కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈకలు—వాటి అపురూప రూపకల్పన

ఈకలు—వాటి అపురూప రూపకల్పన

ఈకలు—వాటి అపురూప రూపకల్పన

ఒక సముద్రపు పక్షి రెక్కలను బలంగా ఊపుతూ గాల్లోకి ఎగిరింది. పైకి చేరుకున్న వెంటనే అది గాలిలో సుడులు తిరుగుతూ సునాయాసంగా పైపైకి వెళ్తుంది. రెక్కలను కొద్దిగా ఆడిస్తూ, తోకను కాస్త అటూ ఇటూ ఊపడం తప్ప అది దాదాపు నిశ్చలంగానే గాల్లో ఎగురుతుంది. అదెలా అంత ఆకర్షణీయంగా, నైపుణ్యవంతంగా అలాంటి విన్యాసాలు చేయగలుగుతోంది? అది అలా చేయగలగడానికి చాలావరకు దాని ఈకలే కారణం.

ప్రాణుల్లో కేవలం పక్షులకే ఈకలు పెరుగుతాయి. అనేక పక్షులకు వివిధ రకాల ఈకలు ఉంటాయి. అన్నిటికన్నా పైన ఉండేవి కాంటోర్‌ ఈకలు (ఆకార నిర్ణయ ఈకలు), వాటివల్లే పక్షులకు గాల్లో ఎగిరేందుకు అనువైన చక్కని ఆకారం వస్తుంది. పక్షులు ఎగిరేందుకు ఉపయోగపడే రెక్కల, తోకల ఈకలు కూడా కాంటోర్‌ ఈకలే. హమ్మింగ్‌ బర్డ్‌కి 1000కన్నా ఎక్కువ, హంసకు 25,000కన్నా ఎక్కువ కాంటోర్‌ ఈకలు ఉంటాయి.

ఈకల రూపకల్పన అపురూపమైనది. ఈక మధ్యలో పొడవుగా ఉండే విన్యాసాక్షి (Rachis) వంగేందుకు వీలైనదైనా చాలా గట్టిగావుంటుంది. దాని పొడవునా వరుసగా కంటకాలు (Barbs) ఉంటాయి, అవి ఒకదానితో ఒకటి అల్లుకుని విన్యాసాక్షికి ఇరువైపులా సుతిమెత్తని పిచ్ఛ పాలకముగా (vane) ఏర్పడతాయి. వందల సంఖ్యలో ఉండే సూక్ష్మ కంటకాల (Barbules) సహాయంతో కంటకాలు ఒకదానితో మరొకటి అత్తుకున్నట్లుగా అల్లుకుంటాయి. సూక్ష్మ కంటకాలకు చిన్న కొక్కాల్లాంటివి ఉండడంతో అవి పక్కనేవున్న ఇతర సూక్ష్మకంటకాలతో ముడిపడతాయి, అలా అవి జిప్పులా తయారవుతాయి. సూక్ష్మ కంటకాలు విడిపోయినప్పుడు, పక్షి దాని ఈకలను శుభ్రం చేసుకున్నప్పుడు వాటిని తిరిగి కలిపేస్తుంది. మీరు కూడా మీ చేతి వేళ్లతో సున్నితంగా విడిపోయిన కంటకాలను కలపవచ్చు.

ఫ్లైట్‌ ఈకల లేక ఎగరడానికి సహాయపడే ఈకల పైభాగం సన్నగానూ క్రింది భాగం వెడల్పుగాను ఉంటుంది. విమానం రెక్కలా ఉండే ఫ్లైట్‌ ఈక రూపకల్పన, అదే ఒక చిన్న రెక్కలా పనిచేసేందుకు తోడ్పడుతుంది. అంతేకాక మీరు ఒక పెద్ద ఫ్లైట్‌ ఈకను దగ్గరనుండి చూస్తే, దాని విన్యాసాక్షి క్రింది భాగంలో పొడవైన సన్నని చీలిక కనిపిస్తుంది. నాజూకైన ఈ రూపకల్పన విన్యాసాక్షిని ఎంత బలపరుస్తుందంటే, దానిని వంచి, అటూ ఇటూ మెలికలు తిప్పినా అది విరగదు.

ఈకల ఉపయోగాలు అనేకం

అనేక పక్షుల్లో, కాంటోర్‌ ఈకల మధ్య అక్కడక్కడా సన్నని పొడవైన రోమ పిచ్ఛములు (Filoplumes), పౌడర్‌ ఈకలు కూడా ఉంటాయి. బయటి ఈకలకు ఏదైనా జరిగినప్పుడు, రోమ పిచ్ఛాల కొనల దగ్గర ఉండే సెన్సర్లు పక్షిని అప్రమత్తం చేస్తాయని భావించబడుతోంది, అవి గాలిలో ఎంత వేగంగా వెళుతున్నాయో అంచనా వేసుకునేందుకు కూడా సహాయపడుతుండవచ్చు. పౌడర్‌ ఈకలే ఎప్పటికీ మొలుస్తుంటాయి, అవి ఎన్నడూ ఊడిపోవు కూడా. వాటికుండే కంటకాలు మెత్తని పొడిగా మారి ఇతర ఈకలపై పొరగా ఏర్పడుతుంది, ఈకలు నీటికి తడవకుండా ఆ పొర అడ్డుకుంటుందని కూడా భావించబడుతోంది.

ఈకలు వేరే విధాలుగా ఉపయోగపడడమేకాక పక్షుల్ని వేడి, చలి, అతినీలలోహిత కిరణాల నుండి కూడా కాపాడతాయి. ఉదాహరణకు, సముద్రపు బాతులు మహాసముద్రపు అతిశీతల గాలులను కూడా తట్టుకుని వర్ధిల్లుతున్నాయనిపిస్తోంది. ఎలా? దట్టంగా కవచంలా ఉండే వాటి కాంటోర్‌ ఈకల క్రింద బాతు శరీరాన్నంతా కప్పే మెత్తని, నూగులాంటి ఈకల (Down feathers) 1.7 సెంటీమీటర్ల మందమైన పొర ఉంటుంది. ఆ ఈకలు చలినుండి ఎంత సమర్థవంతంగా కాపాడతాయంటే, వాటికి సాటియైన సింథటిక్‌ పదార్థమేదీ ఇప్పటివరకు కనుగొనబడలేదు.

ఈకలు సాధారణంగా పాతవై ఊడిపోతాయి, అప్పుడు వాటి స్థానంలో కొత్తవి వస్తాయి. అనేక పక్షుల రెక్కల, తోకల ఈకలు నిర్దిష్ట సమయంలో, క్రమ పద్ధతిలో రాలిపోతాయి. అలా జరగడంవల్ల అవి వాటి ఎగిరే సామర్థ్యాన్ని కోల్పోవు.

“ఈకల రూపకల్పనలో లోపమేలేదు”

సురక్షిత విమానాలు తయారుచేయాలంటే ఎంతో కష్టపడి రూపకల్పన చేయాలి, నమూనాలు తయారుచేసి, వాటిని నిర్మించాలి. మరి పక్షుల, వాటి రెక్కల మాటేమిటి? శిలాజాల ఆధారం లేనందువల్ల ఈకలు ఎలా వచ్చాయనే విషయంలో పరిణామవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ బహిరంగ చర్చలో పాల్గొన్నవారు “సనాతనవాదంపట్ల తీవ్రోత్సాహాన్ని, విద్వేషాన్ని, శిలాజశాస్త్రంపట్ల అమితోత్సాహాన్ని” ఎక్కువగా చూపించారని సైన్స్‌ న్యూస్‌ అనే పత్రిక వ్యాఖ్యానించింది. ఈకల ఆవిర్భావం గురించి ఒక గోష్ఠిని ఏర్పాటు చేసిన ఒక పరిణామవాద జీవశాస్త్రజ్ఞుడు ఇలా ఒప్పుకున్నాడు: “ఏ వైజ్ఞానిక విషయమైనా ఇంతటి అసభ్యకర ప్రవర్తనకు, విద్వేషానికి కారణమౌతుందని నేనెన్నడూ ఊహించలేదు.” ఒకవేళ ఈకలు నిజంగానే పరిణామం ద్వారా ఆవిర్భవించివుంటే, దాని గురించిన చర్చలు ఎందుకింతటి విద్వేషాన్ని రగులుస్తున్నాయి?

“ఈకల రూపకల్పనలో లోపమేలేదు, అదే అసలు సమస్య,” అని యేల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మాన్యుయల్‌ ఆఫ్‌ ఆర్నిథాలజీ—ఏవియన్‌ స్ట్రక్చర్‌ ఎండ్‌ ఫంక్షన్‌ అనే పత్రిక వ్యాఖ్యానించింది. ఈకలు అంతకంతకు అభివృద్ధిచెందాల్సిన అవసరముందనడానికి ఏ సూచనా లేదు. నిజానికి, “అత్యంత ప్రాచీన ఈక శిలాజం ఎంత ఆధునికంగా కనిపిస్తుందంటే అది ఏ మాత్రం తేడాలేకుండా ఖచ్చితంగా నేటి పక్షుల ఈకల్లాగే ఉంది.” * అయితే, చర్మంపై మొదట్లో పెరిగిన బొడిపెలు కాలక్రమేణా ఎదిగి ఈకలయ్యాలని పరిణామ సిద్ధాంతం బోధిస్తోంది. అంతేకాక, కాలక్రమేణా దానిలో మార్పు వచ్చిన ప్రతీసారి “ఈకలు మునుపటి వాటికన్నా మరింత మెరుగైనవిగా మారివుంటేనే అవి పరిణామ క్రమంలో ఆవిర్భవించాయని చెప్పవచ్చు” అని మాన్యుయల్‌ చెబుతోంది.

స్పష్టంగా చెప్పాలంటే, పరిణామ సిద్ధాంతం ప్రకారం ఈక ఉనికిలోకివచ్చే అవకాశమే లేదు ఎందుకంటే, సుదీర్ఘమైన పరిణామ క్రమంలో యాదృచ్ఛికంగా సంభవించే ప్రతీ దశ, అంటే ఈక నిర్మాణంలో వచ్చే మార్పులు ఆ ప్రాణి సజీవంగా ఉండే అవకాశాల్ని గణనీయంగా అధికం చేయాలి. అంత క్లిష్టమైన, ఎగరడానికి పరిపూర్ణంగా తోడ్పడే ఈక అలా ఆవిర్భవించడం అసంభవమని చాలామంది పరిణామవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ ఈకలు సుదీర్ఘ కాల ప్రవాహంలో క్రమేణా పరిణమించివుంటే, వాటి సంబంధిత రూపాల శిలాజాలు ఉండాలి. అయితే, అలాంటివేవీ దొరకలేదు, ఇప్పటివరకూ సంపూర్ణంగా ఉన్న ఈకలే దొరికాయి. మాన్యుయల్‌ పత్రిక ఇలా అంటోంది: “ఈకలు, పరిణామ సిద్ధాంతం వివరించలేనంత క్లిష్టమైనవి”

ఎగిరేందుకు అవసరమైంది ఈకలే కాదు

పరిణామవాదులకు ఈకల పరిపూర్ణత ఒక సమస్య మాత్రమే, ఎందుకంటే పక్షిలోని ప్రతీ అవయవం అది ఎగిరేందుకు తోడ్పడేలా రూపొందించబడింది. ఉదాహరణకు, పక్షికి తేలికైన, బోలగా ఉండే ఎముకలుండడమే కాక, అసాధారణ రీతిలో సమర్థవంతంగా పనిచేసే శ్వాస వ్యవస్థ, దాని రెక్కలను ఆడించేందుకు, నియంత్రించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన కండరాలు కూడా ఉన్నాయి. ప్రతీ ఈక స్థానాన్ని నియంత్రించేందుకు అనేక కండరాలు ఉంటాయి. ప్రతీ కండరాన్ని అద్భుతమైన చిన్న మెదడుకు కలిపే రక్తనాళాలుంటాయి. దాని మెదడు పనులన్నింటినీ ఒకేసారి, యాంత్రింకంగా, ఖచ్చితంగా నియంత్రించే సామర్థ్యంతో రూపొందించబడింది. అవును కేవలం ఈకలే కాదు ఎగరడానికి పక్షిలోని ప్రతీ అవయవం అవసరమైనదే.

ప్రతీ పక్షి చిన్న జీవకణం నుండే పుడుతుందని కూడా మర్చిపోకండి, ఆ చిన్న జీవకణంలో అది పెరిగేందుకు, ఏదో ఒకరోజు నింగిలోకి ఎగిరేందుకు తోడ్పడే సహజ ప్రవృత్తులను పెంపొందించుకోవడానికి అవసరమైన నిర్దేశాలుంటాయి. అదంతా ఆకస్మిక సంఘటనలవల్ల జరిగే అవకాశముందా? లేక చాలా సరళమైన, అత్యంత సమంజసమైన, విజ్ఞానపరంగా సరైన వివరణ అంటే అపారమైన తెలివితేటలుగల ఒక సృష్టికర్త పక్షులను, వాటి ఈకలను సృష్టించాడనేది స్పష్టంగా ఉందా? ఆధారాలే దానికి జవాబిస్తాయి.—రోమీయులు 1:20. (g 7/07)

[అధస్సూచి]

^ ఈ శిలాజం ఇప్పుడు అంతరించిపోయిన ఆర్కియోప్టెరిక్స్‌ అనే ప్రాణికి చెందినది, దానిని ఆధునిక పక్షుల పరిణామ క్రమంలో “మిస్సింగ్‌ లింక్‌”గా (మధ్యమ స్థితిలో ఉండేదని ఊహించబడుతున్న జీవి) పరిగణిస్తారు. అయితే, అనేకమంది శిలాజశాస్త్రజ్ఞులు దానిని ఇక ఏమాత్రం ఆధునిక పక్షులకు పూర్వ జాతిగా చూడడం లేదు.

[24వ పేజీలోని బాక్సు/చిత్రం]

కల్పించబడిన “ఆధారాలు”

పక్షులు ఇతర ప్రాణుల నుండి పరిణామం చెందాయనేందుకు రుజువుగా గతంలో గొప్పగా చూపించబడిన కొన్ని శిలాజ “ఆధారాలు” కేవలం కల్పిత ఆధారాలని తేలాయి. ఉదాహరణకు, 1999లో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ అనే పత్రిక, డైనోసార్‌కుండే తోకలాంటి తోకవున్న ఈకల ప్రాణి శిలాజాన్ని గురించిన ఆర్టికల్‌ను ప్రచురించింది. ఆ ప్రాణి “పక్షులకు డైనోసార్లకు మధ్య ఉన్న సంక్లిష్టమైన శ్రేణిలో నిజమైన మిస్సింగ్‌ లింక్‌ (మధ్యమ స్థితిలో ఉండేదని ఊహించబడుతున్న జీవి)” అని ప్రకటించింది. అయితే, ఆ శిలాజం కేవలం మోసపూరితమైనదని, అది రెండు రకాల జంతువుల శిలాజాలను కలిపి తయారుచేయబడిందని తేలింది. నిజానికి అలాంటి “మిస్సింగ్‌ లింక్‌” ఏదీ ఇంతవరకూ కనుగొనబడలేదు.

[చిత్రసౌజన్యం]

O. Louis Mazzatenta/National Geographic Image Collection

[25వ పేజీలోని బాక్సు]

పక్షి కళ్లతో చూడండి

మనోహరమైన, తరచూ మెరిసే ఈకల రంగులు మానవులను అబ్బురపరుస్తూవుంటాయి. కానీ ఇతర పక్షులకు ఈకలు మరింత ఆసక్తికరంగా కనిపించవచ్చు. కొన్ని పక్షులకు రంగులను పోల్చుకునేందుకు కళ్లలో నాలుగు రకాల శంకువు ఆకార కణాలు ఉంటాయి, కానీ మానవులకు మాత్రం అలాంటివి మూడే ఉంటాయి. అదనంగా ఉండే ఆ కణాలవల్ల పక్షులు మానవులకు కనిపించని అతినీలలోహిత కిరణాలను చూడగలుగుతాయి. మానవులకు కొన్ని జాతుల్లోని మగ ఆడ పక్షులకు మధ్య తేడా తెలియకపోవచ్చు కానీ మగ పక్షుల ఈకలు అతినీలలోహిత కిరణాలను ఒకరకంగా ప్రతిబింబిస్తే ఆడ పక్షుల ఈకలు మరోరకంగా ప్రతిబింబిస్తాయి. పక్షులు ఆ బేధాన్ని గమనించగలవు, దాని సహాయంతోనే అవి తమ జతకాగల పక్షులను గుర్తించగలుగుతాయి.

[23వ పేజీలోని డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

కంటకం

సూక్ష్మ కంటకం

విన్యాసాక్షి

[24వ పేజీలోని చిత్రం]

ఆకార నిర్ణయ ఈకలు

[24వ పేజీలోని చిత్రం]

రోమ పిచ్ఛం

[25వ పేజీలోని చిత్రం]

పౌడర్‌ ఈక

[25వ పేజీలోని చిత్రం]

నూగులాంటి ఈక

[24, 25వ పేజీలోని చిత్రం]

గాన్నెట్‌