“యిష్టవస్తువులు” యెహోవా మందిరంలోనికి వస్తున్నాయి
“యిష్టవస్తువులు” యెహోవా మందిరంలోనికి వస్తున్నాయి
“నేను [యెహోవా] అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును.”—హగ్గయి 2:7.
1. అత్యవసర సమయంలో మనమెందుకు మనం ప్రేమించేవారి గురించి మొదట ఆలోచిస్తాము?
ఎలాంటి ఇష్టవస్తువులతో మీ ఇంటిని నింపుకుంటారు? మీకు విలాసవంతమైన ఫర్నీచరుందా, అత్యంతాధునికమైన కంప్యూటర్ ఉందా, మీ గారేజ్‌లో కొత్త కారుందా? ఇవన్నీ మీకు ఉన్నప్పటికీ, మీ ఇంట్లో మీరు అమూల్యంగా ఎంచేది మనుష్యులనే అంటే, మీ కుటుంబ సభ్యులనే అని మీరు అంగీకరించరా? ఒక రాత్రి పొగ వాసనకి మీకు మెలకువ వచ్చిందనుకోండి. మీ ఇల్లు కాలిపోతోంది, తప్పించుకోవటానికి ఎక్కువ సమయం లేదు! మీరు మొదట వేటి గురించి ఆలోచిస్తారు? మీ ఫర్నీచర్ గురించా? మీ కంప్యూటర్ గురించా? మీ కారు గురించా? మీరు మీ వాళ్ల గురించి ఆలోచించరా? అవును మీరు మీ ఇంట్లోవాళ్ల గురించి ఆలోచిస్తారు, వస్తువులకన్నా వ్యక్తులు విలువైనవారు.
2. యెహోవా సృష్టి విస్తృతమెంత, దానిలో ఏ అంశం యేసుకు ఎక్కువ ప్రియమైనది?
2 ఇప్పుడు యెహోవా దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఆలోచించండి. యెహోవా “ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన”వాడు. (అపొస్తలుల కార్యములు 4:24) యెహోవా ఇతర వాటినన్నింటినీ, “ప్రధానశిల్పి” అయిన తన కుమారుని ద్వారా సృష్టించాడు. (సామెతలు 8:30, 31; యోహాను 1:3; కొలొస్సయులు 1:15-17) యెహోవా యేసుక్రీస్తులిద్దరూ సృష్టించబడిన సమస్తాన్నీ అమూల్యంగా ఎంచుతారనడంలో సందేహం లేదు. (పోల్చండి ఆదికాండము 1:31.) అయితే సృష్టిలో ఏది వాళ్లకు ఎక్కువ ప్రియమైనదని మీరనుకుంటారు—వస్తువులా లేక మనుష్యులా? మూర్తీభవించిన జ్ఞానము అయిన యేసు ఇలా చెప్పాడు: “నరులను చూచి ఆనందించుచునుంటిని,” లేదా విలియమ్ ఎఫ్. బెక్ అనువాదం దాన్నిలా అనువదిస్తుంది, యేసు “మానవులను బట్టి ఆనందించాడు.”
3. హగ్గయి ద్వారా యెహోవా ఏ ప్రవచనాన్ని చెప్పాడు?
3 నిశ్చయంగా యెహోవా, ప్రజలకు గొప్ప విలువనిస్తాడు. దీనికి ఒక సూచన సా.శ.పూ. 520 లో తన ప్రవక్తయైన హగ్గయి ద్వారా తాను పలికిన ప్రవచన మాటల్లో కనబడుతుంది. యెహోవా ఇలా ప్రకటించాడు: “నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; . . . ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించు[ను].”—హగ్గయి 2:7, 9.
4, 5. (ఎ) “యిష్టవస్తువులు” అనే వ్యక్తీకరణ వస్తుసంపత్తిని సూచిస్తుందనటం ఎందుకు సహేతుకమైన ముగింపుకాదు? (బి) ‘యిష్టవస్తువులను’ మీరు ఎలా నిర్వచిస్తారు, ఎందుకని?
* స్వదేశానికి తిరిగివచ్చిన ఈ చిన్న ప్రజల గుంపు నిర్మించిన మందిరం, వస్తుపరమైన వైభవం విషయంలో సొలొమోను నిర్మించిన మందిరాన్ని మించిపోవాలని యెహోవా ఎంతమాత్రం అపేక్షించడు!
4 ఏ “యిష్టవస్తువులు” యెహోవా మందిరానికి వచ్చి, దానికి ఇంతకుముందు లేని మహిమను తీసుకురావల్సివుంది? ఖరీదైన ఫర్నీచరూ, అందమైన అలంకరణలా? బంగారం, వెండి, విలువైన రాళ్లా? అది ఎంతమాత్రం సహేతుకంగా అనిపించదు. అప్పటికి దాదాపు ఐదు శతాబ్దాల క్రితం ప్రారంభించబడిన మునుపటి ఆలయాన్ని జ్ఞాపకం చేసుకోండి, అది భారీ వ్యయంతో కూడిన నిర్మాణం!5 మరైతే, యెహోవా మందిరాన్ని నింపే “యిష్టవస్తువులు” ఏమిటి? అవి మనుష్యులేనని స్పష్టమౌతుంది. ఎంతైనా యెహోవా హృదయాన్ని సంతోషపర్చేది వెండి బంగారాలు కాదుగానీ, ప్రేమతో ఆయన సేవ చేసే ప్రజలే. (సామెతలు 27:11; 1 కొరింథీయులు 10:26) అవును, తనకు అంగీకృతమైన విధంగా తనను ఆరాధించే స్త్రీ పురుషులను, పిల్లలను యెహోవా విలువైనవారిగా ఎంచుతాడు. (యోహాను 4:23, 24) వీరే “యిష్టవస్తువులు,” సొలొమోను నిర్మించిన మందిరాన్ని అలంకరించిన భూషణాలన్నిటికన్నా వీరే యెహోవా దృష్టిలో ఎంతో అమూల్యమైనవారు.
6. దేవుని ప్రాచీనకాల దేవాలయం ఏ సంకల్పాన్ని నెరవేర్చింది?
6 ఎడతెగని వ్యతిరేకత ఉన్నప్పటికీ, మందిర నిర్మాణం సా.శ.పూ. 515 లో ముగిసింది. యేసు బలి సమయం వరకు, యెరూషలేములోని మందిరం, సహజ యూదులతో మతప్రవిష్ఠులైన అన్యులతో కూడిన అనేకమంది ‘యిష్టవస్తువులకు’ స్వచ్ఛారాధనా కేంద్రంగా ఉంది. కానీ ఆ మందిరం మరింత గొప్పదానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, అదేమిటో మనం చూద్దాము.
మొదటి శతాబ్దపు నెరవేర్పు
7. (ఎ) యెరూషలేములో ఉన్న దేవుని ప్రాచీనకాల దేవాలయం దేనికి ముంగుర్తుగా ఉంది? (బి) ప్రాయశ్చిత్తదినం నాడు ప్రధానయాజకుడు ఏం చేస్తాడో వివరించండి.
7 యెరూషలేములోని మందిరం ఆరాధనకోసమైన గొప్ప ఏర్పాటుకు ముంగుర్తుగా ఉంది. అది దేవుని ఆధ్యాత్మిక ఆలయం, యెహోవా సా.శ. 29 లో, యేసును దాని ప్రధానయాజకునిగా నియమించాడు. (హెబ్రీయులు 5:4-10; 9:11, 12) ఇశ్రాయేలు ప్రధానయాజకుడి బాధ్యతలకూ యేసు చర్యలకూ మధ్యనున్న సమాంతరాన్ని పరిశీలించండి. ప్రతి సంవత్సరం ప్రాయశ్చిత్త దినాన ప్రధానయాజకుడు దేవాలయ ఆవరణములో ఉన్న బలిపీఠం వద్దకు వెళ్లి, దానిమీద యాజకుల పాపాల ప్రాయశ్చిత్తం కోసం ఒక కోడెను అర్పించేవాడు. తర్వాత, ఆయన ఆ కోడె రక్తాన్ని తీసుకుని దేవాలయంలోకి ప్రవేశించి, ఆవరణనూ పరిశుద్ధస్థలాన్నీ వేరుచేస్తున్న ద్వారాలను దాటి, పరిశుద్ధస్థలాన్నీ అతి పరిశుద్ధస్థలాన్నీ వేరుచేస్తున్న అడ్డుతెరను దాటి వెళ్లేవాడు. అతి పరిశుద్ధస్థలంలోకి ప్రవేశించిన తర్వాత, ప్రధానయాజకుడు రక్తాన్ని నిబంధన మందసము ఎదుట ప్రోక్షించేవాడు. తర్వాత అదే పద్ధతిని అనుసరిస్తూ, యాజకులుకాని ఇశ్రాయేలు 12 గోత్రాలవారి ప్రాయశ్చిత్తం కోసం మేకను అర్పించేవాడు. (లేవీయకాండము 16:5-15) ఈ ఆచరణకూ దేవుని ఆధ్యాత్మిక ఆలయానికీ ఎలాంటి సంబంధం ఉంది?
8. (ఎ) సా.శ. 29 మొదలుకొని యేసు ఏ భావంలో అర్పించబడ్డాడు? (బి) యేసు తన భూపరిచర్య కాలమంతటిలో యెహోవాతో ఎలాంటి ప్రత్యేక సంబంధాన్ని అనుభవించాడు?
8 సా.శ. 29 లో యేసు బాప్తిస్మం తీసుకుని, దేవుని పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు దేవుని చిత్తమనే బలిపీఠంపై యేసు అర్పించబడ్డాడు. (లూకా 3:21, 22) వాస్తవానికి, ఈ సంఘటన, మూడున్నర సంవత్సరాలపాటు కొనసాగిన యేసు త్యాగపూరిత జీవితకాల ఆరంభాన్ని సూచిస్తుంది. (హెబ్రీయులు 10:5-10) యేసు ఆ కాలంలో, దేవునితో ఆత్మజనిత సంబంధాన్ని అనుభవించాడు. యేసుకు తన పరలోక తండ్రి ఎదుట ఉన్న ఈ అసమానమైన స్థానాన్ని ఏ ఇతర మానవులూ పూర్తిగా అవగతం చేసుకోలేకపోయారు. ఆవరణలోని వారికి పరిశుద్ధస్థలం కనిపించకుండా ఎలా అక్షరార్థమైన తెర అడ్డుగా ఉండేదో అలాగే వారి వివేచనా నేత్రాలకు పొరలు కప్పినట్లుగా ఉంది.—నిర్గమకాండము 40:28.
9. యేసు మానవునిగా పరలోకంలోకి ఎందుకు ప్రవేశించలేడు, ఈ పరిస్థితి ఎలా పరిష్కరించబడింది?
9 యేసు అనే ఈ మనిషి, దేవుని ఆత్మజనిత కుమారుడే అయినప్పటికీ పరలోకంలో జీవితాన్ని పొందలేడు. ఎందుకని? ఎందుకంటే రక్తమాంసాలు దేవుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. (1 కొరింథీయులు 15:44, 50) యేసు మానవ శరీరం ఒక అవరోధంగా ఉన్నది గనుక అది, దేవుని ప్రాచీన ఆలయంలో పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధస్థలాన్ని వేరుపరచే తెర ద్వారా చక్కగా సూచించబడింది. (హెబ్రీయులు 10:20) కానీ యేసు మరణించిన మూడు రోజుల తర్వాత, దేవుడు ఆయనను ఒక ఆత్మగా పునరుత్థానం చేశాడు. (1 పేతురు 3:18) ఇప్పుడు ఆయన దేవుని ఆధ్యాత్మిక ఆలయంలోని అతి పరిశుద్ధస్థలంలోకి అంటే పరలోకంలోకి ప్రవేశించగలడు. ఖచ్చితంగా జరిగిందదే. పౌలు ఇలా వ్రాశాడు: “అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.”—హెబ్రీయులు 9:24.
10. పరలోకానికి తిరిగి వెళ్లిన తర్వాత యేసు ఏమి చేశాడు?
10 పరలోకంలో, యేసు తన జీవరక్తపు విమోచనక్రయధన విలువను యెహోవాకు అందించడం ద్వారా తన బలి ‘రక్తాన్ని ప్రోక్షించాడు.’ అయితే, యేసు అంతకంటే ఎక్కువే చేశాడు. తన మరణానికి కాస్త ముందు, ఆయన తన అనుచరులకు ఇలా చెప్పాడు: “మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.” (యోహాను 14:2, 3) కాబట్టి యేసు అతి పరిశుద్ధస్థలంలోకి, లేదా పరలోకంలోకి ప్రవేశించడం ద్వారా ఇతరులు కూడా అనుసరించటానికి మార్గాన్ని తెరిచాడు. (హెబ్రీయులు 6:19, 20) వీరు దేవుని ఆధ్యాత్మిక ఆలయ ఏర్పాటులో ఉపయాజకులుగా సేవచేస్తారు, వారి సంఖ్య 1,44,000. (ప్రకటన 7:4; 14:1; 20:6) ఇశ్రాయేలులోని ప్రధానయాజకుడు కోడె రక్తాన్ని మొదట యాజకుల పాపముల ప్రాయశ్చిత్తం కోసం అతి పరిశుద్ధస్థలంలోకి తీసుకు వెళ్లినట్లుగానే, యేసు చిందించిన రక్తం విలువ మొదట 1,44,000 మంది ఉపయాజకులకు అన్వయించబడింది. *
ఆధునిక-దిన “యిష్టవస్తువులు”
11. ఇశ్రాయేలీయుల ప్రధానయాజకుడు ఎవరి పక్షాన మేకను అర్పిస్తాడు, ఇది దేనికి ముంగుర్తుగా ఉంది?
11 అభిషిక్తుల సాధారణ సమకూర్పు 1935 నాటికి పూర్తైనట్లు కనిపిస్తుంది. * కానీ యెహోవా తన ఇంటిని మహిమపర్చటం పూర్తికాలేదు. “యిష్టవస్తువులు” ఇంకా రానై ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రధానయాజకుడు రెండు జంతువులను అర్పించేవాడు—యాజకుల పాపములకోసం కోడెను, యాజకులుకాని గోత్రాలకోసం మేకను అర్పించేవాడని గుర్తు తెచ్చుకోండి. యాజకులు పరలోక రాజ్యంలో యేసుతోపాటు ఉండే అభిషిక్తులను సూచిస్తుండగా, యాజకులుకాని గోత్రాలు ఎవరిని సూచిస్తున్నాయి? దానికి సమాధానం యోహాను 10:16 లో వ్రాయబడివున్న, యేసు చెప్పిన ఈ మాటల్లో కనుగొనవచ్చు: “ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.” కాబట్టి, యేసు చిందించిన రక్తము రెండు గుంపులకు అంటే, మొదటిగా, పరలోకంలో యేసుతోపాటు పరిపాలించే నిరీక్షణ ఉన్న క్రైస్తవులకు, రెండవదిగా, పరదైసు భూమిపై నిత్యజీవం కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. హగ్గయి ప్రవచనంలోని “యిష్టవస్తువులు” ఈ రెండవ గుంపునే చిత్రీకరిస్తున్నాయని స్పష్టమౌతుంది.—మీకా 4:1, 2; 1 యోహాను 2:1, 2.
12. ఈనాడు అనేకమంది “యిష్టవస్తువులు” ఎలా దేవుని మందిరంలోకి సమకూర్చబడుతున్నారు?
12 యెహోవా మందిరం ఇప్పటికీ ఈ “యిష్టవస్తువుల”తో నింపబడుతూంది. ఇటీవలి సంవత్సరాల్లో, తూర్పు యూరప్‌లో, ఆఫ్రికాలోని కొన్ని భాగాలలో, ఇతర దేశాల్లో నిషేధాలు ఎత్తివేయబడటంతో, దేవుని స్థాపిత రాజ్యాన్ని గూర్చిన సువార్త ఇంతవరకూ ప్రకటించబడని ప్రాంతాల్లో ప్రకటించడం సాధ్యమైంది. యిష్టవస్తువులవంటి వారు దేవుని ఆలయ ఏర్పాటులోకి వస్తూ, యేసు ఆజ్ఞకు అనుగుణంగా వారు ఇతర శిష్యులను తయారు చేయటానికి కృషిచేశారు. (మత్తయి 28:19, 20) వారు అలా చేస్తూ, యెహోవా మందిరాన్ని మహిమపర్చే “యిష్టవస్తువులు” కాగల అనేకులను, అంటే యౌవనులను వృద్ధులను కలుస్తారు. ఇది ఎలా జరుగుతూ ఉందో కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.
13. రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయటంలో తనకున్న ఉత్సాహాన్ని బొలీవియాలోని ఒక చిన్నమ్మాయి ఎలా ప్రదర్శించింది?
13 బొలీవియాలో, సాక్షుల కూతురైన ఐదేండ్ల ఒక అమ్మాయి ప్రయాణ పైవిచారణకర్త సందర్శన వారంలో తనకు స్కూలు నుండి సెలవు ఇప్పించమని తన టీచరును అడిగింది. ఎందుకు? ప్రత్యేక కార్యకలాపాలు జరిగే ఆ వారమంతటిలోనూ ఆమె పరిచర్యలో భాగం వహించాలనుకున్నది. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, కానీ ఆమెకున్న చక్కని దృక్పథాన్ని బట్టి వారెంతో ఆనందించారు. ఆ చిన్నమ్మాయి ఇప్పుడు ఐదు గృహ బైబిలు పఠనాలు చేస్తోంది, వారిలో కొందరు క్రైస్తవ కూటాలకు హాజరవుతున్నారు. అంతేకాదు, ఆమె తన స్కూల్ టీచర్‌ను కూడా రాజ్యమందిరానికి తీసుకొచ్చింది. బహుశ తగిన సమయంలో, ఆమె బైబిలు విద్యార్థుల్లో కొందరు యెహోవా మందిరాన్ని మహిమపర్చే “యిష్టవస్తువులు” కావచ్చు.
14. కొరియాలో, ఒక సహోదరి ఆసక్తిలేనట్లున్న ఒక వ్యక్తిపట్ల పట్టుదల కల్గివుండి ఎలా ప్రతిఫలాన్ని పొందింది?
14 కొరియాలోని ఒక రైల్వేస్టేషన్‌లో వేచివున్న ఒక క్రైస్తవురాలు, తన హెడ్‌ఫోన్లతో సంగీతం వింటున్న ఒక విద్యార్థి దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది: “మీరేదైనా మతాన్ని అవలంబిస్తున్నారా?” ఆ విద్యార్థి ఇలా అన్నాడు: “నాకు ఏ మతంలోనూ ఆసక్తి లేదు.” ఆ సహోదరి నిరుత్సాహపడలేదు. ఆమె ఇలా అంది: “కాలం గడుస్తుండగా ఒక వ్యక్తి ఏదొక మతాన్ని ఎన్నుకోవాలనుకోవచ్చు. కానీ అతనికి మతాన్ని గురించిన జ్ఞానం లేకపోతే, అతడు తప్పుదాన్ని ఎన్నుకోవచ్చు.” ఆ విద్యార్థి ముఖకవళికలు మారాయి, ఆయన ఆసక్తిగా మన సహోదరి చెప్తున్నది వినటం మొదలెట్టాడు. ఆమె ఆయనకు మీ పట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఇచ్చి, ఆయన మతాన్ని ఎన్నుకునే సమయం వచ్చినప్పుడు ఈ పుస్తకం ఆయనకు ఎంతగానో సహాయం చేస్తుందని తెలియజేసింది. ఆయన వెంటనే ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాతి వారం, ఆయన యెహోవాసాక్షులతో బైబిలు పఠనం ప్రారంభించాడు, ఇప్పుడు ఆయన అన్ని సంఘ కూటాలకూ హాజరవుతున్నాడు.
15. జపాన్‌లోని ఒక చిన్నమ్మాయి ఎలా బైబిలు పఠనాల్ని ప్రారంభిస్తుంది, ఆమె ప్రయత్నాలకు ఏ ప్రతిఫలాలు లభించాయి?
15 జపాన్‌లో, 12 ఏళ్ల మిగుమి ప్రకటించటానికీ, బోధించటానికీ తన స్కూలు అనువైన ప్రాంతమని భావిస్తోంది. ఆమె అనేక బైబిలు పఠనాల్ని కూడా ప్రారంభించగల్గింది. మిగుమి వాటినెలా చేస్తుంది? ఆమె లంచ్ టైములో బైబిలు చదువుతుంది లేదా కూటాలకు సిద్ధమౌతుంది గనుక ఆమె తోటి విద్యార్థులు తరచూ ఆమెను ఏం చేస్తున్నావని అడిగేవారు. కొన్ని స్కూలు కార్యకలాపాల్లో ఎందుకు భాగం వహించటంలేదని మిగుమిని కొందరు అడిగేవారు. మిగుమి వాళ్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చి, దేవునికి ఒక పేరు ఉందని వాళ్లకు చెబుతుంది. తరచూ అది వాళ్లలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అప్పుడు ఆమె వాళ్లకు బైబిలు పఠనాన్ని ప్రతిపాదిస్తుంది. మిగుమి ఇప్పుడు 20 పఠనాలు చేస్తోంది—అందులో 18 తన క్లాస్‌మేట్లతోనే.
16. కామెరూన్‌లో అపహాసకుల గుంపులోని కొందరితో ఒక సహోదరుడు ఎలా బైబిలు పఠనాల్ని ప్రారంభించగలిగాడు?
16 కామెరూన్‌లో, దారిన వెళ్తున్న వారికి ఒక సహోదరుడు బైబిలు సాహిత్యాన్ని ఇవ్వడం అక్కడే పని చేస్తున్న ఎనిమిది మంది చూసి, ఆ సహోదరుడ్ని పిలిచారు. ఆ సహోదరుడ్ని అపహాస్యం చేద్దామని వాళ్లు, నీవు త్రిత్వాన్నీ, నరకాగ్నినీ లేక ఆత్మ అమర్త్యాన్ని ఎందుకు నమ్మవని అడిగారు. బైబిలును ఉపయోగిస్తూ మన సహోదరుడు వారి ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఫలితంగా, వారిలో ముగ్గురు బైబిలు పఠనానికి అంగీకరించారు. వారిలో డానియేల్ అనే ఒక వ్యక్తి కూటాలకు హాజరవటం ప్రారంభించి, తన దగ్గరున్న క్షుద్రవిద్యకు సంబంధించిన వాటినన్నింటినీ నాశనం చేసేశాడు. (ప్రకటన 21:8) సంవత్సరంలోపే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు.
17. ఎల్ సాల్వెడార్‌లో కొంతమంది సహోదరులు, మొదట రాజ్య సందేశాన్ని వినటానికి ఇష్టపడని ఒక వ్యక్తికి ప్రకటించడానికి చాతుర్యాన్ని ఎలా ఉపయోగించారు?
17 ఎల్ సాల్వెడార్‌లో, ఒక వ్యక్తి యెహోవాసాక్షులు దగ్గర్లో కనబడినప్పుడల్లా తన ఇంటిముందు భయంకరంగా కనిపించే తన కుక్కను కట్టేసేవాడు. సాక్షులు వెళ్లిపోయేంత వరకూ వేచివుండి, వాళ్లు వెళ్లిపోయాక ఆ కుక్కను తిరిగి లోపలికి తీసుకెళ్లేవాడు. సహోదరులు ఆ వ్యక్తితో మాట్లాడలేక పోయేవారు. అందుకని ఒకరోజు భిన్నమైన పద్ధతిలో చెప్పాలనుకున్నారు. ఆ వ్యక్తి తాము మాట్లాడేదాన్ని వింటాడని గ్రహించి, వారు ఆ కుక్కకు ప్రకటించాలని నిశ్చయించుకున్నారు. వాళ్లు ఆ ఇంటికి వచ్చి, బయట ఉన్న కుక్కను పలకరించి, దాంతో మాట్లాడే అవకాశం దొరికినందుకు తామెంతో సంతోషిస్తున్నామని చెప్పారు. భూమిపై పరదైసు ఉండే కాలం గురించి, ఎవ్వరూ కోపిష్టులుగా ఉండని కాలం గురించి—అవును, చివరికి జంతువులు సైతం శాంతిగా ఉండే కాలం గురించి వాళ్లు దానితో మాట్లాడారు. ఆ తర్వాత ఎంతో మర్యాదగా
దానికి వీడ్కోలు చెప్పి ముందుకు సాగారు. వాళ్లను ఆశ్చర్యంలో పడవేస్తూ, ఆ వ్యక్తి ఇంట్లోనుంచి బయటికివచ్చి, తనతో మాట్లాడే అవకాశాన్ని సాక్షులకు ఎన్నడూ ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పాడు. ఆయన పత్రికలను తీసుకున్నాడు, ఒక బైబిలు పఠనం ప్రారంభమైంది. ఆ వ్యక్తి ఇప్పుడు మన సహోదరుడు—‘యిష్టవస్తువులలో’ ఒకరు!“భయపడకుడి”
18. అనేకమంది క్రైస్తవులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు, కానీ యెహోవా తన ఆరాధకులను ఎలా దృష్టిస్తాడు?
18 ప్రాముఖ్యమైన ఈ రాజ్య ప్రకటనాపనిలో, శిష్యులను చేసేపనిలో మీరు భాగం వహిస్తున్నారా? అయితే, మీరు నిజంగా ఆధిక్యత గలవారే. నిజానికి, ఈ పని ద్వారానే యెహోవా తన మందిరంలోకి ‘యిష్టవస్తువులను’ ఆకర్షిస్తున్నాడు. (యోహాను 6:44) నిజమే, కొన్నిసార్లు మీరు కాస్త అలసిపోవచ్చు లేదా నిరుత్సాహపడవచ్చు. మరికొన్నిసార్లు కొందరు, అంటే విశ్వాసులైన యెహోవా సేవకుల్లోనే కొందరు తాము అప్రయోజకులమనే భావాలతో బాధపడుతుండవచ్చు. అయితే నిరాశ చెందకండి! యెహోవా తన ఆరాధకుల్లో ప్రతి ఒక్కరినీ యిష్టవస్తువులుగా దృష్టిస్తాడు, ఆయన మీ రక్షణ విషయంలో శ్రద్ధకల్గి ఉన్నాడు.—2 పేతురు 3:9.
19. హగ్గయి ద్వారా యెహోవా ఏ ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు, ఆ మాటలు మనకెలా ధైర్యాన్నివ్వగలవు?
19 వ్యతిరేకత మూలంగానో లేక ఇతర ప్రతికూల పరిస్థితుల మూలంగానో మనం నిరుత్సాహపడినప్పుడు, స్వదేశానికి తిరిగివచ్చిన యూదులకు యెహోవా చెప్పిన మాటలు మనకూ ప్రోత్సాహకరంగా ఉండగలవు. హగ్గయి 2:4-6 లో మనమిలా చదువుతాము: “అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా—జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తుదేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.” గమనించండి, యెహోవా కేవలం ధైర్యంగా ఉండమని చెప్పడం మాత్రమే కాదు గానీ ధైర్యంగా ఉండటానికి సహాయం కూడా చేస్తాడు. ఎలా? అభయాన్నిచ్చే ఆయన మాటలు చూడండి: “నేను మీకు తోడుగా ఉన్నాను.” మనం ఏ అవాంతరాలను ఎదుర్కుంటున్నప్పటికీ యెహోవా మనతో ఉన్నాడన్నది తెలుసుకోవటం మన విశ్వాసాన్ని ఎంతగా బలపరుస్తుందో గదా!—రోమీయులు 8:31.
20. ఇప్పుడు అంతులేని మహిమ యెహోవా మందిరాన్ని ఎలా నింపుతోంది?
20 యెహోవా తాను తన ప్రజలతో ఉన్నానని కచ్చితంగా ఋజువు చేసుకున్నాడు. నిజానికి ఇది హగ్గయి ప్రవక్త ద్వారా ఆయన చెప్పినట్లుగానే ఉంది: “ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించు[ను]. . . . ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను.” (హగ్గయి 2:9) నిజంగా, ఈనాడు గొప్ప మహిమను యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో కనుగొనవచ్చు. అంతెందుకు, ప్రతి సంవత్సరం లక్షలాదిమంది సత్యారాధన వైపుకు గుంపుగా తరలి వస్తున్నారు. వీరందరూ ఆధ్యాత్మికంగా చక్కగా పోషించబడుతున్నారు, కల్లోలితమైన ఈ లోకంలో కూడా వారు దేవుని నూతన లోకంలో మాత్రమే అనుభవించేలాంటి శాంతిని అనుభవిస్తున్నారు.—యెషయా 9:6, 7; లూకా 12:42.
21. మన నిశ్చయం ఏమై ఉండాలి?
21 యెహోవా జనాంగములను కదిలించే అర్మగిద్దోను ఆసన్నమైంది. (ప్రకటన 16:14, 16) కాబట్టి, మిగిలివున్న కాస్త సమయాన్నీ మరిన్ని జీవితాలను రక్షించేందుకు ఉపయోగించుదాము. మనం ధైర్యంగా ఉండి యెహోవాపై పూర్తి నమ్మకాన్ని ఉంచుదాము. పని సంపూర్తి అయ్యిందని యెహోవా చెప్పేవరకూ, ఆయన గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలో ఆయనను ఆరాధిస్తూ మరిన్ని ‘యిష్టవస్తువులతో’ దాన్ని నింపుతూ ఉండాలన్నది మన నిశ్చయమై ఉండాలి.
[అధస్సూచీలు]
^ పేరా 4 సొలొమోను నిర్మించిన మందిరం కోసం వచ్చిన మొత్తం విరాళపు విలువ ప్రస్తుత విలువల్లో చూస్తే, దాదాపు 40 బిలియన్ల అమెరికా డాలర్లకు సమానం. మందిర నిర్మాణ పనికి ఉపయోగించని మొత్తాన్ని మందిరపు ఖజానాలో వేశారు.—1 రాజులు 7:51.
^ పేరా 10 ఇశ్రాయేలు ప్రధాన యాజకునిలో ఉన్నట్లు యేసులో ఏ పాపమూ లేదు, ఆయనకు ఎటువంటి ప్రాయశ్చిత్తమూ అవసరం లేదు. అయితే, ఆయన సహయాజకులు పాపభరితమైన మానవజాతి నుంచి కొనబడ్డారు కాబట్టి వారు పాపులై ఉన్నారు.—ప్రకటన 5:9, 10.
^ పేరా 11 కావలికోట, ఫిబ్రవరి 15, 1998, 17-22 పేజీలను చూడండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
• వస్తుసంపత్తికన్నా యెహోవాకు మరింత అమూల్యమైనదేమిటి?
• యేసు చిందించిన రక్తం, ఏ రెండు గుంపుల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది?
• యెహోవా మందిరాన్ని మహిమతో నింపే “యిష్టవస్తువులు” ఎవరు?
• హగ్గయి ప్రవచనం ఈనాడు నెరవేరుతుందనటానికి మనకు ఏ నిదర్శనం ఉంది?
[అధ్యయన ప్రశ్నలు]
[16వ పేజీలోని డయాగ్రామ్]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
యెహోవా ప్రాచీన దేవాలయపు సూచనార్థక ప్రాధాన్యత మీకు తెలుసా?
అతి పరిశుద్ధస్థలం
తెర
పరిశుద్ధస్థలం
ముఖ మండపము
బలిపీఠం
ఆవరణ
[17వ పేజీలోని చిత్రం]
ప్రధానయాజకుడు, యాజకుల పాపముల కోసం కోడెను, యాజకులుకాని ఇశ్రాయేలీయుల గోత్రాల కోసం మేకను అర్పించేవాడు
[18వ పేజీలోని చిత్రం]
ప్రపంచవ్యాప్త రాజ్య ప్రకటనాపని లక్షలాదిమందిని యెహోవా మందిరంలోకి సమకూరుస్తోంది