చీకట్లో వెలిగే “చిన్న రైలుబండ్లు”
చీకట్లో వెలిగే “చిన్న రైలుబండ్లు”
◼ బ్రెజిల్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో, ప్రశాంతమైన ఒక సాయంత్రం, అడవిలో చిందవందరగా నేలమీద పడివున్న ఎండిన ఆకుల క్రింద నుండి ఒక చిన్న “రైలుబండి” బయటకు వచ్చింది. రెండు ఎర్రని “హెడ్లైట్లు” దాని మార్గాన్ని కాంతివంతం చేస్తున్నాయి, పసుపు, హరిత వర్ణాలు కలగలిసిన 11 జతల దీపాలు దాని ఇరువైపుల భాగాలను కాంతివంతం చేస్తున్నాయి. నిజానికి అది సాధారణమైన రైలుబండి కాదు. అది ఉత్తర, దక్షిణ అమెరికాల్లో కనిపించే 70 మిల్లీమీటర్ల పొడవు ఉండే ఫిన్గొడిడె కుటుంబానికి చెందిన పేడపురుగుల లార్వా. లార్వా రూపంలోనే ఉండిపోయే ఆడ పేడపురుగులు చూడడానికి లోపలంతా వెలుగుమయంగా ఉన్న రైలు బోగీల్లాగే ఉంటాయి కాబట్టి, వాటిని సాధారణంగా రైలుపట్టాల పురుగులు అని పిలుస్తారు. బ్రెజీలియన్ గ్రామీణులు వాటిని బుల్లి రైళ్లు అని పిలుస్తారు.
గోధుమ వర్ణంలో ఉండే ఆ లార్వాను పగటిపూట చూడడం చాలా కష్టం. అయితే రాత్రుల్లో అది అనేక అద్భుతమైన కాంతులను వెదజల్లుతూ తన ఉనికిని చాటుతుంది. లుసిఫరన్ అనే సేంద్రియపదార్థం సహాయంతో ఆ కాంతులు ఏర్పడతాయి, ఆ సేంద్రియపదార్థం లుసిఫరాస్ అనే ఎంజైమ్ సహాయంతో ఆమ్లజనితో కలిసిపోయి చల్లని మిణుమిణుకుమనే వెలుగుకు కారణమౌతుంది. ఆ ప్రక్రియవల్ల ఎర్రని, నారింజ, పసుపు, హరిత వర్ణాల్లో వెలుగు కనిపిస్తుంది.
ఎర్రని హెడ్లైట్లు దాదాపు ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాయి, అయితే దానికిరువైపులావున్న లైట్లు అలా వెలగవు. ఆ లార్వా దానికి ఇష్టాహారమైన రోకలిబండలను కనుగొనేందుకు దాని హెడ్లైట్లు ఉపయోగిస్తాయని, అదే ప్రక్కనున్న లైట్లను బహుశా వాటిని భక్షించే చీమలు, కప్పలు, సాలీళ్లు వంటి ప్రాణులు దరికిరాకుండా చేయడానికి ఉపయోగిస్తుండవచ్చని పరిశోధన వెల్లడిచేస్తోంది. బహుశా, ఆ వెలుగు, “నేను రుచికరంగా లేను. నా నుండి దూరంగా వెళ్లు!” అనే సందేశాన్ని తమను భక్షించే ప్రాణులకు అందిస్తుండవచ్చు. అలాగే, తనను భక్షించే ప్రాణి దగ్గర్లో ఉన్నట్లు లార్వా గ్రహించినప్పుడు ఇరువైపులావున్న దీపాలు వెలుగుతాయి. ఈ పురుగులు రోకలిబండలపై దాడి చేసినప్పుడు, అలాగే ఆడపురుగు తన గుడ్లను చుట్టుకొని ఉన్నప్పుడు కూడా అవి మెరుస్తాయి. సాధారణ పరిస్థితుల్లో, ఇరువైపులావున్న దీపాలు హెచ్చుస్థాయిలో వెలిగి తర్వాత ఆరిపోతాయి, అలా వెలిగి ఆరిపోవడం కొద్ది క్షణాల్లోనే జరిగిపోతుంది, ఈ ప్రక్రియ అవసరమైనన్నిసార్లు పునరావృతం అవుతుంది.
అవును, అడవిలో చిందవందరగా నేలమీద పడివున్న ఎండిన ఆకుల మధ్యలో కూడా మనం అద్భుతమైన అందాన్ని కనుగొనవచ్చు, అది సృష్టికర్తను స్తుతించేందుకు కీర్తనకర్త ఉపయోగించిన మాటలను మనకు గుర్తుచేస్తుంది: “నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.”—కీర్తన 104:24. (g 11/06)
[20వ పేజీలోని చిత్రసౌజన్యం]
Robert F. Sisson / National Geographic Image Collection