దానియేలు గ్రంథం వివరించబడింది!
దానియేలు గ్రంథం వివరించబడింది!
సమావేశానికి వచ్చినవాళ్ళు క్రొత్తగా విడుదలైన దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) అనే 320 పేజీల పుస్తకాన్ని పొందడం కోసం చాలా ఆతురపడ్డారు! ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత వాళ్ళు ఎలా భావించారు? కొందరు ఏమన్నారో గమనించండి.
“ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడంలో ఆనందించడమంటే చాలా మంది టీనేజర్లలాగే, నాకు కూడా కొంచెం కష్టంగా ఉండేది. కనుక, దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! అనే క్రొత్త పుస్తకాన్ని అందుకున్న తర్వాత, దాన్ని చదవడమనే తలంపు నాకు అంత ఉత్సాహాన్నివ్వలేకపోయింది. అయినప్పటికీ, చదువుదామని ఊరికే మొదలుపెట్టాను. అమ్మో, నేను ఎంత పొరపడ్డానో! నేను చూసిన అత్యుత్తమ పుస్తకాల్లో ఇదీ ఒకటి. ఒకసారి చదవడం మొదలుపెట్టామంటే, పూర్తయ్యేదాక వదిలిపెట్టలేం! వేల సంవత్సరాల క్రితం జరిగిన వృత్తాంతాన్ని చదువుతున్నానన్న అనుభూతి మళ్ళీ కలగనే లేదు. నన్ను నేను దానియేలు స్థానంలో పెట్టుకుని ఆలోచించగలనని మొదటిసారిగా గ్రహించాను. కుటుంబం నుండి వేరు చేయబడి, విదేశానికి తీసుకువెళ్ళబడడం, మళ్ళీ మళ్ళీ యథార్థతా పరీక్షను ఎదుర్కోవడం అనేవి మనోనేత్రాలతో నిజంగా చూడగల్గాను. ఈ పుస్తకాన్ని ప్రచురించినందుకు చాలా కృతజ్ఞతలు.”—అన్‌య.
“తన ప్రజలపై ప్రభావం చూపే కార్యాలు పూర్తిగా యెహోవా నియంత్రణలోనే ఉన్నాయి అన్న స్పష్టమైన సందేశం నాకు ఎంతగానో సహాయం చేసింది. మన దేవుడు తాను ఉద్దేశించిన దానికన్నా, ఎక్కువగానో తక్కువగానో ఏదీ జరగడానికి అనుమతించడని దానియేలు దర్శనాల ద్వారా, కలల ద్వారా, ఆయన భావం చెప్పిన ఇతరుల కలల ద్వారా స్పష్టమైంది. ఇది, ఆయన చేయబోయే క్రొత్త లోకాన్ని గురించి బైబిలులో కనబడే ప్రవచనాత్మక చిత్రీకరణలపై మనకున్న నిరీక్షణను మరింత బలపరుస్తుంది.”—చెస్టర్.
“మీరు దానియేలును ఎంతో సజీవంగా చిత్రీకరించిన తీరు నాకు బాగా నచ్చింది. ఆయన వ్యాకులతలను చింతలను గురించి మీరు నొక్కి చెప్పిన విధానం నాకు దానియేలుతో బాగా పరిచయమయ్యేట్లు చేసింది. యెహోవా ఆయనను అంత కోరదగినవాడిగా ఎందుకు దృష్టించాడో నేను ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆయన అనేక శ్రమలనూ, వేధింపులనూ అనుభవిస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా తన గురించి బాధపడనేలేదు. ఆయనకు ఎల్లప్పుడూ ఉన్న చింత, యెహోవా గురించీ, ఆయనకున్న సుందరమైన నామము గురించీనే. ఈ అంశాలను ఉన్నతపరచినందుకు చాలా కృతజ్ఞతలు.”—జాయ్.
“మేము ఎదురు చూస్తూ వచ్చింది దీని కోసమే! మనలో ప్రతి ఒక్కరికీ దానియేలు గ్రంథం ఎంతగా వర్తిస్తుంది అన్నది మునుపెన్నడూ ఇంతగా తేటతెల్లం చేయబడలేదు. నేను ఈ పుస్తకాన్ని అందుకున్న ఆ సాయంకాలమే పుస్తకంలోని చాలా భాగం చదివాను, ఆ తర్వాత ఒక్క క్షణం ఆగి, ప్రార్థనలో యెహోవాకు కృతజ్ఞతలు తెలిపాను.”—మార్క్.
“అది మా పిల్లలపై కూడా అంత ప్రభావం చూపగలదని మేము అనుకోలేదు. వాళ్ళకు ఐదు, మూడు సంవత్సరాలే వయస్సు. . . . నా బైబిలు కథల పుస్తకములోని దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలు వాళ్ళకు అభిమానులే, దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! అనే పుస్తకంలో సమాచారం సమర్పించబడిన తీరు మా పిల్లలపై మేము ఎదురు చూడనంత ప్రభావం చూపింది. ఇంత చిన్న వయస్సులోనే వాళ్ళు నీతిమంతులైన ఆ యువకులతో ఏకీభవిస్తున్నట్లు అనిపిస్తుంది. మా పిల్లలకు వాళ్ళు ఎంత చక్కని మాదిరులు! మీరు మాకు ఎంత చక్కని ఉపకరణాన్ని ఇచ్చారు! చాలా చాలా కృతజ్ఞతలు!”—బెతల్.
“ఆ హెబ్రీ యువకులు తమ విశ్వాస పరీక్షలను ఎదుర్కుంటుండగా, నేను అక్కడే ఉన్నట్లు నాకు అనిపించింది; అది నేను నా విశ్వాసాన్ని పరిశీలించుకునేందుకు నన్ను ప్రోత్సహించింది. “మీరు ఏమి గ్రహించారు?” అన్న పునఃసమీక్షా బాక్సు ఆ అధ్యాయంలోని సారమంతటినీ హృదయపలకపై చెరగని విధంగా ముద్రించేస్తుంది. మీరు మరో ఉత్తమ పుస్తకాన్ని ప్రచురించినందుకు మరోసారి కృతజ్ఞతలు.”—లిడీయ.