కుటుంబం కోసం | భార్యాభర్తలు
ఒకరికొకరం సరిపోము అనిపిస్తే ...
సమస్య
మీకు ఆటలంటే ఇష్టం; మీ భార్య/భర్తకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. మీరు ప్రతీ చిన్న పనిని బాగా ఆలోచించి పద్ధతిగా చేస్తారు. మీ భార్య/భర్త ఇష్టం వచ్చినట్లు ఉంటారు. మీకు అందరినీ కలుస్తూ ఉండడం ఇష్టమైతే, మీ భార్య/భర్తకు ఒంటరిగా సమయం గడపడం ఇష్టమై ఉండవచ్చు.
‘మేము ఒకరికొకరం సరిపోము, పెళ్లికి ముందు ఈ విషయాన్ని ఎందుకు గమనించలేకపోయాం?’ అని మీరు అనుకుంటుండవచ్చు.
నిజానికి అప్పుడే మీరు ఆ విషయాన్ని ఎంతో కొంత గమనించి ఉంటారు. కానీ అప్పట్లో మీకు త్వరగా సర్దుకుపోయే లక్షణం ఉండేదేమో. అయితే పెళ్లైన తర్వాత కూడా మీరు మళ్లీ ఆ మంచి లక్షణాన్ని చూపించడం మొదలు పెట్టాలి. అందుకు ఈ ఆర్టికల్ మీకు సహాయం చేస్తుంది. కానీ ముందు మీ మధ్య ఉన్న తేడాలకు సంబంధించి కొన్ని విషయాలను చూద్దాం.
మీరు తెలుసుకోవాల్సినవి
కొన్ని తేడాలు పెద్దవి. డేటింగ్ అంటే ముఖ్యంగా ఒకరికొకరు పెళ్లి చేసుకోవడానికి సరిపోతారో లేదో తెలుసుకోవడమే. కాబట్టి డేటింగ్ చేసేటప్పుడు పెద్దపెద్ద విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు కలవకపోతే, అనవసరంగా పెళ్లి చేసుకొని రెండు భిన్న ధృవాలుగా ఉండడం కన్నా పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని కొంతమంది నిర్ణయించుకుంటారు. కానీ పెళ్లైన తర్వాత చిన్నచిన్న తేడాలు ఉండడం సహజమే. అప్పుడు ఏం చేయాలి?
ఏ ఇద్దరూ అన్ని విషయాల్లో ఒకేలా ఉండరు. ఈ కింద చెప్పిన ఒకటి లేక అంతకంటే ఎక్కువ విషయాల్లో భార్యాభర్తలకు తేడాలు ఉండడం సహజం:
అభిరుచులు. ఆషిమా a ఇలా అంటుంది, “బయట ఆడుకునే ఆటలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ నా భర్త చిన్నప్పటి నుండే మంచు కొండలు ఎక్కుతూ, రోజులు తరబడి ట్రెక్కింగ్ చేస్తూ ఉండేవాడు.”
అలవాట్లు. “నా భార్య అర్థరాత్రి వరకూ మెలుకువగా ఉన్నా పొద్దున్నే 5 గంటలకే లేస్తుంది, కానీ నాకు మాత్రం కనీసం 7, 8 గంటల నిద్ర కావాలి. లేదంటే రోజంతా చిరాకుగా ఉంటుంది,” అని ప్రశాంత్ చెప్తున్నాడు.
లక్షణాలు. మీరు తక్కువగా మాట్లాడుతూ నెమ్మదిగా ఉంటే, మీ భార్య/భర్త చక్కగా మాట్లాడుతూ చలాకీగా ఉండవచ్చు. దిలీప్ ఇలా అంటున్నాడు “చిన్నప్పటినుండి నాకున్న సమస్యల గురించి ఎవరితో చెప్పుకోకుండా పెరిగాను. కానీ నా భార్య ఇంట్లో వాళ్లందరూ అన్ని విషయాల్ని మనసువిప్పి మాట్లాడుకుంటారు.”
తేడాలు మంచివే. పెళ్లి గురించి ఏమి తెలుసుకుందో జాహ్నవి అనే ఆమె ఇలా అంటుంది “నేను చెప్పేది మంచిదే కావచ్చు, అయినా ఆ పని చేసేందుకు అదొక్కటే మార్గం అని కాదు.”
మీరిలా చేయవచ్చు
ఎదుటి వాళ్లను అర్థం చేసుకుని సహకరించండి. జయంత్ ఇలా అంటున్నాడు “నా భార్య కరిష్మాకు ఆటలంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ తను నాతో కలిసి చాలా ఆటలు చూడడానికి వచ్చింది. అంతేకాదు నాతోపాటు సంతోషంగా చప్పట్లు కూడా కొట్టింది. కరిష్మాకు కళలకి సంబంధించిన మ్యూజియంలు చాలా ఇష్టం. అందుకే నేను తనతో కలిసి వెళ్తాను. అక్కడ తనకు కావాల్సినంత సమయం గడుపుతాం. నా భార్యకు అలాంటివి ఇష్టం కాబట్టి నేను కూడా వాటి మీద ఇష్టం పెంచుకునేందుకు చేయగలిగినదంతా చేస్తాను.”—మంచి సలహా: 1 కొరింథీయులు 10:24.
అవతలివాళ్లు చెప్పేవాటి గురించి కూడా ఆలోచించండి. మీ భర్త/భార్య మీలా ఆలోచించట్లేదు కాబట్టి, వాళ్ల ఆలోచనలు తప్పు అని కాదు. లోకేష్ అనే భర్త ఈ పాఠాన్నే నేర్చుకున్నాడు. “ఏదైనా పనిని బాగా చేయడానికి ఒక్క పద్ధతి మాత్రమే ఉంటుంది, ఇంక ఎలా చేసినా అంతబాగా చేయలేం అనుకునేవాడ్ని. కానీ పెళ్లైన తర్వాత ఒక పనిని చాలా రకాలుగా చేయవచ్చనీ, ప్రతీ పద్ధతిలోనూ ప్రయోజనాలు ఉంటాయనీ తెలుసుకున్నాను.”—మంచి సలహా: 1 పేతురు 5:5.
వాస్తవాలను తెలుసుకోండి. అన్ని విషయాల్లో ఒకేలా ఉంటేనే ఒకరికొకరు చక్కగా సరిపోతారని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ భార్యాభర్తల మధ్య కొన్ని తేడాలు ఉన్నంత మాత్రాన మీరు పెళ్లి చేసుకోవడమే తప్పు అనే ముగింపుకు రాకండి. ద కేస్ ఎగెయినెస్ట్ డైవొర్స్ అనే పుస్తకంలో ఇలా ఉంది “ప్రేమలో నా కళ్లు మూసుకుపోయాయి అని చాలామంది సాకులు చెప్తారు. మీ ఇద్దరిలో కొన్ని సహజమైన తేడాలు ఉన్నా, ఒకరినొకరు ప్రేమించుకోగలరని మీరు సంతోషంగా గడిపిన ప్రతీ రోజు రుజువు చేస్తుంది.” ‘ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించడానికి’ ప్రయత్నిస్తూ ఉండండి.—కొలొస్సయులు 3:13.
ఇలా చేయండి: మీ భార్య/భర్తలో మీకు నచ్చే, మీరు ప్రేమించే, మీకు సరిపోయే విషయాలు రాయండి. తర్వాత మీ ఇద్దరి మధ్య వేరుగా ఉండే విషయాలేంటో రాయండి. మీ మధ్య ఉన్న తేడాలు మీరు అనుకునేంత పెద్ద సమస్యలు కావని మీకు అర్థమౌతుంది. మీరు ఏ విషయాల్లో ఎక్కువ సహనం చూపించవచ్చో, మీ భార్య/భర్తకు సహకరించవచ్చో తెలుసుకోవడానికి మీరు రాసుకున్నవి సహాయం చేస్తాయి. కౌషిక్ ఇలా అంటున్నాడు “నాకు కావాల్సినట్టు నా భార్య సర్దుబాట్లు చేసుకున్నప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది. నేను సర్దుబాట్లు చేసుకున్నప్పుడు తనకు కూడా సంతోషంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకు ఒకవేళ నేను ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినా చేస్తాను. నా భార్య సంతోషంగా ఉండడం చూసి నేనూ సంతోషిస్తాను.”—మంచి సలహా: ఫిలిప్పీయులు 4:5. ◼ (g15-E 12)
a ఈ ఆర్టికల్లో కొన్ని అసలు పేర్లు కావు.