమైనా నెలకొని ఉన్నట్లయితే, మేము ఒకరితో ఒకళ్ళం మాట్లాడుకోని పరిస్థితిలో ఉన్నట్లయితే ఎలా ఉండేది?’ అన్న ప్రశ్న ఆ తర్వాత నా మనస్సులో మెదిలింది. జైలులో ఈ ప్రియ సహోదరునితో గడిపిన సమయం, నా జీవితంలో ఎంతో శ్రేష్ఠమైన పాఠాల్లో ఒకదాన్ని నేర్పింది. మనకు మన సహోదరులు కావాలి కనుక, మనం ఒకరినొకరం క్షమించుకోవాలి, ఒకరితోనొకరం దయగా ప్రవర్తించుకోవాలి అన్నదే ఆ పాఠం. లేకపోతే, అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లు, ‘మనం ఒకళ్ళనొకళ్ళం కరచుకొని భక్షించుకుంటే, మనం ఒకరి వలన ఒకరం బొత్తిగా నశించిపోవచ్చు.’—1945 సెప్టెంబరులో, కెనడాలోని టొరొంటోలోని వాచ్ టవర్ సొసైటీ బ్రాంచ్ ఆఫీస్‌లో సేవ చేయడానికి నన్ను ఆహ్వానించారు. బ్రాంచ్ ఆఫీస్‌ని బెతేల్ అని పిలుస్తారు. అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం నిజంగా నిర్మాణాత్మకమైనదిగా, విశ్వాసాన్ని బలపరచేదిగా ఉంటుంది. ఆ మరుసటి సంవత్సరం, బెతేల్‌కు చెందిన పొలంలో పని చేయడానికి నన్ను ఆహ్వానించారు, ఆ పొలం, బ్రాంచ్ ఆఫీస్‌కి ఉత్తరాన దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడ నేను స్ట్రాబెరీలను కోస్తుండగా, యువతియైన ఆన్ వాలినెక్‌కి శారీరక సౌందర్యమే కాక, యెహోవా అంటే ప్రేమా, ఆసక్తీ కూడా ఉన్నాయని గమనించాను. మా మధ్య ప్రేమ మొదలయ్యింది. చివరికి, 1947 జనవరిలో పెళ్ళి చేసుకున్నాం.
మేము తర్వాతి రెండున్నర సంవత్సరాలు ఒంటారియోలోని లండన్‌లో పయినీరింగ్ చేశాము. ఆ తర్వాత కేప్ బ్రెటన్ ఐలండ్‌లో పయినీరింగ్ చేశాము, అక్కడ ఒక సంఘం రూపొందడానికి మేము సహాయపడ్డాము. ఆ తర్వాత, 1949 లో, 14వ తరగతి వాచ్ టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కి మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ మాకు మిషనరీలయ్యే తర్ఫీదు లభించింది.
క్యూబెక్‌లో మిషనరీ పని
గిలియడ్ క్లాస్‌లో మునుపు గ్రాడ్యుయేట్స్ అయిన కెనడా దేశస్థులు క్యూబెక్‌లో ప్రకటనా పని ప్రారంభించడానికి నియమించబడ్డారు. 1950 లో, మేమూ, మాతోపాటు 14వ తరగతిలోని 25 మందీ వాళ్ళతో చేరాము. మిషనరీ కార్యకలాపాలు అధికం కావడంతో, రోమన్ క్యాథలిక్ చర్చి నాయకుల ప్రేరణతో ప్రజలు వేధించడం, హింసించడం అధికమయ్యింది.
మేము మొదటి మిషనరీ నియామకంలో రోయిన్ నగరానికి వచ్చి రెండు రోజులైన తర్వాత, ఆన్‌ను అరెస్ట్ చేసి, పోలీస్ కార్లో వెనుక కూర్చోబెట్టారు. ఆమెకు అది మొదటిసారి అనుభవం. ఆమె, కెనడాలోని మానిటోబా అనే చిన్న గ్రామ ప్రాంతం నుండి వచ్చింది. ఆమె పోలీసులను చూడడం చాలా తక్కువ. సహజంగానే, ఆమె భయపడింది, “నువ్వు అతడ్ని పెళ్ళి చేసుకుంటే, జైలుకు వెళ్ళవలసి వస్తుంది” అన్న మాటలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. అయితే, కారు నడపకముందు, పోలీసులు నన్ను చూసి, ఆన్‌తో పాటు నన్ను కూడా కారులో కూర్చోబెట్టారు. “నిన్ను చూసినందుకు సంతోషించాలా బాధపడాలా!” అని అంది. “యేసును గురించి ప్రకటించినందుకు అపొస్తలులకు కూడా ఇలాగే జరిగింది” అని ఆశ్చర్యం కలిగించేంతగా ప్రశాంతంగా ఉండిపోయింది. (అపొస్తలుల కార్యములు 4:1-3; 5:17, 18) ఆ రోజే, మమ్మల్ని బెయిల్ మీద విడుదల చేశారు.
ఆ సంఘటన జరిగి ఒక సంవత్సరమైన తర్వాత, మాకు మాంట్రియల్‌లో నియామకం దొరికింది. అక్కడ ఇంటింటి పరిచర్యలో ఉన్నప్పుడు, వీధిలో పెద్దగా అరవడం నాకు వినిపించింది, మనుష్యులు కోపంతో రాళ్ళు విసరడం కనిపించింది. ఆన్‌కీ, ఆమె సహచరురాలికీ సహాయపడేందుకు నేను వెళ్ళేసరికి, పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ మనుష్యులను అరెస్ట్ చేసే బదులు, ఆన్‌నీ, ఆమె సహచరురాలినీ వాళ్ళు అరెస్ట్ చేశారు! జైలులో ఉండగా, “మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు” అని యేసు అన్న మాటలోని సత్యాన్ని మనం అనుభవంలో తెలుసుకుంటున్నాం అని ఆ క్రొత్త సాక్షికి ఆన్ గుర్తు చేసింది.—మత్తయి 10:22.
ఒకసారి, క్యూబెక్‌లో యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా దాదాపు 1,700 కేసులు విచారణకోసం పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా, తిరుగుబాటును ప్రబోధించే సాహిత్యాన్ని పంపిణీ చేస్తున్నామనో, లైసెన్స్ లేకుండా సాహిత్యాన్ని పంపిణీ చేస్తున్నామనో కేసులు నమోదు చేసేవారు. దాని ఫలితంగా క్యూబెక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాచ్ టవర్ సొసైటీ యొక్క లీగల్ డిపార్ట్‌మెంట్ చర్య తీసుకుంది. అనేక సంవత్సరాలుగా చట్టసంబంధ యుద్ధం చేసిన తర్వాత, కెనడాలోని సుప్రీం కోర్టు ఎదుట యెహోవా మాకు రెండు ఘన విజయాలను ప్రసాదించాడు. 1950 డిసెంబర్‌లో, మా సాహిత్యాలు తిరుగుబాటును ప్రబోధిస్తున్నాయన్న ఆరోపణనుండి మమ్మల్ని విముక్తులను చేశారు. 1953 అక్టోబర్‌లో, లైసెన్స్ లేకుండా బైబిలు సాహిత్యాన్ని పంపిణీ చేసే హక్కు మాకుందని కోర్టు చెప్పింది. నిజంగానే దృశ్యమైన ప్రతి మార్గంలోనూ యెహోవా, “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు” అని మేము గ్రహించగల్గాం.—కీర్తన 46:1.
క్యూబెక్‌లో 1945 లో నేను పయినీరింగ్ మొదలు యెషయా 54:17.
పెట్టినప్పుడు, సాక్షుల సంఖ్య 356 ఉండేది, అది నేడు 24,000 కన్నా ఎక్కువగా ఉంది! “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు” అని బైబిలు ప్రవచనం చెప్పినట్లుగానే చివరికి జరిగింది.—ఫ్రాన్స్‌లో మా పని
1959 సెప్టెంబర్‌లో, ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని బెతేల్‌లో సేవ చేసేందుకు నన్నూ, ఆన్‌నీ ఆహ్వానించారు. అక్కడ ముద్రణా పనిలో నేతృత్వం వహించే పని నాకు నియమించబడింది. 1960 జనవరిలో మేము అక్కడికి వెళ్ళేంత వరకు, పత్రికలను ఒక వాణిజ్య సంస్థ ముద్రించేది. అప్పట్లో, ఫ్రాన్స్‌లో కావలికోట పత్రికను నిషేధించారు కనుక, మేము ప్రతి నెలా కావలికోటను 64 పేజీల చిన్న పుస్తకంగా ముద్రించేవాళ్ళం. ఆ చిన్న పుస్తకం పేరు ది ఇంటీరియర్ బులెటిన్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్. ఆయా నెలల్లో సంఘాల్లో పఠనం చేయవలసిన శీర్షికలు అందులో ఉండేవి. ఫ్రాన్స్‌లో, ప్రకటనా పనిలో పాల్గొనే వారి సంఖ్య 1960 లో 15,439గా ఉండేది, అది 1967 లో 26,250గా పెరిగింది.
చివరికి, చాలా మంది మిషనరీలను ఇతర ప్రాంతాలకు నియమించారు, కొందరిని ఆఫ్రికాలో ఫ్రెంచ్ మాట్లాడే ప్రాంతాలకు, మరి కొందరిని తిరిగి క్యూబెక్‌కు నియమించారు. ఆన్‌కు ఆరోగ్యం బాగోలేక, ఆపరేషన్ అవసరమైనందువల్ల, మేము తిరిగి క్యూబెక్‌కు వెళ్ళాం. మూడు సంవత్సరాలు మందులు తీసుకున్న తర్వాత, ఆన్ ఆరోగ్యం కోలుకుంది. ఆ తర్వాత, ఒక్కోవారం ఒక్కో సంఘానికి వెళ్ళి ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రాంతీయ సేవకు నన్ను నియమించారు.
ఆఫ్రికాలో మిషనరీ పని
కొన్ని సంవత్సరాల తర్వాత, 1981 లో, జైర్‌లో మిషనరీలుగా సేవ చేసే క్రొత్త నియామకం అందినప్పుడు మాకు ఎంతో ఆహ్లాదం కలిగింది. జైర్ ఇప్పుడు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అక్కడి ప్రజలు పేదవారు, వాళ్ళు చాలా కష్టాలను అనుభవించేవారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ కేవలం 25,753 మంది సాక్షులే ఉండేవారు. కాని నేడు, 1,13,000 కన్నా ఎక్కువ మంది సాక్షులు ఉన్నారు. 1999 లో, క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి 4,46,362 మంది హాజరయ్యారు!
క్రొత్త బ్రాంచ్ ఆఫీస్‌ను నిర్మించేందుకు 1984 లో ప్రభుత్వం నుండి దాదాపు 500 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాం. ఆ తర్వాత, 1985 డిసెంబరులో, రాజధాని నగరమైన కిన్‌షాసాలో అంతర్జాతీయ సమావేశం జరిగింది. ప్రపంచంలోని పలు భాగాల నుండి 32,000 మంది హాజరయ్యారు. ఆ తర్వాత, జైర్‌లో పాదిరీలు రేకెత్తించిన వ్యతిరేకత మా పనికి అంతరాయం కలిగించింది. 1986, మార్చి 12న, బాధ్యతగల సహోదరులకు ఒక ఉత్తరం అందింది. అది జైర్‌లోని యెహోవాసాక్షుల సమాజం చట్టవిరుద్ధమైనదని ప్రకటించింది. మా కార్యకలాపాలాన్నింటిపై పెట్టబడిన ఈ నిషేధంపై, దేశ అధ్యక్షుడైన మొబుటూ సీసే సీకో సంతకం పెట్టాడు, ఇప్పుడాయన లేడు.
అకస్మాత్తుగా అలా జరగడంతో, “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” అన్న బైబిలు ఉపదేశాన్ని మేము అన్వయించుకోవలసి వచ్చింది. (సామెతలు 22:3) కిన్‌షాసాలో మన ప్రచురణలను ముద్రించేందుకు విదేశం నుండి పేపర్‌నూ, ఇంకునూ, ఫిల్మ్‌నూ, ప్రింటింగ్ ప్లేట్లనూ, కెమికల్స్‌నీ తెప్పించుకునే మార్గాలను కనుక్కున్నాం. మేము మా పంథాలో ఒక తరహా పంపిణీ వ్యవస్థను కూడా పెంపొందించుకున్నాం. మేము ఒకసారి, అన్నీ సంస్థీకరించుకున్నాక, మా విధానం ప్రభుత్వ పోస్ట్‌ల సర్వీసు కన్నా మెరుగ్గా ప్రవర్తించనారంభించింది!
వేలాదిమంది సాక్షులను అరెస్ట్ చేశారు, చాలా మందిని అతి క్రూరంగా హింసించారు. అయినప్పటికీ, ఏదో అతి కొద్ది మంది తప్ప, మిగతావాళ్ళందరూ అలాంటి వేధింపును సహిస్తూ, విశ్వాసాన్ని విడువకుండా ఉండగలిగారు. నన్ను కూడా అరెస్ట్ చేశారు, జైలులో సహోదరులు అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితులను చూశాను. రహస్య పోలీసులూ, అధికారులూ మమ్మల్ని అనేక విధాలుగా అణగద్రొక్కారు, అయినప్పటికీ, యెహోవా తప్పించుకునే మార్గాన్ని చూపిస్తూనే వచ్చాడు.—2 కొరింథీయులు 4:8.
మేము ఒక వ్యాపారస్థుని స్టోర్‌హౌస్‌లో 3,000 కార్టన్ల సాహిత్యాన్ని దాచి ఉంచాం. అయితే, చివరికి, ఆయన పనివాళ్ళలో ఒకరు ఈ విషయాన్ని రహస్య పోలీసులకు తెలియజేశారు, వాళ్ళు ఆ వ్యాపారస్థుడ్ని అరెస్ట్ చేశారు. ఆయనను జైలుకు తీసుకువెళ్తున్నారు, అదే మార్గంలో నేను కారులో వస్తూ వాళ్ళకు ఎదురయ్యాను. నన్ను చూపించి ఆ సాహిత్యాన్ని ఉంచే ఏర్పాటు చేయమని అడిగింది నేనే అని ఆయన వాళ్ళకు తెలియజేశాడు. ఆ పోలీసులు ఆగి, దాని గురించి నన్ను అడిగి, ఆయన స్టోర్‌హౌస్‌లో చట్టవిరుద్ధమైన సాహిత్యాన్ని ఉంచినందుకు నన్ను నిందించారు.
“వాటిలో ఏదైన ఒక పుస్తకం మీ దగ్గర ఉందా?” అని నేనడిగాను.
“ఉన్నాయి” అని వాళ్ళు జవాబిచ్చారు.
“నాకు కొంచెం చూపిస్తారా?” అని నేనడిగాను.
వాళ్లు ఒక పుస్తకం తీసుకువచ్చి చూపించారు, దానిలోని ఒక పేజీని వాళ్ళకు చూపించాను. “అమెరికాలో, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ముద్రించినది” అని అందులో ఉంది.
“మీ చేతిలో ఉన్నది అమెరికావాళ్ళది, జైర్‌కి చెందినది కాదు. మీ ప్రభుత్వం నిషేధించింది, జైర్‌లోని యెహోవాసాక్షుల సమాజపు చట్టబద్ధమైన కార్పొరేషన్‌పైనే కానీ, అమెరికాలోని వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీపై కాదు. కనుక మీరు ఈ ప్రచురణలతో ఏం చేయబోతున్నారన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి” అని వాళ్ళకు గుర్తు చేశాను.
నన్ను అరెస్ట్ చేయమన్న కోర్టు ఆర్డర్ వాళ్ళకు లేదు కనుక, నన్ను వెళ్ళడానికి వాళ్ళు అనుమతించారు. అదే రాత్రి, మేము రెండు ట్రక్కులను తీసుకుని ఆ స్టోర్‌హౌస్‌కు వెళ్ళి, సాహిత్యాలనన్నింటినీ తీసుకుని ఆ స్టోర్‌హౌస్‌ని ఖాళీ చేశాం. అధికారులు మరుసటి రోజు అక్కడికి వచ్చినప్పుడు, అక్కడ ఖాళీగా ఉండడం చూసి చాలా కలతచెందారు. అప్పటికి వాళ్లు నా కోసం వెదకడం మొదలెట్టారు, నన్ను అరెస్ట్ చేయమన్న కోర్టు ఆర్డర్ ఇప్పుడు వాళ్ళకు ఉంది. వాళ్ళకు నేను దొరికాను, అప్పుడు వాళ్ళు కారులో రాలేదు కనుక, జైలుకు నేనే కారు నడపవలసి వచ్చింది! మరొక సాక్షి నాతోపాటు వచ్చి, వాళ్ళు నా కారును క్లెయిమ్ చెయ్యక ముందే, కారును తిరిగి తీసుకువెళ్ళాడు.
ఎనిమిది గంటల ఇంటరాగేషన్ తర్వాత, వాళ్ళు నన్ను దేశబహిష్కరణ చేయాలి అని నిర్ణయించారు. అయితే, జైర్‌లో నిషేధించబడిన యెహోవాసాక్షుల సమాజపు ఆస్తులను మదింపు చేసేందుకు నా నియామకాన్ని ధృవీకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తరం యొక్క కాపీని వాళ్ళకు చూపించాను. ఆ విధంగా నేను బెతేల్‌లో నా పనిని కొనసాగించే అనుమతి నాకు లభించింది.
జైర్‌లో నిషేధమున్న కాలంలో అనేక ఒత్తిళ్ళ మధ్య నాలుగు సంవత్సరాలు సేవచేసిన తర్వాత, నాకు కడుపులో బ్లీడింగ్ అల్సర్ వచ్చింది, అది నిజంగా ప్రాణాంతకమైనది. నేను దక్షిణ ఆఫ్రికాకు వెళ్ళి చికిత్స పొందాలని నిర్ణయించారు. అక్కడ బ్రాంచ్ నన్ను బాగా చూసుకుంది, నేను బాగా కోలుకున్నాను. జైర్‌లో ఎనిమిది సంవత్సరాలు సేవచేశాం. అది నిజంగా గుర్తుంచుకోదగిన సంతోషకరమైన అనుభవం. ఆ తర్వాత, మేము 1989 లో దక్షిణ ఆఫ్రికా బ్రాంచ్‌కి తరలివెళ్ళాం. 1998 లో మేము మా స్వదేశానికి తిరిగి వచ్చాం. అప్పటి నుండి కెనడా బెతేల్‌లో సేవ చేస్తున్నాం.
సేవ చేయగల్గుతున్నందుకు కృతజ్ఞులం
నేను నా 54 ఏళ్ళ పూర్తికాల పరిచర్యను వెనుదిరిగి చూస్తే, నేను నా యౌవన చైతన్యాన్ని ప్రశస్తమైన యెహోవా సేవలో ఉపయోగించగలిగినందుకు చాలా కృతజ్ఞుడను. ఆన్ అనేక శ్రమకరమైన పరిస్థితులను అనుభవించవలసి వచ్చినప్పటికీ, ఆమె ఎన్నడూ ఫిర్యాదులు చేయలేదు, నా కార్యకలాపాలన్నింటిలోను నాకు ఎంతో మద్దతునిచ్చింది. అనేకమంది యెహోవాను గురించి తెలుసుకునేందుకు మేమిద్దరం కలిసి సహాయం చేసే ఆధిక్యత మాకు లభించింది. వారిలో చాలా మంది ఇప్పుడు పూర్తికాల పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు కొందరూ, వాళ్ళ మనవళ్ళూ మనవరాండ్రూ కూడా గొప్పవాడైన యెహోవా దేవునికి సేవ చేయడాన్ని చూడడం చాలా ఆనందంగా ఉంది!
యెహోవా మాకిచ్చిన ఆధిక్యతలతోనూ, ఆశీర్వాదాలతోనూ పోల్చదగినవేటినీ ఈ లోకం ఇవ్వలేదన్న నమ్మకం నాకుంది. నిజమే, మేము చాలా శ్రమలను అనుభవించాం, అయితే అవన్నీ యెహోవా మీద మాకున్న విశ్వాసమూ, నమ్మకమూ మరింత బలపడడానికి సహాయపడ్డాయి. నిజానికి ఆయన ఆశ్రయమును దుర్గమునై యున్నాడనీ, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనీ నిరూపించుకున్నాడు.
[అధస్సూచీలు]
^ పేరా 9 ఆ పుస్తకాన్ని మొదట జర్మన్ భాషలో ప్రచురించారు. దాని పేరు, క్రోయిట్స్‌సూగ్ గేగన్ డాస్ క్రిస్టన్‌టూమ్ (క్రైస్తవత్వానికి వ్యతిరేకమైన క్రూసేడ్). దాన్నే, ఫ్రెంచ్, పోలిష్ భాషల్లోకి అనువదించారు, కాని ఇంగ్లీష్‌లోకి అనువదించలేదు.
[26వ పేజీలోని చిత్రాలు]
1947 లో మేము కలిసి పయినీరింగ్ చేస్తున్నప్పుడు; నేడు ఆన్‌తో
[29వ పేజీలోని చిత్రం]
మేము జైర్‌లో కలిసిన వ్యక్తులకు బైబిలు సత్యంపై చాలా మక్కువ ఉంది